24, మే 2015, ఆదివారం

మా ఊరి కవి గారు

 మా ఊరి కవి గారు
అతడంత ఆజాను బాహుడు కాదు. ఏ అయిదున్నర అడుగులో ఉండొచ్చు. వయస్సు అరవై పై మాటే. దాదాపు డభ్భై ఉండొచ్చు. పొడుగ్గా నెహ్రూ గారు  ధరించే లాంగ్ కోటు లాంటిది ధరించి ఉన్నారు. జేబులో జేబు గడియారం కూడా ఉన్నట్టే ఉంది. గుండ్రని ముఖం. ఉంగరాల జుత్తు. చేతిలో పొన్ను కర్ర చిద్విలాసంగా ఊపుకుంటూ  మా వీధిలో నడుస్తూ వస్తున్నారు. మా ఇంటి దగ్గరకు రాగానే వీధరుగు మీద నిల్చున్న నన్ను చూసి మీ తాతెలా ఉన్నాడ్రా?” అని అడిగి నా జవాబు కోసం ఎదురు చూడకుండా ఇంట్లోకి వచ్చేరు. ఎవరో దారి చూపిస్తే సావిట్లోంచి మా తాతగారు పడుక్కున్న పెద్ద గది లోకి ప్రవేశించేరు.  మా బాబాయిలెవరో మా తాతగారి మంచం పక్కనే కుర్చీ వేయగా దానిలో కూర్చుని మా తాతగారి వంక  పరిశీలించి చూసేరు. అప్పటికి దాదాపు 20 రోజులుగా జబ్బుతో ఉన్న మా తాతగారు  కృశించి పోయి పెరిగిన గడ్డం తోనూ కళ్ళు గుంటలు పడిపోయి బాగా నీరసంగా ఉంటూ జీవం లేని కళ్లతో ఒక సారి ఆ వచ్చిన వ్యక్తి ని చూస్తూ హీన స్వరంతో పలకరిస్తున్నట్లుగా చేతులు జోడించి నమస్కరించేరు. వారు దాదావు సమ వయస్కులే. ఆ వచ్చినాయన మా తాతగారి చేతులు పట్టుకుని  ఒరే జోగయ్యా..నీకేం భయం లేదురా. నువ్విప్పుడప్పుడే పోవురా. మరో పదేళ్ళయినా బతుకుతావు. ఊరికే అధైర్య పడకు అంటూ  అక్కడ  ఆ గది లోనే కిందను కూర్చుని  గుడ్ల నీరు కుక్కుకుంటూ తాము ధరించిన సైను పంచల్ని నోటికడ్డంగా పెట్టుకుని బెక్కుతున్న మా తాతగారి విధవ చెల్లెండ్రిద్దర్నీ చూసి మీరేఁవిటే ఇలా? వీణ్ణి ధైర్యంగా బతకనివ్వరేఁవిటే? మీరలా ఉండకూడదు అని వారిని గద్దించి  మా నాన్న గారి వైపు చూస్తూ  మీ నాన్న కేం భయం లేదురా నాది పూచీ.. అయినా వైద్యం చేయిస్తున్నారుగా. మన ఆదినారాయణ  ( డా. ఆదినారాయణ ఆ రోజుల్లో మా ఊళ్ళో పేరొందిన MBBS  డాక్టరు గారు రోజూ వచ్చి మా తాతగారిని చూసి వైద్యం చేసి వెళ్ళే వారు) చేతి చలవ మంచిదే. వెళ్ళొస్తాన్రా ఎవరూ దిగులు పడకండి అంటూ అందరికీ ధైర్యం చెబుతూ  బయటికి వెళ్ళి పోయారు.  మా Family doctor డా. ఆది నారాయణ గారి మీద  మా ఇంట్లో అందరికీ గురి ఉన్నా, ఇప్పుడు వచ్చి వెళ్ళి నాయన ఇచ్చిన ధైర్యంతో అందరి ముఖాల్లోనూ కళ వచ్చింది. దానికి  అతని జ్యోతిష్యం మీద మా మా వాళ్ళందరికీ ఉన్న గురే కారణం అని వేరే చెప్పనక్కర లేదు.
( ఆయన చెప్పి నట్లే ఆ తర్వాత మా తాతగారొక పదేళ్ళు హాయిగా బ్రతికేరు)
ఆయన  పార్వతీ పురంలో మా కంచరి వీధికి  చివరగా ఉండే గొల్ల వీధిలో ఉండేవారు. ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు industries department లో వీవీంగ్ సూపరింటెండెంట్ గా పని చేసేవారట. ఆ రకంగా ఉద్యోగంలో ఉన్న కాలం లో మద్రాసులోనో మరెక్కడో ఉంటూ వచ్చినా రిటైరయ్యాక మాత్రం  గొల్లవీధి లోనే వారి స్వగృహం లోనే ఉండేవారు. అందువల్ల బజార్లోకి గాని మరెక్కడికి గాని పోవలసి వచ్చినా మా యింటిముందునుంచే పోవలసి రావడంతో వారిని అంతకు ముందు చాలాసార్లే చూసేను. అదీ గాక వారింటికీ మా యింటికీ శుభకార్యాల్లో రాక పోకలుండేవి కూడా. అయితే అవన్నీ నా చిన్నతనంలో కావడంతో నాకు సరిగా గుర్తు లేవు. పైన చెప్పిన ఉదంతం బాగా గుర్తుండి పోవడానికి కారణం అది నేను కాలేజీలో ఆఖరు సంవత్సరం చదువుతున్న 1960 కావడం, అప్పటికి నాకు మా విశ్శి బాబు ( విశ్వనాథం బాబాయి) గారి ద్వారా  సాహిత్యమంటే కొంత అభిలాష కలగడం- ఆ వ్యక్తి పట్ల కొంత ఆసక్తినీ గౌరవాన్నీ కలుగ జేసాయి. ఇంతకీ ఆయనెవరో చెప్ప లేదు కదూ?  ఆయనే శ్రీ అనంత పంతుల రామలింగస్వామి గారు.  మా ఊరి కవిగారు. నాటి సాహితీ లోకంలో సుప్రసిధ్ధులు. వారి గురించే నేనిప్పుడు చెప్ప బోయేది.
శ్రీ రామలింగ స్వామి గారు సాంప్రదాయ వాదులు. తెలుగులో అనేకమైన పద్యకృతులు రచించారు. 1930 ప్రాంతంలో తెలుగు సాహిత్యం ఉధృతంగా వస్తున్న భావకవిత్వం అందరు సాంప్రదాయవాదుల్లాగే ఈయనకీ నచ్చలేదు. సాంప్రదాయవాదులందరూ భావకవిత్వాన్ని అభావకవిత్వమని ఆడిపోసుకుంటూ అక్కడితో ఆగి పోయినా, భావకవిత్వానికి నిరసనగా గ్రంథాల్ని ప్రచురించిన ఇరువురిలో ఒకరు ఉమాకాన్త పండితులు కాగా రెండో వారు ఈ రామలింగస్వామి గారే.
భావకవిత్వాన్ని అధిక్షేపిస్తూ వచ్చిన గ్రంథాల్లో   అనంత పంతుల వారి  శుక్ల పక్షము బహుళ ప్రచారము పొందినది. భావకవిత్వ ప్రచారాన్ని తన భుజస్కంథాల మీద వేసుకుని ఊరూరా తిరిగి సభలు పెట్టి ప్రచారం చేసిన శ్రీ కృష్ణ శాస్త్రిగారి కృష్ణ పక్షాన్ని ముఖ్యంగా ఎద్దేవా చేస్తూ వ్రాసినదిది. భావ కవిత్వాన్ని ఎగతాళి చేస్తూ ఈ శుక్ల పక్షంలో ఒక చోట-
కొండమీద విన్న గూగూలు
కొండ క్రింద గన్న వాగూలు
అప్పన్న చెవి నున్న పోగూలు
అన వేమా రెడ్డి ఈగూలు  అని వ్రాస్తారు.
మరొక చోట  భావ కవిత్వాన్ని అవహేళన చేస్తూ ఈయన చెప్పి ఈ పద్యం ప్రసిధ్ధమైంది-
రెండు కాకులు కూర్చుండె బండమీద
నొండెగిరిపోయె
నందొండు మిగిలె
రెండవది పోయె పిదప నందొండు లేదు
బండ మాత్ర మందుండి పోయె.
( ఛాందసంగా సాంప్రదాయ దృష్టితో చూడడం వలన వీరికి భావ కవిత్వమంటే ఏహ్యత కలిగింది కాని  భావ కవిత్వం ఇటువంటి ఈసడింపులని తట్టుకుని 5,6 దశాబ్దాలు నిలబడిందంటే వీరి సంకుచితమైన సాంప్రదాయ దృష్టి సరైనది కాదని అవగతమౌతుంది)
అనంత పంతుల వారి  భావకవిత్వ  ద్వేషం పక్కన పెడితే వారు రచించిన ఇతర గ్రంథాలు భువన విజయము, శ్రీ కృష్ణ చరిత్రము, వికట వాణి  మొదలైనవి వీరిని కవిగా లబ్ధ ప్రతిష్టుణ్ణి చేసాయి. ఇందులో శ్రీ కృష్ణ చరిత్రము శ్రీ పాద కృష్ణ ముర్తి శాస్త్రి గారి జీవిత చరిత్రమట. అనంత పంతుల వారు వ్యంగ్యానికి పెట్టింది పేరు .  తెనాలి రామలింగని వలెనే  ఈ రామలింగ స్వామి గారికి కూడా వికట కవి అనే బిరుదు ఉంది. మీద కాకుల పద్యం చూసేరుగా. ( అసలు మా ఇజీనారం జిల్లానే ఇగటాలకు పుట్టినిల్లేమో)
ఈ కవి గారి  రచనా పాటవానికి మచ్చుతునక లన దగ్గ రెండు పద్యాలను ఉటంకిస్తాను.  చూడండి. మొదటిది శ్రీ కృష్ణ దేవ రాయల గురించి చెప్పినది.

 కలిత సారస్వత కలశాబ్ధి వీచుల
       నెలిమితోఁ జెలిమితో నీఁది యీఁది
ఘన మల్ల యుద్ధరంగస్థలోపరి మేటి
       మల్లుర తోడుత మలసి మలసి
దండభోగాసంహతాది సర్వ వ్యూహ
       భిద్రహస్యంబులు వెదకి వెదకి
రాజకీయ రహస్య రాజిత జ్ఞానంబు
విజ్ఞుల సంగతిఁ బెనిచి పెనిచి
యాత్మ జనపాలనా సేవనానురోధ
సకల సాధన సామాగ్రి సంతరించి
రాజ్య పథగామి యగుఁ చుండె రాయలంత
ప్రజలు శ్రీకృష్ణుఁడని తన్నుఁ బ్రస్తుతింప.

క్షితి భర్తయుఁ గృతిభర్తయు
నతులిత కృతికర్త, వైరి హర్త, ప్రజాస
న్నుత వర్తియు, ధృతకీర్తియు
ధృత సంపన్మూర్తి కృష్ణదేవనృపతియే.

రాజా! వైభవజితధన
రాజా! తనుకాంతి విజితరాజా! విద్వ
ద్రాజా! ధృతజితభూభృ
ద్రాజా! రాహుత్తరాజ! రాజకరాజా!

తిరమౌ తావక దేశభక్త కలసద్విద్యా సుధారక్తికిన్
పరరాడ్భంజన శక్తికిన్, సకల దిగ్వ్యాప్తప్రధాసక్తికిన్
గురుసేవాస్థిరసక్తికిన్, బుధజనాకూత ప్రియప్రోక్తికిన్ 
చిరవాంఛాఫలసార భుక్తికి మదాశీర్వాద ముర్వీశ్వరా! 

రెండవది- శ్రీ ఓలేటి బుచ్చి బాబు  ( మన Face Book మిత్రులు శ్రీ శ్రీనివాస భాను గారి అన్నయ్యగారు, ప్రముఖ నాటక ప్రయోక్త) గారి కోరిక మేరకు కవిగారు నటరాజును స్తుతిస్తూ అచ్చ తెలుగులో వ్రాసి ఇచ్చిన సీస పద్యం – ( 1960ప్రాంతాల్లో వ్రాసినది)                     
సీ. మలచూలి నరమేన నిలిపి పేరెలమిమై
చలిగొండ చరులందు మెలగువాడ
నేమ్మేని నిండ నేనికతోలు  మొలమీదు
పులితోలు హవణించి  పొలయువాడ
చలువ గందము రోసి వెలిబూది మై పూసి
చిలువ పేరును మెడం గలుగు వాడ
జడలందు నినువాక ముడివైచి మరి వెల్గు
పూవటు సిగ మీద పూను వాడ
 తే.గీ. సంకు నొక చేత, నొక చేత జింక, నొక్క
కేల ముమ్మొన వాలొక్క కేల డక్క
బెరసి యురళించి యాటాడు వేస కాడ
మేటి యాటల రేడ నీ కేటి కోలు

నటరాజు మీద అచ్చ తెలుగులో ఇంత కన్నగొప్ప పద్యం ఎవరు వ్రాయగలరు
? ( రాస్తే గీస్తే మళ్ళా మా అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారే వ్రాసి ఉండాలి.) మా ఊరి కవి గారికివే నా నివాళులు.
(శ్రీ అనంత పంతుల వారి గురించి ఒక విపులమైన వ్యాసం వ్రాయాలని నాకు ఎప్పటి నుంచో ఉన్నా, నేను చదివిన విషయాలన్నీ సేకరించి ఉంచుకోక పోవడం వల్లా ఆయన పుస్తకాలు నాకిప్పుడు లభ్యం కాకపోవడం వల్లా  ఆ పని చేయలేక పోతున్నందుకు నాకు అసంతృప్తి గానే ఉంది.  కాని శ్రీ గుమ్మా రామలింగ స్వామిగారు ఈ మధ్యన వ్రాయమని అడగడంతో అసమగ్రమైనా ఒక వ్యాసం వ్రాస్తేనే మంచిదనిపించి  వ్రాసేను. ఇది చదివి వారిని గురించిన ముచ్చట్లు తెలిసిన వారెవరైనా చెప్పక పోతారా అని నా ఆశ. దీనిలోని అచ్చ తెలుగు పద్యాన్ని నాకు అందజేసిన  తమ్ముడు భానూకి ధన్యవాదాలు. సెలవు. )