26, ఫిబ్రవరి 2012, ఆదివారం

మరో మంచి కథ.. ఆత్మీయబంధం కథ....


                                          బంధుత్వాలనేవి మన ప్రమేయం లేకుండానే మన పుట్టుకతోనే ఏర్పడుతాయి. మరికొన్ని మన జీవిత సహచరి లేక సహచరుని ద్వారా ఏర్పడుతాయి. అందువలన ఈ బంధువులనెవ్వరినీ ఆత్మీయ బంధువులని అనలేం. వీరిలో కొంతమందితో మనకి స్నేహబంధం కూడా ఏర్పడి వారు కూడా మనకు ఆత్మీయులౌతారు కాని మిగిలిన వారి విషయంలో ఆత్మీయత ఏర్పడదు. మనతో చదువుకున్నవారిలో, మనతో ఉద్యోగం చేసిన వారిలో కొద్దిమందితో ఆత్మీయత ఏర్పడినా మిగిలిన వారు సహాధ్యాయులుగానూ సహోద్యోగులుగానే మిగిలి పోతారు. అంతే. ఆత్మీయతా బంధం ఏర్పడడానికి కారణం ఏమిటో తెలీదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కలుసుకున్నవారిలో ఆత్మీయ బంధం కలిగిందంటే దానికి మూలాలు ఏ పూర్వ జన్మలో ఉండి ఉంటాయో? మన ఆదివాసీల ఆత్మబంధువు కథవింటే నాకిలాంటి ఆనుమానమే కలిగింది. ఆకథ చెబుతాను వినండి:
                                                                       ***
మనకి సుదూర ప్రాంతమైన ఆస్ట్రియా దేశంలో రాచరిక వంశంలో 1909 లో పుట్టిన హేమండార్ఫ్ రబీంద్రనాథ్ టాగోర్ రచనలు చదివి మనదేశంపై మక్కువ పెంచుకుని  మానవ పరిణామ శాస్త్ర అథ్యయనానికి మన దేశానికి వచ్చి ఈశాన్య భారతంలోని నాగాలనుగురించి పరిశోధనలను జరిపాడు.అలా మన దేశపు ఆదివాసీలతో మొదలైన బంధం ఆయనను నిజాం కాలంలో గిరిజనుల సంక్షేమానికి గాను ఏర్పరచిన ప్రభుత్వ కార్యనిర్వాహకవర్గం సభ్యునిగా చేసింది. ఈ విధంగా ఆదిలాబాదు ప్రాంతానికి వచ్చిన ఆయన వారితోనే కలిసి జీవిస్తూ వారిజీవన విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. ఈ పనిలో ఆయన జీవన సహచరి బెట్టీకూడా ఆయనతోనే పనిచేస్తూ గిరిజనులకి ఎంతో ప్రీతిపాత్రురాలయ్యింది. చెంచులు,గోండులు, కోయలు,కొండరెడ్ల గురించి విస్తృత పరిశోధన చేసి వారి జీవన విధానం,వివాహ పధ్ధతులు, న్యాయపధ్ధతులు,ఆచార వ్యవహారాలగురించి సాధికారకమైన గ్రంధాల్ని వ్రాసేడు. ఈ విధంగా గ్రంధాల్ని వ్రాయడమే కాకుండా వారి అభ్యున్నతికి కావలసిన కార్యాచరణ ప్రణాళికల్ని రచించి వారి న్యాయమైన పోరాటాలకి సహాయాన్నందిచాడు.
మరో ముఖ్యమై విషయం ఏమిటంటే అనునిత్యం తన అనుభవాలను డైరీలో వ్రాసుకుంటూ వారితో ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపుతూ, ఆయా గిరిజన భాషల ప్రత్యేక పదాలను అత్యంత శ్రధ్ధతో నేర్చుకుని ప్రయోగిస్తూ ఉండేవాడు. 1951లోనే లండన్ వెళ్లి పోయినా తరచూ అదిలాబాద్ వచ్చిపోతుండేవాడు. అలా ఆయన అనుబంధం ఆయన జీవితాంతం కొనసాగింది. ఆయనకి ఇక్కడి గిరిజనులతో ఆత్మీయబంధం ఎంతటిదంటే తన కుమారుడు నికొలస్ కు లచ్చూ పటేల్ అని పేరు పెట్టుకున్నాడట. భార్య బెట్టీ ఇక్కడే మరణిస్తే ఆమె కోరికమేరకు అదిలా బాద్ జిల్లా మార్లవాయిగ్రామంలో ఖననం చేసి సమాధి కట్టేరు. హైమండార్ఫ్ కూడా తన  జీవిత కాలంలోనే ఆమె సమాధి ప్రక్కనే తన సమాధి కూడా నిర్మించుకున్నాడు. 1995 లో హైమండార్ఫ్ లండన్ లోమరణిస్తే 17 సంవత్సరాల తర్వాత ఈ రోజు  మార్లవాయిలో ఆదంపతుల సమాధుల వద్ద గిరిజన సంప్రదాయాలతో కర్మకాండ నిర్వహిస్తున్నారట. ఎక్కడి ఆస్ట్రియా? ఎక్కడి అదిలాబాదు? అర్థ శతాబ్ది క్రిందట లండన్ వెళ్లిపోయి 17 సంవత్సరాల క్రిందట చనిపోయిన విదేశీయునికి ఇప్పుడు సంప్రదాయబధ్ధంగా గిరిజనులు కర్మకాండ నిర్వహించడమేమిటి? ఈ ఆత్మీయతా బంధం ఎలా కలిగి కొనసాగింది? నాకైతే చిత్రంగానే తోస్తుంది.
 హైమండార్ఫ్ గురించి నేటి (26.3.2012) సాక్షి దిన పత్రికలో శ్రీ గుమ్మడి లక్ష్మీనారాయణ గారి వ్యాసం, చాలా కాలం క్రిందటి శ్రీమతి  వకుళాభరణం లలిత గారి గిరిజన విజ్ఞాన సర్వస్వంహైమండార్ఫ్అనే వ్యాసం నాకు పై విషయాలను తెలియజేసాయి. అయితే హైమండార్ఫ్ గిరిజనుల్ని ఎంతగా ప్రేమించాడో వారినెంతగా గౌరవించాడో తెలియజేసే ఒక అపురూపమైన ముచ్చట ఒక్కటి చెప్పి ఈ  వ్యాసం ముగిస్తాను.
                                                                         ****
మన రాష్ట్రంలోని సీనియర్ I.A.S.అధికారి శ్రీ ఫణికుమార్ చాలాకాలం క్రితం అదిలాబాదు జిల్లాలో గిరిజన సంక్షేమ సంస్థ అధికారిగా ఉండేవారు. ఆరోజుల్లో వారు పని చేసే  ఊళ్లో ఒకరోజు సాయంత్రం షికారుగా వెళ్తుంటే ఏకాగ్రతతో వడ్రంగి పని చేసుకుంటున్న ఒక గిరిజన వృధ్దుడు కనిపించాడట. ఆయన పనితనానికి ముగ్ధుడైన ఫణికుమార్ గారు ఆయనను తమ కోసం ఒక అందమైన మేజా బల్ల చేయమని అడిగితే అతడు మౌనంగానే తలూపాడట. తర్వాతెప్పుడో ఆ మేజాబల్ల వారి ఆఫీసుకు చేరింది. తర్వాత కొంత కాలానికి హైమండార్ఫ్ గారు ఆ ప్రాంతానికి వస్తున్నట్లు అధికారిక వర్తమానం అందింది. వారి గొప్పతనాన్ని తెలిసి ఉన్న ఫణికుమార్ గారు వారిని సాదర గౌరవాలతో ఆహ్వానించి మర్యాదలు చేసారట. అప్పుడు హైమండార్ఫ్ గారు తాను అక్కడ కలుసుకోవాలనుకుంటున్న వ్యక్తుల పేర్లలో ఈ వడ్రంగి పని చేసే ఆసామీ పేరు ఉండడం చూసి ఫణి కుమార్ గారు అతడిని పిలిపిస్తానని చెప్పారట. దానికి హైమండార్ఫ్ వెంటనే అది చాలా తప్పనీ  అతడు ఆ గిరిజనులకు రాజనీ తామే వెళ్లి అతడిని చూడాలనీ అన్నాడట. అది విన్న ఫణి కుమార్ గారు అవాక్కైపోయారట. కాలం కలిసిరాక  స్వతంత్ర భారతావనిలో ఆ రాజా సాబ్ వడ్రంగి పని చేసుకోవడం, ఆయనను మేజా బల్ల చేసివ్వమని తను అడిగితే మౌనంగానే ఆయన చేసి ఇవ్వడం, ప్రభుత్వ గౌరవాల్ని అందుకునే హైమండార్ఫ్ గారు ఒక గిరిజనునికి అర్హమైన మర్యాదని పాటించడం చూసి ఫణికుమార్ చాలా సిగ్గు పడ్డారట.( ఈ విషయం స్వతహాగా రచయిత అయిన ఫణి కుమార్ గారు తమ గోదావరి కథల్లో ఒక కథగా మలిచి వ్రాసేరు.)
                                                                      ****
ఈ కథ చదివి మనుషులను వారి వేషాడంబరాలను కాకుండా వారి వారి వ్యక్తిత్వాలను గుర్తించి గౌరవించడమనే సంస్కారం మనలో పెంచుకుంటే మనమూ ధన్యులమే కదా?  సెలవు.
                                                                      ****























                            

21, ఫిబ్రవరి 2012, మంగళవారం

మడిబట్టకట్టి తెలుగును కాపాడుకోగలమా?


                                       
నా చిన్నతనంలో నేనో కథవిన్నాను. ఓ అమాయిక ఛాందస బ్రాహ్మణ వితంతువు తన పెరట్లోని కొబ్బరి చెట్ల కాయలు దొంగలు కోసుకు పోతుండడాన్ని ఆపడానికి, తన పంచ తడిపి మడిగా కొబ్బరి చెట్ల చుట్టూ కట్టిందట. మడి బట్టనెవ్వరూ ముట్టుకోరని ఆవిధంగా కాయలు దక్కుతాయని ఆశ పడ్డది. కానీ మర్నాడు చూస్తే కొబ్బరికాయలూ లేవు. మడిబట్టా లేదట. దొంగలు కొబ్బరి కాయల్ని మడిబట్టలోమూట కట్టుకుని చక్కా పోయారట. ఏ విషయంలోనూ ఛాందసత్వం సమస్యలకి పరిష్కారం కాదని తెలిపే కథ ఇది.
                                                       ***
 నేడు మాతృభాషా దినోత్సవం. మన తెలుగు వారందరం తెలుగుని పరిరక్షించుకోవడానికి కావలసిన ప్రయత్నాలు చేద్దాం.తెలుగు వచ్చిన వారందరం తెలుగు లోనే మాట్లాడడానికీ వ్రాయడానికీ ప్రయత్నిద్దాం.మన పిల్లలందరికీ విధిగా తెలుగు చదవడం వ్రాయడం నేర్పిద్దాం.వీలయితే తెలుగు సామెతల్ని తెలుసుకుని విరివిగా వాడడానికి ప్రయత్నిద్దాం.ఎందుకంటే ఏ భాషకైనా సామెతలే అందాన్ని చేకూరుస్తాయి. పిల్లలకి సామెతల్ని చెప్పి వాటి అర్థాల్ని వివరించి ఏ సందర్భంలోఎలా వాడాలో తెలియజేయండి. కనీసం మనమైనా వాటిని తరచూ వాడుతుంటే కుతూహలంతో వారే అర్థం తెలుసుకుని వాడుతారు. తెలుగు ఉద్గ్రంధాలుకాదు కానీ తెలుగు కథలైనా వారిచేత చదివింపజేయండి. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగార్ల తెలుగువచనం చదివితే తెలుగు తీయందనం తెలుసుకుంటారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విషయంలో ఛాందసత్వం పనికి రాదు.ఎక్కడా ఇంగ్లీషు పదం దొర్లకూడదనే నియమం పెట్టుకోవద్దు. అది జరగని పని. అందరికీ అర్థమై ఇప్పటికే జనబాహుళ్యంలో వాడుకలో ఉన్న ఆంగ్ల పదాలను పరిహరించి తెలుగు పదాలను సృష్టించి వాడుకలోకి తేవాలనే వృధా ప్రయాస మానుకోవాలి. ఏదేశంలోనూ ఏ కాలం లోనూ ఈ పరిశుధ్ధతా వాదం అసాధ్యంగానే మిగిలింది. నేడు ప్రపంచ భాషగా వెలుగొందుతున్న ఆంగ్ల భాష అనేకమైన లాటిన్, గ్రీక్,ఫ్రెంచి పదాలను తనలో చేర్చుకోవడం వల్లనే సుసంపన్నమైంది. మన తెలుగు కూడా ప్రత్యేకమైన భాషే అయినా సంస్కృతం నుంచి వేలకొలది పదాలను తనలో చేర్చుకుంది. మొదట్లో రాజాశ్రయం కోసమే పండితులూ, కవులూ సంస్కృతాన్ని ఆశ్రయించినా ఆ తరువాత తరువాత తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి  ఎన్నో సంస్కృత పదాలను తెలుగులోకి తీసుకు వచ్చి మన సాహిత్యాన్ని చాలా వరకూ సంస్కృత పదభూయిష్టం చేసారు. దీని వల్ల కొంత మేలు జరిగినా ఎక్కువగా అచ్చ తెలుగు కనుమరుగవడానికి కారణమైంది. కాని దీనినెవరైనా ఆపగలిగారా?.అలాగే ఆ తరువాత కూడా అనేక రాజకీయ సాంస్కృతిక కారణాల వల్ల పార్శీ ఉర్దూ ఆంగ్ల భాషా పదాలు లెక్కకు మిక్కిలి గా తెలుగులో చేరాయి. వీటిలో కొన్ని చాలా కాలం క్రితమే కావ్యగౌరవాన్ని కూడా పొందాయి. ఫలానాది తెలుగు పదం కాదు పార్శీ లేక ఉర్దూ నుంచి మన భాషలో వచ్చి చేరిందని చెబితే జనం ఆశ్చర్యపోయేంతగా అవి తెలుగులో కలిసి పోయాయి (వాటి ముచ్చట మరోసారి చెబుతాను). ఇన్ని వందలూ వేల పదాలు తెలుగులో వచ్చి చేరినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు వస్తున్న  ఆంగ్ల పదాలకు మాత్రం ఎందుకు?  రోడ్డు ఫోను రేడియో,టీవీ వంటి పదాలకు తెలుగు పదాలు సృష్టించి వాడడం నిష్ప్రయోజనం. అటువంటిదే హాస్పిటల్ అనే పదానికి అపభ్రంశ రూపమైన ఆసుపత్రి అనేది. ఈ రెండూ కాకుండా వైద్యాలయం అనేపదం ఏ తెలుగు వాడూ ఎప్పుడూ వాడగా నేను విన లేదు. అందు చేత భాషా పరిరక్షణోద్యమంలో ఛాందసత్వం కూదని తెలుసుకుని మసలుకుంటే అసలుకు మోసం రాదని చెప్పడమే నా ధ్యేయం. ఓ రెండు ముచ్చట్లు చెప్పి ముగిస్తాను:
నేను కాలేజీలో డిగ్రీ చదువుతుండగా (1958-61) మాకు తెలుగు రెండవ పేపరులో వ్యాకరణంతో పాటు ఆంగ్లంనుంచి తెలుగు అనువాదం చేయాల్సిన ప్రశ్న కూడా ఒకటుండేది. ఒకసారి ఆ అనువాదంలో సినిమా అనే పదం వచ్చింది. నా అనువాదంలో దానిని మార్చకుండా సినిమా అనే వ్రాసేను. ఆ పేపరులో నాకు ఫస్టు మార్కు ఇచ్చిన మా  ఆంధ్రోపన్యాసకులు శ్రీ రమణ గారు నన్ను పిలిచి సినిమాకు బదులు చలన చిత్రము అని వ్రాయనందుకు రెండు మార్కులు తగ్గించి నట్లు చెప్పారు. అప్పుడు నేనాయన్ని అయ్యా మీరు ఇంట్లో వాళ్లతో  చలన చిత్రమునకు పోవుదమా అంటారా? లేక సినిమాకు వెళ్దామా అంటారా? అని అడిగాను. దాని ఆయన అది సరేనయ్యా ఇది పరీక్ష కదా? అని అన్నారు. ఆయన చెప్పింది రైటే అయినా యాభై ఏళ్ల తర్వాత ఇవాళ కూడా జనం సినిమాని చలన చిత్రం అని పిలుచుకోవడం లేదుకదా? భేషజాలు మాని ఇటువంటి పదాల్ని తెలుగు వదాలుగా పరిగణిస్తే పోయేదేముంది?
ఆ రోజుల్లోనే  రైల్వేలో పని చేస్తుండే మా బాబాయి ఒకరు చెప్పిన విషయం. రైల్వేలకు సంబంధించి హిందీలో పారి భాషిక పదాల్ని తయారు చేసి ప్రభుత్వం ఇచ్చిన పట్టిక లో రైల్వే సిగ్నల్ కి సూచించిన పదంధూమ్ శకట్ కా ఆవక్ జావక్ సూచక్ యంత్ర్అనిట. ఏం సొగసుగా ఉంది? నాటికీ నేటికీ హిందీ మాట్లాడే ప్రాంతంలో కూడా దానిని సిగ్నల్ అనో దాని అపభ్రంశ రూపమైన సింగల్ అనో అంటారు కానీ  ధూమ్ శకట్ కా... అనే చాంతాడు మాటని ఎవ్వరూ ఉపయోగించరు. (ఇప్పుడైతే ధూమశకటాలే లేవు ఎలక్ట్రికల్ లేక డీసెల్ ఇంజన్లే కాని )
విశాఖ పట్నంలో పోర్టులో సముద్రపు పాయలో పేరుకు పోయే ఇసుకని తవ్వి తీయడానికి డ్రెడ్జర్ వచ్చిన కొత్తలో దానిని అక్కడి పోర్టు కూలీలు తవ్వోడ అని పిలిచేవారట. చాలా చక్కటి మాట. అయినా అదీ జనం వాడుకలో నిలబడకుండా జారిపోయింది. ఏ పదాలు నిలుస్తాయి ఏవి నిలవవు అనేది. వాటి వాడుకలో ఉండే సౌలభ్యాన్ని బట్టి కాలమే నిర్ణయిస్తుంది.
మనం మడి బట్ట కట్టి భాషని కాపాడలేం.
సెలవు.













                                    



                                       




















17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ఓ తాత గారి కథ.....(మన కథేనర్రోయ్..)


                             ఓ తాత గారి కథ.....(మన కథేనర్రోయ్..)

నదీమూలం ఋషి మూలం తెలియ రాదన్నారు.ఏం?ఎందుకని?నన్నడగండి చెబుతాను.నేనెన్నోసార్లు రాజమండ్రి దగ్గర అఖండ గోదావరిని చూసి మైమరచి పోయాను.రెండు మైళ్ల వెడల్పున నిండుగా పారుతున్నఆ సుజలస్రవంతి ఎన్నోవేల ఎకరాల భూములకు నీరందిస్తూ ఆంధ్ర దేశాన్నిఅన్నపూర్ణగా మారుస్తోంది కదా అన్నతలంపు కలుగగానే ఆనదిని మన వారు గోదావరీమాత అని ఎందుకు పిలుస్తారో నాణేలు వేసి భక్తి పూర్వకంగా నమస్కరించుకుంటారో అర్థమై పులకరించిన మనస్సులోనే నమస్కరించుకున్నాను..అదే నేను ఓసారి నాసికా త్రయంబకం వెళ్లడం తటస్థించింది.త్రయంబకం వద్ద గోదావరి పుట్టిన కొండ ప్రాంతానికి వెళ్లినా ఆ కొండమీదకి పోయి గోదావరి పుట్టిన ప్రదేశాన్ని చూసే సమయం లేక పోయింది. అక్కడే కిందనున్న దేవాలయం లో పుష్కరిణి ఒకటుంది. దాని గట్టుగా ఉన్నగోడలో చిన్నశయనిస్తున్న విష్ణు మూర్తి విగ్రహం ఉంది.ఆ మూర్తి పాదాల దగ్గర కొద్ది కొద్దిగా నీరు ఊరుతూ ఉంది.అదే గోదావరి అని అక్కడి పూజారులు చెప్పారు.తరువాత నాసికా క్షేత్రంలో గోదావరిని చూసేను. చిన్నపిల్లకాలువ లాగాను అత్యంత మురికి గానూ ఉంది.ఎవరికైనా అక్కడి గోదావరిని చూస్తే ఓస్... ఇదా గోదావరి అని ఏహ్య భావం కలుగక మానదు. ఇదిగో ఇటువంటి భావాలు మనకి కలుగకుండా ఆ నదీమతల్లి మీద మన గౌరవభావం  ఇసుమంతైనా సడలకుండా అలాగే ఉండాలనే నదీ మూలం వెతుక్కో వద్దన్నారు. అలాగే మన మహా ఋషులుకూడా.వారు మహాజ్ఞాన సంపన్నులై సమాజ శ్రేయస్సు ధ్యేయంగా జీవించిన వారు. వారిలో కొందరి పుట్టుక జనసామాన్యం ఊహించు కునే రీతిలో గొప్పగా ఉండక పోవచ్చు. వారందరూ అగ్ర వర్ణసంజాతులు కారు. అందు వల్ల వారికొచ్చిన నష్టమేమీ లేదు. కాక పోతే ఆ కారణంగా వారికి సామాన్య జనులు ఇవ్వాల్సిన గౌరవం లో లోపం జరుగ వచ్చు.ఇందు చేతనే ఋషుల మూలాలు వెతికే ప్రయత్నం కూడా చేయ వద్దన్నారు. కానీ  ఎవరికి వారు తమ తమ మూలాల్నితెలుసు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తాము ఎక్కడ పుట్టిందీ ఎలా పెరిగిందీ తెలుసుకుని జీవిత పర్యంతం దానిని గుర్తుంచుకోవడం ప్రతి మనిషికీ కనీస ధర్మం. అదే కాక ఎవరికైనా సరే తాను పుట్టిన ప్రదేశాన్ని ఒకసారైనా చూడాలనే కుతూహలం అత్యంత సహజమైనది కదా? ఇదిగో సరిగ్గా ఇలా తమ మూలాలను తెలుసుకోవాలన్న కుతూహలమే అలక్స్ హైలీ అన్న అమెరికన్ నీగ్రో రచయితకు కలిగి, ఆయన చేత పరిశోధన చేయించి తమకు ఏడు తరాలముందు తమ తాతను ఆఫ్రికానుంచి బలవంతంగా బానిసగా అమెరికాకు ఎత్తుకు వచ్చిన సంగతిని అద్భుతమైన చారిత్రాత్మక నవల (The Roots – తెలుగు లో ఏడు తరాలు) గా  వ్రాయించి ప్రపంచ నవలా సాహిత్యంలో మణి దీపంలా వెలిగేలా చేసింది.

 మన మెవ్వరం పుట్టక పూర్వమే, సరిగ్గా ఇలాంటి కుతూహలమే, మన తాతగారికి  కూడా కలిగింది. మన అంటున్నావేమిటయ్యా మనకందరికీ ఒకడే తాతా? అని ఆశ్చర్య పోకండి.అవును. మనందరికీ ఒకడే తాత. ఆయన మన ప్ర,, ప్ర,,ప్ర..( ఎన్ని ప్ర లు వాడాలో నాకు తెలీదు.అంచేత ప్ర to the power of n అని వేసుకోండి) ప్రపితామహుడైన బ్రహ్మ దేవుడు.(తమాషా ఏమిటంటే తాత అంటే కూడా బ్రహ్మ దేవుడే). ఆయనకి తనకి మూలం ఎక్కడో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ఆ కథ చెబుతాను వినండి.
                                              *****

      
సృష్ట్యాదికి పూర్వం బ్రహ్మదేవుడు కనులు తెరిచే సరికి తాను పద్మాసనస్థుడై ఉండడం, తన చుట్టూ అనంత వారాశి గోచరిస్తాయి. తానక్కడికి ఎలా వచ్చేడో తెలియదు. ఏం పని చెయ్యాలో తెలీదు. ఎలా చెయ్యాలో తెలీదు. ఎవర్నడగాలో తెలీదు. అడగడానిక్కూడా ఎక్కడా ఒక్క పిట్ట మనిషైనా లేడు.( ఎక్కడినుంచి వస్తాడు సృష్టే ప్రారంభం కాకపోతే? తాతాజీ కనుక తట్టుకున్నాడు కానీ ఎవరికైనా అది పిచ్చెక్కించే సందర్భం కదా?) సరే, తాను పద్మం లోంచి వచ్చాడు కనుక దాని మూలం కనుక్కుంటే సరిపోతుందని ఆ తామర తూడు మొదలెక్కడుందోనని వెతుక్కుంటూ వెళ్తాడు. యోజనాలు పయనించినా దాన్ని కనుక్కో లేక విసిగి వేసారి పోయి మళ్లీ వచ్చి తన స్థానంలో కూర్చుంటాడు. ఏం చేయాలో తోచదు. ఆ సమయంలో ఎక్కడి నుండో రెండు నీటి చుక్కలు జలరాశి మీద పడి తప.. తప.. మని శబ్దం  చేస్తాయి. అది విన్న బ్రహ్మ గారికి ఎవరో తనను తపస్ చేయమని ఉద్బోధించినట్లు తోస్తుంది. వెంటనే తపస్సు ప్రారంభించి వెయ్యి దివ్య సంవత్సరాలు ( అంటే ఎంతని నన్నడక్కండి..ఆ లెక్కలు చాలా కష్టం. .శత కోటి కోట్ల సంవత్స రాలలో ఉంటుందని తెలుసుకుంటే మన కథకి చాలు ) తపస్సు  చేసాడు. అప్పుడు ఆయన ముందర అనంత మైన దివ్య తేజస్సుతో శ్రీ మన్నారాయణ మూర్తి దర్శన మిస్తాడు. ఆ దివ్య మంగళ మూర్తి ఊర్ధ్వ భాగం ఏడు లోకాలు అధో భాగం ఏడు లోకాలుగా పదునాల్గు భువనాలతో విరాజిల్లుతూ ఉంటుంది. భూలోకం కటి ప్రదేశం కాగా ఆ పైన భువర్, సువర్, మహర్, జన తపో, సత్యలోకాలు, కటి ప్రదేశం దిగువున అతల,వితల,సుతల తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు ఉన్నాయి.,.ఆ మూర్తి నాభి లోనుంచి ఉద్భవించిన పద్మమే తన ఆసనంగా బ్రహ్మకు కనిపిస్తుంది. తనకు మూల మెవరో బ్రహ్మకు అర్థమౌతుంది. ఆ తర్వాత శ్రీ మన్నారాయణుడు బ్రహ్మకు సృష్టి ఎలా చేయాలో తెలిపి దానికి కావలసిన శక్తి యుక్తులను ఆయనకు ప్రసాదిస్తాడు.
                                            *****
ఈ విషయాలన్నీ,తానే సృష్టికి మూలకర్త కదా తానెవ్వరిని కొలుస్తాడని అడిగిన తన కుమారుడు నారద మహర్షికి బ్రహ్మ సవివరంగా చెబుతాడు. ఆ నారదుని ద్వారా వ్యాసునికీ తద్వారా లోకానికంతకూ వెల్లడయ్యాయి.
                                                ****
 మన బ్లాగ్ మిత్రుడు శ్రీ రాజ్ కుమార్ గారు అడిగి ఉండక పోతే నేనీ పోస్టు వ్రాసి ఉండే వాణ్ణి కాను. నా చేత ఇది వ్రాయించిన శ్రీ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సెలవు. 
                                                  ***













































                                              







11, ఫిబ్రవరి 2012, శనివారం

రెండు మాటలూ...రెండు ఊహలూ...


                            
నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు మానాన్నగారు తరచూ మాఊరినుంచి శ్రీకాకుళం వెళ్ళి వస్తూండేవారు. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా మర్నాడు కమాను వెళ్ళాలి అంటూ ఉండే వారు. తిరిగి వచ్చేక కూడా ఎవరైనా మీరు నిన్న ఊళ్లో లేరా అని అడిగితే కమాను వెళ్లి వచ్చేను అంటూ ఉండేవారు. కమాను వెళ్లడమంటే ప్రయాణమై వెళ్లడమని అప్పుడు నాకర్థమైంది. కానీ తర్వాత ఈ మాట ఎక్కువ మంది నోటంట విని ఉండలేదు. నాకు కొంచెం వయసొచ్చేక, నేను కన్యాశుల్కం చదువుతున్నప్పుడు మళ్ళీ ఈ మాట నా కళ్లబడింది. గిరీశం వెంకటేశాన్ని జామచెట్టెక్కి పళ్లు కోసుకు రమ్మన్నప్పుడు, అగ్నిహోత్రావధాన్లు అదేమిటని అడిగితే అది దొరల విద్యలో ఒక భాగమనీ, పెద్దయ్యాక వెంకటేశానికి గుణుపురం లో తాసీల్దారీ అయితే కమాన్లు వెళ్లాల్సి ఉంటుందనీ, అడవుల్లో ప్రయాణించేటప్పుడు చెట్లక్కడం నేర్చి ఉంటే పనికి వస్తుందనీ అంటాడు. ఎందుకో నాకీ పదం తెలుగు పదంలా అనిపించేది కాదు. నిఘంటువులు చూస్తే సూర్యరాయాంధ్ర నిఘంటువులో కమాను అంటే విల్లు ధనుస్సు అని మాత్రమే ఉంది. శ.ర. నిఘంటువు లో మాత్రం ఇది అన్య దేశ్యమనీ  ప్రయాణము విల్లు అనే అర్థాలున్నాయనీ తెలిసింది. విద్యార్థి కోశమనే నిఘంటువులో మాత్రం విల్లు అనీ ఫిడేలు వాయించు కొడుపు ( ఫిడేలు వాయించు సాధనం) అనీ ఉంది. హిందీ కమాన్ నుంచి వచ్చిన ఈ పదానికి ప్రయాణమనే అర్థం లేదు. మరి ప్రయాణ మనే అర్థమున్న కమాను అనే పదం ఏ అన్యదేశ భాష నుంచి వచ్చి ఉంటుంది? అని ఆలోచిస్తే నా ఊహకి తట్టిన విషయమేమిటంటే దొరల ఏలుబడిలో వారు ప్రయాణం చేయాల్సి  వచ్చినప్పుడు తమ గుమస్తాలనో బంట్రోతులనో వారితో రమ్మనడానికి Come On అటూ ఉండే వారేమో అలా ప్రయాణ మవడాన్ని దొర కమానంటే వెళ్లడం వలన కమానంటే ప్రయాణమని అనుకుని  ప్రయాణానికి అది ఇంగ్లీషు మాటగా వారి మాటల్లో స్థిర పడిఉంటుందనుకుంటాను. లేక పోతే ఏ పరభాషా పదం ఈ అర్థంతో ఉన్నదీ నాకు తట్టలేదు. మరో మంచి వ్యుత్పత్తి దొరికే వరకూ ఈ ఊహ బాగానే ఉంటుందనుకుంటాను.

కన్యాశుల్కం నాటకంలోనే ద్వితీయాంకం ప్రథమ స్థలంలో వెంకటేశం తల్లి, వెంకటేశం రాక కోసం ఎదురు చూస్తున్నప్పుడు, అగ్ని హోత్రావధాన్లు తాను వద్దంటూంటే వెంకమ్మ కొడుకుని ఇంగ్లీషు చదువులో పెట్టిందనీ, ఇంగ్లీషు చదువు తమకు అచ్చిరాదనీ తన పెద్దన్నదిబ్బావధాన్లు కొడుకుని ఇంగ్లీషు చదువుకి పార్వతీపురం పంపించే సరికి వూష్టం వచ్చి మూడ్రోజుల్లో కొట్టేసిందనీ, బుచ్చబ్బి కొడుక్కి ఇంగిలీషు చెప్పిద్దామనుకుంటుండగానే చచ్చినంత ఖాయిలా చేసిందనీ అన్నప్పుడు వెంకమ్మ మీరెప్పుడూ యిలాంటి వోఘాయిత్తం మాటలే అంటూ వుంటారని అంటుంది. అగ్రహారపు ఛాందస బ్రాహ్మణ స్త్రీ అయిన వెంకమ్మనోటంట ఓఘాయిత్యమనే వినిపించినా ఇది అఘాయిత్యం అనే మాటే. అయితే ఈ అఘాయిత్యం అనే మాట కూడా మన నిఘంటువుల్లో ఎక్కడా కనిపించదు. మొదట్లో ఇది అగత్యం అనే మాట అయి ఉంటుందనీ అగత్యం అంటే గత్యంతరం లేక పోవడం కనుక అలాంటి పరిస్థితుల్లో చేసే పనిని అఘాయిత్యం అంటారనీ అనుకునే వాడిని. కానీ ఈ ఊహ నాకు సంతృప్తి కలిగించ లేదు. తర్వాత ఆలోచించగా తట్టిందేమిటంటే ఇది అఘాయితము అయి ఉంటుందని. అఘము అనే పదానికి పాపము దుఃఖము అనే అర్థాలున్నాయి.ఇతము అనే ప్రత్యయానికి పొందినది కూడుకున్నది అనే అర్థం ఉంది.(నిందితుడు, బాధితుడు వంటి మాటలు చూడండి). పాపము లేక దుఃఖము కలిగినది లేక కూడుకున్నది. అఘాయితము. ఇదే అఘాయిత్యము లేక వెంకమ్మగారు చెప్పిన ఓఘాయిత్తం. ఇంగిలీషు చదువులకి పిల్లల్ని పంపిస్తే చనిపోతారని అగ్నిహోత్రావధాన్లనడం ఓఘయిత్తపు మాటలే కదా మరి?
నా దగ్గర ఏ వ్యుత్పత్తి పదకోశాలూ లేవు. ఈ రెండూ నా ఊహలు మాత్రమే. ఎక్కడైనా ఇంతకంటే సరియైనవీ ప్రామాణికమైనవీ వ్యుత్పత్తులు ఉంటే ఎవరైనా తెలియజేస్తే సంతోషిస్తాను. సెలవు.

4, ఫిబ్రవరి 2012, శనివారం

మాయగాళ్ళకు మాయగాడు....మాయమైన సంవత్సరం


                           
                                      చిన్నతనంలో మన వూళ్లలో చూసే ఉంటారు పాముల్నాడించుకుంటూ చిన్న చిన్న మేజిక్కులు చేసుకుంటూ పాముల మందుల్నీ తావీజుల్ని అమ్ముకునే వారిని. అవి మామూలు మేజిక్కులే అయిఉండవచ్చుగాని వారిలో కొందరికి కనికట్టు విద్యలుంటాయని చెప్పుకునే వారు. పెద్దవూళ్లలో పి.సి.సర్కార్ వంటివారు  మనల్ని సంభ్రమాశ్చర్యాలలోముంచెత్తే విద్యల్ని ప్రదర్శిస్తారు. మా నాన్నగారు చెప్పారు వారు వయసులో ఉండగా సీనియర్ సర్కార్ చేసిన ఒక మేజిక్ గురించి. అ రోజు ఆయన షో ప్రారంభానికి లేటుగా వచ్చాడట. వస్తూనే చాలా ముందుగా వచ్చినట్టున్నాను మనకింకాటైముంది కదా? అన్నాట్ట. అందరూ గోల పెడితే వాచీలు చూసుకోండి. సరిగా పదీ ఇరవయ్యే అయింది. ఇంకా పది నిమిషాలు టైముంది కదా అన్నాట్ట. అదేం విచిత్రమో కానీ ఏనాడూ ఏరెండు వాచీలు ఒకే టైము చూపక పోయినా అప్పుడు  మాత్రం అందరి చేతి వాచీలు పదీ ఇరవయ్యే చూపించాయట. మిగిలిన మేజిక్కుల సంగతేమో కానీ ఇలాంటివి కనికట్టు విద్యలుంటేనే సాధ్యమౌతాయి కాదా?.ఈమధ్య టీవీలో చాలా మేజిక్కులు ఎలా చేస్తారో చూడడం జరిగింది. అవి చూసేక ఓస్ ఇంతేనా అనిపించినా కొన్ని మాత్రం ఇంకా మనకి వింతగానే ఉంటాయి. కదిలే ట్రైన్ని  విమానాన్ని స్టాట్యూ ఆఫ్ లిబర్టీని కూడా మాయం చేసే వారున్నారు. ఇతర దేశాల సంగతి ఇప్పుడు మనకొద్దు గానీ మన దేశం ఇటువంటి మాయలకీ మంత్రాలకీ పుట్టినిల్లని పిస్తుంది. మేజిక్కుల గురించి చెప్పుకున్నప్పుడు  The Great Indian Rope Trick  గురించి చెప్పుకు తీరాలి.. ఇందులో ఐంద్రజాలికుడు ఒక మందమైన తాడు తీసుకుని దాని చివరని గాలిలోకి విసురుతాడు. అప్పుడది ఒక స్తంభం మాదిరిగా నిటారుగా నిల్చుంటే ఆయన సహాయకుడు దాన్ని పట్టుకుని పాకుకుంటూ చివరి వరకూ వెళ్లి మాయమై పోతాడు. కొద్ది సేపటికి హాహాకారాలు వినిపిస్తూ నేలమీదికి రక్తం కారుతుందట. చూపరులందరూ నిశ్చేష్టులై ఉండిపోతే ఆ సహాయకుడు  ఏమీ జరగనట్టుగా కిందకి దిగి వస్తాడట. ఎటువంటి Technical Support లేకుండా ఇటువంటి ప్రదర్శన ఎలా సాధ్యమో తెలియదు. కనికట్టు అనే విద్య ఏమైనా ఉందేమోఏది ఏమైనా ఇటువంటి విద్యలకి పుట్టినిల్లయిన మనదేశం లోనే చాలా కాలం కిందటే మాయగాళ్లకి మాయగాడైన మహనీయుడొకడు పుట్టేడు. ఆ వివరాలేమిటో  తెలుసుకుందాం..
                                                   ***
 మనం భాగవత కథలు విన్నప్పుడు శ్రీ కృష్ణుని లీలలు చాలా విన్నాము కదా?  ఆ కృష్ణుడు తాను నెలల బాలుడిగా ఉన్నప్పుడే తనని చంపడానికి కంసుని చే పంప బడ్డ పూతన  తన స్తన్యం ద్వారా విషమివ్వబోతే ఆమె  చనుబాలతో పాటు ఆమె రుధిరాన్ని కూడా త్రాగి ఆమె ప్రాణాల్నితోడేసి ఆమెని చంపి వేసిన వైనం మనకు తెలుసు. అలాగే తృణావర్తుడ్నీ వత్సాసుర బకాసురుల్నీ కూడా సంహరిస్తాడు. ఇవన్నీ ఆయనకి ఐదేళ్లు కూడా నిండకుండానే ( కౌమారంలోనే) జరిగాయి. తన ఐదవ ఏట, ఒక రోజు తన సంగడీ (స్నేహితు)లతో కలసి చల్దులున్న చిక్కాలను పట్టుకుని లేగ దూడల్ని మేపడానికి అడవికి వెళ్తాడు. వారు ఆలా వెళ్తుండగా దారిలో కంసుని పంపున అఘాసురుడనే రాక్షసుడు కొన్ని యోజనాల పొడవున్న పెద్దపాము రూపంలో భయంకరంగా దారికడ్డంగా పడుక్కుని నోట్లోంచి మంటలు కక్కుతుంటాడు. అయితే బాలకృష్ణుడు  పక్కనుండగా భయమనే మాటే తెలియని గోపబాలురు దాన్ని దాటి వెళ్లడానికే సిధ్ధపడతారు. అది ఒక్కసారిగా వారినీ లేగ దూడల్నీ కబళిస్తుంది. కానీ ఆది నోరు మూసుకునే లోపే బాలకృష్ణుడు దాని నోట్లో ప్రవేశించి ఒక్కసారిగా పెరుగుతాడు. అప్పుడా పాము ఊపిరాడక చనిపోతే తన మిత్రులందర్నీ  తీసుకుని బయటికి వస్తాడు. ఈ దృశ్యాన్ని గమనించిన దేవతలు హర్షధ్వానాలు చేస్తారు .
 తర్వాత ఒక చోట దూడల్ని పచ్చిక మేయడానికి వదలి,  ఒక కొలని గట్టున బాలకృష్ణుడు మధ్యలో కూర్చుండగా చుట్టూ కూర్చొని చల్దులు తినడం ఆరంభిస్తారు. ఉరుకులూ పరుగులూ లేని జీవితం కాబట్టి ఆడుకుంటూ పాడుకుంటూ మెల్లమెల్లగా తింటుంటారు. అప్పుడు బాలకృష్ణుడు లేగదూడలు మేత మేసుకుంటూ దూరంగా పోవడం గమనించి తన మిత్రుల్ని తింటూ ఉండమని తాను లేగల్ని వెతికి తీసుకు వస్తానని బయల్దేరతాడు. ఆ సమయంలో భూమి మీదకి దిగి వచ్చిన బ్రహ్మదేవుడు ఈ బాలుడు చాలా చిన్నవాడు కదా అంత పెద్ద అఘాసురుణ్ణి ఎలా  చంపగలిగి ఉంటాడని ఆశ్చర్యపోతూ ఆ బాలుని శక్తి పరీక్షిద్దామనుకొని లేగదూడల్నీ గోపబాలుర్నీ ఒక మాయాగుహలో దాచిపెడతాడు. లేగల్ని వెతుక్కుంటూ వెళ్లిన కృష్ణుడు వాటి అడుగుల గుర్తులు చూసుకుంటూ ఇటు వెళ్లాయని ఇక్కడ మందగా నిలిచాయని అనుకుంటూ చాలాదూరం వెళ్లాడు.  దూడలు కని పించక తిరిగి వచ్చేసరికి చల్దులు తింటూ ఉండాల్సిన తన సంగడీలు కూడా కని పించలేదు. ఆయన సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు అవతారం కనుక అది బ్రహ్మదేవుడి మాయ అని గ్రహిస్తాడు. బ్రహ్మమాయని తొలగించేయడం తనకి చాలా తేలికైన పని అయినా ఆ లీలా పురుషుడు బ్రహ్మకే బుధ్ధి రావాలని ఊరుకుంటాడు. కానీ ఇంటికి వెళ్లగానే గోపబాలుర సంగతీ లేగదూడల సంగతీ అందరూ అడుగుతారని తానే వారందరి రూపాలూ కూడా ధరించి ఇంటికి మరలుతాడు. ఇళ్లదగ్గర పిల్లల్ని చూసిన తల్లులూ లేగల్ని చూసిన గోమాతలూ వారి వారి సంతానమే అనుకుని ఎప్పటిలాగే ఆప్యాయంగా చూసుకుని మురిసి పోతారు. ఈ విధంగా కృష్ణుడు ఇందరి రూపాలలో అందరికీ ఆనందం కలిగిస్తూ సుమారు ఒక సంవత్సరం పాటు గడుపుతాడు. సంవత్సరం కాలం ఇంక ఐదారు రోజులలో ముగుస్తుందనగా బ్రహ్మదేవుడు ( ఆయనకది ఒక తృటి కాలం)  ఏ మయిందో చూద్దామని వస్తాడు. మహాశ్చర్యకరంగా తను మాయాగుహలో దాచి ఉంచిన గోపబాలురూ లేగదూడలూ అక్కడే ఉండగా ఇక్కడ కృష్ణుని చుట్టూచేరి వారంతా ఆనందంగా ఉండడం కనిపిస్తుంది. తన మాయని మించిన మాయ ఏమిటో తెలియక విస్తుపోతాడు. అప్పుడు కృష్ణుడు  తన మాయని సడలించగా బ్రహ్మదేవునికి గోపబాలురందరూ హార కుండల కిరీటాలూ వైజయంతీ వనమాలికలు ధరించిన మేఘ శ్యామల మూర్తులుగా కనిపించారు. వారి తేజస్సు బ్రహ్మకు భరింపనలవి కాకుండా పోయింది. అప్పుడు  ఈ శ్రీకృష్ణుడు తనను కన్న తండ్రియైన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని తెలిసికొని, పశ్చాత్తప్తుడై ఆయన కాళ్లమీద పడి చాలా సేపు స్తోత్రం చేస్తాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు బ్రహ్మను క్షమించి,  తాను సృష్టించిన మాయా రూపాల్ని తనలోనే కలిపేసుకుంటాడు.  బ్రహ్మ తన మాయాగుహలో దాచిన గోపబాలురనూ లేగలనూ తిరిగి యథా స్థానాల్లో ఉండేట్లు చేస్తాడు.  కొలని ఒడ్డున చల్దులు పట్టుకుని కూర్చున్న గోప బాలురు  కృష్ణుణ్ణి చూసి చెలికాడా వచ్చేవా, రా, మన లేగలన్నీ అరణ్యంలోంచి తిరిగి వచ్చేసాయి. నీవు లేవని మేమెవ్వరమూ చల్దులు తినలేదు. కలిసి తిందాము, రావయ్యా అని పిలుస్తారు. వారందరూ కలిసి చల్దులు తిన్న తర్వాత చనిపోయిన కొండచిలువ రూపంలో ఉన్న అఘాసురుడి శరీరాన్ని చూసి ఇళ్లకు వెళ్లాక తమవారికి శ్రీకృష్ణుడు కొండచిలువను చంపి  తమను రక్షించిన వైనాన్ని తెలుపుతారు.                                           శ్రీ కృష్ణుడు అఘాసురుణ్ణి చంపింది తన ఐదవ ఏటనే అయినా, గోపబాలురందరూ ఇళ్లకు రాగానే  అది అప్పుడే జరిగిన సంఘటనగా తమవారికి చెప్పడం వలన, అప్పటికి శ్రీ కృష్ణునికి ఆరేళ్ల (పౌగండ) ప్రాయం కనుక అతడు అఘాసురుణ్ణి ఆరేళ్ల ప్రాయంలో చంపేడనే అందరూ అనుకుంటారు. ఆవిధంగా ఆ గోప బాలుర జీవితాల్లో ఒక సంవత్సర కాలం మాయమయ్యింది. సృష్టికర్తయైన బ్రహ్మదేవుడికి దిమ్మతిరిగేలా చేసిన మాయగాళ్లకు మాయగాడి కథ ఇది.
                                                        ***
చదివారుగా. విష్ణుమూర్తికి మాయ పుట్టినిల్లట. ఆయన అవతారమైన శ్రీ కృష్ణుడు మనదేశంలో పుట్టాడు. మరి మనకి మాయలకి కొదవేమిటి?  కాకపోతే ఈ కలియుగ కృష్ణుల మాయలకి ప్రజల సొమ్ములూ, గవర్నమెంటు వారి ఆస్తులూ మాయం అవుతున్నాయి. అంతే తేడా.
                                             ***
P.S.—భాగవతంలో ఈ కథ చదివిన వారికీ, విన్నవారికీ వారి సమస్త కోరికలూ తీరుతాయని వ్రాసి ఉంది.
అందుచేత ఈ పోస్టు చదవడం మీ అదృష్టం గా భావించండి. సెలవు.
                                                           ***