19, అక్టోబర్ 2012, శుక్రవారం

శ్రీ రాముడు సేతువు కట్టేడా...?



ఇంతకు ముందు పోస్టు(శ్రీ రాముడు నడచిన దారుల్లో..) లో సీతాన్వేషణ చేస్తున్న రాముడు ఆమెనపహరించుకు పోయిన రావణునిపై దండెత్తడానికి సైన్య సమేతంగా లంకాపురికి వెళ్ళడానికి  రామేశ్వరం చేరుకోవడాన్నిగురించి చెప్పుకున్నాం. రామేశ్వరం ఒక ద్వీపంలో ఉందని మనకు తెలుసు.ఈ ద్వీపం చేరుకోగానే మొదట శ్రీ రాముడు కొద్దికరై అనే ప్రదేశంలో విడిసి సముద్రం మీద వారధి కట్టడానికి ఆ ప్రదేశం అనువైనది కాదని నిర్ణయించుకుని తన సైన్య సమేతంగా రామేశ్వరం చేరుకున్నాడు. (వారధి కట్టడానికి అనువైన ప్రదేశాన్ని వెతకడం గురించి రామాయణం లోని యుధ్ధకాండలో వాల్మీకి వివరంగా వ్రాసేడు)  సరైన స్థల నిర్ణయం చేసుకున్నాక వారధి నిర్మాణానికి అనుభవజ్ఞుడైన శిల్పకారుణ్ణి తీసుకు రమ్మని సుగ్రీవుణ్ణి కోరేడు.దీనికి సమర్థుడైన వాడు విశ్వకర్మ అంతటి అనుభవజ్ఞుడైన నలుడే అని సుగ్రీవుడు చెప్పగా శ్రీ రాముడతడిని రావించాడు.నలుడు కూడా శ్రీ రాముడు ఎంపిక చేసిన స్థలమే సేతునిర్మాణానికి తగినదని అభిప్రాయపడి నిర్మాణ బాధ్యతను స్వీకరించాడు. నలుడి పర్యవేక్షణ లో సేతు నిర్మాణం 5 రోజులలో పూర్తయ్యిందని వాల్మీకి వ్రాసేడు.నూరు యోజనాల పొడవున్న ఈ సేతువుని మొదటి రోజు 14, రెండవరోజు 20, మూడవ రోజు21, నాల్గవ రోజు22, ఐదవ రోజు 23 యోజనాల మేరకు నిర్మించారట. దీని వెడల్పు పదియోజనాలట.
ఈ సంగతి వింటే నా లాంటి వాడికెవడికైనా నమ్మశక్యంకాదు. ఎందుచేతనంటే లంకకీ రామేశ్వరం దీవికీ మధ్యన సేతువున్న చోట దూరం 30 కి.మీ. మానవ మాత్రులైవరికైనా తమకి ఎంతమంది సైన్యం సహకరించినా సముద్రంలో వారధి అనేది 5 రోజుల్లో కట్టడం అనేది అసాధ్యం. ప్రస్తుతం సముద్రంలో ములిగి పోయి ఉన్నా రామసేతువనేది ఇప్పటికీ ఉంది. ఇంత కాలం (అంటే కనీసం 7 వేల సంవత్సరాలు) సముద్రపు తాకిడిని తట్టుకుంటూ నిలిచి ఉండే నిర్మాణం ఏదయినా ఏ కాలంలో నయినా మానవులకు అసాధ్యమే.అయితే శ్రీ రాముడు మానవుడు కాడు భగవత్స్వరూపుడు కనుక సాధ్యమయిందనుకుందామంటే శ్రీ రామావతారంలో అటువంటి మానవాతీత శక్తుల ప్రదర్శన ఏదీ జరుగలేదు.ఈ అవతారంలో శ్రీ రాముడు తన జీవితమంతా మానవుని లాగే జీవించాడు.మన లాగే కష్టసుఖాలను అనుభవించాడు.ఎటువంటి అద్భుతాలనూ ప్రదర్శించలేదు.అయితే మరి రామసేతు నిర్మాణ రహస్యం ఏమిటి? రామసేతువనేది మానవ నిర్మాణం కాదా? ప్రకృతి సహజమైన నిర్మాణం అయి ఉంటుందా? ఈ విషయంలో ఇప్పటికీ జనంలో సందిగ్ధత నెలకొనే ఉంది. ఈ ప్రశ్నలకు  హేతుబధ్ధమైన సమాధానం కోసం శాస్త్రీయ పరిశోధనల సారాంశాన్ని పరిశీలిద్దాం.
గడచిన 15000 సంవత్సరాల్లో పెరిగిన/తరిగిన సముద్రపు నీటి మట్టాలు—తీర ప్రాంతపు ఆవాసాల పై వాటి ప్రభావం గురించి విస్త్రుత పరిశోధన చేసిన డా.రాజీవ్ నిగమ్ గారు చెప్పిన దాన్నిబట్టి  క్రీ. పూ.7500 సంవత్సరాలనుండి తీర ప్రాంతంలోని అనేకమైన ఆవాసాలు సముద్ర గర్భంలో కలసి పోవడమో భూ స్ధాపితమై పోవడమో జరిగింది.మారుతూ వస్తున్న ఈ సముద్రపు నీటి మట్టాల్ని విశ్లేషించి ఆయన చెప్పినదాని ప్రకారం ఇప్పటికి  పూర్వం 7000-7200 ఏళ్ళ మధ్య కాలంలో సముద్ర మట్టం ఇప్పటికంటె 3 మీటర్లు(9-10 అడుగులు) తక్కువగా ఉండేదని.ఇప్పుడు సముద్రంలో(9-10 అడుగుల లోతులో) ములిగి ఉన్న రామసేతువు  అప్పటిలో సముద్ర మట్టానికంటె ఎత్తుగా ఉండేదన్నమాట.శ్రీ రాముడు ఇప్పటికి 7126 ఏళ్ళక్రితం జన్మించాడని మనం చెప్పుకున్నాం కనుక అతడి జీవిత కాలంలో సముద్ర మట్టం ఇప్పటికంటె 9-10 అడుగుల లోతులో ఉండేదన్నమాట. అంటేరామ సేతువనేది అది సహజమైన దయినా మానవనిర్మితమైనదైనా అప్పటి సముద్ర మట్టానికి ఎగువనే ఉండేదన్నమాట. (ఇది సమంజసం గానే తోస్తోంది. లేకపోతే రామసేతువు రామదండు సముద్రాన్ని దాటడానికి పనికివచ్చేదే కాదు కదా?)
NASA వారు, GSI వారు, Archaelogical survey వారు చెప్పిన దానిని బట్టిచూస్తే సింహళం లోని తలై మన్నార్ కీ, మన ధనుష్కోటికీ మధ్య సహజమైన చిన్న చిన్న దీవులూ  ఇసుకదిబ్బలూ సున్నపు రాళ్లగుట్టలూ పగడాల దీవులూ వరుసగా  ఉన్నాయనీ వీటి మీద మానవ నిర్మాణంలా కనిపించే సేతువు ఉందనీ తెలుస్తోంది.ఈ విధంగా ప్రకృతి సహజమైన నిర్మాణం ఒకటి ఉంటే దానిని ప్రయాణ యోగ్యంగా తీర్చి దిద్దుకోవడం సుసాధ్యమే కదా? అదే జరిగి ఉంటుంది.వాల్మీకి వర్ణించిన దాని ప్రకారం వానరసైన్యం రకరకాలవృక్షాలను లతలనూ, పెద్ద పెద్ద రాళ్లనూ యంత్రాల సాయంతో పెకిలించుకు వచ్చి వీటన్నిటినీ  ఉపయోగించి నలుని పర్యవేక్షణలో సేతునిర్మాణం చేసారు. అప్పటికే ఉన్న సహజమైన దారిలో లోతులనూ గోతులనూ పూడుస్తూ వానరులు తెచ్చిన సామగ్రితో పటిష్టమైన  సేతునిర్మాణాన్ని గావించారనడం చాలా హేతుబధ్ధంగా కనిపిస్తుంది. మన సినిమాలలోచూపించినట్లో పిట్టకథల్లో చెప్పినట్లో ఉడతలుతీసుకవచ్చిన ఇసుక రేణువుల్తోనో, లేక నలుడు చేత్తో వేస్తే నీటిమీద తేలే రాళ్ళతోనో సేతునిర్మాణం జరిగిందనుకోవడం గాని, పూర్తిగా  సేతువంతా మానవ నిర్మాణమేనని భావించడం కంటె నాకు ఇదే నమ్మశక్యంగా ఉంది.
శ్రీ లంక లోనూ రామాయణానికి సంబంధించిన అనేక అవశేషాలూ గుర్తులూ నేటికీ మిగిలి ఉన్నాయి కనుక శ్రీ రాముడు తాను ఈ విధంగా నిర్మించుకున్న సేతువు మీదుగా సైన్య సమేతంగా  లంకకి వెళ్లి రావణ సంహారం చేసిఉంటాడనడంలో ఎటువంటి విప్రతిపత్తి ఉండదనే నేను భావిస్తున్నాను.
(I-SERVE Delhi Chapter  వారికి కృతజ్ఞతలతో.... సెలవు.)                                                

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

సేతువు రామ నిర్మాణమే,దాన్ని నాసావారితో సహా చాలామంది నిరూపించారు, నమ్మడానికి పాపం భారత ప్రభుత్వానికే ఇష్టం లేదు.

రవి చెప్పారు...

ఈ విషయంపై ఉచితమైన వాదన చే(వ్రా)శారు. బావుంది.

మనోహర్ చెనికల చెప్పారు...

ఇప్పటికి 7126 సంవత్సరాలక్రితం రాముడు పుట్టాడు అని చెప్పారు కదా. కానీ రాముడు ౧౧౦౦౦(11000) సంవత్సరాలు జీవించాడని వాల్మీకి చెప్పి ఉన్నారు. "దశ వర్ష సహస్రాణి, దశ వర్ష శతానిచ" అనే శ్లోకంలో. అలాగే ఆధారాలు నాకు తెలియవు కానీ రామాయణం తర్వాత లంక, వారధి రెండూ సముద్రంలో కలిసిపోయాయని చెప్తారు. అలాగే సముద్రుడు వరంగా వారధిని తేలేలా చేస్తానని అన్నాడు. ఎందుకంటే ఒక్క బాణంతో సముద్రాన్ని ఎండగట్టగల శక్తి ఉన్నవాడు రాముడు.అలాంటివాడి నేతృత్వంలో ఐదురోజుల్లో వారధికట్ట డంలో నాకేమీ వింతక నపడటంలేదు.

కొంచెంఆ కోణంలో కూడా పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయేమో.

కమనీయం చెప్పారు...


మీరు రాసినది సమంజసమైనదే.రామేశ్వరం దగ్గర సముద్రం లోతు బాగా తక్కువ .మధ్యలో చిన్నగుట్టల్ని ,ఇసుక మేటల్ని కలుపుతూ ఒక వారధి నిర్మించడం సాధ్యమే.బ్రిటిష్ వాళ్ళు దీనికి Adams bridge అని పేరు పెట్టడం గమనార్హం. చరిత్రలో మరే రాజుగాని దీనిని నిర్మించినట్లు ఆధారాలు లేవు.కాబట్టి శ్రీ రాముడు కట్టించినట్లు అనుకోవచ్చును.ఇక యోజనాలు గురించి;పురాణాల్లో కొన్ని అతిశయోక్తులు ఉండవచ్చును.అసలు యోజనం అంటే ఎంత దూరం అనే దానిపై స్పష్టత లేదు.సముద్రంలో (కొంతభాగం) కట్టిన ద్వారక ఇప్పుడు బయలు పడింది,లేకపోతే నమ్మం కదా.పిరమిడ్లు ఇంకా నిలిచి ఉన్నాయి కాబట్టి ,కాని లేకపొతే వాటిగురించి కథలు నమ్మేవాళ్ళం కాదు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

వెంటనే చదివి స్పందించిన మిత్రులు కష్టే పలే శర్మగారికీ,రవిగారికీ, మనోహర్ గారికీ, కమనీయం గారికీ కృతజ్ఞతలు.మనోహర్ గారూ--ఎన్నో వేల ఏళ్ళు మౌఖికంగా కొనసాగుతూ మనకంది వచ్చిన వారసత్వ సంపద మన భారత రామాయణాలు.నిన్న మొన్నటి సంఘటనలే జనం నోళ్ళలో పడి తారుమారవడం మనకి పరిచితమే.అలాంటిది ఎన్నో వేల ఏళ్ళనాటి చరిత్రలో ప్రక్షిప్తాలుండవని అనుకోరాదు.రామాయణాన్ని లక్షల సంవత్సరాలనాటి ఇతిహాసం గానో లేక వేల సంవత్సరాలనాటి చరిత్రగానో, ఎలా నమ్మాలో ముందు తేల్చుకోవాలి.ఇతిహాసం అనుకుంటే ఎటువంటి ప్రశ్నలూ వేయకుండా ఏదయినా నమ్మేయ వచ్చు. అలా కాకుండా శ్రీ రాముణ్ణి చారిత్రక పురుషునిగా తలచినప్పుడే ఈ సాక్ష్యాలూ అవీ వెతుక్కోవలసి వస్తుంది.ఎంతో శ్రమించి మన పరిశోధక శాస్త్రజ్ఞులు వెలువరించిన విషయాల్నిజన బాహుళ్యానికి అందించాలన్నదే నా ఈ చిన్ని ప్రయత్నం.