యాభై అరవై ఏళ్ల క్రితం తెలుగు దేశాన్ని సినిమా ముంచెత్తని
రోజుల్లో పద్యనాటకాలు తెలుగు నాట ఓ వెలుగు
వెలిగాయి. అంతవరకూ మరఠ్వాడా థార్వాడ్ నాటక సమాజాల
నాటకాలు చూసి చూసి విసుగెత్తిన ప్రజలకు 19
వ శతాబ్దపు చివరి దశకంలో ఆవిర్భవించిన తెలుగు పద్యనాటకాలు వారిని విశేషంగా ఆకర్షించ
నారంభించాయి. తెలుగు పౌరాణిక పద్య నాటకాల్లో అత్యంత ప్రజాదరణకి నోచుకున్న తెలుగు
నాటకంగా గయోపాఖ్యానాన్ని పేర్కొనక తప్పదు. ఆ రోజుల్లోనే ఈ నాటకం లక్షా యాభై వేల
ప్రతులు అమ్ముడు పోయిందంటే దాని ప్రాచుర్యాన్ని గురించి చెప్పవలసిందేముంది? .ఈ నాటక రచయిత శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఆ కవిగారి జన్మదినం (26 September) సందర్భంగా వారినోసారి సంస్మరించుకోవడం మన విధిగా భావిస్తున్నాను.
1867వ సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా లోని ఖండవల్లి గ్రామంలో
మేనమామ శ్రీ పురాణపండా మల్లయ్యశాస్త్రిగారింట్లో జన్మించారు శ్రీ లక్ష్మీనరసింహం
గారు. వారి బడి చదువులు వీర వాసరంలోనూ,నరసాపురంలోనూ రాజమండ్రిలోనూ జరిగాయి.
చిన్నప్పటినుంచి కనుచూపులో ఇబ్బంది ఉండేది. ఈ కారణంగానూ ఆర్థికమైన కారణాలవల్లనూ
అతడి చదువు కుంటువడినా 1820లో మెట్రిక్యులేషన్ పరీక్ష ప్యాసయ్యారు.తన చిన్న
వయసులోనే (21 సంవత్సరాలు) హిందూ నాటక
సమాజం కోసం ఏడెనిమిది నాటకాలను వ్రాసి ఇచ్చారు. ఈయన వ్రాసిన తొలినాటకం కీచక వథలో
ద్రౌపది వేషాన్నిశ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు ధరించడం విశేషం.తన 22వ యేటనే రచించిన
గయోపాఖ్యానం నాటకం వీరికి చిరకీర్తిని సంపాదించిపెట్టింది. ఈ నాటకంలోనే శ్రీకృష్ణుని అథిక్షేపిస్తూ
అర్జునుడు ఏమంటాడో చూడండి:
సీ.అల్లుడా రమ్మని ఆదరమ్మున బిల్వ
బంపు
మామను బట్టి చంపగలమె
జలకేళి సవరించు జవరాండ్ర కోకల
నెత్తుక
పోయి చెట్లెక్క గలమె
యిల్లిల్లు దిరిగి వ్రేపల్లెలో మ్రుచ్చిలి
మిసిమి
ముద్దలు దెచ్చి మింగ గలమె
గొల్ల పొట్టెల గూడి కోల సేకొని యాల
కదుపుల
నేర్పుతో కాయగలమె
తలిగదండ్రులు పరులకీదలచు కన్య
బలిమిమై దెచ్చి భార్యగా బడయగలమె
దుష్టులను వంక వీరుల ద్రుంప గలమె
అనపరాధుల దండింప నరుగ గలమె.
గయో పాఖ్యానమే కాక ప్రసన్న యాదవము, ప్రహ్లాద చరిత్రము, ద్రౌపదీ పరిణయము మొదలైనవే కాకుండా అనేక అనువాద నాటకాలను కూడా రచించారు. ఇవే కాక
అనేక చారిత్రక నవలలు,సాంఘిక నవలలూ వ్రాసారు. వీరి గణపతి నవల వీరికి హాస్య
వాజ్ఞ్మయ నిర్మాతగా పేరుతెచ్చి ఇప్పటికీ ప్రచురణలు పొందుతూనే ఉంది. వీరు రచించిన
ప్రహసనాల్లో సంఘంలోని దురాచారాలపై ఘాటైన విమర్శఉంది. కొన్ని కథలు,హాస్య రచనలు
జీవిత చరిత్రలే కాక తన స్వీయ చరిత్ర కూడా వ్రాసుకున్నారు. దేశభక్తిపరుడైన ఈయన ఒక
సభలో ఆశువుగా చెప్పిన పద్యం ఆంధ్ర దేశమంతా మార్మ్రోగింది. అది ఇధి :
తే. భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పిదుకుచున్నారు మూతులు బిగియబట్టి.
వీరు స్వంతంగా పాఠశాలలు నడిపారు. పిల్లలకు తెలుగు వాచకాలు
వ్రాసేరు. పత్రికా సంపాదకత్వం వహించడమే కాకుండా స్వయంగా మనోరమ పత్రికను స్థాపించి
నడిపించారు. ఆ విధంగా సమకాలీన సాహిత్య చైతన్యానికి దోహదం చేసారు. తమ రచనల ద్వారా,పత్రికల
ద్వారా,దేశభక్తిని పెంపొందిచే కృషి చేసారు. వీరు మూడు శతకాలను కూడా వ్రాసేరు. అష్టావధానం
చేసారు. బాల్యం నుండే చూపు మందగిండంతో
పాటు తన 43 సంవత్సరాల వయసు నాటికే పూర్తి అంధత్వం సంప్రాప్తించినా,ఈ మహనీయుడు ఆ
తర్వాత కూడా విశేషమైన సాహీతీ కృషి చేయడం చాలా అభినందనయం. వీరి శతకాలలో ఒకటైన
కృపాంబోనిధీ శతకం 1933 లోనే అచ్చయినా ఇప్పుడు అలభ్యం కనుక దానిలోని ముచ్చటైన మూడు
పద్యాలను పరిచయం చేస్తాను:
మ. జలమందుండుట తిండిమానుటయు నిస్సంగత్వముం బొందుటా
కలముల్ మెక్కుట మోక్ష సాధనములా? యట్లైననం జేపల్ దరి
ద్రులు షండుల్ మఱి వానరంబులును సద్యోమోక్షముంగాంచవే
తెలియం జాలని వారిత్రోవ లివియే దేవా! సత్కృపాంబోనిధీ!
(అదే పనిగా నదుల్లో మునకలిడడం,ఉపవాసాలుండడం ,స్త్రీ సాంగత్యాన్ని వదులుకోవడం,
ఆకులు అ లములు తిని కాలం గడపడం—ఇవేవీ మోక్ష సాధనాలు
కావు. నిజంగా వీటివలననే మోక్షం వచ్చేటట్లయితే చేపలకూ దరిద్రులకూ నపుంసకులకూ
కోతులకూ సద్యోమోక్షం వచ్చి ఉండాలికదా? ఇవన్నీ తెలివి లేని వారి అజ్ఞానపు చేష్టలనీ ఇది నిజమైన
భక్తిమార్గం కాదనీ అంటాడు కవి.)
శా. ఆకారంబులు లేని నీకు
మనుజుండాకారమిచ్చున్,నినున్
లోకవ్యాపకు గోవెలన్ నిలిపి తల్పుల్
మూయు,నిస్సంగుడౌ
నీకుం బెండిలి జేయు,నాకలితృషానిద్రల్
ప్రకల్పించు,మో
హాకృష్టుండయి బేల యయ్యెనరుడన్నన్నా! కృపాంబోనిధీ!
(నిరాకారుడవైన నీకు
అనేక రూపాల్ని కల్పించాడీ మానవుడు. అంతటితో ఊరుకోలేదు. సర్వ వ్యాపకుడవూ
సర్వాంతర్యామివీ అయిన నిన్ను కోవెలకట్టి తలుపులు మూసి అందులో బంధించాడు.
నిస్సంగుడవైన నీకు ప్రతియేటా పెళ్లిళ్ళు చేయడం మొదలు పెట్టాడు. తనలాగే నీకు కూడా
ఆకలి దప్పులను నిద్రనూ కల్పించి ప్రసాదాలు పెట్టడం మేలుకొలుపులు పాడడం మొదలు
పెట్టాడు. మాయలో పడి నరుడు అసహాయుడై ఈ వెఱ్ఱి పనులన్నీ చేస్తున్నాడు.)
మ. కలకండంబులకన్న నవ్య కదళీ ఖర్జూర
ద్రాక్షా ఫలం
బులకన్నం బువుదేనె కన్న మధురాపూపాదులౌ
పిండివం
టల కన్నన్ నవనీతపుంజములకన్నన్
జిహ్వకున్ నీదు ని
ర్మల నామంబు రుచించుచున్నది మహాత్మా! సత్కృపాంబోనిధీ
( దయామయుడవైన ఈశ్వరా!కలకండ,అరటిపండు,ఖర్జూరము
ద్రాక్షపళ్లు,పువ్వుతేనె,తియ్యని పిండివంటలు,వె న్న ముద్దలు—వీటన్నిటి కంటె కూడా
నీ నామామృతమే మధురాతిమధురమైనది కదా?)
చిలకమర్తి వారి కవితారసాన్ని
గ్రోలాలంటే ఆయన శతకాలూ ఇతర రచనలూ చదివి తీరాల్సిందే.
ఈ మహనీయునికి “కళా ప్రపూర్ణ” బిరుదాన్ని,“సాహిత్య చక్రవర్తి” బిరుదాన్ని ఇచ్చి ఆంధ్ర జాతి
తనను తాను గౌరవించుకుంది.
( వీరు 17.6.1946 న నిర్యాణం చెందారు.)
సెలవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి