14, జులై 2012, శనివారం

దండిభొట్ల వారి దర్జా..(విద్వాన్ సర్వత్ర పూజ్యతే.)



స్వగృహే పూజ్యతే మూర్ఖః  స్వగ్రామే పూజ్యతే ప్రభుః
స్వదేశే పూజ్యతే రాజా  విద్వాన్సర్వత్ర పూజ్యతే--
అంటే మూర్ఖుడిని వారి ఇంటిలోని వారే గౌరవిస్తారు ( వాని మీద ఆధార పడి బ్రతుకు తారు కనుక తప్పదుకదా ? ). గ్రామాధికారికి తన వూళ్ళోనే మర్యాద ఉంటుంది. రాజుకు తన రాజ్యంలోనే గౌరవం. కానీ విద్వత్తు ఉన్న వాడు  ప్రపంచంలో ఎక్కడైనా గౌరవింపబడుతాడని భావం. ఎంత చక్కటి నిజం!
ఇది ఎరిగిన వారు కనుకనే పండితులైన వారు తమ పాండిత్యాన్ని కాపాడుకుంటూ మర్యాదగా జీవించేవారు. బ్రాహ్మణుడైన వాడు ధనాశను వీడి తనకు లభించిన దానితో సంతృప్తిని చెంది మరునాటి గురించి కూడా ఆలోచించకుండా జీవించాలట. ఇది సనాతన బ్రాహ్మణ ధర్మం. అందువల్లనే  కొందరు బ్రాహ్మణోత్తములైన పండితులు తమ పాండిత్యాన్నే నమ్ముకుని ఎవరి ఆశ్రయం కోసం పాకులాడక స్వతంత్ర ప్రవృత్తితో ఎన్ని కష్టాలనైనా ఓర్చుకుంటూ రాజులనైనా లెక్కచేయకుండా మహోన్నత వ్యక్తిత్వంతో జీవించేవారు. ఇలాంటి మహాను భావులగురించి ఇంతకు ముందు పోస్టు ( డబ్బంటే చేదా..) లో చెప్పి ఉన్నాను.  ఆ టపా చదవడం కోసం
( ఇక్కడ నొక్కండి ) ఇటువంటి మహానుభావుడు మరొకరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలాకాలం క్రితం కాశీలో మహాపండితులు కాపురం ఉండేవారు. అలాంటి వారిలో మన తెలుగు వారైన దండిభొట్ల విశ్వనాథశాస్త్రి గారొకరు. వారు తెలుగు వారనే మనకు తెలుసు గాని ఎక్కడి వారో తెలియదు. వారి అత్తవారిది మాత్రం గోదావరి జిల్లాలో నేదునూరి ప్రాంతం. ఆయన తన చిన్నతనం లోనే భార్యతో కలసి కాశీ వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టారు. పిల్లా పీచూ ఎవరూ లేరు. వీరు ఏం దర్జాగా బ్రతికేరో చూడండి:
అప్పట్లో విజయనగర సంస్థానాధీశులైన ఆనందగజపతి రాజుగారు ఏడాది లో కొన్నినెలల పాటు కాశీలో ఉంటూ ఉండేవారు. స్వయంగా పండితులైన ఆనంద గజపతిగారికి సాహిత్యాభిలాష మెండుగా ఉండేది. పాండిత్య సభలు ఏర్పాటు చేసి  కాశీలోని పండితులందరినీ గౌరవిస్తూ ఉండేవారు. ఇదిగో ఇలాంటి సమయాల్లోనే దండిభొట్ల వారికీ ఆనందగజపతుల వారికీ పరిచయం ఏర్పడి స్నేహంగా వృధ్ధి చెందింది.
ఒకసారి దండిభొట్ల వారు దక్షిణ దేశం  రైల్లోవస్తూ విజయనగరంలో దిగారు. ముతక పంచె మాసిన గడ్డం పొడుగాటి లాంకోటూ ఇదీ వారి వేషం. చేతిలో సంచీ కూడా లేదు. రైలు దిగీ దిగడంతో సరాసరి రాజుగారి కోటకే వెళ్లారు. తాను రాజుగారి మిత్రుడినని అనర్గళంగా హిందీలో చెబుతున్నఈ పండితుణ్ణి నివారించడానికి అక్కడున్నఉత్తరాది సైనికులెవరూ సాహసించేలేక పోయారు. శాస్త్రిగారు నేరుగా రాజమహల్ హల్లో ప్రవేశించి కుర్చీలో కూర్చున్నారు. అక్కడకు వచ్చిన అంతరంగికుడైన పనివాడిని పిలిచి రాజుగారితో దండిభొట్ల విశ్వనాథం వచ్చేడని చెప్పమన్నారు. దానికిది సమయం కాదు బాబూ అంటూ అతడు సంశయిస్తున్నంత లోనే శాస్త్రిగారి గొంతు గుర్తు పట్టి రాజా వారు హాల్లోకి వచ్చి శాస్త్రిగారిని ఎప్పుడు వచ్చేరని అడిగితే దానికాయన తాను ఊరికే దక్షిణాదికి వెళ్ళి వద్దామని బయల్దేరాననీ ఇంతలో రైలు బరం పురం వచ్చే సరికి తన దగ్గర భంగు అయిపోయిందనీ అది విజయనగరం ప్రభువుల వద్దనే దొరుకుతుందని తెలిసి ఇటు వచ్చానని అన్నారు. రాజు గారు పాలు మిఠాయిలూ భంగూ తెప్పిస్తే ఇద్దరూ కలిసి వాటిని సేవించాక  మరికొంత భంగుని పొట్లం కట్టించి జేబులో వేసుకుని ఇక వెళ్ళి వస్తానని రాజుగారిని సెలవడిగారట. రాజుగారు నాలుగు రోజులుండి తమ ఆతిధ్యం స్వీకరించమనీ,  తమ ఆస్థాన పండితుల వారింట బస చేయమని కోరితే  తానెవ్వరి ఇంటా బస చేయనని రైలు స్టేషను దగ్గర మంచుకొండ వారి సత్రం చూసేనని అక్కడ ఆ రోజుకి ఉండి మరునాడు ఉదయం 10 గంటల రైల్లో వెళ్ళిపోతాననీ చెప్పారు. రాజుగారు ఆసాయంత్రం తమ ఆస్థాన పండితుల్ని పిలిచి పండితులందరూ వెళ్ళి సత్రంలో శాస్త్రిగారి దర్శనం చేసుకోమని ఆజ్ఞాపించేరు.. మరునాడు వారందరూ తమతమ శిష్యగణంతో పాటు శాస్త్రిగారిని దర్శనం చేసుకున్నారు. వారి కోరిక పై  దండిభొట్లవారు వారి శిష్యులను పరీక్ష చేసి వారిలో శేఖరం (వ్యాకరణ గ్రంథం) చదువుకుంటున్న అబ్బాయి చాలా పైకి వస్తాడనీ అయితే ఆ అబ్బాయి వేసుకున్న ఇస్తిరీ బట్టలూ షోకూ శాస్త్రానికి పనికి రావనీ అన్నారు. ( ఆ ఇస్తిరీ బట్టల అబ్బాయి మరెవరో కాదు- తరువాతి కాలంలో మహామహోపాధ్యాయ బిరుదు పొందిన రాయుడు శాస్త్రిగారే). ఆ తర్వాత వారు టిక్కట్టు కొని ఇస్తామన్నా వద్దని వారిస్తూ తమను రైల్లో టికట్టు ఎవరూ అడగరని చెబుతూ రైలెక్కి వెళ్లిపోయారు.  
                                                           ***
మహా వ్యాకరణ పండితులైన విశ్వనాథం గారికి  కాశీలో అనేక మైన పండిత సభల్లో రెండేసి శాలువలను కప్పేవారు. వారు సభానంతరం ఇంటికి వస్తూ వస్తూ దారిలోఇద్దరు వేద వేత్తలైన పండితులను ఇంటికి పిలుచుకు పోయి భార్యతో ఏమేవ్ వేదవేత్తలొచ్చారు, వీరు దేవతా స్వరూపులు. వీరికి చెరొక శాలువా ఇచ్చి నమస్కరించుకో అనే వారు. తమకోసం ఏనాడూ ఏదీ మిగుల్చుకోలేదు. కప్పుకోవడానికి వారికి మామూలు దుప్పట్లే గతి.
                                                        ***
ఒక సారి  వారి శ్రీమతికి శివరాత్రికి కోటిపల్లి వెళ్ళాలని మనసైంది. ఆవిడ కోరిక తీర్చడం కోసం వారిద్దరూ శివరాత్రికి ఒక వారం ముందరే కాశీలో బయల్దేరి రైల్లో కాకినాడ వరకూ వచ్చారు.
 ( రైల్లో ఏనాడూ ఎవరూ వారిని టికట్టు అడిగే వారు కారట ) . అక్కడినుండి కోటిపల్లికి బండిమీద వెళ్ళడానికి వారి దగ్గర డబ్బులు లేక నడిచే అంచెలంచెలుగా ప్రయాణిస్తూ శివరాత్రి నాడు సూర్యోదయ సమయానికి కోటి పల్లి చేరుకున్నారు. అది శివరాత్రి పర్వదినం కావడంతో చాలారద్దీగా ఉంది, వారు భార్యను ఒడ్డునే తమ సంచీ చూసుకుంటూ ఉండమని తాను గోదావరిలో స్నానం చేసి వచ్చారు. తర్వాత ఆమెనుస్నానం చేసిరమ్మంటే ఆమె తటపటాయిస్తూఎంత సేపు ములిగి రావాలి కాకి స్నానమేగా అంది. ఆమె చూస్తున్న గోదావరి వైపు ఆయన దృష్టి సారించేసరికి  వారికి అక్కడ స్నానాలు చేస్తూ బ్రాహ్మణులందరికీ రూపాయిలు దానం చేస్తున్న ధనికులైన కమ్మవారి ఆడువారు కనిపించేరు. తమ భార్య మనోగతాన్ని గ్రహించిన వారై వారి లాగా దానాలివ్వడానికి డబ్బులేదనేగా నీ సందేహం. జాగ్రత్తగాఇక్కడే ఉండు ఇప్పుడే తెస్తాను అంటూ  పిఠాపురం రాజావారు శ్రీ హరిశాస్త్రి గారింట బస చేసారని తెలుసుకుని అక్కడకు వెళ్ళారు. అప్పుడే స్నానాదులు ముగించుకుని సోమేశ్వర స్వామి దర్శనానికి బయల్దేరబోతున్న రాజు గారు వీరినిచూసి ఆగారు. కుశల ప్రశ్నలయేక ఏమిటిలా దయచేశారని రాజుగారడిగితే తాను భార్యాసమేతంగా సోమేశ్వరస్వామి దర్శనానికని ఆవూరు వచ్చాననీ తన భార్య బ్రాహ్మణులకి దానాలివ్వడానికి కొంత సొమ్ము అవసరమై వచ్చాననీ చెప్పారు శాస్త్రిగారు. రాజుగారు వెంటనే ఒక వెండి పళ్ళెంనిండా రూపాయిలు పోయించి తెప్పించి స్వీకరించమన్నారు.. శాస్త్రిగారు రెండు గుప్పిళ్లనిండా రూపాయిలు తీసుకుని అవి చాలని వెళ్ళివస్తానని అన్నారు.. రాజు గారు అలాక్కాదు గుడిలో చాలా రద్దీగా ఉంది. మీరు స్నానాలు ముగించుకుని సతీ సమేతంగా వస్తే మాతో తీసుకు వెళ్ళి శీఘ్ర దర్శనం చేయిస్తామని అన్నారు. దానికి శాస్త్రిగారు అక్కర లేదనీ తాము అంతకంటే రద్దీలో కాశీలో దర్శనాలు చేసుకున్నామని చెప్పి సెలవుతీసుకుని  గోదావరి ఒడ్డుకు వెళ్ళి ఆ రూపాయిలు తనభార్య చేతిలో పోసి అందులో ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా దానం చేసేయమన్నారు.
                                                       ****

అయ్యా ఇదీ దండిబొట్ల వారి కథ. ఇందులో ఏం పెద్ద విశేషముందని ఈ కథ చెప్పావయ్యా అని ఎవరైనా అని అడగొచ్చు. స్థూలదృష్టితో చూస్తే దీనిలో విశేషం కనిపించక పోవచ్చు. కానీ చేతిలో దమ్మిడీ లేనప్పుడు అనాయాచితంగా అంత ధనం వస్తుంటే తీసుకోకుండా ఉండగలగడం సామాన్యమైన గృహస్తులకు సాధ్యపడే విషయం కాదు. చేతిలో ఏ సొమ్మూ లేకుండా తీర్థ యాత్రకి పత్నీ సమేతంగా బయలు దేరడానికి ఎవ్వరైనా సాహసించగలరా? శాస్త్రిగారు శాలువలు స్వీకరించినా రూపాయిలు తీసుకున్నా అవి ఇతరులకివ్వడానికే గాని తనకోసం ఏమీ తీసుకోలేదు.
మన పెద్దలు ఏమన్నారంటే
సద్యో దదాతి చతురః సద్యో నాస్తీతి చతురతమః
అంటే (అడగ్గానే) ఆలస్యం చేయకుండా (ధనం) ఇచ్చేవాడు తెలివైన వాడైతే,
( అడక్కుండానే వచ్చే ధనాన్ని)ఆలస్యం చేయకుండానే వద్దనే వాడు అంతకన్న తెలివైన వాడు-అని భావం. ( ఇక్కడ తెలివైన వాడంటే ధర్మం తెలిసినవాడని అర్థం). మరి దండిభొట్ల వారు ఎంత గొప్ప ధర్మపరుడు ? నప్రతిగృహీతృత్వం- అంటే ఎవరి దగ్గర నుంచీ ఏదీ ఉచితంగా తీసుకోరాదన్నది  మనధర్మమని ఇదివరకే చెప్పి ఉన్నాను కదా? దానిని తూ.చ. తప్పకుండా పాటించిన మహాను భావుల్లో దండిభొట్ల వారు కూడా ఒకరన్నమాట. అదీ ఆయన దర్జా.
                                       ***
ఇక్కడితో ఆపేస్తే నా ఈ వ్యాసం ఉద్దేశం పూర్తి గా నెరవేరినట్లుకాదు. ఇటువంటి ధర్మ వర్తనుల సహధర్మచారిణులు కూడా ఎన్ని కష్టాలనోర్చుకుని వారు కూడా తమ సహచరుల ధర్మ దీక్షాయజ్ఞంలో పాలు పంచుకున్నారో మనం తెలుసుకుని వారికీ మన జోహార్లు పలకాలి. ఎంతో కొంత ధనాశని చంపుకుని జీవితాలను గడుపుకుంటే మనంకూడా మన పాఠాలను నేర్చుకున్నట్లే.
( ఈ విషయాలను గ్రంథస్థం చేసి వెలుగులోకి తెచ్చిన శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారికి కృతజ్ఞతలతోసెలవు.)
                                        ***

9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

పరమానందమయిందండి

Rishi చెప్పారు...

Manchi vishayam teliyachesarandi

www.apuroopam.blogspot.com చెప్పారు...

రిషి గారికి, కష్టే ఫలే శర్మ గారికీ కృతజ్ఞతలు

శ్యామలీయం చెప్పారు...

గొప్పవ్యక్తిత్వంగల మహానుభావులను గురించి తెలుసుకున్నప్పుడు మనస్సు పరమోదాత్తమౌతుంది. పరమానందం స్వామీ.

www.apuroopam.blogspot.com చెప్పారు...

శ్యామలీయం గారికి కృతజ్ఞతలు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు .
దండి భొట్ల వారిని గురించి చాలా విషయాలను తెలియ జెప్పారు. మీరు ఇంతటి ప్రముఖుల గురించి వ్రాయక పొతే , నాలాంటి వారికెలా తెలుస్తుంది ? ఖచ్చితంగా మీ రచనలు తెలుసు కోవలసిన " అపురూపమైనవి " హేట్సాఫ్ "

Kottapali చెప్పారు...

చాలా బావుంది. ఇటువంటి కథలు మరిన్ని రాస్తుండండి.

Zilebi చెప్పారు...

గోపాల కృష్ణ గారు,

దండి భొట్ల గారు ఆ కాలపు వారై పోయేరు కాబట్టి బతికి బట్ట కట్ట గలిగేరు.

ఈ ప్రస్తుత జమానాలో వారు ఉండ గలరా, జీవనం కొన సాగించ గలిగే వారా అన్నది సందేహమే

చీర్స్
జిలేబి.

www.apuroopam.blogspot.com చెప్పారు...

జిలేబీ, నారాయణ స్వామి గార్లకు కృతజ్ఞతలు. జిలేబీ గారూ- ఆ కాలం ఈ కాలం అని కాదు. ఇది వ్యక్తులు తాము ఎంచుకున్న జీవన విధానానికీ వారు పాటించిన విలువలకీ సంబంధించిన విషయం. ఆ రోజుల్లో కూడా వారు తాము ఈ నియమాన్ని పాటించ డానికి ఎన్నో కష్టాలు పడే ఉంటారు. ఈ విషయం లో వారికి లబించిన వారి కుటుంబ సహకారం కూడా చాలా గొప్పది. నాడూ నేడూ కూడా, దురాశా పరులైన జన సామాన్యానికి ఈ మహనీయులు పిచ్చివారిలాగే కనిపిస్తారు.నేను డబ్బంటే చేదా అనే పోస్టులో చెప్పిన ఒక వృత్యాంతం లోని మహాను భావుడు ఈ కాలం వారే.