7, ఏప్రిల్ 2012, శనివారం

మడీ..తడీ..గోదావరీ..భాషా...సంస్కృతీ...


మన తెలుగు భాష ఎప్పుడైనా మడి కట్టుకుని కూర్చుందా ?
మా చిన్నతనం లో ఎవరింట్లోనయినా శుభకార్యాలకి భోజనాలకి పిలిస్తే భోజనాల సమయానికి మళ్లా వచ్చి వడ్డన లవుతున్నాయి..మడి కట్టుకోండి అని మళ్లీ పిలిచే వారు. అంటే భోజనం చేయడానికి మడి కట్టుకోని వెళ్లాలన్నమాట. అలాంటి సమయాలలోనే కాదు నిత్యం మాయింట్లో మా తాతగారు స్నానంచేసి మడిపంచ కట్టుకోని మా నాయనమ్మ తీసిన గంధం రాసుకుని దాని మీద బొట్టు పెట్టుకున్నాక కాని భోజనానికి కూర్చునే వారు కాదు. మా నాన్నగారూ వారి అన్నదమ్ములూ వగైరా లందరూ పొత్తి పంచలు కట్టుకుంటే మేం పిల్లలందరం  పొత్తిలాగులు తొడుక్కుని భోజనాలకి కూర్చునే వారం. పెద్దవారు పీటలమీద కూర్చుని భోజనం చేస్తే పిల్లలందరం నేలమీదే కూర్చుని విస్తళ్లలో భోజనం చేసే వాళ్లం. భోజనాలయేక ఆకులు తీసి ఎంగిళ్లు ఎత్తి ఆవుపేడతో అలికి శుభ్రం చేసేవారు. అయితే ఈ ఆచారం మా తండ్రుల తరానికే ఆగిపోయింది. ఇంటికి వచ్చాక ఇంట్లో కట్టుకున్న బట్టలతోనే భోజనం చేయడం అలవాటయ్యింది. నేలమీద కూర్చుని బోజనం చేసే వారం కనుక భోజనానంతరం శుధ్ధి చేసే కార్యక్రమంలో మార్పు లేకుండా కొనసాగింది. మా తరం వచ్చే సరికి డైనింగ్ టేబిలు మీద తినడం ప్రారంభమైంది. బయటకు వెళ్లేటప్పుడు వేసుకునే డ్రస్సుతోనే కుర్చీలో కూర్చుని తినడం మొదలైంది. టేబిలు కూడా స్పాంజితో తుడిచి శుభ్రం చేయడమే. మరీ ఈ మధ్య కంచాల్లో అన్నం పెట్టుకుని టీవీ ముందు కూర్చుని తినడం, తిన్నకంచాలను సింకులో వేసేసి చెయ్యి కడిగేసుకోవడం తో సరిపోతోంది. ఈ రోజుల్లో ఎవరింటికి శుభకార్యాలకి వెళ్లినా  బయట తిరిగిన బట్టలతోనే బఫే పధ్ధతిలో ప్లేటుపుచ్చుకుని దానిలో కావలసినది మనమే వేసుకుని తినడం తప్పని సరైంది కదా? మడి కట్టుకుని భోజనం చేయడమన్న ప్రశ్నే లేకుండా పోయింది. మా నాయనమ్మ పొద్దున్నే మడికట్టుకుని వంట ప్రారంభిస్తే మళ్లీ అందరి బోజనాలయేక తాను కూడా మడిగా తినేంత వరకూ మడి పాటించేది. ఈ లోగా ఎప్పుడైనా కాలకృత్యాలకు వెళ్లవలసిన అవసరమొస్తే మళ్లా స్నానం చేసి మడికట్టుకునేది.
ఏది మడి అనే విషయంలో కూడా భిన్నాచారా లున్నాయనిపిస్తోంది. సదా చారపరులైన శ్రీ వైష్ణవుల ఇళ్లల్లో పూర్తి నగ్నంగా ఉండి వంట చేసుకుంటారని విన్నాను. మరి కొందరిళ్లలో తడిబట్టకట్టుకుంటేనే మడి.( మా ఇళ్లలో తద్దినాలు పెట్టినప్పుడు మాత్రం తడి బట్టలతోనే వంటలు చేసే వారు) మరికొందరు ఆచారపరులకి రంగు బట్ట మడికి పనికి రాదట..( ఈ విషయం దాశరధి రంగా చార్య గారి జీవన యానంలో చదివినట్టు గుర్తు. వారింట్లో ఆడవారెవరో  మడిగా ఆరేసిన రంగుచీర కట్టుకుని వడ్డిస్తుంటే వాళ్లఇంటికి  చుట్టంగా వచ్చిన పెద్దావిడ రంగుచీరతో మడేవిటని ఆనాచారమంటూ ఆడిపోసుకుంటుంది.). మరి ఈ నాడు ఏ బ్రాహ్మణుల ఇళ్లల్లో కూడా ఈ మడి ఆచారాలు కొనసాగుతున్నాయని నే ననుకోను.( ఎక్కడో వెయ్యిలో ఒక్కరు కొన్ని కొన్ని సమయాలలో వారికి వీలైన మడి పాటిస్తూ ఉండవచ్చు అది అపవాదమే అవుతుందిగాని సంఘం పాటిస్తున్న సాంప్రదాయం అనిచెప్పలేం.) ఛూసేరా ఎంతలో ఎంత మార్పు?
భోజనాదికాలలోనే కాదు వస్త్ర ధారణ లో కూడా ఎంతో మార్పు వచ్చింది. మా తాతగారు మా నాన్నగారు పంచలే కట్టుకుని మీద చొక్కాతొడుక్కుని ఉత్తరీయం వేసుకునే వారు. అసలు బ్రాహ్మడనేవాడు చొక్కా వేసుకోవడమే అనాచారమట. శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వారి నాన్నగారు తిడతారని చొక్కా తీసుకెళ్లి వీధి చివరకెళ్లాకనే వేసుకునే వారట. మా బాబాయిలూ మేమందరం పంచలేనాడూ కట్టి ఎరగం( ఏదో శాస్త్రవిధులు నిర్వహించినప్పుడు తప్ప). పంచలు కట్టుకోవడం కూడా నేడు చాలా మందికి రాదు. ఆంధ్రుల్లో చాలా కాలం క్రితం స్త్రీలు రవికలే వేసుకునే వారు కారట.ప్రతిష్ఠానపురం (నేటి పైఠాన్) ఆంధ్రుల రాజధాని అయిన తర్వాత తెలుగు వనితలు రవికలు వేసుకోవడం నేర్చుకున్నారట.( ఇప్పటికీ కొంచెంకొన్నాళ్లక్రితంవరకూ చాలా మంది నాయురాళ్లు ఉత్తరాంధ్రప్రాంతంలో రవికలేసుకోకుండా కనపడతారు. చీర కట్టులో కూడా తేడాఉంది. మామూలుగా కుచ్చిళ్లుపోసి కట్టుకుంటే మడికి పనికి రాదు. కాసెపోసి కొంగు వెనక్కిదోపికట్టుకోవాలట.( మావైవు దీనిని అడ్డకట్టుఅనేవారు. మడికావాలంటే ఇలా కట్టుకునే వారు.)
బ్రాహ్మడనేవాడికి క్రాఫింగు పనికిరాదు. ముందువైపు జుట్టు అసలే ఉండరాదు.వెనుకవైపుకొంతజుట్టు పిలకా ఉండితీరాలి. దాశరధి రంగాచార్యగారితండ్రి మరో శ్రీ వైష్ణవుణ్ణి ముందుజుట్టవాడు అంటూ ఆక్షేపిస్తాడు. ఈ రోజుల్లో ఎవరైనా పిలక పెట్టుకుని చొక్కాలేకుండా ఆఫీసులలో పనిచేయగలమా? మన పిల్లలను ఆవిధంగా బడికి పంపగలమా?.
ఇక్కడ ఒక్కవిషయం మననంచేసుకోవలసిఉంటుంది. ఆచారాలు ఏ కాలంలోనూ ఒక్కలాగాలేవు. అనేకానేక మార్పులు వచ్చాయి. ఈ మార్పులన్నీ కూడా మన సాంప్రదాయంలోని భాగంగానే గుర్తించాలి. తప్పదు. ఈ సాంప్రదాయంలో మార్పులు రావడమనేది మన ఆంధ్రులకే కాదు.అన్ని సమాజాలలోనూ జరిగింది. మారుమూలనుండే ఆటవిక సమాజాల్లోకూడా ఎంతో మార్పుకనిపిస్తోంది. ఈ మార్పుని ఎవ్వరూ ఆపలేరు.

