కొంగలూ..మేఁకలూ...నిండుసున్నలూ..అరసున్నలూ..
నేను బాగా చిన్నప్పుడు, అంటే అక్షరాలూ గుణింతాలూ నేర్చుకునే వయసులో వేసవి
సెలవుల్లో మా యింట్లో పిల్లల అల్లరి భరించలేక మా పెద్దవాళ్లు మా పిల్లలందరినీ మా
యింటికి నాలుగిళ్ల తర్వాత ఉన్న యింట్లో పిల్లలకి పాఠాలు చెప్పే కాంభుక్త మేష్టారు
గారింటికి చదువు నేర్చుకోమని తోలే వారు, ఆ విధంగా నైనా ఓ గంట సేపు మా అల్లరి
తప్పుతుందేమోనని.ఆ విధంగా చాలా చిన్నప్పుడు వారి దగ్గర కొద్ది రోజులు
చదువుకోవడానికి వెళ్లడం తప్పిస్తే నేనెప్పుడూ ప్రయివేటుకి వెళ్లలేదు. ఈ రోజుల్లో
ట్యూషను చెప్పించుకోవడాన్ని ఆ రోజుల్లో ప్రయివేటు
అనేవారు. ముళ్లపూడి ఈ ప్రయివేటు అన్నదానికి వేరే అర్ధం చెప్పడం వేరేకథ.ఇలా
నేను కాంభొట్ల వారి దగ్గర గుణింతాలు నేర్చుకుంటున్న రోజుల్లో వారి దగ్గర ప్రయివేటు
చదువుకుంటూ ఉండేవారిలో ఒకబ్బాయి మా అందరికంటే ఒకటి రెండేళ్లు పెద్ద వాడో ఏమో గాని
చాలా పొడుగ్గా కొంగ లాగా ఉండేవాడు. ఆ అబ్బాయి కూడా మాతో పాటే గుణింతాలు
నేర్చుకుంటూ ఉండేవాడు. అసలు విషయమేమిటంటే, ఆ అబ్బాయి ఎప్పుడు పుస్తకం తీసి
చదవమన్నా కొంగ అనే పదాన్ని కొజ్ఞ్ జ్ఞ్ గ అనే చదివే వాడు. మా వేసవి సెలవులూ
ప్రయివేట్లూ అయిపోయాయి కానీ మేం అక్కడ ఉన్నన్నాళ్లూ కాంభొట్ల వారు ఎంత
ప్రయత్నించినా ఆ కొజ్ఞ్ జ్ఞ్గ బాబు చేత కొంగ అనిపించ లేక పోయారు.
***
ఈ కథ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా అంటే..వచ్చింది మరి.ఇప్పుడంటే
మనం కొంగ అని మధ్యలో పూర్ణానుస్వారం అనబడే
నిండు సున్నతో వ్రాసి కొమ్.. మ్.. గ అనేటట్లు పలుకు తున్నాము గానీ, మన తెలుగు భాష
పూర్తిగా స్థిర పడని తొలి రోజుల్లో దాదాపు క్రీ.శ. నాలుగో శతాబ్దం వరకూ తెలుగు
భాషలో ఈ అనుస్వారం లేదు. అందు చేత ఆ ధ్వని పలుక వలసిన పదాలన్నిటిలోనూ అక్కడ
అనునాసికాన్నే వాడేవారు. అనునాసికమంటే మన కచటతప వర్గాల్లో వర్గపు చివరి
అక్షరాలన్నమాట. ఉదాహరణకి, పంకజము అనే మాటని అప్పుడు పజ్ఞ్కజము అని
వ్రాసేవారన్నమాట. త వర్గంలో చివరి అక్షరం న.అందుచేత కాంత అనే పదాన్ని కాన్త అని వ్రాసేవారు.
పండుని
పణ్డు అని వ్రాసేవారు. ఇలాగే
అన్నీ. మరి అనునాసికమనే పదమే చెబుతుంది అది ముక్కుతో పలికే ధ్వని అని. మరి అలా
టప్పుడు కొంగ ని కొజ్ఞ్ గ అనే వ్రాసి ముక్కుతో అలాగే పలికే వారన్న మాట. మరి మన
కొంగ బాబు ఆ రోజుల్లో పుట్టి ఉంటే అతడి ఉచ్చారణని ఎవరూ తప్పు పట్టేవారు కారన్నమాటే
కదా?
***
కొంగ అనే పదంలో నిండుసున్న అలాగే ఉండగా, మేఁక అనే పదంలో నిండుసున్న లేదు గానీ
అరసున్న కనిపిస్తుంది.దీని గురించి కొచెం వివరంగా చెప్పాల్సి ఉంది. ఇంతకు ముందు తన
పేరు మరచి పోయిన ఈఁగ కథ అనే పోస్టులో ఈగని మొదట్లో ఈజ్ఞ్గ అనీ .. ఆ తర్వాత ఈంగ అనీ
తరువాత ఈఁగ అనీ ప్రస్తుతం అరసున్న కూడా విడచి పెట్టి ఈగ అని అంటున్నామనీ వ్రాసేను.ఇది చదివిన బ్లాగ్మిత్రులొకరు చిన్నయ సూరి తన బాల
వ్యాకరణము లో దీర్ఘము మీద సాధ్య పూర్ణ బిందువు రాదన్నాడనీ అందు చేత ఈఁగ ఎప్పటికీ
ఈంగ కానేరదనీ వ్రాసేరు.చిన్నయ సూరి చెప్పినది నిజమే. ఆయన చాలా అర్వాచీనుడు. ఆయనకు
ముందే ఎన్నో శతాబ్దాలకు పూర్వమే దీర్ఘము మీది పూర్ణానుస్వారాన్ని తేల్చి పలకడంతో
అది మాయమై పోయి దాని స్థానంలో దాని గుర్తుగా అరసున్న మిగిలింది. అంతే గాని దీర్ఘము మీద పూర్ణ బిందువు ఎన్నడూ
లేదనడం సమంజసం కాదు.దీనికి ఉదాహరణగా కూతురనే అర్థంలో కూంతు అనే శిలా శాసన
ప్రయోగమూ, వీడు అనే అర్థంలో నన్నెచోడుడు వాడిన వీండు అనే ప్రయోగమూ శ్రీ బూదరాజు
వారు చూపించారు. “పదాది వర్ణము
పయినే ఊనిక యుండి యది గురువగుటవలనను ప్రక్కనున్న యనుస్వారము పయిని ఊనిక పూర్తిగా
బ్రష్టమగుటను, దీర్ఘము పయినుండిన యనుస్వారము సార్వత్రికముగా బ్రష్టమయినది”అని తేల్చి చేప్పారు శ్రీ
గంటి జోగి సోమయాజి గారు.అందు వలన ఈఁగ మొదటి రూపము ఈంగ అనీ, దక్షిణాది తెలుగు వారు దానిని ఇప్పటికీ అలాగే
ఉచ్చరిస్తారనీ శ్రీ తిరుమల రామచంద్ర గారు
చెప్పిన దానిని మనం అంగీకరించవలసే వస్తుంది. నా ఈఁగ కథ పోస్టులో చెప్పని విషయం
ఒకటుంది. ఈఁగలు అనే బహువచన రూపమే మొదట వచ్చి దానినుంచి ఈగ అనే ఏక వచన రూపం
వచ్చిందంటారు శ్రీ సోమయాజి గారు. అదెలాగంటే ఈజ్ఞ్ అనే మూల ద్రావిడ శబ్దానికి ఆ భాషలోని
బహువచన ప్రత్యయమైన కళ్ అనేది చేరి ఈజ్ఞ్+కళ్ ఈంకళ్ ఈంగళ్ ఈంగలు అయిందనీ, మన తెలుగు భాషలో
లు బహువచన ప్రత్యయంగా స్థిరపడిన తర్వాత ఈంగలు లోని లు ని మాత్రమే బహువచన
ప్రత్యమనుకొని దానిని విడచి పెట్టి ఈంగ అనే ఏక వచన రూపం అనుచిత విభాగం వలన ఏర్పడ్డదనీ సోమయాజిగారు
తెలిపారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే-
ఈఁగలు లాగే మేఁకలు అనే బహువచన రూపమే
మొదట ఏర్పడి దానినుండి మేఁక అనే ఏక వచన రూపం ఏర్పడి ఉండి ఉండ వచ్చునని నా
కనిపించడమే.ఈఁగలు ఈజ్ఞ్..అని శబ్దం చేయడం వల్ల వాటికి ఈగలు అని పేరు వచ్చినట్లే మేజ్ఞ్..మేజ్ఞ్.. అని
అరిచే వాటికి మేజ్ఞ్+కళ్ మేంకళ్ మేంకలు అని పేరు వచ్చి ఉండవచ్చును.
ఈఁగలు లో లాగానే మేంకలు లోని దీర్ఘము మీది పూర్ణానుస్వారము మీద ఊనిక తగ్గించి
పలకడంతో మేఁకలు అయి ఉండవచ్చును. అయితే మూల
ద్రావిడ భాషలో ఏ రూపం ఉండేదో నాకు తెలియదు కనుక మేఁకలు ఈగలు లాగే అనుచిత విభాగం వల్ల ఏర్పడిందో
కాదో నిర్ధారించలేను. అది ఏ రకంగా ఏర్పడినా ముందు మేంకలు అనే రూపం ఉండేదనీ, దాని
నుంచే మేఁకలు అనే రూపం ఏర్పడి
ఉంటుందనడానికి మేఁకలు లోని అర్థానుస్వారమే
సాక్ష్యం. కొంగలూ మేఁకలూ లో నిండు సున్న
అరసున్నల కథ ఇది. ఈ నిండు సున్న అరసున్నల గురించి చెప్పుకోవలసిన విశేషాలు
మరికొన్ని ఉన్నాయి. అవి మరోసారి చెప్పుకుందాం.సెలవు.