22, మే 2012, మంగళవారం

విద్యల నగరం-- మా విజయనగరం


                                         విద్యల నగరం--మా విజయనగరం
మా విజయనగరానికి విద్యలనగరమని దేశమంతటా ప్రఖ్యాతి రావడానికి రెండు కారణాలు చెబుతారు. మొదటిది--విజయనగరం సంస్థానానికి విజయరామ రాజు ఆ తర్వాత ఆనందగజపతి రాజు గారు సింహాసనాధీశులు కావడం అయితే,రెండోది శ్రీ తాతారాయుడుశాస్త్రులుగారూ,ఆదిభట్ల నారాయణ దాసు గారూ ఈ పుర నివాసులు కావడం అంటారు. వారు అసాధారణ ప్రజ్ఞా సంపన్నులు. ఈ విద్యల నగరానికి చెందిన ఒక ముచ్చట చెబుతాను .అవధరించండి:
                                       
ఒకానొక సాయంకాలం 4 గంటల సమయంలో మహారాజు గారూ యువరాజు గారూ మోతీ మహల్ డాబా మీద విహరిస్తూ మాట్లాడుకుంటున్నారు. డాబా పిట్ట గోడమీంచి క్రిందికి దృష్టి సారించిన మహారాజుగారు ఒక్కసారిగా అగ్రహోదగ్రులయ్యారు.ఎవరక్కడఅంటూ కేక వేసేరు. పరిగెత్తుకుని వచ్చిన భటులు మహారాజు గారి  చూపులననుసరించి చూసేరు. ఇంకేముంది. కొంప ములిగింది. మహారాజు గారి ఆగ్రహానికి కారణం తెలిసింది. మూడు ప్రహరీలు దాటి లోపలికి మహల్ వైపు ఎవరో గొడుగు వేసుకుని నడుచుకుంటూ వస్తున్నారు. రాచరికానికి ఎంత అవమానకరంభటులు వెంటనే క్రిందకి పరుగెత్తారు. క్రిందకు చూసిన యువ రాజుగారు ఆ వస్తున్నదెవరో పోల్చుకోగలిగారు. వెంటనే మహారాజు గారితో మహా ప్రభూ...ఆ వచ్చేవారు మనని అగౌరవపరచే వారు కారు. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. వారి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నానుఅని అన్నారు. మహారాజు గారు సౌంజ్ఞ చేయగానే ఆ ఆగంతకుని కాళ్లూ చేతులూ విరగ్గొట్టి తీసుకు రావడానికి వెళ్లిన భటులు వెనక్కి తిరిగి వచ్చేసారు.ఈ విషయం ఏ మాత్రమూ తెలియని ఆ వ్యక్తి నడుచుకుంటూ నేరుగా యవరాజు గారి మందిరం లో ప్రవేశించి హాల్లో కుర్చీలో ఆసీనుడయ్యారు. కొంత సేపటికి అక్కడికి వచ్చిన యువరాజుగారు అయ్యా శాస్త్రులు గారూ నేరుగా కోటలోకి గొడుగు వేసుకునే ప్రవేశించేశారేమిటి?” అని అడిగారు. అందుకు ఆ శాస్త్రిగారుఅబ్బే అదేం లేదే? నేనెప్పుడూ కోట మొదటి ప్రహరీ గుమ్మం దగ్గరే గొడుగు మూసుకుని వస్తానే? ఈ రోజు ఏదో శ్లోకం ఆలోచించుకుంటూ పరధ్యానంగా వస్తున్నాను. ఏదయినా పొరపాటు కాని జరిగిందా?” అన్నారు. దానికి యువరాజు గారు జరిగింది చెప్పి ఆ శ్లోకం సంగతి కనుక్కున్నారు. ఆ తర్వాత రోజూ లాగే వారిద్దరూ సాహిత్య గోష్టి జరుపుకుని తర్వాత యువరాజు గారు తెప్పించిన పాలూ భంగూ(గంజాయి ముద్ద ) కలిసి సేవించి ముచ్చట్లాడుకున్నారు
                                                             ****
ఈ కథలో మహారాజుగారు విజయనగరం రాజా విజయరామరాజుగారు, యువరాజు ఆనందగజపతి గారు.. కవితా ధ్యాన నిమగ్నులై పొరపాటున తెరచిన గొడుగు వేసుకుని కోటలో ప్రవేశించిన పండితులు శ్రీ పేరి కాశీ నాథ శాస్త్రి గారు యువరాజా వారి ఆస్థాన కవీ పండితులున్నూ. వారి తండ్రిగారు శ్రీ పేరి వేంకట శాస్త్రిగారు మహారాజా వారివద్ద ఆస్థాన పండితులు. కోటలోనికి గొడుగు వేసుకుని రావడం అధికార ధిక్కారం. క్షమించరాని నేరం. అయినా పండితుల వారి మనసు గుర్తెరిగిన వారు కనుక వారు క్షమాపణ కోరకుండానే వారికి తెలియనీయకుండానే వారి తరపున తానే మహారాజును క్షమాపణ కోరిన ఆనంద గజపతి ప్రభువుల పాలనలో కవితా సరస్వతికి లభించిన గౌరవం గురించి చెప్పాల్సిన పనేముంది?
                                                                ****
(ఈ వైనాన్ని మనకు తెలియజేసిన శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రుల వారికి కృతజ్ఞతలు)                             

