24, సెప్టెంబర్ 2011, శనివారం

శ్రీ విశ్వనాథ గిరీశం....హైదరాబాదీ గిరీశం...

( కన్యాశుల్కం నాటకాన్ని విశ్వనాథ వారు వ్రాసి ఉంటే ఎలాగుండేదో ఊహించి సరదాకి చేసిన ప్రయోగం. అలాగే గిరీశం హైద్రాబాదులో పుట్టి ఉంటే  ఆ హైద్రాబాదు  గిరీశం ఎలా మాట్లాడే వాడో అని  మరో చిన్నఊహ... )

ఒకరోజు సాయంత్రం  విశ్వనాథ వారి గిరీశం విజయనగరం బొంకులదిబ్బమీద నిల్చుని  ఇలా స్వగతం చెప్పుకుంటూ ఉంటాడు:

వి.గిరీశం:సాయం సమయమైనది. దీనినే కవులు గోధూళి వేళయని యందురు   అదియొక చమత్కారము. వారేదియును దిన్నగా జెప్పరు.కవులు నిరంకుశులని గదా లోకోక్తి. అయిననేమి? తిన్నగాజెప్పిన వారిసొమ్మేమి బోయియుండును? వారినట్లుండనిండు. వారిది కడుపునిండిన బేరమైయుండును. నాసంగతియే యేమియునుదోఁచకున్నది. నెల దినములక్రిందట విపణికి బోయి సరకులను గొనిదెత్తునన్ననెపమున పూటకూటియామెనుండి ఇరువది రూప్యములను బుచ్చుకొని వచ్చి నాట్యగత్తెకు నర్పించుకొనియుంటిని. ఈదినము ప్రత్యూషముననే నాకునూ ఆమెకునూ పెద్ద జగడమే జరిగినది. కపాల మోక్షము చేయుదమన్నంత కోపమావహించినదిగాని, ఓరిమి లేక ఎవడునూ లోకమును గెలువజాలడని రిచర్డు మహాశయుడు ఆంగ్లమున నుడివియుండుట జ్ఞప్తికి వచ్చుటచే  శమించియుంటిని. పూర్వమున నేనెన్ని పర్యాయములు ఇట్లు ధనము కాజేసినను ఏమియూ ననక యూరకుండెడిదిగాదా? ఇప్పుడీ నాట్యగత్తె విషయము  ఎవడైన తుంటరియొకండు ఆమె చెవిలోనూదియుండును. మన ప్రాభవమును జూచి ఓర్వలేక అతడీ పని చేసియుండును. ప్రొద్దుటి సంఘటన వలన మరి నేటినుండి మనకు నిచ్చట భోజనము లభించు తీరు మృగ్యము. ఇచటనందరకునూ ఋణగ్రస్తుడనైయుంటిని. శ్రీ పంతులుగారి కోడలుకి నేను వ్రాసియున్న ప్రేమలేఖ సంగతి బహిర్గతమైనచో నాకు దేహశుధ్ధి జరుగుట అనివార్యము. అతిశీఘ్రమే ఈయూరినుండి నిష్క్రమించుటత్యావశ్యకమని మదినిదోచెడిని....కాని మధుర వాణిని వీడి వెళ్లుటకు మనసు ఇచ్చగించదే? నేనేదైన నుద్యోగము జేసి యామెకు వైభవమును జేకూర్చగలనను ఆశతోడనున్నది. పాపమమాయకురాలు.

ఆఁ.. ఎవరా వచ్చుచున్నది.... నా ప్రియశిష్యుడగు వెంకటేశము వలె దోచుచున్నది. వీనికీ దినమునుండి  క్రిష్టమసు శలవులిచ్చి యుందురు. వీని ముఖమున విషాదఛాయ దృగ్గోచరమగుచున్నది.  పరీక్ష దప్పియుండును. మంచిది. వీనికి చదువుచెప్పుదునని వీనితోడ వీని యూరికి బోయినయెడల ప్రస్తుత సంకటము నివారించుకొనవచ్చును. తరువాత సంగతి యాతరువాత జూచుకొనవచ్చును. నందో రాజా భవిష్యతి యని గదా
(ఇట్లుకొనసాగును.)
                                               ****
                              
గిరీశం హైద్రాబాదులో పుట్టి ఉంటే......
హై.గిరీశం:   పొద్నూకింది...ఒక మయిన పయిల వొటేలమ్మతాన యిరువై రూపాలు దీస్కొని సామాన్దెస్తనన్జెప్పి చపాయించిన.  గాపైసల్గిట్ట డాన్సు గర్లుకి కరుసైపోయుండె. ఇయ్యాల పొద్దుగాల గామె లడాయి శురూజేసె..  నాకెంత గుస్సయ్యందంటే గామెను సంపేద్దామనుకున్నగాని గంత గుస్సపన్కిరాదని గా రిచర్డుగాడు జెప్పింది యాదికొచ్చి జర్రంత తమాయించిన. గామె గూడ మంచిదే. గిదేమి పైలిబారుగాదు,  గామెతాన పైసల్దీసుకున్నది. గప్పుడల్ల  సప్పుడు జైకుంట
 ఊకునేదిగాదె. గిప్పుడేమొ గామెకి డాన్సుగర్లు కత ఎవుడైన జెప్పిండో  ఏందోకత. గెట్లైన గిప్పటి సంది మనకీడ బువ్వబుట్టే కతలేదు. పంతుల్కోడల్కి చిట్టి రాసినంద్కు గాల్లకెవురికైన ఎరికైతె గెప్పుడైన మన సెమ్డాలెక్కదియ్యొచ్చు. గింక లేట్జెయ్యకుండ గీడనుంచి  బైలెల్లడమే దిమాకున్నోడు జేసేపని. గాని ఆ సాన్ది మదురవోణ్ణి ఇడిసిపెట్టెల్లాల్నంటె మనసైత లేదు. నేనేదైన కొలువు జేసి గామెను సుకబెట్తనని కలలుగంటన్నది. ఎర్రి మొకంది.

