అయ్యా ఈ హెడ్డింగు చూసి నేనేదో ఈ పేరుతో జరుగుతున్న
రాజకీయ బస్సు యాత్ర గురించి రాస్తున్నానని భ్రమ పడి ఇటు రావద్దు. నాకూ రాజకీయాలకీ
ఆమడ దూరం. అంటే ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న విషయాలగురించి
నాకు ఏ అభిప్రాయాలు లేవని కాని కలగవని కాని కాదు. వాటిని వేటినీ ఈ నా బ్లాగులో
నేను చర్చించను. వాటికిది వేదిక కాదు. కాకూడదు. అయితే ఆత్మ గౌరవ యాత్ర గురించి
ఎందుకెత్తుకున్నావయ్యా అంటే ఆ పేరుతో
బస్సు యాత్ర జరుగుతోందని విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఆత్మ గౌరవమంటే
ఏమిటి? అది ఎలా
వస్తుంది? అసలు
ఆత్మ గౌరవమంటూ ఉన్న వాడెవరైనా ఏ రాజకీయ పార్టీలోనైనా మనగలడా? రాజకీయాల్లో ఉన్న వారిని వారే పార్టీకి చెందిన
వారైనా సరే పొద్దున లేస్తే ఎవరో ఒకరు
తిట్టి పోయకుండా ఒక్కరోజైనా గడవదు కదా? మరి
అలాంటప్పుడు వాటినన్నిటినీ దిగ మ్రింగు కుంటూ
కాలం గడపాల్సిన రాజకీయవేత్తలకి ఆత్మగౌరమననేది ఎలా ఉంటుంది ? Politics is the last resort of a
scoundrel – ఇంకే గతీ లేని
దౌర్భాగ్యులకి రాజకీయాలే గతి – అన్న నానుడి ఉండనే ఉంది కదా? అందు
చేత ఈ ఆత్మ గౌరవానికీ రాజకీయాలకీ ముడి ఎలా పడుతుంది? కావున
నేను రాయబోయేది రాజకీయ ఆత్మ గౌరవ బస్సు యాత్ర గురించి కానే కాదని సవినయంగా మనవి
చేసుకుంటున్నాను.
ఆత్మ గౌరవంతో జీవన యాత్ర సాగించాలంటే, అది ఏ యాత్రల వల్లా రాదు. అది
ఒకరిస్తే వచ్చేది కాదు. అది మన జీవన విధానం వల్ల వస్తుంది. ఏ ప్రలోభాలకీ లోను
కాకుండా, ఒకరికి తలవంచ కుండా, తాను నమ్మిన విషయాన్ని నిర్భయంగా ఎప్పుడైనా ఎక్కడైనా
ఎన్ని సార్లు చెప్పాల్సి వచ్చినా
నిస్సంకోచంగా చెప్పగలవాడే ఆత్మ గౌరవం కలవాడు. అటువంటి ఆత్మ గౌరవంతో మన తెలుగు నాట
మసలిన ముగ్గురు కవి వర్యుల గురించి ఇంతకుముందు నా కవులూ- వారి ధిషణాహంకారమూ అనే
పోస్టులో వ్రాసి ఉన్నాను. అటు వంటివే ఇద్దరు సంగీతజ్ఞుల ముచ్చట్లు చెబుతాను
వినండి.
***
దాదాపు నూరేళ్ళ క్రిందట ఉత్తరాంధ్ర ప్రాంతంలో మధురాపంతుల పేరయ్య గారనే సంగీత విద్వాంసులుండే
వారు. వారు కాస్త భూ వసతి కలిగిన వారేమో భుక్తికి లోటు లేదు.ఆయన తంజావూరులో సంగీత సాధన చేసి వచ్చిన వారు. సంగీత
విద్యలో ఆరి తేరిన వారు కనుక శిష్యులకు సంగీత పాఠాలు చెబుతూ కాలక్షేపం చేసేవారు.
కొంచెం కోపిష్టి కూడా కావడంతో శిష్యులు ఏ తప్పు చేసినా సహించే వారు కాదట. ఆయన వద్ద
సంగీతం నేర్చుకోవడమే గొప్ప కనుక శిష్యులు వారి కోపాన్ని భరిస్తూ అణకువగా జాగ్రత్తగా
మసలుకునే వారట. ఈ సంగీత కళానిధి
విజయనగరాధీశుల మన్ననని కూడా పొందిన వారు. ఆయన ఒక రోజు ఒక ఊళ్ళో సంగీత కచేరీ
చేస్తున్నారట. అందరూ శ్రధ్ధగా వింటూంటే సభలో ఒక చోట ఒక ప్రభుత్వాధి కారి
ప్రక్కవారితో సంభాషణ పెట్టకోవడం ఆయన కళ్ళ పడ్డది. వెంటనే కచేరీ ఆపేసి కోపంగా
అటువైపు చూసేరట. సంగతి గ్రహించిన ఆ అధికారి ఏదో సర్ది చెప్పుకోడానికి
ప్రయత్నిస్తుంటే
“ ఇది
నా కచేరీ. నీ కచేరీలో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు లేచి వెళ్ళాకే తిరిగి నా కచేరీ
ప్రారంభమవుతుంది. అంతే ” అన్నారు. ఆ నాడు ఆ అధికారి నిష్క్రమించాకే
తిరిగి కచేరీ జరిగిందనుకోండి. అతి తక్కువ మంది ప్రభుత్వోద్యోగులుండే ఆ రోజుల్లో
వారి హుకుం నిరంకుశంగా సాగే రోజుల్లో ఇలా తమ గౌరవానికి భంగం కలుగకుండా చూసుకోగలగడం
గొప్ప విషయమే కదా? ( ఈ కథ విన్నప్పుడు మీకు శంకరాభరణం శంకర శాస్త్రి గుర్తుకు వచ్చి ఉండవచ్చు. ఆయనా ఇలాంటి వాడే కదా? )
****
ఈ రెండో ముచ్చట హరికథా పితామహ శ్రీ
మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపాలుగా ఉంటున్న
రోజులలో జరిగినదీ వారికే సంబంధించినదీను. దాసు గారు కొంచెం భోజన పుష్టి కలవారు
కనుక భోజనం చేయగానే భుక్తాయాసం వల్ల కొంచెం సేపు కునుకు తీయడం వారికి తప్పని
సరయ్యేది. అలా ఓ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎండ మండి పోతూ ఉండగా ( అందులో మా
విజయ నగరం ఎండల సంగతి చెప్పేదేముంది )
దాసు గారు వారి ఆఫీసు ( సంగీత కాలేజీ ప్రిన్సిపాలు గది ) లో చిన్న
అంగోస్త్రం మాత్రం ధరించిన వారై బెంచీ మీద కునుకు తీస్తూ ఉన్నారట. గాలి ఆడడానికి
తలుపులు తీసే ఉన్నాయి. అయ్యగారు నిద్రలో ఉన్నారు కనుక బంట్రోతుకు చుట్టకాల్చుకునే
ఆట విడుపు సమయమది. అతడందుకే దూరంగా పోయి ఎక్కడో తన్మయంగా చుట్ట కాల్చుకుంటున్నాడు.
ఆ సమయంలో ఒక విద్యాధికారి వచ్చి ప్రిన్సిపాలు గది తలుపులు తెరిచే ఉండడం చూసి
లోపలికి ప్రవేశించాడట. దాసుగారిని ఆఫీసులో ఆ భంగిమలో చూసేసరికి ఆ అధికారికి
అవమానంగా తోచి కోప కారణమయ్యిందట. ఆ అధికారి వెంటనే గద్దిస్తూ దాసుగారిని ఏదో
అన్నాడట. వెంటనే దాసుగారు “ ఏయ్ మిష్టర్ నువ్వెవరైనా సరే. ఇది నా ఆఫీసు.
ఇందులో నా యిష్టం వచ్చినట్లు ఉంటాను. నా అనుమతి లేకుండా లోపలికి రాకూడదని తెలియదా? నువ్వు ముందు బయటకు నడువు. నేను పిలిపించి
నప్పుడు లోపలికి వద్దువు గానివి. ”
అన్నారట. బయటకు నడుస్తున్న ఆ అధికారి ముఖంలో నెత్తురు చుక్కఉండి ఉండదు. ఉద్యోగాలు
ఊడిపోతాయేమో నన్నభయంతో పై అధికారుల అడుగులకు మడుగులొత్తేవరెవరైనా అలా మాట్లాడగలరా? అది ఆత్మ గౌరవానికి ప్రతిరూపమైన ఆ ఆదిభట్ల దాసు
గారికే సాధ్యం.
***
ఇవి విన్నాకైనా ఆత్మగౌరవమనేది ఎలా ఉంటుందో ఎలా వస్తుందో మనకి
అర్థమౌతుందా? దానికోసమేమైనా యాత్రలు చేయాలా?
***
8 కామెంట్‌లు:
Wow!
stalvarts isnt it:-)
ఆత్మలని ఎవరికో తాకట్టు పెట్టి, బతుకు ఈడ్చే బడుద్ధాయిలకు గౌరవమూ ఉండదు, ఆత్మ గౌరవమూ ఉండదు. మీరు చెప్పిన ముచ్చట్లు రెంటింటిలోనూ
ఆయా వ్యక్తులు సుప్రసిద్ధులూ. గొప్ప ఆత్మ ప్రత్యయం కలవారుప్నూ. ఇలాంటి కథలు విన్నప్పుడు మన ఆత్మలు ఎంత పరాధీన మైపోయాయో కదా అని బాధ కలుగుతుంది.
ఆత్మ గౌరవానికి నిర్వచనాలు మారినట్టున్నాయండి :)
నేను మా కష్టేఫలి మాస్టర్ గారితో ఏకీబవిస్తాను
నమస్కారములు
అసలైన ఆత్మ గౌరవం ఎక్కణ్ణుంచో ఎవరో ఇస్తే వచ్చేది కాదు
ఎవరికి వారు తమంత తాముగా దేనినీ లెఖ జేయక మానసికంగా లభించేది కదా ! మంచి విషయాన్ని జెపారు ధన్య వాదములు
నేటి నాయకులు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ శాసనసభలో నీచమైన రీతిలో వాదులాడుకొవడం చూస్తే వీరికీ ఆత్మగౌరవానికీ ఆమడదూరమేమో అనిపిస్తుంది.
ఆలస్యానికి మన్నించండి. శ్రీ యుతులు కృష్ణ పాలకొల్లు, కష్టేఫలే శర్మ, పంజో గార్లకు, శ్రీమతులు రాజేశ్వరి,మీరజ్ ఫాతిమా గార్లకు వారి స్పందనలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
శ్రీ నవజీవన్ గారికి -థాంక్యూ సర్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి