7, సెప్టెంబర్ 2011, బుధవారం

వెంకట సుబ్బారావు మేడీజీ....ఇదెక్కడో విన్నట్టుంది కదా? సాహితీ ప్రియులందరికీ ఇది కన్యాశుల్కం ప్రథమాంకంలో కాపర్సుకి కరువొచ్చినప్పుడు గిరీశం శిష్యుడు వెంకటేశానికి రాసుకోమని చెప్పిన పుస్తకాల లిస్టులోనిదని తెలుసు. సబ్జెక్టు పుస్తకాలు ఎనిమిది చెప్పి తొమ్మిదో పుస్తకంగా దీన్ని రాసుకోమంటాడు. దాని తర్వాత పదీ పూర్తి చెయ్యడానికన్నట్టు కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్టు అనీ రాసుకోమంటాడు. ఆఖరు దాని సంగతి నాకు తెలీదు గాని ఈ వెంకట సుబ్బారావు మేడీజీ మాత్రం గురజాడ వారి సృష్టి కాదు. ఈ రోజుల్లో లాగానే ఆ రోజుల్లో కూడా (అంటే నూరేళ్ళక్రిందటే )  ప్రతి సబ్జెక్టుకీ గైడ్లు ఉండేవన్నమాట.(మన తాతలందరూ మేము టెక్స్టు పుస్తకాలే చదివి పాసయే వాళ్ళమంటే మనం నమ్మనక్కరలేదు). ఆరోజుల్లో ఇలాంటి గైడ్లు ప్రచురించిన చారిత్రిక పురుషుడు  వెంకట సుబ్బారావు. వారి ఇంటి పేరు రెంటాల. వీరిని గురించి కూపీ లాగితే నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నాను.

రెంటాల వెంకట సుబ్బారావు కన్యాశుల్కం రచనా కాలానికి జీవించి ఉన్న వ్యక్తి. (అంటే 18901910 ) ప్రాంతంలోనన్నమాట.  ఆదిభట్ల నారాయణదాసుగారి మాటల్లో ఈయన ఆరోజుల్లో చెన్నపట్నం మైలాపూరు చెరువు ఉత్తర గట్టున నివశిస్తూ ఉండేవాడు. ఆరోజుల్లోనే ఈరకమైన మేడీజీ పుస్తకాలు (గైడ్లు) ప్రచురించి రెండు లక్షలార్జించేడట.బియేబియల్ చదువుకున్న విద్యాధికుడు. తెలివితేటలుకలవాడు మిక్కిలి రసికుడున్నూ.కడు ఉదారవంతుడు. తెలుగున గద్యపద్యములు మిక్కిలి చురుకుగనల్లగలడు. దొరలు మెచ్చునట్లింగ్లీషు వ్రాసి మాట్లాడగలడు.”   ఈ వెంకట సుబ్బారావుగారు నారాయణదాసు గారికి కొన్నాళ్లు ఆతిథ్యమిచ్చి ఆయన చేత సంగీత సభలు చేయించినట్టు,హరికథలు చెప్పించినట్లు వ్రాసుకున్నారు. దాసుగారి సభలమీద హిందూ పత్రికలో వ్యాసాలు కూడా వ్రాసేరట.

ఈ రెంటాల వెంకట సుబ్బారావు గారి గురించి మరికొంత సమాచారం నాకు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ప్రజ్ఞాప్రభాకరములో దొరికింది. శాస్త్రిగారు మద్రాసు లోఉన్నప్పుడు కొంత కాలం మైలాపూర్ లోఉంటూ అక్కడల కపాలీశ్వర స్వామి గుడి దగ్గర ఒక పూటకూటింట్లో భోజనం చేసేవారట. అది నిర్వహించే స్త్రీ మూర్తి రెంటాల వారికి దూరపు బంధువనీ కొన్నాళ్లు ఆమెకు ఏ ఆసరా లేకపోతే ఆదుకున్నారనీ ఆవిడ స్వతంత్రంగా జీవించాలనే తలంపుతో పూటకూళ్ళిల్లు నిర్వహించడం మొదలు పెట్టిందనీ వ్రాసేరు. శాస్త్రిగారు సేకరించి సంకలించిన చాటు పద్యమణిమంజరి ప్రచురించడంలో రెంటాల వారు చాలా సహాయము చేసేరట. వేయి రిప్లై కార్డులమీద (కార్డు వెల కాని) నోటీసు పుస్తక మపేక్షించు వారు వ్రాయుటకు పై అడ్రసుతో అప్లికేషను ఫారము అచ్చు వేయించి అడ్రసులతో పోస్టు చేయించిరి. వెంటనే వేయి పుస్తకములు నమ్ముడుపోయెను.”  అని వ్రాసుకున్నారు.
                                                                    ఈ రెంటాల వెంకట సుబ్బారావు గారిని గురించి మనకి మరికొన్ని విషయాలు శ్రీ వల్లూరి సూర్యనారాయణరావుగారి స్వీయచరిత్రలో దొరుకుతాయి. దీని ద్వారా మనకు శ్రీ రెంటాల వెంకట సుబ్బారావు గారు ఆరోజుల్లోనే ప్రపంచంలో అతి పెద్దదైన ఫోటో స్టుడియోలలో రెండవ స్థానం పొందిన ఫుటో స్టుడియో నిర్వహించే వారని తెలుస్తోంది. ఇదికాక రెంటాలవారు షేక్స్పియర్ నాటకాలను గూర్చి ఇంగ్లీషులో ప్రకటించిన గొప్ప వ్యాఖ్యలు,విమర్శలు, అమెరికన్ విద్వాంసుల ప్రశంసనూ అబ్బురాన్నీ పొందేయట. 
శ్రీ వల్లూరి వారి స్వీయచరిత్రలో ఒక అధ్యాయం అంతా రెంటాల వారిని గురించే ఉందట.  శ్రీ సుబ్బా రావుగారి ఫొటో కూడా చూడవచ్చునట. ఈవిషయాలు శ్రీ అక్కిరాజు రమాపతి రావుగారు  తెలుగులో స్వీయచరిత్రలు జీవిత చరిత్రలు  అన్న వ్యాసంలో వ్రాసేరు. శ్రీ వల్లూరి వారి జీవిత చరిత్ర నాకు దొరకలేదు. దొరికితే ఒక అద్భుత వ్యక్తి గురించి ఇంకా చాలా విషయాలు తెలిసేవి. మిత్రులెవరైనా ఈకృషి చేయగలరని ఆశిస్తున్నాను.

సెలవు.

                                                         

2 వ్యాఖ్యలు:

Sudha చెప్పారు...

అపురూపమైన విషయాన్ని అపురూపంగా చెప్పారు.వెంకటసుబ్బారావు మేడీజీ మాట వెనుక ఉన్న కథని.ధన్యవాదాలు.

కొత్త పాళీ చెప్పారు...

Very interesting.
I thought gireesam just made up that list.