1862 సెప్టెంబరు 21వ తేదీ. తెలుగు సాహితీ గగనంలో వేగుచుక్కపొడిచింది. మన సాహితీ ప్రాంగణంలో అలుముకున్న చీకట్లను తొలగించి ఒక నూతన శకావిర్భావానికి నాంది పలుకబోయే యుగకర్త విశాఖజిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో పుట్టాడు. జననం మాతామహుల ఇంట్లో రాయవరం గ్రామంలోనే అయినా పెరిగిందీ కళలు నేర్చిందీ ఉద్యోగించిందీ కళలకు కాణాచి అయిన విజయనగరంలోనే. అతడు తన హైస్కూలు చదువుల రోజులలోనే శ్లోకాలు వ్రాసేవాడట. కాలేజీ లో అడుగు పెట్టిన కొత్తల్లోనే (21వ ఏట) సారంగధర అన్న ఇంగ్లీషు పద్యకావ్యాన్ని ప్రచురించిన ధీశాలి.అప్పట్లోనే చంద్రహాస అన్న మరో ఇంగ్లీషు కావ్యాన్నికూడా వ్రాసేడు. సారంగధర కావ్యం ఎంత పేరుపొందిందంటే ఆ ప్రచురిత కావ్యాన్ని ప్రముఖ కలకత్తా పత్రిక తిరిగి తమ పత్రికలో ప్రచురించేటంత. అయితే వీటినీ, ఆతరువాత కొన్ని సంస్కృత నాటకాలకి ఆంగ్లంలో వ్రాసిన పీఠికలనుగానీ ఆ కవిశేఖరుని ఆంగ్ల భాషా వైదుష్యానికి మచ్చుతునకలనవచ్చునేమో గానీ ఆయనకి చిరకీర్తిని తెచ్చి పెట్టినది మాత్రం తెలుగు లో మాగ్నమ్ ఆపస్ ( Magnum opus )అనదగ్గ కన్యాశుల్క నాటక రచన మాత్రమే.
ఈనాటకం మొదటి ప్రదర్శన 1892 లో జరిగి విశేష జనాదరణకి నోచుకుంది. దానికి కారణం అంతవరకూ తమకు అర్థంకాని మరఠ్వాడా సంస్థల వారి హిందీ నాటకాలు చూసిమొహం మొత్తిన తెలుగు వారికి వారి నిత్యజీవితంలోకనిపించే పాత్రలు వారి జీవద్భాషలో మాట్లాడుతూ కనిపించడమే. కన్యాశుల్క రచనోద్దేశం ప్రధానంగా సంఘసంస్కరణ అయినా అది ప్రజల హృదయాలలో నాటుకునేట్టు చేయగల బలమైన సాధనం వారి జీవ భాషలో రచింపబడే నాటకమే అని కవి నమ్మడమే. ఆనమ్మకం నిజమని రుజువు చేస్తూ ఆనాటకం పొందిన బహుళ జనాదరణ, పత్రికల ప్రశంసలూ కవిని ముగ్ధుణ్ణి చేశాయి. ఆనాటివరకూ తెలుగు దేశం కనీవినీ ఎరుగని ..నాటి సాహిత్యంలో ఎటికెదురీతలాంటి తన ప్రయోగం విజయవంతమవడంతోనూ మొదటి కూర్పు (1897) ప్రచురించిన నాటినుండి గడచిన పుష్కర కాలంలో వ్యావహారిక భాషకి లభించిన సమాజ, సాహితీపరుల ఆమోదపు ప్రోత్సాహంతోనూ కన్యా శుల్కం నాటకాన్నితిరగ రాసి 1909 లో ప్రచురించారు. ఈ ప్రచురణ మొదటి కూర్పులో ఉండిపోయిన గ్రాంధిక పదజాలపు వాసనలు పూర్తిగా తొలగించుకొని అసలైన తెలుగు నుడికారపు సొబగులతో గుబాళించింది. గత నూరేళ్లుగా తెలుగు సాహితీ పిపాసులు మరీ మరీ చదువుకుంటూ మురిసిపోతున్న ప్రచురణ యిదే.
తెలుగు సాహిత్యంలోమణిపూస అనదగ్గ కన్యాశుల్కం నాటకమే కాకుండా ఆయన రాసిన దేశ భక్తి గేయం ముత్యాలసరాలూ ఆయనని అజరామరుణ్ణిచేశాయి.
దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్
వట్టిమాటలు కట్టి పెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్
పూని యేదైనాను ఒక కార్యం
చేసి జనులకు చూపవోయ్..
అంటూ దేశజనుల్ని ఉద్బోధిస్తూ ఆయన రాసిన గేయం ఏదేశప్రజలైనా పాడుకో దగ్గది. ఇటువంటి దేశభక్తి గేయం మరో బాషలో ఉండి ఉంటుందని నేననుకోను.
ఆయన సమాజంలో ఉన్న మూఢవిశ్వాసాల్ని డంబాచారాల్ని కడిగివేశాడు. తోకచుక్క అనే గేయంలో
అరుదుగా మిను చప్పరంబున
చొప్పుతెలియని వింత పొడమగ
చన్న కాలపు చిన్న బుధ్ధులు
బెదరి యెంచిరి కీడుగా... అంటూ …
తలతునేనిది సంఘసంస్కరణ ప్రయాణ పతాకగాన్ అనీ అన్నాడు.
మన సమాజానికి పెద్ద చీడయైనటువంటి కుల వ్యవస్థని అసహ్యించుకుంటూ
లోకమందున యెంచి చూడగ
మంచి చెడ్డలు రెండె కులములు
మంచియన్నది మాలయైతే
మాలనే యగుదున్ అనగలిగిన సంస్కరణాబిలాషిఅతడు.
వాడుక భాషని ఈసడించే శుధ్ధ గ్రాంధికవాదులకు
కొయ్య బొమ్మలె మెచ్చు కనులకు
కోమలుల సౌరెక్కునా అంటూ చురక పెట్టేడు.
ఈ మహాకవిని గురించి చెప్పుకోవడానికి ఎంతైనా ఉందిగానీ ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. మన మహాకవి శ్రీశ్రీ చెప్పిన విషయాన్నిక్కడ గుర్తు చేసుకోవాలి. ఆయన మనకి ముగ్గురే యుగకవులనీ వారు ఆది కవులలో తిక్కన మధ్యయుగంలో వేమన ఆధునికులలో గురజాడ అని నిష్కర్షగా చెప్పాడు.
అనారోగ్యంతో బాధ పడుతూ చాలాతక్కువ కాలం (53 సంవత్సరాలు) మాత్రమే జీవించినా ఆధునికాంధ్ర సాహిత్యానికి దిశా నిర్దేశం చేస్తూ
దీపధారియై ముందు నడుస్తూ “ అడుగు జాడ గురజాడది-- అ ది భావికి బాట ” అనిపించుకున్న గురజాడ సాహితీపరులందరికీ
చిరస్మరణీయుడు.
నేటికి గురజాడ జన్మించి నూట నలభై తొమ్మిది సంవత్సరాలు గడిచి 150 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో నా నివాళి నీవిధంగా సమర్పిస్తున్నాను
సరసుల మనసులదోచియు
కరమగు ఖ్యాతిని బడసిన కన్యాశుల్కం
విరచించె మన మహాకవి
గురజాడను నే నుతింతు గురుభావముతో...
(మరికొన్ని విషయాలు మరోసారి ---సెలవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి