21, నవంబర్ 2012, బుధవారం

తెలుగులో కుప్పుసామయ్యర్లు...


  
కన్యాశుల్కంలో గిరీశం వెంకటేశానికి రాసుకోమని చెప్పిన పుస్తకాల లిస్టులో చివరిది కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్. ఈ కుప్పుసామయ్యర్ ఎవరో పిల్లలకోసం ఆయన ఏం పుస్తకాలు వ్రాసేడో అవెలా ఉండేవో ఇవాళ మనకు తెలీదు.వెంకటసుబ్బారావుగారి మేడీజీ పుస్తకాలలా కాకుండా అవి అసలు పాఠాన్ని క్లిష్టతరం చేసేవిగా ఉండేవేమో? ద్రావిడ ప్రాణాయామం గురించి విని ఉన్నాం కదా. ప్రాణాయామం చేసేటప్పుటు అందరూ మామూలు పధ్ధతిలో ముక్కుమూసుకుంటే వారి పధ్ధతిలో వారు చేతిని తల వెనుకవైపునుండి తిప్పి ముక్కుపట్టుకుని మూసుకుంటారుట.అంత కష్టం ఎందుకో. ఎందుకేమిటి.కొంతమందికి అందరిలా కాకుండా తాము ప్రత్యేకమని, గొప్ప వారమని చాటుకోవాలని ఉంటుంది.ఈ విషయంలో ఎవరినో తప్పు పట్టనక్కర లేదు.మన తెలుగు వారిలోనే పండితమ్మన్యులలోనూ, శిష్టాచార పరాయణులలోనూ ఇది చాలా ఎక్కువ. భాషా విషయంలో వీరి డాంబికత్వం యెలాఉండేదో చూపిస్తాను చూడండి.
భాషయొక్కమౌలికమైన ఉపయోగం మన భావాలను అందరికీ సులభంగా అర్థమయ్యేలా వ్యక్తపరచడమేకదా. వీరు పిల్లి అంటే అందరికీ తెలిసి పోతుందని మార్జాలం అనే బాపతన్న మాట. ఈనాడు ఎక్కడైనా మిగిలి ఉందో లేదో నాకు తెలీదు కాని ఒకనాడు శిష్టాచార పరాయణులైన వైదీకి బ్రా హ్మణ కుటుంబాలలోని భాష ఏలాగుండేదో మనకు చూపించే ఈ పద్యాన్ని ఆస్వాదించండి.
అస్సే!  చూస్సివషే ! వొషే ! చెముడషే ! అష్లాగషే? యేమిషే?
విస్సావఝ్ఝలవారి బుఱ్ఱినష? ఆ విస్సాయి కిస్సారుషే
విస్సండెంతిటివాడె యేళ్ళు పదషే? వేయేళ్ళకౌ మంచి వ
ర్చస్సే?  అందురు వైదికోత్తమ కులస్త్రీలాంధ్ర దేశమ్మునన్
 (తంజావూరు యక్షగానాల్లో ఇలాంటి భాషా ప్రయోగాలు మనకు లెక్కకు మిక్కిలిగా దొరుకుతాయి.) వేదోచ్చారణలో ఎక్కువగా వచ్చే శ,ష,లకు అలవాటు పడిపోయి అయిన వాటికీ కానివాటికీ కూడా వీటిని చేర్చి పలకడం వారికి అలవాటై పోయి ఉంటుంది. కన్యా శుల్కంలో అగ్ని హోత్రావధాన్లు గారి ధర్మ పత్ని వెంకమ్మ గారు  అంటూ ఉంటారు అనడానికి అంఛూ వుంఛారు అని అంటుంది. ఏ వ్యాకరణం ఏ విధంగా వీటిని సమర్థిస్తుంది? పండితుల వారి ఇంట్లో ఇటువంటి భాష ఎలా మనగలిగేది? పామరుడైన పడవవాడు నాపాట నీ నోట పలకాల సిలకా అంటే సిలకా కాదు చిలకా అనాలి అని సరిదిద్దుతాము (చూ.మూగ మనసులు సినిమా).వారి ఉచ్చారణని ఎగతాళి చేస్తూ ఎకసక్కేలాడతాము.( ఎకసక్కములనేదే సరైన పదమట. పండితులు దీనిని వెకసక్కెములని పలుకుతారు).
ఈ భాషా భేషజం ఎక్కువగా ఉన్నకుటుంబాలలోని వారు ప్రాచీన సాంప్రదాయాలను పునరుధ్ధరించాలనే కంకణం కట్టుకున్న వారైనందున భాష విషయంలో కూడా వారికి తెలియకుండా తప్పులు చేసేవారు.మచ్చుకి కొన్ని చూడండి- క్రొత్త, బ్రతుకు,మ్రొక్కుమొదలైన చాలా పదాలలో  పదాదిని ఉండే రేఫము జారి పోయి కొత్త,బతుకు, మొక్కు అనేవి వాడుకలోనికి వచ్చాయి.అన్ని విషయాలలోనూ ఇలాగే జరిగిఉంటుందనే భ్రాంతితో పదాది వర్ణానికి లేని రేఫను చేర్చి ప్రయోగించిన కవులూ  పండితూలూ ఉన్నారు.ఇటువంటి
భ్రమాదానికి గురైన వారిలో లాక్షణిక చక్రవర్తియైన చిన్నయసూరిగారు కూడా ఉండడం విశేషం. స్థానమనే అర్థమిచ్చే తావు అనే పదాన్ని త్రావు అని నీతిచంద్రికలో ప్రయోగించారు.అలాగే తెగు, తెంచు అనే పదాలను త్రెగు, త్రెంచు అని ప్రయోగించారు.మురికి వదలగొట్టడానికి రుద్దడాన్ని తోమడం అనే మన లాంటి సామాన్యులందరం అంటాము. భోజరాజీయ కవి దీనిని త్రోమడం అన్నాడట. పార్శ్వము అనే అర్థం వచ్చే సంస్కృత పదం పక్ష- ప్రాకృత పదం పక్ఖ లనుంచి వచ్చిన తెలుగు పదం పక్క అనేది, మీద చెప్పిన భ్రాంతివలన ప్రక్క అని ప్రయోగించారు.అలాగే దిండుని ద్రిండు, దుడ్డుని ద్రుడ్డు చెసారు. అందుకే వైదీకుల ఇంట్లో పిల్లి కూడామ్రావు మ్రావుమంటుందని చమత్కరిస్తారు కొందరు. ఈ విధంగా భ్రాంతితో పదాలను ప్రామాణీకరించాలనే తపనలో తప్పులు చేయడాన్ని కృతక ప్రామాణీకరణము (Hyper or Super standardized Form) అన్నారు భాషా శాస్త్ర కారులు.    
ఇలాగే నిర్దుష్టంగా పలకాలనే తపనతో – పామరులు సరిగా ఉచ్చరించడం లేదనే భ్రాంతితో లేని మహాప్రాణాల్ని చేర్చి పలుకుతారు మరి కొందరు. మచ్చుకి చూడండి.జగదీశ, జనార్దన,మధుసూదన, మల్లికార్జున సుదేష్ణ  లను తాము శిష్టులమనుకునే వారు జగధీశ, జనార్ధన,మధుసూధన, మల్లిఖార్జున, సుధేష్ణ అని ఉచ్చరించడంవ్రాయడం కూడా జరుగుతోంది. మన టీవీ ఛానెళ్ళలో స్పష్టమైన ఉఛ్ఛారణ కలిగిన వారు వార్తలు చదవడానికి కావాలనే వార్త స్క్రోలింగులో చూడడం వినడం మనకు తెలిసిందే.
ఇలాంటి భేషజమే తెలుగు గ్రామనామాల్నిసంస్కృతీకరించడం కూడా. పాలకొల్లుని దుగ్ధోవన పురం న్నారు. రెంటచింతలని ద్వితింత్రిణీ పురమన్నారు. కడియంగ్రామాన్ని చెళ్లపిళ్లకవిగారి ముత్తాత గారు వలయ పురం అన్నారుట. ముని మనుమడు గారేం తక్కువ తినకుండా తనకావ్యంలో దానిని కంకణంగా మార్చి కంకణ గ్రామంబు మా కాపురంబు అన్నారు.ఎందుకొచ్చిన తిప్పలు. ఊళ్ళ పేర్లను మార్చే అధికారం మనకెవ్వరిచ్చారు?   
ఇలాగ ఎన్నో ఉన్నాయికాని ఇప్పటికిది చాలు.ముగించేముందు చెప్పదలచుకున్న మాట ఒక్కటీ చెప్పి ముగిస్తాను. భాష సజీవ స్రవంతి. ఇంతకు ముందు నా మడీ..తడీ..గోదావరీ.. అనే పోస్టులో చెప్పినట్లు నన్నయ గారు భారతాంధ్రీకరణం సమయంలో క్రుంకులిడినదీ, మనమిప్పుడు స్నానం చేసేదీ రాజమండ్రి దగ్గర గోదావరిలోనే.నన్నయగారు తానమాడినప్పటి నీళ్లు ఇప్పుడు దానిలో లేక పోయినా అది గోదావరే. అప్పటి భాషలా ఇప్పుడు లేక పోయినా మనం మాట్లాడేది తెలుగే. కుప్పుసామయ్యర్ల లాగా మనం ఏదో చేయబోయి ఏదో చేయవద్దు. ఈ సుజల స్రవంతినిలాగే కొనసాగనిద్దాం.
(ఇందులో ఉదాహరించిన పద్యం దాసు కవిగారిది. కృతక ప్రామాణీకరణం గురించి దొణప్ప గారి వ్యాసం నుంచి గ్రహించాను. వారికికృతజ్ఞతలు తెలుపుకోవడం నా విధి.)







12, నవంబర్ 2012, సోమవారం

                         -అపురూపం-
                  బ్లాగ్మిత్రు లందరికీ దీపావళి  శుభాకాంక్షలు-

                       కం. పాపాత్ముడైన నరకుని
                             కోపాన్వితయైన సత్య కూల్చిన వేళన్
                             పాపపు చీకటి తొలగెను
                             దీపావళి జరుపుకొనుడు దివ్వెల వెల్గున్ !
                                                 
                                                 -పంతుల గోపాల కృష్ణ.

7, నవంబర్ 2012, బుధవారం

వడ్డించని విస్తళ్ళ కథ...


వడ్డించని విస్తళ్ళ కథ..
అవును.. నేను సరిగ్గానే వ్రాసేను. మీరూ సరిగ్గానే చదివారు. ఇది వడ్డించిన విస్తళ్ల కథ కాదు.  వడ్డించని విస్తళ్ల కథే. జీవితంలో ఏ పనీ చేయక పోయినా కాలు మీద కాలేసుకుని కూర్చున్నా హాయిగా సాగి పోయే వారి జీవితాన్ని నీకేం రా, వడ్డించిన విస్తరి నీ జీవితమంటూ  సరి పోలుస్తాము. ఎందు చేతంటే ఎంత డబ్బున్న వారికైనా బాగా ఆకలి వేసిన సమయంలో వారికి ఇష్టమైన పదార్థాలు వడ్డించిన విస్తరి దొరకడం కంటె మించిన అదృష్టం జీవితంలో మరొకటుండబోదు. మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడో పొరుగూరిలోనో  వేళ కాని వేళలోనో ఆకలేసినప్పుడు మన జేబునిండా డబ్బులున్నా కడుపునిండే అదృష్టం లభించదు.ముళ్లపూడి వారి కోతి కొమ్మచ్చిలో ఒక ఉదంతం చెప్పారు. ఓ రోజు ఉదయాన్నే ఏలూరునుంచో ఎక్కడనుంచో  సాయంత్రంలోగా మద్రాసు చేరుకోవాలని  వారూ బాపూ గారూ మరోఫిలిం ప్రొడ్యూసరు మిత్రులూ కలిసి కారులో బయల్దేరారట.మందు బందోబస్తు చేసుకున్నా విందు సంగతి మరచిపోవడంతో సగం దారిలో కడుపులో నకనకలు ప్రారంభమైతే ఏమీ దొరకక పోతే దారిలో పొలం గట్టున కూలివారి కోసం కుండలో వండుకుంటున్న అన్నం వారినడిగి పెట్టించుకుని తిన్న వైనాన్ని హృద్యంగా వర్ణించారు.వారికేం లేదా పోదా? కాని ఆ సమయంలో వారికి ఆ కూడే అమృతప్రాయమయ్యిందికదా? అందుచేతనే అదృష్టవంతుల జీవితాన్ని వడ్డించిన విస్తరితో పోల్చడం.ఇది అలాంటి వడ్డించిన విస్తళ్ల కథ కాదు. 
                                                     భోగ భాగ్యాలతో తులతూగే  మహా రాజులైతే రోజూ బంగారు పళ్ళేలలో భోజనం చేస్తారు. సిరి సంపదలు కలిగిన శ్రీమంతులైతే వెండి కంచాలలో భోజనం చేస్తారు. మరి మామూలు మనుషులకి ఇప్పుడైతే స్టెయిన్ లెస్ స్టీలు కంచాలంటూ వచ్చాయి కానీ పూర్వం రోజుల్లో ఏ ఆకులో విస్తళ్లో గతి.ఎవరో తిన్న (బాగా కడిగినవే అయినా సరే) కంచాల కంటె పరిశుభ్రమైన ఆకులలో భోజనమే శ్రేయస్కరం. అయిన వారికి ఆకుల్లోనీ కానివారికి కంచాల్లోనీ అనే సామెత ఊరికే వచ్చిందా. అరిటాకులలో భోజనం అన్నివిధాలా మంచిదే కానీ అవి అన్ని వేళలా అన్ని చోట్లా కావలసినన్ని దొరకవుకదా. అందుకనే ఆయాప్రాంతాలలో దొరికే మర్రాకులతోనో బాదం ఆకులతోనో మోదుగ ఆకులతోనో విస్తళ్లుకుట్టుకుని వాటిలో భోజనం చేసేవారు.
తన ప్రజల మనిషి ఆనే నవలలో శ్రీ వట్టికోట ఆళ్వారు స్వామి ఊరి దొరల గడీనుంచి ఊళ్లో ఉండే వైష్ణవ కుటుంబానికి ఆకులు కుట్టి పంపించాల్సిందిగా ఆజ్ఞ రావడం, ఆకుటుంబ యజమాని గ్రామాంతరంలో ఉండడంతో ఆ యింటి ఇల్లాలు తన చిన్ని కుమారుణ్ణి పంపించి మోదుగాకులు కోయించి తెప్పించి కుట్టి పంపించడం గురించి వ్రాసేరు. తమ గ్రామాల్లో నివసించే ప్రజలమీద దొరలు ఆరోజుల్లో చలాయించే దాష్టీకం అలా ఉండేది.
 తన చిన్న తనపు రోజుల్లో, దినమ్మూ పొద్దుటి పూట, రెండుపూట్లకూ సరిపడే ఆకులు కుట్టి వుంచుకోవడం వైదిక కుటుంబాలలో వొక విధిగా ఉండేదని వ్రాస్తారు శ్రీ శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు, తన అనుభవాలూ జ్ఞాపకాలూలో. ఆ ముచ్చట్లు చెబుతూ వారి పెరట్లో అరటి చెట్లుండేవి గాని  వాటి ఆకులు ఆటేవిగావని (సరిపోయేవిగావని) అందువల్ల తామరాకులో మోదుగాకులో మర్రిఆకులో అరిటాకులో కట్టల కొద్దీ తెస్తూ ఉండడం తన బాధ్యతగా ఉండేదని, తేవడమే కాదు అవసరమైన ఆకుల్ని కుట్టడం కూడా తన బాధ్యతగా ఉండేదని వ్రాసేరు.వారి నాన్న గారు ఊరిలో ఉంటే వారే ఎక్కువగా కుట్టే వారనీ వారు కుడితే, చేత్తో కాదు మిషను మీద కుట్టినట్లు ఉండేదంటారు.అంత చక్కని కుట్టు విజయనగరం పార్వతీపురం ప్రాంతం నుండి వచ్చేఅడ్డాకు విస్తళ్లలో తప్ప మరెక్కడా తాను చూడలేదనీ వ్రాసేరు.
శాస్త్రిగారు ఆంతగా ప్రశంసించిన అడ్డాకు విస్తళ్ల ప్రసక్తి వచ్చింది గనుక ఆ ముచ్చటలు కొంచెం విన్నవిస్తాను.
నాచిన్నప్పుడు మా వూళ్లో ( మాది శాస్త్రిగారు పేర్కొన్న పార్వతీపురమే లెండి) చాలా మంది బ్రాహ్మలు కోమట్ల ఇళ్లల్లో అడ్డాకుల విస్తళ్లు కుట్టేవారు. బ్రాహ్మలు స్వంత వాడుకకి కుట్టుకుంటే వైశ్యులు ఎక్కువైనవి అమ్మకానికి పెట్టుకునే వారు.  మాచిన్నప్పుడు పిల్లలకి చల్ది అన్నాలు( మా నాయనమ్మ చల్ది వణ్ణాలనే అనేది) తామరాకుల్లోనే పెట్టేవారు.ఈ తామరాకుల కట్టల్ని అవి అమ్మకానికి తెచ్చిన స్త్రీలకు సోలెడో తవ్వెడో నూకలిచ్చి కొనేవారు. అవి దొరకని రోజుల్లో చల్దన్నాలకి  జర్మనుసిల్వరు పళ్లేలే గతి. మధ్యాహ్నం భోజనాలకి మాత్రం తామరాకులు వాడే వారు కాదు. వాటిలో వేడి అన్నం పెడితే వాసన వస్తుందనో ఏమో మరి.కనీసం 15, 20 మందిమి కలిసి భోజనం చేసేవారం. అందరికీ అడ్డాకులతో కుట్టిన విస్తళ్లే. ఇవి కొన్నవికాదు. నాచిన్నతనంలో మారైతులు గ్రామంనుంచి అడ్డాకుల కట్టలు తెచ్చిపడేసేవారు మాయింట్లో.మేమేమో వాటిని పురికొసలతో తోరణాలుగా కట్టి వరండాలలోనో మిద్దెలమీదో  నీడను గాలికి ఆరేటట్లు కట్టేవారిమి. అలా అవి కొన్నాళ్లు బాగా ఆరి ఎండిపోయిన తర్వాత వాటిని విడదీసి సాఫుచేసి దొంతులుగా పెట్టి వాటిమీద తిరగలి (విసుర్రాయి) దిమ్మలో ఏవో బరువులు పెట్టి ఉంచేవారం. ఆవిధంగా అవి  బాగా  సాఫీగా తయారయేక  వాటితో విస్తళ్లు కుట్టడం ఇంట్లో ఆడవారి పని. వేసవి కాలంలో మధ్యాహ్నాలు భోజనాలయేక  మా ఆడవారంతా ఇంటి వాకిటి వరండాలో చేరి అకులదొంతులు పక్కన పెట్టుకుని కూర్చునే వారు.ఆకులు కుట్టడానికి ఈన(చీపురు) పుల్లలను గోటితో రెండుగా మధ్యకు చీరి వాడే వారు. మధ్యలో ఒక చక్కటి ఆకునుంచి దానిచుట్టూ ఆకులను కుట్టేవారు. మళ్లా వాటిచుట్టూ రెండో వరస ఆకుల్ని కుట్టేవారు.అవి పెద్దగా చక్కగా గుండ్రంగా చూడముచ్చటగా ఉండేవి. ఆ ఆకుల్లో పులుసు మజ్జిగ లాంటివి వేసుకుని తిన్నా ఒక్కచుక్క కూడా క్రిందికి పోనంత పకడ్బందీగా కుట్టేవారు. ఈ ఆకులు కుట్టే సమయంలో మా యింటిప్రక్కనే ఉండే మామేనత్తగారి అత్తగారు ఆకులు కుడుతూ కుడుతూ ఏ స్త్ర్లీల పాటలో పాడేవారు. అవి వినడానకీ కాలక్షేపానికీ వచ్చిన ఇరుగు పొరుగు అమ్మలక్కలు కూడా విస్తళ్లుకుట్టడం లో ఓ చెయ్యి వేసేవారు.  ఈ కార్యక్రమం పది పదిహేను రోజులపాటు నిర్విఘ్నంగా సాగేది. ఏ రోజుకారోజు వాటిని దొంతులుగా పేర్చిపెద్ద పెద్దకట్టలను మా నాన్నగారు ఓ ప్రక్కగా నున్న వరండాలో వేలాడదీసేవారు.అవసరమైనప్పుడు దింపుకుని వాడుకోవచ్చని. ఇంట్లో పెళ్లిళ్లయినా సంతర్పణలయినా అవే సరిపోయే వంటే ఎన్ని కుట్టేవారో ఊహించుకోండి. జరుగుబాటు లేకా విస్తళ్లుకొనుక్కో లేకా చేసిన పనులు కావివి.ఉద్యోగాలు చేయక పోయినా సంసారాలు నిర్వహించుకోవడంలో  ఆ నాటి స్త్రీలు తమవంతు పాత్రని ఎంత సమర్థవంతంగా పోషించేవారో తెలియజేసే విషయాలివి.
ఈ వ్యాసం ముళ్ళపూడి వారు చెప్పిన ముచ్చటతో ప్రారంభించేను కనుక వారే చెప్పిన మరో ముచ్చట చెప్పి ముగిస్తాను.రమణ గారి చిన్నప్పుడే తండ్రిగారు మరణిస్తే బ్రతుకుతెరువు వెతుక్కుంటూ వారి తల్లిగారు రమణనీ వారి తమ్ముడినీ తీసుకుని మద్రాసు వచ్చి అక్కడ దుర్గాబాయమ్మగారి ఆంధ్రమహిళా సభలో నెలకి 20 రూపాయలకి చిన్న ఉద్యోగంలో కుదురుకున్నారట.ఒక రోజు వారు భోజనంచేయడానికి విస్తరాకులు కొనడానకి కిరాణా కొట్టుకెళ్తే అక్కడ షావుకారు కానీకి మూడు ఆకులిచ్చాడట.( కానీ అంటే రూపాయిలో అరవై నాలుగో వంతు).కానీకి నాలుగాకులిమ్మంటే తనే కానీకి అయిదాకుల చొప్పున కొంటున్నాననీ వీరికి నాలుగిస్తే తనకు మిగిలేదేముంటుందని అన్నాడట.ఆ రేటుకి తాము కుట్టిస్తే తీసుకుంటావా అని అడిగితే సరేనన్నాడుట. ఆకులు షావుకారే సప్లై చేయాలి కనుక కానీకి ఎనిమిది ఆకులు కుట్టి ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. అలా కొన్నాళ్లు కుట్టి ఇచ్చేక కానీకి పది ఆకులు కుట్టి ఇవ్వాలని షావుకారు పేచీ పెడితే ఆ తర్వాత ఆపని మానుకున్నామని రమణ గారు వ్రాసేరు.కానీకి ఎనిమిదాకుల చొప్పున 512 ఆకులు కుడితే గాని రూపాయి సంపాదించలేరన్నమాట.ఎంత కష్టపడ్డారో. ఏం చేస్తారు మరి? అప్పుడు వారి జీవితం వడ్డించిన విస్తరి కాదు, వడ్డించని విస్తరే కదా?
ఇదీ వడ్డించని విస్తళ్ళ కథ. సెలవు.

1, నవంబర్ 2012, గురువారం

విజయనగరం-పిడుగు భీముడి కథ



ఎవరీ పిడుగు భీముడు? విజయనగరంతో ఏవిఁటతనికి సంబంధం?
అదే చెప్పబోతున్నాను.కొంచెం ఓపిక పట్టండి మరి.  ఈ భీమరాజును గురించి తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్లి విజయనగరం రాజులు పూసపాటి వారి చరిత్ర కొంచెం తిరగెయ్యాల్సి ఉంటుంది.
అనగా అనగా అని మొదలెడితే—పూర్వం వినుకొండ తాలూకాలో పూసపాడు అనే గ్రామంలో మాధవ వర్మ అనే రాజకుమారుడు కాపురం ఉండేవాడు. ఈతని పూర్వులు ఉత్తర దేశం కాశీ ప్రాంతంనుండి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు.ఈ మాధవ వర్మ బెజవాడ పోయి అక్కడ కనకదుర్గానుగ్రహం వల్ల దినదిన ప్రవర్థమానుడై ఆ రాజ్యానికి అధిపతియై రాజ్యం చేస్తూ ఉండే దినములలో ఇతనియొక్క సుగుణాలకున్నూ బలశక్తులకున్నూ మెచ్చి కనకదుర్గ ఏడు గడియలు కనక వర్షం కురిపించింది. కావలసినంత ధనం పుచ్చుకుని తతిమ్మాదంతా భూ స్థాప్యం చేశాడు. ఆ తరువాత కొన్నాళ్లకు అతడికి వజ్రపు గనులు కూడా కనుపించడంతో అనేక విధాల ధనవంతుడై రాజ్యం చేసినాడు.అతని తర్వాత అతని కుమారుడు రవి వర్మ అతని కుమారుడు భూవర్మ అతనికుమారుడు నందిరాజులు వరుసగా బెజవాడ తఖ్తుకు అథిపతులై దుర్గానుగ్రహం వల్ల రాజ్యం చేసినారు. నంది రాజు కుమారుడు బసవరాజు రాజ్యం చేస్తూ ఉండగా ఢిల్లీ పాదుషా వారు సకల దేశాలున్నూ ఆక్రమించుకున్నప్పుడు వీరి జమీందారిన్నీ అక్రమించుకొనిరి.ఆ పాదుషా వారు వీరిని అనుగ్రహించి తూర్పు దేశానికి  మీకు జమీ దయచేస్తామని అనడంతో వారితో పాటు సైన్య సమేతంగా అక్కడికి వెళ్లారు. అక్కడ పాదుషా వారు వీరికి పొట్నూరు  భోగాపురం దేవులపల్లి గండ్రేడు జమీందారి సనదు వ్రాయించి ఇచ్చినారు.ఇక్కడ వీరికి రాజ్యాంగం రావడమున్నూ బెజవాడ కనకదుర్గాంబ అనుగ్రహమే గనుక
ఇక్కడ ఉండిన్నీబెజవాడలో ఉన్నట్టుగానే దుర్గా మహాదేవియందు భక్తి చాల కలిగి ఉండేవారు.
బసవ రాజు తరువాత అతని కుమారుడు వీర బసవరాజు, మనుమడు రుద్రరాజు  శివభక్తి పరాయణులై చాలా కాలం రాజ్యం చేసారు. ఈ రుద్ర రాజు కుమారుడే భీమ రాజు.ఈతని జాతకమందు ఇరవై సంవత్సరములకు పిడుగు గండమని వ్రాసినారు.అందువలన అతని తల్లి తనకుమారుడుకి గండం తప్పించవలెనని ఉక్కుతోటి ఇల్లు దానిక్రింద ఇల్లు అలా వరుసగా అయిదు ఇండ్లు కట్టించుతూ ఉండే టప్పటికి ఈ భీమరాజు తల్లితో అమ్మా ఈ ఇల్లు చూస్తే బహుకొంచెంగా ఉన్నది క్రయం విస్తారంగా అయినది.ఇది ఎందుకు తలపెట్టినారు అని అడిగితే ఆమె  నాయనా నీకు 20వ సంవత్సరంలో పిడుగు గండం ఉన్నది. నీకు 20 వ సంవత్సరం ఇంక నాలుగు రోజులలో వస్తుంది. ఆదినం నాలుగు గడియలు మాత్రం ఈ ఉక్కుఇంట్లో నీవు ఉండవలెనని విచారంగా చెప్పింది.దానికి భీమరాజు నవ్వి అమ్మా పిడుగుకి పర్వతాలు అయినా పాతాళానికి పోతాయి, ఇల్లు అనగా ఎంతమాత్రం. దైవకటాక్షం మాత్రమే నన్ను రక్షించగలదు అని పలికి అతి వేగంగా బెజవాడ వచ్చి తమ ఇష్టదైవమైన కనకదుర్గను అనేక విధాల స్తోత్రం చేసి ప్రసన్నం చేసుకుని నేను పిడుగువల్ల మరణం కాకుండా నా యొక్క ఖడ్గధార చేతనే నేను పిడుగు నరికేటట్టుగా వరం ప్రసాదించమని వేడుకుంటే అమ్మ వారు వరం దయచేశారు. ఆ తరువాత తిరిగి తమ దేశానికి వస్తుండగా కోట సమీపాన పిడుగు పడేసరికి తన కత్తి చేత నరికి గండం పోగొట్టుకుని కోట చేరాడు. ఆ తరువాత ఎన్నో దాన ధర్మాలు చేసి కీర్తిని సంపాదించి శివలోక ప్రాప్తిని చెందాడు. ఈ విధంగా పిడుగుని తన కత్తితో నరికినందువలన ఇతడు పిడుగు భీమరాజని  సార్థక నామధేయుడయ్యాడు. ఇతని తర్వాత రాజ్యానికి వచ్చిన ఇతని కుమారుడు చిక్క భీమరాజు  శైవం మానుకుని వైష్ణవం పుచ్చుకుని  నలభై సంవత్సరాలు రాజ్యం చేశాడు.
అయ్యా ఇదీ పిడుగు భీమరాజు గారి కథ.ఇది కల్నల్ మెకంజీ సేకరించిన కైఫీయత్తు ( వాల్యూం 25- కళింగ కైఫీయత్తు) లలో ఉంది.పూసపాటి వంశీయుడైన ఇతడు వారి వంశ వృక్షంలో ఎక్కడైనా దొరుకుతాడా అని వెతికతే  రఘునాథ రాజు అను మాధవ వర్మ భోగాపురం గ్రహీత (1620-1652) అని ఉంది. విజయనగరాన్ని ఏలిన రాజుల వంశంలో ఇప్పటి కోట కట్టక మునుపు కుమిలిలో మట్టి కోట కట్టించిన కృష్ణమరాజు గారి అన్నదమ్ముడైన రామరాజు (పూసపాటి రేగ వారి ఆద్యులు) వంశంలోని వాడీ  రఘునాధరాజు అనే మాధవ వర్మ- మన పిడుగు భీమరాజుగారి  ప్రప్రపితామహుడని తేలింది. ఆవిధంగా ఇతడు చారిత్రక పురుషుడనడంలో అనుమానం లేకపోయినా, పిడుగుని కత్తితో నరకగలగడం వింతగానే తోస్తుంది. ఏమయినా అతడు కనక దుర్గమ్మతల్లి భక్తుడు కనుక ఆమె కృపవల్లే పిడుగుపాటునుండి రక్షింపబడ్డాడని, జాతకంలోని గండం గడిచిందని భావించాలి.ఈ వృత్తాంతం కైఫీయత్తునుండి సేకరించాను కనుక  అప్పటి కైఫీయత్తుల భాష కూడా మీకు రుచి చూపించాలని వీలయినంతవరకూ అదే భాషలో అందించాను. పెద్దకథని మీకు విసుగు కలుగ కుండా ఉండేందుకు క్లుప్తీకరించాను.అంతే.(నేను  పూసపాటివారి వంశవృక్షాన్ని మహరాజా పూసపాటి అలక్ నారాయణ గజపతి శతజయంతి ఉత్సవ సంచిక 2002 లో చూసి పిడుగు భీముని పూర్వీకుడైన మాధవ వర్మని గుర్తించాను.)