30, నవంబర్ 2011, బుధవారం

సరదా..సరదాల కందాలొక రెండు పుంజీలు..


చిక్కని కాఫీ కప్పుతొ
ప్రక్కను చేరిన నిజసతి పాటల గంధిన్
అక్కున చేరిచి సొగసుగ
చెక్కిలి ముద్దాడ వలదె చెలిమి దలిర్పన్               
  
కందర్పుడేయు బాణము
సుందరి నీ వాలుచూపు సూటిగ నాటెన్
డెందము గాయంబాయెను
మందుగ అందీయరాదె  మధురాధరమే           

అందం నీకే సొంతం
సుందరి నీ సాటి దాన్ని  చూడగ లేదే
ఎందుకు ఈ బ్రతుకెందుకు
పొందక నీతోటి పొందు పూర్ణేందు ముఖీ            

పెళ్ళికి ముందరి  వలపులు
పెళ్ళైన పిదప కుదరవు పిసరంతైనా
పెళ్ళము తోడిది సరసము
కాళ్ళా వేళ్ళా పడుటయె కాముని కైనన్             

రాజీవాక్షులతోడను
రోజూ గొడవలు పడుచును రుక్కుట కంటెన్
రాజీ పడుచును మనమే
హాజీయనుచును గులాము లౌటయె మేలౌ       

సిరిమంతుని పెండ్లాడగ
తరుణులు పోటీ పడుదురు తమలో తామే
దొరకరు నిర్భాగ్యునకున్
పరిణయమాడగ పడతులు  పృధ్వీ స్థలిలో  
  
ఎంతయొ చదువులు చదివి మ
రెంతయొ నేర్చిన మగనికి ఏకాంతమునన్       
వింతగ మతి పోగొట్టగ
కాంతామణి చేయు బోధ కర్టెన్ లెక్చర్                 

తనసతి యుండగ వేరొక
వనితను తెచ్చిన యగునది భారము తలకున్
తనసతి గలిగియు శివుడా
మినుగంగను తేగనదియు  మెట్టెను తలపై    

ఇప్పటికింతే...సెలవు...                   

7 కామెంట్‌లు:

జ్యోతి చెప్పారు...

అద్భుతం.. చాలా బావున్నాయి మీ కందాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నిజమే కాఫీ కప్పుతో పక్కనే ఉన్నా , ఇలాంటి సరదా సరదా కందాలు అందరికీ మదిలో మెలగవు కదా ? చాలా అపురూపంగా అందంగా బాగున్నాయి. హేట్సాఫ్ !
నమస్కారములతో

www.apuroopam.blogspot.com చెప్పారు...

జ్యోతిగారి స్పందనకు నా కృతజ్ఞతలు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

జ్యోతిగారి స్పందనకు నా కృతజ్ఞతలు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

రాజేశ్వరిగారికి స్పందించినందుకు కృతజ్ఞతలు.
నా పద్యాలను చదివి ఆనందించి వారి ఆనందాన్ని వ్యక్త పరుస్తున్న రసజ్ఞులందరి కోసం---

విలువగు బహుమతులేవీ
కలిగించవుయాత్మతృప్తి కవులకు ఎపుడున్
తలలూచు రసికులున్నను
కలుగును సంతోషమెంతొ కవిగాని కిలన్

కొత్త పాళీ చెప్పారు...

భలే

పంతుల సీతాపతి రావు చెప్పారు...

కందం బాగా పట్టావ్!
అందంగా పదములన్ని అబ్బుర పరిచెన్!
బంధం తెంపగ వసెమా?
బందీల్ చేసేరు మనని బహు ముఖ ప్రజ్నన్!