4, ఫిబ్రవరి 2012, శనివారం

మాయగాళ్ళకు మాయగాడు....మాయమైన సంవత్సరం


                           
                                      చిన్నతనంలో మన వూళ్లలో చూసే ఉంటారు పాముల్నాడించుకుంటూ చిన్న చిన్న మేజిక్కులు చేసుకుంటూ పాముల మందుల్నీ తావీజుల్ని అమ్ముకునే వారిని. అవి మామూలు మేజిక్కులే అయిఉండవచ్చుగాని వారిలో కొందరికి కనికట్టు విద్యలుంటాయని చెప్పుకునే వారు. పెద్దవూళ్లలో పి.సి.సర్కార్ వంటివారు  మనల్ని సంభ్రమాశ్చర్యాలలోముంచెత్తే విద్యల్ని ప్రదర్శిస్తారు. మా నాన్నగారు చెప్పారు వారు వయసులో ఉండగా సీనియర్ సర్కార్ చేసిన ఒక మేజిక్ గురించి. అ రోజు ఆయన షో ప్రారంభానికి లేటుగా వచ్చాడట. వస్తూనే చాలా ముందుగా వచ్చినట్టున్నాను మనకింకాటైముంది కదా? అన్నాట్ట. అందరూ గోల పెడితే వాచీలు చూసుకోండి. సరిగా పదీ ఇరవయ్యే అయింది. ఇంకా పది నిమిషాలు టైముంది కదా అన్నాట్ట. అదేం విచిత్రమో కానీ ఏనాడూ ఏరెండు వాచీలు ఒకే టైము చూపక పోయినా అప్పుడు  మాత్రం అందరి చేతి వాచీలు పదీ ఇరవయ్యే చూపించాయట. మిగిలిన మేజిక్కుల సంగతేమో కానీ ఇలాంటివి కనికట్టు విద్యలుంటేనే సాధ్యమౌతాయి కాదా?.ఈమధ్య టీవీలో చాలా మేజిక్కులు ఎలా చేస్తారో చూడడం జరిగింది. అవి చూసేక ఓస్ ఇంతేనా అనిపించినా కొన్ని మాత్రం ఇంకా మనకి వింతగానే ఉంటాయి. కదిలే ట్రైన్ని  విమానాన్ని స్టాట్యూ ఆఫ్ లిబర్టీని కూడా మాయం చేసే వారున్నారు. ఇతర దేశాల సంగతి ఇప్పుడు మనకొద్దు గానీ మన దేశం ఇటువంటి మాయలకీ మంత్రాలకీ పుట్టినిల్లని పిస్తుంది. మేజిక్కుల గురించి చెప్పుకున్నప్పుడు  The Great Indian Rope Trick  గురించి చెప్పుకు తీరాలి.. ఇందులో ఐంద్రజాలికుడు ఒక మందమైన తాడు తీసుకుని దాని చివరని గాలిలోకి విసురుతాడు. అప్పుడది ఒక స్తంభం మాదిరిగా నిటారుగా నిల్చుంటే ఆయన సహాయకుడు దాన్ని పట్టుకుని పాకుకుంటూ చివరి వరకూ వెళ్లి మాయమై పోతాడు. కొద్ది సేపటికి హాహాకారాలు వినిపిస్తూ నేలమీదికి రక్తం కారుతుందట. చూపరులందరూ నిశ్చేష్టులై ఉండిపోతే ఆ సహాయకుడు  ఏమీ జరగనట్టుగా కిందకి దిగి వస్తాడట. ఎటువంటి Technical Support లేకుండా ఇటువంటి ప్రదర్శన ఎలా సాధ్యమో తెలియదు. కనికట్టు అనే విద్య ఏమైనా ఉందేమోఏది ఏమైనా ఇటువంటి విద్యలకి పుట్టినిల్లయిన మనదేశం లోనే చాలా కాలం కిందటే మాయగాళ్లకి మాయగాడైన మహనీయుడొకడు పుట్టేడు. ఆ వివరాలేమిటో  తెలుసుకుందాం..
                                                   ***
 మనం భాగవత కథలు విన్నప్పుడు శ్రీ కృష్ణుని లీలలు చాలా విన్నాము కదా?  ఆ కృష్ణుడు తాను నెలల బాలుడిగా ఉన్నప్పుడే తనని చంపడానికి కంసుని చే పంప బడ్డ పూతన  తన స్తన్యం ద్వారా విషమివ్వబోతే ఆమె  చనుబాలతో పాటు ఆమె రుధిరాన్ని కూడా త్రాగి ఆమె ప్రాణాల్నితోడేసి ఆమెని చంపి వేసిన వైనం మనకు తెలుసు. అలాగే తృణావర్తుడ్నీ వత్సాసుర బకాసురుల్నీ కూడా సంహరిస్తాడు. ఇవన్నీ ఆయనకి ఐదేళ్లు కూడా నిండకుండానే ( కౌమారంలోనే) జరిగాయి. తన ఐదవ ఏట, ఒక రోజు తన సంగడీ (స్నేహితు)లతో కలసి చల్దులున్న చిక్కాలను పట్టుకుని లేగ దూడల్ని మేపడానికి అడవికి వెళ్తాడు. వారు ఆలా వెళ్తుండగా దారిలో కంసుని పంపున అఘాసురుడనే రాక్షసుడు కొన్ని యోజనాల పొడవున్న పెద్దపాము రూపంలో భయంకరంగా దారికడ్డంగా పడుక్కుని నోట్లోంచి మంటలు కక్కుతుంటాడు. అయితే బాలకృష్ణుడు  పక్కనుండగా భయమనే మాటే తెలియని గోపబాలురు దాన్ని దాటి వెళ్లడానికే సిధ్ధపడతారు. అది ఒక్కసారిగా వారినీ లేగ దూడల్నీ కబళిస్తుంది. కానీ ఆది నోరు మూసుకునే లోపే బాలకృష్ణుడు దాని నోట్లో ప్రవేశించి ఒక్కసారిగా పెరుగుతాడు. అప్పుడా పాము ఊపిరాడక చనిపోతే తన మిత్రులందర్నీ  తీసుకుని బయటికి వస్తాడు. ఈ దృశ్యాన్ని గమనించిన దేవతలు హర్షధ్వానాలు చేస్తారు .
 తర్వాత ఒక చోట దూడల్ని పచ్చిక మేయడానికి వదలి,  ఒక కొలని గట్టున బాలకృష్ణుడు మధ్యలో కూర్చుండగా చుట్టూ కూర్చొని చల్దులు తినడం ఆరంభిస్తారు. ఉరుకులూ పరుగులూ లేని జీవితం కాబట్టి ఆడుకుంటూ పాడుకుంటూ మెల్లమెల్లగా తింటుంటారు. అప్పుడు బాలకృష్ణుడు లేగదూడలు మేత మేసుకుంటూ దూరంగా పోవడం గమనించి తన మిత్రుల్ని తింటూ ఉండమని తాను లేగల్ని వెతికి తీసుకు వస్తానని బయల్దేరతాడు. ఆ సమయంలో భూమి మీదకి దిగి వచ్చిన బ్రహ్మదేవుడు ఈ బాలుడు చాలా చిన్నవాడు కదా అంత పెద్ద అఘాసురుణ్ణి ఎలా  చంపగలిగి ఉంటాడని ఆశ్చర్యపోతూ ఆ బాలుని శక్తి పరీక్షిద్దామనుకొని లేగదూడల్నీ గోపబాలుర్నీ ఒక మాయాగుహలో దాచిపెడతాడు. లేగల్ని వెతుక్కుంటూ వెళ్లిన కృష్ణుడు వాటి అడుగుల గుర్తులు చూసుకుంటూ ఇటు వెళ్లాయని ఇక్కడ మందగా నిలిచాయని అనుకుంటూ చాలాదూరం వెళ్లాడు.  దూడలు కని పించక తిరిగి వచ్చేసరికి చల్దులు తింటూ ఉండాల్సిన తన సంగడీలు కూడా కని పించలేదు. ఆయన సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు అవతారం కనుక అది బ్రహ్మదేవుడి మాయ అని గ్రహిస్తాడు. బ్రహ్మమాయని తొలగించేయడం తనకి చాలా తేలికైన పని అయినా ఆ లీలా పురుషుడు బ్రహ్మకే బుధ్ధి రావాలని ఊరుకుంటాడు. కానీ ఇంటికి వెళ్లగానే గోపబాలుర సంగతీ లేగదూడల సంగతీ అందరూ అడుగుతారని తానే వారందరి రూపాలూ కూడా ధరించి ఇంటికి మరలుతాడు. ఇళ్లదగ్గర పిల్లల్ని చూసిన తల్లులూ లేగల్ని చూసిన గోమాతలూ వారి వారి సంతానమే అనుకుని ఎప్పటిలాగే ఆప్యాయంగా చూసుకుని మురిసి పోతారు. ఈ విధంగా కృష్ణుడు ఇందరి రూపాలలో అందరికీ ఆనందం కలిగిస్తూ సుమారు ఒక సంవత్సరం పాటు గడుపుతాడు. సంవత్సరం కాలం ఇంక ఐదారు రోజులలో ముగుస్తుందనగా బ్రహ్మదేవుడు ( ఆయనకది ఒక తృటి కాలం)  ఏ మయిందో చూద్దామని వస్తాడు. మహాశ్చర్యకరంగా తను మాయాగుహలో దాచి ఉంచిన గోపబాలురూ లేగదూడలూ అక్కడే ఉండగా ఇక్కడ కృష్ణుని చుట్టూచేరి వారంతా ఆనందంగా ఉండడం కనిపిస్తుంది. తన మాయని మించిన మాయ ఏమిటో తెలియక విస్తుపోతాడు. అప్పుడు కృష్ణుడు  తన మాయని సడలించగా బ్రహ్మదేవునికి గోపబాలురందరూ హార కుండల కిరీటాలూ వైజయంతీ వనమాలికలు ధరించిన మేఘ శ్యామల మూర్తులుగా కనిపించారు. వారి తేజస్సు బ్రహ్మకు భరింపనలవి కాకుండా పోయింది. అప్పుడు  ఈ శ్రీకృష్ణుడు తనను కన్న తండ్రియైన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని తెలిసికొని, పశ్చాత్తప్తుడై ఆయన కాళ్లమీద పడి చాలా సేపు స్తోత్రం చేస్తాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు బ్రహ్మను క్షమించి,  తాను సృష్టించిన మాయా రూపాల్ని తనలోనే కలిపేసుకుంటాడు.  బ్రహ్మ తన మాయాగుహలో దాచిన గోపబాలురనూ లేగలనూ తిరిగి యథా స్థానాల్లో ఉండేట్లు చేస్తాడు.  కొలని ఒడ్డున చల్దులు పట్టుకుని కూర్చున్న గోప బాలురు  కృష్ణుణ్ణి చూసి చెలికాడా వచ్చేవా, రా, మన లేగలన్నీ అరణ్యంలోంచి తిరిగి వచ్చేసాయి. నీవు లేవని మేమెవ్వరమూ చల్దులు తినలేదు. కలిసి తిందాము, రావయ్యా అని పిలుస్తారు. వారందరూ కలిసి చల్దులు తిన్న తర్వాత చనిపోయిన కొండచిలువ రూపంలో ఉన్న అఘాసురుడి శరీరాన్ని చూసి ఇళ్లకు వెళ్లాక తమవారికి శ్రీకృష్ణుడు కొండచిలువను చంపి  తమను రక్షించిన వైనాన్ని తెలుపుతారు.                                           శ్రీ కృష్ణుడు అఘాసురుణ్ణి చంపింది తన ఐదవ ఏటనే అయినా, గోపబాలురందరూ ఇళ్లకు రాగానే  అది అప్పుడే జరిగిన సంఘటనగా తమవారికి చెప్పడం వలన, అప్పటికి శ్రీ కృష్ణునికి ఆరేళ్ల (పౌగండ) ప్రాయం కనుక అతడు అఘాసురుణ్ణి ఆరేళ్ల ప్రాయంలో చంపేడనే అందరూ అనుకుంటారు. ఆవిధంగా ఆ గోప బాలుర జీవితాల్లో ఒక సంవత్సర కాలం మాయమయ్యింది. సృష్టికర్తయైన బ్రహ్మదేవుడికి దిమ్మతిరిగేలా చేసిన మాయగాళ్లకు మాయగాడి కథ ఇది.
                                                        ***
చదివారుగా. విష్ణుమూర్తికి మాయ పుట్టినిల్లట. ఆయన అవతారమైన శ్రీ కృష్ణుడు మనదేశంలో పుట్టాడు. మరి మనకి మాయలకి కొదవేమిటి?  కాకపోతే ఈ కలియుగ కృష్ణుల మాయలకి ప్రజల సొమ్ములూ, గవర్నమెంటు వారి ఆస్తులూ మాయం అవుతున్నాయి. అంతే తేడా.
                                             ***
P.S.—భాగవతంలో ఈ కథ చదివిన వారికీ, విన్నవారికీ వారి సమస్త కోరికలూ తీరుతాయని వ్రాసి ఉంది.
అందుచేత ఈ పోస్టు చదవడం మీ అదృష్టం గా భావించండి. సెలవు.
                                                           ***
                               

14 వ్యాఖ్యలు:

పంతుల జోగారావు చెప్పారు...

చాలా బావుందండీ. విష్ణుమాయ గురించి బాగా రాసారు. గోపాలురూ, యశోదా నందులూ కూడా ఈ మాయలో పడి కన్నయ్యను , ఆ లీలామానుష విగ్రహుని తమ వాడిగానే చూసారు. అతను చేసే మాయలన్నీ చూసి వాటిని దైవిక చర్యలనుకోక పోవడం కూడా విష్ణు మాయే కదా.

రసజ్ఞ చెప్పారు...

చాలా మంచి కథను పరిచయం చేసారు! ధన్యవాదాలు!
హమ్మయ్యా! చదివేసానండీ! చదివిన వెంటనే ఒక కోరిక కూడా కోరేసుకున్నాను :):):) నా కోరికలు తీరుతాయి కదూ!

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

పంజో,రసజ్ఞ గారలకు కృతజ్ఞతలు. రసజ్ఞ గారి కోరిక తీరడానికి పోతన గారి భాగవతమే హామీ!

అజ్ఞాత చెప్పారు...

good

Sudha చెప్పారు...

హబ్బ...చిన్నికృష్ణుడి ఈ కథ ఎన్నడూ వినలేదే. ఎంతబావుందో.
అనుకోకుండా ఒక రోజు సినిమా లో అమ్మాయి ఒకరోజును తన జ్ఞాపకంలో మిస్ అవుతుంది. ఈ భాగవత కథలో గొల్లపిల్లలు ఒక సంవత్సరాన్ని మిస్ అయ్యారన్నమాట. చాలా కొత్తగా ఉందీ భావం. ఇలాంటి కాన్సెప్టు మన భాగవతం లో కూడా ఉందా...ఎలా వెతికి పట్టుకున్నారూ.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

కష్టే ఫలే, సుధ,గార్లకు కృతజ్ఞతలు. ఈ కథ లోని నీతిని నేను వాచ్యంగా చెప్పలేదు.కానీ తెలుసుకోవలసింది ఏమిటంటే ఎంతటి వారికీ తమకంటె గొప్పవారు లేరనే మిడిసిపాటు కూడదనేది. సృష్టికర్త బ్రహ్మకైనా సరే ఇది వర్తిస్తుంది.తెలుగులో ఒక సామెత ఉంది. అలుడ్ని బలుడు కొడితే బలుడ్ని బ్రహ్మదేవుడు కొడతాడని.మీరు మాయాబజారు సినిమాలో చూసే ఉంటారు.శశిరేఖ నివాసం ఎక్కడో చూపించమని ముసలి బ్రాహ్మణుడి రూపంలో తత్వాలు పాడుకుంటూ కూర్చున్నశ్రీ కృష్ణుణ్ణి ఘటోత్కచుడు అడుగుతాడు ఆ బ్రాహ్మడుతనని ఎత్తుకుని తీసుకు వెళ్తే చూపిస్తానంటాడు. బలగర్వంతో మదమెక్కిన ఘటోత్కచుడు అదెంత పని అనుకుంటాడు కానీ కనీసం కదిలించలేక పోతాడు.అప్పుడది శ్రీ కృష్ణ మాయగా తెలుసుకుని ఆయనని కీర్తిస్తే కృష్ణుడు ప్రసన్నుడై కాగల కార్యాన్ని సుగమం చేస్తాడు.ఈ కథల ప్రయోజనం అదీ.

Sudha చెప్పారు...

భాగవత కథే కాదు, వ్యాఖ్యలో కూడా ఎంత మంచి విషయం చెప్పారండీ. గుడిని మింగేవాడొకడుంటే, గుడినీ గుడిలోని లింగాన్ని కూడా మింగే వాడుంటాడని సామెత విన్నాం. ఒక మనిషిలోని శక్తిని చెప్పడానికి నెగటివ్ గా ఈ సామెత వాడుతారు కదా. విన్నాం. కానీ దాన్నే పాజిటివ్ గా చెప్పడానికి అలుడ్ని,బలుడు కొడితే బలుడ్ని బ్రహ్మదేవుడు కొడతాడనే సామెత ఇప్పుడు వింటున్నా. బావుందండీ. పోతనగారిచ్చిన హామీతో నేనూ ఓ కోరిక కోరుకున్నాను.

రాజ్ కుమార్ చెప్పారు...

ముందుగా చెప్పిన మ్యాజిక్ విశేషాలే సూపర్ గా ఉన్నాయ్. ఆ తర్వాత చెప్పిన మాయగాళ్ళకి మాయగాడు కధ ఇంకా ఇంకా సూపర్ గా ఉన్నాయ్ సార్.

అయితే ఒక డౌట్.. సృష్టికర్త బ్రహ్మదేవునికి శ్రీ మహా విష్ణువు యొక్క అవతారమే శ్రీ కృష్ణుడు అని తెలియకపోవటం ఏమిటండీ?

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

అది కూడా శ్రీ కృష్ణ మాయే అనుకోవాలి రాజా కుమార్ గారూ! ఇక్కడ మరో సంగతి చెప్తాను. ఒక సారి బ్రహ్మ దేవుడుకి తానెక్కడినుంచి పుట్టానో తెలుసుకోవాలనిపించి పద్మసంభవుడు కనుక తామర తూడు మొదలుకోసం వెతకడం ప్రారంభించి నూరు సంవత్సరాలయినా కనుక్కోలేక విరమించుకున్నాడట. బ్రహ్మకు నూరు సంవత్సరాల కాలం అంటే మన లెక్కల్లో శతకోటి కోట్ల సంత్సరాలపై మాటే.ఈ లెక్కలు అనవసరం. ఆ మహా మాయగాడి లీలలు తెలుసుకోవడం బ్రహ్మతరం కూడా కాదన్నది దాని తాత్పర్యం.

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

హహ..పోస్ట్ కంటే PS బాగుంది :))

రాజ్ కుమార్ చెప్పారు...

అర్ధమయ్యిందండీ... ః)
చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే.. ఆ కధ కూడా చెప్పండి ;) [బ్రహ్మ దేవుని పుట్టుక గురించిన కధ ]

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అల నాటి కృష్ణ మాయలు చక్కగా వివరించారు. అవి ధర్మ సంస్తాపనా ర్ధంగా ఉండేవి . ఇక నేటి రాజకీయ మాయలు దారుణం .

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

రామిరెడ్డిగారికీ, రాజేశ్వరిగారికీ కృతజ్ఞతలు.ఈ పోస్టు చదివిన వారందరికీ పోతన చెప్పిన ఫలితం దక్కాలని కోరుకుంటున్నాను.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

రాజ్ కుమార్ గారికి,నాకు తెలియకుండా మీ ఈస్పందన స్పామ్ లోకెళ్లిపోయింది.ఎందుచేతో తెలీదు. సరే. మీరడిగినది తప్పకుండా తెలియజేస్తాను.