సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు అన్నారు. ఆమెత అంటే విందు. సామెత లేని మాట చారూ అన్నం అయితే సామెత తో కూడిన మాటలు విందు భోజనం లాంటిదన్నమాట. ఏ భాషకయినా ఆ భాషలోని సామెతలే అలంకారాలు. ఒకొక్కప్పుడు పది మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క సామెత అవలీలగా విశదీకరిస్తుంది. నా చిన్నతనంలో సామెతలు అందరినోటా తరచూ వినిపిస్తుండేవి. ఇప్పుడవి అపురూపాలయిపోయేయి. పుస్తకాలకే పరిమితమైపోయేయి.
మొన్నామధ్య సోఁవులప్ప కథ చెప్తూ ( సోఁవులప్పకి జేజే పోస్ట్ ఇక్కడ నొక్కి చూడండి ) ఆమెకి కడుపునిండా సామెతలే. సామెత లేకుండా ఒక్క ముక్కయినా మాట్లాడదని చెప్పేను. అయితే ఆవిడ సామెతల్ని వేరుగా పరిచయం చేద్దామనే సంకల్పంతో అప్పుడు ఒక్క సామెత కూడా మీకు నేను పరిచయం చేయలేదు. ఇప్పుడు ఆవిడ చెప్పిన మా ప్రాంతపు సామెతల్ని మీకు రుచి చూపిస్తాను. మా ప్రాంతపువి అన్నంత మాత్రాన ఇతర ప్రాంతాలలో ఇవో ఇలాంటివో ఉండవని కాదు. ఒకే భావాన్ని వెలిబుచ్చే సామెతలు వివిధ ప్రాంతాల్లో ఆయా ప్రాంతపు నుడికారాన్ని సంతరించుకుని వింత పరిమళాలతో గుబాళిస్తాయి. చాలామట్టుకు అందరికీ అర్థమయ్యేటట్లే ఉంటాయి. అవసరమనుకున్న చోట వివరణలు ఇస్తున్నాను.
సోలెడు బియ్యం కూలికెళ్తే కుంచెడు బియ్యం కుక్క తినీసిందట.
పాత రోజుల్లో కొన్ని ప్రదేశాల్లో శేర్లు అనే కొలమానం ఉన్నట్టుగానే ఉత్తరాంధ్రలో గిద్దలు సోలలు తవ్వలు అడ్డలు కుంచాలూ అనే కొలపాత్రలుండేవి. గిద్దలు అన్నిటికంటే చిన్నవి. అంతకంటే పెద్దవి సోలలూ,తవ్వలూ.. ఆ తరువాత అడ్డలూ కుంచాలూ.. ఈ సామెత కర్థం చిన్నదానికాశపడి పెద్దది పోగొట్టుకోవడం.
(pennywise pound foolish అన్నమాట.)
కుంచాల సంగతి వచ్చింది కనుక మరో సామెత..—కుంచమంత కూతురుంటే అన్నీ మంచంమీదనే.--- కుంచమంటే పెద్దది కదా—అంటే ఎదిగిన కూతురింట్లో ఉంటే తల్లిని మంచం దిగనివ్వకుండా సేవ చేస్తుందని…( నమ్మకమేనా?)
కుంచాల గురించే మరో సంగతి. మా వేపు షావుకార్లు వారే మైనా అమ్మిన ప్పుడు చిన్నమ్మీ కుంచంతే అంటారట. వారే ఏదైనా కొనుక్కునేటప్పుడు పెద్దమ్మీ కుంచంతే అంటారుట. అమ్మినప్పుడు చిన్నకుంచం కొన్నప్పుడు పెద్దకుంచం అన్నమాట చూడండి వారి గడుసుదనం.
అప్పబతుకు అడగక్కర్లేదు.. సెల్లి బతుకు సెప్పక్కర్లేదు.
ఒక దాని కంటే మరొకటి ఇంకా అధ్వాన్నమని చెప్పడం.
ఒంతునొచ్చింది గెంతితే తప్పుతుందా
కర్మ వశాన జరగాల్సింది జరిగే తీరుతుంది కాని తప్పించుకోలేమని.
ఎద్దెప్పుడూ ఒక పక్కనే తొంగోని ఉండిపోద్దా?
తొంగోవడమంటే పడుక్కోవడం.—కాలమెప్పుడూ ఒకేలాగ ఉండదని చెప్పడం
లోపల ఊష్టం... పైకి నేస్తం..
ఊష్టమంటే ఉష్ణము. లోపల ఉడికి పోతూ పైకి స్నేహం నటించడమన్నమాట
సుడొక దెగ్గిర... సురకొక దెగ్గిర
సురకంటే చుట్టకాల్చి వాత పెట్టడం. కొన్ని వ్యాధులకి చురక పెట్టడమే మందు అని భావిస్తారు. వ్యాధి ఒకటైతే మందు మరోదానికి వేసినట్టు.
జరిగినమ్మ జల్లిడితోని నీళ్లు మోసిందట
జల్లిడి అంటే జల్లెడ ( seive) కన్నాలుంటాయి కనుక నీళ్లు నిలవ్వు. కొందరేంచేసినా చెల్లుతుంది. అడిగే వాళ్లుండరు. అలాంటి అమ్మే జరిగినమ్మ.
ఈ సందర్భంలోనే మరో సామెత—జరిగితే జొరమంత సుఖం లేదు.-- చేసే వాళ్లుంటే వెచ్చగా కప్పుకుని పడుక్కోవచ్చు కదా ?
పెసరగుడ్డిల పారీసి ఉప్పు దాకల ఎతకడం.
గుడ్డి అంటే పొలం. దాక అంటే వెడల్పు మూతి కుండ.. ఒకచోట పారేసి మరోచోట వెతుక్కోవడమన్నమాట, వృథా ప్రయాస అని అర్థం.
గడియ తీరదు... గవ్వరాదు
క్షణం తీరిక లేకుండా పని చేసినా రాబడి లేక పోవడం.. గవ్వలు మరీ పాతకాలంలో చిన్న డబ్బుకింద చెలామణీ అయేవి.
కరువుకి దాసర్లైతే పాట కుదరొద్దా?
కరువు వచ్చి భుక్తి గడవక దాసరి వేషం వేసుకున్నాడట. ఎవరైనా ఇన్ని గింజలు వేయక పోతారా అని. వేషమైతే వేయొచ్చు కాని దాసరి పాడే పాట పాడడం రావొద్దా? దాసర్లు పాడుకుంటూ వెళ్తుంటే అడక్కుండానే ఆయన జోలి నింపుతారు ఊరివాళ్లు.
నాలిక మీదే బూరెలు వండడం.
లేని ఆశలు కల్పించడం. నాలిక మీదే బూరెలు వండితే తినడమే తరువాయి అన్నట్టు. ఆది జరిగే పని కాదు కదా?
ఈక పండితే అందరూ ఇల్లాళ్లే
వృద్ధ నారీ పతివ్రతా అన్నది ఆర్యోక్తి. ఈక పండడం అంటే తల నెరియడం. వయసు మీరడం. Compulsive chastity అన్న మాట.
సరసుడ్ని నమ్మి పురుసుడ్ని పొయిలో పెట్టేసినట్టు
పురుషుడంటే మగడు.. సరసుడి మాయలో పడి మొగుణ్ణి వదిలించుకున్నట్టు
ముల్లుకి మొనలెవరు దిద్దుతారు.
ముల్లు మొనదీరి ఉండడం దాని సహజగుణం. కొన్ని విషయాలు సహజంగానే అబ్బాలనీ నేర్పిస్తే వచ్చేవి కావనీ చెప్పే సందర్భంలోనిది.
కొకిలమ్మకెవడు పాట నేర్పెనూ.. చేప పిల్లకెవడు ఈత నేర్పెనూ అని కదా సినీ కవిగారన్నారు?
దండుక్కి ఒప్పుకుంతారు గానీ దరమానికి ఒప్పుకోరు.
దండుగ అంటే పన్ను.(Tax-levy) ధర్మం చేయడానికి చేతులు రాక పోయినా పన్ను కట్టక తప్పదు కదా?
ఇంటి మునోకట సూత్తే ఇల్లాల్ని సూడక్కర్లేదు.
మునోకట అంటే ముని వాకిట—ఇంటిముందరి వాకిలిలో. అక్కడ చక్కగా అలికి ముగ్గు పెట్టి ఉంటే ఇల్లాలు పనిమంతురాలని తెలిసి పోతుంది.
కూటిల పాలు పోయనోడు కాటిల గేదని కట్టేసినాడట.
బ్రతికుండగా ఏమీ చేయని వాడు చచ్చేక ఏంచేస్తాడని ఎగతాళి.
కనపడిందానికి గట్టెక్కి సూడ్డమేల?
ముంజేతి కంకణానికి అద్దమేల అని అనడం. ఎదురుగా కనిపిస్తుంటే ఇంకా ఎత్తుకి పోయి చూడాల్సిన పనేముంది?
బతికి సెడినోల్లకి బాదలు లావు. సెడి బతికినోల్లకి సేస్టలు లావు.
ఉత్తరాంధ్రలో లావు అంటే ఎక్కువ అని అర్థం. బాగా బ్రతికి చెడిన వారికి బ్రతుకు దుర్భరమేకదా? సెడి బతికినోల్లకి—అంటే హీన స్థితి నుంచి పైకొచ్చిన వారికి నడమంత్రపు సిరితో షోకులు ఎక్కువే అవుతాయి. ( అర్థ రాత్రి గొడుగు పట్టమన్నాడని సామెత కదా?)
ఇదంసెడి ఈటీవోడికిస్తే సచ్చీదాకా సాపలమోతే.
విధము చెడి అంటే గత్యంతరం లేక ఈటీ వోడికి అంటే వీటివిద్యలు చేసుకుని బ్రతికే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె బ్రతుకంతా చాపలు మోసుకుంటూ ఊళ్లు తిరగడమేనని భావం.
ఇలా మరికొన్ని సామెత లున్నాయి గానీ ఓ రెండు కొత్త సామెతలు చెప్పి ఆపేస్తాను.
ఆఫీసోల్లు పని చెయ్యడమంటే అసిరమ్మ పిల్లలు కాసినట్టే
రెండూ జరగని పనులే అని చెప్పడం. గవర్నంటు ఆఫీసుల పని తీరుపై చురక.
పోలీసు కేసు... కోడి పియ్య బంక
పియ్య అంటే మలం. కోడి పియ్య కోడి విసర్జించిన మలం. బంక అంటే Gum. కోడి పియ్య Sticky గా Fevicol లాగుండి ఒకంతకి వదలదన్న మాట. పోలీసుల కేసులూ అంతే కదా. ఒక సారి ఇరుక్కుంటే బయట పడ్డం కష్టం
( పియ్య అనే పదం మా ఉత్తరాంధ్ర పదం అనుకోవద్దు. “ పియ్య తినెడి కాకి పితరుడెట్లాయెరా” అంటాడు కడప జిల్లా వాసి యైన వేమన గారు.)
ఆఖరుగా ఓ చిన్న ముచ్చట చెబుతాను. మా చిన్నప్పుడు మేము ఎవరితో నైనా స్నేహం చేసినప్పుడు “ నువ్వూ నేనూ జట్టు..కోడి పియ్యట్టు” అనుకుంటూ ఉండేవాళ్లం. చిన్నప్పుడనుకునే వాణ్ణి “ ఛీ కోడి పియ్యతో అట్టేమి ”టని, కాని దానర్థం ఇప్పుడు బోధ పడింది. కోడి పియ్యతో అట్టు వేస్తే దాన్ని ఎవరూ పెనం నుంచి వేరు చేయలేరు. ఆ విధంగా మా స్నేహం (జట్టు) విడదీయరాని బంధ మన్నమాట. చూసేరా ఒక్క సామెతతో ఎంత గట్టి బంధాన్ని ఏర్పరచుకున్నామో? అదీ సామెతల సొగసు.
మా ఉత్తరాంధ్ర పలుకుబళ్ల గురించి మరోసారి రాస్తాను. ఇప్పటికి సెలవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి