28, జులై 2012, శనివారం

పశ్చాత్తాపం,,బహు దొడ్డగుణం.. అవునా ? కాదా?


పశ్చాత్తాపం.. బహుదొడ్డగుణం..
తెలిసో తెలియకో అందరం తప్పులు చేస్తాము. అది మానవ సహజం. కాని చేసిన తప్పును ఒప్పుకోగలిగే దొడ్డగుణం ఏ కొద్దిమందికో ఉంటుంది. ఈ దొడ్డగుణం ఎంతో చదువుకుని సంస్కారవంతులైన వారిలోనే ఉంటుందను కోవడం పొరపాటు. చదువు సంస్కారానికీ ఈ సహజగుణానికీ ఏ సంబంధం లేదు. నిజంగా ఈ గుణం అందరిలో ఉంటే మనకిన్ని లక్షల కేసులూ ఉండేవికాదు. ఇన్ని వేల న్యాయస్థానాలూ అక్కర లేదు. ఈ విషయం గురించి ఇంకా విపులీకరించాలని ఉంది గాని ఇక్కడ స్థలం చాలదు. అందుచేత ఒక మంచి కథ మాత్రం మీకు తెలియజేస్తాను.
మెడోస్ టైలర్ సురపురం సంస్థానంలో నిజాం రాజ్య ప్రతినిదిగా ఉన్నప్పుడు 1856 లో జరిగినదిది.  రాజ ప్రతినిధి గా ఆయన న్యాయవిచారణను కూడా చేపట్టాల్సి వచ్చేది. అప్పుడు విచారణకు వచ్చిన ఒక కేసు ఇది :
ఒక భాగ్యవంతుడైన గొర్ల కాపరి ఉండేవాడు. అతడు వ్యవసాయం కూడా చేసేవాడు. అతడికిద్దరు భార్యలు. పెద్దామెకు వయసు మళ్ళినా పిల్లలు లేకపోవడంతో మరో పెళ్ళి చేసుకున్నాడు. చిన్నామె వయసులో ఉన్నది. సవతులిద్దరికీ పడకపోవడంతో వారిద్దరీనీ ప్రక్క ప్రక్కనే వేరు వేరు ఊళ్లలో ఉంచాడు. ఒక రోజు ఉదయమే అతడి చెరుకు తోటలో అతడు శవమై పడిఉన్నాడు. తల చిట్లి పోయి ఉంది. రాతితో మోది ఎవరో అతడిని రాత్రే చంపివేసారు. ముందు రోజు సాయంత్రం అతడింట్లో ఒక విందు జరిగింది. అతడి మేనల్లుడే మేకను కోశాడు. అతడు చక్కగా భోజనం చేసి పెద్దభార్యతో సరస సల్లాపాలాడి చెరుకుతోటకు వెళ్లి కాపలా పడుకున్నాడు. రాత్రి హత్య జరిగింది. ఇది అతని పెద్ద భార్య అతని మేనల్లుల పనే నని పంచాయతీ దారులు తలచి విచారణ ప్రారంభించేరు. మేనల్లుని భార్య,తన భర్త ఆరాత్రి ఇంట్లో లేడని చెప్పింది. తెల్లవారు ఝామున వచ్చి తన కంబళి ఆమెకు కప్పి పుట్టింటికి పోదాం రమ్మన్నాడట.ఆకంబళి పై రక్తం అంటి ఉన్నది. కానీ చీకట్లో ఆమె చూడలేదు. ఉదయమే పోలీసులు వచ్చి కంబళిని పట్టుకున్నారు.ఆ కంబళిని రక్త పరీక్షకై హైదరాబాదు పంపేరు కానీ అది మనిషి రక్తమో మేక రక్తమో అక్కడ నిర్ధారించలేక పోయేరు .మేనల్లుడేమో అది తను ముందు రోజు కోసిన మేక రక్తమే నంటాడు. వారి తరపు న్యాయవాది ఎంతో దక్షతతో తన క్లయింట్లు నిర్దోషులని వాదించేడు. టైలర్ సాబ్ కి వారే హత్య చేసి ఉంటారని ఎంతో నమ్మకంగా అనిపించినా సాక్ష్యం లేక పోవడం వల్ల వారిని నిర్దోషులుగా తీర్పు వ్రాయడానికి కలం పట్టేడు. ఇంతలో ఆ రైతు పెద్ద భార్య ఆగండి స్వామీ! ఆగండి తీర్పు వ్రాయకండి!! మీకు నిజం తెలియదు. తెలియక పోతే తప్పు తీర్పే ఇస్తారు. సాక్షులు చెప్పింది అబధ్ధం. మా న్యాయవాది వాదనా అబధ్ధమే. నేనే హత్య చేశాను. అతడి మేనల్లుడు తోడ్పడ్డాడు. ఇద్దరం కలిసి తల చితక కొట్టాము ”. అంది.
టైలర్ ఆమెతో అలా మాట్లాడితే ఆమెకు ఉరిశిక్ష పడుతుందనీ ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించినా ఆమె చెప్పిందంతా నిజమే స్వామీ!” అంది. మేనల్లుడు కూడా నేనే అతడి ఆస్థికి వారసుడనౌతాను కదా? మరి చిన్నామెకు బిడ్డలు పుడితే వారికి ఆస్థంతా రాసిస్తాడట. ఎలా ఒప్పకోమంటారు స్వామీ? నా గుండె మండి పోతోంది. ఇప్పుడైనా ఎప్పటికైనా అతడిని చంపే ఉండేవారముఅన్నాడు. ఆమె మేం చెప్పినదంతా వ్రాసుకుని ఉరిశిక్ష వేయించండి స్వామీ అంది.  టైలర్ వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చి ఆమోదం కోసం కలకత్తా లోని సదర్ అదాలత్     ( ప్రధాన న్యాయస్థానం ) కి పంపాడు. ఆమోదం వచ్చాక వారిద్దరూ ఉరితీయబడ్డారు.
                                           ****
ఈ విషయం తన జీవిత చరిత్ర లో వ్రాస్తూ టైలర్ న్యాయస్థానంలో తీర్పు వ్రాయవద్దు అంటూ ఆమె వేసిన కేక,ఆతర్వాత ఆమె చెప్పుకున్న ఒప్పుకోలూ నా బుర్రలో చాలా కాలం ప్రతిధ్వనిస్తూనే ఉండిపోయాయి అంటూ వ్రాసుకున్నాడు.
                                         *****
తమ మీద కేసు నిర్ధారింపబడే సాక్ష్యాలు లేకున్నా. శిక్ష నుండి తప్పించుకునే అవకాశం కళ్ళముందు కనపడుతున్నా,ఉరిశిక్షకు సిధ్ధపడి నిజాన్ని నిర్భయంగా అంగీకరించగలగడం మహా దొడ్డగుణం కాదంటారా?
                                                      ***
( టైలర్ జీవిత చరిత్రనీ అందులోని మరికొన్ని ముచ్చట్లనీ ఇంతకు ముందు "నేను చదివిన ఒక మంచి పుస్తకం..." అనే పోస్టులో పరిచయం చేసాను. కుతూహలం ఉన్నవారు చూడవచ్చు).సెలవు.

25, జులై 2012, బుధవారం

అత్త లేని కాపురం...అద్దె ఇల్లే అమరధామం..


                       

అత్తా లేనీ కోడాలుత్తమురాలూ...ఓయమ్మా..
కోడల్లేని అత్తా గుణవంతూరాలూ..మాయమ్మా..

ఈ పాట తెలియని తెలుగువారుండరు. అత్తా కోడళ్ళ పోరు అతి పురాతన మైనది.  పురాతన కాలంలో బాల్య వివాహాలే జరిగేవి. పురుషులకు వేరే ఉద్యోగాలు లేక పోవడంతో తల్లిదండ్రులతో ఉమ్మడి కుటుంబంలోనే ఉండవలసి వచ్చేది. బెరుకు బెరుకుగా అత్తారింటికి వచ్చిన ఆ లేత వయసు ఆడపిల్లలకు కాపురం కత్తిమీద సామే. అత్తలు పెట్టే ఆరళ్ళకు వారు ఎంత నలిగి పోయే వారో మనం ఊహించుకోలేం. ( ఏది ఏమయినా ఇది ఆడవారి సబ్జెక్టు. దీన్ని గురించి వారే సాధికారికంగా చెప్పగలరు ). అయితే మరి నువ్వెందుకయ్యా ఈవిషయం ఎత్తుకున్నావూ అంటే-  నేను చెప్పబోయే దానికీ దీనికీ చాలా చక్కటి సామ్యం ఉండబట్టే. అదే అద్దె ఇళ్ళ కాపురాల సంగతి. నూటికి ఎనభై మందికి ఏదో సమయంలో అద్దె ఇళ్లలో కాపురం ఉండక తప్పని సరి పరిస్థితులుంటాయి. ఇల్లంటూ లేని వారి సంగతలా ఉండగా,ఉన్న ఊళ్ళో మంచి ఇల్లు ఉన్న వారికైనా ఉద్యోగరీత్యానో మరో కారణం వల్లనో వేరే ఊళ్ళో ఉండాల్సి వస్తుంది కదా? అప్పుడు అద్దె యింటి నివాసం తప్పదుకదా?
మహానగరాల్లో మనకి నివాసయోగ్యంగా ఉన్నా లేకపోయినా ఏదో తల దాచుకుందికి ఒక గూడు కావాలి కనుక అద్దె ఎక్కువనిపించినా ఏదో ఒక ఇంట్లో ఉండడానికి సిధ్ధ పడిపోతాము. వారడిగినంత అడ్వాన్సూ ఇచ్చి వారు పెట్టిన సవాలక్ష కండిషన్లకూ తల ఒగ్గి ఆ ఇంట్లో చేరతాము. అయినా ఆ యింట్లో కంటి నిండా నిద్ర పోతూ ఏ దిగులూ లేకుండా ఉండగలమన్న హామీ ఏ మాత్రం లేదు. ఎప్పుడు అద్దె పెంచమంటారో లేక పోతే ఎప్పుడు ఖాళీ చేయమంటారో అని బితుకు బితుకు మంటూ ఇంటాయనను మంచి మూడ్ లో ఉంచడానికి శాయశక్తులా కృషి చేస్తూ వారు ఏం అన్నా అదే కరెక్టు అంటూ వంత పలుకుతూ వారి కుళ్ళు జోకులకు కూడా పగలబడి నవ్వుకుంటూ కాలక్షేపం చేయాల్సి వస్తుంది. మగ వారి భయాలూ బాధలూ ఇలా ఉంటే ఆడవారి బాధలు మరోరకంగా ఉంటాయి. పొద్దున లేచి వీధిలో ముగ్గు ఎవరి పని మనిషి వెయ్యాలన్న దగ్గరనుంచి కుళాయి నీళ్లు వాళ్లు పట్టుకున్న తర్వాతే అద్దెకున్న వారు పట్టుకోవాలన్నంత వరకూ ఉంటాయి. ఇవి ఇక్కడితోనే ఆగవు. అద్దెకున్న వారు కాపురం ఎలా చేసుకోవాలో ఇంటి యజమానురాలు నిర్ణ యించడం వరకూ సాగుతుంది. అద్దెకున్న అమ్మాయికి అత్తగారి పోరు లేని లోటును ఇంటావిడ భర్తీ చేస్తుంటుంది. ( ఇంటియజమానులు దగ్గర లేని యింట్లో అద్దెకుండడం అంటే అత్త లేని ( వేరింటి కాపురం) కాపురం అంత సుఖమైనది ). ఈ రంజైన కధలన్నీ ఏ అద్దెయింటి అభాగ్యురాలినడిగినా చెబ్తుంది కనుక నేను వాటిని గురించి చెప్పబోవడం లేదు. నూటికో కోటికో కోడల్ని తల్లి లాగా చూసుకునే అత్తగార్లున్నట్లే అద్దెకున్న వారిని తలమీద పెట్టుకుని పూజించిన వారు కూడా సకృత్తుగానైనా లేకపోలేదు. అటువంటి మంచి వారి కథే నేనిప్పుడు చెప్పబోయేది. ఇది చాల పాత ముచ్చటైనా విని తీర వలసినదే.

