ఎవరీ పిడుగు భీముడు? విజయనగరంతో ఏవిఁటతనికి సంబంధం?
అదే
చెప్పబోతున్నాను.కొంచెం ఓపిక పట్టండి మరి.
ఈ భీమరాజును గురించి తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్లి విజయనగరం రాజులు
పూసపాటి వారి చరిత్ర కొంచెం తిరగెయ్యాల్సి ఉంటుంది.
అనగా అనగా అని
మొదలెడితే—పూర్వం వినుకొండ తాలూకాలో పూసపాడు అనే గ్రామంలో మాధవ వర్మ అనే
రాజకుమారుడు కాపురం ఉండేవాడు. ఈతని పూర్వులు ఉత్తర దేశం కాశీ ప్రాంతంనుండి వచ్చి
ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు.ఈ మాధవ వర్మ బెజవాడ పోయి అక్కడ కనకదుర్గానుగ్రహం
వల్ల దినదిన ప్రవర్థమానుడై ఆ రాజ్యానికి అధిపతియై రాజ్యం చేస్తూ ఉండే దినములలో
ఇతనియొక్క సుగుణాలకున్నూ బలశక్తులకున్నూ మెచ్చి కనకదుర్గ ఏడు గడియలు కనక వర్షం
కురిపించింది. కావలసినంత ధనం పుచ్చుకుని తతిమ్మాదంతా భూ స్థాప్యం చేశాడు. ఆ తరువాత
కొన్నాళ్లకు అతడికి వజ్రపు గనులు కూడా కనుపించడంతో అనేక విధాల ధనవంతుడై రాజ్యం
చేసినాడు.అతని తర్వాత అతని కుమారుడు రవి వర్మ అతని కుమారుడు భూవర్మ అతనికుమారుడు
నందిరాజులు వరుసగా బెజవాడ తఖ్తుకు అథిపతులై దుర్గానుగ్రహం వల్ల రాజ్యం చేసినారు.
నంది రాజు కుమారుడు బసవరాజు రాజ్యం చేస్తూ ఉండగా ఢిల్లీ పాదుషా వారు సకల దేశాలున్నూ
ఆక్రమించుకున్నప్పుడు వీరి జమీందారిన్నీ అక్రమించుకొనిరి.ఆ పాదుషా వారు వీరిని
అనుగ్రహించి తూర్పు దేశానికి మీకు జమీ
దయచేస్తామని అనడంతో వారితో పాటు సైన్య సమేతంగా అక్కడికి వెళ్లారు. అక్కడ పాదుషా
వారు వీరికి పొట్నూరు భోగాపురం దేవులపల్లి
గండ్రేడు జమీందారి సనదు వ్రాయించి ఇచ్చినారు.ఇక్కడ వీరికి రాజ్యాంగం రావడమున్నూ
బెజవాడ కనకదుర్గాంబ అనుగ్రహమే గనుక
ఇక్కడ
ఉండిన్నీబెజవాడలో ఉన్నట్టుగానే దుర్గా మహాదేవియందు భక్తి చాల కలిగి ఉండేవారు.
బసవ రాజు తరువాత
అతని కుమారుడు వీర బసవరాజు, మనుమడు రుద్రరాజు
శివభక్తి పరాయణులై చాలా కాలం రాజ్యం చేసారు. ఈ రుద్ర రాజు కుమారుడే భీమ
రాజు.ఈతని జాతకమందు ఇరవై సంవత్సరములకు పిడుగు గండమని వ్రాసినారు.అందువలన అతని
తల్లి తనకుమారుడుకి గండం తప్పించవలెనని ఉక్కుతోటి ఇల్లు దానిక్రింద ఇల్లు అలా
వరుసగా అయిదు ఇండ్లు కట్టించుతూ ఉండే టప్పటికి ఈ భీమరాజు తల్లితో “అమ్మా ఈ ఇల్లు చూస్తే బహుకొంచెంగా ఉన్నది క్రయం
విస్తారంగా అయినది.ఇది ఎందుకు తలపెట్టినారు” అని
అడిగితే ఆమె “నాయనా నీకు 20వ సంవత్సరంలో పిడుగు గండం ఉన్నది.
నీకు 20 వ సంవత్సరం ఇంక నాలుగు రోజులలో వస్తుంది. ఆదినం నాలుగు గడియలు మాత్రం ఈ
ఉక్కుఇంట్లో నీవు ఉండవలె”నని విచారంగా చెప్పింది.దానికి భీమరాజు నవ్వి “అమ్మా పిడుగుకి పర్వతాలు అయినా పాతాళానికి
పోతాయి, ఇల్లు అనగా ఎంతమాత్రం. దైవకటాక్షం మాత్రమే నన్ను రక్షించగలదు” అని పలికి అతి వేగంగా బెజవాడ వచ్చి తమ
ఇష్టదైవమైన కనకదుర్గను అనేక విధాల స్తోత్రం చేసి ప్రసన్నం చేసుకుని “నేను పిడుగువల్ల మరణం కాకుండా నా యొక్క ఖడ్గధార చేతనే నేను పిడుగు నరికేటట్టుగా” వరం ప్రసాదించమని వేడుకుంటే అమ్మ వారు వరం
దయచేశారు. ఆ తరువాత తిరిగి తమ దేశానికి వస్తుండగా కోట సమీపాన పిడుగు పడేసరికి తన
కత్తి చేత నరికి గండం పోగొట్టుకుని కోట చేరాడు. ఆ తరువాత ఎన్నో దాన ధర్మాలు చేసి
కీర్తిని సంపాదించి శివలోక ప్రాప్తిని చెందాడు. ఈ విధంగా పిడుగుని తన కత్తితో
నరికినందువలన ఇతడు పిడుగు భీమరాజని సార్థక
నామధేయుడయ్యాడు. ఇతని తర్వాత రాజ్యానికి వచ్చిన ఇతని కుమారుడు చిక్క భీమరాజు శైవం మానుకుని వైష్ణవం పుచ్చుకుని నలభై సంవత్సరాలు రాజ్యం చేశాడు.
అయ్యా ఇదీ పిడుగు భీమరాజు
గారి కథ.ఇది కల్నల్ మెకంజీ సేకరించిన కైఫీయత్తు ( వాల్యూం 25- కళింగ కైఫీయత్తు)
లలో ఉంది.పూసపాటి వంశీయుడైన ఇతడు వారి వంశ వృక్షంలో ఎక్కడైనా దొరుకుతాడా అని
వెతికతే రఘునాథ రాజు అను మాధవ వర్మ
భోగాపురం గ్రహీత (1620-1652) అని ఉంది. విజయనగరాన్ని ఏలిన రాజుల వంశంలో ఇప్పటి కోట
కట్టక మునుపు కుమిలిలో మట్టి కోట కట్టించిన కృష్ణమరాజు గారి అన్నదమ్ముడైన రామరాజు
(పూసపాటి రేగ వారి ఆద్యులు) వంశంలోని వాడీ
రఘునాధరాజు అనే మాధవ వర్మ- మన పిడుగు భీమరాజుగారి ప్రప్రపితామహుడని తేలింది. ఆవిధంగా ఇతడు
చారిత్రక పురుషుడనడంలో అనుమానం లేకపోయినా, పిడుగుని కత్తితో నరకగలగడం వింతగానే
తోస్తుంది. ఏమయినా అతడు కనక దుర్గమ్మతల్లి భక్తుడు కనుక ఆమె కృపవల్లే పిడుగుపాటునుండి
రక్షింపబడ్డాడని, జాతకంలోని గండం గడిచిందని భావించాలి.ఈ వృత్తాంతం కైఫీయత్తునుండి
సేకరించాను కనుక అప్పటి కైఫీయత్తుల భాష
కూడా మీకు రుచి చూపించాలని వీలయినంతవరకూ అదే భాషలో అందించాను. పెద్దకథని మీకు
విసుగు కలుగ కుండా ఉండేందుకు క్లుప్తీకరించాను.అంతే.(నేను పూసపాటివారి వంశవృక్షాన్ని మహరాజా పూసపాటి అలక్
నారాయణ గజపతి శతజయంతి ఉత్సవ సంచిక 2002 లో చూసి పిడుగు భీముని పూర్వీకుడైన మాధవ
వర్మని గుర్తించాను.)
5 కామెంట్లు:
బాగుంది. పిడుగుని నరకడమంటే బహుశా కత్తిని ఒక వాహకంగా (కండక్టర్) గా వాడి, తనకు షాక్ తగలకుండా భూస్థాపితం చేసి ఉంటాడు.
స్వామి గారికి, చాలా కాలానికి ఇటువైపు వచ్చారు.సంతోషం. కృతజ్ఞతలు.మీరు చెప్పినట్టే జరిగి ఉండవచ్చును.అయితే అలా తనను తాను రక్షించుకోగలనని ఆ రోజుల్లో అతడికి తెలిసి ఉండక పోయినా అమ్మవారి దయవలననే ఆవిధంగా చేసి బ్రతికి బట్టికట్టేడేమో.దైవానుగ్రహం లేకపోతే ఏ కృషీ ఫలించదు కదా?
చాలా ఆశక్తిగా ఉందండీ.. పరిచయానికి ధన్యవాదాలండీ.
శుభ గారికి, స్పందనకు కృతజ్ఞతలు.
నమస్కారములు
చాలా బాగుంది పిడుగు భీముడి కధ " పిడుగుని నరకడం " ఎలా సాధ్య మైందబ్బా ? ఆశ్చర్యం గానే ఉంది .
కామెంట్‌ను పోస్ట్ చేయండి