26, జనవరి 2012, గురువారం

ఇదేమి లోకం...లోక రీతి కందాలు...



లోకరీతి కందాలు...
దైవమ్మనుకూలింపక
ఏవేళను జరుగదు పని ఎవ్వరికైనా
దైవమ్మనుకూలించిన
ఆవేళనె  అలవడునది  అలవోకంగా 
                        
 అక్కర కలిగిన వేళల
చక్కగ మనచెంత జేరు  చతురులు వారే
అక్కర తీరిన పిమ్మట
లెక్కను జేయరు మనలను లేశమ్మైనన్
                        
తనతప్పుతాను గానక
కనుమని దోషము లితరుల కార్యములందున్
గుణహీనుడు చూపెట్టును
తన పృష్ఠము గాన లేడు తానై యెవడున్                      

అర్థమెపరమార్థంబని
వార్థక్యము మీద పడిన వయసున గూడా
వ్యర్థమగు శ్రమను బొందెడి
మూర్థరహితులుండెదరది మూర్ఖత గాదే                           

చెల్లును తన మాటయె,కొ
త్తల్లుని కత్తింటను,అదిమరి యటులుండంగా
ఇల్లరికపుటల్లుని గతి
ఉల్లమునకు శాంతి లేని ఊడిగమేగా      
                       
హరి యేమి చేసె పుణ్యము
తరుణీమణియైన లక్ష్మి తనదే కాగా
హరునిది పాపంబేమొకొ
గరళము తన కంఠసీమ కాల్చగ దాల్చెన్      
      
పసగల జీతంబుండగ
కొసరుగ లంచంబడుగుచు గొణుగుచుఆపై
రుస రుస లాడెడి అయ్యలు
కసవును మెసవెడి పసులకు  కారే పోటీ    
  
పిల్లికి బిచ్చము పెట్టక
తల్లికి నేమియ్యకుండ  దాచిన దంతా
కొల్లరు లెత్తుకు పోగా
గొల్లున యేడ్చుటె మిగిలెను  గోవింద హరీ              

ఎంతయొ చదువులు చదివి మ
రెంతయొ నేర్చిన మగనికి ఏకాంతమునన్       
వింతగ మతి పోగొట్టగ
కాంతామణి చేయు బోధ కర్టెన్ లెక్చర్                 

నీతులకేమిటి తక్కువ
నేతలు వల్లించుచుంద్రు నిత్యం, కానీ
చేతలలో కనిపించక
రోతను కలిగించునవియె రోజూ మనలో !  

సెలవు.         

20, జనవరి 2012, శుక్రవారం

ఓ మంచికథ.... రాజుగారి బాకీ కథ...


                      
 అబ్బో ఈ ముచ్చట ఇప్పటిది కాదు. సుమారు వంద సంవత్సరాలక్రితం 1918లో జరిగినది. అప్పుడు శ్రీ శాస్త్రిగారు విద్వాన్ పరీక్ష ప్యాసయి విజయనగరం మహారాజావారి కళాశాలలో తెలుగు పండితునిగా ఉద్యోగంలో చేరిన కొత్త రోజులు. ఒక రోజు వారి ఊరు (కాకినాడకి 20 మైళ్లదూరంలో గోదావరి ఒడ్డున ఉన్న) మసక పల్లి నుంచి ఉత్తరం వచ్చింది. రెండు మూడు రోజులు సెలవు పెట్టి రమ్మని. ఆ ఉత్తరం రాసిన వాడు అతనికి షడ్డకుడు (తోడల్లుడు) అయిన బాల్య స్నేహితుడు. ఏదో అవసరం ఉండి ఉండక పోతే ఉత్తరం రాయడని కాలేజీకి మూడు రోజులు సెలవు పెట్టి శాస్త్రి గారు  వారి ఊరికి వెళ్ళారు. వెళ్లగానే ఏమిటి సంగతని అడిగితే ఆ స్నేహితుడు ఎవరో నరస రాజు గారట, ఈవూరి వారే కాని వూరు వదలి పెట్టి 40 సంవత్సరాలవుతుంది. వారు నీ కేదో బాకీ ఉన్నారని ఆవిషయమై పిలిపించమంటే నీకు రాసేను. రేపు పొద్దున్నే ఆయన వస్తారు”అని చెప్పేడు.
ఈ రాజుగారి కథ ఏమిటంటే  ఆయన ఆ ఉళ్లో బాగా గౌరవంగా బ్రతికిన క్షత్రియకుటుంబంలోని వాడు. కుటుంబం ఆర్థికంగా చితికి పోతే అక్కడి బ్రాహ్మణుల వద్ద చేబదుళ్లు తీసుకుంటూ వ్యవసాయం చేసేవాడు. అది కలిసిరాక అప్పుల పాలయ్యాడు. చేసిన అన్ని అప్పులూ లెక్కచూసుకుంటే వెయ్యి పన్నెండు వందలదాకా తేలాయట.ఇక ఆ ఊళ్లో బ్రతక లేక భద్రాచలం దగ్గర ఎక్కడో ఏజెన్సీ ప్రాంతానికి పోయి అక్కడ బ్రతుకు వెళ్లదీస్తూ ఉన్నాడు.ఒకటి రెండేళ్లలో చిల్లర అప్పులన్నీ తీర్చేసినా ప్రోనోట్లు వ్రాసి తీసుకున్న అప్పులు 380 రూపాయలు తేలాయట. అవి తీర్చే స్తోమత ఆయనకు లేకపోయింది. అవి ముగ్గురు బ్రాహ్మణుల దగ్గర తీసుకున్నమొత్తాలు రూ. 250, 50, 80 కి సంబంధించిన 3 ప్రోనోట్లు. అవి కాలదోషం పట్టే రోజులు సమీపించేసరికి , ఏదో కొంత చెల్లు వేయించి కాలదోషం పట్టకుండా చూద్దామనుకున్నా అప్పు తీసుకున్న రాజుగారు ఎక్కడికో వెళ్లి పోవడం చేత కుదరలేదు. అప్పుడు 250, 50 రూపాయలు అప్పులిచ్చిన ఆసాములు ఆ వూళ్లో లౌక్య వ్యవహారాలు తెలిసిన రమణయ్యగారికి ప్రోనోట్లిచ్చి కాకినాడలో దావాలు వేయించ వలసిందిగా కోరారు. ఆయన ఆవిధంగా దావాలు వేయించిన కొద్ది నెలల్లోనే ఒక సారి ట్రైన్లో రాజుగారికి తారస పడడం జరిగింది. మన ఊరివారు నామీద దావాలు తెచ్చారటగా అని రాజుగారు అడిగేసరికి రమణయ్యగారు  అప్పులిచ్చిన వారు కోరగా తానే దావాలు వేయించినట్లు తెలిపాడు. అప్పుడు రాజుగారు మరి  లింగయ్య శాస్త్రుల ప్రోనోటు విషయంలో దావా తేలేదేమని అడిగితే
రమణయ్యగారు చెప్పినదేమిటంటేతాను ప్రోనోట్లగురించి దావాలు తేవడానికి కాకినాడ వెళ్లేటప్పుడే లింగయ్య శాస్త్రులని కూడా కలిసి ప్రోనోటుగురించి గుర్తు చేసాననీ  కాలదోషం పట్టిపోకుండా అది కూడా ఇస్తే  ఒకే సారి దావాలు వేయవచ్చునని అన్నాననీ కాని దానికి శాస్త్రిగారు రాజుగారి కంఠంలో ప్రాణ ముండగా నోటుకు కాలదోషం పట్టటమేమిటని అన్నారనీ తాను దావా వేయదల్చుకో లేదని చేప్పారనీ.
దావాలు వేసిన వారు రాజుగారి దగ్గర ఏమి వసూలు చేసుకోగలిగారో తెలియదు గాని లింగయ్య శాస్త్రులగారి ప్రోనోటు బాకీ లింగయ్య శాస్త్రులు బ్రతికుండగా కాని, వారి కుమారుని జీవిత కాలంలో కాని తీరనే లేదు.అసలా ప్రోనోటు ఉందో లేదో ఉంటే ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలీదు. ఉన్నా ఎప్పుడో కాలదోషం పట్టే ఉంటుంది కదా?  రాజు గారికిప్పుడు 70 ఏళ్లు. తన 30 వ ఏట తీసుకున్న బాకీ ఇది. దానిగురించి మాట్లాడడానికే ఇప్పుడు రాజుగారు వస్తున్నది.
                  మరునాడు ఉదయమే శాస్త్రిగారు వారి దగ్గర బంధువులూ వీధి అరుగు మీద కూర్చుని ఉండగా రాజు గారు వచ్చేరు. కుశల ప్రశ్న లయేక రాజుగారు ఇలాఅన్నారు:
అయ్యా మీతాతగారు లింగయ్యశాస్త్రులుగారూ నేనూ మంచి స్నేహితులం. అవసరమై రెండు సార్లు నలభై రూపాయల చొప్పున మొత్తం ఎనభై రూపాయలు మీ తాతగారి వద్ద చేబదులు పుచ్చుకోవడం జరిగింది. తీర్చే అవకాశం లేక 80 రూపాయలకూ ప్రోనోటు వ్రాసి ఇచ్చేను. నోటైతే వ్రాసి ఇచ్చేనుగాని అది తీర్చడానికి మీ తాతగారి జీవిత కాలంలోగాని మీ నాయనగారి జీవిత కాలంలో గాని నాకు వెసులుబాటు కలుగ లేదు. వయసు మీరి పోతోంది కనుక ఋణగ్రస్తుడిగా పోవడం ఇష్టంలేక వారి వారసులకైనా బాకీ తీర్చేద్దామని ఇక్కడ వాకబు చేస్తే తమరు విజయనగరంలో ఉన్నట్టు తెలిసింది. అదైనా విజయనగరం పోస్టుద్వారా పంపించవచ్చుకదా అంటారేమో? ఆప్త మిత్రులైన లింగయ్య శాస్త్రి గారి మనుమలైన మిమ్మల్ని ఓసారి చూసి, ఏ అరుగు మీదైతే అప్పులు తీసుకుని ఋణపత్రం రాసి ఇచ్చేనో అక్కడే దాన్ని తీర్చి ఋణవిముక్తుణ్ణవుదామనిపించి మీకు లేఖ వ్రాయించాను. శ్రమ అనుకోకుండా తమరు వచ్చేరు. నేను తీసుకున్న అప్పు ఇప్పటికి వడ్డీలతో కలిపి ఎన్ని రెట్లో అయిఉంటుంది. తమరు ఎంత ఇమ్మంటారో చెప్తే దాఖలు చేసుకుంటానని అన్నారు. దానికి శాస్త్రిగారు మీకెంత తోస్తే అంత ఇవ్వండి. నేను ఎక్కువ తక్కువ అనకుండా తీసుకుంటాను అని అన్నారు. రాజుగారు అలా కాదని, శాస్త్రిగారు చెప్పిన మొత్తం ఇచ్చినప్పుడే తాను ఋణవిముక్తుడనౌతానని అన్నారు. వెంటనే శాస్త్రిగారు అయ్యా మీరు మా తాతగారి వద్ద తీసుకున్న ఎనభై రూపాయలూ ఇవ్వండి. చాలు.మీరు ఋణ విముక్తులైనట్లే భావిచండిఅన్నారు.
రాజుగారు పై మీది కండువాలో కట్టిన మూట ముడి విప్పి  తాను తెచ్చిన వెండిరూపాయలు అక్కడ దొంతులుగా పెట్టి స్వీకరించండి అన్నారు. అవి సరిగ్గా 80 రూపాయలే ఉన్నాయి.
శాస్త్రిగారు వాటిని స్వీకరించడంతో రాజుగారు ఋణ విముక్తులయ్యారు.
                                                    *****
అయ్యా, ఇదీ కథ. ఇది నిజంగా జరిగిన కథ. దీనిలో రాజుగారి పూర్తి పేరు శ్రీ కాకర్లపూడి నరసరాజుగారు. శాస్త్రిగారు కళా ప్రపూర్ణ శ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారు. ఈ ఉదంతాన్ని విపులంగా శ్రీ శాస్త్రిగారు తమ స్వీయ చరిత్రలో వ్రాసేరు.
(దానిని శ్రీ రాజాచంద్ర ఫౌండేషన్ 482, శాంతినగర్, కె.టి.రోడ్, తిరుపతి-517507 వారు ప్రచురించేరు. వారికి నా కృతజ్ఞతలు.)
 మాటకి కట్టుబడి ఉండే మహనీయులు ఏ కాలంలోనైనా ఉంటారు. కాకపోతే వారిగురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఈ మంచి కథని మీకందిస్తున్నాను.
మరో సారి మరో మంచి కథతో మీముందుకు వస్తాను. సెలవు.

13, జనవరి 2012, శుక్రవారం

రెండును నొకటియే కదా?....




ఎమెస్కో వారు ప్రచురించిన మను చరిత్ర ప్రబంధానికి పీఠికలో అనుకుంటాను,శ్రీ విశ్వనాథ వారిలా ప్రారంభిస్తారు. మనము ఆంధ్రులము,అనగా తెలుగు వారమురెండును నొకటియే అని. రెండును నొకటియే అయినచో మనమాంధ్రులము అనుట ఏల? అది వారి శైలి.
తెలుగువారము అంటే తేలికగా ఉంటుంది.ఆంధ్రులము అని ఒత్తి పలికితే లేని గంభీరత వస్తుంది. సామాన్యార్థక పదాలలో తేలిక వాటిని వదిలి పెట్టి కొంచెం క్లిష్టోచ్చారణ కలిగినవి వాడడం పండిత లక్షణం. పండితులే కాదు సామాన్యులు కూడా ఇలా చేస్తూంటారు వారి వారి పరిధిలో వారికున్న భాషా జ్ఞానాన్ని నలుగురికీ తెలియజేయాలన్న తపనతో.ఇటువంటి భాషాడంబరాన్నియెద్దేవా చేయడానికే గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో గిరీశం లుబ్దావధాన్లుకి వ్రాసిన ఉత్తరంలో మీరు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుసుకుని సంతోషిస్తున్నాను అనడానికిఅమందానంద కందళిత హృదయారవిందుడనైతినిఅనిపిస్తాడు.
 ఒకటి రెండు ముచ్చట్లు చెబుతాను.నా చిన్నప్పుడు వేసవి సెలవులకి మా తాతగారి ఊరికి వెళ్లినప్పుడు మా దొడ్డమ్మ పిల్లలు కూడా వస్తుండే వారు.ఒక సారి మేము అన్నం తింటున్నప్పుడు మా అమ్మమ్మ ఇంకేం కలుపుకుంటావని నన్నడిగితే మరేమీ వద్దు చల్ల పోయి అన్నాను.నాకప్పుడు ఏడెనిమిదేళ్లుంటాయేమో? నాకంటే ఒక యేడాదే పెద్దవాడయిన మా అన్నయ్య (దొడ్డమ్మ కొడుకు) పగల పడి నవ్వుతూ మా మేన మామలతో చూడండి వీడు మజ్జిగని చల్ల అంటున్నాడు అని వెక్కిరించాడు.నాకప్పుడు దానిలో తప్పేమిటో బోధ పడలేదు. మాయింట్లో మా నాయనమ్మ చల్ల అనే అంటుంది.ఆవిడ వడ్డిస్తే తినే వాళ్లం మేము కూడా అలాగే అనడం నేర్చుకున్నాము. వాడికేం జవాబు చెప్పాలో నా కప్పుడైతే ఏమీ తెలియలేదు, కానీ పెద్ద వాడనయినాక తెలిసింది. చల్ల అనే పదమే తెలుగుదనం ఉట్టిపడుతూ తెలుగునాట విస్తారంగా వాడబడే అచ్చతెలుగు పదమనీ మజ్జిగ అనేది మార్జిక అనే సంస్కృత పదానికి వికృతి అనీ.మజ్జిగకి సంస్కృతంలో మూడు పేర్లు ఉన్నాయట.1.తక్రం 2.ఉదశ్విత్తు
3. మధితం అనీ. తక్రం హ్యుదశ్విన్మథితం పాదాంబర్థాంబు నిర్జలం అని అమరకోశం చెబుతుంది, అంటే పావు వంతునీరుకలిపి చిలికినది తక్రం-సగానికి సగం నీళ్ళు పోసి చిలికినది.ఉదశ్విత్తు అసలే నీరు కలపకుండా చిలికినది మథితం.మథితం ఆరోగ్యానికి మంచిది కాదట.ఉదశ్విత్తు సగం నీరే కనుక రుచిగా ఉండదు.తక్రం రుచికరమూ శ్రేష్టమూను.( మజ్జిగకి పధ్నాలుగు పర్యాయ పదాలున్నాయి మన నిఘంటువుల్లో. మజ్జిగ చేసే విధానాన్ని బట్టి, దాని చిక్కదనాన్ని బట్టి,  ఇలా వేరు వేరు పేర్లతో వ్యవహరింప బడతాయని,అసలు పాలు తోడు పెట్టే విధానం ఏమిటో వివరంగా నవ్య వీక్లీ లో శ్రీ రమణ గారు ఒక సారి రాసేరు.) మన సామెతల్లో చల్లకొచ్చి ముంత దాచడమనే చక్కటి సామెత ఒకటుంది. ఏదో ఉపకారం కోరడానికి వచ్చి,రాగానే అడగడానికి మొహమాటపడి ఆ కబుర్లూ ఈ కబుర్లూ ఆడుతుంటే చల్లకొచ్చి ముంత దాస్తున్నాడంటారు. ఒక పౌరాణిక చిత్రం లో నారదుడు రాక్షసుల చేతుల్లో బాధలు పడుతున్న దేవతల్ని వెంటతీసుకొచ్చి విష్ణుమూర్తిని కాసేపు పొగిడిన తర్వాత  చల్లకొచ్చి ముంత దాచనేల అంటూ అసలు విషయానికొస్తాడు.ఆంధ్ర పత్రికలో ఈ సినిమా రివ్యూ రాస్తూ ముళ్లపూడి ఒక ఆట ఆడుకున్నాడు. నారదుల వారికి పాడిలేదా? చల్లకోసం రోజూ విష్ణుమూర్తి గారింటికి వెళ్లడం రివాజా? దానికోసం ముంత పట్టుకు వెళ్లేవాడా?  అంటూఏమేమో రాసేడు.శాఖా చంక్రమణం (చూసేరా నేనుకూడా ఎలాంటి పదం వాడేనోడొంకతిరుగుడు అని ఉండొచ్చుకదా? ఉహూఁ... నాకు చాలా తెలుగు, సంస్కృతం వచ్చని మీకు తెలియాలిగా?) కాకుండా మరో రెండు ముచ్చట్లు చెప్పి ముగిస్తాను.
మేం హైద్రాబాదు వచ్చిన కొత్తల్లో మా యింట్లో పనిచేసే నడివయసు పని మనిషిని మా ఆవిడ అవ్వా అని పిలిచేది.అదేం అలా పిలుస్తావంటే ఇక్కడ చిన్న పిల్లలయినా పని మనుషులందర్నీ అలానే పిలుస్తారని చెప్పింది. అవ్వ అనే పదం సామాన్యంగా వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీలందరికీ వర్తిస్తుంది. మన భారతంలో ప్రబంధాలలో ఈ పదం అదే అర్థంలో వాడబడింది. తెలంగాణా ప్రాంతంలో ఈ పదం ఇప్పటికీ ఆ అర్థంలోనే వాడుకలో మిగిలి ఉంటే మిగిలిన ఆంధ్ర ప్రాంతంలో వయసుడిగిన స్త్రీ అనే అర్థసంకోచం పొందింది.మరో విషయం ఇక్కడ బాలికల్ని పోరి అని పిలుస్తారు. తెలంగాణేతర ప్రాంతాలలో కుమారి అని వ్యవహరిస్తారు.కానీ నేను చాలా పాతకాలపు శిలాశాశనంలో ఒక రాజకుమారి పేరు వసంతపోరి అని చదివేను.ఇప్పుడు వసంతకుమారి అని పెట్టుకున్నట్లన్నమాట. భాష అనేకానేక కారణాల వల్ల వివిధ ప్రాంతాల్లో వివిధ కాలాల్లో మార్పులకు లోనవుతుంటుంది.మార్పులకి లోనుగాని రూపాలు కొన్ని ప్రాంతాల్లో అలాగే మిగిలి ఉంటాయి. ఒకే అర్ధాన్నిఇచ్చే వేరు వేరు పదాలు వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉంటాయి. అందువల్ల ఏ పదం వాడిన వారినీ మనం సంస్కారహీనులనీ వారి భాషని వెక్కిరించాల్సిన పని లేదు.
 ఇక్కడ చివరిగా మరో ముచ్చట చెప్పి తీరాలి. శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు ఇల్లాలి ముచ్చట్లలో ఒకచోట ఇలా రాస్తారు.మగాళ్లు భోజనాలు చేస్తే ఆడాళ్లు అన్నాలు తింటారని.  తేడా ఏముంది? రెండును నొకటియే కదా?
( మహానుభావులుశ్రీ విశ్వనాథ వారి శైలిని ఓ సారి తల్చుకుందామని వారి పేరుతో మొదలెట్టాను కాని వారికీ ఈవ్యాసం లోని విషయాలకీ ఎంత మాత్రం సంబంధం లేదు.)
బ్లాగ్మిత్రులందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలతో..
మరికొన్ని విషయాలు మరోసారి. సెలవు.

8, జనవరి 2012, ఆదివారం

నీతి కందాలు... ముచ్చటగా... మూడు పుంజీలు





మంచి పనులు తల పెడుతూ
పంచాంగం చూడకండిపనులను ఆరం
భించుడు, వెంటనె, ఏకీ
డెంచక, మంచిదిశుభదిన మేదినమైనా   

జాతక ఫలముల నమ్ముచు
చేతల నుడిగియు మసలెడి చెనటుల దెంతేన్
ధాత్రిని పుట్టుక దండుగ
ధాతయు వారిని క్షమింప దలపడు యెపుడున్           
              
అరకొర యత్నము చేయుచు
దొరకదు ఫలితమ్మటంచు  దురపిల్లకనే
తిరిగి ప్రయత్నము చేసిన
సరగుననే కార్య సిధ్ధి జరుగును సుమ్మీ                   

తలచిన పని నెరవేరగ
వలయును కాస్తంత శ్రధ్ధ పనిలో ఎపుడున్
సులభమ్మిదియని తలచుచు
అలసత్వము పనికిరాదు ఆవంతైనా

ఆలస్యమమృతము  విషం
పాలైనా నిలువజేయ పాడైపోవున్
మేలే ఒనగూరు నెపుడు
కాలం వృధ చేయకున్న కార్యములందున్  
           
నేల విడిచి సాము వలదు
నేలను  కాళ్ళూని యున్న  నిలకడ కలుగున్
గాలిలొ మేడలు కట్టకు
మూలాలను మరచి పోవ ముప్పే కలుగున్      

      
కోరికలే గుర్రాలై
స్వారీ చేస్తేను మీకు శాంతియె శూన్యం
కోరికలు త్రుంచ గలిగెడు
వారికె సుఖశాంతులుండు  వసుధలొ యెపుడున్ 

పరిహాసము కొరకైనను
పరులను బాధించు మాట పలుకక యెపుడున్
ఒరులకు మేలొనగూర్చెడి
నరుడిల నారాయణుండె నమ్ముడు మీరల్             

మరచియు నిన్నటి వెతలను
అరుదెంచని రేపటి భయమది తలపకనే
నరుడుండదగును, వానికె
దొరకును శాంతియు  సుఖములు తోడై రాగన్  
      
నరకము నాకము లనుచును
పరలోకము లేమి లేవు  పరికింపంగా
దొరకును తమ కర్మ ఫలము
నరులకు  ఈ లోక మందె  నమ్ముడు మీరల్ 
      
మంచిగ బ్రతకాలంటే
పెంచుకు తీరాలి మనము ప్రేమలతల్నే
ఇంచుక స్వార్థాన్ని వదలి
పంచుకు తాగాలి మనము  పాలో నీళ్ళో
    
కులమత భేదాలు మరచి
కలిసే ఉండాలి జనము  కష్ట సుఖాల్లో
కలిసుంటే కలదు సుఖం
విలసిల్లును శాంతి అపుడు విశ్వం నిండా                  

(ఈ క్రొత్త సంవత్సరంలో ఇది మొదటి టపా.
బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతోసెలవు.)