1942 లో రెండవ ప్రపంచ సంగ్రామం రోజులలో విశాఖ పట్టణం మీద బాంబులు పడతాయన్న భయంతో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తాత్కాలికంగా అంటూ కొన్నేళ్లపాటు గుంటూరుకు మార్చేరు. మార్చడమైతే మార్చారు గాని యూనివర్శిటీకి గాని దాని ఉద్యోగులకు గాని సరైన వసతి ఎక్కడ దొరుకుతుంది? యూనివర్శిటీని ఎలాగో అక్కడా ఇక్కడా  తలోమూలా సర్దేరు. ఉద్యోగులు మాత్రం ఇళ్ల కోసం నానా యాతనా పడ్డారు. ఇదిగో ఇటువంటి చిక్కుల్లో పడ్డ దువ్వూరి వారికి గుంటూరులో బస ఎలాగురా అనుకుంటుండగా వారికి కొద్దిగా స్నేహమూ దూరపు బంధుత్వమూ ఉన్న సూర్య నారాయణ గారనే ఆయన తటస్థ పడి మీరు కాలేజీలు తెరిచే సమయానికి తట్టా బుట్టా పిల్లా జెల్లాతో సహా గుంటూరు వచ్చెయ్యండి. నేను మీకు బస ఏర్పాటు చేసి ఉంచుతానన్నారు. మహదానందభరితుడైన శాస్త్రిగారు సెలవులాఖర్న అలాగే గుంటూరులో సూర్యనారాయణ గారి యిల్లుచేరుకున్నారు. సూ.నా. గారు తాను మాట్లాడి పెట్టిన ఇల్లు ఎదురుగా కడుతున్నమేడేననీ ఇంకా పనులు పూర్తి కానందున కొన్నాళ్లు తమ యింట్లోనే సర్దుకోమనీ ఒక వసారా ఖాళీగా ఉన్నది చూపించేరు. చేసేది లేక శాస్త్రిగారు అందులోనే సర్దుకుంటూ కాలక్షేపం చేస్తూ నెలలు గడిచిపోతుండడం చూసి సూ.నా.గారింట్లో ఊరికే ఉండడం ఇష్టం లేక అద్దెమాట ఎంతో చెప్పమంటే సూర్యనారాయణ గారు నెలకు ఓ పది రూపాయలిచ్చేద్దురూ అన్నారుట. ఆ వసారాకి అక్కడ నాలుగు రూపాయలు కూడా యివ్వరని తెలిసినా గతి లేక శాస్త్రిగారు ఇచ్చుకుంటూ ఉన్నారు. ఒకరోజు సూ.నా.గారు శాస్త్రిగారితో ఎదురింటి కోమటాయన శాస్త్రిగారికి  తమ యిల్లు అద్దెకు ఇవ్వమన్నారనీ వాళ్ల బంధువులకెవరికో ఇచ్చుకుంటామంటున్నారనీ చెప్పారు. అప్పటికి వారు ఆ వూరు వచ్చి దాదాపు 8 నెలలు అయింది. హతాశులైన శాస్త్రిగారు ఎలాగురా భగవంతుడా అనుకుంటుంటే ఒక రోజు రోడ్డు మీద కలిసిన ఎదురింటి షావుకారి గారితో మాకు అద్దెకు ఇల్లివ్వమన్నారుట కదా అనగానే అతడు  “ఎంతమాటండీ బాబుగారూ మీలాంటివారు మాయింట్లోకి అద్దెకు రావడం మా అదృష్టంగా భావిస్తాము. మీరే రానని అన్నారని సూర్యనారాయణ గారు నాతో చెప్పారు. మాయింట్లో కింద నాలుగు గదుల పోర్షన్లు రెండున్నాయి. మీరు దేనిలోనైనా ఈ రోజే చేరవచ్చు. మేము మేడమీద నున్న రెండు గదుల్లో ఉంటాము. అద్దె మీరు ఇప్పుడిస్తున్నంతే ఇవ్వవచ్చు. మీ పక్కపోర్షనులో మీకు ఇష్టమైన వారిని మీరే అద్దెకు కుదుర్చుకోండి. అద్దె మీరే నిర్ణయించండి. అంతా మీఇష్టం అన్నారుట.. ఆ మాటలు వినగానే శాస్త్రిగారికి సూ.నా.గారి కుతంత్రం అర్థమైపోయింది. వెంటనే వారిల్లు ఖాళీ చేసి ఎదురుగానే ఉన్న వెంకటప్పయ్యగారింట్లో చేరి పోయారు. .వెంకటప్పయ్యగారు తమ కోసం చేయించుకున్న కుర్చీలు బల్లలూ కూడా శాస్త్రిగారి వాటాలోనే వేయించి వారినే వాడుకోమన్నారు.
ఆ విధంగా శాస్త్రిగారు ఆ యింట్లో అద్దెకు చేరి సుఖంగా ఉంటూ ఉండగా-
ఒక రోజు శాస్త్రిగారు ఉదయమే ఏదో చదువుకుంటున్నారు. అంతలో వారి ఇంటాయన రెండు మేకులూ సుత్తీ చేత్తో పట్టుకుని కిందకు దిగి వచ్చి చూసేరా బాబు గారూ,నేనిది 20 వేలు పోసి కట్టించుకున్న ఇల్లు. నేనేదో నా గదిలో చొక్కాలు తగిలించుకుందామని రెండు మేకులు కొట్టుకో బోతే మా ఆవిడ వచ్చికింద బాబుగారున్నారని జ్ఞాపకం లేదా అంది. సరే నేనేదో మెల్లిగా చప్పుడు చేయకుండా మేకులు కొట్టుకుంటానంటే తానే మళ్లా వచ్చి  బాబు గారెప్పుడైనా మేడమీదకి వచ్చి చూసినప్పుడు గోడల మీద అసహ్యంగా ఈ మేకులేమిటి అని కోప్పడరా.. ఆపండి మీ పని.. అంటూ నా మీద కేకలేస్తోందండీ. మీరంటే నాకెంత గౌరవమో అనుకుంటుండే వాడిని. మాఆవిడ కింకెంత గౌరవమో అని తెలిసి మీతో చెప్పి పోదామని వచ్చాను. మీ పనికి ఆటంకం కలిగించి ఉంటే క్షమించండిఅంటూ మేడమీదకి వెళ్లి పోయాడు.
ఆ విధంగా శాస్త్రి గారు ఆ ఉళ్లో ఉన్న నాలుగేళ్లూ తామే ఇంటి వారమైనట్లూ వెంకటప్పయ్య గారే తమ ఇంట్లో అద్దె కుంటున్నారన్నంత హాయిగా గడిపి 1946 లో యూనివర్సిటీ విశాఖపట్టణం మళ్ళా తరలి పోగా తాము ఇల్లుఖాళీ చేసి వెళ్ళి పోతున్నప్పుడు వారికి వెంకటప్పయ్యగారు మద్రాసు నుంచి తెప్పించిన చేతికర్రను బహూకరించి. వారి ఇంటిల్లి పాదీ స్టేషనుకు వచ్చి వీడ్కోలు పలికారు.
                                                        ****
శాస్త్రిగారు ఆవిధంగా గుంటూరు విడిచి పెట్టిన పదేళ్లకు మళ్లా హిందూ కాలేజీ వార్షికోత్సవాలకి ఆ కాలేజీ వారి ఆహ్వానం పై  ఆ వూరు వెళ్ళవలసి వచ్చింది. పాత స్నేహం మరిచిపోలేక శాస్త్రిగారు తాను ఫలానా రోజున గుంటూరు వస్తున్నాననీ ఫలానా నీలకంఠ శాస్త్రిగారింట బస చేస్తాననీ మరునాడు కాలేజీలో ఫంక్షననీ వీలు చూసుకుని ఒక సారి వెంకటప్పయ్యగారింటికి వచ్చి వారినందరినీ చూస్తాననీ వారికి కూడా ఒక కార్డు వ్రాసేరు.
అనుకున్న రోజుకి దువ్వూరి వారు నీలకంఠ శాస్త్రిగారింటికి సాయంత్రం చేరుకునే సరికి వెంకటప్పయ్యగారు వచ్చికూర్చుని శాస్త్రిగారికి మరునాడు వీలు పడుతుందో పడదో అనీ అప్పుడే తమయింటికి రావాలని ప్రాధేయపడి తీసుకువెళ్లారు. అక్కడ కాసేపు గడిపిన తరువాత నీలకంఠం గారు ఇక వెళ్దామా అంటుంటే వెంకటప్పయ్యగారింట్లో కింద వాటాలో అద్దెకున్న బామ్మగారు,వెంకటప్పయ్య గారి భార్య తనను శాస్త్రిగారి కోసం వంట చేయమని కోరగా తాను చేస్తున్నాననీ భోజనం చేసి వెళ్లమనీ అనగా నీలకంఠం గారు శాస్త్రిగారి భోజనం తమ యింట్లోనేననీ వారిని  బలవంతం చేయవద్దనీ అన్నారు. వెంకటప్పయ్యగారి పెద్దమ్మాయి పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె,శాస్త్రిగారు ఆరోజు తమ యింటికి వస్తున్నారని తెలిసి  వారిని చూడ్డానికి ఆవూళ్లోనే ఉన్న తమ అత్తవారింటినుంచి  పుట్టింటికి వచ్చి ఉంది. ఆమె,శాస్త్రులు గార్లు అది సమయం కాదు వద్దంటున్నా పెద్ద కంచు గ్లాసుల నిండా టీ చేసుకుని తీసుకు వచ్చిఇస్తే నీలకఠం గారు పుచ్చుకోలేదు. కానినాకోసం తాగవా నాన్నా అంటూ ఆమె కోరితే శాస్త్రిగారు కాదన కుండా ఆ టీ అంతా తాగేరు. నాన్నగారు నామాట మన్నించారని కన్నీరు పెట్టకుంటూ ఆమె శాస్త్రిగారి పాదాలు పట్టుకుంది. ఆ ప్రేమకు ఆపుకోలేని కన్నీళ్ళు ధారాపాతంగా కురుస్తుండగా శాస్త్రిగారు ఆమెను లేవదీసి తన కుర్చీలోనే కూర్చోపెట్టుకున్నారు. ఆ తరువాత ఆమె చిన్నప్పుడు ఆమే వారి నాన్నగారూ కలిసి నీళ్లు పోసి కష్టపడి పూలమొక్కలను పెంచుకుంటున్నా శాస్త్రిగారు రోజు కొక్కపువ్వు తప్ప మిగిలినవి కోసుకోనిచ్చే వారు కారనీ అలాంటి ఎన్నో విషయాలను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. జన్మాంతర బంధమేదో ఉండక పోతే అటువంటి అత్మీయత కుదరదనుకుంటూ శాస్త్రిగారు వారి నుంచి సెలవు తీసుకున్నారు.
                                                                  ****
తనకు 70 ఏళ్లు దాటిన తర్వాత జీవిత చరిత్ర వ్రాసుకున్న దువ్వూరి వేంకట రమణ శాస్త్రులవారు అంతకుముందెప్పుడో 30 ఏళ్ల క్రిందట తాము అద్దెకున్న యింటి యజమాని కుటుంబం చూపించిన గౌరవాన్ని ఆప్యాయతానురాగాల గురించి వారి మంచితనాన్నిగురించి ప్రత్యేకంగా ఎంతో విపులంగా వ్రాసుకున్నారంటే,వెంకటప్పయ్యగారూ వారి కుటుంబం తమ ఇంట్లో కొద్దికాలం మాత్రం అద్దెకున్న వారి మీద చూపించిన గౌరవాభిమానాలూ ప్రేమా ఎంత గొప్పవో మరి?( నేనిది మీకు చాలాక్లుప్తంగా చెప్పేను కాని శాస్త్రిగారు ఇంకా చాలావివరంగా వ్రాసుకున్నారు )
                                    ****
లోకంలో అతికొద్దిమందైనా కానీండి,మంచి అత్తలూ మంచి ఇంటి యజమానులూ కూడా ఉంటారు. కాకపోతే వారి కథలు వినిపించేవారు కావాలి. అంతే!
సెలవు. 
                                   ***
     

22, జులై 2012, ఆదివారం

పిలుపుల్లో ఆత్మీయత..


                       

ఇంతకుముందు పిలుపులూ..మానవ సంబంధాలూ.. అనే నా పోస్టులో పిలుపుల తీరు తెన్నుల గురించి కొన్ని ముచ్చట్లు చెప్పేను. మరికొన్నిటి నిప్పుడు ముచ్చటించుకుందాం.
మా యింట్లో మా తాతగారిని వారి సంతానం అందరూ బాబూ అనే పిల్చే వారని చెప్పేను. ఈ బాబు అది తెలుగు పదమేనని దానికి తండ్రి పూజ్యుడు అనే అర్థాలున్నాయని విద్యార్థి కల్ప తరువు చెబుతుంటే,శరన్నిఘంటువు మాత్రం పూజ్యుడు అనే అర్థాన్నిమాత్రమే ఇచ్చి ఇది వైకృత పదమంటుంది. సూర్యరాయాంధ్ర నిఘంటువు మాత్రం ఇది హిందీ పదం బాప్ నించి వచ్చిందనీ దీనికి తండ్రి పూజ్యుడు అనే అర్థాలే కాకుండా పిన తండ్రి అనే అర్థం కూడా ఉందంటుంది. ఇది ఏ సంస్కృత ప్రాకృత మూలాల్లోనుంచి వచ్చిందో కాని  హిందీ లో బాప్ బాపూ బప్పా పప్పా పాపా రూపాలనూ ఒరియాలో బొప్పా అనీ మన తెలుగులో బాబు అనే రూపాలనూ సంతరించుకుంది. గౌరవ వాచకం గానే పెద్దవారిని బాబు అనీ బాబుగారనీ వ్యవహరించడం ఉంది. ఉత్తరాదిని కూడా ఇలాగే గౌరవ వాచకం గానే దీనిని వ్యక్తినామాలకు చేర్చేవారు. (ఉదా. బాబూ రాజేంద్ర ప్రసాద్,బాబూ జగజ్జీవన్ రామ్). అయితే తండ్రిని బాబూ అని పిలవడం నేను మాయింట్లోనే చూసేను . మరెక్కడా వినలేదు. ( ద్రావిళ్లలో ఈ ఆచారం ఉండేదేమో మరి. రాంభట్ల కృష్ణ మూర్తిగారు వారింట్లో ఇలాగే పిలిచే వారని వ్రాసేరు.). ఏమైనా ఈ పిలుపు మా తండ్రుల తరంతోనే సరి. మేమందరం తండ్రిని నాన్నఅనే పిల్చేవారం. మేం ఇతరులతో వ్యవహారంలో తండ్రిని మా నాన్నగారు అనే అన్నా ఆయనను పిలవడం మాత్రం నాన్నా అనే పిలుస్తూ మీరు అని సంబోధించేవారం. మాఅత్తవారి ఇంట్లో  తండ్రిని నాన్నా అనిపిలుస్తూ నువ్వు అని ఏకవచనంలోనే సంబోధించేవారు. .తరువాత ఎప్పుడో చాలా కాలానికి  కొందరి ఇళ్ళలో తండ్రిని నాన్నగారూ అని గౌరవ వాచకం చేర్చి పిలవడం చూసేను.  అంతమాత్రాన అలా పిలిచే వారికి తండ్రి అంటే ఎక్కువ గౌరవముండేదని చెప్పలేం. మేం అలా పిలవక పోయినా మానాన్న గారిపట్ల మాకు చాలా గౌరవం భయం కూడా ఉండేవి.,శిష్టేతర కుటుంబాల వారుమాత్రం తండ్రిని ఒరే నాన్నా అనో ఓరయ్యా (ఓరి+అయ్యా) అనో పిలిచే వారు.

