21, డిసెంబర్ 2012, శుక్రవారం

తడీ...పొడీ... మడీ...


తడీ..పొడీ..మడీ..
ఈ మూడూ మూడు పొడి ముక్కల లాగే కన్పిస్తున్నా వీటిల్లో చాలా అర్థముందండోయ్.తడిగా అంటే నీటిలో తడిసిన లేక చెమ్మగా ఉందనేది మామూలు అర్థమైతే దీన్ని వేర్వేరు చోట్ల వేర్వేరుగా ప్రయోగించవచ్చు.మచ్చుకు  కంట తడిపెట్టడం అంటే కన్నీరు కార్చడం.ఇది మనకు కలిగిన బాధ వల్లనో ఇతరుల బాధకు మన ప్రతిస్పందనో అయి ఉంటుంది. అదే గుండె తడి అంటే ఎవరి బాధకో మన మనస్సుకరిగి పోవడమన్న మాట.
పొడి అంటే పప్పులు మొదలైన వాటిని బాగా దంచితే వచ్చే పదార్థం. మిరప పొడి కందిపొడి మొదలైనవి. అయితె పొడిగా ఉంది అన్నప్పుడు ఈ అర్థమే కాకుండా తడిగా లేకుండా ఉందనే అర్థం కూడా వస్తుంది.
మరి మడి అనే మాటకి ఈ రెండింటితోనూ సంబంధం ఉందండోయ్. ఊరికే పొడిగా ఉన్నదేదీ మడి కాదు.ఏదైనా బట్ట మడికి కావాలంటే దానిని తడిపి ఆరవేసి పొడిగా అయ్యేక స్నానం చేసి మడిగా ఉన్న వాళ్లు ముట్టుకుని కట్టుకుంటేనే అది మడి అవుతుంది.తడి బట్ట అయితే మడికి మరీ శ్రేష్టం.
ఈ మడి కాదు కాని మడికి (పొలానికి) నీరు పెట్టడం కూడా తడి పెట్టడమనే  వ్యవహరిస్తారు వ్యవసాయదారులు. రెండు , మూడు తళ్లు (తడికి బహువచనం) పెట్టామంటారు.
ఇవన్నీ సామాన్యార్థాలే . వీటి విశేషార్థాలు చూడండి. తడి అనే దానికి ఎలాగొచ్చిందో కాని డబ్బు అనే అర్థం కూడా అది సంతరించుకుంది. దీన్ని కొంచెం వివరిస్తాను.
ఆఫీసుల్లో మన పని జరగాలంటే ఎవరినో ఒకరిని తడిపితే కాని మన పని జరగదంటారు.ఇలా అన్నారు కదా అని మనం అమాయకంగా వారికి జలాబిషేకం చేస్తే అంతే సంగతులు.అసలుకే మోసం వస్తుంది. ఇక్కడ తడపడమంటే ఆమ్యామ్యా లివ్వడమన్న మాట. లంచమనే పదానికి ప్రత్యామ్నాయంగా ఈ ఆమ్యామ్యా అన్న పదం అందాల రాముడు సినిమాలో అల్లు వారి నోట్లోనుంటి వచ్చి ఆంధ్ర దేశమంతా అల్లుకుంది. లంచం కావాలంటూ బహిరంగంగా అడగలేక నీళ్లునములుతూ మాట్లాడినట్లు వినిపించే ఈ పదం ముళ్లపూడి వారి అపూర్వ సృష్టి.అదలా ఉంచి దీనికి తడపడమని ఎందుకు పేరు వచ్చిందో చెబుతాను. మన సంస్కృతిలో ఏ దానమైనా ఇచ్చేటప్పుడు దాత గ్రహీత చేతిలో నీళ్లు పోసి ఇవ్వడం ఆచారం.అఖరుకు కూతుర్ని అల్లుడికి కన్యాదానం చేసినప్పుడు కూడా కాళ్లు కడిగి కన్య ధార పోస్తాము.(అంతే కాదు ముందు మాట్లాడుకున్నవన్నీ ఇచ్చి వరుని తండ్రి చేతులు తడిపితే కాని ఆ మూడు ముళ్లూ పడవు) పెళ్లితంతు ముగిసే ముందు పిల్లని అత్తవారింట్లో అందరికీ పేరు పేరునా ఒప్పజెప్పినప్పుడు కూడా కన్యాదాతలు తమ చేతులు పాలలో ముంచి అవతలివారి చేతులకి తాకించి  వారి చేతులు తడిచేసి( వారికి బట్టలూ గట్రా పెట్టి) మరీ అప్పజెప్తాము.ఈ విధంగా మన సొమ్ము ఇతరులకి దానం చేసినప్పుడు వారి చేతులు తడపక తప్పదు. ఈ ఆచారం వల్లనే లంచం సొమ్ము ఇవ్వడానికి కూడా తడపడమనే రూఢ్యార్థం వచ్చింది. ఇలా లంచం పుచ్చుకోవడానికి ఇష్టపడని వాడిని మరీ మడికట్టుక్కూర్చున్నాడంటారు.ఇవ్వమని మనం మడికట్టుక్కూర్చున్నా పనులు అవవు.ఇంట్లో అయితే ఏ పనీ చేయడానికి ఇష్టం లేక పోతే మడికట్టుకుని హాయిగా ఓ మూల కూర్చోవచ్చు.
తడి అనే దానికి డబ్బుతో ఉండే లింకేమిటో   ఒ ముచ్చట చెబుతాను వినండి.
ఒక రోజు నేను ఏదో ఊరికి వెళ్తూ స్టేషనులో ఆగి ఉన్న రైలు ఎక్కి కూర్చున్నాను. రైలు బయలు దేర బోతుండగా ఒక పెద్దామె ఆమె ఇద్దరూ కూతుళ్లూ హడావుడిగా రైలెక్కారు. రైలు సాగి పోతుండగా వారి తమ్ముడు రైలెక్కలేదని గమనించిన ఒక అమ్మాయి గాభరా పడింది. ఇంకో పెట్లో ఎక్కి ఉంటాడు లేవే అంది రెండో ఆమె. గాభరా పడుతున్న అమ్మాయి వాడి దగ్గర సెల్లుంది కదా. ఫోన్ చేయవచ్చుకదా అంది. దానికి వాళ్ళమ్మ ఆడి సెల్లో తడుందో నేదో అంది.( వాళ్లు మా విశాఖ పట్నం వేపు వాళ్లు). నా పక్కన కూర్చున్న అబ్బాయి సెల్లులో తడేమిట్రా తడిస్తే సెల్లు గతి అంతే కదా అని విస్తు పోతుంటే, అంతకు ముందు అలాంటి మాట విని ఉండక పోయినా సంగతి అర్థమైన వాణ్ణి కనుక ఇక్కడ తడి అంటే సెల్లులో బాలన్సు అని విడమరిచి చెప్పాను.
ఇంక తడిలో ఎంత డబ్బుందో బాగా ఎరిగిన వారు మన సినిమా వారు.అవసరం ఉన్నా లేక పోయినా వాన పాటల్లోనూ, స్విమ్మింగ్ పూల్లోనూ హీరోయిన్ను తడిపి తడిపి తమను తాము కనక వర్షంలో తడుపు కుంటారు.హీరోయిన్సు ఎంత తడిస్తే నిర్మాత కంత డబ్బన్న మాట.
తడికీ పొడికీ ఉన్న తేడా గ్రహించేరుగా. తడి అంటే డబ్బే కాదు.ప్రేమా అభిమానమున్నూ. ఇవి ఉన్న చోటే ఆర్ద్రత ఉంటుంది. మనకిష్టం లేని వారొస్తే రెండు పొడి పొడి ముక్కలు మాట్లాడి పంపించి వేస్తాము కదా.
మన మానవ మాత్రుల సంగతలా వదిలేయండి. ఆ మహాదేవుడికి కూడా మనం తడిపితేనే ఇష్టం.అభిషేకమో  అభిషేకమో అని పలవరిస్తుంటాడట. మంచి తీర్థం కాకుండా పంచామృతాలైతే మరీ మంచిది.మనపై తన కరుణారసవృష్టి కురిపించి మనల్నికూడా తడుపుతాడు. మనకి కూడా అలా తడవడమే ఇష్టం కదా?
ఈ తడీ పొడీ అనే మాటల్ని మహాకవి శ్రీ శ్రీ వేరే అర్థంలో ఎలా ఉపయోగించుకున్నాడో చెప్పి ముగిస్తాను.
మనకు స్వాతంత్ర్యం వచ్చేక కాంగ్రెసు వారు ప్రొహిబిషను అమలు చేస్తూ తనకు మందుదొరక కుండా చేస్తున్నారని చిన్న చురక.
పొడిచేస్తామని చెప్పిన
 మనకాంగ్రెసువారు
తడి రాష్ట్రాలన్నిటినీ
 పొడి చేస్తున్నారు.
(మొదటి పాదంలో పొడిచేయడమంటే ఏదో ఎక్కబొడుస్తామని సాధిస్తామని చెప్పడమైతే నాలుగో పాదంలో పొడి చేయడమంటే ప్రొహిబిషను పెట్టడం. మూడో పాదంలో తడి రాష్ట్రాలంటే ప్రొహిబిషను అమలు లో లేని రాష్ట్రాలన్నమాట.మందు దొరకని కసిలో మహాకవి ఇలా శ్లేషించాడన్నమాట.)
                                                  ***

   

6 కామెంట్‌లు:

వెన్నెల రాజ్యం1 చెప్పారు...

ఏమి రాస్తిరి, ఏమి రాస్తిరి. అదరగొట్టారు మాస్టారూ. మీకు వంద వీరతాళ్లు.

రసజ్ఞ చెప్పారు...

అద్భుతం! చాల బాగా చెప్పారు. అయితే తడి అంటే సెల్లులో బాలన్సు అన్న అర్థం మాత్రం ఇప్పుడే తెలిసింది :)

అజ్ఞాత చెప్పారు...

చక్కగా ’పొడి’ చేసేరు

www.apuroopam.blogspot.com చెప్పారు...

వెన్నెల రాజ్యం, రసజ్ఞ, కష్టే ఫలే శర్మ గార్ల స్పందనకు కృతజ్ఞతలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మన మామూలు వాడుక పదాల్ని చక్కగా విశ్లేషించారు .బాగుంది మంచి వ్యాసం.

www.apuroopam.blogspot.com చెప్పారు...

రాజేశ్వరి గారికి, ఇదీ ఇంతకు ముందు పోస్టు ఎవరీ బుడత కీచులు అన్న వ్యాసమూ చదివి స్పందించినందుకు ధన్యవాదాలు.