4, డిసెంబర్ 2011, ఆదివారం

అసలు కంటె వడ్డీ ముద్దు ..కదా..



అసలు కంటే వడ్డీ ముద్దంటారు .అది నిజమే కదా? అసలు మనం కష్టపడి సంపాదించుకుంటే అది మనం కష్టపడకుండా మనకి వడ్డీల్ని తెచ్చిపెడుతుంటుంది. ఆ వడ్డీ అసలు కంటె బహు ముద్దుగా ఉంటుంది. అలాగే మనం కష్టపడి పిల్లల్ని కని పెంచితే వారు మనకిచ్చే మనుమలో మనుమరాండ్రో బహు ముద్దొస్తారు. అదీ కాక మనం మన పిల్లల్ని ఎక్కువ ముద్దు చెయ్యం. ఎక్కడ పాడయి పోతారోనని. కొంత వయసు వచ్చాకనే పిల్లల్ని ఎలా ముద్దు చెయ్యాలో తెలుస్తుంది. జీవన సంధ్యలో మనుమలో మనుమరాళ్ళో మనకిచ్చే ఆనందం అనుభవిస్తే కాని తెలియదు. సరదాగా మా చిన్న మనుమడిమీద రాసుకున్న ఓ పుంజీడు  కందాలు మీ ముందు ఉంచుతున్నాను. ఇవి మీ మనుమడికీ వర్తిస్తాయి.





మాచిన్నమనుమడింటను
గోచీ లేకయె తిరుగును గోలను చేస్తూ
పేచీలకు లేదు కొదువ
ఏంచేసిన గాని వాడు ఎపుడున్ ముద్దే                              

బుడి బుడి  తడబడు నడకల
ఎడనెడ లేచుచు పడుచును నిలకడ లేకన్
గడబిడ చేసెడి మా మను
మడి చెయిదము మా మనసుల మక్కువ   పెంచున్                   

హద్దులు మీరిన అల్లరి
పెద్దగ చేస్తూ వదలని పెంకితనంతో
ఒద్దిక లేకయు నున్నను
ముద్దేకద మాకు వాని మోమును చూడన్                         

చిన్నా యని నే పిలువగ
నన్నేనాయని పరుగున నన్నుంజేరే
అన్నెము పున్నెము నెరుగని
కన్నడు మా కనులనింపు కాంతిని వేడ్కన్  

( మొదటి పద్యం నాలుగో పాదంలోప్రాసాభంగం అయిందని భావించే వారు  " ఆ చేష్టలు అన్ని మాకు హాయిని గూర్చున్"  అని చదువుకో వచ్చును)

సెలవా మరి..

5 కామెంట్‌లు:

పంతుల సీతాపతి రావు చెప్పారు...

మనవడి అల్లరి అంతా
కను విందగు కధకు మల్లె కందాలమరెన్!
మనవల ఆటలు - పాటలె
మనకొచ్చే అసలు -వడ్డి - మహదానందం

www.apuroopam.blogspot.com చెప్పారు...

సీతాపతిగాకి, కందంలో మీరు స్పందించిన తీరు బాగుంది. కృతజ్ఞతలు.

కథా మంజరి చెప్పారు...

మనవళ్ళ అల్లరే అనురాగ వల్లరి. కదా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఉల్లము పొంగును మనవల
అల్లరి మనకెంతొ ముద్దు ఆనం దింపన్ !
మెల్లగ యొడిలో జేరిన
ఝల్లున మనసంత మనకు చక్ర వృద్ధే !
చక్ర వృద్ధే = వడ్డీకి వడ్డీ
క్షమించాలి . నాకు సరిగా రాదు .[ ఇప్పుడిప్పుడే పద్యాలు వ్రాయడం నేర్చు కుంటున్నాను. తప్పులు ఉంటే సవరణ చేయ గలరు .మీ కందాలు మనవలకి మల్లేనే బాగున్నాయి .] సరదాగా రాసానంతే

www.apuroopam.blogspot.com చెప్పారు...

పంజో గారికీ, రాజేశ్వరిగారికీ కృతజ్ఞతలు. రాజేశ్వరిగారూ, మీ పద్యం బాగుంది.నేనో కవిని కాను. ఈ మధ్య రాసినవీ కొద్దిపాటి పద్యాలే.సరదా కోసం రాసుకున్నవి.మీరు రాస్తూండండి.