.
మీరెప్పుడైనా విన్నారో లేదో కానీ, నా చిన్నప్పుడు
మా పెద్దలు చెప్పగా విన్నానీ కధ.
అనగనగా ఒక ఊళ్లో ఉండే ఒక ఈగ ఇల్లలుకుతూ అలుకుతూ
ఉండగా తన పేరు మర్చిపోయిందట.ఈగేఁవిటి? ఇల్లలకడఁవేఁవిటి? అని
అప్పుడు నేనడగలేదనుకోండి. అడిగినా వాళ్లు చెప్పేవారు కాదు. వెధవా… కథకు
కాళ్లేఁవిటి ముంతకు చెవులేఁవిటి అంటూ ఎదురు దాడికి దిగే వారు. కథకు కాళ్లు
లేకపోతే ముందుకెలా వెళ్తుందండీ…
చివరకు కంచికెలా వెళ్తుందండీ? అయినా ఇలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు వేస్తే కథ
చెప్పడం మానేస్తారని నోరుమూసుకుని చెవులు చేటలు చేసుకుని వినేవాణ్ణి. అలా
ఇల్లలుకుతూ తన పేరు మరచిపోయిన ఈగకు ఎంత తల బద్దలు కొట్టుకున్నా తన పేరు గుర్తుకు
రాలేదట.అయినా తలలు బద్దలు కొట్టుకుంటే ఏవైనా గుర్తుకు వస్తాయటండీ? అలా వస్తాయంటే నేనెన్నిసార్లు తల బద్దలు కొట్టుకోవలసి
వచ్చేదో. మరపు మానవ సహజం కదా అని ఊరుకుంటాను. మరపు మానవ సహజమే కాదు ఈగలకు కూడా
సహజమే అన్నమాట.అయినా పెళ్లాం పుట్టినరోజో, ఎవరికో తీర్చాల్సిన అప్పో అయితే హాయిగా మరచిపోయి ఊరుకోగలం
కాని మన పేరే మనకి గుర్తు లేకపోతే ఎలా చావడం. అందుకని ఆ ఈగ అయ్యలారా తల్లులారా అన్నలారా
అక్కలారా నా పేరేమిటని రోదిస్తూ కనిపించిన వాళ్లందరినీ అడిగిందట. దాని భాష
అర్థంకాకో, ఇంత చిన్న ప్రాణి అడిగితే మనం జవాబు చెప్పాలా అనే అహంకారంతోనో
మనషులెవ్వరూ దానికి సమాధానం ఇవ్వలేదట. ఆ తర్వాత కనిపించిన జంతువులనన్నిటినీ—కుక్కనీ
పిల్లినీ ఆవునీ అన్నిటినీ అడిగందట. ఏ వీ దానికి జవాబు చెప్పలేదు.ఆఖరుగా దానికి
నిద్ర పోతున్న ఒక గుఱ్ఱం కనిపించిందట. చివరి ప్రయత్నంగా దానినీ అడిగింది. జవాబు
లేదట. దానికి సరిగా వినపించలేదేమో అని దాని చెవిలో దూరి రొద చేసి మరీ అడిగిందట. ఈ
ఈగ చెవిలో చేసిన రొదకి గుఱ్ఱం ఒక్కసారిగా
నిద్ర లేచి చెవులు విదిలిస్తూ
హిఁహిఁహిఁ.ఈఁ ఈఁ.. ఈఁ.. అంటూగట్టిగా సకిలించిందట. అది విన్న ఈగకు వెంటనే తన
పేరు ఈ..గ. . అని గుర్తుకు వచ్చి మనసు తేలికై ఈల వేసుకుంటూ డాన్స్ చేసుకుంటూ
చక్కగా ఎగిరి పోయిందట. ఈగ లెక్కడైనా ఈల వేస్తాయా?
డాన్స్ చేస్తాయా? అని నన్నడగకండి. ఈగలు ఈలలూ వేస్తాయి డాన్సులూ
చేస్తాయి లవ్వూ ఆడతాయి. విలన్ల మీద ప్రతీకారాలూ తీర్చుకుంటాయి. కావాలంటే
రాజమౌళినడగండి.
****
ఇంతవరకూ మా పెద్దలు చెప్పిన కథ. మిగిలింది నేను
చెబుతాను వినండి.
ఈ ఈగ అసలు పేరు ఈజ్ఞ్ గ. ఈజ్ఞ్.జ్ఞ్..జ్ఞ్..
అంటూశబ్దం చేస్తుంది కనుక దానిని ఈజ్ఞ్గ అన్నారు. అదే ఈంగ అయింది.ఇప్పటికీ దక్షిణ
దేశంలో ఉన్న మన తెలుగు వారు ఈంగ అనే పిలుస్తారు.మథ్యలో ఉండే పూర్ణానుస్వారాన్ని
తేలిగ్గా పలకడమో అసలు పలకక పోవడమో జరుగుతూ
అది నేటికి ఈగ అయింది.ఒకప్పుడు దానిని ఈంగ
అని పలికే వారమని గుర్తుగా ఈఁగ అంటూ మధ్యలో అరసున్నాతో తెలియజేస్తారు.ఈ అరసున్నలు నా
చిన్నప్పుడు ఉండేవి. కాని ఇప్పుడు ఎవరూ వ్రాయడంలేదు కనుక ఈంగ అనే దాని పూర్వపు
నామం ఇప్పటివారికి తెలీదు.ఇలాగే చిన్నగా ఉండి ఎగురుతూ ఉండే వాటిని మన వాళ్లు ఈగలనే
అనేవారు.జోరుగా రొదచేస్తూ తిరిగేది జోరీగ.వాటిల్లో కాస్త బొద్దుగా ఉండేది బొద్దు
+ ఈంగ = బొద్దీంగ ..బొద్దీంగ..బొద్దింక అయ్యింది..
బొద్దింకలో మనకు నిండు సున్నా నేటికీ కనిపిస్తూ ఉంటే, ఈగలో అది మాయమయింది. ఇలా
వచ్చిన సున్నలూ అరసున్నలూ అవి మాయమై పోవడాల గురించి మరోసారి చెప్పుకుందాం. సెలవా
మరి?
10 కామెంట్లు:
:)
సరదాగా బాగా వ్రాసారు.
ఇక "సున్నలూ అరసున్నలూ అవి మాయమై పోవడాల గురించి మరోసారి చెప్పుకుందాం" అన్నారు.
ఇప్పుడు చెప్పుకొన్నా, మరోమారు చెప్పుకొన్నా, "ఈ(గ" ఎన్నటికీ "ఈంగ" కానేరదు.
ఎందుకంటే దానికో లెక్కుంది - సారీ సూత్రముంది. అది -
"దీర్ఘము మీద సాధ్య పూర్ణము లేదు."
ఈ విషయం నాకూ ఒక ఈగ వల్లే తెలిసింది.
అరసున్నలపై ఒక ప్రసంగం చేయమని ఒక సాహిత్య సంస్థ వారు కోరినప్పుడు మక్కీ(ఈగ)కి మక్కీ(ఈగ) కాపీ కొడదామని "బాల వ్యాకరణం" తిరుగ వేసాను. ఒక పుటలో ఈగ చచ్చి అతికి ఉంది. దాని ప్రక్కన ఈ సూత్రముంది. ( ... సరదాకి!)
అభినందనలు!
బాగుంది ఈఁగ కథ
ఇలా వచ్చిన సున్నలూ అరసున్నలూ
అవి మాయమై పోవడాలూ-
హా హ్హా హ్హా!
పేరు మరిచిన ఈగ కథ -
సామ్యాని భలే చెప్పారు,
పంతులుగారూ!
;
- కోణమానిని
e-గ కథ బాగుందండీ !
జిలేబి.
మీ ఈగ గురించిన సరదా టపా చదివేనండీ. బాగుంది,
టైపు చేస్తూ ఉంటే పదాల మధ్య ఏవో గుర్తులు వస్తున్నాయండీ. అంచేత, వేరే చోట రాసి, కాపీ చేసి, ఇక్కడ పేష్టు చేసాను.
సరే ఇలాగే ఈగ అనే పదంలో కూడా పూర్ణాను స్వారం అక్రమంగా చొరబడిందంటారా ?
చిన్నయ్య వప్పుకోడే? ఫణీంద్ర గారు అన్నట్టు దీర్ఘం మీద సాధ్య పూర్ణం లేదు కదా ?
ఏవిటో ? దే,వి. పదానికి ధాతు రూపం ఉందంటారా ? వ్యాకరణం మరచి పోయి చాన్నాళ్ళయింది.
రాజమఔళిని అడగాలి అన్నారు చూడండి, అది మాత్రం భేషైన మాట ...
శ్రీ ఫణీంద్ర గారికి,నా ఈఁగ కథ మీచేత చదివింపజేసినందుకు ధన్యుణ్ణి.మీ స్పందనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్నయ సూరి వ్యాకరణ సూత్రం ప్రకారం ఈఁగ ఎప్పటికీ ఈంగ కానేరదు అని మీరన్నందున కొంత వివరణ ఇచ్చుకోవలసిన అగత్యం ఉందని భావిస్తున్నాను.ముందుగా నేను భాషా శాస్త్రజ్ఞుడిని కానని మనవి చేసుకుంటూ, ఆ కారణంగా చిన్నయ సూరి గారి సూత్రం గురించిన చర్చ మీవంటి పండితులకు వదిలేస్తూ,మీ వంటి పండితులకు తెలిసే ఉండే విషయాలే అయినా, ఈఁగ పుట్టుకను గురించి మరికొంత సమాచారం భాషా ప్రేమికులైన సామాన్యుల కోసం ఇస్తున్నాను.
మొదట బహువచన రూపమైన ఈజ్ఞ్గళ్ పుట్టింది. ఈజ్ఞ్ కి మూల ద్రావిడ భాషలోని బహువచన ప్రత్యయమైన కళ్ చేరి ఈజ్ఞ్ కళ్ ఈంగళ్ ఈంగలు అయింది. అయితే క్రమేపీ మన తెలుగు భాషలో లు బహువచన ప్రత్యయం గా స్థిరపడి పోయిన తర్వాత కళ్ లోని లు మాత్రమే బహువచన ప్రత్యయమనుకొని దానిని విడిచిపెట్టి ఈగ అనే ఏకవచన రూపం ఏర్పడింది.ఈ విషయాన్ని ఆచార్య గంటిజోగి సోమయాజి గారు తన ఆంధ్ర భాషా వికాసము అన్న గ్రంథం లో వివరించారు.అయితే అనుచిత విభాగం వల్ల ఈగలు నుంచి ఏకవచన రూపం ఏర్పడడం గురించి చెప్పడమే అక్కడ వారి ధ్యేయం కనుక ఈగలు లోని పూర్వ రూపమైన ఈంగలు గురించి వారు ప్రస్తావన చెయ్య్లలేదు.
ఈఁగ కి పూర్వ రూపం ఈంగ అనేది ఉండేదనడానికి ప్రబలమైన సాక్ష్యం ఆ రూపం ఇంకా దక్షిణాది తెలుగు వారి ఉచ్చారణలో మిగిలి ఉండడమే. ధీర్ఘం మీద కూడా పూర్ణ సాధ్యబిందువులండేవని వాండ్లు అనే మాట నిరూపిస్తుంది.
గోమయాన్ని ఆంద్ర ప్రాంతంలో పేడ అనీ తెలంగాణంలో పెండ అనీ నేడు వ్యవహరిస్తున్నారు. ధీని మూల రూపం పేండ అయితేనే ఇవి సాధ్యం కదా.
సోమయాజి గారు సిధ్ధ సాధ్యాలనుగురించి ప్రస్తావిస్తూ పదాది వర్ణము పయినే ఊనిక యుండి అది గురువగుటవలనను, ప్రక్కనున్న యనుస్వారము పయిని ఊనిక పూర్తిగా భ్రష్టమగుటను, దీర్ఘము పయినుండిన యనుస్వారము సార్వత్రికముగా భ్రష్టమయినది అన్నారు. అంటే మొదట ఉంటేనే కదా భ్రష్టమయేది.అందువలన సూరిగారి సూత్రం పక్కను పెట్టి ఈంగలు అనే ప్రాచీన రూపం నుండే ఈగలు పుట్టేయని అంగీకరించవలసి వస్తుంది. ఆ ప్రాచీన రూపాన్ని తెలియజేయడానికే కదా ఈఁగ మధ్యలో అరసున్న ఉంచుతున్నాము.
ఈఁగ ప్రాచీన రూపం ఈంగ అని, తన లిపి దాని పుట్టుపూర్వోత్తరాలు అనే గ్రంథంలో చెప్పినది శ్రీ తిరుమల రామచంద్ర గారు.వారికి కృతజ్ఞతలు.
నమస్కారములు
ఈ ....ఈ....గ కధ చాలా బాగుంది.
రాజేశ్వరి గారికి, నా సృష్టిలో తీయనిది, ఈగ కథ, పద్యం పురివిప్పి నాట్యమాడిన ఊరు పోస్టులను చదివి స్పందించినందుకు ధన్యవాదాలు.కంప్యూ్టర్ లో నెట్ లో కలిగిన ఇబ్బందుల వలన వెంటనే స్పందిచలేకపోయాను.త్వరలోనే మరో పోస్టు వ్రాయడానికి ప్రయత్నిస్తాను.బ్లాగ్మిత్రుల స్పందనలే వాటికి ప్రేరకాలు.
ఈగ కథ చాల బాగుంది. మరి కందిరీగ, తూనీగ ల కథలు కూడా చెబితే మరీ సంతోషం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి