2, జూన్ 2012, శనివారం

మా విశాఖ పట్నం కబుర్లు..


నేనూ..మా మధురవాణీ.. మా విశాఖ పట్నఁవున్నూ..   (రెండో భాగం)
  
ఇంతకు ముందు పోస్టులో విశాఖ పట్నానికున్న వెయ్యేళ్ల చరిత్ర గురించి టూకీ గా చెబుతూ  మా వూరికా పేరెలా వచ్చిందో చెప్పాను. ఇప్పుడు మా వూళ్లోని కొన్ని కొన్ని ప్రాంతాలకా పేర్లెలా వచ్చేయో చెబుతూ నా చిన్నప్పటి విశాఖ పట్నం గురించి  ఆ ఊరితో నాకు గల అనుబంధం గురించి రెండుముక్కలు  చెబుతాను:
ప్రస్తుతం తూర్పు సాగర తీరంలో ఉత్తరాన కొల్కత్తా దక్షిణాన చెన్నైలకు మధ్యగా అతి పెద్ద రేవు పట్టణంగా విరాజిల్లుతున్న విశాఖ  పట్టణం వంటి నగరం ఆంధ్ర ప్రదేశ్ లో సాగర తీరంలో మరోటి లేదు. బంగాళా ఖాతం లోంచి తూర్పు తీరంలోని విశాఖ రేవు వైపు వస్తూనే సుదూర ప్రాంతంనుంచి దర్శన మిచ్చేవి డాల్ఫిన్స్ నోస్ కొండా.. రాత్రి పూట దాని మీద వెలిగే లైట్ హవుసున్నూ.. ఇప్పుడంటే దానిని డాల్పిన్స్ నోస్ అని పిలుస్తున్నాం కాని ఓ రెండు శతాబ్దాల క్రితం దాని పేరు బ్లాక్ మోర్స్ హిల్.”. బ్రిటిష్ పదాతి దళానికి చెందిన కెప్టెన్ బ్లాక్ మోర్  ఈ కొండమీద ఇల్లు కట్టుకుని ఉండే వాడట. అంతే కాదు 1801 లో కంపెనీ వారినుంచి 44 ఎకరాల భూమిని పొంది క్రింద సముద్రం వరకూ సుందరంగా తీర్చి దిద్దుకున్నాడట. ఇక్కడ అతకుముందే ఒక లైట్ హవుస్ ఉండేది కానీ అది 1876 లో వచ్చిన పెను తుఫానులో నామ రూపాలు లేకుండా పోయిందిట. ఇప్పుడు డాల్ఫిన్స్ నోస్ మీదున్న లైట్ హవుస్  పురాతనమైంది కాదు.. అంతకు ముందు పాత లైట్ హవుస్ విశాఖ పట్నంలో టౌన్ హాల్ కెదురుగా ఉండేది. మా చిన్నప్పుడు విశాఖ బీచిలో ఈ లైట్ హవుస్ దగ్గరలో చెంగల్రావు పేట బీచిలో ఆడుకోవడం నాకింకా గుర్తే.

ఉత్తర దక్షిణాలుగా సాగే కలకత్తా- చెన్నైల రైలుమార్గం లోనే ఉన్నా విశాఖ పట్టణానికి వచ్చే రైళ్లన్నీముందుకు సాగడానికి లేదు. స్టేషనులోంచి మళ్లా వెనక్కి తిరిగి  ఉత్తరానికో దక్షిణానికో వెళ్లాల్సిందే. ఇక్కడనుంచి రాయపూర్ వైపు వెళ్లే ట్రయిన్లు ఉండడం వల్ల దీనిని విశాఖ పట్టణం జంక్షన్ అని అన్నారు. ఇప్పుడంటే దీనిని విశాఖ పట్టణం స్టేషనని పిలుస్తున్నారుగానీ  మా చిన్నప్పుడు దీని పేరు వాల్తేర్  ( Waltair)  జంక్షన్.  పాత విశాఖ పట్టణం స్టేషను ఇంకా రెండు మూడు మైళ్లు లోపలికి  పోర్టుకు దగ్గరగా ఉంది. ఆ రోజుల్లో పాసెంజరు రైళ్లు ఈ పాత విశాఖ పట్టణం వరకూ వచ్చిపోతుండేవి. ఇక్కడో ముచ్చట చెబుతాను. నా చిన్నప్పుడో సారి నేను ఒంటరిగా మా వూరు పార్వతీ పురం నుంచి రాయపూర్ పాసింజరు రైల్లో విశాఖ పట్టణం వస్తున్నాను. సాయంత్రం ఐదు గంటలకి మా ఊళ్లో బయల్దేరిన బండి  వాల్తేరుకు రాత్రి ఏ తొమ్మిదికో చేరాలి. కాని ఏదో కారణం వల్ల బాగా ఆలస్యమయింది. నేనేక్కడో నిద్ర పోతూ ఉండి పోయాను. వాల్తేరు స్టేషను రావడం అక్కడ చాలా సేపు ఆగడం కూడా నాకు తెలియదు. ఆ స్టేషను దాటి రైలు విశాఖ పట్టణం స్టేషనుకు పోతున్నాది.ఒక్కసారిగా భరింపరాని దుర్గంధం ముక్కుపుటాల్ని తాకడంతో నాకు తెలివొచ్చింది. దానిక్కారణం వాల్తేరు నుంచి విశాఖ పట్టణం చేరేలోగా రైలు ఉప్పుటేరు ప్రక్కనుంచి ప్రయాణించవలసి రావడమే. Sea Back Waters ఉప్పుటేరులో చేరి నిలవ ఉండడమే ఆ దుర్గంధానికి కారణం. ఇప్పటికీ ఆ పరిసర ప్రాంతాలకి ఈ కంపు బాధ తప్పలేదనుకుంటాను. ఈ విశాఖ పట్టణం స్టేషన్ని వాల్తేర్ అనే వారని చెప్పాను కదా. దానికి కారణం పాత విశాఖ పట్టణం ఊరు దక్షిణాన ఉంటే దానికి ప్రక్కనే ఉత్తరాన వాల్తేరు గ్రామం ఉండేది . ఇప్పటికీ ఆంధ్రా యూనివర్సిటీ ఉండే ప్రాంతాన్ని పెద వాల్తేరనీ చిన వాల్తేరనీ వ్యవహరిస్తూఉంటారు. . ఇది వాల్తేరు ఎస్టేటులో భాగం ఇప్పటి అల్లిపురం మద్దిల పాలెం వాల్తేరు ప్రాంతాలతో కూడిన వాల్తేరు ఎస్టేటుని 1802 లో ఒకవేలం పాటలో అప్పట్లో  విశాఖ పట్టణం కలెక్టరు కచ్చేరీలో పెద్దపదవిలో ఉండిన మొసలికంటి వెంకోజీ అనే ఆసామీ కొనుక్కున్నాడట.ఈ వెంకోజీ పేరిటే ఇప్పుడున్న వెంకోజీ పాలం వెలసి ఉండొచ్చు.
 1950 ల నాటికి ఈ వాల్తేరు (ఇప్పటి విశాఖ పట్టణం) స్టేషనూ మరీ పెద్ద స్టేషనేం కాదు. చీకటి పడితే స్టేషన్ నుంచి బయట పడి ఊళ్లోకి వెళ్లడానికి భయమేస్తూ ఉండేది. ఇప్పుడంటే స్టేషనుకెదురుగా RTC కాంప్లెక్సుకు పోయే పెద్ద రోడ్డు ఉంది కాని అప్పుడదేమీ లేదు. స్టేషను బయటకొచ్చి ఇసకతోటవైపునుంచి ఉన్న రోడ్డులోంచి ఊళ్లోకెళ్లాల్సి వచ్చేది. రాత్రి పూట ఇది నిర్మానుష్యంగా ఉండేది. ఊళ్లోకెళ్లడానికి మనుషులు లాగే రిక్షాలూ ఒంటెద్దులు లాగే పెట్టె బళ్లూఉండేవి.
1957 లో నేను మా మేనమామలతో కలిసి డాబాగార్డన్స్ లో సరస్వతీ మహల్ సినిమా ధియేటరుకు ఎదురుగా ఉండే మేడలో ఉండే వాణ్ణి.( ఈ ధియేటరుని ఈ మధ్యనే పడగొట్టుతున్నట్లు చూసేను. మా చిన్నప్పుడు అది చాలా మంచి ధియేటరు.). అప్పుడే కొత్తగా పెట్టిన ప్రీ-యూనివర్శిటీ కోర్సు ( first batch) లో చేరాను. అప్పట్లో డాబాగార్డన్సులో  ఈ ధియేటరుకు  ఉత్తరాన చిన్న పార్కు ఉండేది కాని దాని తర్వాత  పెద్దగా ఇళ్లు కాని ఊరు కాని ఉండేవి కావు. ధియేటరు కెదురుగా ఉన్న మా ఇళ్లకి వెనుకంతా ఖాళీ జాగానే ఉండేది.అక్కడక్కడా కొన్ని చెట్లుండేవి. మధ్యలో ఒక గెడ్డ ( వాగు) పారుతూ ఉండేది. చీకటి పడితే భయమేస్తుండేది..దాని పేరు ఎల్లమ్మతోట. 1960 ల తర్వాత ఎప్పుడో ఆ ఎల్లమ్మ తోట లోంచి రోడ్డు వేయడంతో అక్కడంతా పెద్ద బజారు తయారై ఇప్పుడు చాలా బిజీ సెంటరై పోయింది.( ఇది ఇప్పుడు చిత్రాలయ సినిమా ఉన్న రోడ్డు).  సరస్వతీ హాలునుంచి దక్షిణంగా వస్తే వచ్చే సెంటరులో ఛడగాస్ అనే హోటల్ ఉండేది.  అప్పట్లో ఛడగాస్ లో దోశలు స్పెషల్. ఎక్కడెక్కడినుంచీ వచ్చి తిని పోయేవారు.. ఇప్పుడా సెంటరులో ఉన్న డాల్ఫిన్స్ హోటల్ అప్పుడు లేదు. ఈ  ప్రాంతం లో పూర్వం శ్రీ  ఏ.వి. జగ్గారావు దొర వారి మేడ తోట ఉండడం వల్ల దీనికి  డాబా గార్డెన్స్ఠ్ అని పేరు వచ్చింది. డాబాగార్డెన్సు సెంటరునుండి తూర్పుగా వెళ్లే రోడ్డు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ పక్కనుంచి వెళ్లి మెయిన్ బజారులో కలిసేచోటికి దగ్గరలో  ఉన్న పురాతన భవనం పేరు  టర్నర్స్ సత్రం. .దీనికి కావలసిన భూమిని మహారాజా గజపతిరావుగారు విరాళంగా ఇవ్వగా, ప్రజలనుంచి సేకరించిన రూ.30,000 లతో 1894లో దీనిని నిర్మించారు. 1881 నుంచి 1889 వరకూ విశాఖ పట్టణానికి కలెక్టరుగా పనిచేసిన H.G. Turner దొర గారి స్మృత్యర్థం దీనికా పేరు పెట్టారు. అప్పట్లో ఇదొక land mark. ఇప్పుడంటే మెయిన్ రోడ్డులో దీనికి దగ్గరగా జగదంబా ధియేటరు పెద్ద సెంటరై  land mark  అయ్యింది కాని 1960 ల నాటికి అదిలేదు.
 మళ్లా వెనక్కి వచ్చి సరస్వతీ జంక్షన్ నుంచి దక్షిణంగా  వెళ్లే రోడ్డులో కొంచెం దూరం వస్తే అక్కడున్న వీధుల్ని దింపుళ్ల అగ్రహారం అనేవారు. మెయిన్ రోడ్డులోని పూర్ణా జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్కి పోయే రోడ్డుని  సరస్వతీ జంక్షన్ నుంచి వచ్చే రోడ్డు కలిసే చోట ఉందిది.( ఇక్కడో యేడాది పాటు మేము ఉండేవాళ్లమి ).  అంతకు పూర్వమెప్పుడో  రైల్వే స్టేషనుకి పశ్చిమాన ఉన్నశ్మశానానికి మోసుకెళ్తూ పాడె కట్టెలనిక్కడ విశ్రాంతి కోసం దించుకునే వారట. అలా మార్గ మధ్యంలో అక్కడక్కడ పాడెలను దించుకోవడం మనకున్న ఆచారమే. అలా దింపినప్పుడు చనిపోయిన వ్యక్తి లేచి వస్తాడేమోనని ఆశగా ఓ సారి  చూస్తారు. దానినే దింపుడు కళ్లం ఆశ ఆంటారు. అంటే Hope against hope అన్నమాట. అప్పుడు ఇక్కడున్న అగ్రహారానికి ఆ కారణంగా దింపుళ్ల అగ్రహారమనే పేరు వచ్చిందట. శ్మశానం రైల్వే లైనుకు పశ్చిమాన ఉండేదని చెప్పాను కదా. అక్కడికి వెళ్లడానికి స్టేషనుకు ప్రక్కనే రైల్వే లైను క్రిందనుంచి దారి ఉంది. శవాలను ఈ దారిలోంచి తీసుకు వెళ్లడంతో దీనికి చావుల మదుము అని పేరొచ్చిందంటారు. (మదుము అనే ఉత్తరాంధ్ర పదానికి తూము అని అర్థం.). ఇప్పుడు విశాఖ స్టేషను విస్తరించి జ్ఞానాపురం వైపుకూడా Entrance పెట్టేక అటువైపు వెళ్లాల్సిన ప్రయాణీకులందరూ  ఈ చావులమదుము గుండానే వెళ్లాల్సి వస్తోంది.  పూర్ణా జంక్షన్ నుంచి స్టేషనుకు పోయే దారిలో ( దీనిని బౌడారా రోడ్ అని అనే వారని గుర్తు) దక్షిణాన పాత బస్టాండు ఉండేది.  తర్వాత ఎప్పుడో 70 లలో RTC Complex వచ్చేవరకూ ప్రయివేటు బస్సులన్నీ  పాత బస్టాండులోనే ఆగేవి.
1959-61 లో నేను ఓ యేడాది   రామకృష్ణా బీచికి దగ్గరలో ఉండే అఫీషియల్ కోలనీ లోనూ మరో యేడాది  కలక్టరు ఆఫీసుకు ఎదురుగా ఉండే కృష్ణ నగర్ లోనూ ఉండే వాడిని. అఫీషియల్ కోలనీలో  నేనూ మా బావ కలసి అద్దెకున్న గది చాలా చిన్నదే కాని అద్దె నెలకు 7 రూపాయలే..ప్రక్కనున్న కలెక్టరు ఆఫీసు జంక్షనులోనున్న అజంతా హోటలునుంచి భోజనం కేరియరు తెప్పించుకునే వాళ్లమి. ఇద్దరికి సరిపోయే ఆ భోజనం నెలకీ రెండుపూటలకీ 40 రూపాయలు. అజంతా హోటల్ లో టిఫిన్లు చాలా రుచిగా ఉండేవి. ఇడ్లీ ప్లేటు 12 పైసలైతే దోశ 16 పైసలుండేది. అయినా కూడా ఆ రోజుల్లో విశాఖ పట్నంలో ధరలు మహాలావు ( చాలా ఎక్కువ) అనుకునే వారు. ఇప్పటి పిల్లలేమనుకుంటారో?

నేను చదువుకున్న కాలేజీ పేరు  మిసెస్. ఏ.వి.యన్. కాలేజీ. ఇది 1860 వ సంవత్సరంలో ది ఆంగ్లో-వెర్నాక్యులర్ స్కూల్పేరుతో ప్రారంభింపబడింది. విశాఖ కు చెందిన రాజా గజపతిరావు ,బొబ్బిలి, విజయనగరం మహారాజుల పోషణలో చాలాకాలం ఈ స్కూలు నడుస్తూ ఉండేది. 1878 లో దీనిని సెకండు గ్రేడు కాలేజీగా upgrade చేసినప్పుడు దీని పేరు హిందూ కాలేజీ గా మార్చేరట. ఆ తరువాత 1892లో విశాఖ పట్టణానికి చెందిన శ్రీ ఏ..వి.నరసింగరావు గారు వారి సతీమణి పేరిట కాలేజీ నెలకొల్పడానికి గానూ ఒక లక్ష రూపాయలు, బిల్డింగుకోసం 15000 రూపాయలు విరాళం ప్రకటించగా కాలేజీ మానేజింగ్ కమిటీ  హిందూ కాలేజీనే మిసెస్. ఏ.వి.యన్ కాలేజీగా పేరు మార్చి 1-4-1899 నుండి ప్రారంభించారనీ ఆతర్వాత కొద్ది కాలానికే ఇప్పుడున్న కాలేజీ బిల్డింగు కట్టేరనీ తెలుస్తోంది. ఎత్తైన Sand Hill మీద రాతితో కట్టబడి, మేడమీది పోర్టికోనుంచి సముద్రం వైపుచూస్తూ నిరంతరం సముద్రం నుంచి చల్లటి గాలులని ఆహ్వానించే  కాలేజీ ముచ్చటగా ఉంటుంది. దీనికి ఆనుకునే పశ్చిమాన మెడికల్ కాలేజీఉంది.  వెనుకవైపు మధ్యలో ఒక చిన్న పిట్టగోడ  దానిలోంచి దారి ఉండడంతో కాఫీ కోసం మెడికల్ కాలేజీ కాంటీనుకే పోతుండేవారం. ఇదే గుట్టమీద ఉత్తర దిక్కున ఉత్తరాంధ్రలో అతి పెద్దదైన king George Hospital ఉంది. దీని గేటుకెదురుగా ఉన్న ప్రాంతాన్ని మహారాణి పేటఅంటారు. ఈ ప్రాంతంలో చాలా కాలం క్రితం మొదట్లో బ్రిటిష్ పదాతి దళం రెజిమెంట్స్ ఉం డేవనీ 1900 ప్రాంతంలో మహారాజా గజపతిరావు గారు వారి మరణానంతరం మహారాణి వారు ఇచ్చిన 10,000 రూపాయలతో ఎగుడు దిగుడుగా ఉన్న ఈ ప్రాంతాన్ని నివాసయోగ్యంగా తీర్చి దిద్దిన తర్వాత ఇక్కడ వెలసిన పేటకు మహారాణీ పేట అని పేరొచ్చిందట.  ఈ ప్రాంతంలో 1920-30 లలో చదరపు గజం అక్షరాలా రెండణాలు,( అంటే రూపాయలో 8వ వంతు) అమ్మకానికి వస్తే కారణాంతరాల వల్లమా తాతగారు తాను కొన లేదని చెప్పేవారు.
విశాఖ పట్నం ముచ్చట్లు ఎన్నైనా ఉంటాయి గాని, విశాఖలో నాకు నచ్చని విషయం కూడా ఒకటి చెప్పి ముగిస్తాను.  , విశాఖలో ఏడాదిలో చాలా కాలం వాతావరణం  ఉక్కపోత అధికంగా ఉంటూ మనకి చికాకు కలిగించేదిగా ఉంటుంది. బయట తిరిగొస్తే చాలు వేసుకున్న బట్టలన్నీ చెమటతో తడిసి ముద్దై పోతాయి. ఇప్పుడంటే ఇలా మాట్లా డుతున్నాను కానీ, మాకాలేజీ రోజుల్లో  ఈ  ధ్యాసే ఉండేది కాదు. ఆఫీషియల్ కోలనీ, కృష్ణ నగర్ లో ఉండే రోజుల్లో రోజూ KGH డౌన్లో దిగి మెయిన్ బజారంతా చూసుకుంటూ చివర్లోని పాత పోస్టాఫీసు దగ్గర వెనక్కి తిరిగి AVN College up ఎక్కి రామకృష్ణా బీచికి వచ్చి కూర్చుని సేద దీరేక  రూములకు పోయే వారము.  ఆ సముద్రపు గాలి ఎంతటి అలసటనూ పోగొట్టేది. ఇదే విషయాన్ని సరదాగా ఇలా చెప్పుకున్నాను:
వైజాగ్లో చిన్నప్పుడు
ఎన్ జాయ్ చేస్తూ తిరిగిన ఎండల వేడిన్
విన్ జామరలై తీర్చెను
సన్ జాకాలపు విశాఖ సలిల సమీరం

 ఇప్పటికీ నాకు అక్కడ మంద్ర మంద్రంగా వీస్తూ మనస్సులకి హాయిగొలిపే ఆ చల్లగాలి నాస్వాదిస్తూ, ఆగకుండా నిరంతరం ఉండే ఆ అలల సవ్వడి వింటుంటే, మధుర స్వనంతో ఆగకుండా నవ్వే మా మధురవాణే గుర్తొస్తుంది.
                                                                     *****10 వ్యాఖ్యలు:

వెన్నెల్లో ఆడపిల్ల చెప్పారు...

మన విశాఖపట్నం గురించి తెలియని విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు ..
మీరు చెప్పిన విషయాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.. నేను చూసిన విశాఖపట్నం అంతా బాగా అభివ్రుద్ది చెందినదే..

Pantula gopala krishna rao చెప్పారు...

వె. ఆ. గారికి కృతజ్ఞతలు.మేం చదువుకునే రోజుల్లో విశాఖ పట్నం పరికిణీ వోణీ వేసుకుని ముగ్దమోహనంగా అమాయకంగా వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్ల లాగానే ఉండేది. ఇప్పుడది అన్నిశృంగార చేష్టలతో ప్రౌఢతనాన్ని సంతరించుకుని జాణ తనాన్ని వెలార్చే వెలయాలి లాగా వెలిగిపోతోంది.

పంతుల జోగారావు చెప్పారు...

విశాఖ కబుర్లు చాలా చక్కగా చెప్పారండీ. కళ్ళకి మన విశాఖ కట్టినట్టుగా ఉంది. తెలియని విషయాలు కొన్ని చక్కగా చెప్పారు. చివర్లో చిన్న దిష్టి చుక్క మాత్రం పెట్టి వదిలారు. ఉక్క పోత గురించి. ఉక్కు నగరానికి అదే కొండ గుర్తు కూడానూ.

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగా చెప్పారండి.
మంచి విషయాలు తెలుసుకున్నాను.
విశాఖ గురించి ఇన్ని విషయాలు తెలుసుకొవడం ఇదై మొదటిసారి.
:venkat

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
విశాఖ వైభవం ఛాలా బాగుంది .అవును " మనుషులు లాగే " రిక్షాలు కొంచం గుర్తు. డాబా గార్డెన్ లోనే ఉండే వాళ్ళం. వాల్టేర్ అనే ఉండేది. బీచి అదీ కొద్దిగా గుర్తు. ఇంకా ఆరోజుల్లో " కానీలు , అర్ధనాలు , అణాలు బేడలు , పావలాలు , ఇలా ఉండేవి కదా ! వెండి రూపాయలే అని గుర్తు. ప్చ్ ! ఆ రోజులే ఎంత బాగుం డేవో ? ఆ సంద్రపు గాలి , అసలు ఆ వైభవాలు ఇప్పుడు గగన కుసుమాలు . ఒక్క క్షణం భూతల స్వర్గంలో విహరింప జేశారు హేట్సాఫ్ !

Pantula gopala krishna rao చెప్పారు...

అజ్ఞాత, పంజో, రాజేశ్వరి గార్లకు కృతజ్ఞతలు.నాకు తెలిసినవీ, నేను తెలుసుకున్నవీ మీ అందరితో పంచుకుంటున్నాను. ఆముచ్చట్లు ఎవరిని అలరించినా ఆనందదాయకమే కదా? కానీలు అర్థణాలూ అవీ మార్చి 1956వరకూ చలామణిలో ఉండేవి. కానీకి మూడు దమ్మిడీలు. కాని అవి మా చిన్నప్పడికే చలామణిలోలేవు. మా చిన్నప్పుడు లెక్కలన్నీ వాటిల్లోనే. ధశాంశమానం కాకపోవడంతో అణాల పైసల లెక్కలు కష్టంగా ఉండేవి. 1-4-1956 నుంచి నయాపైసలు అమలులోకొచ్చాయి.వాటినే అపురూపంగా దాచుకునే వారం. ఇప్పటి పిల్లలకి రూపాయలే తప్పపైసలే తెలియవు.విశాఖ పట్టణం మహారాణి పేట లాంటి స్థలంలో చదరపు గజం రెండణాలు (1/8 రూపాయ) అంటే ఇప్పటివారెవరైనా నమ్మగలరా?

పంతుల సీతాపతి రావు చెప్పారు...

విశాఖపట్నం వివరాలు చాలా బాగా చెప్పారు
మళ్ళీ ఆరోజులు గుర్తుకోచ్చేయ్
వివరాలు అద్భుతంగా చెప్పినందుకు ధన్య వాదాలు

Narayanaswamy S. చెప్పారు...

awesome. enjoyed very much. Please do write more about your childhood and college days

అజ్ఞాత చెప్పారు...

visakha premikulaku adbhutha akshara haaram. thelipondi mee znapakalalo.
-Sreedhar Parupalli

Pantula gopala krishna rao చెప్పారు...

శ్రీ పారుపల్లి శ్రీధర్ గారికి, ఎప్పుడో వ్రాసిన ఈ పోస్టు ఇప్పుడు చదివినా స్పందించినందుకు ధన్యవాదాలు.