6 వ్యాఖ్యలు:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

నాలాంటి వాళ్ళం ఇంకా మీ విజయనగరానికి గురజాడ,ద్వారం వారు వీరి వల్ల పేరొచ్చిందనుకుంటున్నామండి.

Pantula gopala krishna rao చెప్పారు...

రాజేంద్ర కుమార్ గారూ,విజయనగరం ఖ్యాతిని పెంచిన వారు ఎందరో మహానుభావులు అందులోనిస్సందేహంగా పేర్కొన దగ్గ మహాకవి గురజాడ.ద్వారం వారు సంగీతం కాలేజీలో సీటుకోసం వస్తే ఆయనను అక్కడ లెక్చరర్ గా చేర్చుకున్నారట.ఎంత మేధావి అయి ఉండాలి? అయితే మహా మహోపాధ్యాయ రాయుడు శాస్త్రులు గారినీ నారాయణ దాసు గారినీ పేర్కొంటూ దువ్వూరి వారు చెప్పిన మాటలివి. వారు చెప్పిన దాన్ని మీకందించిన వార్తాహరుణ్ణి మాత్రమే నేను.

పంతుల జోగారావు చెప్పారు...

విజీనారం ముచ్చట్లు బాగా చెప్పారు.

Sudha చెప్పారు...

బంగారానికైనా గోడచేర్పు కావాలి అంటారు.రాజపోషణ కళాకారులకు కళలకు ఊతమిస్తుంది. విజయనగరం రాజులలో కళాకారులపట్ల, కళలపట్ల ఎంత గౌరవం, ప్రేమాభిమానాలుండేవో ఈ సంఘటన ద్వారా తెలుసుకోగలం.విజయనగరానికి గురజాడ,ద్వారంవారు, ఆదిభట్లనారాయణదాసు, కోడిరామ్మూర్తి, ఘంటసాల ఇంకా ఎందరో మహానుభావులు వన్నెతెచ్చారు.విజయనగరంరాజులు కళాకారులకు,కళలకు ఇచ్చన ప్రోద్బలం విజయనగరాన్ని విద్యలనగరంగా పేరుగాంచడానికి కారణమయిందని ఈ వ్యాసరచయిత అభిప్రాయం. అది నిరూపించబడిన సత్యం కూడా.

puranapandaphani చెప్పారు...

ఈ ఉదంతాన్ని తనికెళ్ళ భరణి గారు తన "ఎందరో మహానుభావులు" శీర్షికలోనూ ఉటంకించారు. మంచి విషయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఛాలా చక్కని విషయాలను తెలియ జేశారు. విజయ నగరంలో నేను ౭వ తరగతి చదివిన గుర్తు . [ మానాన్న గారి , ఉద్యోగ రీత్యా విశాఖ , విజయ నగరం అన్నీ తిరిగాము. ] హయ్య కోనేరు తూరుపు గట్టున , ఆంజనేయ స్వామి గుడి దగ్గర .ఉన్నట్టు జ్ఞాపకం. మంచి సంఘటనతో పాటు మళ్ళీ ఒకసారి గుర్తు చేసి కొన్ని ఏళ్ళు వెనక్కి పంపి నందుకు కృతజ్ఞతలు .