.
తెలుగు సాహిత్యంలో వందేళ్లకు పైగా సాహిత్యాభిమానుల్నందరినీ అలరిస్తూ చిరంజీవిగా వర్ధిల్లుతున్న ఏకైక సాంఘిక నాటకం మహాకవి గురజాడ రచించిన కన్యాశుల్కం. ఇది ప్రధానంగా ఆనాటి బ్రాహ్మణ సమాజంలో నెలకొన్న (పసిప్రాయపు బాలల్ని కాసులకోసం పండుముసలి వారికి వివాహం పేరుతో అమ్ముకునే) ఒక దురాచారాన్ని అవహేళన చేస్తూ సమాజాన్ని మేలుకొలపడమే ధ్యేయంగా కలిగినదే అయినా ఆ ఒక్క దానికోసమే అయితే మహాకవి ఇంతటి బృహన్నాటకాన్ని వ్రాసి ఉండడు. వీరేశలింగం పంతులుగారు వ్రాసిన బ్రహ్మ వివాహం వంటి ఏ చిన్న ప్రహసనాన్నో వ్రాసి సరి పెట్టుకునేవాడు. ఆయన ఆశయం వేరే ఉంది. అది నాటి సమాజ సమగ్ర జీవన చిత్రణ. అందుకే లెక్కలేనన్ని పాత్రలూ సన్నివేశాలున్నూ. కన్యాశుల్కం మొదటికూర్పు పీఠిక లో ఈ విషయాన్ని ఆయనే స్పష్టంగా చెప్పాడు. ఈ నాటక రచనలో తాను హాస్యం, పాత్రల చిత్రీకరణ, జటిలమైనఒక కొత్త సంవిధానం కోసం ప్రయత్నించాననీ ఈ విషయంలో తానెంత వరకూ కృతకృత్యుడనయ్యిందీ ప్రజలే నిర్ణయించాలనీ అన్నాడు. ఈ సదాశయంతో వ్రాసిన నాటకం కనుకనే నాటకం పురోగతికి పెద్దగా ఉపయోగ పడని సన్నివేశాల్ని కూడా నాటకంలో చేర్చాడు. అలాంటి వాటిల్లో రామప్ప పంతులింట్లో లేనప్పుడు మధురవాణి నలుగురితో కలిసి పేకాడడం ఒకటి.
పేకాట సీనునే ఎందుకెన్నుకున్నాడయ్యా అంటే నాటికీ నేటికీ ఆంధ్రదేశంలో పేకాట లేని ఊరంటూ లేదు. పేకాటంటే ఒళ్లు మరచి పోయే జనం కో కొల్లలు. పేకాటరాయుళ్ళు ఏపాటి కొద్ది జాగా దొరికినా చాప పరచుకుని సెటిలయిపోతారు. రాత్రీ పగలూ అనిలేదు. కరెంటు లేకపోతే బుడ్డి దీపాల దగ్గర కూడా కూర్చునిఆడతారు. వీరు ఆడే తీరు వారి సెంటిమెంట్లు బహు తమాషాగా ఉంటాయి. మాఆఫీసులో కొంతమంది ఠంచనుగా ఐదు కొట్టగానే ఉరుకులు పడుతూ క్లబ్బువైపు పరుగులు తీసే వారు, క్లబ్బులో సీటెక్కడ దొరకదో అని. వీరిలో కొందరివి ఐరన్ లెగ్గులయితే కొందరివి గోల్డెన్ హాండ్సట. అంటే కొంతమంది ఎప్పుడూ ఓడి పోతూనే ఉంటారని కొంతమంది ఎప్పుడూ గెలుస్తూనే ఉంటారని. (మనకి తెలీదు కాని ధర్మరాజుగారిది ఐరన్ లెగ్గే అయిఉంటుంది). ఈ పేకాటలో మజా ఏమిటో కాని డబ్బు పోతున్నకొద్దీ ఆట ఆడాలనే పట్టుదల పెరిగి పోతూ ఉంటుంది. ( పారేసుకున్న చోటే వెతుక్కో మన్నారు కదా?). మాచిన్నప్పుడు మాయింటి వీధి వరండాలో మా వాళ్లు కొంత మంది పేకాట ఆడుతుండే వారు. వారిలో ఒక ఎలిమెంటరీ స్కూలు టీచరు ఒకాయన ఉండే వాడు. ఆయన పంచిన పద మూడు ముక్కల్నీ ఏనాడు పేర్చి పట్టుకోగా నేను చూడలేదు. కొంత సేపయాక ముక్కల్ని కింద బోర్లించి ఉంచి వాటిని తెరిచి చూడకుండానే ఆట ఆడేవాడు. అంటే తన దగ్గర ఏ ఏ ముక్కలున్నాయో ఏ కార్డు వస్తే ఆట అవుతుందో ఆయన మనస్సులో రికార్డు అయి ఉంటుందన్న మాట. ఇది కూడా ఒక ప్రజ్ఞే కదా.
సరే. కులగోత్రాలు సినిమాలో అయయో..చేతిలో డబ్బులు పోయెనే .. పెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమై పోయిందే.. అని రేలంగి పాడిన పాట అంత పాప్యులర్ కావడానికి కారణం ఆంధ్రులందరికీ అటువంటి సన్నివేశాలు సుపరిచితంకావడమే.
“ఎక్స్టెన్షన్ రాక ఎకరాలమ్ముకున్నా”డన్న సామెత ఇలాంటి చోట పుట్టిందే. పేకాట ఆకర్షణ ఎలాంటిదో చెప్పే ఈ జోక్ చూడండి.. ఒకసారి ఓ పూరి గుడిసె లోకూర్చుని కొంత మంది పేకాడుతుంటే ఆ గుడిసెకు నిప్పంటుకుందట. ఆటగాళ్లకు వంటిమీద తెలివి లేక పోవడంతో ఈ విషయం గ్రహించ లేదు. సరికదా వాళ్లని హెచ్చరించడానికి లోపలికి వెళ్లిన ఆసామీ ఆడుతున్నాయన ముక్కల్ని చూసి ఆకార్డు కొట్టకూడదంటూ వారితో మాటల్లో పడి తను వెళ్లిన వైనం మరిచాడట. అయ్యా అలాగుంటుంది పేకాట మజా. మరో పేకాట రాయుడు తండ్రి పోయాడని కబురొస్తే ఇట్నించే తీసుకెళ్తారు కదా అన్నాడట పేకాట లోంచి లేవకుండా. సందర్భం వచ్చింది కనుక మరో జోక్—
ఒకావిడ తమ పక్కింటావిడతో రాత్రి మా యింటిలో దొంగ దూరాడండీ అని వాపోతే అవునండీ రాత్రి ఎవరో రావడం నేను చూసేను అందిటావిడ. మరి మాకు చెప్పలేదేం అని అడిగితే, ఏమో బనీను డ్రాయరుతో గోడ దూకి వస్తుంటే మీ ఆయనే క్లబ్బునుంచి తిరిగి వస్తున్నారు కాబోలనుకున్నానందిట పక్కింటావిడ. ఇలాగుంటాయి పేకాటరాయుళ్ల కబుర్లు. ఇలాంటి జోకులెన్నయినా ఉన్నాయి. పేకాటతో ఇళ్లు గుల్లలైన వైనం, అమీరులు బికారులైనవైనం ఆంధ్రదేశానికి తెలియనివి కావు. ఇందు చేతనే నిడివి గురించి పట్టించుకోకుండా, తన నాటకంలో పేకాట సీను ఉండితీరాలనుకున్నాడు గురజాడ. ఈ పేకాట సీనునీ అక్కడి పాత్రల్నీ వాటి సెంటిమెంట్లనీ గురజాడ చిత్రించిన తీరు ఒకసారి ముచ్చటించుకుందాము. (ఇక్కడో చిన్న ఇబ్బంది ఉంది. ఈ సీన్లో వాళ్లు ఆడే ఆట పేరు ఎత్తడం..లేక ..హెత్తురఫు. దీనిని ఉత్తరాంధ్రలో ఈ పేరుతోనే పిలిచేవారు, కొన్ని చోట్ల దీనిని బేస్తు కుదేలు అంటారని తెలిసింది. ఏ మయితేనేం ఈ ఆట ఇప్పుడు ఆంధ్రదేశంలో ఎక్కడా ఆడుతున్నట్టులేదు. ఆంధ్ర దేశంలో యాభయ్యవ దశకంలో అవతరించి విస్తరించిన రమ్మీ మహమ్మారి దీనిని పూర్తిగా తుడిచి పెట్టింది. ఈ ఆట ఆడే తీరు తెలికపోతే ఈ సీను అందాన్ని పూర్తిగా ఆస్వాదించడం కష్టం. ఒకట్లు రెళ్లు అంటూ వాళ్లు మాట్లాడుకునే మాటలు అర్థం కావు. ఈ ఆటని చిన్నప్పుడు చూసిన వాడిని కనుక నాకు గుర్తున్నంత మట్టుకు ఆ విధానం గురించి చివర్లో తెలియజేస్తున్నాను. ఆసక్తి ఉన్న వారు చదువుకో వచ్చు). ఆట తీరు జోలికి పోకుండా ఒకటి రెండు ముచ్చట్లు మనవి చేస్తాను.
ఈ సీన్లో పేకాట ఆడకుండా ఊరికే చూస్తూ కూర్చున్న పూజారి గవరయ్య మధుర వాణి మీద ఆశు కవిత్వం చెబుతానంటూ ఈ క్రింది పద్యం చదువుతాడు:
రాణా, డైమను రాణీ?
రాణా, యిస్పేటు రాణి? రాణి కళావ
ఱ్ఱాణా ఆఠీన్రాణీ?
రాణియనన్మధుర వాణె, రాజుల రాణీ !
ఎంత చక్కటి పద్యం! కవి అల్లసాని పెద్దన.. అనే తెనాలి వాని పద్యం గుర్తుకు రావడం లేదూ? మధుర వాణి పాత్ర మీద తనకున్న మోజుని మహాకవి ఇలా బహిర్గతం చేసాడేమోనని పిస్తుంది.
( నాటకంలో మధురవాణి పాత్ర రూపు దిద్దుకుంటున్నతీరు చూస్తుంటే ఆ పాత్ర మీద తనకి వ్యామోహం ( Fascination ) పెరిగి పోతోందని తన మిత్రునికి వ్రాసిన లేఖలో గురజాడే పేర్కొన్నాడు.) ఈ పద్యం వింటూనే పోలిశెట్టి, గవరయ్య మధుర వాణి దగ్గర రాణీ ఉందని ఈ రకంగా చెప్పేశాడని గగ్గోలు పెడతాడు. పోనీ నీ మీదా ఒక పద్యం చెబుతానంటూ ప్రారంభించేసరికి ఒద్దొద్దు.. పాసం బెట్టి సంపేస్తావా ఏటి? నేను గెలిస్తే కాండబ్బు ఇస్తానూరుకోమంటాడు. ఇక్కడ పోలిశెట్టి అమాయకత్వం భయమే కాకుండా ఆ రోజుల్లో బ్రాహ్మణుల వాక్శుధ్ధి మీద ఇతరులకుండే నమ్మకాన్ని సూచిస్తాడు కవి. గవరయ్య ముణుకు తన దగ్గర పెట్టి కూర్చున్నాడని సణుగుతాడు. పేకాట ఆడే వాళ్లకి చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ఎవరైనా పక్కన ముణుకు మీద చెయ్యి ఆన్చి కూర్చుంటే ఆట కలిసి రాదనే ఒక నమ్మకం. ఏదైనా ఒక ఆట గెలిస్తే ఆ కూర్చున్న భంగిమ మారిస్తే అదృష్టం పోతుందని కదలకుండా అలాగే కూర్చుని ఆడతారు.
( నాటకంలో మధురవాణి పాత్ర రూపు దిద్దుకుంటున్నతీరు చూస్తుంటే ఆ పాత్ర మీద తనకి వ్యామోహం ( Fascination ) పెరిగి పోతోందని తన మిత్రునికి వ్రాసిన లేఖలో గురజాడే పేర్కొన్నాడు.) ఈ పద్యం వింటూనే పోలిశెట్టి, గవరయ్య మధుర వాణి దగ్గర రాణీ ఉందని ఈ రకంగా చెప్పేశాడని గగ్గోలు పెడతాడు. పోనీ నీ మీదా ఒక పద్యం చెబుతానంటూ ప్రారంభించేసరికి ఒద్దొద్దు.. పాసం బెట్టి సంపేస్తావా ఏటి? నేను గెలిస్తే కాండబ్బు ఇస్తానూరుకోమంటాడు. ఇక్కడ పోలిశెట్టి అమాయకత్వం భయమే కాకుండా ఆ రోజుల్లో బ్రాహ్మణుల వాక్శుధ్ధి మీద ఇతరులకుండే నమ్మకాన్ని సూచిస్తాడు కవి. గవరయ్య ముణుకు తన దగ్గర పెట్టి కూర్చున్నాడని సణుగుతాడు. పేకాట ఆడే వాళ్లకి చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ఎవరైనా పక్కన ముణుకు మీద చెయ్యి ఆన్చి కూర్చుంటే ఆట కలిసి రాదనే ఒక నమ్మకం. ఏదైనా ఒక ఆట గెలిస్తే ఆ కూర్చున్న భంగిమ మారిస్తే అదృష్టం పోతుందని కదలకుండా అలాగే కూర్చుని ఆడతారు.
మరోచోట గవరయ్య ముక్కల మీద కన్నేసి సిల్లంగెట్టేస్తున్నాడంటాడు. సిల్లంగి లేక చిల్లంగి అంటే బాణామతి లాంటిదన్నమాట. నరశింహ నీ దివ్య నామ మంత్రము చేత అనే ప్రార్థనని తన యాసలో పాడుకుంటూ ఉంటాడు. భుక్తది ఇనప చెయ్యనీ బులబులాగ్గా కలుపుతున్నాడనీ బొమ్మల్లాంతరేశాడనీ. ( బొమ్మల్లాంతరంటే అన్నీ పొల్లు ముక్కలేనని) ఇలా ఏదో గొణుగుతూనే ఉంటాడు. సిధ్ధాంతి ఆట కలిపేస్తానని బెదిరిస్తే నోరు మూసుకుంటాడు. పేకాట ఆడే వారి తీరుని ఎంతో నిశితంగా పరిశీలించిన వారు కాని ఈ విషయాలు రాయలేరు.
ఆఖరుగా ఒక్క ముచ్చట చెప్పి ముగిస్తాను. రామప్ప పంతులొస్తున్నాడని అటక మీద దాగోమంటే తాను “జారి పడితే యేటి సాదనం” అని పోలిశెట్టి భయం వ్యక్తం చేస్తే సిధ్ధాంతి “ నీ కొడుకుది అదృష్టం” అనడం ఎవరికైనా నవ్వు తెప్పిస్తుంది. (పోలిశెట్టికి తప్ప).
నాటక పురోగతికి అవసరం లేని ఈ సీనుని గురజాడ తాను కోరుకున్న సమాజ చిత్రణకీ హాస్యం పండించడానికే వ్రాసేడని అందులో కృతకృత్యుడయ్యేడనీ నానమ్మకం. ఇలాంటిదే అయిన సారాయంగడి సీను గురించి మరో సారి ముచ్చటిస్తాను.
సెలవు.
బేస్తు కుదేలు,, లేక ఎత్తడం.. అనే ఆట ఆడే విధానం:
ఈ ఆటలో తురుఫు (Trump) జాకీ అన్నిటి కన్నా పెద్దది. దాని తర్వాత తురుఫు మణేలా.( తొమ్మిదిని మణేలా అంటారు). వాటి తర్వాత ఆసు, రాజు, రాణి, పది, ఎనిమిది, ఏడు, ఆరు..ఇలా.. తురుఫు కాని రంగుల్లో మామూలు గానే ఆసు రాజు రాణీ అలా వరుసలో వాటి విలువ ఉంటుంది. నలుగురే ఆడినప్పుడు మిగిలిన చిన్న ముక్కలని పేకలోంచి తీసేస్తారు. ఆట పంచిన వారు నలుగురికీ నాలుగేసి ముక్కలు పంచి మరోనాలుగు ముక్కలు మధ్యలో మూసి ఉంచుతారు, ఆట మొదలవగానే చేతివరస ఆసామీ( First Hand)కి తురపు చెప్పే అవకాశం మొదట వస్తుంది. ఆయన ఆట బాగా లేక పోతే ఒకటి అంటాడు( అంటే Pass On అన్న మాట). ఆ తర్వాత కూర్చున్న వ్యక్తికి అవకాశం వస్తుంది.. అతడూ తురఫు చెప్పలేక పోతే ఆయనా ఒకటి అంటూ Pass on ఛేస్తాడు. మిగిలిన వాళ్లకి వారి వరుసలో అవకాశం వస్తుంది. నలుగురూ ఒకట్లు అన్న తర్వాత రెండో రౌండు ప్రారంభం అవుతుంది. ఈ సారి కూడా ఆట లేకపోతే చేతి వరస ఆటగాడు రెండు అంటూ Pass On ఛేస్తాడు. తురఫు చెప్పలేని వారందరూ రెండు అంటూ ఉంటారు. ఇలా రెండో రౌండ్ లో కూడా ఎవరూ తురఫు చేప్పలేకపోతే కింద నాలుగు ముక్కలూ చేతివరస ఆసామీ కిచ్చి మిగిలిన వారికి కూడా నాలుగేసి ముక్కలు పంచుతారు. అంటే మూడోరౌండు ప్రారంభమవుతుందన్నమాట. ఈసారి తురఫు చెప్పే వారు ఎనిమిది ముక్కలూ చూసి తురఫు చెప్పవచ్చును. ఎవరూ తురఫు చెప్పకపోతే ఆట కలిపేసి మళ్లా ముక్కలు పంచుతారు. మొదటి రెండు రౌండ్లలో ఎవరైనా తురపు చెప్తే వాళ్లు కిందనున్న నాలుగు ముక్కలూ తీసుకుని ఆడతారు, మిగిలిన వారికి పేకలోని ముక్కలు నాలుగేసిచొప్పున పంచుతారు. ఒకొక్కఆటగాడి దగ్గరా ఎనిమిదేసి ముక్కలు ఉంటాయి కనుక మొత్తం ఎనిమిది పట్లు అవుతాయి. తురఫు చెప్పిన ఆసామీ ఒక్కడూ ఒకవైపు మిగిలిన వారంతా ఒక టీము అవుతారు. ఆటలో తురపు ముక్కలకి మిగిలిన వాటన్నిటికంటె ఎక్కువ విలువ ఉంటుంది. అంటే తురుఫులో చిన్న ముక్క అయినా వేరే కలరు ఆసు కంటేకూడా పెద్దదన్నమాట. ఈ ఆటలో తురపు చెప్పిన ఆసామీకి మిగిలిన వారందరికంటె ఎక్కువ పట్లు రావాలి. వస్తే గెలిచినట్లు. లేకపోతే ఓడిపోయినట్లు. తురఫు చెప్పిన ఆసామీ గెలిస్తే అందరూ డబ్బులిస్తారు. ఆయన ఓడిపోతే బేస్తు పెడతాడు. అంటే కొంత సొమ్ము డిపాజిట్ చేస్తాడన్నమాట. ఆ తరువాతి ఆటలో గెలిచిన వారు ఈ సొమ్ముకూడా తీసుకుంటారు. అప్పుడు తురఫు చెప్పిన ఆసామీ ఓడిపోతే మళ్లా బేస్తు పెడతాడు. ఆతరువాతి ఆటలో తురుఫు చెప్పిన ఆసామీ గెలిస్తే రెండు బేస్తుల డబ్బులూ తానే తీసుకుంటాడు. అలాగ కాకుండా ఓడిపోతే ఆయన ఇచ్చే డబ్బులతో కలిపి మిగిలిన అందరూ పంచుకుంటారు. దీనినే కుదేలు అంటారు. ఈ ఆట పూర్తిగా జూదంలా కాకుండా ఆటగాళ్ల నైపుణ్యం మీద కూడా ఆధార పడి ఉంటుంది. ఎవరేం ముక్కలేస్తున్నారో ఎన్ని తురఫులయ్యేయో ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయో అవి ఎవరి దగ్గర ఉండవచ్చో అన్ని విషయాలూ జాగ్రత్తగా గమనిస్తూ ఆడాలి. తురుఫు చెప్పిన వాడు గెల్చుకోకుండా మిగిలిన వారందరూ ఒక టీం లాగా ఆడాలి. ఏ ఒక్కరు తప్పు ఆడినా మిగిలిన వారు అతడ్ని తిడతారు. ఈ ఆట ఎలా ఆడతారో తెలిసింది కనుక ఇప్పుడు నాటకంలో సీను చదివితే ఆ పాత్రలు మాట్లాడిన మాటలు అర్థం అవుతాయి. ఏదో జ్ఞాపకం ఉన్నంత మట్టుకు చెప్పాను. తప్పులుంటే ఉండ వచ్చు. అయితే నాటకం లో సీను చదువుకోవడానికి అవేమీ అడ్డం కావు. ( అంతరించిన జాతుల్లోకి చేరి పోయిన ఈ ఆట గురించి తెలుసు కోవలసిన అగత్యం ఇప్పుడెవరికీ లేదు.)
_____
8 కామెంట్లు:
కులగోత్రాలు సినిమాలో అయయో..చేతిలో డబ్బులు పోయెనే .. పెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమై పోయిందే.. అని రేలంగి పాడిన పాట అంత పాప్యులర్ కావడానికి కారణం ఆంధ్రులందరికీ అటువంటి సన్నివేశాలు సుపరిచితంకావడమే.
It is Ramana Reddy and not Relangi!
Andhramanగారికి స్పందనకు కృతజ్ఞతలు.రేలంగి అని రాయడం నా పొరపాటు కావచ్చు.అయితే ఎవరు పాడేరన్నది ముఖ్యం కాదు కనుక నేను Check చేసుకో లేదు.అయినా తప్పు దొర్లినందుకు చింతిస్తున్నాను
చాలాబావుంది మాస్టారూ.
ఇప్పటి సంగతి అసలు రమ్మీ అయినా ఆడే తీరుబాటు ఎవరికన్నా ఉందా అని :)
మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఇది కూడా ఆడేవాళ్ళం.
అమెరికా సంగతి నాకు తెలీదు.అక్కడ కేసినో లన్నీ కళకళలాడుతూ ఉంటాయని విన్నాను.(అక్కడ వేరే జూదం ఆడుతారనుకుంటాను).ఇక్కడ సాఫ్ట్ వేర్ రంగం లో ఉన్న యువకులకి టైమ్ ఉండక పోవచ్చును కానీ మిగిలిన వారితో క్లబ్బులన్నీ ఫుల్లే. మీ స్పందనకి కృతజ్ఞతలు.
ఇక్కడ కెసీనోలో జరిగే ముక్కల జూదంలో black jack, poker ఉంటాయి. పోకర్ అయితే జనాలు పార్టీలు చేసుకున్నప్పుడు కూడా ఆడుతుంటారు.
ఆర్యా, మీరు ఎత్తడం ఆటని తప్పుగా చెప్పారు. అందులో ఆసు, రాజు, రాణీ, జాకీ, పది.... నుండి రెండు వరకూ ఇదే వరుసలొ Descending orderలో విలువైనవి. అతి చిన్నదైన రెండు అయినా తురుపు అయితే అది మిగతా మూడు ఆసులకన్నా కూడా పెద్దదే. జాకీ,మణేలా,ఆసు,అని మీరుచెప్పిన వరుస ఆటను "అడ్డాట" అంటారు. ఈ క్రమంలో మీరు చెప్పిన "ఎత్తడం" విధానంలోకూడా కొంత తేడా ఉంది. ఈ ఆట నేను చిన్నప్పుడు విస్తృతంగా ఆడిన వాడిని గనక చెప్పగలను.
ఆడే విధానం, ఎన్ని ముక్కలుండాలి, గెలుపంటే ఏమిటి?:
ఎత్తడం ఆటలో నలుగురు ఆడితే ఆసునుండి ఆరువరకు ముక్కలు ఉంచి మిగతావి వదిలేస్తారు.5గురు ఆడితే ఆసునుండి 4దాకా ఉంచుతారు. 6మంది ఆడితే 52 ముక్కలూ కలుపుతారు. [ఇది ముగ్గురితోకూడ ఆడొచ్చు కాని అప్పుడు మనిషికి పదిచొప్పున పంచి క్రింద నాలుగు ఉంచుతారు. కనుక నల్ల6లు(కళావరు, ఇస్పేటు 6లు)తీసేస్తారు. ఎరుపురంగువి 9తురుఫులూ, నలుపువి 8తురుఫులూ ఉంటాయి.] 8 ముక్కలు పంచినపుడు ఆట గెలవడానికి 5పట్లు రావలసి ఉంటే, ముగ్గురు ఆడుతున్నప్పుడు, ఆట గెలవడానికి 7పట్లు రావాలి. 5పట్లు రావలసిన చోట 4 పట్లు వస్తే అది బేస్తు. 3 గాని అంతకంటే తక్కువగాని వస్తే దాన్ని కుదేలు అంటారు. 7 రావలసిన చోట 6 వస్తే బేస్తు,5గాని అంతకు తక్కువ వస్తే కుదేలు.
పంపకం: అందరికీ రౌండుకి రెండేసి చొప్పున నాలుగు రౌండ్లలో ఎనిమిది ముక్కలు పంచి, ప్రతి రౌండులోనూ ఎప్పుడో ఒకప్పుడు క్రింద ఒక ముక్క ఉంచి మొత్తం క్రింద నాలుగు ముక్కలు ఉండేలా చూస్తారు. అదే రెండు బేస్తులమీద పంపకం అయితే రౌండుకి ఒక్క ముక్క చొప్పున పంచుతారు.
ఇక ఆట విషయానికివస్తే, మీరు చెప్పినట్టు పంచినవాడి కుడిపక్కఉన్న అతనితో ఆట ప్రారంభం అవుతుంది. దాన్ని చేతివరస అంటారు. ఇది ఒక ఆవృతి ప్రకారం మారుతుంది. ఒక ఆవృతి పూర్తయేసరికి ఆడే వాళ్ళందరికి చేతివరస వస్తుంది. చేతివరస వ్యక్తి తనచేతిలో ఉన్న ముక్కలతోనే 5 పట్లు సాధించగలననుకుంటే, తను ఒకటి అనకుండా, చేతి తురఫు అంటాడు. (మొదటి రౌండ్లో ఎవ్వరూ క్రింద ముక్కలు ఎత్తుకోరు) అలా, ఆడేవాళ్ళెవ్వరూ చేతితురఫు చెప్పకపోతే రెండు ప్రారంభం అవుతుంది. మళ్ళీ చేతివరసవ్యక్తికే మొదటి ఛాన్సు. అప్పుడు అతను రెండు అనకుండా,4 ముక్కలు చేతిలోవి దించేసి, క్రింద 4 ముక్కలూ ఎత్తుకుని, తర్వాత తురఫు చెప్పాలి. రెండవ రౌండు కూడా ఎవ్వరూ ఎత్తుకోక అందరూ రెండు అనేస్తే, మూడవ రౌండు ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మాత్రం చేతివరస వ్యక్తి క్రిందవి ఎత్తుకుని మొత్తం 12 ముక్కలలొ 4 దించి, తర్వాత తురఫు చెబతాడు. ఈ ఆటలో ఎవరు ఆట ఎత్తుకున్నా, మొదటిముక్క వెయ్యవలసింది చేతివరస వ్యక్తే. చేతివరస వ్యక్తికి ఇది ఎంతో లాభదాయకం. అతను అతని ఆటను ప్లాను చేసుకోవచ్చు. తురఫు కాకుండా ఉన్న పెద్దముక్కల వరసని మైరు అంటారు. ఇది తురఫులన్నీ అయిపొతేనే లాభం. అంటే, వాటిమీద కోతపడుతుందన్న భయం ఉండదు కాబట్టి పట్టు గారంటీ. ఇందులో రంగు ఉండగా కోత కొయ్యడం ఉండదు. (అడ్డాటలో అలా చెయ్యవచ్చు).
అడ్డాటలో మీరు చెప్పిన జాకీ మణేలాలు ఉంటాయి. కానీ అందులో క్రిందనుంచి ఎత్తుకోవడం ఉండదు. కనుక 4 గురు ఆడినపుడు ఆసునుంచి 7 వరకు ముక్కలు కలుపుతారు. ఇందులో ఎదురెదురుగా ఉన్నవాళ్ళు ఒక టీము క్రింద లెఖ్క. 6 గురు ఆడితే 2 తప్ప అన్ని ముక్కలూ ఉంటాయి. 1,3,5 ఒక టీము, 246 ఒక టీము. తురఫు జాకీ ముఖవిలువ 20, తురఫు మణేలాకి (అంటే 9 కి) 14 (మిగతా 9 లకి ఏమీ విలువలెదు), ఆసుకి 11, పదికి 10, రాజుకి 3, రాణీకి 2, తురఫుకాని జాకీలకి 1 ఉంటాయి. మిగతా ముక్కలకి ఏ విలువా ఉండదు. మొత్తం విలువ 141. కనుక ఆటగెలవడానికి 72 పాయింట్లు రావాలి.
Teluguanuvaadalu గారికి,ఆటగురించి సరిగా విరించినందుకు ధన్యవాదాలు. నేను నా పోస్టులోనే చెప్పేను. చిన్నప్పుడు చూసిన ఆటనిగుర్తున్నంత మట్టుకు రాస్తున్నానని. ఆట ఆడిన వారు మీ మాటకి ఆడ్డేమిటి? నేనామాత్రమైనా రాయకపోదును. కాని ఆఇటలో వాళ్ళు ఒకట్లు,రెళ్లు అనుకోవడం ఏమిటో కొంతైనా తెలుస్తుందని రాసేను.
ఆట-అడ్డు గురించి చెబుదామనుకుంటే, 'తెలుగు అనువాదాలు' గారు రెండు ఆటల గురించి చెప్పేశారు. మొదటి ఆటని Trump అని పిలుస్తారు. జాకీ, మణేలు ఉండి 6 గురు ఉంటే ఆట-అడ్డు అంటారు.
మొత్తం పట్లు వచ్చాక 'పదులు', 'ఓకులు' లెక్కిస్తారు. జాకీ విలువ 5ఓకులు, మణేలు విలువ 4 ఓకులు, రాజు విలువ 3 ఓకులు, రాణి విలువ 2 ఓకులు. ఆసు, 10 ఒక పది. ఆట చెప్పినపుడు , అడ్డు అన్నపుడు, షరతు , పై షరతు లకు ఇన్ని పదులు , ఇన్ని ఓకులు రావాలని ఉంటుంది. ఇప్పటికీ పల్లెటూర్లలో ఈ ఆటలు ఆడతారు. Trump ఆట చాలా ఎక్కువగా ఆడతారు. పెద్దవాళ్లు చేరినపుడు ఆట - అడ్డు ఎప్పుడైనా సరదాగా పందెం కాసి ఆడతారు. ఈ ఆట ఆడేటప్పుడు పైన ఉండి చూస్తూ చాలా మంది ఉంటారు. చాలా సరదాగా ఉంటుంది ఆట-అడ్డు. ఇంత మంచి ఆటని గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి