14, ఏప్రిల్ 2012, శనివారం

డ.డ్డ..డ్డడ్డ..డబ్బంటే ముద్దా? ము.. మ్ము..మ్ము..మ్ముద్దంటే చేదా?


                     ఓ పాత సిన్మా లో కథా నాయిక కథా నాయకుణ్ణి కవ్విస్తూ ము..మ్ముమ్ముమ్ము.. ముద్దంటే చేదా? నీకా ఉద్దేశం లేదా? అంటూ రెచ్చగొడ్తుంది. కానీ కథా నాయకుడుమాత్రం రెచ్చిపోకుండా ముద్దంటే చేదే. నాకా ఉద్దేశం లేదే అంటూ సమాధానమిస్తాడు. ముద్దంటే ఇష్టమున్న వాళ్లకయినా స్థలకాల పరిస్థితులూ అవీ కుదరాలి కదా? అదేకాక ప్రేమానురాగాలు లేనిచోట ముద్దుకూడా చేదుగానే ఉంటుంది. ఆ మధ్య టీవీల్లో  ఏదో దేశంలో ముద్దుల పోటీలు పెడితే ఎంతో మంది జంటలు పాల్గొని గంటల తరబడి ముద్దులు పెట్టుకోవడాన్ని చూశాం. పోటీల్లో గెలవడంకోసం వారంత కష్టపడి అంతంత సేపు ముద్దులు పెట్టుకున్నా వారు కూడా ఎంతోకొంత సేపటికి ఆపక తప్పింది కాదు కదా?  తినగ తినగ వేము తియ్యనౌతుందేమో గానీ తినగ తినగ తీపి కనరెక్కడం అనుభవైకవేద్యమే కదా? భర్తగారికెంతో ఇష్టమని ఇంటి ఇల్లాలు వంకాయో మరోకూరో సంవత్సరంలో మూడు వందల అరవై రోజులూ అదే వండిపెట్టిందనుకోండి, ఎంత భార్యావిధేయుడైన భర్తైనా  ఏదో ఒక రోజు వడ్డించిన విస్తరిని ఆ భార్యామణి నెత్తిన వేసి రుద్దడం ఖాయమనే విషయంలో ఎవరికీ సందేహం ఉండాల్సిన పనిలేదు. మనకెంతో ఇష్టమైన పుల్లారెడ్డి స్వీటైనా ఒకటో రెండో తినగలం కాని అంతకు మించితే మొహం మొత్తడం ఖాయమే గదా? ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానయ్యా అంటే మనకెంత ప్రీతిపాత్రమైనదైనా ఒక హద్దుమీరితే ఇక చాలు బాబో అనిపించక తప్పదని. కానీ లోకంలో దీనికి ఒకే ఒక అపవాదు ఉన్నట్టు కనిపిస్తోంది. అదేమిటయ్యా అంటే డబ్బు.డబ్బు..డబ్బు మాత్రమే.
డబ్బంటే ఇష్టం లేనివాడు లోకంలో కనిపించడు. జీవిక కోసం ప్రతివాడికీ డబ్బు అవసరమే.అందుచేత డబ్బు సంపాదించడం ప్రతివాడికీ తప్పని సరి. మన ధర్మశాస్త్రాలు కూడా అధర్మ మార్గాలలో ధనం సంపాదించకూడదు కానీ ధన సంపాదన ప్రతివ్యక్తి ధర్మమే నని చెబుతున్నాయి. డబ్బు పరమ పాపిష్టిదనీ, ఆప్తులమధ్యనే వైరాలు సృష్టిస్తుందనీ ( మాతా పుత్ర విరోధాయ హిరణ్యాయ నమోనమః) అనీ ధర్మ పన్నాలు వల్లిస్తూనే డబ్బు మీది ఆశని చంపుకోలేము. ధనంమూలమిదం జగత్ అంటూ.. ధనమేరా అన్నిటికీ మూలం ధనం విలువ తెలిసికొనుట మానవ ధర్మం అనీ పాడుకుంటాము. గృహస్తు అన్నాక దారా సుత పోషణార్థమైనా ధనం సంపాదించక తప్పదుకదా? గృహస్తులు లేకుండా సంఘమే ఉండదుకదా?గృహస్తులు లేకుంటే సిధ్ధులకైనా పస్తులు తప్పవుకదా?. అందుకే  ప్రవరుడి ఇంటికి వచ్చిన సిధ్ధుడు గృహస్తులు తమవంటివారికి  అంక స్థితార్థ పేటి ( ఒళ్లో పెట్టుకున్న Cash Box ) లాంటివారన్నాడు. కౌపీన సంరక్షణార్ధం ఇయంపటాటోపం అని గోచీ అంటూ పెట్టుకున్నాక సంసార జంఝాటం పెరక్కా తప్పదు. సంసార పోషణార్థం సంపాదనా తప్పదు. సంపాదనంటూ లేని మగాడు గుడ్డి గవ్వపాటి చెయ్యడుకదా?. సమాజమే కాదు పెళ్లాం కూడా లెక్కచేయదు.
గడన గల మగని చూచిన
అడుగులకు మడుగులిడుదురతివలు ధరలో
గడనుడుగు మగని చూచిన
నడపీనుగ వచ్చెనంచు నగుదురు సుమతీ..... అన్నాడు సుమతీ శతకకారుడు.

అందుచేత సంపాదన పురుషుడి విధ్యుక్త ధర్మాలలో ఒకటి అని మనం ఒప్పుకు  తీరాలి.  కానీ అసలు సమస్య అల్లా ఎంత సంపాదించాలి ? ఎలా సంపాదిచాలి? ఎక్కడ ఆపాలీ అన్నదే.  ఈ విషయమై ఏ ఒక్క  నిర్ణయం  అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చుకానీ, ఎవరైనా తన పిల్లలు తమ కాళ్లమీద నిలబడే వరకూ పోషించడానికీ, తమ వృధ్దాప్యంలో ఒకరిపై ఆధారపడకుండా జీవించడానికీ సరిపడా ఆర్జించి పెట్టుకోవడం ధర్మమే అనిపిస్తుంది. కానీ కొన్ని తరాలు కూర్చుని తిన్నా తరిగిపోని ఆస్తులు సంపాదించేక కూడా వేల కోట్ల సంపాదన కోసం అంగలార్చే వారిని ( వారిలో కొందరి ప్రస్తుత దుస్థితినీ) చూస్తూనే ఉన్నాము. ఇటువంటి సమాజంలో ఉంటూ కూడా  డబ్బంటే గడ్డిపోచతో సమానంగా చూసిన మహానుభావులున్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ?.  అలాంటి వారు ఏ కొద్దిమందో మన ఆంధ్రదేశంలోనే ఉండేవారు ఇప్పుడూ ఉన్నారు. వారు ముక్కుమూసుకుని అడవిలో తపస్సుచేసుకునే ముని పుంగవులుకాదు. మనలానే గృహస్థ ధర్మం నిర్వహిస్తూ సంసారాన్ని పోషించుకున్న, కుంటున్నవారే. వారిగురించి తెలుసుకుందాం రండి:
ఒకప్పుడు పిఠాపురాధీశులకి ఒక ధర్మ సందేహం వచ్చింది. దానిని వారి ఆస్థానంలో ఉన్నవారెవ్వరూ తీర్చలేకపోయేరు. వారే కాదు వారి ఆస్థానానికి వచ్చిపోతుండే పండితులు కూడా ఎవ్వరూ వారికి తృప్తి కలిగించే తీర్పు నివ్వలేకపోయారు. అప్పుడు వారికి ఎవరో వింజరంలో ఉండే శాస్త్రిగారొకరు మాత్రమే వారి సందేహ నివృత్తి చేయగలరని విన్నవించారు. అప్పుడు రాజుగారు పల్లకీని పరివారాన్నీ పంపి వారిని సాదరంగా సభకు రప్పించుకున్నారు. సభలో ఆ శాస్త్రిగారు చెప్పిన తీర్పు రాజుగారికే కాకుండా అక్కడున్న యావన్మంది పండితుల ఆమోదం పొందింది. రాజుగారు సంతోషంతో శాస్త్రిగారికి  సత్కారం తలపెడితే శాస్త్రిగారు సున్నితంగా తిరస్కరించారు. రాజుగారు అనేక విధాల బలవంతం పెట్టిన మీదట శాస్త్రిగారు వాళ్ల వూళ్లో ఎప్పుడో పడిపోయి ఎండిపోయిన చింతచెట్టుని కొట్టించుకోవడానికి అనుమతి  మాత్రం ఇవ్వండి చాలని అన్నారు. అదికూడా రాజుగారిని సంతోషపెట్టడానికే.
ఇంకొక సంగతి:
కోటిపల్లిలో  భాగవతి హరిశాస్త్రిగారని సాటిలేని మహా పండితుడొకాయన ఉండేవారు.శిష్యులకు పాఠం చెప్పడం తపస్సు చేసుకోవడం తప్ప ఆవూరు వదలి ఎక్కడికీ వెళ్లి ఎరుగడాయన. ఇలా ఉంటుంటే వారి ప్రజ్ఞ  విని పిఠాపురం రాజుగారైన గంగాధర రామారావుగారికి వారిని దర్శించుకోవాలన్న కోరిక కలిగింది. కానీ ఎంత ప్రలోభపెట్టినా వారెక్కడికీ కదలి రారని తెలిసింది. వారిని ఎలాగైనా దర్శించుకోవాలన్న కోరిక మిక్కుటమై రాజుగారే బయల్దేరి కోటిపల్లి వెళ్లారు. కానీ శాస్త్రిగారు ఎవరికోసమూ దేనికోసమూ బయటకు రారనీ, ఒక్క  స్నానానికి మాత్రం తెల్లవారుఝామునే గోదావరికి వచ్చి వెళ్తుంటారని తెలుసుకుని  ఆసమయంలో  వారికి ఎదురు పడి సవినయంగా మహాత్మా నమస్కారాలు అన్నారు. శాస్త్రిగారు శుభం అంటూ ముందుకు సాగుతుంటే రాజుగారు తాను ఫలానా అని విన్నవించుకుని  తమ దర్శనార్థం వచ్చానని తెలిపారు. శాస్త్రిగారు అయిందిగా అంటూ కదలిపోతుంటే ఒక మనవి అంటూ వారితో తమ పాదపూజ చేసుకుంటానన్నారు రాజుగారు. దానికి శాస్త్రిగారు వద్దు వద్దు గ్రామదేవత గుడి శిధిలం అయిపోతోందని ఊరి ప్రజలు ఆందోళన పడుతున్నారు దానిని బాగుచేయించండి,.వెళ్లండి. వెళ్లండి. అన్నారు. తన కోసం ప్రభువులే కదలి వచ్చి దర్శనం చేసుకుని  కోరిక తీరుస్తానంటే అక్కరలేదనగలగడం అందరికీ చెల్లుతుందా?
పై రెండు వృత్తాంతాలూ శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తన అనుభవాలూ జ్ఞాపకాలూ లో పొందుపరిచేరు కనుక మనకు తెలిసాయి. ఇటువంటిదే నేను విన్నదొకటి చెప్పి ముగిస్తాను.
నా చిన్ననాటి స్నేహితుడొకరు బహుకాలం చాలా విదేశాల్లో వైద్యునిగా పనిచేసి తిరిగి మనదేశం వచ్చేసి విశాఖ పట్టణంలో నివాసముంటున్నారు ఆయనా ఆయన మిత్రులింకొకరూ కలిసి ఒకసారి తూర్పు గోదావరి జిల్లాలో ఒక పల్లెటూళ్లో నివాసముంటున్న ఒక వేద పండితుని దర్శనార్థమై వెళ్లారట. వారి ఇల్లు శిధిలావస్థలో ఉందట. అక్కడ పేదరికం తాండవిస్తోందట.  ఆపండితుని దర్శనం  పూర్తయేక  వారి ప్రక్కనే  3000 రూపాయలుంచి వారికి నమస్కరించేరట. వారు మా మిత్రులని ఆశీర్వదించి వారుంచిన సొమ్ము వైపు వేలు చూపిస్తూ అది తీసుకుపోవల్సిందిగా సైగ చేసారట. చేసేదిలేక మా మిత్రులు దాన్ని వెనక్కి తీసుకుని వచ్చేసారట.
మన సంస్కృతిలో నప్రతిగృహీతృత్వం అనేది ఒకటుంది. దాని అర్థం ఎవ్వరినుంచీ ఊరికినే ఏదీ స్వీకరించరాదని. పైన చెప్పిన ముగ్గురు పండితోత్తములూ అక్షరాలా దానిని పాటించారన్నమాట.
యథా కథం చపరీ పరిగ్రహస్తేనోహ భవతీతి కౌత్సహారీతౌ, కాణ్యపుష్కరసాదీఅనే  ఆపస్తంబ సూత్రానికి పుచ్చుకోవడం ఎలా జరిగినా, అది దొంగతనమే అవుతుందని అర్థమట. కనుక కట్నం పుచ్చుకున్నా లంచం పుచ్చకున్నా అది దొంగతనం కిందే లెక్కన్నమాట.
జీవితంలో ఈ విలువల్ని పాటించ గలిగితే మన సాంప్రదాయంకన్న లోకంలో గొప్పదేముంటుంది?

                                                                             ***

4 వ్యాఖ్యలు:

పంతుల జోగారావు చెప్పారు...

డబ్బుకున్న పవరు ఎలాంటిదో బాగా వివరించేరు.
వ్యర్ధం నిర్ధనికస్య జీవన మహోదారైరపి త్యజ్యతే .. అన్నారు. అంటే తెలుసుకదా,డబ్బు లేని చవటాయిని
పెళ్ళాం కూడా వదలిపెడుతుందిట. ఇక డబ్బుని తృణప్రయంగా పరిగణించే మహానుభావులను కూడా పరిచయం చేసారు. సంతోషం. అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు ఓసారి బెంగుళూరులో హరికథా కాలక్షేపం చేసారు. రాజావారు మహదానందంతో వారికేం కావాలో కోరు కొమ్మన్నారుట. దాసు గారు ఓ బుట్టెడు బెంటుళూరు వంకాయలు ఇప్పించండి అన్నారుట. ఇది డబ్బు మీద వ్యామోహం ఉండడమో, లేక పోవడమో తెలియదు కానీ భోజన ప్రియత్వం అని చెప్పొచ్చును.

మీటపా హాయిగా చదివించింది.అభినందనలు.

రాజ్ కుమార్ చెప్పారు...

మీరు చెప్పే అపురూపమయిన కధల కోసం, కబుర్ల కోసమే వస్తుంటానండీ. ఎప్పుడూ డిజప్పాయింట్ అవ్వలేదు. నైస్ పోస్ట్ ;)

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
" డబ్బంటే చేదా ? " ఛాలా బాగుంది. మీ రచనలు ఎప్పుడు అపురూప మైనవవే మంచి సాహిత్యాన్ని అంది స్తున్నందులకు ధన్య వాదములు

Pantula gopala krishna rao చెప్పారు...

రాజేశ్వరి గారికి , మీరింతవరకూ ఈ పోస్టు చూడలేదేమా అని అనుకున్నాను- మీ స్పందనకు కృతజ్ఞతలు.