                                                                                   ****
మన ఆదికవి నన్నయగారు రాజమహేంద్రవరతీరాన పవిత్రగోదావరిలో స్నాన మాచరించే భారతాంధ్రీకరణ మొదలెట్టారు. అదే ఏరు ఇప్పుడూ రాజమండ్రి ఒడ్డున పారుతూ ఉంది. దానిని గోదావరి అనే పిలుస్తునే ఉన్నాం.  అయితే అప్పటి నీరుఉందా? క్షణ క్షణం కొత్తనీరు పారుతూనే ఉంటుంది.శతాబ్దాల కాలంలో  గోదావరి ఎంతో కొంత తన ప్రవాహ దిశనీ మార్చుకునే ఉంటుంది. అయినా అది గోదావరే కదా? ఇంకో విషయం. గోదావరిలో అనేక ఉపనదులూ పిల్లకాలువలూ వాగులూ వంకలూ వచ్చిచేరాయి. వీటన్నిటి కలయిక వల్లా గోదావరి పరిపుష్టమై జీవనది అయింది.కానీ దానికి నష్టమేమీ కలుగలేదు.వాటివల్ల గోదావరి కలుషితమైపోయిందనీ మైల పడిపోయిందనీ భావించడం తగదు.మనకెప్పటికీ అది పవిత్రమైన దక్షిణగంగ. గోదావరి గోదావరియే.
                                                                                  ****

మన తెలుగు భాష కూడా జీవనది గోదావరి లాంటిదే. ఎన్నో కొండవాగుల్నీ ,పిల్లకాల్వల్నీ,ఉపనదుల్నీ కలుపుకుని తెలుగు నేలపై నదీమతల్లిగా భాసిస్తున్న గోదావరిలానే. మన తెలుగు కూడా శతాబ్దాలకాలంలో మార్పులూ చేర్పులూ పొందుతూ ఈ నాటి ఈ రూపాన్ని సంతరించుకుని ఉన్నాది. నన్నయ కాలంలోని నీళ్లు గోదావరిలో లేనట్లే ఆనాటి తెలుగు కూడా అదే రూపంలో మనకు లేదు. నన్నయనాటి వ్యావహారిక భాషా స్వరూపం ఎలా ఉండేదో మనకు తెలియదు కానీ నన్నయగారి భారతాంధ్రీకరణతో మొదలై మన గ్రాంధిక భాష మాత్రం తత్సమ తద్భవాలతో నిండి పోయి తెలుగు దనాన్ని కోల్పోతూ వచ్చింది.తర్వాత శతాబ్దాల తరబడి మన తెలుగు కవులు తమ ప్రబంధాలలో సుదీర్ఘమైన సంస్కృత సమాసాల్ని గుప్పించడమే గొప్పకవిత్వంగా భావించారు. తేలికైన,అందమైన తెలుగు పదాలు మన కావ్యాల్లో చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇది ఇలా ఉంటే మన తెలుగు వ్యావహారిక భాషను కూడా సంస్కృతం ముంచెత్తింది. తెలుగు వారైన పండితులూ కవులూ చదువంటే సంస్కృతమే చదువనీ తెలుగు ఎందుకూ పనికి రాని భాష అనీ సభ్య భాష కాదనీ నిరాదరించేరు.తెలుగులో కవిత్వంచెయ్యడం పతనమనిన్నీ అప్రతిష్ఠాకరమనీ భావించేరు. తెలుగు కావ్యాలు చదవడం ఒక చదువు కాదనీ  భావించేవారు. అంతే కాదు తెలుగులో పండితులే కాదు సంస్కృతం రాని వారుకూడా సంస్కృతంలోనే త్వం శుంఠ అంటే త్వం శుంఠ అనో కష్టముష్టింపచా అనో తిట్టుకునేవారు. ఇంట్లో ఆడవారితో మాట్లాడి నప్పుడు కూడా వీలైనన్ని సంస్కృత పదాలు వాడేవారు. నెయ్యి అనేవారు కాదట ఆజ్యం అనే అనేవారు.న పెళ్లి అనకూడదట వివాహం అనే అనాలట. మంచినీళ్లు అంటే పామరుడికింద లెక్క. మంచితీర్థం అంటేనే గౌరవం. ఇలాంటి కొన్ని విషయాలు శ్రీపాదవారు తమ అనుభవాలూ జ్ఞాపకాలూ లో గ్రంధస్థం చేసారు.పండితుల్నీ పెద్దల్నీ చూసి పామర జనంకూడా తమదైన శైలిలో ఆ మాటల్ని వాడుకుంటూ ఉంటారనడానికి ఒకటి రెండు మాటలు మచ్చు చూపిస్తాను.
ఇప్పుడు ఎక్కువ మంది తెలుగువారు మజ్జిగ అని వ్యవహరిస్తున్న దానికి అచ్చతెలుగు పదం చల్ల అనేది ఉంది. ధీనిని మాండలికమని శ్రీ బూదరాజువారు అన్నారుకానీ ఆ భావన సరికాదని నేననుకుంటాను. ఎందుకంటే మా ఉత్తరాంధ్రలోనే కాకుండా సుదూర ప్రాంతాల్లో కూడా వినిపించిన మాట ఇది. మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణా అనే పాటలోనూ, శ్రీ నాథ కవి వీధిలో.. చల్లాయంబలి త్రావితిన్ అనే చోట్ల కనిపిస్తుంది. ఇదే కాదు ఖమ్మం జిల్లాలో పుట్టిపెరిగి హైదరాబాదులో నివాసం ఏర్పరచుకున్న దాశరథి రంగాచార్యగారూ తన జీవన యానంలో ఈ పదం వాడేరు. రంగుల కల సినిమా తీసిన బి.నరసింగరావు నిజామాబాదు జిల్లాలో తమకున్నగడీలో వారి అమ్మగారు అందరికీ చల్లపోస్తూ ఉండేవారని వ్రాసేరు.ఇంత వైశాల్యంలో వాడుకలో ఉన్న పదం కనుమరుగై దాని స్థానాన్ని మజ్జిగ అనే తద్భవ పదం ( సంస్కృతపదం మార్జిక) ఆక్రమించుకోడానికి కారణం మన తెలుగు వారికి సంస్కృతం పట్లగలదురభిమానమే. శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగారి తాతగారు వారి నాయనమ్మగారిని ఏ రోజైనా మజ్జిగ పల్చబడ్డదేం అని అడగడానికి తక్రం ఉదశ్విత్తు అయిందేం అని అడిగే వారట. ఛూడండి ఆ భాషా భేషజం.మన పూర్వులైన పండితులందరికీ తెలుగంటే చిన్న చూపు. సంస్కృతమంటే వల్లమాలిన గౌరవం. అది వారి దృష్టిలో దేవభాషే. ( కన్యాశుల్కంలో భోజనాల సమయంలో గిరీశం నోటంట రెండు ఇంగ్లీషు ముక్కలు వచ్చే సరికి అగ్నిహోత్రావధాన్లు అదేమన్నా దేవభాషా అను విసుక్కుంటాడు.సంస్కృతమైతే దేవభాష కనుక తప్పులేదని మనం ఇందాక చూశాం. సంస్కృతం దేవభాష. గీర్వాణం.  సరస్వతీదేవి గీర్వాణి. ఇప్పుడు ఇంగ్లీషు వస్తే ఎంత గొప్పో అప్పుడు సంస్కృతం వస్తే అంత గొప్ప అన్నమాట. మా చిన్నప్పుడు ఎవరైనా టెక్కుచూపిస్తే వాడికెంత గీర్వాణం అనే వారు. అంటే అది టెక్కుకు పర్యాయపదం అయిపోయిందన్నమాట. మా పిల్లలం కూడా తోటి కుర్రాడెవరైనా టెక్కు చూపిస్తే వాడికి మహా గీర అంటూ ఉండేవారం. ఈ గీర అనే పదం గీర్వాణం నుంచి పుట్టినదే.
ఈ సంస్కృత పదాల వాడుక శిష్టులనుంచి గ్రామీణులలోకి ఎలా వ్యాపించిందో చూపిస్తాను చూడండి:
శ్రీ గంటేడగౌరునాయుడు ఉత్తరాంధ్ర పలుకు బళ్లకి పట్టం కడుతూ వ్రాసిన కళింగోర లో నాయురాలు సోములమ్మఒక కష్టమొచ్చినప్పుడు తనకి అరనశరనాలు ఆడలేదంటుంది. ఇవి అరనశరనాలు కావు. కరచరణాలకొచ్చిన తిప్పలు. సంస్కృతంలోంచి దిగుమతిచేసుకుని  శిష్టులెవరో వాడితే వారినుంచి నేర్చుకున్నది. కాళ్లూ చేతులూ ఆడడం లేదన్నది చక్కని తెలుగు నుడికారం.క్లిష్టసమయాల్లో ఏచేయాలో తోచకపోతే కాళ్లూ చేతులూ ఆడవు. సంస్కృతం తెలుగుని ఎంతలా ముంచెత్తిందో చెప్పడానికి పై విషయాలు చెప్పాను. ఇలా ఎన్నైనా చెప్పవచ్చు.కానీ ఈ వ్యాస ప్రయోజనం అదికాదు. మన తెలుగువారు సంస్కృతాన్ని అవసరానికి మించి దిగుమతిచేసుకుని తెలుగుని సంస్కృ త పదభూయిష్టం చేసారని చెప్పడమే. మన తెలుగు నిఘంటువుల్లో ఎనభై శాతం పైనే సంస్కృత పదాలు అతి తక్కువ తెలుగు పదాలు కనిపిస్తాయి. మన నిఘంటువుల పేర్లే సంస్కృతంలో ఉంటాయి.
సంస్కృతం తర్వాత పార్శీ అరబిక్ ఉర్దూ పదాలు మన భాషలో చాలా చేరాయి.ఈ చేరడం 14వ శతాబ్ది నాటికే జరిగింది. తిక్కన భారతంలోనే త్రాసు (తరాజునుంచి వచ్చినది) కనిపిస్తుంటే అప్పటికి మన వాడుక భాషలో ఎన్ని పదాలు చేరిపోయాయో. ఆ తర్వాత శ్రీ నాథ మహాకవి కూడా యదేఛ్చగా ఈ భాషల పదాల్ని వాడేడు.అంటే అప్పటికే అవి జనసామాన్యం మాట్లాడే భాషలో అంతర్భాగమై పోయాయని మనం గుర్తించాలి. తరువాత ఎందరో తెలుగు కవులు ఉర్దూ పార్శీ పదాల్ని తమ కవిత్వంలో వాడేరు.ఈ భాషల పదాలు కూడా మన తెలుగులో ఎంతలా కలిసి పోయాయంటే అవి తెలుగు పదాలు కావని చాలా మందికి తెలీదు.( ఈ పదాలగురించి మరో సారి వ్రాస్తాను). ఈ భాషల తర్వాత ఆంగ్ల భాషా ప్రభావం ఇతర  భారతీయ భాషల్లాగే మన తెలుగు మీద కూడా పడ్డది. మన ముత్తాతలు సంస్కృతాన్ని కావిలించుకున్నట్టే మన తాతలు తండ్రులు  ఇంగ్లీషుని కావిలించుకుని అక్కర లేని ఆంగ్ల వదాల్ని కూడా దిగుమతి చేసుకున్నారు. వాటికి సమానార్థకాలైన తెలుగు పదాల్ని మరచి పోయేలా చేసారు. ఇదంతా గతం. ఇప్పుడు దానినేమీ చేయలేం. ప్రపంచంలోని ఏ భాషకైనా ఈ స్థితి తప్పదు.
మనం ఇప్పుడు మన భాషని కాపాడుకోవాలంటే మనం మనకు తెలిసిన తెలుగు పదాల్నే వాడుతూ మాట్లాడాలి. పిల్లలచేత మాట్లాడించాలి.
ఎక్కడో మారుమూలనున్న తెలుగు పదాల్ని వెలికితీసి వాటిని వాడుకలోకి తెద్దామనేది సంతోషదాయకమైనదే అయినా వృధా ప్రయాస. అవి జనంలోకి వెళ్లవు.కొత్తగా వచ్చిన పనిముట్లకీ పరికరాలకీ వాటికి వాడుకలో నున్న ఇంగ్లీషు పేర్లనే అజంతం చేసి తెలుగు పేర్లు అని అనుకోవాలి. మనం ఇప్పుడేవో కొత్తపేర్లు సృష్టిస్తే అవి జనంలోకి వెళ్లవు. మొన్న ఉగాది రోజున కవి శ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావుగారు సాక్షి ఛానెల్లో తెలుగు కార్యక్రమమేదో నిర్వహిస్తూ కంప్యుటర్ కి తాను అన్నీఅని నామ కరణం చేస్తున్నానన్నారు. ఈ పదం వచ్చే ఉగాదినాటికయినా పదిమందైనా వాడుతారని నాకు నమ్మకం లేదు. కంప్యుటరు అని తెలుగు చేసుకుంటే వచ్చిన నష్టమేమీ లేదు.వందల ఏళ్లుగా మన తాతలుఅంగీకరించి అన్యదేశ్యాలకి కావ్యగౌరవం కూడా కల్పించి ఉండడం చూసికూడా మనం ఇవాళ మడి కట్టుక్కూర్చుంటామంటే అది జరిగే పని కాదని నా నిశ్చితాభిప్రాయం. ఈ పదాలు మన భాషలో చేరడంతో మన భాష ఏమీ మైల పడదు.కొంతమంది ఛాందసంగా మనం సంస్కృతం నుంచి తెచ్చుకోవచ్చుకాని ఇతర మ్లేఛ్చభాషలనుంచి తెచ్చుకోకూడదనే భావన వ్యక్తం చేస్తూ ఉంటారు. వారికి తెలుసునో తెలియదో కానీ మన పండితుల దృష్టిలో  సంస్కృతం వినా మిగిలిన భాష లన్నీ (తెలుగుతో సహా) మ్లేఛ్చ భాషలే.. వీరి ద్విభాషా పరిశుధ్దవాదం (Bilingual Puritanism)  ఏనాడూ ఏ దేశంలోనూ నిలబడలేదు. అందు చేత కొత్తగా వచ్చి చేరుతున్న పరికరాలకి మనం కృత్రిమంగా పేర్లు పెట్టి ఏదో సాధిద్దామనుకోకుండా వాటినలాగే స్వీకరిస్తూనే,మన భాప మౌలిక స్వరూపం చెడిపోకుండా కాపాడుకుంటూ భాషా వ్యాప్తికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.
చెప్పవలసినవీ చెప్పదల్చుకున్నవీ చాలా విషయాలే ఉన్నాఇప్పటికింతటితో ముగిస్తున్నాను. సెలవు.
17 వ్యాఖ్యలు:

Nagaraju చెప్పారు...

excellent gaa chepparu..

Nagaraju చెప్పారు...

adbhutham gaa chepparu.

Narayanaswamy S. చెప్పారు...

Interesting.

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

"...ఆచారపరులకి రంగు బట్ట మడికి పనికి రాదట..( ఈ విషయం దాశరధి రంగా చార్య గారి జీవన యానంలో చదివినట్టు గుర్తు. వారింట్లో ఆడవారెవరో మడిగా ఆరేసిన రంగుచీర కట్టుకుని వడ్డిస్తుంటే వాళ్లఇంటికి చుట్టంగా వచ్చిన పెద్దావిడ రంగుచీరతో మడేవిటని ఆనాచారమంటూ ఆడిపోసుకుంటుంది.)....."

ఈ విషయం కూడా శ్రీపాద వారి జ్ఞపకాలలోనిదే అనుకుంటాను. ప్రస్తుతం చదువుతున్నాను. ఇదే విధంగా దాశరధి రంగాచార్యగారికి కూడ అనుభవం అయ్యి ఉండవచ్చు.

బాగున్నయి మీ పాత జ్ఞాపకాలు. "మడి" అంటె ఏమిటి? అంటే పూజ చేసేప్పుడు "తంతు" లో భాగమైనది ఈ నాడు. "మడి" అనే మాటకు ఆంగ్లం లో మాట ఉన్నదా? ఆంగ్లపదాలు ఏదోవిధంగా తెలుగులోకి తర్జుమా చేసే గుంపులు ఉన్నాయి కాని, మరే భాషలోకీ మార్చ లేని తెలుగు పదాలను ఏరి కూర్చే వారు లేరనుకుంటాను.

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

నాగరాజుగారికీ, స్వామిగారికీ ,శివరామప్రసాదుగారికీ కృతజ్ఞతలు.ప్రసాదుగారూ మీరే రైటనుకుంటాను.అందుకే రంగాచార్యగారి పుస్తకంలో చదివినట్టు గుర్తు అని మాత్రమే వ్రాసేను.మడి అనేది మనవారు ఆరోగ్య రీత్యా పెట్టిన సదాచారమంటే అందరికీ ఆమోదయోగ్యమే.అయితే మరి రంగు బట్ట పనికి రాదనే కిరి కిరి ఏమిటి? మన ఆచారాల్లో చాలా మట్టుకు వెర్రితలలు వేసాయి.తెలిసి పాటించడం వేరు తెలియక పాటించడం వేరు అని నా ఆభిప్రాయం.

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

ఈ కిరి కిరి అనే మాట ఏదో ఒక నేలబారు సినిమా నుంచి వాడుకలోకి వచ్చినట్టు గుర్తు. ఏదో కోట రహస్యం అనుకుంటాను.

ఏది ఏమైనా "మడి" అనేది సూపర్ ఫైన్ శుభ్రత తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం. మడి, మళ్ళల్లో రకాలు, ఇది పనికి వస్తుంది, ఇది పనికి రాదు వంటివి అన్నీ కూడా గుమాస్తా కబుర్లు. ప్రభుత్వం ఏదో ఒక నియమం పెట్టంగానే, దాంటోంచి గుమాస్తాలు చిలవలు పలవలుగా వాళ్ళకు అర్ధమయ్యిన రీతిగా నిర్వచించి అసలు విషయం మర్చిపొయ్యి ఫైళ్ళ సైజులు పెంచినట్టుగానే, ఈ మడి, పూజ, వంటి విషయాల్లో, అసలు మాని కొసరు మీద ఎక్కువ మక్కువ చూపటంవల్లే, అవన్నీ హస్యాస్పదం అయ్యి ఆచరణలో దాదాపుగా మాయమయ్యాయి.

bonagiri చెప్పారు...

Nice post...

sevalive చెప్పారు...

అభ్యర్ధన :

నమస్తే!
' సేవ' సంస్థ ఆధ్వర్యంలో 'సకల' అంతర్జాల సకుటుంబం (వెబ్సైటు)ను ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సాహిత్య రంగం, మహిళా రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగం, ఆధ్యాత్మిక రంగం, సినిమారంగం, విద్య-ఉపాధి, ఆర్ధిక రంగం, కళారంగం, వైద్యం, హాస్యం, బాల్యం, వంటలు ఇత్యాది రంగాలకు సంబంధించి బ్లాగులు , వెబ్ పత్రికలు, వార్తాపత్రికలు ఉన్నాయా?..
అయితే.. ఇంకేం ఆలస్యం.. మీ మీ బ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తాపత్రికల పేర్లు, URL లు, నిర్వాహకుల పేర్లు, ఇ -మెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్లతో వెంటనే... sevalive.com@gmail.com మెయిల్ చేయండి. ఇట్టే అంతర్జాల సకుటుంబం లో అనుబంధం (లింక్) చేస్తాం.
మా ఈ ప్రయత్నానికి సహకరించాలని కోరుతున్నాం.

వ్యాఖ్యానంలో మా అభ్యర్ధనను విన్నపిస్తున్నందులకు అన్యదా భావించ వద్దని కోరుకొంటూ.. మా విజ్ఞప్తిని పదిమందికి తెలిసేలా సహకరించమని అభ్యర్ధిస్తూ...

సదా సేవలో,
-కంచర్ల సుబ్బానాయుడు,
సంపాదకులు, సేవ
http://sevalive.com/

ramesh babu alapati చెప్పారు...

మీ టపా చదువుతుంటే నేను కూడా నా చిన్ననాటి రొజులకు ప్రయాణం చేసినాను.
ఆచరించేదె ఆచారం.కాలమాన పరిస్థితులు అనేకం మారుతున్నయి ఈనాడు వీరి ఆందరకు ఆవి చాదస్తంగా వున్నాయి.భొజనమునకు ముందు మడి వలన దేహశుభ్రత,ఆకలి కలుగుట, నిత్య వ్యవహారములనుంచి చల్లనినీటికి మనసు భొజనము మీదకు మరులుతుంది ఇది మూల సూత్రం.మేము కూడా కొన్ని కొత్తవిషయాలు తెలుసుకొన్నాము.

kastephale చెప్పారు...

చాలా బాగుంది.

రాజ్ కుమార్ చెప్పారు...

excellent sir..
ఆ ఆఖరి పేరా నాకు సూపర్ గా నచ్చేసిందండీ..

>>ఎక్కడో మారుమూలనున్న తెలుగు పదాల్ని వెలికితీసి వాటిని వాడుకలోకి తెద్దామనేదిసంతోషదాయకమైనదే అయినా వృధా ప్రయాస. అవి జనంలోకి వెళ్లవు.కొత్తగా వచ్చిన పనిముట్లకీ పరికరాలకీ వాటికివాడుకలో నున్న ఇంగ్లీషు పేర్లనే అజంతం చేసి తెలుగు పేర్లు అని అనుకోవాలి.>>
BINGO... ;)

ఎలా ఉన్నారు మాష్టారూ? చాలా కాలానికి కనిపించారు..

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

నా పోస్టు నచ్చినందుకు ధన్యవాదాలు రాజ్ కుమార్ జీ. మళ్లా త్వరలోనే కలుధ్దాం.ఉంటాను.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
చాలా మంచి వ్యాసం వ్రాసారు . బాగుంది . మా మామగారు ఇప్పడికీ కొన్ని అలాగే మాట్లాడే వారు వారికి ౧౦౩ ఏళ్ళు నడుస్తుండగా ఈ మధ్యే పరమ పదిం చారు . ఆయన ఎప్పుడు టేబుల్ మీద తినే వారు కాదు. మీ వ్యాసాలు చదువు తుంటే పాత జ్ఞాపకాలు తలుచు కుంటూ , కొన్ని ఏళ్ళు వెనక్కి వెడుతుం టాం ధన్య వాదములు

పంతుల గోపాల కృష్ణ చెప్పారు...

రాజేశ్వరిగారికి కృతజ్ఞతలు.మీ మామగారు నిండునూరేళ్లు బ్రతికిన సంగతి తెలియజేసారు.ఆ శతాధిక వృధ్ధులు మీతో పంచుకున్న జ్ఞాపకాలు ఏవైనా గుర్తుంటే వ్రాయండి.అప్పటివారిగురించి వారిజీవన విధానాలగురించి తెలుసుకోవడం చాలామందికి ఆసక్తి కరంగానే ఉంటుంది.

buddha murali చెప్పారు...

తెలంగాణా జిల్లాల్లో ఇప్పటికీ చల్ల అనే పలుకుతారు .... మజ్జిగ తమిళ పదం అని ఎక్కడో చదివినట్టు గుర్తు మజ్జిగై నుంచి మజ్జిగ అని పిలుస్తున్నారని చదివినట్టు గుర్తు

Meraj Fathima చెప్పారు...

సర్, ప్రతి ఆచారం వెనుక ఓ అర్ధం ఉంటుంది. పాటించలేని వారు కనీసం దాని అర్దాన్ని తెలుసుకుంటే చాలు.
మది అనేది శుభ్రతకు చిహ్నం అని తెలుసు.
మంచి పోస్ట్.

అజ్ఞాత చెప్పారు...

తమిళం లో మోరు అంటారు. మోరు కొళంబు అని మజ్జిగ పులుసుని పిలుస్తారు