5, ఏప్రిల్ 2014, శనివారం

మా తెలుగు తల్లికీ మల్లె పూదండా...(దండ లోని దారం కథ..)




మనం తెలుగు నేల మీద ఉన్నా దేశాంతరాలలో ఉన్నా , ఏ తెలుగు సాంస్కృతిక కార్యక్రమమైనా మా తెలుగు తల్లికీ మల్లె పూదండా ..మా కన్న తల్లికీ మంగళారతులూ..  అంటూ తెలుగు తల్లికి జేజేలు పలుకుతూ ప్రారంభిస్తాము. తెలుగు తల్లి విగ్రహానికి వేసిన మల్లెల మాల ధవళకాంతులీనుతూ కనిపిస్తూనే ఉంటుంది. ఆ మల్లెల సౌరభాలు దశదిశలా వ్యాపిస్తూనే ఉంటాయి. కానీ తెలుగు తల్లి మెడని మల్లెలు అలంకరించి మనల్ని అలరించడానికి కారణమైన ఆ సూత్రం—అదే- ఆ దారం మాత్రం కన్పించదు. దాని గురించి ఎవరమూ ఏ వేళా ఆలోచించం కూడా. పాట విని రసడోలలో తేలిపోతూ ఎదురుగా నిల్చొని పాడుతున్న గాయకుణ్ణి మెచ్చుకుంటూ మురిసి పోతాం. కాని దండలో దారం లాగా కనిపించని ఆ కవిని మాత్రం పట్టించుకోం. ఎప్పుడో అర్థశతాబ్దికి పూర్వమే, మనకి స్వాతంత్ర్యం రాకపూర్వమే మన తెలుగు తల్లి మెడలో వాడని ఆ మల్లె పూదండ వేసిన కవిగారి గురించి కొంచెం తెలుసుకుందాం.
ఈ గీతాన్ని వ్రాసిన కవి శ్రీ శంకరంబాడి సుందరాచార్య గారు. వీరిని నేను 1960-70లలో ఒకసారి చూసేను. వీరి అన్న(లేక తమ్ముడు) గారైన కృష్ణమాచారిగారు అప్పట్లో నేను పనిచేసే ఆడిట్ ఆఫీసు (A.G’s Office, Hyderabad) లో అకవుంట్స్ ఆఫీసరుగా పనిచేస్తూ ఉండేవారు. ఒక సాయంత్రం ఆఫీసు పని ముగిసేక మా రంజని గ్రంథాలయంలో శ్రీ సుందరాచారి గారితో ఇష్టాగోష్టి ఏర్పాటు చేసేరు. రంజని గ్రంథాలయానికి కేటాయించబడ్డ ఆ మారుమూల పాతకాలపు హాలులో పట్టుమని పాతికమందిమి కూడా లేమనే నాకు గుర్తు. ఏమయితేనేం అలా ఆ కవిగారిని చూడడం వారితో ముచ్చటించగలగడం నాకింకా లీలగా గుర్తుంది. వారు పొడగరి కాదు. అర్భకంగా అయిదూ అయిదున్నర అంగుళాల ఆసామీ. మిగిలిన వివరాలేమీ నాకిప్పుడు గుర్తు రావడం లేదు. వారి అన్నతమ్ముడైన మా కొలీగ్ శ్రీ కృష్ణమాచారిగారు మాత్రం మన లోక్ సభ స్పీకర్ గా పని చేసిన శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగారి అల్లుడని మాత్రం తెలుసు. 1974లో నేనూ శ్రీ కృష్ణమాచారిగారూ  ఒక ఆడిట్ నిమిత్తం ఒంగోలు వెళ్ళి అక్కడ రహదారి బంగళాలో కలసి ఉండడం ఆయనతో చేసిన సాహితీ గోష్టి కొంచెం కొంచెంగా గుర్తుకొస్తున్నాయి. (ఈ విషయం ఎందుకు చెప్పానంటే సుందరంబాడి వారింట్లోనే సాహితీ వాసనలు గుబాళిస్తూ ఉండి ఉంటాయేమోననే ఊహ రావడం వల్లనే )
సుందరాచారి గారి గురించి తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆయన స్వేఛ్చాలోలుడు. ఎవరినీ లెక్క జేసే మనిషి కాడట. అందువల్లనే ఏదో విషయంలో తన పై అధికారులతో విభేదించి తాను పని చేస్తున్న డిప్యూటీ ఇనస్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి తన రచనలమీదే ఆధారపడి జీవించాడట. మతి స్థిమితం లేని ఆయన భార్య కంచిలో ఎవరో బంధువుల ఆశ్రయంలో ఉండేదట. పుస్తకాలు రాసి వాటిని అచ్చేసుకుని ఊరూరా తిరిగి అమ్ముకుంటూ కాలం గడిపే వాడట. ఎన్ని కష్టాలు పడ్డాడో బ్రతుకెలా ఈడ్చుకొచ్చాడో?  ఏ దుర్భర జీవితం ఆయనను పురిగొల్పిందో కాని తాగుడు వ్యసనానికి  పూర్తిగా బానిసైపోయి పూర్తిగా స్పృహ లేని స్థితిలో తిరుపతి వీధుల్లో తనువు చాలించారట. గుణ లేశం ఎక్కడ కనిపించినా మెచ్చుకుంటూ, వెలిగే దివ్వెలకు నూనె పోస్తూ, గట్ల మథ్య
ఇమడలేని వరద వెల్లువలా జీవించిన ఆయన జీవితమనే గంభీర విషాదాంత నాటకానికి ఆవిధంగా తిరుపతి వీధుల్లో తెరపడిందంటారు ఆయన గురించి బాగా తెలిసిన  ప్రఖ్యాత కథకులు కీర్తి శేషులు శ్రీ మధురాంతకం రాజారాం గారు. శ్రీ సుందరాచారి గారికీ,  తన ఈ పై పాటకీ సంబంధించిన ఆసక్తిదాయకమైన ఓ ముచ్చట- శ్రీ రాజారాం గారు చెప్పినదే -అందరూ తెలుసుకోవలసినది ఒక్కటీ చెప్పి ముగిస్తాను.
1976లో ఆంధ్ర పదేశ్ ప్రభుత్వం  తొలి తెలుగు ప్రపంచ మహా సభలు హైదరాబాదులో ఘనంగా  నిర్వహించారు. ఆ సందర్భంగా మా తెలుగు తల్లికీ మల్లె పూదండా.. గీతాన్ని తెలుగు వారి జాతీయగీతంగా నిర్ణయించడంతో పాటు ఆ పాటని మొదటిసారి గ్రామఫోను రికార్డులో పాడిన విదుషీమణి శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారిని ప్రత్యేకంగా లండనునుంచి రప్పించి సభల ప్రారంభగీతంగా పాడించారట. అందుకోసం లండను నుంచి విమానంలో వచ్చిన సూర్యకుమారిగారు నేరుగా  ఫైవ్ స్టార్ హోటల్లో దిగి బస చేసి సభాప్రాంగణానికి కారులో వచ్చి పాట పాడేసి తిరిగి కారులో తెలుగు నేల మట్టైనా కాళ్ళకు అంటుకోకుండా వెళ్లిపోయారట. ఆ సభకు వచ్చిన సాహితీ పరులు కొందరు  మన ఈ రాష్ట్రీయగీతాన్ని రచించిన కవి గారి గురించి ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం గురించి చాలా విచారించారట. అలా విచారిస్తున్న రాజారాం గారికి ఆ రాత్రి పది గంటల సమయంలో  స్టేడియం సోపాన పంక్తుల మీంచి నడుచుకుంటూ ఒక్కడూ వెళ్ళి పోతున్న సుందరాచారిగారు కనిపించారట. రాజారాం గారు పలకరించగానే ఆయనతో   నన్నింత నిర్లక్ష్యం చేస్తారట్రా వీళ్లు? ఊరుకుంటానట్రా? మండలి వేంకట కృష్ణారావుకు కబురు పంపించాను.  రేపు ఉదయం ఆరుగంటలకు కలవమన్నారు అంటూ వెళ్లి జనంలో కలసి పోయారట. మరునాడు ఆయన మండలి కృష్ణా రావు గారిని కలవగానే ఆయన   కవి గారి చిరునామా తెలియకపోవడంతో అలా జరిగిందనీ దానికి చాలా చింతిస్తున్నామనీ చెప్పి మరునాడు మహా సభల్లో  ఆయనను తగురీతిని సత్కరించడంతో పాటు కవిగారికి జీవితాంతం వర్తించేలా జీవనభృతిని కూడా ఏర్పాటు చేసారట. నాటి విద్యాశాఖా మంత్రి   ప్రపంచ తెలుగు మహా సభల నిర్వాహకులు అయిన మండలి వారి సంస్కారం గొప్పది. అయితే ఆయన పెద్ద మనసుతో కవిగారికేర్పాటు చేసిన ఆ జీవన భృతి (ఆ రోజుల్లో నెలకు 250 రూపాయలు) కవి గారికి మంచి కంటే చెడే ఎక్కువ చేసిందనీ అంతకు ముందు చేతిలో పైకం లేక తక్కువగా తాగే కవిగారు చేతిలో సొమ్ము గలగల లాడటంతో విపరీతంగా తాగి  ఆరోగ్యం పాడుచేసుకున్నారంటారు శ్రీ మధురాంతకం రాజారాం గారు. కవిగారు ఎలా కాలం చేసినా కలకాలం మిగిలే పాట ఒకటి మనకి మిగిల్చి పోయారు.
వేద్దాము వేద్దాము మన తెలుగు తల్లికీ మల్లె పూదండలూ...
చేద్దాము చేద్దాము మన కవిగారికీ కోటి దండాలూ...
( కవిగారితో తనకు గల పరిచయాన్ని రికార్డు చేసిన శ్రీ రాజారాం గారికి  కృతజ్ఞతలతో- సెలవు.)  
         

6 కామెంట్‌లు:

కథా మంజరి చెప్పారు...

అంతా చదివేక చాలా బాధ అనిపించింది. కవులు చాలా వరకూ శాపగ్రస్తులే కాబోలు. వారి విషాద జీవన సరళికి స్వయం కృతమే కారణమనుకో లేం. ఒక అలుపెరుగని పోరాటంలో తమని తాము దహించి వేసుకుంటూ ఉంటారు. కవులకే కాదు, ఇతర కళాకారులకూ ఇలా బతకమని సరస్వతీ దేవి శాపం ఉందని వొక కథ ఉంది.

మీ టపాలో సూర్య కుమారి గారి గురించి సంధించిన వ్యంగ్యాస్త్రాలు మాత్రం నాకు నచ్చ లేదు. ఆవిడ మీద అంత రుసరుసలు అక్కర లేదేమో ...

www.apuroopam.blogspot.com చెప్పారు...

కథా మంజరి గారి స్పందనకు ధన్యవాదాలు. ఇక- సూర్యకుమారి గారి గురించి నేనేమీ వ్యంగ్యాస్త్రాలు సంధించలేదు. అక్షరం పొల్లుపోకుండా ఆ మాటలన్నీ ఆవైనాన్ని మనకి తెలిపిన శ్రీ మధురాంతకం రాజారాం గారివే. నేనెందుకు మార్చాలని వారు చెప్పినదే మీకందించాను.

Unknown చెప్పారు...

మా తెలుగు తల్లికి మల్లె పూదండ గీత రచయిత శ్రీ శంకరంబాడి సుందరాచారి గారి గురించి మీరు వ్రాసిన వ్యాసములో, రచయిత పట్ల మన తెలుగు వారు చూపిన నిర్లక్ష్యం బాధ కలిగించింది. శొచనీయమైన విషయం ఏమంటే, నేటికీ ఆయన పేరు చాల మంది తెలుగు వారికి తెలియకపోవటం. వారు చివరలో ఏవిధమైన దుర్భర జీవితం గడిపారో మీ ద్వారా భొధపడింది. ధన్యవాదాలు.

G S Venugopal చెప్పారు...

meeru andinchina vivaralu ento mukhyaminavi mariu aasakti dayakamulu. Kavulu manusuto sambhashistu untaru mari yu anta PERFECT gaa undalani korutaru. Aa vyvidhyame varini unnatunni chestundi kaduu. Sankarambadi vari ki nivalulu arpistuu, meeku mari yu madhurantam variki krutajnatalu

venugopal

www.apuroopam.blogspot.com చెప్పారు...

వేణు గోేపాల్ గారికి కృతజ్ఞతలు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

వేణు గోేపాల్ గారికి కృతజ్ఞతలు.