26, జనవరి 2012, గురువారం

ఇదేమి లోకం...లోక రీతి కందాలు...లోకరీతి కందాలు...
దైవమ్మనుకూలింపక
ఏవేళను జరుగదు పని ఎవ్వరికైనా
దైవమ్మనుకూలించిన
ఆవేళనె  అలవడునది  అలవోకంగా 
                        
 అక్కర కలిగిన వేళల
చక్కగ మనచెంత జేరు  చతురులు వారే
అక్కర తీరిన పిమ్మట
లెక్కను జేయరు మనలను లేశమ్మైనన్
                        
తనతప్పుతాను గానక
కనుమని దోషము లితరుల కార్యములందున్
గుణహీనుడు చూపెట్టును
తన పృష్ఠము గాన లేడు తానై యెవడున్                      

అర్థమెపరమార్థంబని
వార్థక్యము మీద పడిన వయసున గూడా
వ్యర్థమగు శ్రమను బొందెడి
మూర్థరహితులుండెదరది మూర్ఖత గాదే                           

చెల్లును తన మాటయె,కొ
త్తల్లుని కత్తింటను,అదిమరి యటులుండంగా
ఇల్లరికపుటల్లుని గతి
ఉల్లమునకు శాంతి లేని ఊడిగమేగా      
                       
హరి యేమి చేసె పుణ్యము
తరుణీమణియైన లక్ష్మి తనదే కాగా
హరునిది పాపంబేమొకొ
గరళము తన కంఠసీమ కాల్చగ దాల్చెన్      
      
పసగల జీతంబుండగ
కొసరుగ లంచంబడుగుచు గొణుగుచుఆపై
రుస రుస లాడెడి అయ్యలు
కసవును మెసవెడి పసులకు  కారే పోటీ    
  
పిల్లికి బిచ్చము పెట్టక
తల్లికి నేమియ్యకుండ  దాచిన దంతా
కొల్లరు లెత్తుకు పోగా
గొల్లున యేడ్చుటె మిగిలెను  గోవింద హరీ              

ఎంతయొ చదువులు చదివి మ
రెంతయొ నేర్చిన మగనికి ఏకాంతమునన్       
వింతగ మతి పోగొట్టగ
కాంతామణి చేయు బోధ కర్టెన్ లెక్చర్                 

నీతులకేమిటి తక్కువ
నేతలు వల్లించుచుంద్రు నిత్యం, కానీ
చేతలలో కనిపించక
రోతను కలిగించునవియె రోజూ మనలో !  

సెలవు.         

7 వ్యాఖ్యలు:

'Padmarpita' చెప్పారు...

:-) :-)

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
లోకం తీరును అందమైన కందంలో చక్కగా పొందు పరచారు . చాలా బాగున్నాయి అసలు కందం వ్రాయడ మంటే ఎందుకో నాకూ ఇష్టమే [ ఇంకా బాగా రాదు గానీ ]

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

పద్మార్పితగారికీ రాజేశ్వరిగారికీ కృతజ్ఞతలు.

రాజ్ కుమార్ చెప్పారు...

wow.. చాలా బాగున్నాయండీ.
మీ బ్లాగ్ ఇదే చూడటం..నేను

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

శ్రీ రాజ్ కుమార్ గారికి ధన్యవాదాలు.మీకు వీలైనప్పుడు పాత పోస్ట్ లన్నీ చదవండి. కొన్నైనా మీకు నచ్చవచ్చు.మీ స్పందన నా కలానికి కొత్త ఊపిరి పోస్తుంది కదా?

రాజ్ కుమార్ చెప్పారు...

తప్పకుండా సార్. ఆల్రెడీ కొన్ని చదివాను. నాకు బాగా నచ్చాయ్. ఇకపై మీ బ్లాగ్ ఫాలోవర్ ని ;)

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

Thank you Rajkumarji