26, మే 2012, శనివారం

నవనీత మనస్కుడు.. కవితాంతరంగుడు....శ్రీ విశ్వనాథ..


  “ శ్రీ విశ్వ సత్యనాథాయణ అగ్గి మీద గుగ్గిలం….”. అంటాడు మహాకవి శ్రీశ్రీ. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి మాట పెళుసు. అయితే అయి ఉండ వచ్చు.ఆయనది ఎవరినీ లక్ష్య పెట్టే స్వభావం కాకపోవచ్చు.అనదలుచుకున్నమాట ఏదో ఎదుటివారి ముఖం మీదే అనేసే తత్వం ఆయనది.నిర్మొహమాటి. ఈ విషయంలో మనం ఆయన ప్రవర్తనను హర్షించలేక పోవచ్చును.  అయితే చాలా మందికి తెలియని దొడ్డ గుణాలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి.మంచి కవిత్వాన్ని చదివితే మైమరిచిపోవడం,తానే ఒక మహాకవి ఐనా కూడా ఇతరుల కవిత్వాన్ని తన కవిత్వం కంటె బాగుందని నిస్సంశయంగా మెచ్చుకోవడం గొప్ప విషయాలు.వారి సహృదయతకు అద్దం పట్టే సంఘటనలు చాలానే ఉన్నాయి.మచ్చుకు ఒకటి చూడండి:

ఒకసారి బీర్నీడు ప్రసన్న అనే కవి శ్రీ విశ్వనాధ వారిని సందర్శించుకోవడానికి వచ్చాడు. ఆయన నిమ్నకులానికి చెందనవాడూ క్రైస్తవమతానికి చెందిన వాడూను.ఆయన తాను ఒక కావ్యం వ్రాశాననీ దాని మీద విశ్వనాథ వారి అభిప్రాయం తెలుసుకోవడానికి వచ్చాననీ విన్నవించుకున్నాడు. ఏదో చికాకుల వలన మనసు బాగా లేని విశ్వనాథ వారు నీకూ పుట్టిందీ ఈ రోగం. సరే కానీ ఏం వ్రాశావు అని అడిగారు. దానికతడు అది పృధ్వీరాజు రాణీ సంయుక్తల వివాహ గాథ అనీ పుస్తకం పేరు పృధ్వీభాగవతమనీ చెప్పి పుస్తకాన్ని తన చేతి సంచీ లోంచి తీసి విశ్వనాథ వారి కాళ్ల దగ్గర ఉంచబోయాడు. విశ్వనాథ వారు వెనక్కి తగ్గి పుస్తకాన్ని అక్కడ బల్లమీద పెట్టి ఒక పదిరోజులాగి కనపడుఅని అన్నారు. సరిగ్గా పదిరోజులాగి పదకొండోరోజు ప్రసన్నగారు వచ్చారు విశ్వనాథ వారు “ చదవలేదయ్యా నాలుగు రోజులాగి రాగలవా?” అన్నారు. “ చిత్తమండీ అంటూ అతను వెళ్లిపోయాడు. సరిగ్గా నాలుగు రోజులాగి మళ్లా వచ్చాడు. ఏమిటోనయ్యా చదవడం కుదర లేదు. రెండురోజులాగి రాగలవా? ”అని విశ్వనాథవారంటే అతడు తప్పకుండా అంటూ వెళ్లిపోయి రెండురోజులాగి మళ్లా వచ్చాడు. ఏదో పనిమీద పోతున్నానయ్యా రేపురాఅని విశ్వనాథ వారంటే సరేనని ప్రసన్న గారు వెళ్లిపోయి మర్నాడు సాయంత్రం విశ్వనాథ వారు చాలా చికాకుగా ఉన్న సమయంలో మళ్లా వచ్చారు.విశ్వనాథ వారు కోపంతో “ ప్రతీవాడూ కవిత్వం వ్రాసేవాడే! నాప్రాణం తీసే వాడే! వ్రాస్తే వ్రాసుకో వచ్చుకాని నా అబిప్రాయం ఎందుకూనేనెవర్నైనా అభిప్రాయాలడిగానా? వ్రాసిన దేదో అచ్చేసుకేవచ్చు. చదివే వాడు చదువుతాడు. లేనివాడు లేదు.నీ పుస్తకం చదవడం నా వల్లకాదు తీసుకుని ఫోఅంటూ విసుక్కున్నారు.ఆ ప్రసన్నగారు కళ్లనీళ్ల పర్యంతమై అట్లాగే నండయ్యా పుస్తకమిప్పించండయ్యా! అగ్గిలో పారే స్తానుఆన్నారు. దానికి ఆశ్చర్య పోయిన విశ్వనాథ వారుఏమిటీ ఏమిటంటున్నావు....నిజంగానే అంటున్నావా అని అడిగితే నిజమేనండయ్యా,మీరు చదవని కాడికి ఈ పుస్తకమెందుకండయ్యా..మీ ముందరే అగ్గిలో పడేస్తాను అన్నారు ప్రసన్న గారు. ఆయనను మర్నాడు రమ్మన్నారు విశ్వనాథ వారు.
ఆ రాత్రి భోజనాలయేక ప్రసన్నగారిచ్చిన వ్రాత ప్రతిని తీసుకుని చదవడమారంభించిన విశ్వనాథ వారు రాత్రి ఒంటి గంట సమయంలో తమ మేడ మీద నిద్రిస్తున్నమల్లాది లక్ష్మీ నారాయణ గారిని కేకేసి రమ్మని పిలిచి పృద్వీ బాగవతం లోని పద్యాలను వరుసగా కొన్ని చదివి వినిపించిఎంత బాగా వ్రాసాడండీ అసలీయన లాగా నేను వ్రాయగలనుటండీఅని మెచ్చుకున్నారు.
మర్నాడు పుస్తకం కోసం వచ్చిన ప్రసన్నగారిని లక్ష్మీనారాయణ గారు బాబూ ఈ పుస్తకమె వరికి అంకిత మిద్దామనుకుంటున్నావు అని అడిగారు.ఆయన మానవ మాత్రుడెవరికీ ఇవ్వదలచుకోలేదండీ అని సమాధానమివ్వడంతో లక్ష్మీ నారాయణ గారు
అదికాదయ్యా నువ్వు అంకితమిస్తే తీసుకుందామని మాస్టరుగారు అనుకుంటున్నారు, కానీ నీవు మానవ మాత్రుడికి ఇవ్వనంటున్నావే మరీ అని అన్నారు.ఆశ్చర్యపోయిన ప్రసన్న గారు అది వేళా కోళం కాదనీ నిజమేననీ రూఢి చేసుకుని తాను ఏనాడూ ఆయనను మానవ మాత్రునిగా తలచ లేదంటూ విశ్వనాథ వారి కాళ్లమీద పడి లేచి అప్పటికప్పుడు అంకితం  పద్యాలు వ్రాసి ఇచ్చారు.
ఆ తర్వాత ఆగ్రంథం సాహిత్య అకాడెమీ వారి ధన సహాయంతో ముద్రింపబడింది.
పుస్తకం అంకితం సభలో ప్రసన్నగారు శ్రీవారు ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన కవులైతే నేను వారి ఆస్థాన కవినిఅని చెప్పుకుని మురిసిపోయారు.
బ్రాహ్మణేతరుల కవిత్వాన్ని కేవలం వారి కులం కారణంగా ఈసడించుకుంటున్న పండితమ్మన్యులు వెలిగి పోతున్న రోజులలో నిజమైన కవిత్వం ఎక్కడున్నా తలదాల్చిన కవిసమ్రాట్టుకి జేజేలు పలుకు తున్నాను.
ఈ వైనాన్ని మనకు తెలిపిన ( శ్రీవిశ్వనాథ సత్య నారాయణ గారి కుమారులు) శ్రీ విశ్వనాథ పావని శాస్త్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఇటువంటిదే ఇంకొక ముచ్చట మరోసారి.. ఇప్పటికి సెలవు.)


22, మే 2012, మంగళవారం

విద్యల నగరం-- మా విజయనగరం


                                         విద్యల నగరం--మా విజయనగరం
మా విజయనగరానికి విద్యలనగరమని దేశమంతటా ప్రఖ్యాతి రావడానికి రెండు కారణాలు చెబుతారు. మొదటిది--విజయనగరం సంస్థానానికి విజయరామ రాజు ఆ తర్వాత ఆనందగజపతి రాజు గారు సింహాసనాధీశులు కావడం అయితే,రెండోది శ్రీ తాతారాయుడుశాస్త్రులుగారూ,ఆదిభట్ల నారాయణ దాసు గారూ ఈ పుర నివాసులు కావడం అంటారు. వారు అసాధారణ ప్రజ్ఞా సంపన్నులు. ఈ విద్యల నగరానికి చెందిన ఒక ముచ్చట చెబుతాను .అవధరించండి:
                                       
ఒకానొక సాయంకాలం 4 గంటల సమయంలో మహారాజు గారూ యువరాజు గారూ మోతీ మహల్ డాబా మీద విహరిస్తూ మాట్లాడుకుంటున్నారు. డాబా పిట్ట గోడమీంచి క్రిందికి దృష్టి సారించిన మహారాజుగారు ఒక్కసారిగా అగ్రహోదగ్రులయ్యారు.ఎవరక్కడఅంటూ కేక వేసేరు. పరిగెత్తుకుని వచ్చిన భటులు మహారాజు గారి  చూపులననుసరించి చూసేరు. ఇంకేముంది. కొంప ములిగింది. మహారాజు గారి ఆగ్రహానికి కారణం తెలిసింది. మూడు ప్రహరీలు దాటి లోపలికి మహల్ వైపు ఎవరో గొడుగు వేసుకుని నడుచుకుంటూ వస్తున్నారు. రాచరికానికి ఎంత అవమానకరంభటులు వెంటనే క్రిందకి పరుగెత్తారు. క్రిందకు చూసిన యువ రాజుగారు ఆ వస్తున్నదెవరో పోల్చుకోగలిగారు. వెంటనే మహారాజు గారితో మహా ప్రభూ...ఆ వచ్చేవారు మనని అగౌరవపరచే వారు కారు. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. వారి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నానుఅని అన్నారు. మహారాజు గారు సౌంజ్ఞ చేయగానే ఆ ఆగంతకుని కాళ్లూ చేతులూ విరగ్గొట్టి తీసుకు రావడానికి వెళ్లిన భటులు వెనక్కి తిరిగి వచ్చేసారు.ఈ విషయం ఏ మాత్రమూ తెలియని ఆ వ్యక్తి నడుచుకుంటూ నేరుగా యవరాజు గారి మందిరం లో ప్రవేశించి హాల్లో కుర్చీలో ఆసీనుడయ్యారు. కొంత సేపటికి అక్కడికి వచ్చిన యువరాజుగారు అయ్యా శాస్త్రులు గారూ నేరుగా కోటలోకి గొడుగు వేసుకునే ప్రవేశించేశారేమిటి?” అని అడిగారు. అందుకు ఆ శాస్త్రిగారుఅబ్బే అదేం లేదే? నేనెప్పుడూ కోట మొదటి ప్రహరీ గుమ్మం దగ్గరే గొడుగు మూసుకుని వస్తానే? ఈ రోజు ఏదో శ్లోకం ఆలోచించుకుంటూ పరధ్యానంగా వస్తున్నాను. ఏదయినా పొరపాటు కాని జరిగిందా?” అన్నారు. దానికి యువరాజు గారు జరిగింది చెప్పి ఆ శ్లోకం సంగతి కనుక్కున్నారు. ఆ తర్వాత రోజూ లాగే వారిద్దరూ సాహిత్య గోష్టి జరుపుకుని తర్వాత యువరాజు గారు తెప్పించిన పాలూ భంగూ(గంజాయి ముద్ద ) కలిసి సేవించి ముచ్చట్లాడుకున్నారు
                                                             ****
ఈ కథలో మహారాజుగారు విజయనగరం రాజా విజయరామరాజుగారు, యువరాజు ఆనందగజపతి గారు.. కవితా ధ్యాన నిమగ్నులై పొరపాటున తెరచిన గొడుగు వేసుకుని కోటలో ప్రవేశించిన పండితులు శ్రీ పేరి కాశీ నాథ శాస్త్రి గారు యువరాజా వారి ఆస్థాన కవీ పండితులున్నూ. వారి తండ్రిగారు శ్రీ పేరి వేంకట శాస్త్రిగారు మహారాజా వారివద్ద ఆస్థాన పండితులు. కోటలోనికి గొడుగు వేసుకుని రావడం అధికార ధిక్కారం. క్షమించరాని నేరం. అయినా పండితుల వారి మనసు గుర్తెరిగిన వారు కనుక వారు క్షమాపణ కోరకుండానే వారికి తెలియనీయకుండానే వారి తరపున తానే మహారాజును క్షమాపణ కోరిన ఆనంద గజపతి ప్రభువుల పాలనలో కవితా సరస్వతికి లభించిన గౌరవం గురించి చెప్పాల్సిన పనేముంది?
                                                                ****
(ఈ వైనాన్ని మనకు తెలియజేసిన శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రుల వారికి కృతజ్ఞతలు)                             

18, మే 2012, శుక్రవారం

నేనూ.. మా మధురవాణీ.. మా విశాఖ పట్నఁవున్నూ...


                       


కన్యాశుల్కం నాటకంలో ఒకానొక సందర్భంలో  కరటక శాస్త్రులు  మధురవాణి అంటూ ఒక వేశ్యా శిఖామణి యీ కళింగ రాజ్యంలో వుండక పోతే, భగవంతుడి సృష్టికి యంత లోపం వచ్చి వుండును? ”. అంటాడు.  .నిజఁవే. కళింగ రాజ్యానికి సాహితీ లోకం లో ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన విదుషీ మణి  ( పాత్ర )  వేరొక్కటి లేదు. తనని  సృష్టించిన  గురజాడ మహాకవినే అబ్బురపరచేటట్లు రూపు దిద్దుకున్న పాత్ర మధురవాణి. నాటకం సప్తమాంకంలో లుబ్దావధాన్లు మీద బనాయించ బడ్డ దొంగ కేసు ముడిని ఎలా విప్పాలా అని సతమతమౌతున్న సౌజన్యారావు పంతులు గారికి ఆ విషయంలో సాయం చేసి ఆయన మెప్పు వడసి బహుమతిగా భగవత్గీత పుస్తకాన్ని అందుకుని కృతార్థురాలను అంటూ సెలవు తీసుకుంటుంది. అంతే ఆమె ఇక మరి మనకు కన్పించదు. ఇది జరిగింది విశాఖ పట్నంలోనే. మధుర వాణి (పాత్ర) చిరంజీవి కనుక  విశాఖ సాగర తీరంలోనే నడయాడుతూఉందేమో?
                                                           ***
కళింగ రాజ్యానికి మధుర వాణి  అనే ఒక వేశ్యా శిఖామణి  ఇంత పేరు సంపాదించి పెడితే, ఆ కళింగ రాజ్యంలో  ఒక నగరమణి  గా వెలుగుతున్న నగరం  మా  విశాఖ పట్నం. ఈ విశాఖ పట్నం లేక పోతే  అప్పటి కళింగ రాజ్యంలోని భాగమైన  ఇప్పటి మా ఉత్తరాంధ్ర కే కాదు, యావత్తు ఆంధ్ర దేశానికే తీరని లోటని వేరే చెప్పాల్సిన పని లేదు. తూర్పు తీరంలో  ఆంధ్ర దేశంలో వెలసిన అతి సుందరమైన నగరం ఇది. ఈ విశాఖ పట్నానికి  మనకు తెలిసి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ముందుగా ఈ ఊరికా పేరు ఎలా వచ్చిందో తెలుసుకుని  తరువాత చరిత్రలో అక్కడ జరిగిన సంగతులూ ఇతర విశేషాలూ తెలుసుకుందాము.
                                                           ***
 విశాఖ పట్నానికి ఆ పేరెలా వచ్చిందో చెబుతూ Gazetteer of  the Vizagapatam District , చాలా కాలం క్రితం ఒక ఆంధ్ర రాజు   కాశీ వెళుతూ దారి లో ఇక్కడ మజిలీ చేసాడనీ ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశుడై ఈ తీరంలో వైశాఖేశ్వరు (కార్తికేయు )డికి ఇప్పటి Lawsons Bay కి దక్షిణంగా ఉన్న ప్రాంతంలో ఒక ఆలయం నిర్మించాడని  అంటుంది. ఈ విషయంలో ఇంకా స్పష్టంగా వివరాలను అందజేసిన కళింగ రాజ్య చరిత్ర  కులోత్తుంగ చోళ దేవ చక్రవర్తి( కీ.శ.1070-1119) , గంగ వంశపు రాజన అనంత వర్మ కళింగ రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు దండెత్తి వచ్చి ఈ ప్రాంతాన్ని లోబరచుకుని, సింహాచలమునకు నాలుగు క్రోసుల దూరములో ఈ విశాఖేశ్వరమూర్తిని ప్రతిష్టించి నట్లు చెబుతోంది. కొంత కాలం పాటు ఈ ఊరు కులోత్తుంగ చోళ పట్టణ మని కూడా పిలువ బడేదట. ఈ విధంగా వెలసిన  విశాఖేశ్వరుని పేరు మీదుగా ఇక్కడ ఏర్పడిన పట్టణానికి  విశాఖ పట్టణమనే పేరొచ్చింది. ధీనినే       17 వశతాబ్దపు  పూర్వార్థంలో ఇక్కడికి చేరుకున్న  ఇంగ్లీషు వారు సంక్షిప్తీకరించి వైజాక్ అనీ వైజాగ్ అనీ పిలువనారంభించేరు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర వాసులు దీనిని వైజాగ్ అనే ముద్దుగా పిలుచుకుంటారు. ఈ పట్టణానికి ఈ పేరు తెచ్చిన విశాఖేశ్వరునితో పాటు ఆయన ఆలయమూ  కాల గర్భంలో సముద్రంలో కలిసి పోయింది. 1750 ప్రాంతంలో తయారు చేయబడిన ఈ ప్రాంతపు మ్యాపును చూస్తే   విశాఖేశ్వరుని ఆలయం సముద్ర తీరానికి  సుమారు ఒక మైలు దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంత దూరంలో ఉన్న విశాఖేశ్వరుని ఆలయం  శాశ్వతంగాములిగి పోయిందంటే   సముద్రంలో వచ్చిన పెను ఉప్పెనయే కారణమై ఉండాలి. ఇప్పటికీ  ఆ ఆలయం ఉండే తీర ప్రాంతాన్ని తీర్థపు రాళ్లని  పిలుచుకుంటూ  పర్వ దినాల్లో ఇక్కడి ప్రజలు సముద్ర స్నానాలు చేస్తుండడం విశేషమే.  ఈ ప్రాంతం ఇప్పటికీ  Lawsons bay  అని పిలవబడే ప్రాంతానికి దక్షిణాన ఉంది.
విశాఖ పట్టణానికి ఆ పేరెలా వచ్చిందో తెలుసు కున్నాం. ఆ ప్రాంతపు చరిత్ర టూకీ గా  చెప్పి , అక్కడి విశేషాలూ నా అనుభవాలూ తర్వాత చెబుతాను.
ఈ ప్రాంతం కళింగ రాజ్యంలో ఉంది కనుక, కళింగ దేశాన్ని పాలించిన గాంగ వంశపు రాజులు, తరువాత గజపతుల పాలనలో 16వ శతాబ్ది ఉత్తరార్థం వరకూ ఉంది. ఈ లోగా 1515 ప్రాంతంలో శ్రీ కృష్ణ దేవరాయలు తన జైత్ర యాత్రలో ప్రతాప రుద్ర గజపతిని ఓడించినా అతడు సంధి చేసుకోవడంతో పొట్నూరులో విజయస్తంభాన్ని నాటించి  వెళ్లిపోయాడు గాని  ప్రాంతాన్ని పాలించలేదు.. ఆ తరవాత 1568 లో ఈ ప్రాంతం గోల్కండ  ముసల్మాన్ ప్రభువుల వశమైంది. గోల్కొండ పాలకులు ఢిల్లీ మొగల్ చక్రవర్తులకు సామంతులే అయినా వారికి విధేయులై వర్తించే వారు కారు. గోల్కొండ రాజులు ఈ ప్రాంతాన్ని తమ ఫౌజుదారుల ని నియమించుకుని వారి ద్వారా పరిపాలన కొనసాగించేవారు. ఆవిధంగా నాటి  గంజాం ,విశాఖ పట్నం ప్రాంతాలు అప్పుడు  శిఖాకోల్ (అని పిలువబడే  నేటి శ్రీకాకుళం) ఫౌజుదారు అధీనంలో ఉండేవి. అప్పటి ఫౌజుదారైన షేరుమహమ్మదుతో పాటు వచ్చిన వారే విజయనగరం బొబ్బిలి సంస్థానాధీశుల పూర్వీకులు. ( ఈ షేర్ మహమ్మదు పేరిట ఇప్పటికీ షేర్ మహమ్మదు పురం అనే ఊరు శ్రికాకుళం జిల్లాలో ఉంది.) ఈ ఫౌజుదారులు కూడా స్వయంగా కాకుండా జమీందారుల ద్వారా పరిపాలన కొన సాగించేవారు. ఆవిధంగా విశాఖ ప్ర్తాంతం విజయనగరం జమీందారుల ఏలుబడిలో ఉండేది. 1748 లో దక్కను సుబేదారు మరణంతో కలిగిన వారసత్వ పోరులో బ్రిటిషు వారు ప్రెంచివారు ప్రత్యర్థులను బలపరచగా ఫ్రెంచివారు బలపరచిన సలాబత్ జంగ్ సుబేదారు అయ్యాడు. అందుకు కృతజ్ఞతగా  సలాబత్ జంగ్ 1753 లో ఫ్రెంచి వారికి ఉత్తర కోస్తా లోని నాలుగు పరగణాలనీ  ఇచ్చివేసాడు.. కాని అక్కడి ఫౌజుదారు అధికారాన్ని అప్పగించడానికి ఇష్ట పడక పోవడంతో  కొన్ని ఇబ్బందులనెదుర్కున్నా ఫ్రెంచి జనరల్ బుస్సీ  స్వయంగా వచ్చి 1757 లో ఈ ప్రాంతాల్ని స్వాధీన పరచుకున్నాడు.  ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా 1765లో  మొఘల్ చక్రవర్తి  బ్రిటిష్ కంపెనీ ప్రతినిధి యైన క్లైవ్ కి  అయిదు ఉత్తర పరగణాలనీ ధారాదత్తం చేసేడు. ఈ విధంగా 1765 నుంచి 1947లో మనకు స్వతంత్రం వచ్చే వరకూ  ఈ ప్రాంతం బ్రిటిషు వారి అధీనంలో ఉండేది. అయితే బ్రిటిషు కంపెనీ విశాఖ పట్నంలో నివాసం ఏర్పరచుకోవడం మాత్రం అంతకు చాలా కాలం ముందే  1682 లోనే జరిగింది. ఆ వైనం కొంచం టూకీగా చెబుతాను.
