టీక అంటే ఒక పదానికి
గల అర్థం. టిప్పణి అంటే టీక కు టీక. అంటే అర్థాన్ని మరింత వివరించి సుబోధకం
చేయడమన్నమాట. ఏదో ఉద్గ్రంధాల్లోనో కావ్యాల్లోనో ఉన్న పద్యాలకైతే
సరేగాని, మామూలు వాడుక భాషలో వ్రాసిన కన్యాశుల్కం
నాటకానికి టీకా టిప్పణీ ఎందుకు? ఎందుకంటే
కన్యాశుల్కం నాటకం వందేళ్లక్రితం విశాఖ జిల్లా మాండలికంలో వ్రాయబడింది.అక్కడ ఆనాడు
వాడుకలో ఉండిన మాటల్లో కొన్ని ఈనాడు వాడుకలో లేవు.ఆ నాడు జనం ధారాళంగా ఉపయోగించిన
పార్శీ ఉర్దూ పదాలు ఎన్నో ఉన్నాయి.అదీ కాక ఈ నాటకంలో ఎన్నో ప్రాంతాల పేర్లూ
(బొంకుల దిబ్బ, కస్పా బజారు లాంటివి) ఎందరో వ్యక్తుల పేర్లూ (సురేంద్రనాధ్
బెనర్జీ,టెన్నసన్ లాంటివి) వస్తాయి. ఎన్నో పద్యాలు పాత్రల నోటంట వస్తాయి.ఈనాడు
జనానికి అర్థంకాని విశాఖ ప్రాంతపు ఆనాటి పలుకుబళ్ళూ ఉన్నాయి. వీటన్నిటినీఅర్థం
చేసుకుంటూ కన్యాశుల్కం నాటకాన్ని చదివి దానిలోని స్వారస్యాన్ని గుర్తించాలంటే
ఇప్పటి వారికి మరీ ముఖ్యంగా యువతకు టీకా..టిప్పణీ.. అవసరమే.మరి అలాంటిదేదైనా
ఉందా అంటే ఉంది.
1980లలో
కన్యాశుల్కం మొదటికూర్పును సంపాదించి విశేషమైన శ్రమకోర్చి దానిలోని ఎన్నో పదాలకు
వివరణాత్మకమైన ఫుట్ నోట్స్ వ్రాసి ప్రచురించారు కీ.శే. బండి గోపాల రెడ్డి( (బం.గో.రె.) గారు.(ఇది అప్పట్లో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో
చదువుకుంటున్న మా అమ్మాయిలు అక్కడి లైబ్రరీనుండి తెచ్చిపెట్టగా చదివాను.ఇప్పుడది
ఎక్కడైనా లభ్యమో కాదో నాకు తెలియదు).గురుజాడలు పేరుతో గురజాడ సమగ్ర రచనలు క్రిందటి
నెలలో ప్రచురించిన మనసు ఫౌండేషన్ వారి పుస్తకంలో కన్యాశుల్కం మొదటి కూర్పు ఉంది
కాని దానిలో ఎటువంటి పుట్ నోట్స్ లేవు.ఇప్పుడు మనకు సర్వత్రా లభ్యమయ్యే
కన్యాశుల్కం రెండవకూర్పు మొదటి కూర్పుకన్నా చాలా పెంచి వ్రాయబడింది కనుక, దానిలో
ఇంకా ఎక్కువ పదాలకు వివరణలు తెలుసుకోవలసి ఉంది.ఈ అవసరం తీర్చిన వారు శ్రీ గురజాడ
సాహిత్యం మీద “మహోదయం”
వెలయించిన శ్రీ కె.వి.రమణారెడ్డిగారు.వీరు తయారు చేసిన “కన్యాశుల్కం టీకా..టిప్పణీ”, కన్యాశుల్కం నూరేళ్ళ పండుగ సందర్భంగా 1991లో
ప్రచురించిన వారు శ్రీ వెలుగు రామినీడుగారు. రామినీడు గారు ఈ పుస్తక
ప్రచురణోద్దేశ్యాన్ని తెలియజేస్తూ “ ఈ
గొప్ప రచన(కన్యాశుల్కం) తనంత తానుగా బోధపడక పోవడానికి కారణం,నిర్దిష్టమైన మాండలిక
భాషా ప్రయోగమే., ప్రజల వాడుక భాషను ఎంతో వైవిధ్యసంపన్నంగా పాత్రోచితభేదాలతో
సహాగ్రంథస్థం చెయ్యడం మూలాన, రచనకు ఎంతటి శోభ సమకూరిందో, అర్థ వివరణ లేకుండా బోధ
పరచుకోవడం అంత కష్టతరమైంది”అంటారు. ఈ పుస్తకం కన్యాశుల్కం చదివే నేటి
పాఠకులకు
ఎంతో ఉపయోగకరంగా
ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే శ్రీ రమణారెడ్డిగారు కొన్ని పదాలకు ఇచ్చిన
వివరణ విషయంలో నాకు కొంచెం భేదాభిప్రాయం ఉంది. మరికొన్ని పదాలకు ఇంకా కొంత
వివరణావశ్యకతా ఉంది.
కన్యాశుల్కం
ద్వితీయాంకం మొదటి స్థలంలో-చివర్లో- గిరీశం వెంకటేశంతో “యీ శలవులాఖర్లోగా తాళాధ్యాయం కాకుండా
తప్పించుకుంటే నువ్ పూరా ప్రయోజకుడివే”
అంటాడు. దీనికి రెడ్డి గారు
“ ఇది శార్జ్ఞ దేవుడి సంగీత రత్నాకరంలోని ఒక
అధ్యాయం పేరు. ఇక్కడ వ్యంగ్యార్థంలో దెబ్బల ప్రకరణం అనుకోవాలి”అని వివరణ ఇచ్చారు.ఇది సరికాదు.సంగీతకారులు తాళం
వేసినా సున్నితంగా వేస్తారు.ఆ దెబ్బలకీ ఇక్కడి తాళాధ్యాయానికీ సంబంధం లేదు. పైన
చెప్పిన గిరీశం సంభాషణకి కొంచెం సేపు ముందరే
వెంకటేశం “ఇవాళ మీరే రాకపోతే పరీక్ష ఫెయిలయినందుకు మానాన్న
పెయ్యకట్టుతాడుతో చెమ్డాలెగ్గొట్టును”
అంటాడు. ఉత్తరాంధ్రలో దూడలను పెయ్యలంటారు. వాటిని కట్టే తాళ్లు తాటినారతో పేనినవై
ఉంటాయి.(తాడు అనే పదమే అవి తాటినారతో తయారైనవని సూచిస్తుంది కదా?)అటువంటి
తాడును తీసుకుని చర్మం చిట్లేట్టు చావగొట్టడాన్నే గిరీశం వ్యంగ్యంగా
తాళాధ్యాయం అని అన్నాడన్నమాట. ( నా తాటిచెట్టు కథ అన్న పోస్టులో అందుకే ఈ
తాళాధ్యాయం గురించి సరదాగా ప్రస్తావించేను.)
తృతీయాకం రెండవ
స్థలంలో రామప్పపంతులు “నా దగ్గర పాత తాటాకులు అలేఖాలు అటకనిండా ఉన్నాయి.” అంటాడు. దీనికి రెడ్డిగారు అలేఖాలు అంటే పత్రాలు
అని వివరించారు.ఇది సరికాదు. అలేఖాలు అంటే ఏమీ లిఖించబడని,వ్రాయడానికి సిద్ధం చేసుకుని ఉంచుకున్న
ఖాళీ తాళ పత్రాలు.గ్రంధాలు వ్రాసుకుందికి పనికి వచ్చే ఇలాంటి ఖాళీ తాళపత్రాలను దొంగ
జాతకాలు బనాయించడానికి పనికి వస్తాయని రామప్పపంతులు జాగ్రత్త చేసుకుని
ఉంచుకున్నాడన్నమాట.
చతుర్థాంకం
ఒకటోస్థలంలో రామప్ప పంతులు “నేను పిత్రార్జితం
అంతా కరారావుఁడు చుట్టేశాను అంటాడు.దీనికి “క్రావడి
చుట్టి (సున్న చుట్టినట్టు) వేశాను.అంటే ఖర్చు పెట్టివేశాను”అని రెడ్డిగారు అర్థం చెప్పారు. కాని దీనికి సరైన
అర్థం – క్రావడి చుట్టడం అంటే క్రయం చేయడం. తన పిత్రార్జితం అంతా అమ్మివేశాడని
అర్థం.
తృతీయాంకంలో వచ్చిన
దూబర అనే మాటకు దుబారా ఖర్చు అని చెప్పిన అర్థం సరైనదే.ఇంకొంచం వివరంగా
చెప్పాలంటే- ఈ పదం పార్శీ ఉర్దూల ద్వారా తెలుగు లోకి వచ్చింది.దు+బారా అంటే రెండోసారి అని అర్థం.ఏ పనైనా రెండోసారి
చెయ్యాల్సి రావడం వృథా శ్రమేకదా. దుబారా చెయ్యడమంటే వృథా (Wasteful)గా చేయడమనే అర్థం.
ఇదే అంకం మూడవ
స్థలంలో వచ్చిన రొకాయించడం అనే మాటకి సాధింపు పెట్టకూడదు, నస పెట్టకూడదు అని అర్థం
ఇచ్చారు. దీనికి సరైన అర్థం అడ్డుపెట్టకూడదని. అడ్డుకోవడం అనే అర్థానిచ్చే రుక్నాఅనే
పార్శీ పదం నుంచి వచ్చినదిది. పార్శీపదాలకు ఇంచు అనే ప్రత్యయం చేర్చుకుని మన తెలుగులో
చేర్చుకున్న అనేకమైన చలాయించు బనాయించు, జమాయించు డబాయించు లాంటిదే ఇదిన్నీ.
