30, నవంబర్ 2011, బుధవారం

సరదా..సరదాల కందాలొక రెండు పుంజీలు..


చిక్కని కాఫీ కప్పుతొ
ప్రక్కను చేరిన నిజసతి పాటల గంధిన్
అక్కున చేరిచి సొగసుగ
చెక్కిలి ముద్దాడ వలదె చెలిమి దలిర్పన్               
  
కందర్పుడేయు బాణము
సుందరి నీ వాలుచూపు సూటిగ నాటెన్
డెందము గాయంబాయెను
మందుగ అందీయరాదె  మధురాధరమే           

అందం నీకే సొంతం
సుందరి నీ సాటి దాన్ని  చూడగ లేదే
ఎందుకు ఈ బ్రతుకెందుకు
పొందక నీతోటి పొందు పూర్ణేందు ముఖీ            

పెళ్ళికి ముందరి  వలపులు
పెళ్ళైన పిదప కుదరవు పిసరంతైనా
పెళ్ళము తోడిది సరసము
కాళ్ళా వేళ్ళా పడుటయె కాముని కైనన్             

రాజీవాక్షులతోడను
రోజూ గొడవలు పడుచును రుక్కుట కంటెన్
రాజీ పడుచును మనమే
హాజీయనుచును గులాము లౌటయె మేలౌ       

సిరిమంతుని పెండ్లాడగ
తరుణులు పోటీ పడుదురు తమలో తామే
దొరకరు నిర్భాగ్యునకున్
పరిణయమాడగ పడతులు  పృధ్వీ స్థలిలో  
  
ఎంతయొ చదువులు చదివి మ
రెంతయొ నేర్చిన మగనికి ఏకాంతమునన్       
వింతగ మతి పోగొట్టగ
కాంతామణి చేయు బోధ కర్టెన్ లెక్చర్                 

తనసతి యుండగ వేరొక
వనితను తెచ్చిన యగునది భారము తలకున్
తనసతి గలిగియు శివుడా
మినుగంగను తేగనదియు  మెట్టెను తలపై    

ఇప్పటికింతే...సెలవు...                   

28, నవంబర్ 2011, సోమవారం

అనగనగనగా ఒక తాడి....తాటిచెట్టు కథ





      భూలోక కల్ప వృక్షంతాటిచెట్టు
                                మనవాళ్లు తాటిచెట్టుని భూలోక కల్ప వృక్షంగా భావించే వారట. దానికి ప్రధాన కారణం అది బహు ప్రయోజనకారి కావడమైనా  అది మన ప్రాంతాల్లో  విస్తారంగా పెరగడం దాన్నిపెంచడంలో గల సౌలభ్యం మిగిలిన కారణాలు కావచ్చు.
                                       పూర్వం ఆంధ్ర దేశంలో తాటితోపులు ప్రతి గ్రామంలో పెంచడం ధర్మకార్యంగా భావించే వారట. యెనభై తొంభై యేళ్ల ముసలి వానిని పట్టుకుని వాని చేత తాటిగింజలు నాటించే వారట. అట్లా నాటిన గింజలు మొలకెత్తి చెట్లై కాపుకు వచ్చే సరికి ఆ ముసలాయన హరీమంటాడని ప్రతీతి. ఎందుకంటే నాటిన తాటిచెట్టు ఇరవై అయిదేళ్లకు గాని కాపుకు రాదు. మూడు తరాల తాటి చెట్లను చూసిన వాడిని ముత్తాడిఅనే వారట. అంటే తన యెరుకలో నాటిన తాటి చెట్టు పెరిగి పెద్దదై పళ్లు కాచి వాటిగింజలు మళ్లా నాటితే అవి పెరిగి వాటికి పళ్లు కాస్తే వాటిననుభవించిన వాడు దీర్ఘాయుష్మంతుడే కదా.
ఈ తాటిచెట్లను నాటించడం ధర్మకార్యంగా భావించే వారని చెప్పాను కదా? వాటిని వేలూ లక్షల సంఖ్యలలో నాటించేవారట. ఒక శిలా శాసనం ప్రకారం ఒక పుణ్యపురుషుడు పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి సన్నిధి ప్రాంతంలో  నాలుగు లక్షల అరవై వేల తాటిచెట్లు నాటించేడట.
                                     తాటి చెట్లను పెంచడంలోని సౌలభ్యం ఏమిటంటే వాటిని నీటి వసతి లేని, పంటలకు పనికి రాని, ఎగుడు దిగుడు నేలల్లో కూడా హాయిగా పెంచుకో వచ్చు. దగ్గర దగ్గరగా వేసుకోవచ్చు. మొక్కలు ఎదిగే దాకా కాపు కాయనక్కర్లేదు. ఆవిధంగా ఖర్చు లేని పంట. అయితే  తాటి చెట్ల ప్రయోజనాలు మాత్రం బహుళం. అవేమిటో కొద్దిగా వివరిస్తాను.

                                        తాటి మాను గుడిసెలు వేసుకుందికి నిట్రాటగానూ మిద్దె ఇళ్లలో స్తంభాలు,దూలాలు, వాసాలు గానూ పనికి వస్తుంది. తాటి ఆకులు పైకప్పుగా పనికి వస్తాయి. కట్లు కట్టడానికి తాటినార పనికి వస్తుంది . చిన్న చిన్న కాలువలు దాటడానికి వాటిమీద తాటి దూలాల్నివేసి బ్రిడ్జీల లాగా వాడుకునేవారు. ఇంట్లో వాడుకకి తాటి చాపలూ బుట్టలూ తయారు చేసుకోవచ్చు. నూతుల్లో నీళ్లుతోడుకోవడానికి తాటాకు బొక్కెనలు చేసుకోవచ్చు. మా ప్రాంతంలో వీటిని రేకలంటారు. తాటినారతో తాళ్లు పేనుకుంటారు. తాటి మాకులను నిలువుగా చీల్చివాటిని నీళ్లు పారించుకునే దోనెలుగా తయారు చేస్తారు. తాటి ఆకులతో విస్తళ్లు కూడా కుడతారట గాని నేనెప్పుడూ వాటిని చూడ లేదు.  తాటిముంజెలూ, తాటితేగలూ తాటిబెల్లం తాటికల్కండ తాటిపానకము తాటికల్లు ఆహార పానీయాలుగావాడుతారు. తాటి ఆకులతో గొడుగులను తయారు చేస్తారు. వీటిని మా ప్రాంతంలో గిడుగులనే వారు. వీటిల్లో పెద్దా చిన్నా సైజులవి ఉండేవి. వర్షా కాలంలో వీటిని వేసుకుని తిరిగే వాళ్లం. వీటితో సుఖమేమిటంటే  వీటిని చేత్తో పట్టుకోనక్కర లేదు. హెల్మెట్ లాగా దానికి వేలాడే తాడుని తగిలించుకోవడమే. తాటి ఆకుల ఈనెలు చీపుళ్లు గానూ ఎండుమట్టలూ మొదలైనవి వంటచెరకుగానూ పనికి వస్తాయి. తాటాకులతో విసన కర్రలు తయారు చేస్తారు. ఉష్ణ దేశమైన మన ప్రాంతంలో ఇవి  నేటి సెల్ ఫోన్ల లాగా అందరి చేతుల్లోనూ హస్త భూషణాలుగా విరాజిల్లేవి.  పెళ్లిళ్లలో అరుగుల మీద చాపలు పరచి చేతికి  విసన కర్రలు ఇచ్చేవారు. ఇవన్నీ జన బాహుళ్యానికి ఒనగూరే ప్రయోజనాలు.
                                            తాటి చెట్టు మరో ముఖ్య ప్రయోజనం నాడు మన విద్యా విజ్ఞానాల్ని పెంపొందించుకోవడానికి అవసరమైన  తాటాకుల్ని మనకందించడం. ఈ తాటాకుల మీద వ్రాసిన గ్రంథాలు శతాబ్దాల పాటు చెడిపోక నిలిచాయి. చక్కగా ఈనెలు తీసిన తాటాకుల్ని చుట్టలు చుట్టి పేడనీళ్లలో  కొంచెం సేపు ఉడకబెట్టి నీడ పట్టున ఆరబెట్టి భద్రపరచి గ్రంథాలు వ్రాసుకునేందుకు  దాచుకునే వారు. వీటినే అలేఖాలు అనే వారు. ( గుర్తుందా-- కన్యాశుల్కంలో రామప్ప పంతులు మా ఇంట్లో తాటాకుల అలేఖాలు అటకనిండా ఉన్నాయంటాడు. అవి ఇవే. కన్యాశుల్కం ఊసెత్తాను కనుక ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. నాటకం ద్వితీయాంకంలో ఒకటో స్థలంలో వెంకటేశం మా నాన్న నాక్కూడా పెళ్లి చాస్తాడు అన్నప్పుడు గిరీశం యివాళో పెద్ద పెళ్లి నీకు తల వెంట్రుక వాసి లో తప్పి పోయింది. యీ శలవులాఖర్లోగా తాళాధ్యాయం కాకుండా తప్పించుకుంటే నువ్ పూరా ప్రయోజకుడివే..”   అంటాడు. ఇక్కడ తాళాధ్యాయం అంటే తాటి పట్టతో చెమ్డాలెక్కగొట్టడమన్న మాట.)
                                                     మరో ముఖ్యమైన విషయంమన తెలుగు స్త్రీలు ఎంతో పవిత్రంగానూ మంగళప్రదంగానూ భావించే తాళిబొట్టు తాటాకుతో తయారు చేసినదే. అందుకే దానికా పేరు వచ్చింది. అదే కాదు చెవులకు కూడా తాటాకులని భూషణాలుగా వాడేవారు. అందుకే  అవి చెవి కమ్మలయేయి.  నా చిన్నప్పుడు తాటాకులతో చేసిన బొమ్మల పెళ్ళిళ్లు చేయడంచూసేను.
                                                     ఎత్తులూ లోతులూ కొలతలు చెప్పడానికి చిన్నవైతే మనిషి నిలువుతో పోల్చినట్టుగా మరీ పెద్దవైతే తాటిచెట్టు పొడవుతో పోల్చి చెప్పేవారు. రెండు తాటిచెట్ల ఎత్తనీ మూడు తాళ్ల లోతనీ అంటూ. ఇదే తాళ ప్రమాణమంటే.  ఎంతో బాధలో ఉన్నప్పుడు పెద్ద నిట్టూర్పులు విడుస్తాం కదా? అలాంటి దుఃఖాన్ని సూచించడానికి  మాకు నిశ్వాస తాళ వృంతాలు గలవుఅంటారు కృష్ణ శాస్త్రి గారు.
    మన మహా భారతంలో భీష్మునికీ బలరామునికీ తాళ ధ్వజులనే పేర్లున్నాయి. వారి జెండాలపై తాటిచెట్ల గుర్తులండేవన్న మాట
 తాటి చెట్లు మన జీవితాల్తో ఎంతగా పెన వేసుకున్నాయంటే చాలా ఊళ్ల పేర్లు వాటి వల్ల వచ్చినవే. ఉదా  తాడిగిరి, తాడికొండ, తాళ్లవలస, తాటిపూడి, తాళ్లరేవు ఒంటితాడి మొదలైనవి. ఈపేర్లే కొందరికి ఇంటి పేర్లగానూ స్థిర పడ్డాయి. మాహైదరా బాదులో తాడ్ బన్ అనే ప్రదేశం ఉంది. ఆఫ్గనిస్తాన్ లో అరాచకానికీ విధ్వంసానికీ పేరు పడ్డ తాలిబన్ పేరు ఇలా వచ్చిన దేమో తెలుసుకోవాలి . ఇంతగా తెలుగు వారి జీవితాలతో పెన వేసుకున్న తాటిచెట్టు మన సామెతల్లో ఎలా దర్శనమిస్తుందో చూడండి:-
తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదురునా?
తాటిచెట్టుకింద పాలుతాగినా కల్లే అంటారు.
తాడితన్నే వాని తలదన్నే వాడుంటాడు.
తాటిచెట్టు ఎక్కా లేవు, తాటిగెల కొయ్యాలేవు, తాతా నీ కెందుకోయి పెండ్లాము
తాటి చెట్టు నీడ నీడా కాదు తగులుకున్న వాడు మొగుడూ కాదు. (తగులుకున్నది పెండ్లామూ కాదు.)
 తాగిన వాడే కడతాడు తాళ్ల పన్ను.       ఇత్యాది

(ఈ వ్యాసంలో తాటి చెట్లగురించి చెప్పిన దానిలో కొన్ని విశేషాలు కీ.శే. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ఆంద్ర కల్ప వృక్షము అనే వ్యాసం నుంచి గ్రహించేను. వారికి  నా కృతజ్ఞతలు.)
సెలవు.

17, నవంబర్ 2011, గురువారం

శ్రీ సాయి కి కందాల నీరాజనం


శ్రీ సాయి నామ మంత్రము
ఆశ్రయ మని మదిని తలచి ఆరాధించన్
ఆసాయి గురుడు  భక్తుల
బాసట గా నిలచి పరమ పదమును చేర్చున్                

షిరిడీ నాథుని దయకై
కరములు మొగిడిచి మనమును కరుణాత్ముని పై
తిరముగ నిలుపుచు సతతము
పరమాత్మా యనుచు పిలిచి ప్రార్థింపదగున్                       

ప్రణవ స్వరూప పావన
గుణసాంద్ర సకల మునిగణ ఘోషిత చింతా
మణి, యగణిత సాధుసుజన
గణ వందిత, మా ప్రణతులు గైకౌను స్వామీ                

అమృతానంద ప్రదాతా
సమధిక భక్తజన హృదయ సంవాసీ, ఓ
విమలాత్మా విమలచరిత
సమస్త దురితాపతహార  సద్గురు సాయీ  
   
శ్రీ పాద వల్లభా,మా
పాపాలన్నియు హరించు బాబా సాయీ
ఓ పావన చరితా, మము
కాపాడగ కోరుకొందు కావుము సాయీ                         

కోరను కోరికలను, కడ
తేరని నాబాధల కథ  తెలియును నీకే
చీరను వేరొక దైవము
కారుణ్యము జూపి నన్ను కావుము సాయీ    

           
గడచిన దినముల నన్నియు
గడపితి నీ సేవ మరచి గరువము తోడన్
కడచితి తిమిరపు సంద్రము
విడువను నీ పాద సేవ వేళెంతైనన్  
                            
పిలిచిన పలికే దైవమ
కలలను సాకారపరచు కరుణామయుడా
కొలిచెద నీ పదయుగళము
తలపుల నిన్నే నిలుపుచు ధ్యానము వీడన్   

కలుగని   సిరులను కోరను
కలలవి నెరవేరకున్న క్రాగుచు నుండన్
కలిగిన కలుముల తృప్తిని
కలిగించిన సద్గురు, గుణ గానము చేతున్                               

అడుగక నెన్నడు అమ్మయు
కుడువగ బెట్టదు అదెంత కూరిమి యున్నన్
అడుగకనే వరమిచ్చెడి
కడుకరుణామయుడు సాయి కాచెడు జనులన్   
       
సాయిని  కొలిచెడి జనులకు
ఏ యాపద కలుగ బోదు యెన్నండైనన్
పాయక భక్తుల గాచెడి
సాయికి జేజేలు పలికి సాగిల బడుదున్                              

సద్భావన  మదినిండగ
సద్భాషణములనె వినుట  ఆపై నీపై
సద్భక్తి కలిగియుండుట
మద్భాగ్యము గానె తలతు మదిలో  సాయీ  ! 

              శుభం.
      





14, నవంబర్ 2011, సోమవారం

నన్నయనుండి...నానీ కవులదాకా..కవులకు కందాల వందనాలు



 తెనుగున భారత కావ్యము
మునుపెన్నడు లేని దారి పోవగ నైనన్
తనదగు శైలిని నన్నయ
మన భాగ్యము కలిసి రాగ మనకందించెన్                  

తిక్కన కవి యొక్కండే
చిక్కని మన తెలుగు భాష చేవను చూపెన్
తక్కిన కవులకు చిక్కని
అక్కజమగు నతని శైలి   అనితర సాధ్యం                 

తీరుగ నన్నయ పోలిక
భారతమందున అరణ్య పర్వపు శేషం
పూరించెను, ఘన కవితా
పారగుడెఱ్ఱన, ప్రబంధ పరమేశ్వరుడై          

ఇమ్ముగ  చక్కని తెలుగున
కమ్మని కన్నయ్య కథలు కమనీయంగా
ముమ్మరమగు భక్తి కలుగ
బమ్మెర పోతన్న చెప్పె   భాగవతంబున్             
   
చవులూరెడు చాటువులను
అవలీలగచెప్పెనతడు ఆశువుగానే
కవిసార్వభౌముడాతడు
శివభక్తి పరాయణుండు  శ్రీనాథుండే  
                                    
 జంకేమి లేక పలికెద
ఇంకేదియు సాటి రాని ఇంపగు కావ్యం
శృంగారపు రస శిఖరం
వెంకట కవి చేమకూర విజయ విలాసం                   

వేమాయను మకుటముతో
వేమన పద్యాల యాట వెలదులు అన్నీ
సామాన్యుల నాల్కలపై
వేమరు నర్తించు చుండు వేయేండ్లయినన్   
          
చిరుత ప్రాయపు పాపల
పరువము సడలిన ముదుసలి  బాపల తోడన్
పరిణయముల ఖండించిన
పరశువు గురజాడ యనుట పాడియు గాదే    

సరసుల మనసుల దోచియు
కరమగు ఖ్యాతిని బడసిన కన్యా శుల్కం
విరచించె మన మహాకవి
గురజాడను నే నుతింతు గురుభావముతో          

ఆది కవులందు తిక్కన
ఆ తదుపరి కవులయందు నా వేమనయున్
ఆధునికులలో గురజా
డే తగుదురు యుగ కవులను యెంపిక చేయన్      
   
తిరుపతి వేంకట కవులును
కురిపించిరి తెలుగువారి గుండెల నిండా
సరసపు కవితా  వర్షం
మురిపెము తో తడిసి వారు ముద్దై పోవన్          

ఒకశ్రీ నింకొక శ్రీయును
ఒకచో చేర్చుచును పల్కు డొమ్మిక తోడన్
సుకవీంద్రుండే కనపడు
నగణిత ఖ్యాతిని బడసిన యతడే శ్రీశ్రీ    
                   
కవి చూడా మణి ఆరుద్ర
కవితా సంద్రము తరచిన  కౌశలమెంతేన్
చవి చూడగ వలయును కద
కవులకు నది తప్పని సరి కార్యము కాగా                   

విధి వంచిత లై వందెడు
విధవల చీకటి బ్రతుకుల వెలుగులు నింపెన్
విధవా వివాహ శుభకా
ర్యధురీణుడు, కందుకూరి యనఘుడు కాడే                 

ముని మాణిక్యం చూపెను
మనమెరుగని మన కుటుంబ మాధుర్యమునే
తనివార చదివి మీరలు
కనుడా రచనల సొబగులు కాంతం కథలన్  
         
కొంచెపు బుధ్ధులు కొందరు
పంచముడని పరిహసింప పాటింపకనే
మంజుల కవితల మనకం
దించిన జాషువ మనకవి తిలకుడు కాడే   
                        
అమృతం కురిసిన రాతిరి
గమనించని జనము నిద్ర  క్రమ్మియు నుండన్
తమిగొనుచు సుధను త్రావిన
అమరుడు మనకవి తిలక్కు  నభినందింతున్                          
 
చిరు చిరు నానీలందున
గురుతర భావాల గూర్చి గొప్పగ చెప్పే
చిరు నానీ కవులతొ నే
కర నిష్పీడన మొనర్తు కంగ్రాట్సంటూ                                


                      ***

8, నవంబర్ 2011, మంగళవారం

నా చాటువులు...ఓ డజన్...







                                   

నవ్వే జీవన మంత్రము
నవ్వక యుండెడి బ్రతుకులు నవ్వుల పాలే
నవ్వొక చక్కని యోగము
నవ్వే పరమౌషధమ్ము నరులకు జూడన్   

 మగలను నమ్మరు  మగువలు
ముగురమ్మల తీరు చూడ ముచ్చట గొలుపున్
మగలను నమ్మకనేకద
తగిలేయున్నారు వారు తమతమ మగలన్  

మాచింగ్ చీరలు లంగాల్
మాచింగ్  జాకెట్లు బొట్లు  మాచింగ్  జోళ్లున్
మాచింగ్ నగలును  కుదిరెను
మాచింగ్ మగడే దొరకడు  మహిళా మణికిన్  

రాజును చూసిన కళ్ళకు
మోజెట్టుల కలుగునయ్య మొగుడిని చూడన్
రోజూ ఉండేవాడీ
వాజమ్మేయనుచు తలచి వగతురు జాణల్             
           
కాశికి పోయిన కూడా
చేసిన పాపాలు పోవు చిడుగంతైనా
కాసింతైనా పుణ్యము
చేసిన పాపాలు కడుగు జీవితమందున్    

పిడికెడు మెతుకులు పెట్టిన
విడువదు మన గడప కుక్క విశ్వాసంతో
కడుపార పెట్టి పెంచిన
కొడుకులె మనవారు కారు  గోవింద హరీ    

అడ్డాల నాటి బిడ్డలు
గడ్డం మీసాలు మొలిచి కండలు పెంచీ
ఎడ్డెం తెడ్డెం అంటూ
అడ్డం తిరిగితె మనగతి అయ్యో రామా  

కందకు లేదే దురదా
ఎందుకు మరి కత్తి పీట కెట్లా వచ్చెన్ ?
కొందరి నైజంబంతే
అందరితో తగవులాడు అవలక్షణమే !  

 నీరే దొరకదు గానీ
సారాయికి లోటులేదు  సర్వం సిధ్ధం
ఊరూరా వెలసిన ఆ
సారాయంగళ్ళ లోన  స్టాకులు ఫుల్లే 

దివిటీ పట్టుకు వెదికిన
అవినీతే లేనిచోటు అగుపడదయ్యో
చివరకు కాటికి పోవగ
శవదహనమునకును కూడ చాతురు చేతుల్   

పేకాట  ఆడువారికి
ఆకలి దప్పులును లేవు ఆటలొ మునుగన్
పేకాటలొ బంధుత్వము
లాకేత్వము దాకు కొమ్ము  లాభమె ధ్యేయం    
         
పగలే మద్యము గ్రోలుచు
తగరుల మాంసము భుజించి తనియక నాపై
మగువల పొందును గోరెడి
జగమెరిగిన బ్రాహ్మణునకు జందెంబేలా    

(  ఈ పద్యాలు నా కందాలు మకరందాలు  కవితాపుష్పకం లోనివి.  ఈ బ్లాగు ప్రారంభించిన కొత్తలో  అనుభవ రాహిత్యం చేత వాటిని సరిగా పెట్టక పోవడం  లింకులు ఇవ్వక పోవడంతో మిత్రులు వాటిని చూడ లేక పోయారని తెలిసింది. అందుకే వాటిని తొలగించి  మళ్లా కొద్ది కొద్దిగా పెట్టాలని సంకల్పించాను మరోసారి మరికొన్ని...సెలవు.)