అపురూపం...వివాహ స్వర్ణోత్సవ వేడుక..
“అపురూపం”
“అపురూపమా?”
“అవును. అపురూపమే”
“ఇది నీ బ్లాగు
పేరుకదా?”
“అవును. కానీ
నేనిప్పుడు చెబుతున్నది దాని గురించి కాదు.”
“మరేమిటి ”
“మా జీవితంలో
అపురూపమైన రోజు గురించి.”
“ఏమిటది”.
“ఇవాళ తారీకు 12 మే
కదా”.
“అవును. అయితే ఏమిటి
విశేషం”
“ఉంది. ఇవాళ మా
పెళ్లి రోజు.”
“శుభం. కానీ పెళ్లి రోజులు ప్రతీ సంవత్సరం
ఒకసారి వస్తూనే ఉంటాయి కదా.ఇది అంత అపురూపమైన
విషయమా”
“అవును మాకిది
అపురూపమైన విషయమే. ఎందుకంటే ఇవాళ్టికి మా పెళ్లై యాభై ఏళ్ళైంది. అంటే వివాహ స్వర్ణోత్సవమన్న మాట. మనిషి పూర్ణాయుష్షు వంద సంవత్సరాలు. కానీ వంద సంవత్సరాలు
బ్రతికే వారు లక్షకి ఒక్కరు కూడా ఉండరు కదా. సగటు జీవిత కాలం ఏ అరవై డభ్భై సంవత్సరాలో.అలాంటప్పుడు యాభై
ఏళ్లంటే మన జీవితంలో సగం కంటే ఎక్కువే కదా. అందుచేత యాభై ఏళ్ల దాంపత్యం అంటే
జీవితంలో సగ భాగం కంటే ఎక్కువే.కనుక వివాహ స్వర్ణోత్సవమంటే ఎవరికైనా వారికది
అపురూపమే.
ఈ సందర్బంగా మా ఇద్దరికీ ఇంత
ఆయుష్షునిచ్చినందుకు ఆ పరమేశ్వరునికి- నేను కొలిచే సాయిబాబాకి- నమస్కరించుకుంటున్నాను.
మరి నా జీవితంలో సగభాగం పైనే పాలుపంచుకుని జీవితాన్ని సుఖమయం
చేసిన
నా జీవిత సహచరిని అభినందిస్తున్నాను. ఆవిడ మీద నేను
రాసుకున్న పద్యం
ఇహ సుఖముల నందించగ
అహరహమును పాటు పడుచు అలుపెరుగక నా
గృహమును స్వర్గమొనర్చిన
సహచరి నాకున్ ప్రియ
సఖి సాక్షాత్ లక్ష్మీ
ఎన్నడూ పెళ్లి రోజు వేడుకలని జరుపుకోకపోయినా ఇవాళ మా వాళ్లందరితో సరదాగా
జరుపుకుంటున్నాము.తమ్ముళ్ళూ చెల్లెలూ కుటుంబాలతో ఊళ్ళనుండి వస్తున్నారు. బావ
మరదులూ మరదళ్లూ అందరూ ఊళ్ళోనే ఉన్నారు. అందరం సాయంత్రం హోటల్లో కలసి సమావేశమై
సరదాగా గడుపుతాము.కలసి భోజనం చేస్తాము.
అక్షయ తృతీయకి ఎప్పటిలాగే ఈ సారి కూడా అరతులం బంగారమైనా
కొనుక్కోక పోయినా అరకిలో బంగారం కొనుక్కున్నంత ఆనంద పడుతోంది మా ఆవిడ. ఆవిడ ఆనందమే
నా ఆనందం కదా?
.