9, డిసెంబర్ 2011, శుక్రవారం

పిలుపులూ....మానవ సంబంధాలూ......


పిలుపూలూ..మానవ సంబంధాలూ... 
ఒకరినొకరు పిల్చుకోవడంలో ఎన్ని రకాలో? మా చిన్నప్పుడు మాది ఉమ్మడి కుటుంబం. మా తాతగారిని  మా నాన్నగారూ వారి తమ్ములూ అందరూ బాబూ అని విలిచేవారు. వారందరిలోకీ పెద్దఅయిన మా నాన్నగారిని వారి తమ్ములు నాన్నా అని పిలిచేవారు. తండ్రి తరువాత తండ్రి అంతటివారని పెద్దన్నగారిని అలా పిలిచే వారేమో?.ఇటువంటి ఆచారం వాళ్ళకుటుంబాలలో కూడా ఉండేదని శ్రీ రాంభట్ల కృష్ణమూర్తిగారు వారి స్వీయ చరిత్రలో రాసేరు.
మా చిన్నప్పుడు ( నాకప్పుడు పదేళ్లలోపే) మా మాతామహుల ఇంటికి ఉరవకొండ  ( అనంతపురం జిల్లా) వెళ్తూ ఉండేవాళ్లం.. వారింటికి ఎదురుగా బస్టాండు ఉండేది స్టాండంటే మరేమీ లేదు. ఓ చెట్టు చుట్టూ బస్సులు ఆగుతుండేవి. అక్కడినుంచి బళ్లారికి పోయే బస్సులు వచ్చినప్పుడల్లా ఎవురప్పా బళ్లారి అనే అరుపులు విని పిస్తుండేవి. ఉత్తరాంధ్ర ప్రాంతంనుండి వెళ్లిన మాకు ఆ పిలుపులు వింతగా తోచేవి.  రాయలసీమలో తండ్రిని అప్పా అని పిలుస్తారని గౌరవ వాచకంగా అందరినీ అప్పా అంటారనీ అప్పుడుతెలిసింది.
అప్ప అనే తెలుగు పదం నిజానికి తల్లి తండ్రులకిద్దరికీ వర్తిస్తుంది.  అందుచేత భేదం సూచించడానికి తండ్రిని అప్పడు అనీ తల్లిని అప్పఅనీ  అనాలి..  లోకంలో అందరికీ తండ్రి అయిన శ్రీ వేంకటేశ్వరుని గురించి అప్పడిని కనుగొంటిఅంటారు శ్రీ అన్నమాచార్య. అయితే లోక వ్యవహారంలో తరువాతికాలంలో డు వర్ణం జారిపోయి అప్ప అనే పిలుపు మిగిలి ఉంటుంది. మా ఉత్తరాంధ్రలో మగవారి పేర్లకి అప్పడనీ అడవారి పేర్లకి అప్ప అనీ తగిలించి వ్యవహరించడం నేటికీ ఉన్న ఆచారమే . మారిషస్ లో తెలుగు మాట్లాడే వారి సంఘానికి అధ్యక్షుల పేరు శ్రీ రామస్వామి అప్పడు. చూడండి ఎన్నో తరాల క్రిందట దేశాంతరాలకు  తరలి పోయిన తెలుగు వారు మన సంస్కృతినీ ఆచార వ్యవహారాలనీ కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుతున్నతీరు.మాతృభూమిలో నివశిస్తున్న తెలుగు వారు    ఇది సిగ్గు పడాల్సిన విషయం. ( నాజూకు పేర్లు, అసలు అర్థమే లేని పేర్లు పెట్టుకోవడం మొదలయ్యాక  అప్పలూ అయ్యలూ మూర్తిలూ రావులూ  శర్మలూ శాస్త్రిలూ ఎక్కడా కనిపించడం మానేశారు. ఇప్పుడు పిలుపులగురించి మాట్లాడుకుంటున్నాం కనుక పేర్లగురించి మరోసారి).
                                                         మా చిన్నప్పుడు ఇంటిపేరుకి ప్రాధాన్యం ఉండేది. తోటి పిల్లలు బళ్లోకి వెళ్తున్నప్పుడు ఒరే పంతులా బళ్లోకి రారా అంటూ ఇంటిపేరు  పెట్టి కేకేసేవారు ఇలా ఇంటిపేరుతో పూర్తిగా వ్యవహరిచడం వల్ల మనకి తెలియని ప్రదేశాల్లో కూడా మన బంధువులని గుర్తించడానికి అవకాశం ఉండేది. ఇంటిపేరుని పొడి అక్షరాలకి పరిమితం చేసుకుని ఈ అవకాశాల్ని చెయిజార్చుకున్నాము.
యుక్త వయసులో స్నేహితులందరం ఒకరినొకరు గురూ..గురూ.. అని పిల్చు కోవడం తమాషాగా ఉండేది. పెద్దగా పరిచయం లేని వారిని పలకరించాల్సి వస్తే మాస్టారూ అని పిలవడం ఆనవాయితీ...( అవతలివారు ఉపాధ్యాయవృత్తిలో లేరని తెలిసినా సరే)
 భారత దేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు వాళ్లలో అందరినీ వరసలు పెట్టి పిలుచుకునే సదాచారం ఒకటి ఉంది. పల్లెటూళ్లలో అది నేటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. పిన్నిగారూ అనో అత్తయ్యగారూ పక్కింటావిడని పిలిచిన కొత్తకోడలు  వెంటనే వారికి ఆత్మీయురాలై కూర్చుంటుంది. పరాయి మగాళ్లందరినీ అన్నా అని పిలుచుకునే ఆడవారూ, పరాయి స్త్రీలనందరినీ అక్కాఅనో చెల్లెమ్మా అనో పిలుచుకునే సంస్కృతి ఎంత గొప్పదో కదా?                                                                           అయితే పాత కాలంలో అన్నీ మంచి ఆచారాలే ఉండేవా? అంటే లేదనే చేప్పాలిమంచి గతమున కొంచేమేనోయ్ అన్నాడు శ్రీ గురజాడ. రోజుల్లో భార్యని పేరు పెట్టి పిలవడంకూడా తప్పే. అసే, ఒసే, ఏమేవ్ అని పిలుచుకునే వారు. వేసిన తలుపు తీయమనడానికి కూడా తలుపు..తలుపు..అంటూ తలుపు తట్టేవారు. తలుపు తీయడం కాస్త ఆలస్యమయితే నోరు పారేసుకునే వారే గాని పేరు పెట్టి పిలిచిన పాపాన పోయేవారు కాదు. ఇప్పటికీ  ఉత్తర హిందూ స్ధానంలోని ఛాందస కుటుంబాలలో భార్యని ఏ బబ్లూకీ మా అనో పిలుస్తారు తప్ప భార్యపేరు ఉచ్చరించరు.
దేశంలో విద్యాసంస్కారాలు పెరిగాక  ఈమొరటుదనం తగ్గి  చక్కగా భార్యలను వారి పేర్లతో పిలుచుకుంటున్నారుమొగుడు పేరు ఉచ్చరించడానికి సిగ్గు పడే భార్యలిప్పుడిప్పుడు వారిని వారి పేర్లతో పిలుచుకుంటున్నారు. ఇంత వరకూ బాగానే ఉందితమను తాము మరీ నవనాగరీకులమనుకునే భామలు  భర్తల్ని అరే ఒరే అనికూడా అంటున్నారు.   చిన్నప్పుడు ......ఉన్నప్పుడు రాకొట్టడంపాడియేమో గాని నలుగుర్లో ఉన్నప్పుడు ఆపిలుపులు భావ్యమా అన్నది వారికి వారు వేసుకో వలసిన ప్రశ్న
 బాల్యమిత్రులు అరే ఒరే అని పిలుచుకోవడం పాడి. తెలంగాణాలో పిల్లలు రాబే..పోబే.. అనుకుంటారు. చిన్న పిల్లలు కలిసి మెలిసి ఉండేవారు  ఇలా పిలుచుకోవడంలో తప్పు పట్టాల్సిన పనేమీ లేదు. కాకపోతే కొత్తవారిని ఏ విధంగా సంబోధిస్తున్నారో గమనించి వారికి బుధ్ది చెప్పాల్సిన అవసరం ఉంది. యౌవనంలో మిత్రులైన వారు ఓయ్ అని పిలుచుకోవడం అలవాటే.. మరీ పెద్దయ్యాక మిత్రులైన వారు మీరు తమరు అనుకోవడం మరియాద.
బెంగాలీ వారు గౌరవ సూచకంగా మహాశయ్ అని సంబోధిస్తారు. తెలంగాణాలో నీ బాంచన్ కాల్మొక్త అనే పేదవారుకూడా ఎంతవారినైనా నువ్వు అనే సంబోధిస్తారు. ధీనిని అపార్థం చేసుకోవలసిన పని లేదు.ఇక్కడి సంఘం ఆమోదించిన  పిలుపది.
(ఇంగ్లీషు వారి You లాగా).
మన సినిమాల్లోకూడా పాత రోజుల్లో పాటల్లో రావే ప్రేమలతా.. అనో రావె రాధారాణీ.. అనో ఓహో జవరాలా అనో అందంగా పిలుచుకునే వారు. ఈ రోజుల్లో విద్యావంతులైన హీరో హీరోయిన్లుకూడా  “ రాయె రాయె అని పాడు కుంటున్నారు.  ఈ సంబోధనలలోని ఔచిత్యం ఆ సినిమా రచయితలూ దర్శకులే చెప్పాలి.

ఇద్దరు వ్యక్తుల మధ్య వారికున్న చనువును బట్టి వారి ఏకాంత సంభాషణలలో పిలుపులు ఎలాగున్నా నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం హుందాగానూ పరస్పరగౌరవాభిమానాలను వ్యక్తపరిచేవిగానూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఆ సమాజం నాగరిక సమాజం అనిపించుకుంటుంది. మానవ సంబంధాలు పరిమళిస్తాయి.
సెలవు..

14 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

చాలా బాగా ఉంది మీ వ్యాసం.

అన్నట్లు మీరొక విషయం మరచారు. అప్ప అంటే అక్క అన్న అర్ధంకూడా మంచి ప్రచారంలోనే ఉంది.

మరీ యీ రోజులే అని కాదు కాని కొన్నాళ్ళక్రిందటే ఫాషను పేర్లు మొదలయాయి. ఒక్కొక్కసారి కొన్ని యిబ్బందికరమైన పేర్లూ వినిపిస్తాయి. పాపం ఆ పేర్లు పెట్టిన వారికీ, పెట్టించుకున్న వారికీ కూడా ఆ పేర్లకు సరయిన అర్ధం తెలియదు.

నేను పనిచేసే చోట ఒకామె ఉద్యోగంలో చేరింది. పేరేమిటండీ అంటే 'జఘనరాణి' అంది. నవ్వాలో యేడవాలో తెలియలేదు. బహుశః ఆవిడ దృష్టిలో 'జగన్ రాణి' అయి ఉంటుంది. జగత్+రాణి-> జగద్రాణి కాని యిదేమిటని అడగకండి. అదంతే!

మరీ విడ్డూరం యేమిటంటే యేదో తలాతోకాలేని పేరు - యిది ఫలానిభాషలో ఫలాని గొప్ప అర్ధం అంటారు. బాగుంది కాని మనభాషలో యేదో దరిద్రపు అర్ధం వస్తేనో. అప్పుడేంచేస్తారో.

జ్యోతిర్మయి చెప్పారు...

చాలా చక్కని వ్యాసం.

www.apuroopam.blogspot.com చెప్పారు...

జ్యోతిర్మయిగారికీ, శ్యామలీయంగారికీ కృతజ్ఞతలు. శ్యామలీయంగారూ- అప్ప అని అక్కను పిలవడం ఉత్తరాంధ్రలో ఉంది. నాకు తెలుసు.( సోములప్ప మీద నా పాత పోస్ట్ చూడండి) అయితే ఇక్కడ అప్ప అప్పడు అనే పదాలు తల్లి తండ్రులను సూచిస్తాయని చెప్పడం నా ఉద్దేశం.మిగిలి వారికి ఈ పదాలను గౌరవ సూచకంగా చేర్చడం జరుగుతుంది.అక్క కూడా పెద్దది తల్లి తర్వాత తల్లి అంతటిది కనుక అక్కను కూడా అప్పా అని పిలవడం ఉత్తరాంధ్రలో అలవాటయిందనుకుంటాను.జఘనరాణిగారికి వారి పేరు అర్థం తెలిసి ఉండక పోవడం ఒక వరం.పేర్లగురించి మరోసారి ముచ్చటిస్తాను.

రసజ్ఞ చెప్పారు...

చాలా చక్కని వ్యాసం! లెస్స పలికితిరి!

కథా మంజరి చెప్పారు...

చాలా బాగుంది. మీర్నట్టు భర్తలు భార్యను పిలవడంలో లోగడ అంతర్గతమైన ప్రేమాభిమానాలు ఎలా ఉన్నా, కొంత కరకుదనం చోటు చేసు కొనేది. భార్యలు అమాయకత్వం వల్లనో, అఙ్ఞానం వల్లనో నొచ్చు కునే వారు కారేమో కూడా.

ఆ విషయం అలా ఉంచితే ఆధునిక వనితలు భర్తలను, లేదా ప్రయులను పిలిచే తీరు మీరు పేరకొన్నట్టుగా మరీ విడ్డూరంగా ఉంటోంది.

నాకు తెలిసిన ఒక గొప్పింటి భార్య తన భర్తను డాడీ ! అంటూ పిలిచేది. అదేమిట్మా అనిడిగేను.‘‘ అదేమిటో నండీ మా పిల్లలు ఆయన్ని అలా పిలుస్తారు కనుక నాకూ అదే అలవాటయి పోయింది.’’ అంది.

దీనిని నాగరీకం అనాలా, మూర్ఖత్వం అనాలా !

ఏం చోద్యం !

పంతుల సీతాపతి రావు చెప్పారు...

చాలా మంచి వ్యాసం .
'' .ఓయ్" అని ఈ మధ్య సినిమా వచ్చేక
భార్యని భర్త '' ఏమ్వోయ్'' అని భార్య భర్తని ''ఓయ్''
అని పిలుస్తున్నారు. సంతోషం ''ఓరే మొగుడా!''
అని పిలవనందుకు

www.apuroopam.blogspot.com చెప్పారు...

రసజ్ఞ గారికీ, సీతాపతిగారికీ,జోగారావుగారికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.నేనింకా చాలా విషయాలు రాయలేదు. నాకు తెలిసిన ఒక ఎన్నారై కుటుంబంలో అత్తగారిని కోడలు మమ్మీ అని పిలవడం ఆరంభించింది.ఆ మమ్మీగారు ఈ కోడలుని కూతురులాగ కాదు కదా సాటిస్త్రీగా కూడా చూడదు.అత్తగారిని ఆత్తగారూ అని సంబోధిస్తే వచ్చేనష్టమేమిటో నాకైతే తెలియదు.

కథా మంజరి చెప్పారు...

ఈ కాలపు పిలుపులంతే నండీ.

జడ్డీ, జంకానూ అంటే అదే మరి.

సుధారాణి చెప్పారు...

పిలుపుల్లో మానవసంబంధాలను బాగా వివరించారు. ఇక్కడ నాకూ ఓ మాట గుర్తొస్తోంది. మా బంధువుల్లో ఓ
ఆవిడ తన భర్తను,ఆవిడని భర్త డార్లింగ్ అని పిలుచుకుంటారు.ఇద్దరూ షష్టిపూర్తికి దగ్గరపడుతున్న ఈ వయసులో కూడా ఆ పిలుపులు - ఏదో ప్రేమపారవశ్యంలో ఉచితంగా వారిరువురి ఏకాంతంలో ఐతే సరే కానీ...డార్లింగ్ స్నానంచేస్తారా లాంటి వాక్యాలు ఎబ్బెట్టుగా ఉంటాయని వాళ్ళకి ఎలా చెప్పడం!!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు .
పిలుపులు , మానవ సంబంధాల గురించి చక్కగా వివరించారు . " అడిదం సూరకవి గారన్నట్టు " కొన్ని సందర్భాలలో " రా " కొట్టడం బాగానే ఉంటుంది గానీ బొత్తిగా , నలుగురి మధ్యలో ఉండగా భర్తని " అరె కన్న , ఒరే బుజ్జీ " అంటే బాధగా ఉంటుంది [ ముఖ్యం గా పెద్దవాళ్ళకి ] వారికదేదో గొప్ప నాగరికత ! అన్న భ్రాంతి. ఎం చేస్తాం ? ? ?

కథా మంజరి చెప్పారు...

యాదాలాపంగా మళ్ళీ ఇవాళ ఈ టపా చూసాను. అప్పట్లో ఒకటో రెంటో కామెంట్ లు కూడా ఉంచేను. ఇప్పుడు తిరిగి వ్యాకరణ సంబంధ మయిన ఒకటి రెండు అంశాలు మీ దృష్టికి తేవడం కోసం ఇది రాస్తున్నాను.

అప్పడు అనే మాటలో డు అనే అక్షరం కాలక్రమేణా తొలిగి పోయిందని రాసేరు. అది సరి కాదు.
పుంలింగ మహద్వాచక మయిన ప్రాతి పదిక చివర అర సున్నాతో కూడిన డు వర్ణకం చేరుతుందని వ్యాకరణం చెబుతోంది. కనుక అప్ప అనేది స్త్రీ వాచక పదమనీ, డు వర్ణకం చేరిన అప్పడు అనేది పుంలింగ వాచకమనీ గమనించాలి. అంతే తప్ప అప్పడు లో డు కాలక్రమంలో జారి పోయిందని భావించడం సరి కాదు.

అలాగే మీ టపాలో శాస్త్రిలు, మూర్తిలు అనే మాటలు వాడేరు. కానీ, శాస్త్రులు , మూర్తులు అని ఉండాలి.
ఇత్తునకు బహు వచనం పరమయితే ఉత్వం వస్తుందని బాల వ్యాకరణం.
నక్కలు బొక్కలు వెదుకును అంటే ఇదే కాబోలు.
కదా !

www.apuroopam.blogspot.com చెప్పారు...

పంజో గారికి , నా వ్యాసం అంత శ్రధ్దగా చదివి వ్యాకరణదోషాలని చూపించినందుకు కృతజ్ఞతలు.వినదగునెవ్వరు చెప్పిన అన్నది నా మతం. మరీ ముఖ్యంగా మీ వంటి పండితులు చూపించే తప్పుల్ని వినమ్రంగా సరిదిద్దుకుంటాను. కాని ఇక్కడ మీరు చెప్పిన రెండు విషయాలతోనూ ఏకీభవించలేక పోతున్నాను.ఎందు చేతనంటే--
మీరు వ్రాసినట్టు అప్ప స్త్రీ వాచకం కాదు. అప్ప అంటే తల్లి తండ్రు లిద్దరికీ వర్తిస్తుంది.( చూ-శ.ర.నిఘంటువు). అయితే వాడుకలో తల్లినీ తండ్రినీ కూడా అప్ప అనే పిలిస్తే ఇబ్బందులుంటాయి కనుక తండ్రికి అప్పడనీ తల్లికి అప్ప అనీ వ్యవహారం. ఈ రకంగానే పురుషులను అప్పడు అనీ స్త్రీలను అప్ప అనీ వ్యవహరించడం ఈ నాటికీ ఉత్తరాంధ్రలో ఉంది. రాయల సీమ లోకూడా తండ్రిని ఒకప్పుడు అప్పడనే వ్యవహరించే వారనడానికి అన్నమాచార్య కీర్తనే సాక్ష్యం.కాల క్రమంలో అక్కడ పురుషులకు కూడా అప్ప అనే చేర్చి వ్యవహరిస్తున్నారు .అప్ప అంటే తండ్రి అని కూడా అర్థముందని చెప్పేను కదా.ఒకప్పుడు అక్కడ కూడా వ్యవహారంలో పురుషులకు చేర్చి వాడిన డు వర్ణం తరువాత కాలం లో జారి పోయనదనే నేను చెప్పినది. మీరన్నట్టు అప్ప స్త్రీ వాచకమైతే సీమ ప్రాంతం లో తండ్రిని అప్ప అని పిలవడం పురుషులకు అప్ప అనే గౌరవ వాచకం చేర్చడం తప్పే అవుతుందికదా? కాని అది సరైనదే.ఇదే విషయం నేను చెప్పేను.
ఇంక మీరు చెప్పిన వ్యాకరణ సూత్రం ప్రకారం ఇకారాంత పదాలు బహువచన ప్రత్యయం " లు " చేరినప్పుడు ఇకారం ఉ కారం గా మారడమన్నది కరెక్టే. ఇది మడి దారి వంటి పదాల విషయంలో వర్తిస్తుంది కాని వ్యక్తినామాల విషయం లో వర్తించదు.వ్యక్తి నామాలు ఉన్నవి ఉన్నట్టుగానే వ్రాయాలి కదా?. మూర్తిలూ శాస్త్రిలూ అంటే మూర్తి, శాస్త్ర్రి అనే పేరు గల వారనే అర్థం వస్తుంది.వ్యాకరణ సూత్రం ఇక్కడ వర్తించదు. ఎలాగూ ఈ విషయం లో చర్చకు వచ్చేను కనుక మరో విషయం చెబుతాను వినండి. గౌరవ పూర్వకంగా శాస్త్రులు గారనీ, చయనులు గారనీ పిలవడం ఉంది కాని ఇక్కడ లు బహువచన ప్రత్యయం కాదు.శాస్త్రం చదివిన వాడు శాస్త్రి,చయనం చేసిన వాడు చయని అవుతారు కాని శాస్త్రులూ చయనులూ అవరు.ఇది వ్యాకరణ దోషం క్రిందే లేక్క. కాని నా బోటి సామాన్యుడే కాదు, పండితులు కూడా ఇలాగే వ్యవహరిస్తారు.వ్యవహార బలం అటువంటిది.వాటిని బట్టి వ్యాకరణాలు తిరగ వ్రాసుకోవాల్సి ఉంటుంది. మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విమర్శలను వినమ్రంగా ఆహ్వానిస్తున్నానని తెలుపుకుంటున్నాను.

కథా మంజరి చెప్పారు...

నిజమే. అప్ప అనే పదానికి తల్లి, తండ్రి అనే అర్ధాలూ. అన్న అక్క అనే అర్ధాలూ కూడా ఉన్నాయి.ఈ తద్భవ విశేష్య పదం అప్ప , అప్పడు అని స్త్రీ పురుష వాచకాలుగా వాడుతూ ఉండడం తెలిసినదే. అలాంటప్పుడు ముందు అప్పడు అనే పదమే కాల క్రమంలో డు వర్ణం లుప్తమై అప్ప అనే రూపంలో మిగిలిందని మీరు పేర్కొనడం సరికాద అనేదే నా వాదం.ఈ డువర్ణం వచ్చి చేరినదే కానీ, కాలక్రమంలో జారి పోయినది కాదన్నది మనం గమనించాలి. ఏమయినా భాషా వేత్తలు ఎవరయినా దీనిని వివరించాలి.
ఇక, మూర్తిలు, శాస్త్రిలు అనే రూపాల విషయంలో మీరు అనవసరంగా పట్టుదలకు పోయి అవే సరైన రూపాలు అని చెప్పడం సబవుగా లేదు. నామవాచక శబ్దాలకు ఈ సూత్రం వర్తించదని తేల్చేయడం చాలా విడ్డూరంగా ఉంది. మన వ్యాకరణ సూత్రాలు వీలయినతంవరూ ఎలాంటి అతి వ్యాప్తి, అవ్యాప్తి దోషాలకూ తావు లేకుండా సూత్రీకరిస్తారు. కనీసం అపవాదు లేమయినా ఉంటే సూత్ర వివరనలలో, కార్తికలలో వివరించడం కద్దు. ఈ సూత్రం నామ వాచక శబ్దాలకు వర్తించదు అని వ్యాకణ వేత్తలు ఎక్కడా చెప్ప లేదు. మరి మీరు ఇది నామవాచకాలకు లేదా, వ్యక్తి నామాలకు వర్తించదు అని ఏ ఆధారంతో చెబుతున్నారో తెలియదు. అది సరే, సరప్వతి , పార్వతి మొదలయిన నామవాచక శబ్దాలు బహువచన రూపంలో సరస్వతులు, పార్వతులు అని శిష్ఠ రూపంలో ఉండడం మీ గమనికకు ఎందుకు రాలేదో తెలియదు. సరస్వతిలు, పార్వతిలు అనే అపభ్రంశ రూపాలలో ఉండవు. అలా ఉండడమే మీకు సమ్మత మయితే చేసేదేమీ లేదు.వ్యవమార బలం గురించా చెప్పారు. శాస్త్రులూ, చయనులూ అని అనరు. అవి వ్యాకరణ దోషాలు అనడం దుస్సాహసం. మీకు మాత్రమే అవి వ్యాకరణ దోష రూపాలుగా కనిపించడం విడ్డూరం. శాస్త్రిలు లాగే చయనిలు అని రాయాలనిపిస్తే అలాగే రాసు కోండి.

www.apuroopam.blogspot.com చెప్పారు...

పంజో గారికి, అప్ప స్త్రీ వాచకం అని మీరు వ్రాసేరు. అది సరైన అవగాహన కాదనీ అప్పఅనేది స్త్రీ పురుషులిద్దరికీ వర్తిస్తుందనే నేను చెప్పినది. వ్యవహారంలో గందరగోళం లేకుండా ఉండడానికి పురుషులను అప్పడు అని వ్యవహరించడం మొదలైందనే నేను చెప్పేను.ఇది ఉత్తరాంధ్రలో ఇంకా నిలిచి ఉండగా సీమ ప్రాంతంలో ఒకనాడు వాడుక లో ఉండి నేడు వాడుక లో జారి పోయిందనీ నేను అన్నాను. దానికి ఋజువుగా అన్నమయ్య కీర్తన చూపించాను.ఈ కాలం లో అప్పడు అని కాకుండా అప్ప అనే వాడుతున్నారనడానికి సీమ వాసులు తండ్రిని అప్ప అని పిలవడం మగవారికి అప్ప అని చేర్చడం నిదర్శనాలు.ఇది ఈ ప్రాంతంలో వాడుకలో ఉన్న అప్పడులో ఢు వర్ణం జారిపోవడం కాదా?
మరేమిటి?
వ్యక్తి నామాలకు మీరు చెప్పిన వ్యాకరణ సూత్రం వర్తించదని ఎందుకు చెప్పానంటే వ్యక్తి నామాల్ని ఉన్నదున్నట్టగా వ్రాయాల్సి ఉంటుందనే. వాటిలో సంధులు చేయడం లోక వ్యవహారంలో లేదు. ఉదాహరణకి గౌరి+అడిగెను= గౌరడిగెను, కుమారి+ఉన్నది=కుమారున్నది అని సంధులు చేయడం ఎంత విడ్డూరంగా ఉంటుందో మీరే గ్రహించగలరు.భాషాభిజ్ఞులెవరైనా ఇది సరి కాదని చెబితే సరిదిద్దుకోవడానికి నాకు నామోషీ ఏమీ లేదు.