అపురూపం...వివాహ స్వర్ణోత్సవ వేడుక..
“అపురూపం”
“అపురూపమా?”
“అవును. అపురూపమే”
“ఇది నీ బ్లాగు
పేరుకదా?”
“అవును. కానీ
నేనిప్పుడు చెబుతున్నది దాని గురించి కాదు.”
“మరేమిటి ”
“మా జీవితంలో
అపురూపమైన రోజు గురించి.”
“ఏమిటది”.
“ఇవాళ తారీకు 12 మే
కదా”.
“అవును. అయితే ఏమిటి
విశేషం”
“ఉంది. ఇవాళ మా
పెళ్లి రోజు.”
“శుభం. కానీ పెళ్లి రోజులు ప్రతీ సంవత్సరం
ఒకసారి వస్తూనే ఉంటాయి కదా.ఇది అంత అపురూపమైన
విషయమా”
“అవును మాకిది
అపురూపమైన విషయమే. ఎందుకంటే ఇవాళ్టికి మా పెళ్లై యాభై ఏళ్ళైంది. అంటే వివాహ స్వర్ణోత్సవమన్న మాట. మనిషి పూర్ణాయుష్షు వంద సంవత్సరాలు. కానీ వంద సంవత్సరాలు
బ్రతికే వారు లక్షకి ఒక్కరు కూడా ఉండరు కదా. సగటు జీవిత కాలం ఏ అరవై డభ్భై సంవత్సరాలో.అలాంటప్పుడు యాభై
ఏళ్లంటే మన జీవితంలో సగం కంటే ఎక్కువే కదా. అందుచేత యాభై ఏళ్ల దాంపత్యం అంటే
జీవితంలో సగ భాగం కంటే ఎక్కువే.కనుక వివాహ స్వర్ణోత్సవమంటే ఎవరికైనా వారికది
అపురూపమే.
ఈ సందర్బంగా మా ఇద్దరికీ ఇంత
ఆయుష్షునిచ్చినందుకు ఆ పరమేశ్వరునికి- నేను కొలిచే సాయిబాబాకి- నమస్కరించుకుంటున్నాను.
మరి నా జీవితంలో సగభాగం పైనే పాలుపంచుకుని జీవితాన్ని సుఖమయం
చేసిన
నా జీవిత సహచరిని అభినందిస్తున్నాను. ఆవిడ మీద నేను
రాసుకున్న పద్యం
ఇహ సుఖముల నందించగ
అహరహమును పాటు పడుచు అలుపెరుగక నా
గృహమును స్వర్గమొనర్చిన
సహచరి నాకున్ ప్రియ
సఖి సాక్షాత్ లక్ష్మీ
ఎన్నడూ పెళ్లి రోజు వేడుకలని జరుపుకోకపోయినా ఇవాళ మా వాళ్లందరితో సరదాగా
జరుపుకుంటున్నాము.తమ్ముళ్ళూ చెల్లెలూ కుటుంబాలతో ఊళ్ళనుండి వస్తున్నారు. బావ
మరదులూ మరదళ్లూ అందరూ ఊళ్ళోనే ఉన్నారు. అందరం సాయంత్రం హోటల్లో కలసి సమావేశమై
సరదాగా గడుపుతాము.కలసి భోజనం చేస్తాము.
అక్షయ తృతీయకి ఎప్పటిలాగే ఈ సారి కూడా అరతులం బంగారమైనా
కొనుక్కోక పోయినా అరకిలో బంగారం కొనుక్కున్నంత ఆనంద పడుతోంది మా ఆవిడ. ఆవిడ ఆనందమే
నా ఆనందం కదా?
.
16 కామెంట్లు:
అపురూపమైన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ దంపతులిద్దరికి అభినందనలు.. బంధుమిత్రులు, కుటుంబ సభ్యలు ప్రేమను మించిన బంగారం ఏమున్నది??
వివాహ రజతోత్సవం అంటే నిజంగా "అపురూపమే"- మీకూ, మీ భార్యగారికీ ఈ శుభ సందర్భంలో మా శుభాకాంక్షలు...
చాలా సంతోషమండి. ఆ ఆదిదంపతులు మీ నవదంపతులని కలకాలం సుఖసంతోషాలతో దీవించాలని ఈ శుభసందర్భంగా కోరుకుంటూ .. అభినందనలు.
యాభై జిలేబీలతో
శుభాకాంక్షలు !!
చీర్స్
జిలేబి
ఎంతో అపురూపం మీ బంధం. చాలా సంతోషం. మీ జంటకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ప్రతిరోజూ ఇద్దరూ ఇంతే అనందంగా గడపాలని ఆశిస్తున్నాను.
Congratulations..Wishing you both many more happy years together !!!!
నా శుభాకాంక్షలు ముందే తెలిపాను.కాని స్వర్ణోత్సవసందర్భంలో అరతులం బంగారమైనా అర్ధాంగికి కొనిపెట్టకుండా తప్పించుకున్నందుకు కూడా అభినందిస్తున్నాను!
ఇంకా ఎన్నో ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు మీ దంపతులిద్దరు జరుపుకోవాలని ఆశిస్తూ.... Congratulations!
నమస్కారములు
నిజంగా మీ ఆవిడ [ మాకు ఒదిన గారు ] బంగారం ఈ రోజు మీరు ఆవిడకి బంగారం స్వర్ణ మయమైన మీ ఆదర్శ దాంపత్యానికి హృదయ పూర్వక శుభా కాంక్షలు.
క్షమించాలి.. స్వర్ణోత్సవానికి బదులుగా రజతోత్సవం అని వ్రాసినందుకు...
మా వివాహ స్వర్ణోత్సవ మని తెలియజేయగానే స్పందించి తమ శుభాకాంక్షలను అందించిన బ్లాగ్ మిత్రులందరికీ కృతజ్ఞతలు. హరే ఫలే గారికి--మీరు కాదు నేనే పొరబాటున తొందరలో రజతోత్సవమని వ్రాసేను.తరువాత నేనే చూసుకుని సరిచేసే లోపల మీరు దానిని చూడడం స్పందిచడం జరిగాయి.ఆ పోరబాటు నాదే.
అపురూపమైన మీ వివాహస్వర్ణోత్సవాని కి శుభాకాంక్షలు .
వీరి వివాహ స్వర్ణోత్సవానికి వచ్చేను చాలా బాగా జరిగింది. మా వదిన నిజంగా బంగారమే.
కార్యక్రమం జరిగిన తీరు అందరికీ తెలియ .ేయాలనే సరదాదాతో రాస్తున్నాను.
అమ్మాయిలు సుధ, రాధ కళ్యాణిలు చక్కగా కార్య క్రమాన్ని నిర్వహించారు. ఇక కొడుకుల్లాగా అల్లుళ్ళు ఇద్దరూ చక్కని తోడ్పాటు అందించారు.
బంధు మిత్రులందరూ దంపతులకి శుబాకాంకంషలను అందించి సరదాగా గడిపేరు.
పెద్ద పెద్ద ఆర్భాటా లేమీ లేకుండా ఆహ్లోదకరంగా ఈ వేడుక జరిగింది.
అన్నయ్య రెండో కుమార్తె చి. రాధ అమ్మా నాన్నల మీద ఒక చక్కని పాట రాసి పాడింది. పాట రచనలో సహజమైన ఆర్ద్రత ఉండడం వల్లనూ, మధురమైన కంఠ స్వరంతో పాడడం వల్లనూ అందరమూ చాలా సంతోషించాం. కళ్ళు చెమరించాయి కూడా.
ఈ కుటుంబ వేడుకకి విజయ నగరం నుండి అన్నయ్య తరువాతి వాడి నయిన నేనూ. విశాఖ పట్నం నుండి అక్కయ్య ( అన్నయ్యకి చెల్లెలు ), రాజమండ్రి నుండి మా తమ్ముడ దంపతులూ, ఒంగోలు నుండి మా ఆఖరి తమ్ముడూ. వాడి భార్యా వచ్చేము. మిగతా బంధు వర్గమంతా హైదరాబాద్ లోనే ఉండడంతో అంతా వచ్చేరు.
అన్నయ్య అందరికీ చక్కని విందు భోజనం ఏర్పాటు చేసాడు. కుమ్మేసాం అనుకోండి !
అన్నయ్య పెళ్ళికి నేను చిన్న వాడిని ఎనిమిదో తరగతి చదువు తున్నాను. కానీ ఆ పెళ్ళి వేడుక నాకు బాగానే గుర్తు. శ్రీకాకుళంలో ఏభై ఏళ్ళ కిందట జరిగింది.
మా వదిన నిజంగా బంగారమే అనడానికి సందేహం లేదు. అన్నయ్యా వదినెల పెళ్ళి జరిగిన కొత్తలో ఏదో పెళ్ళికి మేమంతా విశాఖ వెళ్ళాం. అక్కడ మా ఇల్లు అఫీషియల్ కాలనీలో ఉండేది. అక్కడికి సముద్రం చాలా దగ్గర. మా వదినె గారి చేతి వాచీని పెట్టుకోడానికి అడిగితే కాదనకుండా వెటనే ఇచ్చేరు. చిన్న వాడిని కదా. అది ఆడ వాళ్ళ చేతి వాచీ అని కూడా నాకు అక్కర లేక పోయింది. మరిది అడిగేడు కదా అని మురిపెంగా ఇచ్చేరావిడ.
ఆ వాచీ చేతికి పెట్టుకుని సముద్రపు ఒడ్డుకి వెళ్ళి కెరటాలతో ఆడుకుని ఒళ్ళంతా తడిపేసు కున్నాను. దానితో పాటూ వాచీని కూడా తడిపి ముద్ద చేసాను. మరా వాచీ పనికి రాకుండా పోయాంది !
భయ పడుతూనే వాచీని వదినెకి ఇచ్చేను. తిడతారేమో నని హడలి చచ్చేను.
మా బంగారు వదినె ఒక్క మాట అన లేదు నమ్మండి !
అందుకే అన్నయ్య మా ఆవిడ బంగారం అని టపా రాసేడు కదా !
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు!!!
ఈ వివాహ స్వర్ణోత్సవ కార్య క్రమానికి మా తమ్ముడూ, వాడి భార్యా శ్రీకాకుళం నుండి వచ్చేరు. వాళ్ళ తోడు తీసుకుని విశాఖ నుండి మా అక్కయ్య వచ్చింది. వచ్చిన వారి జాబితాలో వీడెందుకు మిస్ అయ్యాడంటే, వాడు నేరుగా కొండా పూర్ లో ఉన్న వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళి, అక్కడి నుండి హొటల్ కి వాళ్ళ అమ్మాయినీ. శ్రీమతినీ తీసుకుని వచ్చేడు. వ్యవధి లేక పోవడంతో ఆ రాత్రే తిరిగి వెళ్ళి పోయేడు.
ఇక, మా ఆఖరి తమ్ముడి కొడుకు ఇక్కడే ఉన్నాడు కనుక వాడూ వచ్చేడు. ఇక్కడే ఉన్న మా బావ కూడా భార్యతో వచ్చేడు.
అపురూపమైన మీ స్వర్ణోత్సవ వివాహ వేడుకలు గూర్చి విన్నాం, చూసాం ఆనందించెం
మాఅసీస్సులు జీవితములో నిజంగా ఇది ఒక అపురోపమ్
పంతులు బాబు ,మురళీ
కామెంట్‌ను పోస్ట్ చేయండి