14, జనవరి 2013, సోమవారం

సృష్టి లో తీయనిది....కన్యాశుల్కం నాటకంలో గిరీశం వెంకటేశాన్ని చదువు చెప్పే మిషతో సృష్టిలో ఏమేమి వస్తువులు ఉన్నవో చెప్పమని అడిగితే దానికి తడుముకోకుండా చెగోడీలు అని ఠక్కున సమాధానమిస్తాడు వెంకటేశం.దానికి గురువు గారి ఇంగితం గ్రహించి విధవలు అని వెంకటేశం సమాధానమిస్తే,  విధవా వివాహాల గురించి పెద్ద లెక్చరు దంచాలని గిరీశం ఆశ.ఎవరి ఇష్టాలు వారివి. ఎవరి గోల వారిది.
అలాగే సృష్టిలో తీయనిది ఏది అని మనం ప్రశ్నిస్తే తడుముకోకుండా ప్రేమ  అని సమాధానమిస్తాడు ప్రేమికుడు. ప్రేమికులు ఊసుపోక కబుర్లు చెప్పుకున్నా అవి తియ్యగానే ఉంటాయి. అవి “Sweet Nothings”.
అలాగే వారు కనే కలలు కూడా తియ్యగానే ఉంటాయి.  అవి “Sweet Dreams”.
 రాజకీయుడు పదవి అంటాడు.లుబ్ధుడు ధనం అంటాడు.కన్నతల్లి నా సంతానం అంటుంది.
సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్నది ఒక  కవిగారి ఉవాచ. మనం సృష్టిలో తియ్యగా ఉండేదేదో చెప్పమంటుంటే అందరూ వారి వారి కిష్టమైన వస్తువుల పేర్లు చెబుతున్నారేంటి అనుకో వద్దు. అదంతే. ఆఖరుకి కొత్తావయ కాయో మిర్చిబజ్జీలో అంటే ప్రాణం పెట్టే ఆసామీలు కూడా తన ప్రాణమంటే తనకు తీపి అనే అంటారు కాని కారం అని అనరు కదా?అలా మన యిష్టాలకి తీపి పర్యాయపదమైపోయింది.
ఎవరైనా మనకు శుభ వార్త మోసుకుని వస్తే చల్లగా తీపి కబురు చెప్పావు కదయ్యా అంటూ అతడి నోట్లో ఇంత పంచదార పోయడమో బెల్లం ముక్క పెట్టడమో చేసేవారు మన పూర్వ కాలపు ఇల్లాళ్లు.ఏదో ఒకటైనా తీపివంట చేసుకోకపోతే మనకు పండుగా వెళ్లదు, శుభకార్యమూ జరుగదు కదా.ఇలా మనం కష్టపడి చేసుకునే తీపివంటల సంగతలా ఉంచితే, ప్రకృతి సిధ్ధం గా దొరికే తియ్యటి పండ్లు, చెరుకు, పాలమీగడా, తేనె వంటివి ఉండనే ఉన్నాయి. పండ్లూ చెరుకుల్లో రసం మాత్రమే తియ్యగా ఉంటుంది.పాలను కాస్తేనే కాని మీగడ కట్టదు.కాని తేనె ప్రతిబొట్టూ మధురమే.పాపం ఎన్నో వందల తేనెటీగలు ఎన్నో వేల పుష్పాలనుంచి ఎంతో దూరాలనుంచి మకరందాన్ని సేకరించి తమ గూట్లో పెట్టుకుంటే మనం అనాయాసంగా దానిని సంగ్రహిస్తాము.ప్రకృతి  సిధ్ధమైన వాటిల్లో తేనె అత్యంత మధురమైనదే కాకుండా ఆరోగ్య హేతువుకూడా అంటారు ఆయుర్వేద వైద్యులు. ఈ తేనె పట్టుల్లో లభించే తేనెగురించి అందరికీ తెలిసిందే కాని దానికన్నభిన్నమైనదీ, మధురమైనదీ, చాలామందికి తెలిసి ఉండనిదీ, అన్ని చోట్లా లభ్యం కానిదీ అయిన మరో తేనె గురించి మీకు చెప్పాలన్నదే నా కోరిక. వినండిమరి.
మన తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురానికి తూర్పుగా ఆరు కోసుల దూరంలో తూర్పుగా ఉండే పొన్నాడ,తొండంగి, వేమవరం గ్రామాలను ఆనుకుని, వాటికీ తూర్పు సముద్రానికీ మధ్యలో పలచటి అడవి ప్రాంతం కొంత ఉంది. కోన అనే వారు దాన్ని. ఈ కోన లో పాల చెట్లనే చెట్లు ఉంటాయి..వీటి తొర్రలను గూళ్లు చేసుకుని మన తేనెటీగల్లాంటి చిన్న ఈగలు వాటిల్లో గుడ్లు పెట్టుకుంటూ కాపురముంటాయి. అలాగే ఈ కోనలో సన్నగానూ పొడుగ్గానూ ఉంటూ, జమ్మి ఆకులను పోలిన ఆకులతో ఉండే చిన్ని చెట్లు ఉంటాయి. ఈ చిన్ని చెట్లకు చిన్ని చిన్ని తెల్లని పువ్వులుంటాయి.ఆ తేనె టీగలు  చిన్ని చెట్ల పువ్వులనుండి తేనె గ్రహించి తమ గూళ్లలో పెట్టుకుంటాయి. అదే కాక  ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వరి పంట సేద్యమయ్యే కాలంలో వరి చేలు ఈనుతూ ఉండే సమయంలో వరి పువ్వారు అనే వరి పువ్వు ఉంటుంది. ఆ తేనెటీగలు చిన్ని పువ్వుల తేనెతో పాటు  వరిపువ్వారునూ సంగ్రహించి తమ గూళ్ళకు చేరుస్తాయి.తమ గుడ్లు ఎదిగి అవి పిల్లలయే సరికి వాటి ఆహారం కోసం.అయితే  ఈ తేనె మన మామూలు తేనె లాగా ఎర్రగానూ ఉండదు, ద్రవరూపంలోనూ ఉండదు.  తెల్లగా చిన్న చిన్న పలుకుల్లాగా ఉండి గడ్డకడుతుంది.ఒకొక్క గడ్డా శేరు, శేరున్నర వరకూ తూగుతుంది.ఇది అత్యంత మధురంగా ఉంటుంది. దానికోసం  అక్కడే అడవిలో పాకలు వేసుకుని కాపురముంటూ పిఠాపురం రాజావారి సేవకులు ఆ తేనె తయ్యారయ్యే సమయం చూసుకుని దానిని సంగ్రహించి రాజా వారికి చేర్చే వారు. వారు దానిని తమ ఇష్టులకీ ఆప్తులకీ ఇచ్చుకుని మిగిలినది తమ వాడుక కోసం ఉంచుకునే వారు.ఈ తేనె సంవత్సరం లో రెండుసార్లు తయారవుతుంది.అయితే ఆషాడ మాసంలోతయేరయ్యే తేనె వరిపువ్వారు ఉండదు కనుక , కార్తీక మాసంలో వరిపువ్వారుతో కూడా కలసి తయారయ్యే  తేనెలాగా అంత మధురంగా ఉండదు.కార్తీక మాసంలో తయ్యారయ్యే ఈ చిన్ని పువ్వుతేనె తియ్యదనానికి దానికదే సాటి.ఇది నడి వేసవిలోచిన్నమెత్తు స్వీకరించినా తాపాన్ని హరించి చలవ చేస్తుందట.
ఈ తియ్యటి తేనె దాని సేకరణ గురించి బ్రౌను లోకలు రికార్డులలో ఉంది. మరి ఇప్పుడు ఇది దొరుకుతోందో లేదో ఆ జిల్లా వారెవరైనా చెప్పాలి.
సంక్రాంతి పండుగ పూటా మీతో తియ్యటి కబుర్లు చెప్పుకోవాలనిపించింది. అందుకే అపురూపమైన ఈ చిన్ని పువ్వు తేనెగురించి వ్రాసేను.బ్లాగ్మిత్రులకు సంక్రాంతి శుభకామనలతో—సెలవు.

3 వ్యాఖ్యలు:

పంతుల జోగారావు చెప్పారు...

మీ సృష్టి లో తీయనిది, ససేమిరా బ్లాగు ట పాలు రెండూ చూసానండీ. చాలా బాగా రాసారు. జక్కన గారి కథా కావ్యం నుండి ససేమిరా కథను పరిచయం చేసి నందుకు ధన్యవాదాలు.

రాజ కుమారులు చేపల వేటకు వెళ్ళడం , ఎండని చేపలు మాట్లాడడం ఎంత బాగుందో, ఇదీ అంటే బాగుంది. కాని, తెలుగు నాట ఏదు చేపల కథ పొందినంత ప్రసిద్ధ్హి మరీ కథకీ లేదు కదా ..

Pantula gopala krishna rao చెప్పారు...

జోగారావు గారికి-ధన్యవాదాలు.మీరు చెప్పినది నిజమే.ఏడు చేపల కథ చిన్న పిల్లలకు చెప్ప దగినది కనుక దానికంత ప్రాచుర్యం.ససేమిరా కథ లో ఆ అక్షఅరాలతో మొదలయ్యే పద్యాలూ వాటిలోని నీతి ముఖ్యమైనవి. ఇవి చెప్పుకోవడంలో ఉండే ఇబ్బంది వల్ల దానికి ప్రాచుర్యం లభించి ఉండక పోవచ్చును.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
" సృష్టి లో తీయని స్నేహ మే నోయి " " అన్న పదం ఎంత మధురమో మీ మధుప మకరందం అంత బాగుంది. మంచి వ్యాసం .