మరో చోట సప్త వెధవ
అనే మాటకి-సప్త అనేదినిందార్థకమనీ,అన్నిందాలా వెధవ, పరమ వెధవ అనీ వివరించారు.పరమ వెధవ
అనే అర్థం సరైనదే.కాని ఈ పదానికి ఇంకొంచెం వివరణ అవసరం. మనకి వ్యసనాలు ఏడు. సప్త
వ్యసనాలు అంటారు.అంటే అంటే ఏ కొన్నో కాకుండా అన్ని దుర్గుణాలూ( సప్తవ్యసనాలూ) ఉన్న వ్యక్తిని సప్త
వెధవ అనే వారని నా భావన.
ద్వితీయాంకంలోనే
వచ్చిన బోగట్టా, ఓఘాయిత్యం అనే మాటలకు నాకు తోచిన వ్యుత్పత్తిని ఇంతకుముందే నా “రెండు మాటలు –రెండు ఊహలూ” అనే పోస్టులో వివరించాను.
తునితగవు అనే
మాటకి-ఎవ్వరినీ నొప్పించకుండా చెప్పే తీర్పు అనీ, కృష్ణా జిల్లాలోదీనినే “భట్టిప్రోలు పంచాయితీ” అంటారని రెడ్డిగారు వ్రాసేరు.ఇది సరైనదే.కాని
ఉత్తరాంధ్రలో చెప్పుకునే తుని తగవు కథ ఏమిటంటే-ఒకసారి అదృష్ట దేవతైన మహాలక్ష్మీదేవీ,
దురదృష్టదేవతైన ఆమె అక్కగారు జ్యేష్టాదేవి ఆకాశంలో వస్తూ తమలో ఎవరు బాగుంటారోనని
వాదు లాడుకున్నారుట.ఎవరినైనా కనుక్కుందామని వారు భూమిమీదకు దిగిన స్థలం మన
ఆంధ్రదేశంలోని తుని.అక్కడి వర్తక ప్రముఖుడిని ఒకరిని తమలో ఎవరు బాగుంటారో తీర్పు
చెప్పమని వారు అడిగారట.అప్పుడా షావుకారు
ఇద్దరినీ నొప్పించకుండా ఉండడానికి తన జాణతనం చూపిస్తూ లక్ష్మీదేవితో “చిన్నమ్మా నీవు ఇంట్లోకి వస్తున్నప్పుడు
బాగుంటావు, మీ అక్కగారు ఇంట్లోంచి వెళ్లిపోతున్నప్పుడు బాగుంటుంది”అన్నాడట.ఇది కథే అయినా ఎంతోచమత్కారంగా ఉంది కదా? మరి ఇలాంటికథలు తెలుసుకోకపోతే ఎలా?
ఈ సారి కన్యా
శుల్కం చదివితే రమణా రెడ్డిగారి టీకా
టిప్పణీ దగ్గర పెట్టుకుని చదవండి. మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. కె.వి. ఆర్.
కృషి అభినందనీయం అని మీరే గుర్తిస్తారు.(ఈ టీకా టిప్పణీ ఖరీదు కేవలం అయిదు రూపాయలే.ప్రచురణమకర్త
రామినాయుడుగారి అడ్రసు-రామినాయుడు, వెలుగు,Quarter No.ELC28,రైల్వే
ఓల్డ్ కోలనీ, విజయనగరం-531203.)
సెలవు.
3 కామెంట్లు:
మీరు రాసిన అర్ధాలతోనూ, తుని తగువు కధతోనూ పూర్తిగా ఏకీభవిస్తాను. మీరనుకున్నట్లు ఇవి పూర్తిగా ఉత్తరాంధ్ర మాటలు కావు గో.జి లలో కూడా ఈ మాటలు వాడుకలో ఉన్నాయి. కన్యా శుల్కం చదివినపడు నాకు అర్ధం కాని పదాలు కనపడలేదు.
పాత తాటాకులు అలేఖాలు అటకనిండా ఉన్నాయి.”
నా దగ్గరా కొన్ని వున్నాయండి,.హ,హ..నిజమే
రాసిన వాటిని కొన్ని పరిశీలిస్తే అవి ప్రాంసరి నోట్లని అర్థం అయ్యి ఆశ్ఛర్యం వేసింది,(కొన్నిరోజులు ఆ తాటాకులు కలెక్ట్ చేసే హాబీ వుండేదిలేండి ఒకప్పుడు.నాకు..)
వ్యాసం బాగుంది.
తుని తగవు అనేదానికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నదని దానికి సంబంధించిన కథ కూడా విన్నట్లు గుర్తు. మీరన్న చమత్కారకథ కాదనుకుంటాను. దురదృష్టవశాత్తు నేను విన్న కథ తాలూకు వివరాలేవీ నాకు యిప్పుడు గుర్తు లేవు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి