కథలెక్కడనుంచి వస్తాయి? ఆకాశం నుంచి ఊడి పడవు కదా? ఈ నేల మీద పుట్టి పెరిగిన మనుషుల్లోంచి వస్తాయి. వాటిని రాసే వాడూ మనిషే. వాటిల్లోని పాత్రలూ మనుషులే.. జరిగిన ఏదో ఒక సంఘటనను చూసో లేక ఇలా కూడా జరిగి ఉండొచ్చునని ఊహించో రచయితలు కథలు రాస్తారు. ఆ కథలు చెప్పడానికి కూడా నిజ జీవితంలోంచే పాత్రల్ని ఎన్నుకుంటారు. కాకపోతే తాము చెప్పదల్చుకున్న విషయానికి అవసరమైన కల్పనల్ని జోడిస్తారు. ఒక్కోసారి ఏ కల్పనలూ అక్కర లేకుండా జరిగిన సంఘటనలే అద్భుతమైన కథా రూపాన్ని సంతరించుకుంటాయి. వాటిల్లో రచయిత పైత్యం జొప్పించకుండా జరిగింది జరిగి నట్లు చెబితే చాలు మనకో గొప్ప కథ చదివిన అనుభూతి కలుగుతుంది. అదిగో అలాంటి అనుభూతిని నాకు కలిగించిన ఓ రెండు గొప్ప కథల్ని గురించి మీకు చెప్పబోతున్నాను.
( ఈ రెండు కథలూ కళలకి కాణాచియైన విజయనగరంలోనే జరిగాయి. మన మొట్టమొదటి తెలుగు కథ దిద్దుబాటు కూడా ఇక్కడే పుట్టింది కదా?)
1919 లో విజయనగరం రాజు విజయరామ గజపతి సంగీత కళాశాలను స్థాపించేరు.( ఇది ఇప్పటికీ దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ.) దీని మొదటి ప్రిన్సిపాలు హరికథా పితామహ శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు. వారితో పాటు ద్వారం వెంకట స్వామి నాయుడుగారు వాసా వారు మొదలైన హేమా హేమీలుండేవారు. ఇదిగో ఇటువంటి సంగీత కళాశాలలో దాసుగారికి సేవ చెయ్యడానికి రామస్వామి అనే వ్యక్తిని రాజుగారు నియమించేరు. ఈ రామస్వామి మరీ సామాన్యుడు కాడు. అతడు అంత వరకూ శ్రీ విజయరామ గజపతికి ఆంతరంగిక సేవకుడుగా ఉన్నవాడు.అతని ఉద్యోగం రాజు గారికి వారి అభిరుచిమేరకు రకరకాల వైన్స్ కలిపి ఇవ్వడం. ఈ సేవలో రాజు గారితో పాటు అతడు అనేక ఉత్తరాది సంస్థానాలకి కూడా వెళ్లి వచ్చిన వాడు. ఇటువంటి ఆంతరంగిక సేవకుడ్ని సంగీత కళాశాలలో ముఖ్యంగా దాసుగారి సేవలకి రాజుగారు ఎందుకు నియమించేరో తెలీదు. బహుశః రాజుగారితో తనకున్న చనువు మేరకు రామస్వామి అడిగితే నియమించేరేమో?. ఈ రామస్వామి మాత్రం సంగీత కళాశాలకూ అక్కడి విద్వాంసులైన వారికీ సేవలు చేసుకుంటూ ఉండే వాడు.
రామస్వామి పరమ రామ భక్తుడు. తను దాచుకున్న కొద్దిపాటి సొమ్ముతోనూ ఆ ఊళ్లో ఒక రామ మందిరం కట్టించేడు.రోజూ తెల్లారకనే లేచి స్నానపానాదులయ్యేక గుడికి వెళ్లి పూజ చేసుకుని ప్రసాదం పంచుతూ కాలేజీకి వచ్చేవాడు.
రామస్వామికి ఫిడేలునాయుడుగారంటే పంచప్రాణాలు. ఆయన సంగీతం కాలేజీ ప్రిన్సిపాలై రిటైరయ్యే వరకూ ఆయనదగ్గరే పనిచేసాడు.
ఈ ఫిడేలు నాయుడుగారింట్లో గురుకుల వాసం చేసుకుంటూ చాలామంది విద్యార్థులు ఉండేవారు. రోజూ శిష్యుల్లో ఒకరు బజారుకెళ్లి నాయుడుగారింటికి కావల్సిన కూరగాయలు తెచ్చేవారు. వారు తెచ్చిచ్చిన చిల్లర సరిగా ఉందో లేదో సరి జూసుకొని కాని మరీ వాళ్లను వెళ్లమనేవారు కారు నాయుడుగారు. అయితే ఎప్పుడైనా రామస్వామిని పంపి కూరలు తెప్పించుకున్నప్పుడు మాత్రం అతడిచ్చిన చిల్లర లెక్కజూసుకోకుండానే జేబులో వేసుకునే వారు. తమ మీద లేని విశ్వాసం రామస్వామి మీద నాయుడుగారికెందుకుందో తెలియక విద్యార్థులు ఈర్ష్య పడుతూ ఉండే వారు. ఉండబట్టలేక ఓ రోజు నాయుడుగార్నే ఈ సంగతి అడిగేసారు. అయితే వినండి అంటూ నాయుడుగారు వారికి చెప్పిన జవాబు ఇది:
“ఎంత బాగా వాయించినా ఎంత పేరొచ్చినా (తగిన పారితోషికం లేక) బాధ పడుతుంటే రామస్వామి నన్నూరడించేవాడోయ్—బాధ పడకండయ్యగారూ! మీకు స్వర్ణాభిషేకాలు జరిగే రోజులొస్తాయండీ అనేవాడోయ్--ఒక రోజున వచ్చి నన్ను అడిగాడుకదా-అయ్యగారూ-నేను చిన్నరాములోరి గుడి కట్టించానండి. రేపటి ఉదయం విగ్రహాలు పెడుతున్నారు. మధ్యాహ్నం సంతర్పణ జరుగుతుంది.. సాయంత్రం తమరు కచేరీ చేస్తే ధన్యుణ్ణవుతానన్నాడోయ్-- పరమానందంతో నేను కచేరీ చేసేను –కచేరీ అయిన తర్వాత రామస్వామి నాకు నూట పదహార్లు తాంబూలం పెట్టి నమస్కరించేడు—అంత గొప్ప సన్మానం మొదటిసారిగా చేసిన వాడిని చిల్లర లెఖ్ఖ అడగమంటారోయ్? ”
ఈ రామస్వామి 80 ఏళ్లు పైగా ఆరోగ్యంగా జీవించి ఒక సాయంత్రం రాముల వారి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి పాయసం సేవించి సుఖనిద్రలో రాముని సన్నిధి చేరుకున్నాడు. అతడు మాన్యుడా ? సామాన్యుడా? అతని సంస్కారం ఈ నేల లోంచి వచ్చిందా? నెనరులోంచి వచ్చిందా? ఆతని నిమ్మళం మనకుందా?
***
ఇక రెండో కథ చూడండి: ఇదీ విజయనగరంలోనే జరిగింది. కాకపోతే పైన చెప్పిన కథ జరిగిన చాలా ఏళ్ల తర్వాత—
ఓ రోజు రాత్రి ద్వారం దుర్గా ప్రసాద రావుగారూ కవిరాయని జోగారావుగారూ, కాట్రావులపల్లి వీరభద్రరావు గారూ కాలేజీ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. రోడ్డు చీకటిగా ఉంది- ఏదో మంచి కచేరీయే జరిగింది. దాని గురించి కచేరీ బాగుందని మాట్లాడుకుంటూ వస్తున్నారు- అంతలో వెనుక నుండి ఇలా విన పడ్డది:
“ మా గొప్ప కచేరీయే లెండి. మీరు యినడం- బాగుందనడఁవున్నూ-మేఁవూ ఇన్నాం కచేరీలు-సంగీతవఁటే అలాగుండాలి – ఆ రోజులు పోనాయి.”
ఈ మాటలు విని ఆ ముగ్గురూ నిర్ఘాంత పోయి-వెనక్కి తిరిగి చూస్తే- అతడో బికారిలాగున్నాడు. కొంచెం పట్టు మీద తూల్తున్నాడు. అతడిని పోలిక పట్టేరు. ఊళ్లో రోజూ గొడుగులు బాగు చేస్తూ తిరుగుతుంటాడు. సాయంత్రం వచ్చిన డబ్బుల్తో పూటుగా తాగి రాత్రికి మాదాకబళం తల్లీ అంటూ ఆడుక్కుంటూ ఉంటాడు. నువ్వు విన్న కచేరీ ఏదోయ్ అని వారడిగితే- “ కాకినాడ సరస్వతీ గాన సభలోనండీ- తిరుచ్చి గోవింద స్వామి పిళ్ళె ఫిడేలు వాయిస్తేనండీ – ఆ నాదమండి జడివోనలో తడిసినట్టుండేదండి. పల్లడం సంజీవ రావు ఫ్లూటు ఇన్నారా తమరు- గొప్ప తీపండి
వోయిద్యం. కాని ఒకటే స్పీడండి, నాయుడుగోరి వోయిద్యం సరేనండి-ఆరి ఇంట్లో రోజూ యినేవోడినండి. – రోజూ అమృతమేగదండీ –అయండీ సంగీతాలంటే ” అంటూ గొణుక్కుంటూ వెళ్లి పోయేడు.
మళ్లా కొన్ని నెలల తర్వాత ఒక రాత్రి ప్రసాదరావు గారూ వారి మేనత్త ద్వారం మంగ తాయారు గారూ వారింట్లో కూర్చుని ఈమని శంకర శాస్త్రి గారి వీణ టేపు వింటున్నారు. శంకర శాస్త్రిగారికి ప్రక్కవాద్యంగా కోలంక వెంకటరాజుగారు మృదంగం వాయిస్తున్నారు. వారు తన్మయంగా వింటుంటే “అదండీ మృదంగం అంటే” అని వీధరుగు మీంచి వినిపించింది. తలుపు తీసి చూస్తే ఆగొడుగుల బికారే.
మంగ తాయారుగారు అన్నం పెట్టి అతని పేరేమిటని అడిగితే సన్యాసండి అని చెప్పి అతడు వెళ్లి పోయేడు.
ఆ తర్వాత కొంత కాలానికి ఆవిడ మద్రాసు వెళ్లినప్పుడు వాళ్ల అమ్మగారిని ఎవరీ సన్యాసి అని అడిగితే “ అయ్యో తల్లీ వాడు మాదాకవళం చేసుకుంటున్నాడా – వాడికి బట్టలిచ్చి రోజూ భోజనం పెట్టండి తల్లీ ” అంటూ సన్యా సి కథ చెప్పిందావిడ.
విజయనగరం రాజు విజయరామ గజపతి వారు వారి ఆంతరంగ కార్యదర్శి గారి పుత్రుడు అంధుడైన చాగంటి గంగ బాబు కోసమే 1919లో విజయనగరంలో సంగీత కళాశాల ప్రారంభించేరు. గంగబాబుని గుర్రబ్బండిలో కాలేజీకి తీసుకు వెళ్లి తీసుకు రావడానికిగాను అతడికి ఎస్కార్టుగా ఉండడానికి సన్యాసిని నియమించేరు.
గంగబాబుని 15 సంవత్సరాలు కాలేజీకి, ద్వారం నాయుడు గారింటికీ, కచేరీలకీ సన్యాసే తీసుకు వెళ్లేవాడు. నాయుడు గారి కచేరీలలో గంగబాబు ప్రక్కవాద్యం వాయించేవారు. సన్యాసి నిరంతరం వారితోనే ఉంటూ సంగీత కచేరీలు వింటూ ఉండేవాడు. కొన్నాళ్లకి గంగబాబు గారు పెద్ద విద్వాంసులయ్యేసరికి వారి ఆస్తులన్నీ హరించుకు పోయేయి. గుర్రబ్బళ్లు పోవడం, తోడుగా శిష్యులుండడం చేత ఎస్కార్టు అవసరం లేక సన్యాసి ఉద్యోగం ఊడింది. తర్వాత ఏమేం పనులు చేసే వాడో కానీ గొడుగులు బాగు చెయ్యడంలో స్థిర పడ్డాడన్నమాట”.
ఉండడానికి తగిన నీడ నిచ్చే గొడుగు కరువైనా, జీవిక గురించి పట్టించుకోకుండా నిత్యం నాదామృతంలో తడిసి ముద్దైన వానికి సన్యాసి సార్థక నామధేయమే కదా?
***
ఈ కథల్లోని రామస్వామి, సన్యాసి పాత్రలు సృష్టించింది వారి జీవిత కథలకు కర్తా ఆ విధాతే అయినా ఈ అపురూపమైన వ్యక్తుల కథలు కాలగర్భంలో కలిసిపోకుండా రికార్డు చేసి మనకి అందించిన, ఈ రెండో కథలో ఒక పాత్ర అయిన శ్రీ ద్వారం దుర్గా ప్రసాద రావుగారు ధన్యులు.
ఈ జీవిత గాథలు నా హృదయాన్ని తాకిన గొప్ప కథలు. మరి మీ సంగతి?
****
6 కామెంట్‌లు:
చాలా చాలా కదిలించేయి.
విజయ నగరం గురించి ఎవరు ఏ ముక్క చెప్పినా నాకిష్టమే.
మనసుని తాకాయి. ఆ సంగీతంలో తడిసిన వారు ధన్యులు, మాకు చెప్పి మీరు మమ్మల్నీ ధన్యుల్ని చేశారు. పుణేలో ఒక రాత్రంతా జరుగుతున్న కచేరీలో కూర్చుని ఉన్నాం నేనూ నా స్నేహితుడూ. పక్కన ఒక నడివయసు ముస్లిం. బట్టలూ అవీ పేదరికాన్ని సూచిస్తున్నాయ్. గాయకులు మారుతున్న మధ్య వ్యవధిలో ఊరికినే పలకరించాను. టీకొట్టు నడుపుకుంటాడుట. ఎక్కడ కుదురుతుంది బాబూ, ఏదో అరుదుగా ఇలా ప్రవేశ రుసుము అక్కర్లేని కచేరీలు దొరుకుతాయి అన్నాడు. మా తరపున ఒక చాయ్-సమోసా అర్పించుకున్నాం ఆ సంగీతారాధకునికి.
కొత్తపాళీ గారికి . మీ స్పందన ఇవాళే చూడడం జరిగింది. మనం సామాన్యులనుకునే వారిలో కూడా చాలా గొప్ప వారుంటారు అని తెలిపే ఈ ఇద్దరు వ్యక్తుల కథలూ ఎక్కువ మంది చదివి ఉండడానికి అవకాశం లేని చోట నేను చదివాను. అందుకే ఇవి అందరితో పంచుకోవాలనుకున్నాను. మీ అనుభవాన్ని కూడా తెలిపినందుకు కృతజ్ఞతలు.
marachipoleni patralu.sahajamina jeevita chitrikarana.hridayanni kadilinchi ventadi kalakalam jnapakaluga vundi poye kadhalu.andariki teliyali.
geo lakshman గారికి- మీస్పందనకి కృతజ్ఞతలు
నమస్కారములు.
ఛాలా మంచి కధలు విని పించారు . కొందరు హెచ్చు తగ్గు లెలా ఉన్నా , మంచి కళా భిమానులు ఉంటారు. ఆస్వాదించే హృదయం ఉండాలే గానీ కళలు అందరి సొత్తు కదా ! . ఇంత మంచి విషయాలను అందించ గల మీ రసజ్ఞతకు కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి