5, అక్టోబర్ 2011, బుధవారం

ఆరుద్ర చెప్పిన డబ్బింగ్ పితామహుడు శ్రీశ్రీ ముచ్చట

                                  

            ఆరుద్ర                                                                            శ్రీశ్రీ                       



ఈ ముచ్చట ఓ యాభై ఏళ్ల కిందటిది. ఆప్పుడు నేను విశాఖపట్నం ఏవీఎన్ కాలేజీలో చదువుకుంటున్నాను. ఆ కాలేజీకి నేను చదువుకుంటున్నరోజుల లోనే సెంటినరీ ఉత్సవాలు జరిగాయి. క్రితం సంవత్సరం 150 సంవత్సరాల వేడుక కూడా జరిగిందట. ఆఖరి నిమిషంలో తెలియడంతో నేను వెళ్లి పాల్గొన లేక పోయాను. అంతటి ఘన చరిత్ర గల కాలేజీలో చాలా చాలా మంది పెద్దలు చదువుకున్నారట. నోబుల్ బహుమతి పొందిన సర్. సివిరామన్ లాంటి మహామహులు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మనకి కావలసింది మహాకవి శ్రీశ్రీ కూడా అక్కడి కాలేజీ హైస్కూలు లోనే చదువుకున్నాడన్నది. ఆరుద్ర కూడా ఆవూరి వాడే. చిన్నప్పుడు ఆస్కూల్లో చదువుకున్నాడనుకుంటాను. ఏమయితేనేం వారిద్దరికీ ఆ కాలేజీ స్కూళ్లతో మంచి  సంబంధం ఉంది. ఆ కారణంచేతనే కావచ్చు నేను చదువుకుంటున్నరోజుల్లో ఒకసారి (బహుశ 58లేక59 లో అనుకుంటాను) ఆరుద్రని పిలిచి సభ పెట్టేరు. అప్పటికే ఆ యిద్దరూ ( వారిద్దరూ మేనమామ మేనల్లుళ్ళవుతారు) తెలుగు సినీరంగంలో లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలు. సభానిర్వాహకులు సినిమాలగురించో శ్రీశ్రీ గురించో మాట్లాడ మన్నట్లున్నారు.
ఆరోజు ఆరుద్ర శ్రీశ్రీ గురించి మాట్లాడేడు.  మిగిలిన విషయాలు నాకు గుర్తులేవు కానీ ఆరుద్ర శ్రీశ్రీని డబ్బింగ్ పితామహుడనడమూ,  అప్పట్లో డబ్బింగ్ చేయడంలోని కష్టాలన్నీ వివరంగా విశదపరచడమూ గుర్తుంది. అప్పటికే ఆరుద్ర రాజ్ కపూర్ ప్రేమలేఖలుకి డబ్బింగ్  రచన చేసాడు.
                                    హిందీలోని నీర్ ఔర్ నందా తెలుగులోకి   ఆహుతి పేరుతో డబ్ చేయబడ్డ తొలితెలుగు సినిమా. దీనికి  తెలుగులో మాటలూ పాటలూ రాసింది శ్రీశ్రీ. ఆరోజుల్లో ఇప్పటిలా డబ్బింగ్ ధియేటర్లు లేవట. మూల భాష లోని సినిమాని చూస్తూ  పాత్రధారుల హావభావాలనూ పెదవుల కదలికలను చూస్తూ డబ్బింగ్ చెప్పే సదుపాయంకూడా లేదంటే ఎంతకష్టపడే వారో ఊహించుకోవచ్చు. ఈకష్టాల్నీ తన అనుభవాలనీ ఆచిత్రంలో ఒక పాత్రకి డబ్బింగ్ చెప్పిన, తరువాతి కాలపు కేరక్టర్ యాక్టర్, శ్రీ వల్లం నరసింహా రావుగారు               డబ్బింగూ దాని పుట్టపూర్వోత్తరాలూ అనే వ్యాసంలో రాసేరట.  టెక్నికల్ సాధక బాధకాలటుంచి రచనలో వచ్చే ఇబ్బందులగురించి ఆరుద్ర ఓ ముచ్చట చెప్పేరు. అదీఇది :
                                     ఢబ్బింగ్ రచనలో  చాలాముఖ్యమైన ఇబ్బంది.
మూలభాషలో కాని అనువదిస్తున్న భాషలో కాని ఔష్ఠ్యాలు వచ్చినప్పుడు వస్తుంది. ప ఫ బ భ మ లు పలికి నప్పుడు పెదవులు కలిసి నోరు మూసుకున్నట్లవడం మిగిలినప్పుడు నోరు తెరిచే ఉచ్చరించడం. మరీ ముఖ్యంగా క్లోజప్  షాట్లలో వస్తుందీ ఇబ్బంది. ఇటువంటి ఇబ్బందే ఒకసారి వచ్చిందట. ఓ హిందీ సినిమాలో హీరోయిన్ హీరోతో తాను గర్భవతి నయ్యానని తెలియజేస్తూ మై మా హూఁ   అంటుందట. ఖర్మంకొద్దీ అది హీరోయిన్ ముఖంమీద క్లోజప్ షాట్లో తీయబడింది.  ఈ చిన్ని డైలాగ్ కి తెలుగులో నేను గర్బవతిని అని ఎలా చెప్పించాలని రచయిత తలపట్టుక్కూర్చున్నాడట. అప్పుడు  శ్రీశ్రీ గారిని ఆశ్రయిస్తే ఆయన ఆగండం గట్టెక్కే ఉపాయం చెప్పాడట. మై మాహూఁ అనే చోట పాపాయి అని రాసుకోమన్నాడట. తరవాత హీరో హీరోయిన్ల  డైలాగుల్లో తనకడుపులో ఆతని పాపాయి పెరుగుతోందని  హీరోయిన్ చేత అనిపించేరట. అలా ఆ గండం గడిచిందట. అదీ కథ.  ఎంతైనా ఆయన డబ్బింగ్ పితామహుడుకదా?
( పైన ఉదాహరించిన వల్లంనరసింహారావు వ్యాసం గురించీ మరికొన్ని కబుర్లూ చెప్పిన మిత్రుడు శ్రీ వోలేటి శ్రీనివాసభానుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను....)
సెలవు....

6 కామెంట్‌లు:

రామ్ చెప్పారు...

చాలా బాగుంది.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

బాగుంది డబ్బింగు అనుబవం

ఆ.సౌమ్య చెప్పారు...

ఓహ్ భలే! శ్రీ శ్రీ యా మజాకా!

శ్రీ శ్రీ కలానికి రెండు వైపులా పాళీ ఉంటుంది కాబోలు...డబ్బింగ్ అయినా, straiT అయినా సరే....తన ముద్ర వేసేస్తారు! :)

ఆయన కలానికి ఉన్న పదును సామాన్యమైనది కాదండోయ్!. నేను మొన్ననే శ్రీ శ్రీ గారు రాసిన ఒక మంచి పాటని పరిచయం చేసాను నా బ్లాగులో...వీలైతే చూడండి. Ofcourse అది డబ్బింగ్ పాట కాదులెండి. :)

www.apuroopam.blogspot.com చెప్పారు...

సౌమ్యగారికి దన్యవాదాలు. మీ బ్లాగు చూస్తాను. యుగళగీతం బ్లాగులో మా అమ్మాయి సుధారాణి కొన్ని మంచి పాటలను పరిచయం చేసింది.దేానిలో శ్రీశ్రీ పాటలు కూడా ఉన్నాయి. మీకు అభిరుచిఉంటే చూడండి

సుజాత వేల్పూరి చెప్పారు...

"పాపాయి"__________ఎంత బాగుంది?

"నేను తల్లిని కాబోతున్నాను" అని చెప్పడం కంటే కూడా ఇది భావ గర్భితంగా ఉంది!

శ్రీ శ్రీ డబ్బింగ్ కబుర్లు కొన్ని వాళ్లావిడ రాసిన సంసారంలో శ్రీ శ్రీ అనే పుస్తకంలో ఉన్నాయండీ. పుస్తకం చాలా చోట్ల సోదిగా ఉన్నా, ఇదిగో ఇలాంటి కొన్ని కబుర్లు బాగున్నాయి.

మీ పేరు సాహితీ లోకంలో మాకు చిరపరిచితం! అయితే సుధారాణి గారు మీ అమ్మాయని ఇప్పుడే తెలుసుకున్నా! సుధ గారితో దెబ్బలాడాలిక! వస్తానండీ!

www.apuroopam.blogspot.com చెప్పారు...

సుజాత గారికి కృతజ్ఞతలు