  ఆఁ...ఎవురది... గిట్నే ఉర్కొస్తండు? మన యెంకటేనా? గీడికిప్పుడు కిస్మిస్సెలవులిచ్చుంటరు. గీడు దప్పకుంట పరీచ్చ ఫెయిలయ్యుంటడు. గీడి మొగమే జెప్తందా ముచ్చట. గీణ్ణి జర్ర సమ్జాయించి గీడికి  సదువు సెప్తనని గీన్తో గీని ఊర్కి ఉడాయిస్తే గిప్పటికి మనం బచాయించినట్లయితది. పరేశాన్ ఖతమ్. గానక ముచ్చట గానక.....        (ఇలా నడుస్తుంది...)

( ఇది శ్రీ గురజాడ 150వ జయంతోత్సవ సంవత్సరం అందుకే ఈ యత్నం...సెలవు)                        

16 వ్యాఖ్యలు:

Ravi Khandavilly చెప్పారు...

Great effort.. Gireesam is my all time favorite.. If you can convert the whole drama into Vishwanatha style, I am sure it will be a lot applauded..

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

శ్రీ రవి గారికి కృతజ్ఞతలు. ఆంతా చేస్తే బోరుకొడుతుంది, అయినా ఆది నా వల్ల అయ్యే పని కాదు, మరికొంత కొనసాగింపుచేయవచ్చు.ధీనికి శ్రీ శ్రీ రమణగారు లేక విశ్వనాథ పావని శాస్త్రిగారో తగుదురని నానమ్మకం. అలాగే హైదరాబాదు గిరీశానికి కొనసాగింపు చేయగలవారు శ్రీ తెలిదేవర భానుమూర్తిగారని నా అభిప్రాయం.

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

మీ పారడీ చాలా బాగున్నది. విశ్వనాథ వారి శైలి చాలా బాగా పట్టుకుని సందర్భానుసారం మాటలు వేసి రక్తి కట్టించారు. ధన్యవాదాలు.

SHANKAR.S చెప్పారు...

అద్భుతంగా రాశారండీ. విశ్వనాధ వారి శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

ఇక తెలంగాణా గిరీశం గురించి చెబుదామంటే ప్రస్తుతం సకల జనుల సమ్మె కదా కామెంట్ కూడా చేయచ్చో లేదో తెలియక చెయ్యట్లేదు. :)

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

shri shankar gariki,sivaramaprasad gariki kruthagnathalu. nenu type chesthunna chota thelugu leka povadamtho englishlo cheyyalsi vachindi. kotha postlu kooda choosi spandana theliya jesthundandi.

పంతుల జోగారావు చెప్పారు...

హైదరాబాదీ గిరీశం చాలా బాగుంది. విశ్వనాథ గిరీశంలో
అదియొక చమత్కారము లాగా మరి కొన్ని విశ్వనాథవారి పడికట్టు పదాలు, విషయాంతరంలోకి మరలి పోవడాలూ కూడా చేస్తే మరింత రాణిచేదనిపించింది.ఏమయినా,
మీ టపా ఆకట్టుకునేలా ఉంది. రవి గారు అన్నట్టుగా Great effort.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

పంజో గారికి కృతజ్ఞతలు.మీరు చెప్పినట్టు చెయ్యడానికి అది నాటకంలో ఒకపాత్ర కావడం ఒక ఆటంకం.
ఇంకా పెంచితే రసాభాస అవుతుందేమోనని సంశయం.అందుకని కొంచెం తగ్గాల్సి వచ్చింది. వ్యాసమైతే ఎలాగేనా రాసుకోవచ్చు.

swathi చెప్పారు...

excellent and very well written

pratap.vinnakota చెప్పారు...

గోపాలక్రిష్ణ గారికి,
గురజాడ వారి గిరీశాన్ని చాల చమత్కారంగా విశ్వనాథ వాణిలో పలికించారు. నూతనమైన హైదరాబాదీ గిరీశం కూడా చాల బాగుంది.. శ్రమ అనుకొకుంటే మిగతా అంధ్ర, రాయలసీమ మాండలికాలలో కూడా గిరీశాన్ని ఆవిష్కరిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం...

అన్వేషి చెప్పారు...

విశ్వనాధవారి బాణికి అనుకరణ బహుదొడ్డగా కుదిరిందిసుమీ - ఇంక హైదరాబాదీ గిరీశంతోటి లొల్లి మనకెందుకులే తమ్మీ, ఇడిసేద్దారి.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

అన్వేషిగారికి -మీస్పందనకు నా కృతజ్ఞతలు

పంతుల సీతాపతి రావు చెప్పారు...

విశ్వనాధవారి గిరీశెం చాలా బాగుంది

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

Thank you pantulu babu please read other posts also

బొందలపాటి చెప్పారు...

Good effort sir.Especially ViSwanaatha gaaridi baagundi.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

బొందలపాటివారి స్పందనకు కృతజ్ఞతలు తొలియజేసుకుంటున్నాను.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
తెలంగాణా యాసలో చక్కగా ఉంది.