 1682 లో శ్రీకాకుళం ( అప్పటి చికాకోల్)   పరగణా సీర్ లస్కర్ ( ముసల్మాన్ ఫౌజుదారు ) కి ఏడాది కి  4500 రూపాయలు అద్దె చెల్లించే ఏర్పాటు మీద  బ్రిటిష్ కంపెనీ విశాఖ పట్నం ప్రాంతాన్ని కౌలుకు తీసుకున్నట్టు తెలుస్తోంది.  ఆ మరుసటి సంవత్సరం  ఫౌజుదారుకు వెండి ట్రంకు పెట్టె,  ఖరీదైన మద్యం, 15 మణుగుల గంధపు చెక్కలు, తుపాకి మందు వంటి కొన్ని బహుమానాలనిచ్చి విశాఖ పట్టణ ప్రాంతం లో వారు ఫాక్టరీ కట్టుకునేందుకు అనుమతినీ, వారి సరుకులమీద పన్నుల మినహాయింపు వంటి అదనపు సౌకర్యాలను పొందారు. అయితే కొద్ది కాలానికే  1689 లో బ్రిటిష్ కంపెనీ వారికీ  మొగల్ ప్రభువైన ఔరంగజేబుతో పడక పోవడంతో అతడు కంపెనీ వారి ఆస్తులన్నిటినీ స్వాధీనం చేసుకుని వారిని తన రాజ్యంనుంచి తరిమి కొట్టమని హుకుం జారీ చేసాడు.  చికాకోల్ ఫౌజ్ దార్ పంపిన  రాచవారు విశాఖ పట్నంలో ఉన్న  ఫాక్టరీలోని   బ్రిటిష్ వారిలో ముగ్గరిని చంపి మిగిలిన వారిని బందీలుగా తీసుకుని  వారి ఆస్తులను స్వాధీన పరచుకున్నారు. ఆ తరువాత 1690 లో తిరిగి ఔరంగజేబుకూ, బ్రిటిష్ వారికీ సఖ్యత చేకూరడంతో విశాఖ లోని వారి కంపెనీ ఆస్తులన్నీ తిరిగి వారి స్వాధీన మయ్యేయి.
1711 ప్రాంతం లో ముస్లిమ్ ప్రభుత్వానికి, బ్రిటిష్ కంపెనీ విశాఖ పట్నం దాని చుట్టుపక్కల గ్రామాలకు గాను చెల్లించే కౌలు సంవత్సరానికి 4862 రూపాయలు ఉండేది. దానికి బదులుగా కంపెనీ వారు ఉప్పు సారాయి తయారు చేసుకునేందుకు అనుమతీ, ఇతర సరకులు అమ్ముకునేందుకూ, సముద్రం ద్వారానూ భూ మార్గంలోనూ చేసే వ్యాపారాల మీద సుంకాలు వసూలు చేసుకునే హక్కునీ పొందేరు.
ఉత్తర దక్షిణంగా ప్రవహిస్తున్న ఉప్పుటేరు తూర్పుకి తిరిగి సముద్రంలో కలిసే చోట దానికీ సముద్రానికీ మధ్య ఒక మైలున్నర పొడవు 600 గజాల వెడల్పూ ఉన్న భూ బాగంలో బ్రిటిషువారు తమ కోటని నిర్మించుకున్నారనీ దానికి దక్షిణాన చిన్నగ్రామం ఉత్తరాన 300 గజాల దూరంలోనే   పట్నమూ ఉండేవని తెలుస్తోంది. కోట ప్రాంతంలో 50 మంది బ్రిటిషర్లు నివాసం ఉండేవారు. కోట రక్షణ కోసం 150 మంది  బ్రిటిష్ వారు 300 మంది సిపాయీలు ఉండేవారట.
1753లో ఫ్రెంచివారికి నాలుగు ఉత్తర పరగణాలు ముస్లిమ్ ప్రభువులు ధారాదత్తం చేసిన సంగతి చెప్పుకున్నాం. అయితే ఈ ప్రాంతం వారి స్వాదీనంలోకి రావడం మట్టుకు 1757 ఫ్రెంచి జనరల్ బుస్సీ స్వయంగా దండెత్తి రావడం తోనే సాధ్య      పడింది. ఈ సమయం లోనే బ్రిటిషు కంపెనీ వారి ఆస్తులను అతడు స్వాధీన పరచుకుని వారిని బందీలుగా తీసుకపోయాడు. తిరిగి 1765 లో క్లైవు మొఘల్ చక్రవర్తి నుంచి ఈ ప్రాంతాన్ని ఈనాముగా పొందడం గురించి ముందే చెప్పాను.. ఆ విధంగా బ్రిటిష్ సామ్రాజ్యం   వేళ్లూనుకున్నాక, తొలిసారిగా  ఈ ప్రాంతానికి విశాఖ పట్టణం  జిల్లా ముఖ్య పట్టణంగా 1769 లో అవతరించింది.
 విశాఖకి సంబంధించిన మరికొన్ని కబుర్లు విశేషాలు నా అనుభవాలూ.. మరోసారి చెబుతాను. సెలవు.
                                                                 ***


                                                                         

11, మే 2012, శుక్రవారం

నేను అసలు సిసలు పదహారణాల ఆంధ్రుణ్ణి...


                  
ఇంతకు ముందు నేను వ్రాసిన ( మడి బట్ట కట్టి తెలుగును కాపాడుకోగలమా? Dtd. 21-2-12,  మడీ తడీ .గోదావరీ..Dtd 7-4-12 ) ,అనే రెండు భాషా వ్యాసాల్లో తెలుగు భాష ఏ నాడూ మడి కట్టుకుని కూర్చో లేదనీ అనేక మైన అన్య భాషా పదాలు తెలుగులో అవసరంగానూ,అనవసరంగానూ వచ్చి చేరాయనీ వ్రాసేను. నన్నయగారి భారతాంధ్రీకరణంతో మొదలై అనేక సంస్కృత పదాలు మన కావ్య భాషలో వచ్చి చేరాయి. అంతటితో ఆగకుండా మన తెలుగుపండితుల సంస్కృత భాషా దురభిమానం వల్ల అవి మన వ్యవహారిక భాషలో కూడా వచ్చి చేరాయి. ఆవిధంగా అచ్చ తెలుగు చాలా మట్టుకు కనుమరుగై మన భాష తత్సమ తద్భవ పద భూయిష్టమై పోయింది. ఆ తర్వాత నవాబుల పాలన తెలుగు దేశం అంతా విస్తరించి నప్పుడు అంతకు ముందు వాణిజ్య వ్యవహారాల మూలంగా తెలుగులో కొద్ది కొద్దిగా చేరిన పార్శీ అరబ్బీ పదాల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. 14 వ శతాబ్దంలోని తిక్కన భారతంలోనే త్రాసు అనే పదం కనిపిస్తుంది. ఆ తర్వాత కాలంలో శ్రీ నాధుని కవిత్వంలో ఎన్నో పార్శీ అరబ్బీ పదాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత పాలవేకరి కదరీ పతి, పొన్నిగంటి తెలగనార్యుడు,గోగుల పాటి కూర్మనాథ కవి ..   ఒకరేమిటి... ఎందరో కవులు  పారశీక పదాల్నీ,పదబంధాల్ని కూడా నిరభ్యంతరంగా తమ కవిత్వంలో వాడుకున్నారు. కావ్యాల్లోనే అన్ని అన్య భాషా పదాలు చేరాయంటే జన వ్యవహారంలో మరెన్ని ఉండేవో ఊహించుకోవడం కష్టం కాదు. అలా తెలుగులో పార్శీ అరబ్బీ పదాలు తిన్నగానూ,ఉర్దూ ద్వారాను తెలుగులో చేరి అవి మన తెలుగు పదాలేనేమో అని భ్రాంతి కలిగించే విధంగా మనకు అలవాటై పోయాయి. కొన్ని పదాల విషయంలో నైతే వాటికి సమానార్థకాలైన తెలుగు పదాలు ఏమై ఉంటాయో మనకు వెంటనే తట్టని పరిస్థితి ఏర్పడింది. ఇలా తెలుగులో  చేరిన ఈ పదాలేమిటో చూపిస్తాను చూడండి:
ఈ వ్యాసం శీర్షిక లో ఉన్నట్టు నేను అసలు సిసలు పదహారణాల ఆంద్రుణ్ణి..కల్తీ లేని తెలుగే  మాట్లాడతాను అని ఎవరైనా అన్నారనుకోండి. ఇందులో అసలు మనది కాదు సిసలు మనది కాదు అణాలూ మనవి కావు. ఆంధ్ర శబ్దం సంస్కృత భవం. ఇంక కల్తీ కూడా తెలుగు పదం కాదు. ఎక్కడైనా ఈ పార్శీ (ఉర్దూ) పదాల్ని వాడకుండా మనకి రోజు గడవదు.దినము అనము రోజు అనే అంటాము. రోజుమనది కాదు. రోజువారీ వాడుకలో కనిపించే రైతు జమీందారు,ఖర్చు  ఖైదు,ఫిర్యాదు,కబురు,బజారు,దుకాణము,గాబరా ,ఖాయం పాగా,అర్జీ,దాఖలా,దావా,ఖాళీ, జాగా,ఖజానా హద్దు లూటీ ఈనాము మేకు నగదు జేబు రుమాలుభరోసా నౌఖరీ దమ్ము గాభరా జులుము అజమాయిషీ బదిలీ సలహా సజావులాంటివి ఎన్నెన్నో పార్శీ పదాలు.. ఎన్నని చెప్పను.. చాలా ఉన్నాయి కానీ.. సరదాగా మన సినీకవులు వాడినవి చూపిస్తాను చూడండి:
ఖుషీ ఖుషీగా నవ్వుతూ ..చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా అంటాడు దాశరథి. ఇందులో ఖుషి చలాకీ హుషారు నిషా ఏవీ మనవి కావుకదా ?
కార్మిక ధీరుల కన్నుల నిండా కణకణమండే గలగలతొణికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు  ఖరీదు కట్టే షరాబులేడంటాడు శ్రీశ్రీ. ఖరీదు షరాబు పదాలు మనవి కావు.
పైలా పైలా పచ్చీసు.. అంటాడు ఆరుద్ర. వయసుకి హుషారు తెప్పించే మాటలివి.
జోరుగా హుషారుగా షికారు పోదమా.. అంటే ఇవేవీ మనవికావు.
ఇవన్నీ లేక పోతే మనకి కులాసా లేదు కదా అదీ మనది కాదుకదా?
మన పండితులు కూడా నిరభ్యంతరంగా  అన్య దేశ్యాలని వాడే వారు ఉదాహరణకి వారు ఛప్పన్నదేశాలూ అనే వారు. యాభై ఆరు అని అర్థం వచ్చేఈ ఛప్పన్న పదం మనది కాదు.
ఇక్కడొక విషయాన్ని చెప్పక తప్పదు. తెలుగు నాట ఆంధ్ర ప్రాంతంలో నివసించే వారికి వారిది కల్తీ లేని స్వఛ్ఛ మైన తెలుగనీ తెలంగాణ ప్రాంతంలోని తెలుగులో ఉర్దూ మాటలు ఎక్కువ గా కలిసి ఉంటాయనీ ఒక భావన.ఇది పూర్తి నిజం కాదు. కొంచెం తర తమ భేదా లున్నాయంతే. ఆంధ్రప్రాంతంలో కూడా 1750 ప్రాంతంలో ఫ్రెం చి వారికి ఐదు పరగణాల్ని ధారా దత్తం చేసే వరకూ నిజాము ఏలుబడి ఉండడంతో ఆ ప్రాంతంలో కూడా పార్శీ ఉర్దూ పదాలు తెలుగులో ఎక్కువ గానే చేరాయి. తర్వాత చాలా కాలం నిజాము ఏలుబడిలో ఉండడం వల్ల తెలంగాణ లో ఉర్దూ ప్రభావమూ ఆంద్ర ప్రాంతంలో ఆంగ్ల బాషా ప్రభావమూ ఎక్కువ గా కనిపిస్తాయి. ఇప్పటికీ వెతుక్కుంటే తెలంగాణ పల్లెల్లోనే  అచ్చ తెలుగు పదాలు మిగిలిన ప్రాంతాల కంటె ఎక్కువగా దొరుకుతాయి. ఏ ప్రాంతం లోనూ కల్తీ లేని తెలుగంటూ లేదు.
వందేళ్ల క్రిందటే ఉత్తరాంధ్రకి చెందిన గురజాడ వారు తమ కన్యా శుల్కంలో తమ పాత్రల ద్వారా ఎన్నో ఉర్దూ పదాల్ని పలికించారు. ఆడ వాళ్లని అట్టే "రుకాయించ" కూడదంటాడు కరటక శాస్త్రులు. రోక్నా అనే పదం నుంచి వచ్చినదిది. రూపాయల్ని"ఫిరాయించి" ఇస్తానంటాడు రామప్ప పంతులు. ఇంకా జరూరు,మజా, మగ్దూర్,చాడీకోరు,సిఫారసు, బనాయించడం,నాజూకు లాంటి వెన్నెన్నో కనిపిస్తాయి. పాత్రోచితమైన భాష అన్న తర్వాత జన బాహుళ్యంలో ఉన్న పదాలే కదా ఇవి?
కొన్నేళ్ల క్రితం మన ప్రమఖ దిన పత్రిక లో పెద్దల సభలో గలాభాఅంటూ పతాక శీర్షికలో వార్త వచ్చి పత్రికాధిపతిని సభ వారికి క్షమాపణ చెప్పుకునే టట్లు చేసింది. ఈ గలాభా మన తెలుగు పదం కాదు.పార్శీ నుంచి వచ్చింది.
బాల వ్యాకరణానికి రమణీయం అనే రమణీయమైన వ్యాఖ్య వ్రాసిన దువ్వూరి వారు ఆ గ్రంథంలోనే పసందు అనే మాటని వాడేరు. తెలుగు మాట కాకపోయినా బలే పసందుగా ఉంది కదూ?

పండితులకే లేని అభ్యంతరం మనకెందుకు? వారికి లేని మడి మనకేల?
                                                    ***
ఉన్నమాట చెప్పితీరాలి. నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. అచ్చతెలుగు పదాలు అంతకు ముందు తెలియనివి ఎక్కడై నా చూస్తే మురిసి పోతాను. కొత్త పదాలు అచ్చతెలుగువే వస్తే మంచిదే ఆనంద దాయకమే. ( ఈ మాట లో సం.వెం. రమేశ్ గారి తెలుగు వ్యాసాలు నన్ను మురిపించాయి. ఆయన చెప్పినట్టు తెలుగు ధాతువులతో కొత్తపదాల్ని సృష్టించుకోవచ్చు.  కానీ అవి జనానికి పట్టవు. కొత్తగా వస్తున్న పరికరాలకి  అంగ్ల భాషా పదాలకి బదులుగా తెలుగు మాటల్ని సృష్టించాలనే వారు కూడా సంస్కృత మూలాల్ని ఉపయోగించి తయారు చేస్తున్నారు. వారికి సంస్కృతం దేవబాష. ఆంగ్లం మ్లేఛ్ఛ భాష. అసలు మ్లేఛ్ఛులంటే ఉచ్చారణ సరిగా రాని వారని అర్థం. సంస్కృత  పండితుల దృష్టిలో తెలుగు మ్లేఛ్ఛ భాష అది మాట్లాడే మనమూ మ్లేఛ్ఛులమే. పదాల్ని ఎరువు తెచ్చుకోవలసి వచ్చినప్పుడు అది అప్పటికే జన బాహుళ్యంలో అలవాటయిన పదాన్నే( అది ఏ భాషయినా సరే) తెచ్చుకుని అజంతం చేసుకుని తెలుగు పదంగా మార్చుకుందాం. లేని పోని మాటలు సృష్టించి తెలుగు మాట్లాడ డాన్ని క్లిష్టతరం చేయవద్దు. ఉదా హరణకి ఇప్పటికే వాడుక లో ఉన్న Pen-drive (పెన్ డ్రైవు) అనే వదానికి తెలుగు మాటని తయారు చేసి జనామోదంతో దాన్ని వాడుకునేటట్టు చేయగలమా? నాకైతే నమ్మకం లేదు. ఆ అవసరమూ కన్పించదు.
                                                 ***
 ఇంతకు ముందు పోస్టులో ఈ పార్శీ ఉర్దూ పదాలగురించి వ్రాస్తానని చెప్పాను. అంటే నేను మీకు బాకీ ఉన్నట్టు. ఆ బాకీ ఇప్పుడు తీరి పోయింది. (ఈ బాకీకూడా పార్శీ పదమే). సెలవు..
                                              ****

4, మే 2012, శుక్రవారం

నరసింహ..నీ దివ్య నామము..2(నృసింహ జయంతి సందర్భంగా)



                                 నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత....2

 నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత  అనే క్రిందటి వ్యాసంలో  శ్రీ ధర్మపురి శేషప్ప గారిని,  వారి నరసింహ శతకం లోని కొన్ని పద్యాలనూ పరిచయం చేసాను. శ్రీ శేషప్పగారి గురించి మనకు ఎక్కువ వివరాలు తెలియక పోయినా అతడు అమాయకుడనీ, పెద్దగా గ్రంథాలు చదువుకున్నవాడు కాడనీ అందరూ అతని దైన్యాన్ని చూసి అపహసించేవారనీ అయినా  అతడవేమీ పట్టించుకోకుండా ధర్మపురి నరసింహ స్వామికి వీర భక్తుడై  మెలిగే వాడనీ అతని రచన వల్లనే మనకు తెలుస్తుంది.  అతడు  నరసింహ శతకం కాకుండా ఇంకేమైనా రచనలు చేసి ఉండి ఉంటే ఆ వివరాలు మనకు తెలియవు.   ఈ రోజు ( 4.5.2012) నృసింహ  జయంతి సందర్భంగా
 ఈ శతకం లోని చక్కని ధారాశుధ్ది కలిగిన ఆయన పద్యాలు మరికొన్ని  పరిచయం చేస్తున్నాను.

ఈ కవికి ఇహసౌఖ్యాలమీద మనసులేదు. మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదనీ అలాగే వెళ్లేటప్పుడుకూడా ఏమీ తీసుకుపోలేమనీ ధర్మం చేయకుండా దాచిన సొమ్ము దొంగలపాలో లేక రాజుల పాలో అవుతుందనీ ఎలా చెప్పాడో చూడండి:
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్లిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మ్రింగబోడు
విత్తమార్జనముచేసి విఱ్ఱవీగుటెగాని కూడబెట్టిన సోమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమిలోపలబెట్టి దానధర్మము లేక దాచి దాచి
తుదకు దొంగల కిత్తురో దొరలకగునొ  తేనె జుంటీగలియ్యవా తెరువరులకు
భూషణవికాస శ్రీధర్మపురనివాస దుష్టసంహార నరసింహ దురితదూర
(తెరువరులు =బాటసారులు)

ఈ కవిగారికి సామాన్య భక్తులు చూపించే వేషభాషాటోపముల మీద నమ్మకం లేదు. సద్గురుని సేవించడం తప్ప వేరే ముక్తిమార్గం లేదని నిక్కంగా నమ్మిన వాడు. ఆవిషయం ఎలా చెప్పాడో చూడండి:

జందెమింపుగ వేసి సంధ్య వార్చిన నేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీ చూర్ణ గురురేఖలిడినను విష్ణు నొందక కాడు వైష్ణవుండు
బూదిని నుదుటను బూసుకొనిన నేమి శంభు నొందక కాడు శైవజనుడు
కాషాయ వస్త్రాలు గట్టి కప్పిన నేమి యాశ పోవక కాడు యతివరుండు
ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన గురుని జెందక సన్ముక్తి దొరకబోదు
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర
(యతి వరుడు=ముని శ్రేష్టుడు)
ఆరోగ్యంగా వయసులో ఉన్నప్పుడు సమయమంతా ధనార్జనలోనూ భోగ లాలసతోనూ గడిపేస్తే మరణకాల మాసన్నమైనప్పుడు దైవ నామ స్మరణ చేయాలనుకున్నా శరీరం సహకరించక పోవచ్చునంటూ అతడు చెప్పిన పద్యం చూడండి ( ఇది కంచెర్ల గోపన్న దాశరథీ శతకం లోని ముప్పున కాల కింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ, మీ స్మరణ కల్గునొ కల్గదో నాఁటి కిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణా పయోనిధీఅన్న పద్యాన్ని గుర్తుకు తెస్తుంది.

బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పనుగాని మరణ కాలమునందు మరతునేమొ
ఆ వేళ యమదూతలాగ్రహంహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫవాత పైత్యముల్ గప్పగా భ్రమ చేత గంపముద్భవమంది కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా యంచు బిలుతునో శ్రమ చేత బిలువ లేనొ
నాటి కిప్పుడె చేసేద నీ నామ భజన తలచెదను జెవిని వినవయ్య ధైర్యముగను
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర

అనంత జీవకోటికీ బ్రతుకుతెరువు చూపించిన దయామయుడైన నారాయణుణ్ణి పొగిడే
 ( నీటిలోని చేప కెవడు ఈత నేర్పెనూ.. అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెనూ.. అన్న మన సినీ కవి గారికి స్పూర్తి నిచ్చిన ) ఈ క్రింది పద్యం చూడండి:

అడవి పక్షుల కెవ్వ డాహార మిచ్చెను మృగజాతి కెవ్వడు మేత బెట్టె
జలచరాదులకు భోజన మెవ్వడిప్పించె చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసె
స్త్రీల గర్భంబులన్ శిశుల నెవ్వడు పెంచె ఫణుల కెవ్వడు పోసె బరగ పాలు
మధుపాళి కెవ్వండు మకరంద మొనరించె బసుల కెవ్వడొనరించె బచ్చి పూరి
జీవకోట్లను బోషింప నీవె కాని వేఱె యొక దాత లేడయ్యె వెదికి చూడ
 భూషణ వికాస శ్రీ ధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర
( పచ్చి పూరి= పచ్చ గడ్డి)
ఇలా ఎన్నో మంచి మంచి పద్యాలు ఇంకా ఉన్నాయి గాని  భక్తి పారవశ్యంతో భగవంతునితో తాదాత్మ్యం చెందిన
భక్త శిఖామణి ఆయనతో తగవు లాడడానికైనా సిధ్ధపడతాడని తెలియ జేసే ఈ రెండు పద్యాలూ చూడండి:

 మా లాంటి వారికే పూట గడవడం కష్టం గాని, నీకూ నీ పరివారానికీ ఏ ఖర్చూ లేకుండా హాయిగా మంది సొమ్ముతో  బ్రతికేస్తావంటూ శ్రీమన్నారాయణుణ్ణి ఎకసక్కెమాడే పద్యం:
హరి నీకు పర్యంకమైన శేషుడు చాల పవనము భక్షించి బ్రతుకుచుండు
ననువుగా నీకు వాహనంబైన ఖగరాజు గొప్ప పామును నోట గొఱుకుచుండు
నదిగాక నీ భార్యయైన లక్ష్మీదేవి దినము పేరంటంబు దిరుగుచుండు
నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ పెట్టుచుంద్రు
స్వస్థముగ నీకు గ్రాసమ్ము జరుగుచుండ గాసు నీ చేతదొకటైన గాదు వ్యయము
భూషణ వికాస శ్రీ ధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము ..ఎవడబ్బ సొమ్మని కులుకుతూ ఉన్నావు..” అంటూ శ్రీ రామచంద్రుణ్ణి గోపన్న దండించినట్లుగా, ఇన్నాళ్ళూ నీ సేవ లోనే జీవిత మంతా గడిపేను  అందుకు నాకు ప్రతిఫలంగా జీతమేమీ ఎందుకివ్వలేదంటూ  నిలదీసే ఈ పద్యం చూడండి:
కువలయశ్యామ నీ కొలువుజేసిన నాకు జీతమెందుకు ముట్టజెప్పవైతి
మంచిమాటల చేత గొంచె మియ్యగ లేవు కలహమౌనిక జుమ్మి ఖండితముగ
నీవు సాధువుగాన నింత పర్యంతంబు చనువుచే నిన్నాళ్లు జరుప వలసె
నిక నేను సహియింప నిపుడు నన్నేమైన శిక్ష జేసిన సేయు సిధ్ధమయితి
నేడు కరుణించకుంటివా నిశ్చయముగ దెగబడెద జూడు నీతోటి జగడమునకు
భూషణ వికాస శ్రీ దర్మవురనివాస దుష్టసంహార నరసింహ దురిత దూర

( భక్తి మార్గం వినా ముక్తి మార్గం లేదంటూ చాటి చెప్పే మన భక్తి శతకాలలో  శేషప్ప నరసింహ శతకం కూడా బహుళ ప్రచారం పొందినదే.  ఇది సరళమైన భాషలో వ్రాయబడడం చేత  సామాన్యులకు సైతం  సుబోధకమై అలరారింది.)

                                                                 ****