8, జనవరి 2012, ఆదివారం

నీతి కందాలు... ముచ్చటగా... మూడు పుంజీలు

మంచి పనులు తల పెడుతూ
పంచాంగం చూడకండిపనులను ఆరం
భించుడు, వెంటనె, ఏకీ
డెంచక, మంచిదిశుభదిన మేదినమైనా   

జాతక ఫలముల నమ్ముచు
చేతల నుడిగియు మసలెడి చెనటుల దెంతేన్
ధాత్రిని పుట్టుక దండుగ
ధాతయు వారిని క్షమింప దలపడు యెపుడున్           
              
అరకొర యత్నము చేయుచు
దొరకదు ఫలితమ్మటంచు  దురపిల్లకనే
తిరిగి ప్రయత్నము చేసిన
సరగుననే కార్య సిధ్ధి జరుగును సుమ్మీ                   

తలచిన పని నెరవేరగ
వలయును కాస్తంత శ్రధ్ధ పనిలో ఎపుడున్
సులభమ్మిదియని తలచుచు
అలసత్వము పనికిరాదు ఆవంతైనా

ఆలస్యమమృతము  విషం
పాలైనా నిలువజేయ పాడైపోవున్
మేలే ఒనగూరు నెపుడు
కాలం వృధ చేయకున్న కార్యములందున్  
           
నేల విడిచి సాము వలదు
నేలను  కాళ్ళూని యున్న  నిలకడ కలుగున్
గాలిలొ మేడలు కట్టకు
మూలాలను మరచి పోవ ముప్పే కలుగున్      

      
కోరికలే గుర్రాలై
స్వారీ చేస్తేను మీకు శాంతియె శూన్యం
కోరికలు త్రుంచ గలిగెడు
వారికె సుఖశాంతులుండు  వసుధలొ యెపుడున్ 

పరిహాసము కొరకైనను
పరులను బాధించు మాట పలుకక యెపుడున్
ఒరులకు మేలొనగూర్చెడి
నరుడిల నారాయణుండె నమ్ముడు మీరల్             

మరచియు నిన్నటి వెతలను
అరుదెంచని రేపటి భయమది తలపకనే
నరుడుండదగును, వానికె
దొరకును శాంతియు  సుఖములు తోడై రాగన్  
      
నరకము నాకము లనుచును
పరలోకము లేమి లేవు  పరికింపంగా
దొరకును తమ కర్మ ఫలము
నరులకు  ఈ లోక మందె  నమ్ముడు మీరల్ 
      
మంచిగ బ్రతకాలంటే
పెంచుకు తీరాలి మనము ప్రేమలతల్నే
ఇంచుక స్వార్థాన్ని వదలి
పంచుకు తాగాలి మనము  పాలో నీళ్ళో
    
కులమత భేదాలు మరచి
కలిసే ఉండాలి జనము  కష్ట సుఖాల్లో
కలిసుంటే కలదు సుఖం
విలసిల్లును శాంతి అపుడు విశ్వం నిండా                  

(ఈ క్రొత్త సంవత్సరంలో ఇది మొదటి టపా.
బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతోసెలవు.)

5 వ్యాఖ్యలు:

Sudha చెప్పారు...

మూలాలను మరిచిపోవ ముప్పేకలుగున్;
మరచియు నిన్నటి వెతలను;
అరుదెంచని రేపటి భయమది తలపకనే నరుడుండదగును;
మంచిగ బ్రతకాలంటేపెంచుకు తీరాలి మనము ప్రేమలతల్నే-
చాలా మంచి వాక్యాలు. ఒక్కో వాక్యం ఒక్కో ఆణిముత్యం.
కొత్తసంవత్సరానికి మీరందించిన నీతి వాక్యాలకి
నమోవాక్కాలు.

పంతుల జోగారావు చెప్పారు...

మీరందించిన ముచ్చటయిన మూడు పుంజీల కందాలను అందు కున్నామండీ.

మీరొక నీతి శతకం రాయడానికి తలపెట్ట కూడదూ ?

పద్య రచనలో, ముఖ్యం, కంద పద్య రచనలో మీ ఈజ్ ముచ్చట కలిగిస్తోంది. ఆ ఈజ్ వల్లనే అన్నీ పాత నీతులే అయినా, ఆ శాశ్వత , సార్వ జనీన మయిన నీతులు భలే చదివించాయి.

కందాలతో ఏవేనా ఖండికలు రాయండి. చదువుతాం.
అభినందనలు.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

సుధగారికీ, పంజోగారికీ కృతజ్ఞతలు.అన్ని నీతులూ ఎందరో ఎన్ని సార్లో చెప్పినవే. కొత్తనీతులు ఎక్కడనుంచి వస్తాయి.వాటిని మనదైన శైలిలో చెప్పడం తప్ప.హృద్యంగా చెప్పగలిగామా లేదా అన్నదే ముఖ్యం. మరికొన్ని కందాలతో మళ్ళీ కలుస్తాను.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
చక్కనికందాలను ముచ్చటగా అందించారు. మంచి సందేశాత్మ కంగా ,నీతి దాయకంగా
ఉన్నాయి. పరి హాసంగా నైనా పరుల బాదించకు అన్నారు. నిజమే ." పరుషోక్తి భాష చూడకు , మందు చేదు చూడకు , పెరిగిన వ్యాధిని అణచేలా చూడు ' అన్నారు వెనకటి కొ కవి ,అందు చేత మనం చెప్ప గలిగినవి మంచి భాషలో చెప్పడమే మనం చేయ గలిగిన పని అవునూ ! అసలు మీ కందాలన్నీ శత కాలుగా ప్రింటు చేయించు కోవచ్చును కదా ?
అలా చేసి ఉంటే మాకు పంప గలరు. మీకు మీ కుటుంబ సభ్యు లందరికీ
సంక్రాంతి శుభా కాంక్షలు. సెలవు

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

రాజేశ్వరిగారికి,కృతజ్ఞతలు.శతకనియమంతో వ్రాయక పోయినా నా కందాలు శతకానికి మించే ఉన్నాయి.అయితే పద్యాలెవరు చదువుతారన్న మీమాంసతో వాటిని అచ్చు వేయించ లేదు. వీలుచూసుకుని చక్కగా ముద్రింపిస్తాను.మీకు తప్పక పంపిస్తాను.నేను ఒక పాతిక ఆటవెలదులూ వ్రాసేను. కవిగారూ ఆటవెలదులూ.. అన్న శీర్షికతో అవి ఈ బ్లాగులో సెప్టెంబరు మాసంలో ఉన్నాయి.వాటిని మీరు చూసి ఉండక పోవచ్చును.ఆసక్తి ఉంటే చూడండి.