మా యింట్లో అందరికంటె జ్యేష్టుడైన మా నాన్న గారిని వారి తమ్ములందరూ నాన్నాఅనే పిలిచే వారని చెప్పేను.పితృ సమో జ్యేష్టఃఅన్నారు కనుక తండ్రి తరువాత తండ్రి అంత వారు కాబట్టి జ్యేష్ట సోదరుని అలా పిలిచే అలవాటు అయి ఉంటుంది. ఏమయినా ఈ అలవాటు కూడా మాతండ్రుల తరంతోనే అంతరించింది. ఇక్కడొక తమాషాగా అనిపించే విషయం ఒకటి చెప్పాలి. అసలు అన్న అంటేనే తండ్రి అని అర్థమట. ఆ తరువాత కాలగమనంలో తండ్రి తరువాత తండ్రి అంతటి వాడనే గౌరవంతో జ్యేష్ట సోదరుని కూడా అన్న అని వ్యవహరించడం మొదలైనదట. అలా మొదలైన తరువాత తండ్రి అని ప్రత్యేకంగా తెలియడానికి ( నా+అన్నః) నాన్న అని వ్యవహరించడం ప్రారంభమైందట. తండ్రి అనే అసలైన అర్థంలో తండ్రిని అన్నా అని పిలవడం విశాఖ జిల్లాలో చాలా కాలం క్రితం వరకూ మిగిలి ఉండేదట. మహా మహోపాధ్యాయ రాయుడు శాస్త్రిగారి ధర్మ పత్ని మహా పండితులైన పేరి కాశీనాథ శాస్త్రుల వారి కుమార్తె వారి నాన్న గారిని ఒరే అన్నా అనే పిలిచేదిట. అంతటి పండితుల వారి యింట అలా పిలుచుకునే వారంటే అది ఆ రోజుల్లో అత్యంత సహజమైనదై ఉండాలి. తండ్రిని కూడా ఒరే అని పిలవడం మనకీ రోజుల్లో కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ తండ్రీ కూతుళ్ల మధ్యనున్న స్నేహబంధానికి గుర్తుగా అలా పిలుచుకోవడం ఆరోజుల్లో నిరాక్షేపణీయమే కాకుండా పండితామోదం కూడా పొందినదనే భావించాలి. చిన్నయ సూరి  ఓరి ఓసి మైత్రియందు గలవు అని అంటాడుకదా?
ఇక్కడో చిన్న ముచ్చట. శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు విద్వాన్ పరీక్షకు చదువుకోవడానికి విజయనగరం వచ్చే సరికి వారికి 16 ఏళ్లు. అప్పట్లో ఆ ఊళ్ళో చొప్పల్లి భాగవతార్ గారి తండ్రిగారైన చొప్పల్లి నరసింహంగారు ఉండేవారు. అప్పుడాయన 50 ఏళ్ళ పెద్ద మనిషి. వారు కనిపించినప్పుడు శాస్త్రిగారు వారిని నరసింహంగారూ అని పలకరించేవారట. వారు కోప్పడుతూ ఒరే.. గారూ గీరూ ఏమిట్రా ఒరే నరసింహం అని పిలవలేవుట్రా అనేవారట. అంత పెద్ద వారిని అలాగ పిలవడం ఇబ్బంది గానే ఉన్నా మెల్లగా వారినలాగ పిలవడానికి అలవాటు చేసుకున్నారుట శాస్త్రిగారు. ఆ పిలుపు మిత్రత్వానికి చిహ్నమనీ నరసింహంగారు శాస్త్రిగారి స్నేహాన్ని కోరుకునే వారనీ మనం అర్థం చేసుకోవాలి. కాలగమనంలో పదాలు కొత్త అర్థాలను సంతరించుకున్నట్టే పిలుపులు కూడా దేశకాల పరిస్థితుల్ని బట్టి మార్పులకు గురి అవుతూ ఉంటాయి. అందుకే ఒకనాటి పిలుపులు ఈనాడూ,ఒక ప్రాంతపు పిలుపులు మరో ప్రాంతం వారికీ వింతగా తోచడం జరుగుతుంది. ఎప్పుడైనా అప్పటి సంఘంలో వ్యవహారంలో ఉన్న దేనినీ మనం తప్పు పట్టాల్సిన పని లేదు.
మరికొన్ని ముచ్చట్లు మరోసారి ఎప్పుడైనా. సెలవు.
  



20, జులై 2012, శుక్రవారం

కర్షక వేదన--వ్యథార్త జీవన యథార్థ దృశ్యం



( అతివృష్టో అనావృష్టో ఏదో ఒకటి రైతన్నను ఎప్పుడూ బాధిస్తూనే ఉన్నది. నవంబరు 2010 లో కురిసిన అకాల వర్షాల కారణంగా పండిన పంటను నష్టపోయి పలువురు రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. నేను ఈ గేయాన్ని 25.12.2010 న వ్రాసేను.)

 నాడు వర్షపు చినుకు లేకా
పొలము నంతా బీడు పెట్టీ
అప్పు జేసీ  సప్పుజేసీ
ఆకలిని దిగ మ్రింగుకుంటూ
రోజులెట్లో వెళ్లబుస్తూ
మంచి కాలం రాక పోదని
మరల సేద్యం చేయవచ్చని
ఆశవీడక ఎదురు చూసిన
రైతు కీయేడు  చక్కగ
అదను లోనావాన కురిసీ,
ఆశ లెన్నోమొలక లెత్తగ,
ఆడతిరిగీ ఈడతిరిగీ
వారినడిగీ వీరినడిగీ
అందినంతా అప్పుచేసీ
పదునుమీదే విత్తు జల్లేడే...
నారు పోసిన నాటినుండీ
పొలము నుండీ వెలికి పోవక
తిండి తిప్పల మాట మరచీ
అహర్నిశలూ పాటు పడ్డాడే.....
తల్లి పిల్లా తాను కలసీ
కాయకష్టం చేసి యున్నాడే....
తలకు మించిన భారమైనా
ఎరువులెన్నో కొనుక్కొచ్చీ
పొలము జల్లాడే.....
అర్ధరాత్రీ నిద్ర లేకా
నీరు పెట్టీ కాపు కాసేడే.....
పెరుగుతున్నా పైరు చూసీ
కష్టకాలం గడచి పోయీ
మంచికాలం వచ్చెనంటూ
మురిసి పోయేడే...
కలలు కన్నాడే.....
కన్న కలలూ నీరు జేస్తూ
కాపుకొచ్చిన పంట కాస్తా
నీటి పాలై తనను ముంచేస్తే
అప్పులందున పీక లోతున
మునిగి పోయిన బక్క రైతుకు
తీరబోవని కష్టమొచ్చిందే.......

ఆదుకుంటామంటు వచ్చీ
ఆపన్న హస్తం అందీయరెవరూ
రాజ్యమేలే యోచనలతో
రాజకీయం చేసుకుంటూ
రోజు రోజూ వారు వీరూ
తిట్టుకుంటూ తెగడు కుంటూ
ఉండిపోయేరే......
రాజ్యమేలే ప్రభువులేమో
రైతు రాజ్యం మాదె అంటూ
రాజన్న పథమే వీడమంటూ
అన్నలేనీ లోటు నెపుడూ
రానీయమంటూ హామిలిస్తూ
ఒట్టి మాటలతోనె కాలం
గడుపుతున్నారే
ఊరడించే చేతలేవీ
కానరాలేదే.........

విజను ట్వంటీ వీరుడొక్కడు
యెగసాయమెందుకు శుధ్ధ దండగ
పనికి మాలిన పనులవంటూ
నాడు రైతును యెకసక్కెమాడేడే
కంప్యుటర్లో క్లిక్కు చేస్తే
ధారధారగ కనక రాశులు
కురియునన్నాడే ..వాటితోనే
ఆకలంతా తీరునన్నాడే
తనకు అన్నీ తెలుసు నన్నాడే...
నేడు తానే రైతు బంధువు
వేషమేసేడే...
మొసలి కన్నీరు కార్చేడే....

పదుగురొచ్చీ మీద పడినా
కాలరైనా నలగకుండగ
చిత్తు చిత్తుగ వైరి వీరుల
పీచమణిచే తెరవీరుడొక్కడు
తెలిసితెలియని చిలక పలుకులు
పలుకుతున్నాడే....రైతు పక్షం
తానె అన్నాడే..నటన లోనీ
వైదుష్యమంతా ఒలకబోసేడే......

తండ్రి పేరును చెప్పుకుంటూ
తాను గద్దెను ఎక్కవలెనని
తపన పడుతూ కొడుకు ఒక్కడు
ఓదార్పు అంటూ ఊరూరు తిరిగాడే
పనిలొ పనిగా  రైతుకోసం
కన్నీరు కార్చేడే...
ఓట్లకోసం విత్తు జల్లేడే........

వారు వీరూ ఎవరి వలనా
తనకు ఏమీ ఒరగనందున
ఆలు బిడ్డలు ఆకలంటూ
 అలమటిస్తుంటే
దినము గడిచే  తీరు తెలియక
రేపు పైనా ఆశ లేకా
దిక్కు తోచని దీన స్థితిలో
నమ్ముకున్నా నేల తల్లీ
ఒడిని ఒరిగాడే.........

వెతల  సుడిలో బ్రతుక జాలక
కన్నుమూసిన కన్న తండ్రీ
నీవు పోతే లోకమంతా పస్తులుంటుందే
అన్నదాతవు నీవు లేకా
ఆకలేసీ బావురంటూ
అలమటిస్తూ మాడిపోతుందే....

దీనికెవ్వరు బాధ్యు,లీ
పాప మెవ్వరిదంటు మీరూ
వెఱ్ఱి ప్రశ్నలు వేయబోకండీ
నిశ్చయముగా అది నాడు నేడూ
నేల నేలిన ఏలికలదే
నయవంచకత్వపు నాయకులదే..
వారిచేతికి పగ్గమిచ్చిన
మీరు నేనూ హంతకులమే...
              ***

.

























14, జులై 2012, శనివారం

దండిభొట్ల వారి దర్జా..(విద్వాన్ సర్వత్ర పూజ్యతే.)



స్వగృహే పూజ్యతే మూర్ఖః  స్వగ్రామే పూజ్యతే ప్రభుః
స్వదేశే పూజ్యతే రాజా  విద్వాన్సర్వత్ర పూజ్యతే--
అంటే మూర్ఖుడిని వారి ఇంటిలోని వారే గౌరవిస్తారు ( వాని మీద ఆధార పడి బ్రతుకు తారు కనుక తప్పదుకదా ? ). గ్రామాధికారికి తన వూళ్ళోనే మర్యాద ఉంటుంది. రాజుకు తన రాజ్యంలోనే గౌరవం. కానీ విద్వత్తు ఉన్న వాడు  ప్రపంచంలో ఎక్కడైనా గౌరవింపబడుతాడని భావం. ఎంత చక్కటి నిజం!
ఇది ఎరిగిన వారు కనుకనే పండితులైన వారు తమ పాండిత్యాన్ని కాపాడుకుంటూ మర్యాదగా జీవించేవారు. బ్రాహ్మణుడైన వాడు ధనాశను వీడి తనకు లభించిన దానితో సంతృప్తిని చెంది మరునాటి గురించి కూడా ఆలోచించకుండా జీవించాలట. ఇది సనాతన బ్రాహ్మణ ధర్మం. అందువల్లనే  కొందరు బ్రాహ్మణోత్తములైన పండితులు తమ పాండిత్యాన్నే నమ్ముకుని ఎవరి ఆశ్రయం కోసం పాకులాడక స్వతంత్ర ప్రవృత్తితో ఎన్ని కష్టాలనైనా ఓర్చుకుంటూ రాజులనైనా లెక్కచేయకుండా మహోన్నత వ్యక్తిత్వంతో జీవించేవారు. ఇలాంటి మహాను భావులగురించి ఇంతకు ముందు పోస్టు ( డబ్బంటే చేదా..) లో చెప్పి ఉన్నాను.  ఆ టపా చదవడం కోసం
( ఇక్కడ నొక్కండి ) ఇటువంటి మహానుభావుడు మరొకరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలాకాలం క్రితం కాశీలో మహాపండితులు కాపురం ఉండేవారు. అలాంటి వారిలో మన తెలుగు వారైన దండిభొట్ల విశ్వనాథశాస్త్రి గారొకరు. వారు తెలుగు వారనే మనకు తెలుసు గాని ఎక్కడి వారో తెలియదు. వారి అత్తవారిది మాత్రం గోదావరి జిల్లాలో నేదునూరి ప్రాంతం. ఆయన తన చిన్నతనం లోనే భార్యతో కలసి కాశీ వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టారు. పిల్లా పీచూ ఎవరూ లేరు. వీరు ఏం దర్జాగా బ్రతికేరో చూడండి:
అప్పట్లో విజయనగర సంస్థానాధీశులైన ఆనందగజపతి రాజుగారు ఏడాది లో కొన్నినెలల పాటు కాశీలో ఉంటూ ఉండేవారు. స్వయంగా పండితులైన ఆనంద గజపతిగారికి సాహిత్యాభిలాష మెండుగా ఉండేది. పాండిత్య సభలు ఏర్పాటు చేసి  కాశీలోని పండితులందరినీ గౌరవిస్తూ ఉండేవారు. ఇదిగో ఇలాంటి సమయాల్లోనే దండిభొట్ల వారికీ ఆనందగజపతుల వారికీ పరిచయం ఏర్పడి స్నేహంగా వృధ్ధి చెందింది.
ఒకసారి దండిభొట్ల వారు దక్షిణ దేశం  రైల్లోవస్తూ విజయనగరంలో దిగారు. ముతక పంచె మాసిన గడ్డం పొడుగాటి లాంకోటూ ఇదీ వారి వేషం. చేతిలో సంచీ కూడా లేదు. రైలు దిగీ దిగడంతో సరాసరి రాజుగారి కోటకే వెళ్లారు. తాను రాజుగారి మిత్రుడినని అనర్గళంగా హిందీలో చెబుతున్నఈ పండితుణ్ణి నివారించడానికి అక్కడున్నఉత్తరాది సైనికులెవరూ సాహసించేలేక పోయారు. శాస్త్రిగారు నేరుగా రాజమహల్ హల్లో ప్రవేశించి కుర్చీలో కూర్చున్నారు. అక్కడకు వచ్చిన అంతరంగికుడైన పనివాడిని పిలిచి రాజుగారితో దండిభొట్ల విశ్వనాథం వచ్చేడని చెప్పమన్నారు. దానికిది సమయం కాదు బాబూ అంటూ అతడు సంశయిస్తున్నంత లోనే శాస్త్రిగారి గొంతు గుర్తు పట్టి రాజా వారు హాల్లోకి వచ్చి శాస్త్రిగారిని ఎప్పుడు వచ్చేరని అడిగితే దానికాయన తాను ఊరికే దక్షిణాదికి వెళ్ళి వద్దామని బయల్దేరాననీ ఇంతలో రైలు బరం పురం వచ్చే సరికి తన దగ్గర భంగు అయిపోయిందనీ అది విజయనగరం ప్రభువుల వద్దనే దొరుకుతుందని తెలిసి ఇటు వచ్చానని అన్నారు. రాజు గారు పాలు మిఠాయిలూ భంగూ తెప్పిస్తే ఇద్దరూ కలిసి వాటిని సేవించాక  మరికొంత భంగుని పొట్లం కట్టించి జేబులో వేసుకుని ఇక వెళ్ళి వస్తానని రాజుగారిని సెలవడిగారట. రాజుగారు నాలుగు రోజులుండి తమ ఆతిధ్యం స్వీకరించమనీ,  తమ ఆస్థాన పండితుల వారింట బస చేయమని కోరితే  తానెవ్వరి ఇంటా బస చేయనని రైలు స్టేషను దగ్గర మంచుకొండ వారి సత్రం చూసేనని అక్కడ ఆ రోజుకి ఉండి మరునాడు ఉదయం 10 గంటల రైల్లో వెళ్ళిపోతాననీ చెప్పారు. రాజుగారు ఆసాయంత్రం తమ ఆస్థాన పండితుల్ని పిలిచి పండితులందరూ వెళ్ళి సత్రంలో శాస్త్రిగారి దర్శనం చేసుకోమని ఆజ్ఞాపించేరు.. మరునాడు వారందరూ తమతమ శిష్యగణంతో పాటు శాస్త్రిగారిని దర్శనం చేసుకున్నారు. వారి కోరిక పై  దండిభొట్లవారు వారి శిష్యులను పరీక్ష చేసి వారిలో శేఖరం (వ్యాకరణ గ్రంథం) చదువుకుంటున్న అబ్బాయి చాలా పైకి వస్తాడనీ అయితే ఆ అబ్బాయి వేసుకున్న ఇస్తిరీ బట్టలూ షోకూ శాస్త్రానికి పనికి రావనీ అన్నారు. ( ఆ ఇస్తిరీ బట్టల అబ్బాయి మరెవరో కాదు- తరువాతి కాలంలో మహామహోపాధ్యాయ బిరుదు పొందిన రాయుడు శాస్త్రిగారే). ఆ తర్వాత వారు టిక్కట్టు కొని ఇస్తామన్నా వద్దని వారిస్తూ తమను రైల్లో టికట్టు ఎవరూ అడగరని చెబుతూ రైలెక్కి వెళ్లిపోయారు.  
                                                           ***
మహా వ్యాకరణ పండితులైన విశ్వనాథం గారికి  కాశీలో అనేక మైన పండిత సభల్లో రెండేసి శాలువలను కప్పేవారు. వారు సభానంతరం ఇంటికి వస్తూ వస్తూ దారిలోఇద్దరు వేద వేత్తలైన పండితులను ఇంటికి పిలుచుకు పోయి భార్యతో ఏమేవ్ వేదవేత్తలొచ్చారు, వీరు దేవతా స్వరూపులు. వీరికి చెరొక శాలువా ఇచ్చి నమస్కరించుకో అనే వారు. తమకోసం ఏనాడూ ఏదీ మిగుల్చుకోలేదు. కప్పుకోవడానికి వారికి మామూలు దుప్పట్లే గతి.
                                                        ***
ఒక సారి  వారి శ్రీమతికి శివరాత్రికి కోటిపల్లి వెళ్ళాలని మనసైంది. ఆవిడ కోరిక తీర్చడం కోసం వారిద్దరూ శివరాత్రికి ఒక వారం ముందరే కాశీలో బయల్దేరి రైల్లో కాకినాడ వరకూ వచ్చారు.
 ( రైల్లో ఏనాడూ ఎవరూ వారిని టికట్టు అడిగే వారు కారట ) . అక్కడినుండి కోటిపల్లికి బండిమీద వెళ్ళడానికి వారి దగ్గర డబ్బులు లేక నడిచే అంచెలంచెలుగా ప్రయాణిస్తూ శివరాత్రి నాడు సూర్యోదయ సమయానికి కోటి పల్లి చేరుకున్నారు. అది శివరాత్రి పర్వదినం కావడంతో చాలారద్దీగా ఉంది, వారు భార్యను ఒడ్డునే తమ సంచీ చూసుకుంటూ ఉండమని తాను గోదావరిలో స్నానం చేసి వచ్చారు. తర్వాత ఆమెనుస్నానం చేసిరమ్మంటే ఆమె తటపటాయిస్తూఎంత సేపు ములిగి రావాలి కాకి స్నానమేగా అంది. ఆమె చూస్తున్న గోదావరి వైపు ఆయన దృష్టి సారించేసరికి  వారికి అక్కడ స్నానాలు చేస్తూ బ్రాహ్మణులందరికీ రూపాయిలు దానం చేస్తున్న ధనికులైన కమ్మవారి ఆడువారు కనిపించేరు. తమ భార్య మనోగతాన్ని గ్రహించిన వారై వారి లాగా దానాలివ్వడానికి డబ్బులేదనేగా నీ సందేహం. జాగ్రత్తగాఇక్కడే ఉండు ఇప్పుడే తెస్తాను అంటూ  పిఠాపురం రాజావారు శ్రీ హరిశాస్త్రి గారింట బస చేసారని తెలుసుకుని అక్కడకు వెళ్ళారు. అప్పుడే స్నానాదులు ముగించుకుని సోమేశ్వర స్వామి దర్శనానికి బయల్దేరబోతున్న రాజు గారు వీరినిచూసి ఆగారు. కుశల ప్రశ్నలయేక ఏమిటిలా దయచేశారని రాజుగారడిగితే తాను భార్యాసమేతంగా సోమేశ్వరస్వామి దర్శనానికని ఆవూరు వచ్చాననీ తన భార్య బ్రాహ్మణులకి దానాలివ్వడానికి కొంత సొమ్ము అవసరమై వచ్చాననీ చెప్పారు శాస్త్రిగారు. రాజుగారు వెంటనే ఒక వెండి పళ్ళెంనిండా రూపాయిలు పోయించి తెప్పించి స్వీకరించమన్నారు.. శాస్త్రిగారు రెండు గుప్పిళ్లనిండా రూపాయిలు తీసుకుని అవి చాలని వెళ్ళివస్తానని అన్నారు.. రాజు గారు అలాక్కాదు గుడిలో చాలా రద్దీగా ఉంది. మీరు స్నానాలు ముగించుకుని సతీ సమేతంగా వస్తే మాతో తీసుకు వెళ్ళి శీఘ్ర దర్శనం చేయిస్తామని అన్నారు. దానికి శాస్త్రిగారు అక్కర లేదనీ తాము అంతకంటే రద్దీలో కాశీలో దర్శనాలు చేసుకున్నామని చెప్పి సెలవుతీసుకుని  గోదావరి ఒడ్డుకు వెళ్ళి ఆ రూపాయిలు తనభార్య చేతిలో పోసి అందులో ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా దానం చేసేయమన్నారు.
                                                       ****

అయ్యా ఇదీ దండిబొట్ల వారి కథ. ఇందులో ఏం పెద్ద విశేషముందని ఈ కథ చెప్పావయ్యా అని ఎవరైనా అని అడగొచ్చు. స్థూలదృష్టితో చూస్తే దీనిలో విశేషం కనిపించక పోవచ్చు. కానీ చేతిలో దమ్మిడీ లేనప్పుడు అనాయాచితంగా అంత ధనం వస్తుంటే తీసుకోకుండా ఉండగలగడం సామాన్యమైన గృహస్తులకు సాధ్యపడే విషయం కాదు. చేతిలో ఏ సొమ్మూ లేకుండా తీర్థ యాత్రకి పత్నీ సమేతంగా బయలు దేరడానికి ఎవ్వరైనా సాహసించగలరా? శాస్త్రిగారు శాలువలు స్వీకరించినా రూపాయిలు తీసుకున్నా అవి ఇతరులకివ్వడానికే గాని తనకోసం ఏమీ తీసుకోలేదు.
మన పెద్దలు ఏమన్నారంటే
సద్యో దదాతి చతురః సద్యో నాస్తీతి చతురతమః
అంటే (అడగ్గానే) ఆలస్యం చేయకుండా (ధనం) ఇచ్చేవాడు తెలివైన వాడైతే,
( అడక్కుండానే వచ్చే ధనాన్ని)ఆలస్యం చేయకుండానే వద్దనే వాడు అంతకన్న తెలివైన వాడు-అని భావం. ( ఇక్కడ తెలివైన వాడంటే ధర్మం తెలిసినవాడని అర్థం). మరి దండిభొట్ల వారు ఎంత గొప్ప ధర్మపరుడు ? నప్రతిగృహీతృత్వం- అంటే ఎవరి దగ్గర నుంచీ ఏదీ ఉచితంగా తీసుకోరాదన్నది  మనధర్మమని ఇదివరకే చెప్పి ఉన్నాను కదా? దానిని తూ.చ. తప్పకుండా పాటించిన మహాను భావుల్లో దండిభొట్ల వారు కూడా ఒకరన్నమాట. అదీ ఆయన దర్జా.
                                       ***
ఇక్కడితో ఆపేస్తే నా ఈ వ్యాసం ఉద్దేశం పూర్తి గా నెరవేరినట్లుకాదు. ఇటువంటి ధర్మ వర్తనుల సహధర్మచారిణులు కూడా ఎన్ని కష్టాలనోర్చుకుని వారు కూడా తమ సహచరుల ధర్మ దీక్షాయజ్ఞంలో పాలు పంచుకున్నారో మనం తెలుసుకుని వారికీ మన జోహార్లు పలకాలి. ఎంతో కొంత ధనాశని చంపుకుని జీవితాలను గడుపుకుంటే మనంకూడా మన పాఠాలను నేర్చుకున్నట్లే.
( ఈ విషయాలను గ్రంథస్థం చేసి వెలుగులోకి తెచ్చిన శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారికి కృతజ్ఞతలతోసెలవు.)
                                        ***

7, జులై 2012, శనివారం

ట్రినిడాడ్ నర్సమ్మ కథ...(చరిత్ర చెప్పని కథలు)


    ఇది ఇప్పటి  ముచ్చట కాదు. నలభై ఏళ్లనాటిది.. అప్పుడతడు మన ఆంధ్ర ప్రదేశ్ లో గవర్నమెంటు డాక్టరుగా పని చేస్తుండే  వాడు. ఎనస్థీసియాలో M.D. డిగ్రీ సంపాదించేడు. అప్పట్లో చాలా మంది డాక్టర్ల లాగే ఇక్కడ సరైన ప్రోత్సాహం కొరవడి  విదేశాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని ప్రయత్నిస్తే Trinidad లో Port of Spain లో యూనివర్శిటీ హాస్పిటల్లో ఉద్యోగం వస్తే వెళ్లి చేరాడు. యూనివర్శిటీ హాస్పిటల్ ఊరి మధ్యలో ఉంది. ఒకవైపు కొండలు మరొక వైపు సముద్రం...ఊరు దాటగానే చెరుకు తోటలు, పళ్లచెట్లు-ఊరు చాలా అందంగానూ వాతావరణం చాలా ఆహ్లాదకరం గానూ ఉన్నాయి. హాస్పిటల్లో మన భారత దేశంనుంచి వచ్చి పని చేస్తున్న డాక్టర్లు నర్సులు ఒక పాతికమంది వరకూ ఉన్నారు. వీరు కాక ట్రినిడాడియన్ ఇండియన్స్, యూరోపియన్లు కూడా చాలామంది ఉన్నారు.
అక్కడ ఉన్న  భారత సంతతికి చెందిన ట్రినిడాడియన్లలో కొంత మంది మంచి మంచి ఉన్నతోద్యోగాలలోనో  వ్యాపారాల్లోనో కుదురుకున్నవారే. ఈ డాక్టరు గారికి వారిలో చాలామందితో పరిచయం స్నేహం ఒనగూరేయి. అతడికున్న అటువంటి మిత్రుల్లో నర్సాలూ రామయా ఒకరు. అతడు అక్కడి ఇన్ఫర్మేషన్&బ్రాడ్ కాస్టింగ్ డిపార్టుమెంటులో ఉన్నతోద్యోగిగా ఉన్నాడు.అందువల్ల అతడికి ఎంతోమంది ప్రభుత్వోద్యోగులే కాక మినిష్టర్లతో కూడా పరిచయం ఉండేది. ఆ రామయా ఒక సారి ఈ డాక్టరు గారిని వారి ఇంటికి భోజనానికి పిలిచేడు. రామయా గారి ఇల్లు చాలా పెద్దది. అతడికి ముగ్గురూ అమ్మాయిలే. అతడి భార్య పేరు దీదీ.
రామయా మన డాక్టరు గారిని ఒక గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ మంచం మీద ఒక పండు ముదుసలి..జుట్టంతా రాలిపోయి సన్నంగా పిట్టలా ముడుచుకుపోయి పడుక్కుని ఉంది. రామయా డాక్టరు వంక చూస్తూ మా యమ్మ అంటూ వచ్చీ రాని తెలుగులో పరిచయం చేసాడు. వీరు వచ్చిన  అలికిడికి ఆవిడ లేస్తే రామయా ఆవిడ దగ్గరకి వెళ్లి గట్టిగా ఈయన ఇప్పుడే ఇండియానుండి ఇక్కడకు వచ్చిన డాక్టరు. పేరు...అంటూ చెప్పేడు. ఆవిడకు చెవుడు లేదట కానీ కొంచెం గట్టిగా మాట్లాడాలిట. కొడుకు చెప్పిన మాటలు విని ఆమె మెల్లగా లేచి నిలబడడానికి ప్రయత్నించింది. కానీ డాక్టరు గారు లేవొద్దు.. కూర్చోతల్లీ అన్నాడు. దానికావిడ ఏటిబాబూ ఏటన్నావ్..తల్లీ అనా! మరో పాలి అలా పిల్మీ..ఈ జల్మలో మరి ఎవురూ నన్నలా పిలుస్తారనుకోలేదయ్యాఅంది. కొంచెం సేపు ఆగి ఎంత అదురుష్టం నాయినా.. నాను సచ్చిపోయీ లోగా మల్లీ జల్మలో తెలుగు మాటింతాననుకో నేదు నాయినా అంది. డాక్టరు ఏమీ మాట్లాడకుండా ఆమె పక్కనే కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నిమరడం ప్రారంభించేడు.
ఆమె తన కథ చెప్పడం ప్రారంభించింది:
అప్పుడు నాకు నిండా పదమూడేల్లు కూడా నేవు బాబూ..మా నాయిన సాలా మంచోడే కాని మా సవిత్తల్లి మా కానిది. నన్ను సాలా ఇంసలు పెడుతుండేది. నా బాదలు సూసి మా వూల్లో ఓ కంసాలాయన  కత్తు కలిపి పెల్లి సేసేసుకుందాం. అంటూ నన్ను లేవదీసుకుని పోయి రంగూనెల్దాం వొస్తావా అనడిగేడు. అలగడిగీసరికి నా సవిత్తల్లి పెట్టే బాదలు గుర్తుకొచ్చి సరేనన్నాను. అలాగ నన్ను లేపుకొచ్చి ఇజీనారం తీసుకొచ్చేడు బాబూ. అప్పట్లందరూ రంగూనెల్లి బాగా సంపాదించుకుని వొచ్చేవారేమో మేమూ అలాగు సుక పడొచ్చు ననుకున్నాను. నేనూ కసింత గడుసుదాన్నే కాని ఎప్పుడు ఊరి దాటెల్లని దాన్ని కదా నాకేటి తెల్దు. అతగాడేమో అక్కడ నన్ను ఓ యిద్దరి కప్ప జెప్పి ఈల్లు నిన్ను సరిగ జూసుకుంతుంతారు. నేను మనూరోపాలెల్లి ఒచ్చేత్తాను.బేగొచ్చేత్తాన్లే. మరేంటి బయ్యం నేదు అంటూ మాయ మాటలు సెప్పి ఎల్లిపోనాడు బాబూ. ఆడొత్తన్నాడ్లే అని సెప్పి ఆల్లు నన్నోడెక్కించేసారు .ఆడొచ్చిండో సచ్చిండో మరినాక్కనపడలేదు.. అంది.
ఓడలో ఎక్కి ఇక్కడికెలావచ్చేవో చెప్పు అంటూ రామయ తల్లిని ఇంగ్లీషులోనే అడిగేడు.
ఓ ర్నాయనో..మరేటి. ఆల్లు మన్ను మోసం సేసీసేరని తెలిసి పోనాది. కానేటి సేద్దును? నా లాటోల్లు సానామంది ఓడలో ఉన్నారు గాని ఆల్లంతా బిహారి వోల్లు ఇందీ వోల్లే. కొద్దిమంది మలయాలీలు కూడా ఉన్నారు. మద్దిలో ఓడెక్కడైనా ఆగినప్పుడు దిగి పారిపోదామనుకున్నాం గాని దయిర్నం సాల్లేదు .మాం  పారి పోకుండా నల్లోళ్లని కాపలా ఎట్టారు.
రంగూన్ తోలుకెల్తన్నామని సెప్పినోల్లు ఇదిగిక్కడికి తీసుకొచ్చి ఒడేసారు. మమ్మల్ని తీసుకొచ్చినోల్లంతా తెల్లోళ్ళే.
నల్లోళ్ళ చేత కొరడా దెబ్బలు కొట్టించి మా సేత పని సేయించుకునీ వోల్లు.ఎదురు సెప్పనేక ఆల్లేటిసెప్తే అది సేస్తుండేవోల్లం. కొన్నాల్లు తెలుగోడెవరేన కుదుర్తాడేమోనని సూసీ సూసి ఆకరికి ఓ మలయాలీ  ఓడితో సంసారం జేసేను. ఆడు పోయి దగ్గిదగ్గిరి యాభై అరవై ఏల్లవుతాది. ఆడు పోనాక  నాను మరెవుర్ని దగ్గిరికి రానియ్యలేదు.
రామయ్య మానాయిన పేరు. అదే ఈ డికి పెట్టుకున్నాను. మొన్న మొన్నటిదాక ఈడికి ఇండియా అంటే గిట్టేది కాదు. ఇండియాకి సొతంత్రం ఒచ్చింది కాని మాకేటి సెయ్యలేదు గదా?అందుకని మరిక్కడిలాగే ఉండిపోనాం. అద్సరే..మీదేవూరు బాబు?” అని అడిగింది.
మాది వైజాగుఅన్నాడు డాక్టరు గారు.
అద్గదే. అక్కడే మేం ఓడెక్కింది. దార్లో  వోంతులు ఇరేసనాలు. నాను పోతాననీసేరు బాబు. ఎలగో మెల్లిగ వాటంతటవే తగ్గిపోనాయి బాబు.. నాకిక్కడ నూకలు రాసిపెట్టుంటే అక్కడెందుకు పోతాను. నా నుదుట్రాతిలగుంది. మరేటి సేద్దుం?”
కళ్లనీళ్లు పెట్టుకుంటూనాన్సేసిన తప్పల్లా ఆ కంసాలాయన్ని గుడ్డిదాన్లా నమ్ముకుని ఎలిపోయి వొచ్చీడమే .. నాకిప్పుడు 98 ఏల్లు బాబు. ఇంకెన్నాల్లు బతుకుతాను? సచ్చీలోపుని తెలుగుమాటింతానా అని అనుకునీదాన్ని. నువ్వొచ్చేవు .నిన్ను సూత్తే మావూరు సూసినట్టున్నాది. ఈ జల్మకింతే ప్రాప్తం.అని కన్నీళ్లు తుడుచుకుంటూ      మరుంతాను బాబుఅంది.
బరువెక్కిన గుండెతో డాక్టరు బాబు ఆగదిలోంచి బైటకు నడిచాడు.
                                                        ****

ఈ కథ చదువుతుంటే మీకు ఏడుతరాల కథ (ఆంగ్లమూలం-అలెక్స్ హైలీ The Roots నవల) లోని కింటాకింటూ కథ గుర్తుకు రావడం లేదూ? అతడ్నీ ఇలాగే ఆఫ్రికా నుంచి అమెరికాకు ఎత్తుకు వస్తారుకదా? మన విజయనగరం నరసమ్మని ఇలాగే 1880 లలో తెల్లవాళ్లు కంసాలాయనకెంతో యిచ్చి ఎత్తుకొచ్చారు. మరో నాలుగు తరాల తర్వాత నర్సమ్మ మనవలో ముని మనవలకో  తమ మూలాలు తెలుస్తాయో తెలియవో ?
                                                           ***
ఈ కథ మనకు తెలియజేసిన కథలోని డాక్టరు నా ప్రియమిత్రుడు Dr.ప్రయాగ మురళీ మోహన కృష్ణ.. అతడు Trinidadలో మూడేళ్ల Contract ముగిసేక లండన్లో FRCS చేసి అక్కడా, ఇర్లండు, డెన్మార్క్ లలోనూ ఆ తర్వాత 20 ఏళ్ల పాటు నార్వే లోనూ పని చేసి తిరిగి మన దేశం వచ్చి వైజాగు లో  సెటిలయ్యాడు. తన అనుభవాలని అందరితో పంచుకోవాలని నేలా..నింగీ ..నేనూ.. ఒక ఎన్నారై ఆత్మకథఅంటూ తన జీవితంలోని  ఎన్నో ఆసక్తిదాయకమైన విశేషాలను గ్రంథస్థం చేసాడు. ఆ పుస్తకాన్ని ఎమెస్కో వారు నవంబరు 2011 లో ప్రచురించేరు. ఈ విజయనగరం నరసమ్మ కథ దానిలోదే. కొంచెం ఆసక్తిదాయకం గా చెప్పడానికి నేను ప్రయత్నించాను కానీ కథంతా ఆయన చెప్పినదే. నా కల్పనేమీ లేదు. ఇలాంటి చరిత్ర చెప్పని కథలు. ఎన్నెన్నో కదా?. మరి డా. కృష్ణ లాంటి వారు గ్రంథస్థం చెయ్యక పోతే ఇలాంటివి లోకానికెలా తెలుస్తాయి?
                                                              ****






3, జులై 2012, మంగళవారం

పల్లకీలో ఊరేగుదాం..రండి..




 పల్లకీ అనే మాట  ఈ నాటి పిల్లలు ఎవరూ విని ఉండక పోవచ్చు.
విన్న ఏ కొద్ది మంది లో నయినా దానిని చూసిన వారు సకృత్తు గానే ఉంటారు.  ( మన దేవుళ్ళకి నేటికీ ఏదో సమయంలో పల్లకీ సేవలు జరుగుతూనే ఉంటాయి. ఆ సమయం లో వీటిని చూసే అవకాశం ఉంది.) పురాతన కాలం నుంచి దాదాపు పంతొమ్మిదో శతాబ్దం చివరి వరకూ ప్రపంచంలో చాలా చోట్ల పల్లకీలే  చాలా ముఖ్యమైన ప్రయాణ సాధనాలుగా  కొన సాగేయి. ఆ తరువాత కొన్నాళ్లు వివాహాది శుభ కార్యాలలో వధూవరులను ఊరేగించడానికి ఉపయోగ పడినా కాలక్రమంలో దాదాపు అర్థ శతాబ్దం క్రితమే అవి జనజీవనం నుంచి నిష్క్రమించాయి. నేడు పల్లకీలూ లేవు. పల్లకీ బోయీలూ లేరు.
మన భాగవతంలో పల్లకీ ప్రసక్తి జడభరతుని కథలో వస్తుంది. బ్రహ్మ జ్ఞానియై పూర్వ జన్మ జ్ఞానం కూడా కలిగిన జడభరతుడు సింధు దేశపు రాజైన రహూగణుని పల్లకీ కొమ్ముమోస్తాడు. జడభరతుడు తన ముందు జన్మలో భరత దేశాన్ని ఏలిన చక్ర వర్తి. అటువంటి వాడు పల్లకీ ఎందుకు మోసేడనే  కథ ఇప్పుడు చెబితే శాఖా చంక్రమణం అవుతుంది కనుక మరోసారి చెప్పుకుందాం. ఇప్పటికి తెలుసుకోవలసినది ఆ పురాతన కాలం లోనే రాజులు పల్లకీలు ఎక్కి ఊరేగేవారని మాత్రమే. ఆ  తరువాతి కాలంలో మెల్లమెల్లగా రాజ్యాధికారులూ ధనవంతులూ కూడా పల్లకీల్లో ప్రయాణం చేసేవారు. ఈ పల్లకీలు మన దేశం లోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలలోనూ ఉండేవి. దేశ కాలాల్ని బట్టి వాటి తీరు తెన్నులు మారుతూ వచ్చాయి. చిన్నవీ, ఒక్కరు  మాత్రం కూర్చొని ప్రయాణం చేయడానికి సరిపోయే వాటితో మొదలై, ఒకరు పూర్తిగా పడుక్కుని సుఖంగా ప్రయాణం చేసేంత విశాలమైనవి గా కూడా రూపాంతరం చెందుతూ వచ్చేయి.  పల్లకీలను యూరోపు దేశాలలో  Sedan chairs అనే వారు. వాటిని మోసే బోయీలను వారు  Chairmen అనే వారు. ఆ దేశాల్లో రాచబాటలు మాత్రమే శకటాలు రధాలు పోవడానికి వీలుగా ఉండేవి. మిగిలిన వీధులన్నీ చక్రాల బండ్లు పోవడానికి తగినంత తీరుగానూ విశాలంగానూ ఉండేవి కావు. ఆ వీధులన్నీ బురద తోనూ ఇళ్లనుంచి కిటికీల గుండా వీధిలోకి గిరవాటేసిన చెత్తతోనూ నానా భీభత్సంగా ఉండేవి. నాగరికులెవరూ కాలుపెట్టి నడవడానికి వీలు లేనంత భయంకరంగా ఉండేవి. అటువంటి దారుల గుండా తమకు  బురద మట్టి అంటకుండా ప్రయాణించడానికి వారికి  పల్లకీలే గతి అయ్యేవి. వీటిలో ఒక చోటినుంచి ఒక చోటికి ఇంత రుసుమని చెల్లిస్తే తీసుకు పోయే పల్లకీలు  ( stages carriers) కూడాఉండేవట. ఇవికాక అధికారులు ధనవంతులు తమకోసం స్వంతంగా అట్టి పెట్టుకునేవీ ఉండేవి. వీటిలో అతి సాధారణంగా ఉండేవి మొదలుకుని అత్యంత వైభవంగా అలంకరించిన  పల్లకీల వరకూ ఉండేవి. కొన్ని రకాల పల్లకీలు, వాటిని మోసే వారి సంఖ్య ఆ పల్లకీలో ప్రయాణించే అధికార్ల హోదాను తెలియజేసేవి గా ఉండేవి. బెంగాలు లో 1758 లో చిన్న పాటి ఉద్యోగులు పల్లకీలు కొనకుండా నిషేధం ఉండేదట. ( రక రకాల అందమైన పల్లకీలను నెట్లో చూడవచ్చు కొన్ని రకాల నిక్కడ చూడండి. వీటిలో ఆఖరుది  రాణులను , స్త్రీలు మాత్రమే మోస్తున్న దృశ్యం )


 


     




అధికార దర్పానికీ, అర్థబలానికీ చిహ్నాలైన ఈ పల్లకీల రూపురేఖల  గురించి మనకెందుకు ?      “   ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరని కదా మన మహాకవి ప్రశ్నించాడు?  కనుక ఈ పల్లకీలను  శ్రమించి మోసిన బోయీల గురించి కొంతైనా తెలుసుకుందాం.
అస్తవ్యస్తంగా ఉన్న దారులలో పల్లకీలను మోసుకు వెళ్ళడం  అందరూ సరిగా చేయలేరు. పల్లకీలో ప్రయాణిస్తున్న వారికి ఏ విధమైన కుదుపూ, ఇబ్బందీ కలుగజేయకుండా పల్లకీని మోయడం ఒక కళే. ఈ పనిని కొన్ని కులాల వారే ఒక హక్కు గానూ సమర్థవంతంగానూ నిర్వహించే వారనీ మిగిలిన కులాల వారు ఈ పనికి ఒప్పుకునే వారు కారనీ తెలుస్తోంది.
 పల్లకీ బోయీలనగానే మనకి తప్పకుండా గుర్తు వచ్చేది సరోజినీ నాయుడు వ్రాసిన  The palanquin bearers అనే అంగ్ల గేయం. చక్కటి పాట పాడుకుంటూ వారు  కొత్త పెళ్ళి కూతుర్ని అత్తవారింటికి తీసుకు వెళ్లే తీరును చిన్న పాటి గేయంలో హృదయంగమంగా మన నైటింగేల్వివరించారు. పని లోని శ్రమ తెలియకుండా ఉండేందుకు వారు ఒహొం..ఒహొంహొం.. అంటూ రకరకాల పాటలు పాడుకునేవారు.
యూరప్ దేశాలలో వీరి సంపాదన బాగుండేదనీ  పొలాలు కొనుక్కునీ ఇల్ళు కట్టుకునీ మర్యాదగా జీవించే వారనీ తెలుస్తోంది.
మన ఆంధ్ర దేశం లో ఈ పనిని అతి సమర్థవంతంగా చేయగలిగిన వారు కాకినాడ దగ్గర ఉన్న ఉప్పాడ బోయీలని  1830 లో మదరాసు నుంచి కాశీ వరకూ పల్లకీలలో ప్రయాణం చేసిన ఏనుగుల వీరాస్వామి గారు వ్రాసేరు. కన్యాకుమారి నుంచి కాశ్మీర దేశం వరకూ ఉప్పాడ బోయీలకు సమానమైన మోత గాండ్లు, చూపరులు బలాఢ్యులు, అలంకార ప్రియులు ప్రయాసకు వోర్చగల వారు, ఆయుధ ధారణ ప్రియులు మరెక్కడా కానరారని చెబుతాడాయన. ఈశ్వరుడు వారిని ఈ పనికోసమే సృష్టించినట్లుందని అంటాడాయన. వారికి మార్గంలో ఎక్కడయినా సుస్తీ చేసినప్పుడు కొంచెం విశ్రాంతి కలుగ జేస్తూ ఉంటే వారితో భూగోళ సంచారమే చేయ వచ్చునని కూడా అంటాడాయన.
ఆ రోజుల్లోకాకినాడకు దగ్గర్లో ఉన్న ఉప్పాడ గ్రామంలో సుమారు 500 ఇళ్ళ బోయీలు నివాసముండేవారట.  వారు సముద్రంలో చేపలు పట్టి వాటిని ఎండ వేసి ఎండు చేపలను అమ్ముకోవడమో, మదరాసు పోయి పల్లకీ బోయీలుగా పనికి కుదురు కోవడమో చేసేవారట. బోయ స్త్రీలు కట్టెలు కొట్టి అమ్ముకోవడం, పొలాల్లో కూలి పని చేయడం ద్వారా జీవనం కొన సాగించేవారట. వీరి ఇళ్లల్లో మగవారు పుడితే చచ్చే వరకూ తలకు ఇంత అని సర్కారుకు పన్ను కట్టాల్సి ఉండేదట. ఈ పన్ను కూడా వారి స్త్రీలే కట్టుకునే వారట. ఇక్కడి మగవారు రూపాయికి సంవత్సరానికి అర్థ రూపాయి ( 50% ) వడ్డీకి అప్పు తెచ్చి తాగడానికి ఖర్చు చేసేసే వారట. ఆ అప్పులు తీర్చడానికి మదరాసు వెళ్లి అక్కడ బోయీలుగా పనిచేసి తిరిగి వచ్చి అప్పులు తీర్చుకునే వారట. అక్కడ కూడా తాగేసి ఏమీ మిగుల్చుకోలేని వారు  సంవత్సరాల తరబడి ఇంటికి రాకుండా అక్కడే ఉండి పోయేవారట. యూరప్ లో బోయీల స్థితిగతులకీ ఇక్కడి మనవారి ఈ జీవనానికీ ఎంత తేడానో కదా? దానికి మన వారి తాగుడు అలవాటే కారణమని వేరే చెప్పనక్కర లేదు.  వీరా స్వామి గారితో వచ్చిన బోయీలలో ఇద్దరు ఇల్లు వదలి చాలా కాలమైనందున వారి భార్యలు వారిని గుర్తు పట్టలేక పోయారనీ, వారికి తాగడానికి కావలసిన పైసలు కూడా తామే సంపాదించి ఇస్తామనీ తిరిగి వెళ్ళ వద్దనీ వారిని వేడుకున్నారని వీరాస్వామిగారు వ్రాసేరు. ఎంతటి దయనీయమైన పరిస్థితి ?
పూర్వం మన రాజుల కాలంలోఈ పల్లకీలెక్కి ఊరేగడానికి  అన్ని కులాల వారికీ అర్హత ఉండేది కాదట. అర్హత లేని కులాల వారు ప్రత్యేక సమయాల్లో పల్లకీలలో ఊరేగాలంటే రాజాజ్ఞ లేక పోతే పల్లకీ మోసే కులాల వారు కూడా మోసే వారు కారట. ఈ విషయాన్ని వివరిస్తూ మా నాటి గత్తర అంటూ ఒక వైనం చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు తన కథలూ గాథలూ లో వ్రాసేరు. ఆ వైనం ఏమిటంటే--
1860 ప్రాంతంలో  కాకినాడ దగ్గర ఉన్న యానాం టవున్లో ఉండే పల్లీయులు (బెస్త వారు) ఒక పెండ్లి సందర్భంగా ఫ్రెంచి పోలీసుల సాయంతో పల్లకీ ఊరేగింపు తీయడానికి తలపెట్టారట. దీనిని తమకు అవమానమని భావించిన ఆ వూరి కాపులు తలుపులు వేసుకుని ఎవరి ఇళ్ళలో వారు ఉండి పోయారట. అందువల్ల ఏ గొడవలూ లేకుండా ప్రశాంతంగా సాయంత్రం చీకటి పడేవరకూ ఉరేగింపు జరిగిందట. ఫ్రెంచి పోలీసులు ఇక తమ అవసరం లేదని వెళ్ళి పోయారట. విజయోత్సాహంతో ఉన్న పల్లీయులు అక్కడితో ఆగకుండా మానాటి కాపులు కొంత మంది ఉండే అక్కడికి శివారు గ్రామమైన కనగాల పేటలో కూడా ఊరేగాలని నిశ్చయించుకున్నారట. కనగాల పేటకీ యానాంకీ మధ్యలో చిన్నకోడు (యేరు) ఉందట. అది అట్టే లోతు ఉండని కారణంగా నడచి దాటవచ్చునట.ఈ మత్స్యకారులు ఆ వూరు రానున్నారని తెలిసి ఆ వూరి కాపులు కొన్ని జనపనార తీసిన కట్టెల ( మా ఉత్తరాంధ్రలో వీటిని కటిక కర్రలంటారు) మోపులనుయేటి ఒడ్డునే పేర్చి వాటిపై తెల్లటి గుడ్డలను కప్పివాటిపై వసంతం ( ఎరుపు నీళ్ళు) చల్లి ఉంచి వాటి పక్కనే ఆయుధ పాణులై నిల్చున్నారట.. ముని చీకటిలో అటువైపు బయల్దేరిన బెస్త వారి గుంపులో చాలా మంది అది చూసి తమ వారిని కాపువారు చంపేసిఉంటారని భయపడి  పరుగెత్తి అక్కడికి దక్షిణాన ఉన్న గౌతమీ నది ఈదుకుంటూ బ్రతుకు జీవుడా అంటూ చెల్లాచెదరైపోయారట. అలా పారి పోకుండా మిగిలి పోయిన పెళ్ళి వారినీ వారి బంధువుల్నీ కాపు వారు చితక బాది వారి పల్లకీని విరిచి ధ్వంసం చేసారట. ఆ తరువాత ఆ కులస్థుల ఇళ్లలో జొరబడి కొల్లగొట్టారటకూడా. ఆ విధ్వంసాన్ని ఆపడానికి ఫ్రెంచి పోలీసులకు చేతకాక కాకినాడనుంచి బ్రిటిష్ సైన్యాన్ని సహాయం కోరవలసి వచ్చిందట.  వారి సహాయంతో  కాపు వారి  అరాచకాన్ని అణచి  వారి పెద్దలను జైలు పాలు చేసారట.
ఈ విధంగా రాజరికానికీ, కులీనత్వానికీ ప్రతీకలై మన సాటి మనుషులు మోసే  పల్లకీలు మనకొద్దు గాని-
ఊహల పల్లకీ ఎక్కించి సాహితీ నందనోద్యానవనంలో విహరింప జేస్తుంటాను. మాబ్లాగింటికి విచ్చేస్తూ ఉండండి. సెలవు.