నేను 1997 లో రిటైర్ అవకముందు హైదరాబాదు ఏజీ ఆఫీసులో 34 సంవత్సరాలు పని చేసాను. అప్పట్లో...(.ఇప్పటికీ కూడా) ... మా ఆఫీసు లో సాహితీ పరిమళం గుబాళిస్తూ ఉండేది/ ఉంటోంది. ఎందరో కవులూ సాహిత్యాభిలాషులూ మరీ ముఖ్యంగా కథా నాటక రచయితలు ఎక్కువగా ఉండేవారు. బి.కె.ఎల్.ఎన్ ఆచార్య, ఇసుకపల్లి దక్షిణా మూర్తి, పరుచూరి వెంకటేశ్వర రావు, ఢి.ప్రభాకర్, పమ్మి వీరభద్రరావు గుమ్మా ప్రసన్నకుమార్ కె.కె.మీనన్ శంకరమంచి పార్థసారధి ..ఇలా ఎందరో.. నేను రచయితను కాకపోయినా వాళ్ళలో కొంతమందితో స్నేహమూ,మిగిలినవారితో ముఖపరిచయమూ ఉండేది. రంజని అనే పత్రిక నేను ఆఫీసులో చేరిన రోజుల్నుంచీ సాహితీ సేవ చేస్తూ ఈనాటికీ నడుస్తోంది.మహాకవుల్నీ గొప్ప రచయితల్నీ ( దివాకర్ల వెంకటావధాని , విశ్వనాథ సత్య.నారాయణ ఉత్పల మొదలైన కవులూ.. రావి శాస్త్రి కాళీపట్నం మొదలైన రచయితల్నీ) పిలిపించి సభలు చేయడం మంచి పుస్తకాలు ప్రచురించడం వచన కవితా పోటీలు నిర్వహించడం వంటి ఉత్కృష్ట సాహితీ సేవ నేటికీ కొన సాగుతోంది.(తొలినాళ్లలో రంజనిలో నేనూ చిన్న చిన్న గేయాలు వ్రాసిన వాడినే)
ఈ విధంగా సాహితీ సౌరభాలు విరజిమ్మే చోటికి మిత్రులను కలుసుకుందికి అనేకమంది రచయితలు వస్తూండేవారు. వారిలో నేటి నవ్య వార పత్రిక సంపాదకుడు జగన్నాథ శర్మ ఒకరు. శర్మది మా ఊరే కావడం.. మా వీధిలోనే పుట్టి పెరిగిన వాడవటం మాతమ్ములందరితోనూ స్నేహంగా ఉండడంతో నాకంటే బాగా చిన్నవాడయినా నాకు బాగా తెలుసు. ఒకసారి అతను సాహితీ మిత్రులను కలుసుకోవడానికి మా ఆపీసుకి వచ్చినప్పుడు అందరం కలసి గేటు దగ్గర ఖాన్ సాబ్ టీ కొట్లో టీ తాగుతున్నాము. ఇంతలో ఒకాయన పలానా రచయిత్రి తన కథలో “కక్కూస్” అనే పదం వాడిందనీ దాని అర్థమేమిటో తెలియదనీ అలాటి పదాలు ఎందుకు రాస్తారో అర్థం కాదనీ అన్నాడు. అక్కడున్న మిగిలిన వారికి కూడా ఆ పదం అర్థం తెలిసినట్టులేదు. తెలియక పోవడంలో విశేషం లేదు. ఎందుచేతంటే వారందరూ చిన్నవారు. బహుశా వారు పుట్టినప్పటికే ఆపదం వాడుకలో కనుమరుగయిందనుకుంటాను.
నాకు ఆపదం అర్థం తెలుసు కనుక వారికి చెప్పాను. కక్కూస్ అంటే లెట్రిన్ అని. ఆ పదం తమాషా ఏమిటంటే అది పోర్చుగీసు పదం. వాళ్లు మనదేశానికి వర్తకానికి వచ్చి స్థావరాలు ఏర్పరచు కున్నప్పుడు. మన భాషలో చేరింది. అసలు ఆపదం Kak+ House= kakhouse “ కేక్ హవుస్” జనం పలుకుబడిలో కక్కూస్ గా మారింది. నేను బాగా చిన్నవాడిగా ఉన్నప్పుడు కొన్ని రైల్వే స్టేషన్లలో లెట్రిన్ల నీద కక్కూస్ అని వ్రాసి ఉండడం చూసి ఉన్నాను.ఇప్పుడయితే ఈ పదం ఎక్కడా వినపడడం లేదుగాని ఇప్పటికీ మా ఇళ్లల్లో చిన్న పిల్లలు మల విసర్జన చేస్తే కేక్ వెళ్లాడంటూ ఉంటారు.. శుచి శుభ్రతల్ని పాటించే సంస్కారవంతుల ఇళ్లల్లో కొన్ని పదాల్ని పలకడం తప్పుగా భావిస్తారు. అసహ్యమని భావించే పదాలకి బదులుగా వేరే పదాల్ని వాడడం సర్వత్రా ఉన్నదే. అందుకనే ఒకటికనీ,రెంటికనీ బహిర్భూమికనీ దొడ్డిలోనికనీ వ్యవహరిస్తూ ఉంటారు. (కన్యాశుల్కంలో కోమటాయన గుడ్డి మీద బాహ్యానికి వెళ్లాననడం గుర్తుందా?) . మా ఇంట్లో మా చిన్నప్పుడు మేము పెట్టుకున్న ముద్దు పేరు
“ లండన్” అని.... బాగుంది కదూ? ( మేము తెలియకుండా పెట్టుకున్న పేరయినా దానికో సార్థకత ఉన్నట్టుంది. సుమారు రెండు వందల ఏళ్లక్రితం లండన్ లో ఎవరింట్లోనూ లెట్రిన్లు ఉండేవి కావట. అప్పుడప్పుడూ మనుషులు తోపుడు బళ్లతో వచ్చి మల మూత్రాల్ని తీసుకు పోయేవారట. అంటే ఆరోజుల్లో లండన్ నగరమే ఓ పెద్ద కక్కూస్ లా ఉండి ఉంటుదనడం -- తప్పేమి ఒప్పేయగున్
ఈ రోజుల్లో టాయ్ లెట్లమీద ఏమీ వ్రాసి ఉండదు. హి..ఆర్ షి..అతడు లేక ఆమె అని మాత్రం వ్రాసి ఉంటుంది. అర్థంచేసుకోగలరు. అసలు మన రైల్వే బస్టాండులలో టాయ్ లెట్ల గురించి ఎక్కడా వ్రాసి ఉండక్కరలేదు. చాలాదూరం వ్యాపించే వాటి దుర్గంధమే వాటి ఉనికిని చాటుతూ ఉంటుంది.
( ఇక్కడో రహస్యం చెప్పాలి. నేను 1957—60 ప్రాంతాలలో భారతిలో ప్రచురించ బడిన శ్రీ తూమాటి దొణప్ప గారి వ్యాసం “తెలుగులో బుడతకీచు నుడులు” అనే దాన్ని చదివి ఉన్నాను. కక్కూస్ గురించి ఆయన వ్రాసిందే . బుడతకీచు అనేది తెలుగు వారు పోర్చ్ గీ సు వారికి పెట్టుకున్న పేరు.ఇందులో నా ప్రజ్ఞ ఏమీ లేదు).........
ఇదీ కక్కూస్ ల కథ...
. మళ్లీ కలుద్దాం....సెలవు....
4 కామెంట్లు:
15,16 ఏళ్ళక్రితం వరకు నాకూ ఈ పదం తెలియదు. ఈ పదాన్ని మొదటిసారి 1995లో అయ్యప్పదీక్షలో శబరిమలై వెళ్ళినప్పుడు పంబా నది ఒడ్డున తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల వద్ద తెలుగులో (కక్కూస్), హిందీలో (कक्कूस) అని వ్రాసి ఉండడం గమనించాను. అది హిందీ పదం కావచ్చనీ, కేరళ వారికి దానిని తెలుగులో ఏమంటారో తెలియక హిందీ పదాన్నే తెలుగు లిపిలో వ్రాసారనీ అనుకున్నాను. అసలు విషయం ఇప్పుడు తెలిసింది. ధన్యవాదాలు.
బుడతకీచు, కక్కూస్ మా/మీ చిన్నప్పుడు వాడుకలో (కనీసం చిన్న పిల్లలలో)ఉండేవి. పాత జ్ఞాపకాలు వ్రాస్తున్నందుకు ధన్యవాదాలు.
ఇలాంటి విషయాలు తెలుసు కోడానికి చాలా సరదాగా ఉంటుంది. మీకు తెలిసినవీ, మీరు విన్నవీ మరిన్ని రాయండి. ధన్యవాదాలు.
స్పందనలను తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి