20, జులై 2012, శుక్రవారం

కర్షక వేదన--వ్యథార్త జీవన యథార్థ దృశ్యం



( అతివృష్టో అనావృష్టో ఏదో ఒకటి రైతన్నను ఎప్పుడూ బాధిస్తూనే ఉన్నది. నవంబరు 2010 లో కురిసిన అకాల వర్షాల కారణంగా పండిన పంటను నష్టపోయి పలువురు రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. నేను ఈ గేయాన్ని 25.12.2010 న వ్రాసేను.)

 నాడు వర్షపు చినుకు లేకా
పొలము నంతా బీడు పెట్టీ
అప్పు జేసీ  సప్పుజేసీ
ఆకలిని దిగ మ్రింగుకుంటూ
రోజులెట్లో వెళ్లబుస్తూ
మంచి కాలం రాక పోదని
మరల సేద్యం చేయవచ్చని
ఆశవీడక ఎదురు చూసిన
రైతు కీయేడు  చక్కగ
అదను లోనావాన కురిసీ,
ఆశ లెన్నోమొలక లెత్తగ,
ఆడతిరిగీ ఈడతిరిగీ
వారినడిగీ వీరినడిగీ
అందినంతా అప్పుచేసీ
పదునుమీదే విత్తు జల్లేడే...
నారు పోసిన నాటినుండీ
పొలము నుండీ వెలికి పోవక
తిండి తిప్పల మాట మరచీ
అహర్నిశలూ పాటు పడ్డాడే.....
తల్లి పిల్లా తాను కలసీ
కాయకష్టం చేసి యున్నాడే....
తలకు మించిన భారమైనా
ఎరువులెన్నో కొనుక్కొచ్చీ
పొలము జల్లాడే.....
అర్ధరాత్రీ నిద్ర లేకా
నీరు పెట్టీ కాపు కాసేడే.....
పెరుగుతున్నా పైరు చూసీ
కష్టకాలం గడచి పోయీ
మంచికాలం వచ్చెనంటూ
మురిసి పోయేడే...
కలలు కన్నాడే.....
కన్న కలలూ నీరు జేస్తూ
కాపుకొచ్చిన పంట కాస్తా
నీటి పాలై తనను ముంచేస్తే
అప్పులందున పీక లోతున
మునిగి పోయిన బక్క రైతుకు
తీరబోవని కష్టమొచ్చిందే.......

ఆదుకుంటామంటు వచ్చీ
ఆపన్న హస్తం అందీయరెవరూ
రాజ్యమేలే యోచనలతో
రాజకీయం చేసుకుంటూ
రోజు రోజూ వారు వీరూ
తిట్టుకుంటూ తెగడు కుంటూ
ఉండిపోయేరే......
రాజ్యమేలే ప్రభువులేమో
రైతు రాజ్యం మాదె అంటూ
రాజన్న పథమే వీడమంటూ
అన్నలేనీ లోటు నెపుడూ
రానీయమంటూ హామిలిస్తూ
ఒట్టి మాటలతోనె కాలం
గడుపుతున్నారే
ఊరడించే చేతలేవీ
కానరాలేదే.........

విజను ట్వంటీ వీరుడొక్కడు
యెగసాయమెందుకు శుధ్ధ దండగ
పనికి మాలిన పనులవంటూ
నాడు రైతును యెకసక్కెమాడేడే
కంప్యుటర్లో క్లిక్కు చేస్తే
ధారధారగ కనక రాశులు
కురియునన్నాడే ..వాటితోనే
ఆకలంతా తీరునన్నాడే
తనకు అన్నీ తెలుసు నన్నాడే...
నేడు తానే రైతు బంధువు
వేషమేసేడే...
మొసలి కన్నీరు కార్చేడే....

పదుగురొచ్చీ మీద పడినా
కాలరైనా నలగకుండగ
చిత్తు చిత్తుగ వైరి వీరుల
పీచమణిచే తెరవీరుడొక్కడు
తెలిసితెలియని చిలక పలుకులు
పలుకుతున్నాడే....రైతు పక్షం
తానె అన్నాడే..నటన లోనీ
వైదుష్యమంతా ఒలకబోసేడే......

తండ్రి పేరును చెప్పుకుంటూ
తాను గద్దెను ఎక్కవలెనని
తపన పడుతూ కొడుకు ఒక్కడు
ఓదార్పు అంటూ ఊరూరు తిరిగాడే
పనిలొ పనిగా  రైతుకోసం
కన్నీరు కార్చేడే...
ఓట్లకోసం విత్తు జల్లేడే........

వారు వీరూ ఎవరి వలనా
తనకు ఏమీ ఒరగనందున
ఆలు బిడ్డలు ఆకలంటూ
 అలమటిస్తుంటే
దినము గడిచే  తీరు తెలియక
రేపు పైనా ఆశ లేకా
దిక్కు తోచని దీన స్థితిలో
నమ్ముకున్నా నేల తల్లీ
ఒడిని ఒరిగాడే.........

వెతల  సుడిలో బ్రతుక జాలక
కన్నుమూసిన కన్న తండ్రీ
నీవు పోతే లోకమంతా పస్తులుంటుందే
అన్నదాతవు నీవు లేకా
ఆకలేసీ బావురంటూ
అలమటిస్తూ మాడిపోతుందే....

దీనికెవ్వరు బాధ్యు,లీ
పాప మెవ్వరిదంటు మీరూ
వెఱ్ఱి ప్రశ్నలు వేయబోకండీ
నిశ్చయముగా అది నాడు నేడూ
నేల నేలిన ఏలికలదే
నయవంచకత్వపు నాయకులదే..
వారిచేతికి పగ్గమిచ్చిన
మీరు నేనూ హంతకులమే...
              ***

.

























11 కామెంట్‌లు:

ఫోటాన్ చెప్పారు...

మొదటి రెండు పారాలు చాలా కదిలించాయి గురువు గారు!
రైతుల కష్టాలను, రాజకీయ వికృత క్రీడలను బాగా రాసారు!
ధన్యవాదములు.

the tree చెప్పారు...

శ్రీశ్రీ ని గుర్తుచేసారు, చాలా చక్కగా రాశారండి,అభినందనలు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

The tree ఫోటాన్ గార్ల స్పందనకు కృతజ్ఞుణ్ణి.

జ్యోతిర్మయి చెప్పారు...

ఆఖరి వాక్యాల్లో నిజం నిష్టూరంగా ఉన్నా సూటిగా చెప్పారు. చాలా బాగా వ్రాశారు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

జ్యోతిర్మయి గారికి ధన్యవాదాలు.

కమనీయం చెప్పారు...

కవిత భావం,సరళమైనశైలి,బాగున్నాయి.కాని అక్కడక్కడ మాత్రలు(లయ)తప్పాయి.

www.apuroopam.blogspot.com చెప్పారు...

శ్రీ కమనీయం గారికి,ఇది నేను మాత్రా ఛందోబధ్ధంగా ఉండాలని ప్రయత్న పూర్వకంగా వ్రాసినది కాదు. ఏదో నా భావావేశానికి ఇచ్చిన అక్షర రూపం. అందువల్ల ఎక్కడైనా మాత్రలు ఎక్కువో తక్కువో అయి ఉండ వచ్చును. ఏమయినా గణబధ్ధంగా ఉంటేనే రాణిస్తుందన్నది సత్యం.మీవంటి పెద్దల అభిప్రాయమెప్పడూ నాకు శిరోధార్యమే.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

అంతా రైతన్న యెడల
వంతులుగా ప్రేమ వండి వార్చెద రకటా !
పంతుల గోపాల కృష్ణ !
సుంతయు నేతలకు చిత్త శుధ్ధి కలుగునా ?
----- సుజన-సృజన

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

రైతన్నల బాధల్ని చక్కగా వివరిం చారు. బాగుంది ధన్య వాదములు

Lakshmi Naresh చెప్పారు...

బాధతో రాసారు..భావం బాగుంది... ఈ రైతు నాయకులూ ఎం చేస్తారండి? అంటే పాపం వాళ్ళ వల్ల కూడా ఎం కాదనుకుంటా? ఈ రైతులంత ఓ మాట మీద నిలబడి, మాకిది చేసిన పార్టీ కే వోటేస్తాం అంటే...

www.apuroopam.blogspot.com చెప్పారు...

Lakshmi Naresh gariki kruthagnathalu