భూలోక కల్ప వృక్షం—తాటిచెట్టు
మనవాళ్లు తాటిచెట్టుని భూలోక కల్ప వృక్షంగా భావించే వారట. దానికి ప్రధాన కారణం అది బహు ప్రయోజనకారి కావడమైనా అది మన ప్రాంతాల్లో విస్తారంగా పెరగడం దాన్నిపెంచడంలో గల సౌలభ్యం మిగిలిన కారణాలు కావచ్చు.
పూర్వం ఆంధ్ర దేశంలో తాటితోపులు ప్రతి గ్రామంలో పెంచడం ధర్మకార్యంగా భావించే వారట. యెనభై తొంభై యేళ్ల ముసలి వానిని పట్టుకుని వాని చేత తాటిగింజలు నాటించే వారట. అట్లా నాటిన గింజలు మొలకెత్తి చెట్లై కాపుకు వచ్చే సరికి ఆ ముసలాయన హరీమంటాడని ప్రతీతి. ఎందుకంటే నాటిన తాటిచెట్టు ఇరవై అయిదేళ్లకు గాని కాపుకు రాదు. మూడు తరాల తాటి చెట్లను చూసిన వాడిని “ ముత్తాడి” అనే వారట. అంటే – తన యెరుకలో నాటిన తాటి చెట్టు పెరిగి పెద్దదై పళ్లు కాచి వాటిగింజలు మళ్లా నాటితే అవి పెరిగి వాటికి పళ్లు కాస్తే వాటిననుభవించిన వాడు దీర్ఘాయుష్మంతుడే కదా.
ఈ తాటిచెట్లను నాటించడం ధర్మకార్యంగా భావించే వారని చెప్పాను కదా? వాటిని వేలూ లక్షల సంఖ్యలలో నాటించేవారట. ఒక శిలా శాసనం ప్రకారం ఒక పుణ్యపురుషుడు పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి సన్నిధి ప్రాంతంలో నాలుగు లక్షల అరవై వేల తాటిచెట్లు నాటించేడట.
తాటి చెట్లను పెంచడంలోని సౌలభ్యం ఏమిటంటే వాటిని నీటి వసతి లేని, పంటలకు పనికి రాని, ఎగుడు దిగుడు నేలల్లో కూడా హాయిగా పెంచుకో వచ్చు. దగ్గర దగ్గరగా వేసుకోవచ్చు. మొక్కలు ఎదిగే దాకా కాపు కాయనక్కర్లేదు. ఆవిధంగా ఖర్చు లేని పంట. అయితే తాటి చెట్ల ప్రయోజనాలు మాత్రం బహుళం. అవేమిటో కొద్దిగా వివరిస్తాను.
తాటి మాను గుడిసెలు వేసుకుందికి నిట్రాటగానూ మిద్దె ఇళ్లలో స్తంభాలు,దూలాలు, వాసాలు గానూ పనికి వస్తుంది. తాటి ఆకులు పైకప్పుగా పనికి వస్తాయి. కట్లు కట్టడానికి తాటినార పనికి వస్తుంది . చిన్న చిన్న కాలువలు దాటడానికి వాటిమీద తాటి దూలాల్నివేసి బ్రిడ్జీల లాగా వాడుకునేవారు. ఇంట్లో వాడుకకి తాటి చాపలూ బుట్టలూ తయారు చేసుకోవచ్చు. నూతుల్లో నీళ్లుతోడుకోవడానికి తాటాకు బొక్కెనలు చేసుకోవచ్చు. మా ప్రాంతంలో వీటిని రేకలంటారు. తాటినారతో తాళ్లు పేనుకుంటారు. తాటి మాకులను నిలువుగా చీల్చివాటిని నీళ్లు పారించుకునే దోనెలుగా తయారు చేస్తారు. తాటి ఆకులతో విస్తళ్లు కూడా కుడతారట గాని నేనెప్పుడూ వాటిని చూడ లేదు. తాటిముంజెలూ, తాటితేగలూ తాటిబెల్లం తాటికల్కండ తాటిపానకము తాటికల్లు ఆహార పానీయాలుగావాడుతారు. తాటి ఆకులతో గొడుగులను తయారు చేస్తారు. వీటిని మా ప్రాంతంలో గిడుగులనే వారు. వీటిల్లో పెద్దా చిన్నా సైజులవి ఉండేవి. వర్షా కాలంలో వీటిని వేసుకుని తిరిగే వాళ్లం. వీటితో సుఖమేమిటంటే వీటిని చేత్తో పట్టుకోనక్కర లేదు. హెల్మెట్ లాగా దానికి వేలాడే తాడుని తగిలించుకోవడమే. తాటి ఆకుల ఈనెలు చీపుళ్లు గానూ ఎండుమట్టలూ మొదలైనవి వంటచెరకుగానూ పనికి వస్తాయి. తాటాకులతో విసన కర్రలు తయారు చేస్తారు. ఉష్ణ దేశమైన మన ప్రాంతంలో ఇవి నేటి సెల్ ఫోన్ల లాగా అందరి చేతుల్లోనూ హస్త భూషణాలుగా విరాజిల్లేవి. పెళ్లిళ్లలో అరుగుల మీద చాపలు పరచి చేతికి విసన కర్రలు ఇచ్చేవారు. ఇవన్నీ జన బాహుళ్యానికి ఒనగూరే ప్రయోజనాలు.
తాటి చెట్టు మరో ముఖ్య ప్రయోజనం నాడు మన విద్యా విజ్ఞానాల్ని పెంపొందించుకోవడానికి అవసరమైన తాటాకుల్ని మనకందించడం. ఈ తాటాకుల మీద వ్రాసిన గ్రంథాలు శతాబ్దాల పాటు చెడిపోక నిలిచాయి. చక్కగా ఈనెలు తీసిన తాటాకుల్ని చుట్టలు చుట్టి పేడనీళ్లలో కొంచెం సేపు ఉడకబెట్టి నీడ పట్టున ఆరబెట్టి భద్రపరచి గ్రంథాలు వ్రాసుకునేందుకు దాచుకునే వారు. వీటినే అలేఖాలు అనే వారు. ( గుర్తుందా-- కన్యాశుల్కంలో రామప్ప పంతులు మా ఇంట్లో తాటాకుల అలేఖాలు అటకనిండా ఉన్నాయంటాడు. అవి ఇవే. కన్యాశుల్కం ఊసెత్తాను కనుక ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. నాటకం ద్వితీయాంకంలో ఒకటో స్థలంలో – వెంకటేశం “ మా నాన్న నాక్కూడా పెళ్లి చాస్తాడు” అన్నప్పుడు గిరీశం “ యివాళో పెద్ద పెళ్లి నీకు తల వెంట్రుక వాసి లో తప్పి పోయింది. యీ శలవులాఖర్లోగా తాళాధ్యాయం కాకుండా తప్పించుకుంటే నువ్ పూరా ప్రయోజకుడివే..” అంటాడు. ఇక్కడ తాళాధ్యాయం అంటే తాటి పట్టతో చెమ్డాలెక్కగొట్టడమన్న మాట.)
మరో ముఖ్యమైన విషయం—మన తెలుగు స్త్రీలు ఎంతో పవిత్రంగానూ మంగళప్రదంగానూ భావించే తాళిబొట్టు తాటాకుతో తయారు చేసినదే. అందుకే దానికా పేరు వచ్చింది. అదే కాదు చెవులకు కూడా తాటాకులని భూషణాలుగా వాడేవారు. అందుకే అవి చెవి కమ్మలయేయి. నా చిన్నప్పుడు తాటాకులతో చేసిన బొమ్మల పెళ్ళిళ్లు చేయడంచూసేను.
ఎత్తులూ లోతులూ కొలతలు చెప్పడానికి చిన్నవైతే మనిషి నిలువుతో పోల్చినట్టుగా మరీ పెద్దవైతే తాటిచెట్టు పొడవుతో పోల్చి చెప్పేవారు. రెండు తాటిచెట్ల ఎత్తనీ మూడు తాళ్ల లోతనీ అంటూ. ఇదే తాళ ప్రమాణమంటే. ఎంతో బాధలో ఉన్నప్పుడు పెద్ద నిట్టూర్పులు విడుస్తాం కదా? అలాంటి దుఃఖాన్ని సూచించడానికి “ మాకు నిశ్వాస తాళ వృంతాలు గలవు” అంటారు కృష్ణ శాస్త్రి గారు.
మన మహా భారతంలో భీష్మునికీ బలరామునికీ తాళ ధ్వజులనే పేర్లున్నాయి. వారి జెండాలపై తాటిచెట్ల గుర్తులండేవన్న మాట
తాటి చెట్లు మన జీవితాల్తో ఎంతగా పెన వేసుకున్నాయంటే చాలా ఊళ్ల పేర్లు వాటి వల్ల వచ్చినవే. ఉదా తాడిగిరి, తాడికొండ, తాళ్లవలస, తాటిపూడి, తాళ్లరేవు ఒంటితాడి మొదలైనవి. ఈపేర్లే కొందరికి ఇంటి పేర్లగానూ స్థిర పడ్డాయి. మాహైదరా బాదులో తాడ్ బన్ అనే ప్రదేశం ఉంది. ఆఫ్గనిస్తాన్ లో అరాచకానికీ విధ్వంసానికీ పేరు పడ్డ తాలిబన్ పేరు ఇలా వచ్చిన దేమో తెలుసుకోవాలి . ఇంతగా తెలుగు వారి జీవితాలతో పెన వేసుకున్న తాటిచెట్టు మన సామెతల్లో ఎలా దర్శనమిస్తుందో చూడండి:-
తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదురునా?
తాటిచెట్టుకింద పాలుతాగినా కల్లే అంటారు.
తాడితన్నే వాని తలదన్నే వాడుంటాడు.
తాటిచెట్టు ఎక్కా లేవు, తాటిగెల కొయ్యాలేవు, తాతా నీ కెందుకోయి పెండ్లాము
తాటి చెట్టు నీడ నీడా కాదు తగులుకున్న వాడు మొగుడూ కాదు. (తగులుకున్నది పెండ్లామూ కాదు.)
తాగిన వాడే కడతాడు తాళ్ల పన్ను. ఇత్యాది…
(ఈ వ్యాసంలో తాటి చెట్లగురించి చెప్పిన దానిలో కొన్ని విశేషాలు కీ.శే. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి “ఆంద్ర కల్ప వృక్షము” అనే వ్యాసం నుంచి గ్రహించేను. వారికి నా కృతజ్ఞతలు.)
సెలవు.
11 కామెంట్‌లు:
చాలా అద్భుతంగా ఉంది! చక్కగా ఎన్నో మంచి విషయాలన్నిటినీ సేకరించి పొందుపరిచారు. తాటి చెట్టుకు సంబంధించి అన్నీ చెప్పారు కానీ ఈ తాటి ముంజెలు తినేసాక మిగిలిన కాయలతో పిల్లలు మూడు లేదా రెండు చక్రాల బండ్లు చేసుకుని తోసుకుంటూ ఆడుకుంటారు అలానే ఈ తాటి చాపలని మామిడి తాండ్ర తయారీకి ఎక్కువగా వాడతారు. కొన్ని ప్రాంతాలలో తాటి తాండ్ర కూడా చేస్తారు. మీరు చెప్పిన తాటి కలకండ నేను వినలేదు! ఈ తాటాకు గొడుగులని తలకి శిరస్త్రాణంగా (హెల్మెట్ లాగా) కన్నా గొడుగులానే చూసాను. ఒకసారి పట్టుకున్నా చాలా బరువుగా ఉంటాయి బాబు!
మా చిన్నప్పుడు సంక్రాంతికి ముందే తాటి ఆకులు తెచ్చి ఎండబెట్టేవాళ్ళు. తాటి ఆకులతో భోగి మంట వేస్తే మంటలు చాలా ఎత్తుగా లేస్తాయని. తాటి చెట్టును గూర్చి మంచి వ్యాసం. ధన్యవాదములు.
entha chakkaga wrasaru super
రసజ్ఞ గారికీ, జ్యోతిర్మయిగారికీ,అజ్ఞాత గారికీ వారి స్పందనలు తెలియజేసినందులకు కృతజ్ఞతలు.ఈ వ్యాసం ఎవరికైనా ఆసక్తిదాయకంగా ఉంటుందా అని సందేహించేను.ఆ సందేహాన్ని వమ్ము చేస్తూ వచ్చిన మీ స్పందనలే వయసుడిగిన మాలాంటి రచనోత్సాహాన్ని కలిగిస్తాయి.Thank you--once again.
చాలా బాగా రాశారు.
నా చిన్నపుడు బాగా ఎండిన ముంజెకాయని బాల్ గానూ, తాటి మట్టని బాటు గానూ ఉపయోగించి క్రికెట్ ఆడేవాళ్ళం. ఎండిన ముంజెకాయ తగిలితే హలే నొప్పి పుడుతుంది.
నా ఇంటిపేరు బొందలపాటి. మా ఇంటి దగ్గర తాటి తోపు ఉండేది. దానినే "బొందలు" అని కూడా అంటారు. అందుకనే మా ఇంటిపేరు బొందలపాటి అని వచ్చింది అనుకొనేవాడిని. కానీ తరువాత తెలిసింది, ప్రకాశం జిల్లాలోని బొందలపాడు అనే ఊరినుంచీ రావటం వలన ఆ పేరు వచ్చిందని.
తాలిబ్ అంటే student అని పష్టూన్ భాష లో అర్ధం. islaamic students పటాలం కాబట్టీ దానిని తాలిబాన్ అని అంటారు.
బొందలపాటి వారికి కృతజ్ఞతలు.ఈ రోజే మీ బ్లాగు చూడడం జరిగింది.కులాలకథ చాలా బాగా రాసేరు.చదవమని మా రచయిత తమ్ముడిని కూడా కోరేను.మీ పాత పోస్టుని ఇవాళచూడగలగడం యాదృఛ్చికమే. చాలా మంచి కథ.మీ బ్లాగుని ఫాలో అవుతుంటాను.
తాటి చెట్టు గూర్చి మేటిగా చెప్పావు
తాటి చెట్టుని పెకిలించి తీయడం నేను కింతలి లొ పనిచేసినప్పుడు చూసేను
పాలకొండ భీముడు అన్నారు తనని
నమస్కారములు.
చాలా బాగా చెప్పారు. తాటాకుతో దీపావళికి టపాకాయలు చేసేవారు. తెలియని ఎన్నో విషయాలను చక్కగా వివరించారు. మా చెల్లెలు ఇంటి పేరు " తాడినాడ " [ భీమవరం ] మంచి ఆర్టికల్ ధన్య వాదములు .
రాజేశ్వరి గారికి కృతజ్ఞతలు. తాటాకు పటాకీలు చిన్నప్పుడు మేమూ కాల్చేం. తాటాకులని నాలిక బద్దల లాగా వాడటం నాకు తెలుసు.అయితే అన్నీ యాకరువు పెట్టడం కాకుండా జన సామాన్యానికి ఉండే ఉపయోగాలే కాక మన శాస్త్ర, కావ్య సంపదని నిక్షిప్తం చేసి కొన్ని తరాల పాటు అందించడంలో తాళవృక్షం ప్రాముఖ్యతను తెనియజెయడమే నా వ్యాస ముఖ్యోద్దేశం.తాటాకులే లేకపోతే ఎంత విజ్ఞానం గాలిలో కలిసి పోయేదో కదా?
గోపాల కృష్ణ గారు, కథ మీకు నచ్చినందుకు నాకు ఆనందం గా ఉంది. మీరు జోగారావు గారికి చెప్పి చదివించినందుకు ధన్యవాదాలు.
ఈ కథ రాసిన తరువాత కొన్ని చిన్నా చితకా కథలు రాశాను.
ఈ కింది దానిని జోగా రావు గారు portrait అంటారేమో. మీరు చదివి మీ అభిప్రాయం చెప్తారా?
http://bondalapati.wordpress.com/2011/05/27/1297/
http://wp.me/pGX4s-ma
పై రెండూ కూడా కథలు కాకపోతే, ఇంకా నాకు రాయటానికి ఆసక్తి తగ్గుతుంది.
తాటి చెట్లు సర్వ సా్ధారణమైనా, వాటి గురించి ఎన్నో క్రొత్త విషయాలు మాకు తెలియనివి తెలిపారు. ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి