కవిగారూ..ఆటవెలదులూ...
ఓ కవిగారికి ఆటవెలదులన్నా తేటగీతములన్నా చాలా ఇష్టమట. ఆయితే ఆటా..పాటా లేకపోయినా మిగిలినవి ఉంటే సర్దుకు పోతాను ఫర్వాలేదు అన్నాడిలా:
ఆట లేక తేట పాటయులేకున్న
వెలదులున్నచాలు వేవరాలు....
అదీ కవిగారి రసికత.. ఆయన పేరు సరిగా గుర్తులేదు కాని వావిలాల వాసుదేవ శాస్త్రి అనుకుంటాను. ఆయన పేరు కూడా తమాషాగా ఆటవెలది ఆఖరి పాదమై కూర్చుంది చూసేరా? (ఈయన గురించి శ్రీ ఆరుద్ర గారి సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో సుబాకవుల విభాగంలో చదువుకొన వచ్చు)
నాకైతే కంద పద్యాలే ఇష్టం కానీ సరదాకి కొన్ని ఆటవెలదులూ రాసేను. చిత్తగించండి:
తాను తినక సొమ్ము తనవారికీకుండ
దానమీయకుండ దాచువాడు
గడ్డి వాము చెంత కాపుండు శునకము
నిజమె పలుకు చుంటి నీరజాక్ష
కూటగురుని చేరి కొలువెంత చేసిన
కలుగబోదు ఎపుడు జ్ఞానసిధ్ధి
కుక్క తోక బట్టి గోదావరీదగా
జాలడెవడు వాని జన్మలోన
కుక్కతోక జూడ కుటిలమై యుండును
దాని శీలమదియు దాచలేదు
తోలలేదు ఎపుడు దోమ ఈగలనైన
వ్యర్ధుడైన వాని వైనమింతె *
మనము నిద్రపోవ మనతోనె నిద్రించు
మనము నడచుచుండ వెనుకె వచ్చు
పూర్వ జన్మ కర్మ పోదు ఫలమునీక
నిజమె పలుకుచుంటి నీరజాక్ష *
తరుణులందరెపుడు తలను దాల్తురుగదా
విరుల సరుల లోని దారమైన
మంచివారి పొందు మాన్యత చేకూర్చు
నిజమె పలుకు చుంటి నీరజాక్ష *
మనసులోనిమాట మర్మమేలేకుండ
పలుక వలయునెపుడు, పలుకెగాదు
చేసిచూపవలయు చేతలందునుగూడ
నీతిమార్గ మిదియె నీరజాక్ష
మట్టిలోన పుట్టి మట్టిలో కలిసేటి
మనుజులందరొకటె మాన్యులార
మతములందు లేదు భేద భావమెపుడు
మానవతనెచాటు మతములన్ని
ప్రేమ ప్రేమ యనుచు ప్రేమిస్తి ననుచును
అందమొకటె జూచి ఆశ పడుచు
పిల్లదాని మనసు పిసరంత తెలియక
వెంటబడెడివాడు వెఱ్ఱి వాడు
ఆలు మగల మధ్య అనురాగముండియు
ఒకరినొకరు యెపుడు గౌరవింప
కాపురములు సాగు కలతలు లేకుండ
నీతి వాక్య మిదియె నీరజాక్ష
కష్టసుఖములవియు కలిసె వచ్చు
పగలు రాత్రి గడువ పగలు రాకుండునా
నిత్య సత్య మిదియె నీరజాక్ష
ఏమిలేని నాడు ఎంగిలికాశించు
కుడువ కూడులేక కుములుచుండు
అన్ని యున్ననాడు అన్నమే తినలేడు
నిత్య సత్య మిదియె నీరజాక్ష
ఏరినైన నీవు గౌరవింపదలప
మంచిగుణము, విద్యలెంచవలయు
కలిమి కులములెపుడు కారాదు కొలబద్ద
నీతి వాక్యమిదియె నీరజాక్ష
నమ్మడెవరిమాట నమ్మబోడుసతిని
నమ్మడెపుడు వాని అమ్మనైన
బెమ్మ ఎదుట నిలిచి నమ్మబల్కిన గూడ
సణుగుచుండు నిత్య శంకితుండు
చుట్టరికముతోడ చూడనింటికి బోవ
ధనము నడుగ వచ్చిరనుచు తలచి
ఇంటనున్న లోభి లేడని చెప్పించు
నిజమె పలుకుచుంటి నీరజాక్ష
ఎవరిసొమ్ము వారికిచ్చుటేమి ఘనము
నిలువుదోపిడిచ్చి నీల్గుచుంద్రు
సకల సంపదలును శర్వునివేకావ
నిజము పలుకుచుంటి నీరజాక్ష
జాతకములు వ్రాసి చక్రాలు సరిజూసి
మంచిమూర్త మొకటి యుంచుగాని
పిల్ల లేచి పోయి పెండ్లి రద్దయి పోవ
పంతులేమి జేయు పద్మనాభ
ఆశ పెరుగుచుండు ఆస్తులతో పాటు
ఆశకంతులేదు అవనియందు
ఆశలేని వాడు అదృష్టవంతుడు
నీతి వాక్య మిదియె నీరజాక్ష
ఫిల్ల కనుటయొకటి పెండ్లి చేయుటొకటి
ఆడపిల్ల తల్లి తండ్రులకును
కష్ట సాధ్యమైన కార్యమే యెపుడైన
నిజమె పలుకుచుంటి నీరజాక్ష
పాల సంద్రమందు పవ్వళించెడువేళ
పాదసేవ చేసెనాది లక్ష్మి
ద్వాపరమున నీకు దారయై అలుకతో
సత్యభామ కాలు సాచి తన్నె
కవియెకాని వాడు కావ్యమ్ము వ్రాయంగ
చదువె రాని వాడు చదువుచుండ
చెవిటివాడొకడు చెవియొగ్గి వినుచుండ
కాశి పారిపోయె కావ్య రసము
( * ఈగుర్తు గల పద్యాలకు సంస్కృత మూలాలున్నాయి)
ఇప్పటికి సెలవు...
పెండ్లి వారి యింట పేకాట లేకుండ
పెండ్లి యెట్లు జరుగు పెద్ద లార
పెండ్లి వారి కిపుడు పేకల కొని దెచ్చి
పెండ్లి జరుపు కొనుము పెండ్లి పెద్ద
5 కామెంట్లు:
భలే బాగున్నాయి.
మరి కంద పద్యాలు కూడా వినిపించండి.
కొత్తపాళీ గారికి కృతజ్ఞతలు.నా యీ బ్లాగులోనే కందాలూ మకరందాలూ పేరుతో 108 కంద పద్యాలున్నాయి. చూసేరా? చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.నేను కవిని కాను.ఏదో ఉబుసుపోకకి రాసుకున్న పద్యాలు.నలుగురూ ఇష్టపడితే మరికొన్ని రాయగలనేమో
చూళ్ళేదండి, చూస్తాను.
మీ ఆటవెలదులు ధారాశుద్ధితో కడు రమ్యంగా ఉన్నాయి. కందం నడక పట్టుపడితే దానంతటి సులభమైన పద్యం మరొకటి లేదని నా నమ్మకం. నాకూ కందమే చాలా ఇష్టమైనది.
కంది శంకరయ్యగారూ, ధన్యవాదాలండీ
కామెంట్‌ను పోస్ట్ చేయండి