25, జులై 2012, బుధవారం

అత్త లేని కాపురం...అద్దె ఇల్లే అమరధామం..


                       

అత్తా లేనీ కోడాలుత్తమురాలూ...ఓయమ్మా..
కోడల్లేని అత్తా గుణవంతూరాలూ..మాయమ్మా..

ఈ పాట తెలియని తెలుగువారుండరు. అత్తా కోడళ్ళ పోరు అతి పురాతన మైనది.  పురాతన కాలంలో బాల్య వివాహాలే జరిగేవి. పురుషులకు వేరే ఉద్యోగాలు లేక పోవడంతో తల్లిదండ్రులతో ఉమ్మడి కుటుంబంలోనే ఉండవలసి వచ్చేది. బెరుకు బెరుకుగా అత్తారింటికి వచ్చిన ఆ లేత వయసు ఆడపిల్లలకు కాపురం కత్తిమీద సామే. అత్తలు పెట్టే ఆరళ్ళకు వారు ఎంత నలిగి పోయే వారో మనం ఊహించుకోలేం. ( ఏది ఏమయినా ఇది ఆడవారి సబ్జెక్టు. దీన్ని గురించి వారే సాధికారికంగా చెప్పగలరు ). అయితే మరి నువ్వెందుకయ్యా ఈవిషయం ఎత్తుకున్నావూ అంటే-  నేను చెప్పబోయే దానికీ దీనికీ చాలా చక్కటి సామ్యం ఉండబట్టే. అదే అద్దె ఇళ్ళ కాపురాల సంగతి. నూటికి ఎనభై మందికి ఏదో సమయంలో అద్దె ఇళ్లలో కాపురం ఉండక తప్పని సరి పరిస్థితులుంటాయి. ఇల్లంటూ లేని వారి సంగతలా ఉండగా,ఉన్న ఊళ్ళో మంచి ఇల్లు ఉన్న వారికైనా ఉద్యోగరీత్యానో మరో కారణం వల్లనో వేరే ఊళ్ళో ఉండాల్సి వస్తుంది కదా? అప్పుడు అద్దె యింటి నివాసం తప్పదుకదా?
మహానగరాల్లో మనకి నివాసయోగ్యంగా ఉన్నా లేకపోయినా ఏదో తల దాచుకుందికి ఒక గూడు కావాలి కనుక అద్దె ఎక్కువనిపించినా ఏదో ఒక ఇంట్లో ఉండడానికి సిధ్ధ పడిపోతాము. వారడిగినంత అడ్వాన్సూ ఇచ్చి వారు పెట్టిన సవాలక్ష కండిషన్లకూ తల ఒగ్గి ఆ ఇంట్లో చేరతాము. అయినా ఆ యింట్లో కంటి నిండా నిద్ర పోతూ ఏ దిగులూ లేకుండా ఉండగలమన్న హామీ ఏ మాత్రం లేదు. ఎప్పుడు అద్దె పెంచమంటారో లేక పోతే ఎప్పుడు ఖాళీ చేయమంటారో అని బితుకు బితుకు మంటూ ఇంటాయనను మంచి మూడ్ లో ఉంచడానికి శాయశక్తులా కృషి చేస్తూ వారు ఏం అన్నా అదే కరెక్టు అంటూ వంత పలుకుతూ వారి కుళ్ళు జోకులకు కూడా పగలబడి నవ్వుకుంటూ కాలక్షేపం చేయాల్సి వస్తుంది. మగ వారి భయాలూ బాధలూ ఇలా ఉంటే ఆడవారి బాధలు మరోరకంగా ఉంటాయి. పొద్దున లేచి వీధిలో ముగ్గు ఎవరి పని మనిషి వెయ్యాలన్న దగ్గరనుంచి కుళాయి నీళ్లు వాళ్లు పట్టుకున్న తర్వాతే అద్దెకున్న వారు పట్టుకోవాలన్నంత వరకూ ఉంటాయి. ఇవి ఇక్కడితోనే ఆగవు. అద్దెకున్న వారు కాపురం ఎలా చేసుకోవాలో ఇంటి యజమానురాలు నిర్ణ యించడం వరకూ సాగుతుంది. అద్దెకున్న అమ్మాయికి అత్తగారి పోరు లేని లోటును ఇంటావిడ భర్తీ చేస్తుంటుంది. ( ఇంటియజమానులు దగ్గర లేని యింట్లో అద్దెకుండడం అంటే అత్త లేని ( వేరింటి కాపురం) కాపురం అంత సుఖమైనది ). ఈ రంజైన కధలన్నీ ఏ అద్దెయింటి అభాగ్యురాలినడిగినా చెబ్తుంది కనుక నేను వాటిని గురించి చెప్పబోవడం లేదు. నూటికో కోటికో కోడల్ని తల్లి లాగా చూసుకునే అత్తగార్లున్నట్లే అద్దెకున్న వారిని తలమీద పెట్టుకుని పూజించిన వారు కూడా సకృత్తుగానైనా లేకపోలేదు. అటువంటి మంచి వారి కథే నేనిప్పుడు చెప్పబోయేది. ఇది చాల పాత ముచ్చటైనా విని తీర వలసినదే.

1942 లో రెండవ ప్రపంచ సంగ్రామం రోజులలో విశాఖ పట్టణం మీద బాంబులు పడతాయన్న భయంతో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తాత్కాలికంగా అంటూ కొన్నేళ్లపాటు గుంటూరుకు మార్చేరు. మార్చడమైతే మార్చారు గాని యూనివర్శిటీకి గాని దాని ఉద్యోగులకు గాని సరైన వసతి ఎక్కడ దొరుకుతుంది? యూనివర్శిటీని ఎలాగో అక్కడా ఇక్కడా  తలోమూలా సర్దేరు. ఉద్యోగులు మాత్రం ఇళ్ల కోసం నానా యాతనా పడ్డారు. ఇదిగో ఇటువంటి చిక్కుల్లో పడ్డ దువ్వూరి వారికి గుంటూరులో బస ఎలాగురా అనుకుంటుండగా వారికి కొద్దిగా స్నేహమూ దూరపు బంధుత్వమూ ఉన్న సూర్య నారాయణ గారనే ఆయన తటస్థ పడి మీరు కాలేజీలు తెరిచే సమయానికి తట్టా బుట్టా పిల్లా జెల్లాతో సహా గుంటూరు వచ్చెయ్యండి. నేను మీకు బస ఏర్పాటు చేసి ఉంచుతానన్నారు. మహదానందభరితుడైన శాస్త్రిగారు సెలవులాఖర్న అలాగే గుంటూరులో సూర్యనారాయణ గారి యిల్లుచేరుకున్నారు. సూ.నా. గారు తాను మాట్లాడి పెట్టిన ఇల్లు ఎదురుగా కడుతున్నమేడేననీ ఇంకా పనులు పూర్తి కానందున కొన్నాళ్లు తమ యింట్లోనే సర్దుకోమనీ ఒక వసారా ఖాళీగా ఉన్నది చూపించేరు. చేసేది లేక శాస్త్రిగారు అందులోనే సర్దుకుంటూ కాలక్షేపం చేస్తూ నెలలు గడిచిపోతుండడం చూసి సూ.నా.గారింట్లో ఊరికే ఉండడం ఇష్టం లేక అద్దెమాట ఎంతో చెప్పమంటే సూర్యనారాయణ గారు నెలకు ఓ పది రూపాయలిచ్చేద్దురూ అన్నారుట. ఆ వసారాకి అక్కడ నాలుగు రూపాయలు కూడా యివ్వరని తెలిసినా గతి లేక శాస్త్రిగారు ఇచ్చుకుంటూ ఉన్నారు. ఒకరోజు సూ.నా.గారు శాస్త్రిగారితో ఎదురింటి కోమటాయన శాస్త్రిగారికి  తమ యిల్లు అద్దెకు ఇవ్వమన్నారనీ వాళ్ల బంధువులకెవరికో ఇచ్చుకుంటామంటున్నారనీ చెప్పారు. అప్పటికి వారు ఆ వూరు వచ్చి దాదాపు 8 నెలలు అయింది. హతాశులైన శాస్త్రిగారు ఎలాగురా భగవంతుడా అనుకుంటుంటే ఒక రోజు రోడ్డు మీద కలిసిన ఎదురింటి షావుకారి గారితో మాకు అద్దెకు ఇల్లివ్వమన్నారుట కదా అనగానే అతడు  “ఎంతమాటండీ బాబుగారూ మీలాంటివారు మాయింట్లోకి అద్దెకు రావడం మా అదృష్టంగా భావిస్తాము. మీరే రానని అన్నారని సూర్యనారాయణ గారు నాతో చెప్పారు. మాయింట్లో కింద నాలుగు గదుల పోర్షన్లు రెండున్నాయి. మీరు దేనిలోనైనా ఈ రోజే చేరవచ్చు. మేము మేడమీద నున్న రెండు గదుల్లో ఉంటాము. అద్దె మీరు ఇప్పుడిస్తున్నంతే ఇవ్వవచ్చు. మీ పక్కపోర్షనులో మీకు ఇష్టమైన వారిని మీరే అద్దెకు కుదుర్చుకోండి. అద్దె మీరే నిర్ణయించండి. అంతా మీఇష్టం అన్నారుట.. ఆ మాటలు వినగానే శాస్త్రిగారికి సూ.నా.గారి కుతంత్రం అర్థమైపోయింది. వెంటనే వారిల్లు ఖాళీ చేసి ఎదురుగానే ఉన్న వెంకటప్పయ్యగారింట్లో చేరి పోయారు. .వెంకటప్పయ్యగారు తమ కోసం చేయించుకున్న కుర్చీలు బల్లలూ కూడా శాస్త్రిగారి వాటాలోనే వేయించి వారినే వాడుకోమన్నారు.
ఆ విధంగా శాస్త్రిగారు ఆ యింట్లో అద్దెకు చేరి సుఖంగా ఉంటూ ఉండగా-
ఒక రోజు శాస్త్రిగారు ఉదయమే ఏదో చదువుకుంటున్నారు. అంతలో వారి ఇంటాయన రెండు మేకులూ సుత్తీ చేత్తో పట్టుకుని కిందకు దిగి వచ్చి చూసేరా బాబు గారూ,నేనిది 20 వేలు పోసి కట్టించుకున్న ఇల్లు. నేనేదో నా గదిలో చొక్కాలు తగిలించుకుందామని రెండు మేకులు కొట్టుకో బోతే మా ఆవిడ వచ్చికింద బాబుగారున్నారని జ్ఞాపకం లేదా అంది. సరే నేనేదో మెల్లిగా చప్పుడు చేయకుండా మేకులు కొట్టుకుంటానంటే తానే మళ్లా వచ్చి  బాబు గారెప్పుడైనా మేడమీదకి వచ్చి చూసినప్పుడు గోడల మీద అసహ్యంగా ఈ మేకులేమిటి అని కోప్పడరా.. ఆపండి మీ పని.. అంటూ నా మీద కేకలేస్తోందండీ. మీరంటే నాకెంత గౌరవమో అనుకుంటుండే వాడిని. మాఆవిడ కింకెంత గౌరవమో అని తెలిసి మీతో చెప్పి పోదామని వచ్చాను. మీ పనికి ఆటంకం కలిగించి ఉంటే క్షమించండిఅంటూ మేడమీదకి వెళ్లి పోయాడు.
ఆ విధంగా శాస్త్రి గారు ఆ ఉళ్లో ఉన్న నాలుగేళ్లూ తామే ఇంటి వారమైనట్లూ వెంకటప్పయ్య గారే తమ ఇంట్లో అద్దె కుంటున్నారన్నంత హాయిగా గడిపి 1946 లో యూనివర్సిటీ విశాఖపట్టణం మళ్ళా తరలి పోగా తాము ఇల్లుఖాళీ చేసి వెళ్ళి పోతున్నప్పుడు వారికి వెంకటప్పయ్యగారు మద్రాసు నుంచి తెప్పించిన చేతికర్రను బహూకరించి. వారి ఇంటిల్లి పాదీ స్టేషనుకు వచ్చి వీడ్కోలు పలికారు.
                                                        ****
శాస్త్రిగారు ఆవిధంగా గుంటూరు విడిచి పెట్టిన పదేళ్లకు మళ్లా హిందూ కాలేజీ వార్షికోత్సవాలకి ఆ కాలేజీ వారి ఆహ్వానం పై  ఆ వూరు వెళ్ళవలసి వచ్చింది. పాత స్నేహం మరిచిపోలేక శాస్త్రిగారు తాను ఫలానా రోజున గుంటూరు వస్తున్నాననీ ఫలానా నీలకంఠ శాస్త్రిగారింట బస చేస్తాననీ మరునాడు కాలేజీలో ఫంక్షననీ వీలు చూసుకుని ఒక సారి వెంకటప్పయ్యగారింటికి వచ్చి వారినందరినీ చూస్తాననీ వారికి కూడా ఒక కార్డు వ్రాసేరు.
అనుకున్న రోజుకి దువ్వూరి వారు నీలకంఠ శాస్త్రిగారింటికి సాయంత్రం చేరుకునే సరికి వెంకటప్పయ్యగారు వచ్చికూర్చుని శాస్త్రిగారికి మరునాడు వీలు పడుతుందో పడదో అనీ అప్పుడే తమయింటికి రావాలని ప్రాధేయపడి తీసుకువెళ్లారు. అక్కడ కాసేపు గడిపిన తరువాత నీలకంఠం గారు ఇక వెళ్దామా అంటుంటే వెంకటప్పయ్యగారింట్లో కింద వాటాలో అద్దెకున్న బామ్మగారు,వెంకటప్పయ్య గారి భార్య తనను శాస్త్రిగారి కోసం వంట చేయమని కోరగా తాను చేస్తున్నాననీ భోజనం చేసి వెళ్లమనీ అనగా నీలకంఠం గారు శాస్త్రిగారి భోజనం తమ యింట్లోనేననీ వారిని  బలవంతం చేయవద్దనీ అన్నారు. వెంకటప్పయ్యగారి పెద్దమ్మాయి పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె,శాస్త్రిగారు ఆరోజు తమ యింటికి వస్తున్నారని తెలిసి  వారిని చూడ్డానికి ఆవూళ్లోనే ఉన్న తమ అత్తవారింటినుంచి  పుట్టింటికి వచ్చి ఉంది. ఆమె,శాస్త్రులు గార్లు అది సమయం కాదు వద్దంటున్నా పెద్ద కంచు గ్లాసుల నిండా టీ చేసుకుని తీసుకు వచ్చిఇస్తే నీలకఠం గారు పుచ్చుకోలేదు. కానినాకోసం తాగవా నాన్నా అంటూ ఆమె కోరితే శాస్త్రిగారు కాదన కుండా ఆ టీ అంతా తాగేరు. నాన్నగారు నామాట మన్నించారని కన్నీరు పెట్టకుంటూ ఆమె శాస్త్రిగారి పాదాలు పట్టుకుంది. ఆ ప్రేమకు ఆపుకోలేని కన్నీళ్ళు ధారాపాతంగా కురుస్తుండగా శాస్త్రిగారు ఆమెను లేవదీసి తన కుర్చీలోనే కూర్చోపెట్టుకున్నారు. ఆ తరువాత ఆమె చిన్నప్పుడు ఆమే వారి నాన్నగారూ కలిసి నీళ్లు పోసి కష్టపడి పూలమొక్కలను పెంచుకుంటున్నా శాస్త్రిగారు రోజు కొక్కపువ్వు తప్ప మిగిలినవి కోసుకోనిచ్చే వారు కారనీ అలాంటి ఎన్నో విషయాలను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. జన్మాంతర బంధమేదో ఉండక పోతే అటువంటి అత్మీయత కుదరదనుకుంటూ శాస్త్రిగారు వారి నుంచి సెలవు తీసుకున్నారు.
                                                                  ****
తనకు 70 ఏళ్లు దాటిన తర్వాత జీవిత చరిత్ర వ్రాసుకున్న దువ్వూరి వేంకట రమణ శాస్త్రులవారు అంతకుముందెప్పుడో 30 ఏళ్ల క్రిందట తాము అద్దెకున్న యింటి యజమాని కుటుంబం చూపించిన గౌరవాన్ని ఆప్యాయతానురాగాల గురించి వారి మంచితనాన్నిగురించి ప్రత్యేకంగా ఎంతో విపులంగా వ్రాసుకున్నారంటే,వెంకటప్పయ్యగారూ వారి కుటుంబం తమ ఇంట్లో కొద్దికాలం మాత్రం అద్దెకున్న వారి మీద చూపించిన గౌరవాభిమానాలూ ప్రేమా ఎంత గొప్పవో మరి?( నేనిది మీకు చాలాక్లుప్తంగా చెప్పేను కాని శాస్త్రిగారు ఇంకా చాలావివరంగా వ్రాసుకున్నారు )
                                    ****
లోకంలో అతికొద్దిమందైనా కానీండి,మంచి అత్తలూ మంచి ఇంటి యజమానులూ కూడా ఉంటారు. కాకపోతే వారి కథలు వినిపించేవారు కావాలి. అంతే!
సెలవు. 
                                   ***
     

12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడా అనుబంధాలు లేవుకాని కుతంత్రాలు చెల్లిపోతున్నాయి. మంచి విషయం చెప్పేరు

సుభ/subha చెప్పారు...

నమస్తే అండీ..చాలా మంచి విషయాన్ని పరిచయం చేసారు. ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు .
ఈ పాట , ఘంటసాల వారి నోటి వెంట వీనుల విందుగా ఉంటుంది. నిజమే కాగడా వేసి వెదకినా ముఖ్యంగా ఈ రోజుల్లో , మంచి అత్తలు ఉంటారేమో గానీ , మంచి ఇంటి వాళ్ళు డౌటే ! ఎందు కంటె " ఇది కోడళ్ళ యుగం గనుక " నూటికి ఒక మంచి కోడలు ఉన్నట్టే , ఒక ఇంటి ఓనరు ఔనా ?

www.apuroopam.blogspot.com చెప్పారు...

కష్టే ఫలే, శుభ, రాజేశ్వరి గార్లకు కృతజ్ఞతలు. మంచి ఎక్కడ ఏ కొంచెం ఉన్నా దానిగురించి చెప్పుకుంటూ ఉందాం.ఎవరికైనా అది స్ఫూర్తిదాయక మవుతుందేమో?

Zilebi చెప్పారు...

ఆహా,

మా కిట్లాంటి ఓనరు దొరక కుండా పోయెనే!

వెంకటప్పయ్య గారి లాంటి వారలు ఇంకా పెరగాలని, వారిని తలచుకుని సంతోష పడే శాస్త్రీ వారలు ఇంకా పెరగాలని కోరుకుంటూ...

పంతులు వారు ఇట్లాంటి మరిన్ని మనసుకి ఆహ్లాదాన్నిచ్చే టపాలు ఇంకా మరింకా రాయాలని ఆశిస్తూ

చీర్సో చీర్సాయ నమః
జిలేబి.

www.apuroopam.blogspot.com చెప్పారు...

జిలేబీ గారూ, మీ స్పందనకి కృతజ్ఞతలు.వంకటప్పయ్య గారి లాంటి మంచివారి గురించి శాస్త్రిగారు తమ జీవిత చరిత్రలో వ్రాసుకోకపోతే ఈ నాడు మనకు వారి గురించి తెలిసేది కాదు కదా? మంచి వారు కొద్దిమందైనా అన్ని రంగాలలోనూ అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ ఉన్నారనీ ఉంటారనీ నా విశ్వాసం.అటువంటి వారిగురించి తగినంత ప్రచారం చేస్తే లోకం ఏ కొంచెమానా మారుతుందేమో?

జ్యోతిర్మయి చెప్పారు...

మంచి విషయం తెలియజేశారు, ఇలా౦టి విషయాలు కొంతమందికైనా స్ఫూర్తిదాయకమౌతాయి. ధన్యవాదాలు.

రాజ్ కుమార్ చెప్పారు...

మీరన్నట్టూ ఏదో పూర్వజన్మ బంధాలు ఇలా కొనసాగుతూ ఉంటాయేమోనండీ

నేను పుట్టి పెరిగిన ఊరు మా సొంతూరు కాదు. నాకు చాలా కాలం వరకూ నేను నానమ్మా తాతయ్యా అని పిలిచే వాళ్ళిద్దరూ మా ఇంటి ఓనర్లనీ, నిజంగా నానమ్మా,తాతయ్యా కారనీ ఇంకా చెప్పాలి అంటే వాళ్ళకీ మాకూ ఏ సంబంధం లేదనీ తెలీదు. ఆ విషయం తెలిసిన రోజు నేను ఎంత షాకయ్యానో ఇప్పటికీ గుర్తుందీ.

భలే విషయాన్ని పంచుకున్నారు.. నాకొక మంచి జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చారండీ.. ధన్యవాదాలు ;)

www.apuroopam.blogspot.com చెప్పారు...

రాజ్ కుమార్ జీ,మీరు దేశాంతరం వెళ్లారని తెలిసింది. నా బ్లాగుకు పునః స్వాగతం.మిమ్మల్ని స్వంత మనుమడిలా చూసుకున్న మీ యింటి వారితో మీ చిన్ననాటి అనుభవాలు మీరు తప్పకుండా మాతో పంచుకోవాలి.ఎదురు చూస్తుంటాము.

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

chaala chaala baagundandi..........
naaku kannellu Vachhayi

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

అద్దె ఇంటి వ్యవహారంలో మరో కోణం కూడా ఉంది . ముచ్చట పడి సొంత ఇంటి కల నిజం చేసుకోవడానికి అనేక పాట్లు పడి , తీరా కట్టుకున్న పిదప ఉద్యోగాది కారణాంతరాల వల్ల అందులో ఉండలేకపోవడం , ఖాలీ గా ఉంచలేక అద్దెకివ్వడం , వాళ్ళు బాధ్యత లేకుండా ప్రవర్తించి దాన్ని పాడు చేయడం -
ఇంటిని సొంత దారు చూసుకున్నట్టు అద్దె కున్నవాళ్ళు చూసుకోక పోవడం కూడా ఇందులో మరో పార్శ్యం .
మీ పోష్టులో ' యజమాని-అద్దెకున్న' సంబంధం కంటే మానవీయ అనుబంధాలు ప్రస్తుతించ దగినవి .
----- సుజన-సృజన

www.apuroopam.blogspot.com చెప్పారు...

లక్కాకులవారూ,మీరు చెప్పినదీ నిజమే.అద్దెకున్నవారు ఇల్లు జాగ్రత్తగా చూసుకోక పోవడమే కాదు, అవసరమైనప్పుడు ఇల్లు ఖాళీ చేయడానికి కూడా స్వంత దారులని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు త్రాగించిన సంఘటను కూడా కోకొల్లలు.కానీ అద్దెకున్న వారికి ఇంత గౌరవం ఇచ్చిన వారు చాలా చాలా అరుదు గానే ఉంటారు. నేను చెప్పిన ఈ కథలో వెంకటప్పయ్యగారికి శాస్త్రిగారు బాగా చదువుకున్న వారనే గౌరవ భావం కూడా ఉండి ఉంటుంది. కాని అంతకు మించిన సౌజన్యం లేక పోతే అద్దెకున్న వారి పట్ల ఇంత
మర్యాద పూర్వకంగా ప్రవర్తించడం మనం ఎక్కడా చూడము. అందుకే ఇది ప్రత్యేకం.