5, సెప్టెంబర్ 2011, సోమవారం

కౌకిలి..కైకిలి..కంగాళీ...


ఈమాటలు మీరెప్పుడైనా విన్నారా? నా చిన్నప్పుడు మా వూళ్ళో  ( పార్వతీవురం-ప్రస్తుతం విజయనగరంజిల్లా) లో ఉన్నప్పుడు  కౌకిలి..కంగాళీ.. అన్న పదాలను విన్నాను.శిష్టేతరుల వ్యవహారాల్లో వాళ్ళకేదైనా కష్టాలొచ్చినప్పుడు   మా చెడ్డ కౌకిలి పడిపోనాం బాబూ  అనడం విన్నాను.  ఆ మాట ఏదో కష్టాన్ని సూచిస్తోందని తెలిసేది. అంతే.  అయితే కొన్నాళ్ల క్రితం  తెలంగాణా మాండలికం లో వచ్చిన కథలు చదువుతున్నప్పుడు  అదే అర్ధంలో కైకిలి అనే పదం వాడడం గమనించేను.అప్పుడు దీని అసలు రూపం నాకు స్ఫురించింది. అది కైకూలి అయి ఉంటుంది. కై+కూలి= కైకూలి.అంటే చేతితో చేసే పని..శారీరక శ్రమ అన్నమాట. శ్రమ జీవుల వ్యవహారాల్లోనే ఈపదం కనిపించడం కాయకష్టం తెలియని అగ్ర వర్ణాల వ్యవహారాల్లో ఈ ప్రయోగం లేక పోవడంలో ఆశ్చర్యం ఏముంది? 
                                                        కంగాళీ..అన్న పదం ఎవరైనా అల్లరి చేస్తున్నప్పుడు వాడేవారు.   వాడొచ్చి చాలా కంగాళీ చేసేడ నేవారు .ఈ పదం శిష్టుల వ్యవహారాల్లో కూడా ఉన్నా నిఘంటువులలో కనపడదు. దీనర్థం నాకు ఏనుగుల వీరాస్వామిగారి కాశీయాత్ర చదివినప్పుడు గోచరించింది. ఆయన కాశీలో ఉన్నప్పుడు (సుమారు 150 ఏళ్ల క్రితం) అక్కడ కంగాళీలనే జాతి వారుండే వారనీ వారు కాశీ యాత్రకి వచ్చిన యాత్రికులని జలగల్లా పట్టుకు పీడిస్తూ  డబ్బులడుక్కునే వారనీ రాసేరు.ఆంధ్రదేశంనుంచి కాశీయాత్రకి చాలామంది పోయి వచ్చేవారు కనుక  వారందరూ తమనెవరైనా అల్లరి చేస్తే కంగాళీ మనుషులు అంటూఉండే వారనుకుంటాను.
                                                   ఇవి నాకుతోచిన విషయాలు.ఇంతకంటే అర్థవంతంగా ఉండే వివరణ ఎవరికైనా తడితే తెలియజేస్తే సంతోషిస్తాను.

     ముందు ముందు పోస్టుల్లో మరికొన్ని పదాలు వాకు తోచిన వివరణలూ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.    సెలవు.

9 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

‘కై + కూలి’ కైకిలిగా మారిందనడం 100% కరెక్ట్!
ఇక కంగాళీ గురించిన మీ విశ్లేషణ బాగుంది.

కథా మంజరి చెప్పారు...

కౌకిలి గురించీ, కైకిలి గురించీ మీరు రాసినది ఆమోదయోగ్యంగానే ఉంది. కంగాళీ పదం గురించి కాశీయాత్రలో నేనూ చదివాను.

www.apuroopam.blogspot.com చెప్పారు...

స్పందించిన కొత్త పాళీ గారికీ, శంకరయ్యగారికీ, జౌగారావు గారికీ నా కృతజ్ఞతలు.మున్మందుకూడా మీ మీ అభిప్రాయాలు అవి ఎలాంటివైనా నాకు శిరోధార్యాలు. వాటికోసం ఎదురుచూస్తాను.

Vadapalli SeshaTalpaSayee చెప్పారు...

కంగాళీ - శబ్దరత్నాకరము, బ్రౌన్ నిఘంటువులలో ఉంది.
కైకిలి, కైకూలి - తెలుగువ్యుత్పత్తికోశం,(రవ్వా)శ్రీహరి నిఘంటువులలో ఉంది.

http://www.andhrabharati.com/dictionary/index.php

www.apuroopam.blogspot.com చెప్పారు...

శ్రీ శేషతల్పశాయి గారికి స్పందించినందుకు కృతజ్ఞతలు.కంగాళీ పదం సూర్య రాయ ఆంధ్ర నిఘంటువులో లేదు. శబ్ద రత్నాకరంలో మీరు చేప్పాక చూసేను. అది హిందీ నుంచి వచ్చిందనీ అల్పమైన నీచమైన అనే అర్థాలు కలిగి ఉందనీ వ్రాసి ఉంది.నిజమే కావచ్చును. కానీ కళింగాంధ్రలో దానిని అల్లరి పెట్టడం ఇనే అర్థంలో వాడుతుంటారు.ఏదైనా నేనో చిన్న ఈహ చేశామంతే. ఇక కౌకిలి పదం తెలుగు వ్యుత్పత్తి కోశం రవ్వా శ్రీ హరి గారి నిఘంటువులలో ఉందని తెలిపారు .వాటిని నేను చూడలేదు. నేను తెలంగాణా లో వాడుక ఉన్న పదం చూశేక నాకు తట్టిన ఆలోచనని నలుగురితో పంచుకోవాలనుకున్నాను. అది కరక్టయితే సంతోషమే. తెలుగు పదాల వ్యుత్పత్తి గురించి కొత్త సంగతులేమైనా మీకు తెలిసినవి వ్రాయండి.కొంతమందికి తెలిసినవే అయినా అందరికీతెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది కదా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
" కౌకిలి .....కైకిలి .....కంగాళీ.....",,, ...అనే ఈ పదాలు కొత్తగా ఉన్నాయి . నేనెప్పుడూ వినలేదు. కాక పొతే " కంగాళీ " అన్న పదం వింటుంటాం . విశాఖ , విజయ నగరం , లలో చాలా చిన్నప్పుడు ఉన్నాము. మా నాన్నగారు అక్కడ పనిచేసారు. గానీ అంత తెలియదు. చాలా బాగుంది.

అజ్ఞాత చెప్పారు...

కైకిలి అనె పదం నేను చాలా సార్లు విన్నాను.
పాలమూరు జిల్లాలొ కూలీ పని చేసే వాల్లు చాలా విరివిగా వాడె పదం.
కూలి పని చేసె వాల్లు, కైకిలి కి పోయిండు, కైకిలి ఎంత అని, కైకిలి ఇప్పించండి అని మాట్లాడుతు వుంటారు.
కంగాళీ అనె పదం పుస్తకాలలొ చదివాను.
కౌకిలి ఎప్పుడు వినలెదు.

సురభి

www.apuroopam.blogspot.com చెప్పారు...

ఇప్పటికైనా మీరు ఈ పోస్టు చూడగలిగి స్పందించినందుకు కృతజ్ఞతలు.మీరు చెప్పినట్టు కైకిలి పదం తెలంగాణాలో వాడుకలో ఉంది.ఇది చూసేకే నాకు మా ఉత్తరాంధ్రలో వాడుకలో ఉన్న కౌకిలి అన్న పదం ఇలాగే వచ్చిందనీ అనిపించి ఈ పోస్టు వ్రాయడం జరిగింది.మీ కేమైనా వింతగా తోచే పదాలు తెలిస్తే వ్రాయండి.వాటిమూలాలు వెతుక్కోవడం ఒక సాహిత్య క్రీడ అవుతుంది.

ఆ.సౌమ్య చెప్పారు...

కంగాళీ అన్న పదం మన విజయనగరంలో చాలా సాధారణం. కంగాళీ చేసేసాడు, కంగాళీ అయ్యింది, కంగాళీ మనిషి అని మనం నిత్యమూ వాడుతుంటాం.

కైకిలి, కౌకిలి గురించి ఇదే మొదటిసారి వినడం. కైకిలి గురించి మీ ఊహ బావున్నాది.

అచ్చ తెలుగు పదాలను వెలికి తీద్దామనే ప్రయత్నమొకటి చేసాను. వీలైతే చూడండి.
http://vivaha-bhojanambu.blogspot.in/2010/05/blog-post_05.html