23, డిసెంబర్ 2011, శుక్రవారం

చెయిజారిన మణిపూస...మళ్ళీ దొరికిన వైనం...


     

                    
చెయి జారడమేమిటి? మళ్లీ దొరకడమేమిటి?
నేను అరవయ్యో దశకంలో ఎమెస్కో వాళ్లు ప్రచురించిన పుస్తకాలు కొంటుండేవాడిని. వాళ్లు ఎన్నో  నవలలూ కథల పుస్తకాలే కాకుండా ప్రబంధాలని కూడా అందంగా తక్కువ ధరకే అందిస్తూ ఉండేవారు. అలాంటి ప్రచురణల మధ్య వారు 1974 ( 1964?) లో తాతాచార్లు కథలనే పుస్తకాన్ని కూడా ప్రచురించేరు. ఎంతో ఆసక్తితో కొని చదువుకుని దాచుకున్నా పుస్తకాన్ని భాషాభిమానిని కనుక. అయితే నాదగ్గరనుంచి చదవడానికి పుస్తకాలు తీసుకెళ్ళే మిత్రులెవరో దానిని పట్టుకు పోయేరు. తర్వాత సంగతి మామూలే. పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతః  మరి నాకది దొరక లేదు.
చిన్న ప్పటినుంచి నా నోట దాని గురించిన కబుర్లు విన్న మా అమ్మాయి  నిన్న పుస్తక ప్రదర్శనలో దొరికిందంటూ ఆ పుస్తకాన్ని కొని తెచ్చి యిచ్చింది. నా ఆనందానికి మేర లేదు. మరి చూడలేమనుకున్న చిన్నప్పటి బాల్య  మిత్రుణ్ణి కలుసుకున్నట్లు  పొంగి పోయేను.

ఎవరీ తాతాచార్లు? ఏమా కథ?
ఈ తాతాచార్లనే పెద్ద మనిషి ,( నిజంగా పెద్దమనిషే- ఈయన గురించి బ్రౌన్ దొరగారు- He was a tall stout man about 50 years of age, a humorist thoroughly versed in sanscrit learning, very learned and eloquent, most modest and humble; He died in my employ అంటారు.) తెలుగు భాషకు మహోపకారం చేసిన సర్.సి.పి,బ్రౌన్ వద్ద ఉద్యోగి గా ఉండే వాడు. యోగ్యుడూ సరసుడూ ఐన ఈయన సంభాషణల్లో సమయోచితమైన చిత్ర విచిత్ర కథలు చెబుతూ వచ్చేవాడట. అలాంటి వాటిల్లో కొన్నిటిని బ్రౌన్ దొరగారు సేకరించి సంకలనంగా 1855 లో మొదటి సారి ముద్రింపించేరు. దరిమిలా 1916 లో వావిళ్ళ శాస్త్రుల వారు గురజాడ అప్పారావుగారి పరిష్కరణతో అచ్చువేయింపించారట. ఇవన్నీ నేను పుట్టక పూర్వం జరిగిన సంగతులు.
అయితే 1974 లో ( 1974లో అని ఇప్పటి ప్రచురణ కర్తలు అంటున్నారు కానీ నా జ్ఞాపకం 1964 అనే)  బంగోరె (అవును. కన్యాశుల్కం మొదటి కూర్పుని వెలుగులోకి తెచ్చి అలక్ నందా నదిలో అకాల మృత్యువు పాలైన ఆ బంగోరే నే) తన ముందు మాటతో వ్యాఖ్యలతో  ఎమెస్కో ద్వారా వెలువరించారు. ఇదిగో ఈ విలువైన పుస్తకాన్నే నేను పోగొట్టుకున్నదీ ,మళ్లా నాకు దొరికినదిన్నీ.
ఇంతకీ ఏమిటయ్యా ఈ పుస్తకం గొప్పతనంఎందుకు చదవాలది?
సుమారు నూట యాభై ఏళ్ల క్రితం సామాన్యజనం  మాట్లాడుకునే వాడుక భాషలో వ్రాయబడ్డదీ గ్రంథం. ఇవి తాతాచారిగారు కూర్చుని వ్రాసిన కథలు కావు. తాను విని లేక చూసిన విషయాల్నే ఆసక్తిదాయకంగా ఆయన బ్రౌన్ దొరగారికి చెప్పినట్టు కనబడుతుంది. అందుచేత ఆనాటి జన జీవన సరళి గురించి మనకు కొంత తెలుస్తుంది. ముఖ్యంగా మనని ఆకట్టుకునేది. ఆనాటి జీవద్భాష. అది మనకు మెకంజీ కైఫీయతుల ద్వారా తెలిసినట్లుగానే ఈ కథల వల్ల కూడా తెలుస్తుంది.అప్పుడు వాడుక లో ఉండి ఇప్పుడు లేకుండా పోయిన లేక రూపు మార్చుకున్న ఎన్నో పదాలు మనకి కనిపిస్తాయి. ఆనాటికే మన భాషలో వచ్చిచేరి సామాన్యులు సైతం వాడుతున్న అనేక ఉర్దూ, పార్శీ పదాలు మనకు దర్శనమిస్తాయి. అందుకే భాషాభి మానులందరూ కొని చదివి దాచుకో వలసిన పుస్తకమిది.
 పుస్తకం మీరే కొనుక్కుని చదువుకోండి. చిన్న ఝలక్ లాగా దీని లోని ఒక చిన్ని వృత్తాంతాన్ని మాత్రం నా మాటల్లో మీకు ఇక్కడ పరిచయం చేస్తాను. అదేమిటంటే
ఒక వూళ్లో ఒక బోగము దానింట్లో ఒక పండితుడు ఉంటూ ఉండగా ఆ వీధి లో ఒక పీనుగని తీసుకెళ్తుంటారు. ఆ బోగముది తన బోనకత్తె (భోజనం వండి పెట్టే దాసి) ని పిలిచి ఆ పీనుగ స్వర్గానికి పొయ్యేదా నరకానికి పొయ్యేదా తెలుసుకుని రమ్మంటుంది. ఆమె వీధిలోనికి పోయి వచ్చి ఆ పీనుగ స్వర్గానికి పోయేదే అని చెబుతుంది. మహా పండితుడైన తనకే ఆ పీనుగ గతి యేమిటో తెలియదే? ఈ దాసి వీధి లోకి పోయి వచ్చినంత మాత్రాన ఆ విషయం ఎలా కనుక్కుందో నని మధన పడి, తెలియజాలక, ఉండబట్టలేక ఆ బోగము దానినే ఆవిషయం అడుగుతాడు. దానికామె, అయ్యో ఇదేమంత పెద్ద విషయం-ఏ పీనుగని చూచి నలుగురూ అయ్యో పుణ్యాత్ముడు పోయేడే అంటారో ఆ పీనుగు నిశ్చయముగ స్వర్గానికే పోతుంది. యే పీనుగును చూచి నలుగురూ పాపిష్టి ముండా కొడుకు పోయేడని అంటారో అతడు తప్పకుండా నరకానికే పోతాడు అన్నదట.
దీని కిందనే    In a jest Book అని చెప్పి ఈ కింది English  పంక్తిని ఉదహరించారు.
 When death puts out our flame, the snuff will tell if we were wax or tallow by the smell !!!

ఈ వృత్తాంతం బాగుంది కదా?
దీన్ని ఇప్పుడు అందంగా ముద్రించడమే కాకుండా మనకు తెలియని పదాలకు అర్థాలు ఇవ్వడం, C.P.Brown Academy వారు చేసిన మంచి పని. బోనస్ గా 1855 లొ ప్రచురించబడిన  తాతాచారి కథలు తొలి పేజీ నకలునీ, తొలి వ్రాత ప్రతిలోని ఒక పేజీ నకలునీ కూడాఅందిచేరు.ఇంతా చేస్తే ఈ పుస్తకం వెల కేవలం 30 రూపాయలు మాత్రమే.  US లో దీని ధర రెండు డాలర్లు.   C.P.Brown Academy, 53 nagarjuna hills, Panajagutta, Hyderabad.500082, India   Phone number 040-23430448, E.Mail-www.cpbrownacademy.org వారు ప్రచురించేరు. ఈమంచిపనికి వారికి అభినందనలు.

సెలవు.
10 వ్యాఖ్యలు:

Sanghamithra చెప్పారు...

బాగుందండీ ఈ తాతాచారి ఉదంతం. తాతాచారి అంటే రాయల కొలువులో రామలింగ కవిని ఆటన్కపరిచిన మత గురువు గుర్తొస్తారు నా లాంటి పామరులకు. మరచిపోయిన జాతి రత్నాలను ఇలా జ్ఞాపకం చేసినందుకు ధన్యవాదాలు.

పంతుల జోగారావు చెప్పారు...

అపురూపమైన ఇలాంటి పుస్తకాల గురించి పున: పరిచయం మీ అపురూపంలో చెయ్యడం ఎంతో అపురూపమైన విషయం. కొనసాగించండి.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

ఇది కేవలం భాషాభిమానులకోసం. తాతాచార్ల కథలంటే ఏవో కథలని భ్రమసి కొనుక్కోవద్దు. సంఘమిత్ర పంజోగార్ల స్పందనలకు కృతజ్ఞతలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
తాతాచారి గారిని గురించి చక్కగా వివరించారు. ఇలాంటి ఆణి ముత్యాలను అందించే మీ బ్లాగు నిజంగా అపురూపం.

విరిసిన అరవిందం చెప్పారు...

చాల
బావుంది నిజం గ ఇది మణిపూస, తెనాలి
రామకృష్ణ సినిమాలో చూసాము

అంతకంటే
మరి తెలియదు వీరి గురుంచి

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

virisina aravindam gaariki kruthagnathalu. kaani meeru cenema lo choosina thatha charylu veeru kaadu.

buddha murali చెప్పారు...

manchi pusthakanni parichayam chesharu

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

మురళి గారికీ, రాజేశ్వరి గారికీకృతజ్ఞతలు.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

అరవయ్యో దశకం=ఆరు పదులు అరవై
అరవై పదులు ఆరువందలు
పత్రికల్లో వచ్చే దరిద్రగొట్టు పదం ఇది.ఎవరు మొదలుపెట్టేరో తెలీదు కానీ,మీలాంటి పెద్దలు కూడా వాడటం విడ్డూరం.
బోగము దానింట్లో
బోగముది
బోగము దానినే---ప్చ్

Pantula gopala krishna rao చెప్పారు...

రాజేంద్ర కుమార్ గారికి నా పోస్టులు చదివి స్పందిస్తున్నందుకు కృతజ్ఞతలు.అరవయ్యో దశకం అన్న మాట అందరూ వాడుతున్న అర్థంలో నేను వాడిఉండకూడదని మీరనుకుంటే, దాన్ని నా జారుపాటుగానే గ్రహించమని కోర్తాను.ఇక బోగముది అన్నమాట ఆ కథ చెప్పిన తాతాచార్లు వాడినదే.దానిని నేను మార్చకూడదు కదా?అయినా నేను ఆ కథల్ని చదవమని చెబుతున్నది అప్పటి భాష తెలుసుకోవడానికే కదా?