27, జూన్ 2012, బుధవారం

నేను చదివిన ఒక మంచి పుస్తకం--ఒక పరిచయం

నేను చదివిన ఓ మంచి పుస్తకంఒక పరిచయం
సరిగ్గా ఒక సంవత్సరం క్రిందట మా చిన్న అల్లుడుగారు వారి మిత్రులైన పబ్లిషర్స్ ఇచ్చేరని చెప్పి నాకు రెండు పుస్తకాలు తెచ్చి ఇచ్చేరు. అవి నాకు చాలా ఇష్టమైనవే. ఆ పుస్తకాల ప్రచురణ కర్తలు శ్రీ రాజాచంద్ర ఫౌండేషన్ వారు. ఆ పుస్తకాలు చూస్తుంటే ఆ ప్రచురణ కర్తలదే మరో పుస్తకం కూడా ఉందని తెలిసింది.  దాని పేరు సురపురంమెడోస్ టైలర్ ఆత్మ కధ. ఇదేదో ఒక ఆంగ్లేయుని ఆత్మ కథ కదా? మనకేమి ఆసక్తిదాయకంగా ఉంటుందిలే అని అదికూడా తెచ్చి పెట్టమని మా అల్లుడుగారిని నేనడుగలేదు. ఈ మధ్య మా అమ్మాయి గారింట్లో ఈ పుస్తకం కూడా చూసి తెచ్చుకుని చదివేను. అవడానికి ఇది ఒక ఆంగ్లేయుని ఆత్మ కథే అయినా, దీనిలో మనకి ఆసక్తి కలిగించే విషయాలు చాలానే ఉన్నాయి. దానికి కారణం  ఈ రచయిత తన జీవితంలో సింహభాగం మనదేశంలోనే మరీ ముఖ్యంగా మన నిజాము రాష్ట్రంలో గడపడం అప్పటి ఇక్కడి మన ప్రాంత పరిస్థితులు ప్రజల జీవన విధానాన్ని గురించి వివరంగా వ్రాయడం. సుమారు రెండువందల సంవత్సరాలకి పూర్వం , మనకి నాలుగైదు తరాలముందు మన తాతల జీవిత స్థితిగతులు ఎలాఉండేవో తెలుసుకోవాలంటే ఇటువంటి పుస్తకాలు చదవడం తప్పని సరి. మనకి చరిత్ర పుస్తకాలు దొరుకుతాయి గాని నాటి సాంఘిక జీవనాన్ని తెలిపే పుస్తకాలు చాలా అరుదుగానే దొరుకుతాయనుకుంటాను. మనలో చాలామందికి ఆరోజులు బంగారు దినాలనీ మనకంటె మన పూర్వులు చాలా హాయిగా సుఖశాంతులతో బ్రతికే వారనీ ఒక అపోహ ఉంది. దీనికి కారణం అప్పటి సంఘం గురించి, రాజ్య వ్యవస్థ గురించి మనకి సరైన సమాచారం లేకపోవడమే. ఈ పుస్తకం మనకా కొరత కొంతైనా తీరుస్తుంది. అందుకే దీనిని పరిచయం చేయాలనుకుంటున్నాను.
ఈ మెడోస్ టైలర్ ఇంగ్లాండు దేశంలో లివర్ పూల్ నగరంలో 1808 సెప్టెంబరులో పుట్టేడు..కొద్దిపాటి స్కూల్ చదువు చదువుకున్నా అది సాగలేదు..చిన్నప్పుడే వాళ్లనాన్న అక్కడ ఇతడిని పనిలో పెట్టాడు. ఇతడికి 16వ యేడు నడుస్తుండగా 1824 లో ఇతడిని  వాళ్ల నాన్న బొంబాయి లో వ్యాపారం చేసే ఒక బ్రిటిష్ సంస్థలో ప్రవేశ పెట్టాడు. ఆ ఉద్యోగంలో చేరడానికి  ఓడలో నాలుగున్నర నెలలు  ప్రయాణించి  సెప్టెంబరు ఒకటి, 1824 సంవత్సరంలో బొంబాయిలో మన గడ్డపై అడుగు  పెట్టాడు. అయితే అతడు ఏ ఉద్యోగంలో చేరుదామని వచ్చాడో ఆ ఉద్యోగంలో చేరలేదు. అప్పట్లో బొంబాయి ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శి అయిన న్యూ హోం,   టైలర్ తల్లిగారికి పెత్తండ్రి కొడుకు. ఆయనని కలుసుకుని ఆయన సలహా మేరకు ఆయన సిఫారసుతో  హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెంటు క్రింద నిజామ్ సైన్యంలో చేరడానికి ఔరంగాబాదు  చేరుకున్నాడు. అక్కడ ఉద్యోగంలో సైన్యంలో లెఫ్టినెంటు హోదాలో  చేరి కవాతు నేర్చుకోవడమే కాకుండా ఒక మున్షీని పెట్టుకుని హిందూస్థానీ కూడా నేర్చుకున్నాడు..అప్పుడక్కడ సేనానిగా పని చేస్తున్న మేజర్ సేయర్ తో  స్నేహం వలన పుస్తకాలు చదవడం చిత్రాలు గీయడం బాగా అలవాటైంది. హిందూ స్థానీ కూడా తొందర గానే నేర్చుకోవడం వల్ల అక్కడ జరిగిన ఒక కోర్టుమార్షల్ లో  దుబాసీగా వ్యవహరించి పై వారి మెప్పుపొందుతాడు. ఆ విధంగా హైదరాబాదు రెసిడెంటు దృష్టిలో పడి హైదరాబాదులో బొలారం కంటోన్మెంటులో వ్యాపార సంస్ధలపై అజమాయిషీ చేసే  సూపరింటెండెంటు పదవిలో కుదురుకుంటాడు.. ఆతర్వాత కొన్నాళ్లకే సదాశివపేటలో అసిస్టెంటు పోలీసు సూపరింటెండెంటుగా ఉద్యోగంలో చేరుతాడు. పదిలక్షల జనాభా 22 వేల చదరపుమైళ్ల విస్తీర్ణంగల ప్రాంతంలో రెవిన్యూ పోలీసు విధులను నిర్వహించవలసి ఉంటుంది.  ఆప్పటి కతనికి పధ్ధెనిమిది సంవత్సరాలు నిండలేదు. ఇక్కడ విధి నిర్వహణలో ఉంటుండగానే ఒకసారి మోమినా బాద్ అనే ఊళ్ళో కల్తీ పిండి అమ్ముతున్న వ్యాపారులపై  జరిమానాలు విధించి కఠిన చర్యలు తీసుకుంటే  వారు హైదరాబాదులోని మంత్రి చందూలాల్ గారికి ఫిర్యాదు చేయడం దానిపై విచారణకుగాను మంత్రి పంపిన అధికారి వచ్చి జేబులు నింపుకుని వెళ్లిపోవడం జరుగుతాయి . తరువాత కొన్నాళ్ళకు హైదరాబాదు వెళ్లిన టైలర్ తో మంత్రి చందూలాల్ ఆ వ్యాపారస్థులను అలాగే పట్టి ఉంచేటట్టయితే నేనో లక్ష గుంజేవాడిని కదయ్యా? అన్నాడట. ఆ రోజుల్లో కూడా లంచగొండితనం  ఎంతగా వ్యాపించి ఉండేదో తెలిపే ఉదంతమిది.
ఆ తర్వాత ఒకసారి అతడు తుల్జాపూర్ లో కేంపులో గుడారంలో ఉండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి అతని పుట్టిన తేదీ తెలుసుకుని చెయ్యిచూసి దీర్ఘాయుర్దాయమనీ త్వరలోనే పెళ్ళవుతుందనీ తక్కువమందే పిల్లలు కలుగుతారనీ అతడి చేతులలో లక్షల ధనం నడుస్తుందనీ అయితే  ధనవంతుడు కాకపోయినా పేదవాడు కాడనీ చెప్పి కొద్ది సేపట్లోనే అతడి జాతకం వేసి తీసుకు వచ్చి అతడు త్వరలోనే ఆప్రాంతాన్ని పరిపాలిస్తాడనీ చెప్పివెళ్తాడు.
అక్కడ ఉన్నప్పుడే గోధుమపిండిలో ఇసుక కలిపి తూకంలో కూడా మోసం చేస్తున్న వ్యాపారస్తులను పిలిచి వారిని ఆ పిండి తినమని ఆజ్ఞాపిస్తే వారు జరిమానా కడతామనీ మళ్ళా ఎప్పుడూ అలాంటి అక్రమాలకు పాల్పడమనీ ఒట్టు వేసుకుని దానికి కట్టుబడి ఉండి వ్యాపారం చేసేవారట.
ఆ రోజుల్లో దొంగలు బందిపోట్లు తమ దొంగ సొమ్ములో జమీందార్లకు వాటాలు పెడుతూ చాలా ఘోరకృత్యాలకు పాల్పడేవారట. ఆ జమీందారులు కూడా హైదరాబాదులో పెద్దల అండదండలను చూసుకుని నిజాం ప్రభుత్వపు ఉత్తర్వులను బేఖాతరు చేసేవారట. రెవిన్యూ శాఖవారు సర్వే పేరు చెప్పి లంచాలు తిని అంతా మోసమే చేసేవారట.
ఒకసారి నారాయణరావనే దుర్మార్గుడు ముగ్గుర్ని చంపి వారి ధనాన్ని దోచుకుంటే టైలర్ ధైర్యంగా వాడి కోట లోకి వెళ్ళి వాడిని బంధించి తీసుకు వస్తాడు. అతడు తనని వదిలి పెడితే లక్ష రూపాయలవరకూ ఇస్తానని  చెబుతాడు. వాడిని శిక్షించడానికి హైద్రాబాదు తీసుకు వెళ్ళి అతడు తన కివ్వజూపిన లంచానికి సాక్ష్యంగా అతడు వ్రాసిన ఉత్తరాన్ని చూపిస్తే మంత్రి చందూలాల్ పగలబడి నవ్వుతూ ఆ లక్ష రూపాయలూ తీసుకోవలసింది. ఇప్పుడా ధనమంతా దాచేస్తారన్నాడట. అయ్యా ఇదీ ఆనాటి పరిస్థితి.
టైలర్ సదాశివ పేటలో ఉంటున్నప్పుడే చాలా ఘోరాలు జరిగేవట. మనుషుల్ని గొంతునులిమి చంపి రస్తాల ప్రక్కన పాతిపెట్టేవారట. ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది ఇళ్లనుండి కొన్నికొన్ని కాలాలలో మాయమైపోతూండేవారట. వీరు మైసూర్ ధార్వార్ బెల్గాం ప్రాంతాలలో సరకులమ్మి తిరిగి వచ్చేటప్పుడు దుస్తులు పాత్రలు వగైరాలు తెస్తూండేవారట. వీరినోకంట కనిపెట్టి ఉండమని టైలర్ తన అసిస్టెంటుని పురమాయిస్తాడు. అప్పట్లో వీరి సంగతి తేలకపోయినా తరవాత వీళ్లూ దారి దోపిడీగాళ్లేనని  తేలిందని టైలర్ వ్రాస్తాడు. బ్రిటిషు వారు తరువాతికాలంలో సరైన పోలీసు వ్యవస్థని నిర్మించక ముందు ఇలాంటి దారి దోపిడీ గాళ్లకు ఏ అడ్డూ ఆపూ ఉండేదికాదు. జమీందార్లతో మిలాఖతై జనాన్ని దోచుకునేవారు.  వీరే ధగ్గులు.
పిండారులు ధగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెనఅని శ్రీశ్రీ గారు చెప్పినది వీరిగురించే.
చాలా కాలం తరవాత ధగ్గులనందరనూ టైలర్ పట్టుకోవడం జరుగుతుంది. టైలర్ దగ్గర ఉండే సైనికుల్లో కొందరు కూడా పారిపోయారట. తర్వాత వారుకూడా ధగ్గులేనని తెలిసింది. ఈ అనుభవాలతోనే టైలర్ తరువాతికాలం లో
 “ The Confessions of a Thug” అనే పుస్తకాన్ని వ్రాయడమూ అది విశేష ప్రాచుర్యాన్ని పొందడమూ జరుగింది.
తర్వాత కాలంలో టైలర్  బొలారంకు బదిలీ అయి హైదరాబాదు రావడం అక్కడ నిజాం తమ్ముడు ముబారిజుద్దౌలా అన్నగారితో గొడవ పడడం అతడిని గోలకొండలో బందీగా ఉంచడం తరువాత టైలర్ అతడికీ నిజాముకీ మధ్య సామరస్యపూర్వకమైన పరిష్కారం కుదర్చడం వంటివి జరిగాయి.
1832 ఆగష్టు 25న సికందరాబాదు చర్చిలో టైలర్ స్నేహితుడైన పామర్ కూతురు మేరీతో అతడికి వివాహమౌతుంది. తర్వాత మూడేళ్లలో ఇద్దరు బిడ్డలు కలిగి చనిపోతారు.
1837 లో అతడికి కెప్టెన్ గా ప్రమోషన్ లబిస్తుంది. టైలర్ అతడి భార్య ఆరోగ్యం బాగుండక ఊటీలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్  జనరల్ విలియం బెంటింగ్ నిజాం సైన్యంలో పని చేసే బ్రిటిష్  వారికి లండన్ వెళ్ళడానికి సెలవివ్వరని   టైలర్ ద్వారా తెలుసుకుని వారికి ఆ సదుపాయం కల్పిస్తూ కౌన్సిల్ ఆమోదాన్ని తెప్పిస్తాడు. ఆ విధంగా లండన్ వెళ్లడానికి వీలు కలిగిన టైలర్ 1838 లో లండన్ వెళ్లి 1841 ఫిబ్రవరిలో తిరిగి హైదరాబాదు చేరుకున్నాడు. 
ఇలా తిరిగి వచ్చాక టైలర్ జీవితంలో ఒక ప్రధాన ఘట్టం ప్రారంభమయ్యింది... అతడు  సురపురం సంస్థానంలో రాజకీయ ప్రతినిధిగా నియమింపబడ్డాడు. ఇక్కడ  ఉద్యోగంలో అతడు పదేళ్లు పనిచేసాడు. అతడా ఉద్యోగంలో చేరేసరికి అక్కడి పరిస్థితులేమీ బాగులేవు. రాజు కృష్ణప్పనాయక్ అకస్మాత్తుగా. చనిపోయాడు అతడికి అప్పటికి ఏడేళ్ల వయసుగల కుమారుడున్నాడు.  రాజుగారి తమ్ముడు పెద్దినాయక్. రాజకుమారునికి యుక్తవయసు వచ్చే వరకూ తాను రాజప్రతినిధిగా వ్యవహరించడానికి గవర్నర్ జనరల్ ఆమోదం పొందాడు.. కానీ  రాణి ఈశ్వరమ్మ ఈ ఏర్పాటును దౌర్జన్యంగా వ్యతిరేకించబూనుకుంటుంది. సైనిక చర్యతో ఆమెను దారికి తీసుకురావచ్చును కాని అప్పట్లో బ్రిటిషువారికున్న అనేక ఇబ్బందుల వల్ల టైలర్  ఈ సమస్యని సామరస్యంగానే పరిష్కరించవలసి వస్తుంది. రాణి ఈశ్వరమ్మ వ్యభిచారియై చినబసప్ప అనే అతడితో కులుకుతూ ఉంటుంది. అతడి ప్రోద్బలంతో టైలర్ అంతు చూడాలని కూడా ఆనుకుంటుంది. కానీ అవేమీ సాగవు. అయినా ఆమె చాలా కనికరం గలదనీ బీదలంటే ఎంతో ప్రేమ చూపించేదనీ టైలర్ అంటాడు. ఆమెకు తనకుమారుడు 24 ఏళ్ళునిండకుండానే చనిపోతాడని అతడి జాతకంలో వ్రాసి ఉందని భయం పట్టుకుంటుంది. అతడి తర్వాత
సంస్థానం  ఏమయిపోతుందోనని దిగులు పడుతుంటుంది.. రాజకుమారుని జాతకాన్ని నాసిక్, కాశీ పంపించామనీ అందరూ అదే మాట చెప్పారనీ ఎవరైనా వేరే మాట చెబుతారేమోనని లక్ష రూపాయలు ఖర్చు పెట్టాననీ రాణి చెబుతుంది. అక్కడి వారి పురోహితుడుకూడా టైలర్ తో అదేమాట చెబుతాడు.
తరువాత అక్కడ సంస్థానంలో జరిగిన ఎన్నో సంఘటనలను టైలర్ వివరిస్తాడు. 1844 లో టైలర్ కు భార్యా వియోగం సంభవిస్తుంది. 1854లో  జూన్ 30న  యుక్త వయసు వచ్చిన రాజకుమారుని సంస్థానానికి పట్టాబిషిక్తుడిని చేస్తాడు అంతకుముందు మే నెలలోనే రాణి ఈశ్వరమ్మ కూడా మరణిస్తుంది.
తరువాత 1857 లో సిపాయీల తిరుగుబాటు జరిగినప్పటి దేశపు అల్లకల్లోల పరిస్థితుల్ని టైలర్ చక్కగా వివరిస్తాడు. బ్రిటిషర్లందరూ భయభ్రాంతులై ఉంటారు. టైలర్ కి కూడా ప్రాణహాని ఉండేది కాని అక్కడి ప్రజలకు అతడిమీద ఉన్న ప్రేమతో  మహదేవ బాబా అని పిలుచుకుంటూ కాపాడుతుంటారు.. 1857లోనే  సురపురం రాజా చెడు సలహాలను విని  తిరుగు బాటు ప్రయత్నం చేసి ఫలించక బ్రిటిషువారి బందీగా హైదరాబాదు తీసుకు రాబడతాడు. అక్కడ అతడిని చూడడానికి వచ్చిన టైలర్ తో  అతడి  సలహాలను చెవిని బెట్టక పాడయిపోయినానని వాపోతూ తనకు శిక్ష తప్పదనీ అయితే  సాధారణ ప్రజల్లాగా ఉరితీయకుండా తనను పేల్చి వేసేటట్లు చూడమనీ కోరుకుంటాడు. సురపురం పాలనా వ్యవహారాలు చూడడానికి టైలర్ మళ్లా సురపురం వస్తాడు. అక్కడ ఉంటుండగా రాజుకు ఉరిశిక్ష వేసేరనీ దానిని రెసిడెంటు యావజ్జీవ శిక్షగా మార్చగా, గవర్నర్ జనరల్ దానిని నాలుగేళ్ళకు తగ్గించాడనీ తెలుస్తుంది. 24 వ యేట మరణిస్తాడనుకున్న రాజుకి ఉరిశిక్ష తప్పినందుకు టైలర్ సంతోషిస్తుండగా సురపురం పురోహితుడు మాత్రం జాతకం తప్పదనే నమ్మకంతో ఉంటాడు. వారిలా ఉండగా రాజు ని చెంగల్పట్టు తీసుకు వెళ్తున్నారనీ అక్కడ బందీగా ఉండే ఆయనతో పాటుగా రాణులూ ఆయన పరివారం కూడా ఉండవచ్చనీ నాలుగేళ్లు సరిగా వ్యవహరిస్తే అతడి రాజ్యాన్ని తిరిగి అతడికి ఇచ్చివేయవచ్చనీ తెలుస్తుంది .రాణులూ పరివారం రాజును చెంగల్పట్టు తీసుకు వెళ్లే దారిలో కర్నూలులో కలుసుకుందికి ఏర్పాట్లు జరుగుతాయి.
.రాజపురోహితుడు మాత్రం ఆపత్కాలం ఇంకా మించిపోలేదనీ భయపడుతూనే ఉంటాడు. ఇంతలో హైదరాబాదు రెసిడెంటునుంచి రాజకుమారుడు  ఉదయం తన ప్రయాణపు మొదటి మజిలీలో పిస్తోలుతో పేల్చుకు చనిపోయాడు అనే వర్తమానం అందుతుంది. రాజకుమారునికి 24వ ఏడు గడవనే లేదు.ఆ భయంకరమైన జోస్యం అలా ఫలించింది అంటాడు టైలర్. తాను విద్యా బుద్ధులు గరపి పెద్దవాణ్ణి చేసిన రాజకుమారుడు ఈ విధంగా మరణించడం పట్ల టైలర్ చాలా బాధ పడతాడు..
 టైలర్ విషయంలో కూడా తుల్జాపూర్ బ్రాహ్మడు ఆ ప్రాంతాన్ని ఏలతావని చెప్పిన జోస్యం నిజమైంది కదా?
                                                     ***
1859 లో సెలవు మీద లండన్ వెళ్లిన టైలర్ అనారోగ్యం  కారణంగా అక్కడే ఉండిపోయి ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. అక్కడ రచనా వ్యాసంగంతో కాలం పుచ్చుతూ  మన ప్రాంతాలను చూడాలన్న కోర్కె చంపుకోలేక తిరిగి 1875 సెప్టెంబరు 12న బయల్దేరి తన కూతురు సాయంతో హైదరాబాదు వస్తాడు. హైదరాబాదులో ఉండగా ఎందరో వచ్చి ఆయనను కలుసుకుని పాదాభివందనం చేసి వెళ్లేవారని అతని కుమార్తె అంటుంది. సురవరం నుంచి వచ్చిన ఒక స్నేహితుడు అప్పటికీ (అంటే 1875 నాటికికూడా) సురపురంలో స్త్రీలు ధాన్యం దంచుకునే టప్పుడూ దీపం వెలిగించుకునే టప్పుడూ టైలర్ సాహెబుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారని తెలియజేస్తాడు. 1876 మార్చిలో తిరుగు ప్రయాణమై జెనీవా దగ్గర మెంటోన్ అనే వూళ్లో టైలర్ మరణిస్తే ఆయనను అక్కడే ఖననం చేశారట. ఈ విషయాలను పుస్తకం ఆఖరు అధ్యాయంలో అతని కుమార్తె చేర్చింది.
                                                     ***
టైలర్ మన దేశంలో ఉండగా తాను పని చేసిన ప్రాంతాల్లో చెరువులు బాగు చేయించి ఎంతో భూమిని సాగులోకి తీసుకు రావడం రోడ్లు వేయించడం వాటిప్రక్కన చెట్లు నాటించడం వంటి మంచి పనులు చేసాడు. తనకున్న అరకొర పరికరాల్తోనే భూమిని సర్వేచేసి భూముల హద్దులు నిర్ణయించి వాటిని కౌలుకిప్పించి సాగు చేయించడం చేసాడు. భూములమీద వ్యవసాయం చేసేవారికి అదికారం కల్పించి శిస్తు పెంచమనే అభయమిస్తే  వ్యవసాయదారులు కష్టించి  పనిచేస్తారని నమ్మిన టైలర్  ఆవిధంగా చేసి వ్యవసాయాభివృధ్దికి గణనీయంగా తోడ్పడ్డాడు. సురపురంలో తెలుగు మరాటీ పర్షియన్ ఇంగ్లీషు భాషలను బోధించే పాఠశాల నెలకొల్పాడు. బ్రిటిష్ ప్రభుత్వం పాలించే ప్రాంతాల లోని పాఠశాలలనుండి పుస్తకాలు తెప్పించి వారికి సరఫరా చేసేవాడు. సురపురం నుంచి లింగిసునూరు పోవడానిక రోడ్డు వేయించి దానికి రెండువైపులా మామిడి .చింత మొదలైన ఫల వృక్షాలను కొన్ని వేలు నాటించాడు. ఇలా ఎన్నో చోట్ల చేసాడు.   తాను పని చేసిన ప్రాంతంలోని ప్రజలందరికీ దగ్గరై వారి ప్రేమకు పాత్రుడయ్యాడు. సురపురం లో ఎక్కువ మంది బేడర్లు ఉండేవారు. వారు విచ్చు కత్తులు పట్టుకుని తిరుగుతూ ఎటువంటి అకృత్యానికైనా పాల్పడుతుండే వారు. అటువంటి వారిని కూడా టైలర్ తన మంచితనంతో ఘర్షణలు లేకుండా దారికి తీసుకు వచ్చాడు. అరాచకత్వానికి మంగళం పాడి శాంతి భద్రతలు నెలకొల్పాడు. టైలర్ ఇక్కడి ప్రజలకు ఇంత దగ్గర కావడానికి కారణాలేమిటో తెలుసుకోవాలంటే  అతడి అబిప్రాయాలేమిటోతెలుసుకోవాలి.. అతడి భావాలు కొన్ని చూడండి:

భాష నేర్చుకునే టప్పుడు కష్టమైనా దాని నుడికారం నేర్చుకోవాలి. ( ఈ విధంగానే హిందూస్థానీ మరాఠీ, తెలుగు నేర్చుకుని వాటి మీద అధికారం సంపాదించి ప్రజలకు చేరువయ్యాడు) 
భాగ్యవంతులు పన్నులు సరిగా చెల్లించరు. పేదలే నయం. ( దీనికి అనేక ఉదాహరణలు చూపిస్తాడు)
కులీనులలో నెలకొన్న అవినీతి ప్రజలలో కానరాదు. (ఇప్పటికీ అంతే కదా?)
రక్షణ కోసం ప్రజల మీద ఆధార పడడం మంచిది. (ప్రజాభిమానం చూరగొన్న నాయకులకు వేరే రక్షణ అవసరం ఉండదు కదా)
ఇంతమంచి అభిప్రాయాలు కలిగి వాటిని ఆచరణలో చూపించ గలిగాడు కనుకనే అంతమంది ముష్కర మూకల మధ్య సంస్కరణలు చేస్తూ కూడా క్షేమంగా మనగలిగాడు. అతడి నినాదం భారత ప్రజలను ప్రేమించి పాలించండి అన్నది. ఇది నమ్మి ఆచరించాడు కనుకనే ఇక్కడి ప్రజలు అతడిని మహదేవ బాబా అని గౌరవంగా పిలుచుకునే వారు.
                                                               ***
టైలర్  పెద్దగా స్కూళ్లలో చదువుకోక పోయినా మంచి రచయితగా ఎదిగాడు. భారత దేశ చరిత్ర నేపధ్యంలో తార, రాల్ఫ్ డార్నెల్, సీత అనే నవలలు వ్రాసేడు. ఇక్కడ పని చేస్తుండగా ఇంగ్లాండులోని టైమ్స్ పత్రికకు విలేఖరిగా పుంఖాను పుంఖంగా వ్యాసాలు వ్రాసి పంపేవాడు. రెండు సంవత్సరాలు కష్టపడి Students manual of the History of India అనే గ్రంధం వ్రాసేడు. భారత దేశ ప్రజలను గురించి ఒక చారిత్రక వర్ణనాత్మక సచిత్ర గ్రంథం మరికొంతమంది సహకారం తో రూపొందించాడు. టైలర్ కేవలం రచయితే కాదు. మంచి చిత్రకారుడు కూడా. ఇక్కడ తాను నివసించిన ప్రదేశాల సౌందర్యాన్ని అప్పటి మనుషుల్నీ తన కుంచెతో పట్టుకుని  తన చిత్రాల్లో నిక్షిప్తం చేసాడు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞావంతుడు సహృదయుడు ఎక్కడో ఇంగ్లండులో పుట్టి ఇక్కడకు వచ్చి ఇక్కడ మనవార్ని తనవారుగా భావించి ప్రేమించి వారి అభ్యున్నతి కోసం తన ఆరోగ్యం సహకరించక పోయినా విశేషమైన కృషి చేసిన టైలర్ ఎంత అభినందనీయుడో కదా?
                                                           ***

ఆంగ్లంలో టైలర్ వ్రాసిన ఈ పుస్తకాన్ని ప్రముఖ పాత్రికేయులు జి.కృష్ణ గారు తెలుగులోకి అనువదించి 1986 లోనే ప్రచురించారట. వారి అనుమతితో రాజా చంద్ర ఫౌండేషన్ వారు తిరిగి జులై 2011 లో పునర్ముద్రించారు. ఇటువంటి మంచి పుస్తకాన్ని శ్రమకీ ఖర్చుకీ వెనుకాడకుండా ప్రజలకు అందించిన ప్రచురణకర్తలను అభినందిస్తున్నాను. 
                                                           ***
(ఈ వ్యాసాన్ని చదివిన వారిలో పదోవంతు మందికైనా అసలు గ్రంథాన్ని చదివే అవకాశం దొరుకుతుందో లేదోనన్న సంశయం వల్ల  వివరంగా వ్రాయడంతో నిడివి పెరిగింది. విసుగు కలిగించి ఉంటే క్షంతవ్యుణ్ణి. సెలవు.
                                                         ***



















  

















20, జూన్ 2012, బుధవారం

వేష భాషల్లో ఏ ముంది? సరదా ముచ్చట్లు


భాషా సంబంధిత వ్యాసాలు  బరువైనవి గానూ కొంచెం ఆలోచింప జేసేవి గానూ ఉంటాయి కనుక కొంత విరామమిచ్చి ఈ లోగా బ్లాగ్మిత్రులు సరదాగా చదువుకునే విషయం ఏదైనా వ్రాయాలనుకునే సరికి నా మదిలో మెరిసిన జంటపదం వేష-భాషలు అనేది. భాషతో పాటే దానికంటె ముందే దీన్ని జోడించి వేషభాషలని మన వాళ్లు ఎందుకన్నారని  ఆలోచిస్తే  నాకు తట్టిన దేమిటంటేమనం కొత్తవారినెవరినైనా తొలిసారి చూసినప్పుడు ముందుగా వారి వేషం తరువాత వారు మాటలాడే తీరు గమనించి వారి గురించి ఏదో ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాము. వారి వేషం చూసి వారు పెద్దమనుషులనీ వారి మాటతీరుని చూసి సంస్కారవంతులనీ ఒక నిర్ణయానికి వస్తాము. ఈ విధంగా మనం వారిని గురించి చేసుకున్న అవగాహన సర్వే సర్వత్రా సరైనది కాకపోవచ్చు కాని సాధారణంగా నిజమే అవుతుంది. ఆవిధంగా మన వేషధారణ మనను గురించి ఇతరులు సరైన అంచనా వేసుకుందికి  తోడ్పడుతుంది. వేషమంటే మనం వేసుకునే బట్టలు మాత్రమే ననేది మనందరి సామాన్యమైన భావన. మన నిఘంటువులు మాత్రం మజ్జనానులేపన మాల్య వస్త్రాభరణముల చేతఇది ఐదు రకాలని పేర్కొంటుంది. అంటే స్నానం చేయడం, గంధము వంటి లేపనములు పూసుకోవడం, మాలలు  వస్త్రములు ఆభరణములు ధరించడమన్నమాట.. మాలలేమిటి మగ వారు ధరించడమేమిటి? అనుకోవద్దు. మన పూర్వులు ఆడవారి వలెనే పెద్ద కొప్పు ఉంచుకునే వారు.  దానిని దువ్వుకుని ముడి వేసుకునే వారు. ఆ కాలంలో మగ పిల్లలకు కూడా ఎంత కొప్పు పెరిగిందో చూసి అతడు పెళ్ళీడు కొచ్చాడని అనుకునే వారట. మనుచరిత్రం లో  ప్రవరాఖ్యునికి ఈ విధం గానే కొప్పు  కొలిచి సోమిదమ్మ నిచ్చి పెళ్లిచేసారని పెద్దన కూకటుల్ కొలిచి చేసిన సోమిదమ్మ అంటాడు. అదలా ఉంచితే వారు సిగలో పువ్వులు ధరించే వారో లేదో నాకు తెలీదు గాని మెడలో మాలలు మాత్రం ధరించే వారు. రసికులైన వారు చేతులకు కూడా చుట్టుకుని వాసన చూస్తూండే వారు. పుష్ప లావికలతో వారి సరస సంభాషణలు మన కావ్యాలలో కోకొల్లలు. ఇంక కర్ణాభరణాలూ కంఠాభరణాలూ చేతులకి గండపెండేరాలూ ఉండనే ఉన్నాయి. చెవులకి కుండలాలు ధరించడం పండిత లక్షణం. శ్రీనాథుడు తాను బాగా వెలిగిన రోజులలో కుళ్లాయుంచితి కోక కట్టితి మహా కూర్పాసముం దొడ్గితిన్అంటాడు. ( కుళ్లాయి అంటే ఎత్తుగా ఉండే టోపీ లేక తలపాగా, కోక అంటే పంచ, కూర్పాసమంటే  పొడుగ్గా ఉండే అంగరఖా లేక లాంగ్ కోట్ లాంటిదన్నమాట). ఎంతైనా కవి సార్వ భౌమునికి ఆపాటి వేషం ఉండొద్దా?  మన ఆధునిక కవుల్లో కూడా భావకవులు కొంచెం విలక్షణంగా ఉండేవారట. సన్నని గ్లాస్కో పంచె , గ్లాస్కో జుబ్బా, మధ్య పాపిడి తీసి రెండు వేపులా దువ్విన పొడుగైన గిరజాల జుట్టూ, కళ్ళకి చలువ కళ్ళద్దాలూ వేసుకు తిరిగే వారట. ( చలువకళ్లజోళ్లు గిరజాల సరదాలు భావ కవికి లేని వేవి లేవు? ). కుండలాలు ధరించడం పండిత లక్షణం అని చెప్పాను కదా?. కుండలాలు ధరించి సాక్ష్యం చెప్పిన బ్రాహ్మల సాక్ష్యానికి విలువెక్కువ ఉండేదని కన్యాశుల్కం మనకు సాక్ష్యమిస్తుంది. ఆ విధంగా మనవారు ఎప్పుడూ ఆహార్యానికీ అలంకారాలకీ ప్రాముఖ్యతనిస్తూనే వచ్చారు.( ఇవన్నీ ఎందుకు బట్టలు కూడా కట్టనక్కర లేదంటాడు వేమన ..పుట్టినప్పుడు లేదు పోయేటప్పుడు లేదు..నడుమ బట్ట కట్ట నగుబాటు కాదయా? అని. అన్ని భోగాలూ అనుభవించి చివరకు యోగి అయిపోయిన తర్వాత ఆయన అన్న మాటలివి. అందువలన  మనమిప్పుడు పట్టించుకో నక్కర లేదు. మనం కూడా ముసలాళ్లమై పోయాక ఇలాంటి నీతులెన్నైనా చెప్పవచ్చు) .  వేషం అలంకారం విషయంలో ఎంతైనా ఆడవారికున్న శ్రధ్ధ మగవారికి లేదు. ఎక్కడికెళ్లాలన్నా ఏం కట్టుకోవాలనే ఆలోచన వారిని నిత్యం వేధిస్తుంది. ఏదైనా పెళ్లి వంటి శుభకార్యాలకి అయితే మరీను. అయిన వారికి సంబంధించిన వివాహాలయితే చెప్పనే అక్కర లేదు.కొత్తచీరలు కొనుక్కోవడం వాటికి మాచింగ్ జాకెట్లు కుట్టించుకోవడం వగైరా పనులతో తలమున్కలవుతారు.( వీరి మాచింగ్ పిచ్చి గురించి నేను చెప్పిన సరదా పద్యం ఇంతకు ముందు నా బ్లాగులో చదవకుండా మిస్సయిన వారికోసం:
మాచింగ్ చీరెలు లంగాల్మాచింగ్ జాకెట్లు జోళ్లు మాచింగ్ నగలున్మాచింగ్లన్నీ కుదిరెనుమాచింగ్ మగడే దొరకడు మహిళా మణికిన్ ) పెళ్ళిలో ఏ టయిమప్పుడు ఏ చీరకట్టుకోవాలో నెలల ముందే నిర్ణయమైపోతుంది. అక్కడికి వచ్చే వారు ఇంతకు ముందు చూసేసిఉంటారనుకున్నవి కాకుండా కొత్తవి కట్టుకోవాలని కోరుకుంటారు. తమ భర్తలు కూడా అందరిలో  గొప్పగా కనిపించాలని వారికున్నడ్రస్సులలో మంచివి ఏరి పెట్టె సర్దుతారు కాని ఆ మహాను భావుడు ఏ లుంగీ కట్టుకునో ఏ అరుగు మీదో పేకాటకి సిధ్ధమయి పోయి మరి కదలడు. పట్టుకెళ్ళిన బట్టలు అలాగే  ఇస్త్రీలు నలక్కుండా తిరిగి వచ్చేస్తాయి. (అందరూ అలాగే ఉంటారనుకుందికి లేదు. కొందరు  విలాసవంతులు ఆడవారికంటే ఎక్కువగా తయారవుతారు.)  మన  అందాల నటుడు నందమూరి తారక రామారావు గారికి  వేషాలంటే చాలా ఇష్టమనిపిస్తుంది. సినిమాల్లో తమ పాత్ర వేషమే కాకుండా అంతర్నాటకమో మరోటో అని పేరు చెప్పి కొన్ని ఎక్స్ట్ ట్రా వేషాలు కూడా వేరే రెమ్యూనరేషన్ తీసుకోకుండా వేసేవాడు. ఈ అలవాటుని చంపుకోలేక ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా  వివేకానందుని గెటప్ లాంటివి వేస్తుండేవాడు. నందమూరిని గురించి మొదలు పెడితే ఇప్పుడు తెమలదు కాని అసలు విషయానికి వద్దాము. సంఘంలో మసలుతున్నప్పుడు సంఘ మర్యాదకు లోపం రాని విధంగా వేషం ధరించక పోతే వచ్చే చిక్కులను గురించి ముచ్చటగా మూడు ముచ్చటలు చెబుతాను.ముళ్లపూడి రమణ గారు పత్రికలో పని చేసేటప్పుడు ఆయనను కొన్నాళ్లు రాజకీయ విలేఖరి గాపని చేయమన్నారుట. ఆ పని మీద ఆయన ఉన్నప్పుడు నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి వంటి ప్రముఖులు రమణ గారిని వారి కారులోనే ఎక్కించుకుని తిప్పుకునే వారట. ఒక సారి అలానే వారితో కాస్మొపాలిటన్ క్లబ్బుకి తీసుకెళ్లారట. రమణ గారికి ఆకలేసి పక్కనున్న బుహారి హోటల్ లో టిఫిన్ తిని వస్తానన్నారుట. బ్రహ్మానంద రెడ్డిగారు ఠఠ్.. వీల్లేదు. ఇక్కడ భోజనం ఏ క్లాసుగా ఉంటుంది మా గెస్టుగా భోజనం చేసి రమ్మని డైనింగ్ హాల్లోకి పంపారట. రమణ గారు డైనింగ్ హాల్లో టేబిలు ముందు కూర్చుని బేరర్ని పిలిచి బోజనం వడ్డించమన్నారుట. రమణ గారి ఇస్త్రీ లేని నలిగి పోయిన షర్టు ఫేంటు చూసి ఆ బేరర్  డ్రయివర్లకీ అటెండర్లకీ భోజనం బయట షెడ్డులో పెడతారనీ అక్కడకు వెళ్లి తినమనీ అన్నాడుట. అంతలో ఆపద్బాంధవుడివా వచ్చిన రెడ్డిగారు గుడ్లురుముతూ రాస్కెల్.. ఈ.యన రిపోర్టరుగారు.. నా గెస్టు ,బోజనం ఇక్కడే వడ్డించుఅని చెప్పారుట. తర్వాత రమణ గారితో  రెడ్డిగారు మరియాదకరమైన డ్రస్సువేసుకోవలసిన అవసరం గురించి చెప్పారుట.ఇంకో సంగతి.:
నేను ఆడిట్ ఆపీసులో పని చేస్తున్నప్పుడు ఒక మిత్రుడు చెప్పిన సంఘటన ఇది. ఆయన ఒక సారి ఆడిట్ నిమిత్తం ఒక పల్లెటూళ్లో ఉండే పంచాయతీ సమితికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఉండడానికి వసతి ఉండదు కనుక పొరుగూర్లో లాడ్జిలో దిగి ఉదయం పదిగంటల లోపే సమితి ఆఫీసుకు చేరుకున్నాడట. అక్కడ ఆఫీసు తలుపుల తాళాలింకా తీసి ఉండక పోవడం చేత సిగరె ట్టు ముట్టించి  ఛుట్టూ చూస్తే దూరంగా నలిగి పోయిన బట్టలూ హవాయి చెప్పులూ వేసుకున్న ఒక ముసలాయన పచార్లు చేస్తూ కనిపించాడట. ఆయనను దగ్గరకు రమ్మని పిలిచి ఏ మయ్యా ఇక్కడ ఆఫీసు టైముకు తీసే అలవాటు లేదా?” అని అడిగాడట. దానికా ముసలాయన సమాధాన మిస్తూ అలాగే ఉందండి. ఇంతకూ తమరెవరండి?” అని అడిగాడట. దానికి మా మిత్రుడు తన హోదా తెలిస్తే తన మీద గౌరవం పెరుగుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఈ ఆఫీసు అక్కవుంట్లు తనిఖీ చేయడానికి హైద్రాబాదు నుంచి వచ్చిన ఆడిట్ పార్టీ సెక్షనాఫీసర్ని . అని గర్వంగా చెప్పుకున్నాడుట. దానికా ముసలాయన  తనను తాను పరిచయం చేసుకుంటూ   మీరూ టయిముకే వచ్చినందుకు చాలా సంతోషం. నేను మీ పనిని పర్యవేక్షించడానికి వచ్చిన ఆడిట్ ఆపీసర్ని అన్నాడుట. తెల్లబోవడం మా మిత్రుని పనయ్యిందిట. మా మిత్రుడీ సంగతి నాకు చెబుతూ  ఆ ఆఫీసరు గారి డ్రస్సే తనని పొరపడేట్టు చేసిందని చెప్పేడు.ముచ్చటగా మూడో ముచ్చట:
శ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారు ఒకప్పుడు విశాఖ పట్టణం లో ఉన్నప్పుడు ఉదయమే  ఒక కొల్లాయి గుడ్డ కట్టుకుని చెంబు తీసుకుని దగ్గర లో నున్న ఏడునూతుల వీధికి స్నానార్థమై బయల్దేరి వెళ్తున్నారట. అంతలో ఎవరో  చెప్పగా శ్రీ జయంతి రామయ్య పంతులు గారిల్లు ఆ దారి లోనే ఉందని తెలిసిందట. జయంతి రామయ్య పంతులు గారు ఆ రోజుల్లో గోదావరి జిల్లాల్లో బి.య్యే.మొదటి బ్యాచిలో ప్యాసయిన వారూ..శ్రీ పిఠాపురం రాజా వారికి సహాధ్యాయులో సతీర్థులో అయిన వారున్నూ.. ఆయన అప్పట్లో డిప్యూటీ కలెక్టరు  హోదాలో ఉన్న వారు. ఆయన స్వయంగా మంచి కవిన్నీ.. సాహిత్యాభిలాషిన్నీ. ఆయన తో చెళ్లపిళ్ల వారికి పూర్వ పరిచయం ఉంది. ఒకానొక సందర్భంలో రామయ్య పంతులు గారి మీసాల మీద పద్యం చెప్పి ఉన్నారు కూడాను. అందు చేత స్నానానికి పోతూ పోతూ పంతులు గారింటి  వీధి గుమ్మం దగ్గర నిల్చుని పంతులు గారున్నారా అంటూ కేకేసారుట. లోపల్నుంచి           ఈయనను చూసిన పంతులు గారి ఇల్లాలు యాయవారం బ్రాహ్మలకు పంతులుగారితో పనేమిటో?” అని ప్రశ్నించిందట. దానికి మారు చెప్పకుండా కవి గారు స్నానానికి పోయి ఆ మధ్యాహ్నం పంతులు గారిని సక్రమంగా దర్శించినప్పుడాయన మీరు తగినంత వేష భాషలు కలిగి ఉండాలి. నిరాడంబరంగా ఉండకూడ దని హితోపదేశం చేశారుట.
 డాబూ దర్పం కూడదు గాని, సందర్భానికి తగిన వేషం లేక పోతే వచ్చే చిక్కులు చూసేరా?
                                                         ***
( దీని లోని ముళ్ళపూడి వారి ముచ్చట. వారి కోతి కొమ్మచ్చి లోనిదయితే  చెళ్ళపిళ్ళవారి అనుభవం వారి కథలూ..గాధలూ లోనిది. వారిద్దరికీ నా కృతజ్ఞతాంజలులు)                                                    ***


14, జూన్ 2012, గురువారం

రసగంగాఝరి...గగన గంగావతరణం


రసగంగా ఝరి.... గగన గంగావతరణం
సౌజన్య మూర్తి శ్రీ విశ్వనాథ  అనే క్రిందటి నా పోస్టులో శ్రీ విశ్వనాథ వారు శ్రీ శివశక్తి దత్తా గారు రచించిన గగన గంగావతరణం కావ్యాన్ని ఎంతగా మెచ్చుకున్నారో చెబుతూ ఆ కావ్యం సాహితీ మిత్రులందరూ తప్పకుండా చదివి తీరవలసిన గ్రంథమనీ దానిని పరిచయం చేస్తాననీ చెప్పి ఉన్నాను. ముందుగా గంగావతరణం కథ తెలియని ఈ నాటి యువత కోసం ఆ కథ చెబుతాను.
( గంగావతరణ గాథ అంతా తెలిసిన వారు ఇది వదిలి పెట్టి గ్రంథ పరిచయం చూడ వచ్చును.)
గంగావతరణం కథ:
ఇక్ష్వాకు వంశపు రాజైన సగరమహారాజుకు ఇద్దరు భార్యలు.పెద్ద భార్య కేశిని .రెండవ భార్య  సుమతి.వీరికి సంతానం కలుగక పోవడంతో సగరుడు నూరు సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు  భృగు మహర్షి వచ్చి వారి పూజలను మెచ్చి వారు అడుగ కుండానే వరమిస్తాడు. ఒక భార్యకు అరువది వేల మంది పుత్రులు రెండవ వారికి వంశకారకుడు పుడతారని చెబుతాడు. ఎవరికి ఎవరు పుడతారను ప్రశ్నకు వారి వారి కోరికలను బట్టి కలుగుతారని చెబుతాడు. కొన్నాళ్లకు కేశినికి అసమంజసుడనే కుమారుడు పుట్టగా,సుమతికి ఒక సొరకాయ పుడుతుంది. దానిని ఊరవతల పారవేయబోగా ఆకాశ వాణి భృగు మహర్షి వాక్కు ఫలిస్తుందనీ ఆ సొరకాయ విత్తులను నేతికుండలలో దాచమనీ చెబుతుంది. రాజు అలాగే చేయగా వాటినుండి అరవై వేలమంది పుత్రులు కలుగుతారు. అసమంజసుడు అయోధ్యానగరం లోని పిల్లలనందరినీ సరయూ నదిలో పడవేసి చంపడం వంటి దుర్మార్గపు పనులు చేస్తుంటాడు.దానిని పుర జనులందరూ ఏవగించుకోగా అతడు గత జన్మలోయోగ భ్రష్టుడైన కారణంగా తిరిగి తన నిజ మహిమలను పొంది వారందరినీ మళ్లా బ్రతికిస్తాడు. సగరుడు వరుసగా అశ్వమేథ యాగాలు తలపెట్టి చేస్తుండగా అందులో ఒక  యజ్ఞాశ్వమును ఇంద్రుడు దొంగిలించి తీసుకు పోయి పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల ముని ఎదుట కట్టి వేస్తాడు.యజ్ఞాశ్వమును వెతికి తీసుకు రమ్మని సగరుడు తన అరవై వేల మంది కొడుకులనూ పంపిస్తాడు. వారు భూతలమంతా వెతికి అశ్వమెక్కడా కనిపించక తిరిగి వస్తారు. కోపించిన సగరుడు వారిని అశ్వాన్ని తీసుకురాకుండా తిరిగి రావద్దని ఆజ్ఞాపిస్తాడు. వారు యజ్ఞాశ్వాన్ని వెతుకుకుంటూ  దాని జాడ చెప్పమని కనిపించిన వారినందరనూ హింసిస్తూ భూమి నాలుగు చెరగులా త్రవ్వి పోస్తూ పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ కపిలముని చెంతనే కట్టబడి ఉన్న యజ్ఞాశ్వాన్ని చూసి అతడే అశ్వాన్నిదొంగిలించి తెచ్చాడని తిట్టి పోస్తూ హింసించడానికి తలపడతారు. అప్పుడు కనులు తెరచిన కపిల ముని కోపాగ్ని జ్వాలలకు వారందరూ భస్మీ పటలమైపోతారు. ఈ విషయం నారద మునీంద్రుల వలన తెలుసుకున్న సగరుడు అసమంజసుని కొడుకూ తన మనుమడూ అయిన అంశుమంతుని వారిని వెదికి రమ్మని పంపిస్తాడు. అంశుమంతుడు తన పిన తండ్రులు వెళ్లిన దారిలోనే వెళ్తూ కపిల బిలం చేరి అక్కడతన పిన తండ్రుల భస్మ రాశులనూ ఆ ప్రక్కనే కపిలమునినీ ఆయన ప్రక్కనే కట్టబడి ఉన్న యాగాశ్వాన్నీ కనుగొంటాడు. ఏమి జరిగి ఉంటుందో గ్రహించి కపిలమునిని స్తుతిస్తూ ప్రార్థన చేస్తాడు. కపిలుడు సంతోషించి యాగాశ్వాన్ని తీసుకు పోవచ్చని అనుమతిస్తూ ఆతని పిన తండ్రుల బూడిద ప్రోవుల మీద సురగంగ ప్రవహింపజేసినప్పుడు వారికి సద్గతులు కలుగుతాయని తెలియజేస్తాడు. అంశుమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని వెళ్లాక సగరుడు యాగం పూర్తి చేస్తాడు.సగరుడూ ఆయన తరువాత అంశుమంతుడూ చాలా కాలం రాజ్యం చేస్తారు.అంశుమంతుడు తన పిన తండ్రులకు సద్గతులను కలిగించడానికి అడవికి పోయి తపస్సు చేస్తూ సురగంగకై ప్రార్థిస్తూ కోరిక నెరవేరకుండానే స్వర్గస్తుడౌతాడు. అతడి వలెనే అతని కుమారుడు దిలీపుడు కూడాప్రయత్నించి కోరిక తీరకుండానే తనువు చాలిస్తాడు.
దిలీపుని కొడుకైన భగీరథుడు పిల్లలు లేని కారణంగా రాజ్యాన్ని మంత్రులకప్పగించి  గోకర్ణ క్షేత్రానికి పోయి బ్రహ్మను ప్రార్థిస్తూ ఘోరమైన తపస్సు చేస్తాడు.తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమై అతని కోరిక తెలుసుకుని గంగను అతనితో వెళ్లమంటాడు. మొదట సంశయించిన గంగ బ్రహ్మ ఆజ్ఞను శిరసావహించడానికి అంగీకరిస్తుంది. కానీ తాను భూమి మీదకు దిగినప్పుడు భూమి కృంగి పోకుండా ఎవ్వరాపగలరని ప్రశ్నిస్తుంది. దానికి శంకరుడే తగినవాడని బ్రహ్మ పలుకగా భగీరథుడు తిరిగి మళ్ళా అంత తపస్సూ చేసి శంకరుని మెప్పించి గంగను భరించడానికి ఒప్పిస్తాడు.ఆ విధంగా గంగ బ్రహ్మ లోకం నుండి జాలువారుతుండగా తన శిరోజాలతో ఆకాశమంతా కప్పి వేసిన శివుడు  గంగనంతా అందులో బంధించి ముడి వేస్తాడు.ఆ తరువాత శివుడు భగీరథునికి ఒక బంగారు రధాన్ని ఇచ్చి అతడు ముందు దారి చూపిస్తుండగా గంగ అతని వెంట రాగలదని ఆనతిచ్చి తన జటా జూటం నుండి ఒక పాయను తీసి గంగను విడిచి పెట్టగా అది భగీరథుని రథము వెంట పర్వులెత్తుతూ ప్రవహిస్తుంది .గంగ భాగీరథుని వెంట భూమార్గం గుండా పాతాళ లోకం లోని కపిల బిలం ప్రవేశించి అక్కడ ఉన్న సగర కుమారుల బూది ప్రోవుల మీదుగా ప్రవహిస్తుంది. దానితో సగర కుమారుల ఆత్మలు స్వర్లోకాలకు చేరుకుంటాయి. భగీరథుని ప్రయత్నం సఫలీ కృతమవుతుంది. క్లుప్తంగా గంగావతరణం కథ ఇది.
                                                  ***
గగన గంగావతరణంకావ్య పరిచయం
గంగావతరణం కథ సగర మహారాజు, ఆయన కొడుకులు ముని మనవడితో ముడివడి ఉంటుంది. సగర మహారాజు ఇక్ష్వాకు వంశస్థుడు.అందుచేత ఇక్ష్వాకు వంశం ఎలా ఉద్భవించిందో నాలుగు ద్విపదలలో చెబుతూ కావ్యారంభం కావించాడు కవి.
శ్రీ దేవికి పుట్టిల్లగు క్షీరాంబుధి తరగలపై
పన్నగ పతి పాన్పు పైన పవళించెను విష్ణుమూర్తి
విష్ణు నాభి కమలమ్మున విరించి జన్మించినాడు
విరించి మానస పుత్రుడు మరీచి యను మహాత్ముడు
అతని సుతుడు కశ్యప ప్రజాపతి అతని సతి అదితి
అదితీ కశ్యపుల తనయులాదిత్యులు పన్నిద్దరు
వివస్వంతుడను ఇనునకు వైవస్వత మనువు బుట్టె
అతని తనయుడిక్ష్వాకుడయోధ్యానగరాధీశుడు
 ఈ ఇక్ష్వాకు వంశస్థుడైన సగరునికి పుట్టిన అరవై వేలమంది పుత్రులూ ఎటువంటి వారో ఆరు ద్విపదలలో వర్ణిస్తాడు కవి.మచ్చుకి రెండు ద్విపదలు చూడండి:
గగన వాణి చెప్పినట్లె సగరుడు కావించి కనెన్
అసమాన బలోధ్ధతులన్ అరువది వేవుర సుతులన్
ఉద్దండుల దుర్దండుల దోర్దండ బలోద్దండుల
దుర్ధర్షుల దుర్భేద్యుల దుర్నిరీక్ష్య తేజస్కుల
దుర్వారుల దుష్కర్ముల దుర్వ్యాపారుల దూష్యుల
దుర్మార్గుల దురాగతుల దురాచార పరాయణుల

సగరుని పంపున యజ్ఞాశ్వాన్ని వెతకడానికి సగరకుమారులు వెళ్లడాన్ని, అశ్వం కానరాక వారు చేసిన దుష్కృత్యాలనూ 28 ద్విపదలలో రసవత్తరంగా వర్ణించాడు కవి. కొన్ని మచ్చు చూడండి:
 యాగాశ్వం కోసం ఎంత వెదకినా
కీకారణ్యమ్ములందు కీకటము లభించలేదు
ఘోరారణ్యముల నెందు ఘోటకమగుపించలేదు
కోటల పేటల బాటల తోటల ఘోటమ్ము లేదు
చెరువుల దొరువుల తెరువుల గరువులనెట ఖరువు లేదు
కుహరములన్ విహారముల జుహురాణము జాడ లేదు
కందకముల కందరముల కంఖాణము గుర్తు లేదు
అప్పుడు వారు--
గ్రామస్థుల సీమస్థుల క్రమ్మర వాన ప్రస్థుల
మార్గస్థుల మర్దించిరి మా జన్నపు మా వేదని
పిశాచముల నిశాచరుల విషోరగుల వియచ్చరుల
గరుత్మతుల గర్జించిరి మరుద్రథము మాటేమని
దిక్కులెల్ల చీరాడిరి దీవులెల్ల పారాడిరి
ఎక్కడ గుఱ్ఱము గానక కుతలమెల్ల కోరాడిరి
ఆఖరుకు వారు పాతాళానికి వచ్చి కపిల ముని చెంత కట్టబడి ఉన్న యాగాశ్వాన్ని చూచి --
 “ తంతు హుమాయిని దెచ్చిన మంతర మాయావి వీడె
మన తేజిని మఖవాజిని మరగించిన ముచ్చు వీడె -- అంటూ కపిలుని తూలనాడడం, కపిలుని కోపానల జ్వాలలలో వారు భస్మమై పోవడం చక్కగా వర్ణిస్తాడు కవి.
ఆ తరువాత బ్రహ్మను గూర్చి భగీరథుడు చేసిన  భీకర తపస్సును 12 ద్విపదలలో వర్ణించాడు కవి. ఓ రెండు ద్విపదలు చూడండి:
జడి వానల కడల లేదు వడగండ్లకు సడల లేదు
ప్రళయకాల పర్జన్య ప్రబల ఘోష కడర లేదు
కుంభీకర వినిర్ముక్త కుంభవృష్టి కరగ లేదు
జంభారి కర నిర్ముక్త దంభోళుల కెరగ లేదు.
భగీరథునితో భూమి మీదకు వెళ్ళడానికి ఇష్ట పడని గంగకు బ్రహ్మ నచ్చ చెప్పినప్పటి పలుకులు చూడండి:
దివి నుండి భువికి చన్నను దివి నుందువు భువి నుందువు
భూతలమును వీడి మరి రసాతలమున కేగిననూ
ఆతలముల రెంటనొకే రీతిను ప్రవహించెదు
త్రిభువనముల పయనించెదు  త్రిపథగవై విలసిలెదవు
నర కోటుల దురితవ్రజ పరిమార్జన నీ ధర్మం
పరమ పతివ్రతల యశస్మరణములే నీకు ధనం
భగీరథుని తపమునకు మెచ్చి గంగను భరించడానికి సిధ్దమైన శివుడు తన జటలను నింగినిండా పరచిన తీరును  విపులముగా కవి వర్ణించిన తీరు అమోఘము. మచ్చు చూడండి:
హరుడు మెచ్చి వచ్చినాడు ముని కభయమ్మిచ్చినాడు
తన జటాకలాపమున గగనమంతా గప్పినాడు
చదలంతా తన జడలే నభమంతా తన నెరులే
అంతరిక్షమంతా తనకుంతలముల మయమే
శక్ర శమన వరుణ ధనద దిశలన్ తన కేశములే
అగ్ని నిఋతి వాయు రుద్ర విదిశల్ తత్పాశముల
తనను భరించడానికి సిధ్ధ పడిన శివుని జూసి గంగ ఇతడేనటె స్మర హరుడు? ఇతడేనటె పురహరుండు?ఇతడేనటె హిమవన్నగనందినీ మనోహరుండు? ”  అనుకున్నదట. గంగను చూసిన శివుడు  స్ఫురత్ శుభ్ర సుందర తర దరస్మేర ముఖము  శరద్యామినీ రాకా చంద్రకోటి సఖము అనుకున్నాడట.
వియద్గంగ దూకుడు ధాటికి కులగిరులే కదిలాయట. కానీ ధృతి చెడని హరుని తీరు కవి వర్ణించిన విధము చూడండి;
దిక్కులు గడగడ వడకెను దిక్కరులున్ ఘూర్ణిల్లెను
చుక్కలు జలజల రాలెను శివుడు చెక్కు చెదర లేదు
శతకోటి తటిల్లతలన్ దశదిశలన్ పెఠిల్లుమనెన్
ధరణి గుండె ఝల్లుమనెన్ హరుడు రెప్పలార్చలేదు
శతసహస్ర పర్జన్యము లతితీవ్రత గర్జించెను
గతి తప్పెను గ్రహ కోటులు ధృతి ధూర్జటి వీడ లేదు
కులనగ పంక్తులు సడలెను కువలయమండల మడలెను
కూర్మరాజు సర్దుకొనె కపర్ది కాలు కదుప లేదు.
ఆ విధంగా నిల్చున్న శివుడు సత్యలోక వీధి వీడి స్వర్గసీమ నధిగమించి
మహర్వాటి పరిధి మీటి రోదసీకుహరము దాటి  ఉరికే గంగను తన జటాజూటంలో బంధిస్తే ఒక్క చుక్క గంగ కూడా నేలను రాల లేదట.
శివజటా కలాపభరం చెలరేగెను మింటి మీద
లవలేశం సలిలకణం  పడనీయదు మంటిమీద
గంగ మొత్తం శివుని జటాజూటంలో చిక్కుకుని కనిపించకుండా పోయిందట-.
తుంగత్ గురు భంగవారి పెంగురులన్ మ్రింగువడెను
రంగత్  శృంగార లహరి ముంగురులన్ భంగ పడెను
కురులన్నియు వడి ముచ్చట ముడి చుట్టుక పోయె
కుంతముల వెలి నెచ్చట గంగదోపదాయె
ఏదేదీ దివిషద్విష? ఏ దనిమిష కూలంకష?
ఏది త్రివిష్టపవాహిని? ఏది వియత్తటిని ?” అని అందరూ వెతుక్కుంటారు.
ఆతరువాత గంగ పరమేశ్వరునితో నేను నీదాననే అని చెబుతూ  భగీరథునికోసం తనను విడువమని వేడుకునే తీరు చూడండి:
పరమ పురుష నీ దానను పరమేశ్వర నీ చానను
బంధించగ దగునా నను మన్నించగ దగదా నను
పురుషోత్తమ! నీ నారిని వృషవాహన నీ వారిని
దయగనుమీ జడదారిని నను విడు మీతని దారి

శివుని ఆనతిని భగీరథుని రధము వెనుక ఉరుకులిడే గంగను చూడండి:
క్రిందరయక మీదరయక ముందర అదుగదుగో తేరు
తొందర తొందర నడకల వెను వెన్కనే వేల్పుటేరు
ముందర తన ప్రియవత్సము నందిని క్రేళ్లురుకుచుండ
వెనువెంటనె తరలి వచ్చు వైహాయస సురభి వోలె
ఎంత  సుందరమైన ఉపమానం !
మునుముంగట పరుగులెత్తి ముని అరదం పోతున్నది
వెనువెంటనే గంగ వరద ముంచెత్తుక వస్తున్నదట.
ఇలా ఇలకేతెంచిన గంగను చూసిన జనం  ఏం చేశారట?
సర్వాధివ్యాధి హరం స్వర్వేణి పవిత్ర జలం
అనుచున్ అంజలులబట్టి ఆత్రమ్మున త్రావువారు
సర్వ పాప హారిణి ఇది  సకలాఘ విదారిణి ఇది
అని పశ్చాత్తాప వహ్నిసమన నిమగ్ను లగువారు
పావనమని విష్ణుమూర్తి పాదోదక మీ వనమని
కేవల మతిభక్తిని శిరసావహించు మరికొందరు
శ్రీకరమని పరమపదవశీకర మీ శీకరమని
కొంకక తద్వేలోధ్ధతి క్రుంకులిడుదు రింకొందరు
ఆ పిదప గంగ సగరకుమారుల భస్మరాశులపై ప్రవహింపగా వారు సురనిమ్నగ నీరువారి సగరేయుల గీటు మారి చిరతర శాపమ్ము దీరి నడచిరి స్వర్గమ్ము దారిఅంటాడు కవి.
గంగను తీసుక వచ్చి తన తాతలకు సద్గతులను కలిగించిన భగీరథుని చూసి కపిలుడు--
కమలాసను నొప్పించితి వలికాక్షుని మెప్పించితి
వమరారామ తరంగిణి నిలకిటకున్ రప్పించితి
నీ యత్నము నిరుపమ్ము నీ ప్రయత్నమసమానము
నీ జతనము సాటి లేదు నూ పూనిక పరుల గాదు
అసమాన ప్రయత్నమునకు భగీరథ ప్రయత్నమనే
నుడి ఇటుపై వ్యాప్తి చెందు నీ చరితము ఖ్యాతినొందు”  అని మెచ్చుకుంటాడు.
 భగీ రథుడు స్వర్గంగను మున్కలనిడి స్వపితరులకు జలములనిడి
స్వర్ణరథమునెక్కి  సాగి స్వస్థలమున కేగగా
గంగ మాత్రమీనాటికి మంగళ వరదాయనియై
పొంగారుచు భూతలమున బంగారము పండించును  ” అంటూ కావ్యం ముగిస్తాడు కవి.
                                                 ****
ఈ గంగావతరణ కావ్యాన్ని  త్రిశ్రగతి ద్విపదులలో చెప్పబూనుకోవడం లోనే కవి ప్రతిభ మనకు గోచరిస్తుంది. ఇది మరో ఛందస్సులో అయితే ఇంతగా రాణించేది కాదేమోనని నాకనిపిస్తుంది.  ఆయా చోట్ల  భావ వ్యక్తీకరణకి అవసరమైన ప్రౌఢ పద ప్రయోగాలున్నా, దీర్ఘ సమాసాలేమీ లేక పోవడం వల్లా, అన్వయ క్లిష్టత లేక పోవడం వల్లా  భావం సులభ గ్రాహ్యమే. నేను చెప్పినవే కాకుండా ఈ కావ్యంలో ఇంకా గంగ విష్ణు పాదోదకం ఎలాఅయిందీ, అగస్త్యుడు సముద్రాన్నిఏ విధంగా త్రాగి వేసిందీ...వంటి వెన్నో విషయాలున్నాయి . కానీ గ్రంథ పరిచయంలో  కావ్యం లోని రసవంతము లైన బాగాలన్నిటినీ ఉటంకించడం సాధ్యం కాదు కదా? రస ప్లావితమైన ఈ కావ్యాన్ని మీకు మీరే పూర్తిగా చదువుకుని ఆనందించండి.( అందిరికీ లభ్యం కాదేమో నని కొంతైనా రుచి చూడగలరని కొన్ని ద్విపదులను మచ్చు చూపించాను ). కవి శ్రీ శివశక్తి దత్తా గారికి అంజలి ఘటిస్తున్నాను. మరో విషయం.ఈ కవి గారు ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు కీరవాణి తండ్రిగారని చెప్పాను కదా?సినీ సంగీత దర్శకురాలు శ్రీ లతకు వీరు పెదనాన్నగారవుతారు. ఆమె  ఈ గగన గంగావతరణాన్ని ఎప్పటికైనా ప్రజలకు తన స్వరకల్పనలో కాసెట్ రూపంలో అందించాలనుకుంటున్నానని తెలిపారు. ఆ రసగంగకు ఆహ్వానం పలుకుదాం.సెలవు.





  













7, జూన్ 2012, గురువారం

సౌజన్య మూర్తి శ్రీ విశ్వనాథ....



సౌజన్య మూర్తి శ్రీ విశ్వనాథ...
ఏ గతి రచియించి రేని సమకాలము వారలు మెచ్చరే గదా? ” అంటూ వాపోయాడు విజయ విలాస కర్త శ్రీ చేమకూర వెంకటకవి. ప్రతి పద్యం లో చమత్కారం తొణికిస లాడే విజయ విలాస కావ్యాన్ని రచించిన చేమకూర వానికే సమకాలీనులలో మెచ్చుకునే వారు కరువయ్యారంటే,మిగిలిన కవుల సంగతి చెప్పే పనేముంది? చేమకూర కవికి సమకాలీనులలో దక్కాల్సిన గౌరవం దక్కక పోవడానికి అతని కులం అడ్డుపడిందేమోనని అనుకున్నా అసలు కారణం ఆది కాదు. సమకాలీను లైన కవులలోఉండే స్పర్థే దీనికి కారణమై ఉంటుంది.తమకు పూర్వ కవుల స్తుతి చేసిన వారున్నారేమోగాని తమ సమకాలీనులైన కవులను గురించి గొప్పగా చెప్పిన కవులు ఎక్కడా కనిపించరు..అలా మెచ్చుకోవడానికి చాలా సౌజన్యమూ సహృదయతా కావాలి. ఇవి మెండుగా ఉన్నకవి,శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు.నవనీత మనస్కుడు కవితాంతరంగుడు శ్రీ విశ్వనాథ... అనే పోస్టులో శ్రీ విశ్వనాథ వారి లోని ఈ దొడ్డగుణాన్ని ఆవిష్కరించే ముచ్చట ఒకటి చెప్పిఉన్నాను. ఈ విషయాన్నిధృవీకరించేవి మరో రెండు ముచ్చట్లు చిత్తగించండి:

నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు ( 1957-62 ) మధ్యలో మా వూళ్లో లైబ్రరీలో అన్ని పుస్తకాలతో పాటు భారతి సాహిత్య మాస పత్రిక కూడా  క్షుణ్ణంగా చదువుతుండే వాడిని. అలా చదువుతుండడంలో ఒకసారిహేతువాదయుగం అనే వ్యాసాన్నిచదవడం తటస్థించింది.ఇన్నేళ్ల తర్వాత ఆ వ్యాసం పూర్తి పాఠం నాకు గుర్తు లేదు కాని మనకి ఇప్పుడు అవసరమైన విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంది.ఆ వ్యాసం ఇద్దరు సాహితీ ప్రియుల మధ్యన జరిగే సంభాషణ లా సాగుతుంది.ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపుటంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం అనే గేయ పంక్తులతో ప్రారంభం అవుతుందీ వ్యాసం.చివర్లో మొదటివ్యక్తిని రెండో ఆయనఇంతకీ ఈ యుగకర్త ఎవ్వరంటావు? ” అని ప్రశ్నిస్తాడు. దానికి జవాబుగా మొదటి వ్యక్తిఇంకెవరు.పైన చెప్పిన గేయం వ్రాసిన వాడే అని చెప్పి ముగిస్తాడు.ఈ వ్యాసం వ్రాసినది శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు కనుక ఆ ఆభిప్రాయం ఆయనదే అనీ ఆయన యుగకర్తగా పేర్కొన్నమహాకవి ఆయనను పాషాణ పాక ప్రభువుగా వర్ణించిన శ్రీశ్రీ గారేననీ మనకి తెలిసి పోతుంది.కవి సమ్రాట్టైన ఒక మహాకవి సమకాలీనుడైన మరో కవిని యుగకర్తగా పేర్కొనడం ఆయన సహృదయతకు గీటురాయి కాదా?
మరోముచ్చట:
కే.యస్. రావు గారంటే ఫలానా అని ఇతమిథ్థంగా మనకి తెలీదు.కోడూరి శివశక్తి దత్తా అనీ మన సినీ రంగంలో కథా గేయరచయిత గానూ దర్శకుని గానూ పని చేస్తున్నారని చెబితే కొద్దిమందికి తెలియవచ్చును.ఈమద్య విడుదలైన రాజన్న సినిమాలో అమ్మా అవనీ...అనే అద్భుతమైన పాట వ్రాసిన కవి గారంటే చాలా మందికి తెలియవచ్చును.ఆయన ప్రఖ్యాత సంగీత దర్శకుడు కీరవాణి గారి నాన్నగారని చెబితే అందరికీ తెలుస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఆయన గగన గంగావతరణం అనే అద్భుతమైన కావ్యం త్రిస్రగతి ద్విపదలలో వ్రాసేరని. ఈ కావ్యం ఆయన చాలా కాలం క్రిందటే వ్రాసేరు. దాన్ని స్వయంగా శ్రీ విశ్వనాథ వారికి వినిపించి వారి స్పందనను తెలుసుకోవాలన్న కుతూహలంతో వారి అన్నదమ్ములతో కలిసి కవి సమ్రాట్టు దర్శనం చేసుకున్నారు. వారి ఆధునిక వేషధారణ చూసి వారి కావ్యం ఎలా ఉంటుందో ననుకున్న విశ్వనాథ వారు నిరాసక్తిగా అక్కడ పెట్టి వెళ్లండి తీరికగా చదువుతా నన్నారుట. హతాశులైన దత్తా గారి ముఖ కవళికలు చూసి మళ్లీ విశ్వనాథ వారే సరే మీరు బాగా రాశాననుకున్నవి పది పంక్తులు చదివితే వింటానన్నారుట.ఆనందంతో దత్తాగారు చేతికొచ్చిన పేజీ తెరచి చదవనారంభించేరట.కొంచెం చదవగానే విశ్వనాథ వారు ఆపమని సంజ్ఞ చేసి, మళ్లా మొదటినుంచి నిదానంగా చదవమని అడిగారట.ఆ తర్వాత అంతా నిదానంగా వింటూ ఇదిరా శయ్య!ఇదిరా శిల్పం!ఇదిరా శబ్ద గాంభీర్యం!ఇదిరా అల్లిక!ఇదిరా ధార!ఇదిరా తెలుగు నుడికారం!” అంటూ పొగడ్తలు కురిపించారట. అంతటితో  ఆగకుండానాకు ఈ గంగావతరణం కథా వస్తువంటే చాలా ఇష్టం. నా కంటె ముందు వాల్మీకి మొదలుగా పన్నెండుమంది కవులు ఈ గంగావతార ఘట్టాన్ని హృద్యంగా వర్ణించి ఉన్నారు. నా కల్ప తరువు( రామాయణ కల్ప వృక్షం) లో నేనంత కంటె బాగా వ్రాయడానికి ప్రయత్నించాను. ముందు వాటితో నిష్పాక్షికంగా సరితూచు కొని నాకే అగ్ర తాంబూలం ఇచ్చుకున్నాను. కాని ఇవాళ ఈ గగన గంగావతరణం విన్నాక అగ్ర తాంబూలమిక నాది కాదు నీది అని నా అంతరాత్మ చెబుతున్నది. అందు చేత ఆ నాడు నా కల్పవృక్షాన్ని ఆవిష్కరించినప్పుడు నాకిచ్చి సత్కరించిన పట్టు వస్త్రాలు నీకిచ్చి ఆశీర్వదిస్తానంటూ వారూ వారి శిష్యగణమూ ముక్త కంఠాలతో మంత్ర పుష్పాలతో ఆశీర్వదించి అక్షతలు చల్లారట!
విశ్వనాథ వారి సౌజన్యానికి మరో నిదర్శనం ఎందుకూ?

( ఇక్కడ నేను పేర్కొన్న గగన గంగావతరణం నిజంగా ఒక అద్భుత కావ్యం. నేను పండితుణ్ణి  కాను. కావ్యాలంటే పెద్ద ప్రీతి ఉన్న వాణ్ణీ కాను. అయినా ఈ పుస్తకం నా చేతికి వచ్చిన రాత్రి ఏకబిగిన ఆపకుండా చదివింప చేసిందీ 60 పేజీల గ్రంథం. ఇది అందరికీ లభ్యమై చదివే అవకాశం ఉండక పోవచ్చు కనుక దీనిని మరోసారి విపులంగా పరిచయం చేయాలని ఉంది. చేస్తాను.సెలవు.)




2, జూన్ 2012, శనివారం

మా విశాఖ పట్నం కబుర్లు..


నేనూ..మా మధురవాణీ.. మా విశాఖ పట్నఁవున్నూ..   (రెండో భాగం)
  
ఇంతకు ముందు పోస్టులో విశాఖ పట్నానికున్న వెయ్యేళ్ల చరిత్ర గురించి టూకీ గా చెబుతూ  మా వూరికా పేరెలా వచ్చిందో చెప్పాను. ఇప్పుడు మా వూళ్లోని కొన్ని కొన్ని ప్రాంతాలకా పేర్లెలా వచ్చేయో చెబుతూ నా చిన్నప్పటి విశాఖ పట్నం గురించి  ఆ ఊరితో నాకు గల అనుబంధం గురించి రెండుముక్కలు  చెబుతాను:
ప్రస్తుతం తూర్పు సాగర తీరంలో ఉత్తరాన కొల్కత్తా దక్షిణాన చెన్నైలకు మధ్యగా అతి పెద్ద రేవు పట్టణంగా విరాజిల్లుతున్న విశాఖ  పట్టణం వంటి నగరం ఆంధ్ర ప్రదేశ్ లో సాగర తీరంలో మరోటి లేదు. బంగాళా ఖాతం లోంచి తూర్పు తీరంలోని విశాఖ రేవు వైపు వస్తూనే సుదూర ప్రాంతంనుంచి దర్శన మిచ్చేవి డాల్ఫిన్స్ నోస్ కొండా.. రాత్రి పూట దాని మీద వెలిగే లైట్ హవుసున్నూ.. ఇప్పుడంటే దానిని డాల్పిన్స్ నోస్ అని పిలుస్తున్నాం కాని ఓ రెండు శతాబ్దాల క్రితం దాని పేరు బ్లాక్ మోర్స్ హిల్.”. బ్రిటిష్ పదాతి దళానికి చెందిన కెప్టెన్ బ్లాక్ మోర్  ఈ కొండమీద ఇల్లు కట్టుకుని ఉండే వాడట. అంతే కాదు 1801 లో కంపెనీ వారినుంచి 44 ఎకరాల భూమిని పొంది క్రింద సముద్రం వరకూ సుందరంగా తీర్చి దిద్దుకున్నాడట. ఇక్కడ అతకుముందే ఒక లైట్ హవుస్ ఉండేది కానీ అది 1876 లో వచ్చిన పెను తుఫానులో నామ రూపాలు లేకుండా పోయిందిట. ఇప్పుడు డాల్ఫిన్స్ నోస్ మీదున్న లైట్ హవుస్  పురాతనమైంది కాదు.. అంతకు ముందు పాత లైట్ హవుస్ విశాఖ పట్నంలో టౌన్ హాల్ కెదురుగా ఉండేది. మా చిన్నప్పుడు విశాఖ బీచిలో ఈ లైట్ హవుస్ దగ్గరలో చెంగల్రావు పేట బీచిలో ఆడుకోవడం నాకింకా గుర్తే.

ఉత్తర దక్షిణాలుగా సాగే కలకత్తా- చెన్నైల రైలుమార్గం లోనే ఉన్నా విశాఖ పట్టణానికి వచ్చే రైళ్లన్నీముందుకు సాగడానికి లేదు. స్టేషనులోంచి మళ్లా వెనక్కి తిరిగి  ఉత్తరానికో దక్షిణానికో వెళ్లాల్సిందే. ఇక్కడనుంచి రాయపూర్ వైపు వెళ్లే ట్రయిన్లు ఉండడం వల్ల దీనిని విశాఖ పట్టణం జంక్షన్ అని అన్నారు. ఇప్పుడంటే దీనిని విశాఖ పట్టణం స్టేషనని పిలుస్తున్నారుగానీ  మా చిన్నప్పుడు దీని పేరు వాల్తేర్  ( Waltair)  జంక్షన్.  పాత విశాఖ పట్టణం స్టేషను ఇంకా రెండు మూడు మైళ్లు లోపలికి  పోర్టుకు దగ్గరగా ఉంది. ఆ రోజుల్లో పాసెంజరు రైళ్లు ఈ పాత విశాఖ పట్టణం వరకూ వచ్చిపోతుండేవి. ఇక్కడో ముచ్చట చెబుతాను. నా చిన్నప్పుడో సారి నేను ఒంటరిగా మా వూరు పార్వతీ పురం నుంచి రాయపూర్ పాసింజరు రైల్లో విశాఖ పట్టణం వస్తున్నాను. సాయంత్రం ఐదు గంటలకి మా ఊళ్లో బయల్దేరిన బండి  వాల్తేరుకు రాత్రి ఏ తొమ్మిదికో చేరాలి. కాని ఏదో కారణం వల్ల బాగా ఆలస్యమయింది. నేనేక్కడో నిద్ర పోతూ ఉండి పోయాను. వాల్తేరు స్టేషను రావడం అక్కడ చాలా సేపు ఆగడం కూడా నాకు తెలియదు. ఆ స్టేషను దాటి రైలు విశాఖ పట్టణం స్టేషనుకు పోతున్నాది.ఒక్కసారిగా భరింపరాని దుర్గంధం ముక్కుపుటాల్ని తాకడంతో నాకు తెలివొచ్చింది. దానిక్కారణం వాల్తేరు నుంచి విశాఖ పట్టణం చేరేలోగా రైలు ఉప్పుటేరు ప్రక్కనుంచి ప్రయాణించవలసి రావడమే. Sea Back Waters ఉప్పుటేరులో చేరి నిలవ ఉండడమే ఆ దుర్గంధానికి కారణం. ఇప్పటికీ ఆ పరిసర ప్రాంతాలకి ఈ కంపు బాధ తప్పలేదనుకుంటాను. ఈ విశాఖ పట్టణం స్టేషన్ని వాల్తేర్ అనే వారని చెప్పాను కదా. దానికి కారణం పాత విశాఖ పట్టణం ఊరు దక్షిణాన ఉంటే దానికి ప్రక్కనే ఉత్తరాన వాల్తేరు గ్రామం ఉండేది . ఇప్పటికీ ఆంధ్రా యూనివర్సిటీ ఉండే ప్రాంతాన్ని పెద వాల్తేరనీ చిన వాల్తేరనీ వ్యవహరిస్తూఉంటారు. . ఇది వాల్తేరు ఎస్టేటులో భాగం ఇప్పటి అల్లిపురం మద్దిల పాలెం వాల్తేరు ప్రాంతాలతో కూడిన వాల్తేరు ఎస్టేటుని 1802 లో ఒకవేలం పాటలో అప్పట్లో  విశాఖ పట్టణం కలెక్టరు కచ్చేరీలో పెద్దపదవిలో ఉండిన మొసలికంటి వెంకోజీ అనే ఆసామీ కొనుక్కున్నాడట.ఈ వెంకోజీ పేరిటే ఇప్పుడున్న వెంకోజీ పాలం వెలసి ఉండొచ్చు.
 1950 ల నాటికి ఈ వాల్తేరు (ఇప్పటి విశాఖ పట్టణం) స్టేషనూ మరీ పెద్ద స్టేషనేం కాదు. చీకటి పడితే స్టేషన్ నుంచి బయట పడి ఊళ్లోకి వెళ్లడానికి భయమేస్తూ ఉండేది. ఇప్పుడంటే స్టేషనుకెదురుగా RTC కాంప్లెక్సుకు పోయే పెద్ద రోడ్డు ఉంది కాని అప్పుడదేమీ లేదు. స్టేషను బయటకొచ్చి ఇసకతోటవైపునుంచి ఉన్న రోడ్డులోంచి ఊళ్లోకెళ్లాల్సి వచ్చేది. రాత్రి పూట ఇది నిర్మానుష్యంగా ఉండేది. ఊళ్లోకెళ్లడానికి మనుషులు లాగే రిక్షాలూ ఒంటెద్దులు లాగే పెట్టె బళ్లూఉండేవి.
1957 లో నేను మా మేనమామలతో కలిసి డాబాగార్డన్స్ లో సరస్వతీ మహల్ సినిమా ధియేటరుకు ఎదురుగా ఉండే మేడలో ఉండే వాణ్ణి.( ఈ ధియేటరుని ఈ మధ్యనే పడగొట్టుతున్నట్లు చూసేను. మా చిన్నప్పుడు అది చాలా మంచి ధియేటరు.). అప్పుడే కొత్తగా పెట్టిన ప్రీ-యూనివర్శిటీ కోర్సు ( first batch) లో చేరాను. అప్పట్లో డాబాగార్డన్సులో  ఈ ధియేటరుకు  ఉత్తరాన చిన్న పార్కు ఉండేది కాని దాని తర్వాత  పెద్దగా ఇళ్లు కాని ఊరు కాని ఉండేవి కావు. ధియేటరు కెదురుగా ఉన్న మా ఇళ్లకి వెనుకంతా ఖాళీ జాగానే ఉండేది.అక్కడక్కడా కొన్ని చెట్లుండేవి. మధ్యలో ఒక గెడ్డ ( వాగు) పారుతూ ఉండేది. చీకటి పడితే భయమేస్తుండేది..దాని పేరు ఎల్లమ్మతోట. 1960 ల తర్వాత ఎప్పుడో ఆ ఎల్లమ్మ తోట లోంచి రోడ్డు వేయడంతో అక్కడంతా పెద్ద బజారు తయారై ఇప్పుడు చాలా బిజీ సెంటరై పోయింది.( ఇది ఇప్పుడు చిత్రాలయ సినిమా ఉన్న రోడ్డు).  సరస్వతీ హాలునుంచి దక్షిణంగా వస్తే వచ్చే సెంటరులో ఛడగాస్ అనే హోటల్ ఉండేది.  అప్పట్లో ఛడగాస్ లో దోశలు స్పెషల్. ఎక్కడెక్కడినుంచీ వచ్చి తిని పోయేవారు.. ఇప్పుడా సెంటరులో ఉన్న డాల్ఫిన్స్ హోటల్ అప్పుడు లేదు. ఈ  ప్రాంతం లో పూర్వం శ్రీ  ఏ.వి. జగ్గారావు దొర వారి మేడ తోట ఉండడం వల్ల దీనికి  డాబా గార్డెన్స్ఠ్ అని పేరు వచ్చింది. డాబాగార్డెన్సు సెంటరునుండి తూర్పుగా వెళ్లే రోడ్డు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ పక్కనుంచి వెళ్లి మెయిన్ బజారులో కలిసేచోటికి దగ్గరలో  ఉన్న పురాతన భవనం పేరు  టర్నర్స్ సత్రం. .దీనికి కావలసిన భూమిని మహారాజా గజపతిరావుగారు విరాళంగా ఇవ్వగా, ప్రజలనుంచి సేకరించిన రూ.30,000 లతో 1894లో దీనిని నిర్మించారు. 1881 నుంచి 1889 వరకూ విశాఖ పట్టణానికి కలెక్టరుగా పనిచేసిన H.G. Turner దొర గారి స్మృత్యర్థం దీనికా పేరు పెట్టారు. అప్పట్లో ఇదొక land mark. ఇప్పుడంటే మెయిన్ రోడ్డులో దీనికి దగ్గరగా జగదంబా ధియేటరు పెద్ద సెంటరై  land mark  అయ్యింది కాని 1960 ల నాటికి అదిలేదు.
 మళ్లా వెనక్కి వచ్చి సరస్వతీ జంక్షన్ నుంచి దక్షిణంగా  వెళ్లే రోడ్డులో కొంచెం దూరం వస్తే అక్కడున్న వీధుల్ని దింపుళ్ల అగ్రహారం అనేవారు. మెయిన్ రోడ్డులోని పూర్ణా జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్కి పోయే రోడ్డుని  సరస్వతీ జంక్షన్ నుంచి వచ్చే రోడ్డు కలిసే చోట ఉందిది.( ఇక్కడో యేడాది పాటు మేము ఉండేవాళ్లమి ).  అంతకు పూర్వమెప్పుడో  రైల్వే స్టేషనుకి పశ్చిమాన ఉన్నశ్మశానానికి మోసుకెళ్తూ పాడె కట్టెలనిక్కడ విశ్రాంతి కోసం దించుకునే వారట. అలా మార్గ మధ్యంలో అక్కడక్కడ పాడెలను దించుకోవడం మనకున్న ఆచారమే. అలా దింపినప్పుడు చనిపోయిన వ్యక్తి లేచి వస్తాడేమోనని ఆశగా ఓ సారి  చూస్తారు. దానినే దింపుడు కళ్లం ఆశ ఆంటారు. అంటే Hope against hope అన్నమాట. అప్పుడు ఇక్కడున్న అగ్రహారానికి ఆ కారణంగా దింపుళ్ల అగ్రహారమనే పేరు వచ్చిందట. శ్మశానం రైల్వే లైనుకు పశ్చిమాన ఉండేదని చెప్పాను కదా. అక్కడికి వెళ్లడానికి స్టేషనుకు ప్రక్కనే రైల్వే లైను క్రిందనుంచి దారి ఉంది. శవాలను ఈ దారిలోంచి తీసుకు వెళ్లడంతో దీనికి చావుల మదుము అని పేరొచ్చిందంటారు. (మదుము అనే ఉత్తరాంధ్ర పదానికి తూము అని అర్థం.). ఇప్పుడు విశాఖ స్టేషను విస్తరించి జ్ఞానాపురం వైపుకూడా Entrance పెట్టేక అటువైపు వెళ్లాల్సిన ప్రయాణీకులందరూ  ఈ చావులమదుము గుండానే వెళ్లాల్సి వస్తోంది.  పూర్ణా జంక్షన్ నుంచి స్టేషనుకు పోయే దారిలో ( దీనిని బౌడారా రోడ్ అని అనే వారని గుర్తు) దక్షిణాన పాత బస్టాండు ఉండేది.  తర్వాత ఎప్పుడో 70 లలో RTC Complex వచ్చేవరకూ ప్రయివేటు బస్సులన్నీ  పాత బస్టాండులోనే ఆగేవి.
1959-61 లో నేను ఓ యేడాది   రామకృష్ణా బీచికి దగ్గరలో ఉండే అఫీషియల్ కోలనీ లోనూ మరో యేడాది  కలక్టరు ఆఫీసుకు ఎదురుగా ఉండే కృష్ణ నగర్ లోనూ ఉండే వాడిని. అఫీషియల్ కోలనీలో  నేనూ మా బావ కలసి అద్దెకున్న గది చాలా చిన్నదే కాని అద్దె నెలకు 7 రూపాయలే..ప్రక్కనున్న కలెక్టరు ఆఫీసు జంక్షనులోనున్న అజంతా హోటలునుంచి భోజనం కేరియరు తెప్పించుకునే వాళ్లమి. ఇద్దరికి సరిపోయే ఆ భోజనం నెలకీ రెండుపూటలకీ 40 రూపాయలు. అజంతా హోటల్ లో టిఫిన్లు చాలా రుచిగా ఉండేవి. ఇడ్లీ ప్లేటు 12 పైసలైతే దోశ 16 పైసలుండేది. అయినా కూడా ఆ రోజుల్లో విశాఖ పట్నంలో ధరలు మహాలావు ( చాలా ఎక్కువ) అనుకునే వారు. ఇప్పటి పిల్లలేమనుకుంటారో?

నేను చదువుకున్న కాలేజీ పేరు  మిసెస్. ఏ.వి.యన్. కాలేజీ. ఇది 1860 వ సంవత్సరంలో ది ఆంగ్లో-వెర్నాక్యులర్ స్కూల్పేరుతో ప్రారంభింపబడింది. విశాఖ కు చెందిన రాజా గజపతిరావు ,బొబ్బిలి, విజయనగరం మహారాజుల పోషణలో చాలాకాలం ఈ స్కూలు నడుస్తూ ఉండేది. 1878 లో దీనిని సెకండు గ్రేడు కాలేజీగా upgrade చేసినప్పుడు దీని పేరు హిందూ కాలేజీ గా మార్చేరట. ఆ తరువాత 1892లో విశాఖ పట్టణానికి చెందిన శ్రీ ఏ..వి.నరసింగరావు గారు వారి సతీమణి పేరిట కాలేజీ నెలకొల్పడానికి గానూ ఒక లక్ష రూపాయలు, బిల్డింగుకోసం 15000 రూపాయలు విరాళం ప్రకటించగా కాలేజీ మానేజింగ్ కమిటీ  హిందూ కాలేజీనే మిసెస్. ఏ.వి.యన్ కాలేజీగా పేరు మార్చి 1-4-1899 నుండి ప్రారంభించారనీ ఆతర్వాత కొద్ది కాలానికే ఇప్పుడున్న కాలేజీ బిల్డింగు కట్టేరనీ తెలుస్తోంది. ఎత్తైన Sand Hill మీద రాతితో కట్టబడి, మేడమీది పోర్టికోనుంచి సముద్రం వైపుచూస్తూ నిరంతరం సముద్రం నుంచి చల్లటి గాలులని ఆహ్వానించే  కాలేజీ ముచ్చటగా ఉంటుంది. దీనికి ఆనుకునే పశ్చిమాన మెడికల్ కాలేజీఉంది.  వెనుకవైపు మధ్యలో ఒక చిన్న పిట్టగోడ  దానిలోంచి దారి ఉండడంతో కాఫీ కోసం మెడికల్ కాలేజీ కాంటీనుకే పోతుండేవారం. ఇదే గుట్టమీద ఉత్తర దిక్కున ఉత్తరాంధ్రలో అతి పెద్దదైన king George Hospital ఉంది. దీని గేటుకెదురుగా ఉన్న ప్రాంతాన్ని మహారాణి పేటఅంటారు. ఈ ప్రాంతంలో చాలా కాలం క్రితం మొదట్లో బ్రిటిష్ పదాతి దళం రెజిమెంట్స్ ఉం డేవనీ 1900 ప్రాంతంలో మహారాజా గజపతిరావు గారు వారి మరణానంతరం మహారాణి వారు ఇచ్చిన 10,000 రూపాయలతో ఎగుడు దిగుడుగా ఉన్న ఈ ప్రాంతాన్ని నివాసయోగ్యంగా తీర్చి దిద్దిన తర్వాత ఇక్కడ వెలసిన పేటకు మహారాణీ పేట అని పేరొచ్చిందట.  ఈ ప్రాంతంలో 1920-30 లలో చదరపు గజం అక్షరాలా రెండణాలు,( అంటే రూపాయలో 8వ వంతు) అమ్మకానికి వస్తే కారణాంతరాల వల్లమా తాతగారు తాను కొన లేదని చెప్పేవారు.
విశాఖ పట్నం ముచ్చట్లు ఎన్నైనా ఉంటాయి గాని, విశాఖలో నాకు నచ్చని విషయం కూడా ఒకటి చెప్పి ముగిస్తాను.  , విశాఖలో ఏడాదిలో చాలా కాలం వాతావరణం  ఉక్కపోత అధికంగా ఉంటూ మనకి చికాకు కలిగించేదిగా ఉంటుంది. బయట తిరిగొస్తే చాలు వేసుకున్న బట్టలన్నీ చెమటతో తడిసి ముద్దై పోతాయి. ఇప్పుడంటే ఇలా మాట్లా డుతున్నాను కానీ, మాకాలేజీ రోజుల్లో  ఈ  ధ్యాసే ఉండేది కాదు. ఆఫీషియల్ కోలనీ, కృష్ణ నగర్ లో ఉండే రోజుల్లో రోజూ KGH డౌన్లో దిగి మెయిన్ బజారంతా చూసుకుంటూ చివర్లోని పాత పోస్టాఫీసు దగ్గర వెనక్కి తిరిగి AVN College up ఎక్కి రామకృష్ణా బీచికి వచ్చి కూర్చుని సేద దీరేక  రూములకు పోయే వారము.  ఆ సముద్రపు గాలి ఎంతటి అలసటనూ పోగొట్టేది. ఇదే విషయాన్ని సరదాగా ఇలా చెప్పుకున్నాను:
వైజాగ్లో చిన్నప్పుడు
ఎన్ జాయ్ చేస్తూ తిరిగిన ఎండల వేడిన్
విన్ జామరలై తీర్చెను
సన్ జాకాలపు విశాఖ సలిల సమీరం

 ఇప్పటికీ నాకు అక్కడ మంద్ర మంద్రంగా వీస్తూ మనస్సులకి హాయిగొలిపే ఆ చల్లగాలి నాస్వాదిస్తూ, ఆగకుండా నిరంతరం ఉండే ఆ అలల సవ్వడి వింటుంటే, మధుర స్వనంతో ఆగకుండా నవ్వే మా మధురవాణే గుర్తొస్తుంది.
                                                                     *****