శ్రీ విశ్వనాథ సత్యనారాయణగార్ని అన్ని రామాయణాలుండగా మళ్లా మీరు రామాయణ కల్పవృక్షం వ్రాయడమెందుకని ఎవరో అడిగితే రోజూ తినే అన్నమే కదా అని మానేస్తున్నామా? రోజు కొకరకంగా వండుకుని తింటున్నాము కదా? అలాగే ఇదీను. ఎవరి రుచులు వాళ్లవి కదా అంటూ చక్కని పద్యమొకటి చెప్పారు. అలాగే రామాయణమంటే అమితంగా ఇష్టపడే ముళ్లపూడి వెంకటరమణ దానిని అటు తిప్పీ ఇటుతిప్పీ సినిమా కథలుకూడా తయారు చేసాడు. వాటిల్లో ముత్యాలముగ్గు సినిమా ఒకటి. ఈ సినిమాలో ఆయన చేసిన అపూర్వ సృష్టి కంట్రాక్టరు రావు గోపాలరావు పాత్ర. మరే సినిమా లోనూ ఇటువంటి పాత్రని చూడం. ఈ పాత్ర చేత రమణ పలికించిన డైలాగులు ఆ రోజుల్లో కేసెట్టుల రూపంలో మార్మ్రోగేవి. ఆ పాత్ర తెరమీద కనిపిస్తూనే చెప్పే డైలాగు “ అబ్బా సెగెట్రీ... ఎప్పుడూ బిజినెస్సేనా? మనిసన్నాక కసింత కలా పోసనుండాలయ్యా..”అంటూ ప్రారంభిస్తాడు.అలాఎవరికైనా మనం చేసే పనిలోంచి అప్పుడప్పుడూ diversion అవసరం. అందుకే మళ్లా ఏ భాషా వ్యాసం తోనో మీముందుకు వచ్చే ముందు సరదా కబుర్లు చెబుదామనిపించింది. ఏం చెబుదామా అనుకునే సరికి మళ్లా ముళ్లపూడే గుర్తుకి వచ్చేడు. ఓ సారి నేను వైజాగ్ లో ఆటోలో వెళ్తుంటే ముందు వెళ్తున్న ఆటో వెనకాతల చిత్రమైన రాత ఒకటి కనిపించింది. చాలా వాహనాలకి ముందో వెనకో ఏదో ఒకటి రాసుకోవడం ఒక సరదా. కొంత మందికి ఆచారం కూడాను. Dad’s gift అనో Mom’s Love అనో కుర్రాళ్లు బైకుల మీద రాసుకుంటే ఆటోలు లారీల వెనుక చిత్రమైన రాతలు కనిపిస్తాయి. ఇంగ్లీషులో Touch me not అనో Kiss me not అనో తెలుగులో పడకు పడకు వెంటపడకు.. అనో లేకపోతే వాళ్లకిష్టమైన సినిమా పేరో హీరో పేరో రాసుకునే వాళ్లు కొందరైతే, గ్రామ దేవతల పేర్లు రాసుకునే వారు మరి కొందరు.ఇలా ఎన్నెన్నో రకాలు. వాటిమీదే రీసెర్చి చెయ్యవచ్చునన్నంత ఉంటాయి. అందువల్ల ఆవివరాలు పక్కన పెట్టి నాకు కనిపించిన రాతగురించి చెబుతాను. నాముందు వెళ్తున్న ఆటో వెనుక భాగంలో ముళ్లపూడి వెంకట రమణే.. అని వ్రాసుంది.ఇది రమణ గారి వీరాభిమాని అయి అలా వ్రాసుకున్నాడో లేక ఆ ఆటో ఓనరు లేక డ్రైవరు పేరే అదో నాకు తెలీదు.ఆ ఆసామీ పేరు అదైతే రమణ అని మాత్రం రాసే వాడనీ రమణే.. అని వ్రాయడం చేత అది రచయిత రమణ గురించే అయుంటుందని అనిపించింది. నిజం తెలుసుకునే అవకాశం నాకు లేకపోయింది కానీ, ఆ ఆసామీ రమణ మీది అభిమానంతో అలా రాసుకుని ఉంటే ఆ సంస్కారానికి జోహారనాలనిపించింది. ఇలాటి రాతల్ని ఇంగ్లీషులో గ్రాఫిటీ అంటారుట. దీనికి సరైన తెలుగు పదం నాకు తట్టలేదు. ఈ గ్రాఫిటీ కి సంబంధించిన రెండు ముచ్చట్లు చెప్పి ఈ పోస్టు ముగిస్తాను.
ఏదో దేశంలో ఒక పట్నంలో ఆ వూరి మేయరు గారి కూతుర్ని టాక్సీ నడుపుకునే ఒక యువకుడు ప్రేమించాడట. ఆ అమ్మాయి పేరు రోజ్. తన ప్రేమకు చిహ్నంగా Rose is beautiful ( రోజా చాలా అందమైనది)) అని వ్రాసుకున్నాడట. అది చూసి కోపగించుకున్న మేయరుగారు ఒక వారంలోగా ఆ రాత తొలగించాలని హుకుం జారీ చేసేరుట.టాక్సీ తోలుకుంటూ వేరే ఊరికి పోయిన ఆ హీరో వారాంతానికి తిరిగి వచ్చేడు. మేయరు గారి ఆజ్ఞ పాటించాడా లేదా అని అందరూ ఆతృత తో టాక్సీ వెనుక భాగాన్ని చూసేరుట. Rose is beautiful అన్నమాటలు అక్కడ లేవు. కానీ వాటి స్థానంలో I still feel so.. (నా మనసు మార లేదు) ని రాసి ఉందట. ఊళ్లో అందరికీ దాని భావమేమిటో తెలుసు కానీ మేయరేంచేయగలడు పాపం?
ఇంకో సంగతి దాదాపు మఫ్పై ఏళ్లనాడు మనకిన్ని టీవీ ఛానెల్స్ రాని రోజుల నాటిది. అప్పుడు దూర దర్శన్ లో ఆదివారం ఉదయం హాస్యకవితా పఠనం ఉండేది. శర్మాజీ అనే కవిగారు చదివిన చిట్టికవితే ఈ ఉదంతం. ఇన్నేళ్ల తర్వాత ఆ కవిత అచ్చంగా అప్పజెప్పలేను కానీ దాని భావమిది. నా తెలుగులో--
రోడ్డు మీద వాహ్యాళికి వెళ్తున్నానొకసారి
వెనుకనుంచి దూసుకు వస్తోందొక లారి
ఆ మృత్యు శకటాన్ని తప్పించుకో గోరి
పడ్డాను రోడ్డు పక్క గోతిలో జారి..
దాటిపోయిన లారీ వైపు చూసానొక సారి
దాని వెనుక వైపు రాసుంది అసలు కిరికిరి..
ఇదిగో అది--“మళ్లీ కలుద్దాం ..మరోసారి”.
(లారీ వెనకాతల ఫిర్ మిలేంగే.. అని వ్రాసుందట. దీని భావమేమి తిరుమలేశ?) రసికుడైన కవి దేనినుంచైనా కవిత్వం పిండగలడు కదా? శర్మాజీ కవిగారికి కృతజ్ఞతలతో..
మళ్లీ కలుద్దాం... సెలవు.