సౌజన్య మూర్తి శ్రీ విశ్వనాథ...
“ ఏ గతి రచియించి రేని సమకాలము వారలు
మెచ్చరే గదా? ” అంటూ వాపోయాడు విజయ విలాస కర్త శ్రీ
చేమకూర వెంకటకవి. ప్రతి పద్యం లో చమత్కారం తొణికిస లాడే విజయ విలాస కావ్యాన్ని
రచించిన చేమకూర వానికే సమకాలీనులలో మెచ్చుకునే వారు కరువయ్యారంటే,మిగిలిన కవుల
సంగతి చెప్పే పనేముంది? చేమకూర కవికి సమకాలీనులలో దక్కాల్సిన
గౌరవం దక్కక పోవడానికి అతని కులం అడ్డుపడిందేమోనని అనుకున్నా అసలు కారణం ఆది కాదు.
సమకాలీను లైన కవులలోఉండే స్పర్థే దీనికి కారణమై ఉంటుంది.తమకు పూర్వ కవుల స్తుతి
చేసిన వారున్నారేమోగాని తమ సమకాలీనులైన కవులను గురించి గొప్పగా చెప్పిన కవులు ఎక్కడా
కనిపించరు..అలా మెచ్చుకోవడానికి చాలా సౌజన్యమూ సహృదయతా కావాలి. ఇవి మెండుగా
ఉన్నకవి,శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు.“నవనీత
మనస్కుడు కవితాంతరంగుడు శ్రీ విశ్వనాథ...” అనే పోస్టులో
శ్రీ విశ్వనాథ వారి లోని ఈ దొడ్డగుణాన్ని ఆవిష్కరించే ముచ్చట ఒకటి చెప్పిఉన్నాను.
ఈ విషయాన్నిధృవీకరించేవి మరో రెండు ముచ్చట్లు చిత్తగించండి:
నేను యుక్త
వయస్సులో ఉన్నప్పుడు ( 1957-62 ) మధ్యలో మా
వూళ్లో లైబ్రరీలో అన్ని పుస్తకాలతో పాటు భారతి సాహిత్య మాస పత్రిక కూడా క్షుణ్ణంగా చదువుతుండే వాడిని. అలా
చదువుతుండడంలో ఒకసారి“హేతువాదయుగం ” అనే వ్యాసాన్నిచదవడం తటస్థించింది.ఇన్నేళ్ల తర్వాత ఆ వ్యాసం పూర్తి పాఠం నాకు గుర్తు లేదు కాని మనకి
ఇప్పుడు అవసరమైన విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంది.ఆ వ్యాసం ఇద్దరు సాహితీ ప్రియుల
మధ్యన జరిగే సంభాషణ లా సాగుతుంది.“ఆనందం
అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపుటంచులు
చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం” అనే గేయ పంక్తులతో ప్రారంభం అవుతుందీ
వ్యాసం.చివర్లో మొదటివ్యక్తిని రెండో ఆయన“ఇంతకీ ఈ
యుగకర్త ఎవ్వరంటావు? ” అని ప్రశ్నిస్తాడు. దానికి జవాబుగా
మొదటి వ్యక్తి“ఇంకెవరు.పైన చెప్పిన గేయం వ్రాసిన వాడే ” అని
చెప్పి ముగిస్తాడు.ఈ వ్యాసం వ్రాసినది శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు కనుక ఆ
ఆభిప్రాయం ఆయనదే అనీ ఆయన యుగకర్తగా పేర్కొన్నమహాకవి ఆయనను పాషాణ పాక ప్రభువుగా
వర్ణించిన శ్రీశ్రీ గారేననీ మనకి తెలిసి
పోతుంది.కవి సమ్రాట్టైన ఒక మహాకవి సమకాలీనుడైన మరో కవిని యుగకర్తగా పేర్కొనడం ఆయన
సహృదయతకు గీటురాయి కాదా?
మరోముచ్చట:
కే.యస్. రావు గారంటే ఫలానా అని ఇతమిథ్థంగా మనకి తెలీదు.కోడూరి శివశక్తి దత్తా అనీ మన సినీ రంగంలో కథా గేయరచయిత గానూ దర్శకుని గానూ పని
చేస్తున్నారని చెబితే కొద్దిమందికి తెలియవచ్చును.ఈమద్య విడుదలైన రాజన్న సినిమాలో “ అమ్మా
అవనీ...” అనే అద్భుతమైన పాట వ్రాసిన కవి గారంటే
చాలా మందికి తెలియవచ్చును.ఆయన ప్రఖ్యాత సంగీత దర్శకుడు కీరవాణి గారి నాన్నగారని
చెబితే అందరికీ తెలుస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఆయన గగన గంగావతరణం అనే
అద్భుతమైన కావ్యం త్రిస్రగతి ద్విపదలలో వ్రాసేరని. ఈ కావ్యం ఆయన చాలా కాలం
క్రిందటే వ్రాసేరు. దాన్ని స్వయంగా శ్రీ విశ్వనాథ వారికి వినిపించి వారి స్పందనను తెలుసుకోవాలన్న
కుతూహలంతో వారి అన్నదమ్ములతో కలిసి కవి సమ్రాట్టు దర్శనం చేసుకున్నారు. వారి
ఆధునిక వేషధారణ చూసి వారి కావ్యం ఎలా ఉంటుందో ననుకున్న విశ్వనాథ వారు నిరాసక్తిగా “అక్కడ
పెట్టి వెళ్లండి తీరికగా చదువుతా” నన్నారుట. హతాశులైన దత్తా గారి ముఖ
కవళికలు చూసి మళ్లీ విశ్వనాథ వారే“ సరే మీరు బాగా రాశాననుకున్నవి పది పంక్తులు
చదివితే వింటానన్నారుట.ఆనందంతో దత్తాగారు చేతికొచ్చిన పేజీ తెరచి చదవనారంభించేరట.కొంచెం
చదవగానే విశ్వనాథ వారు ఆపమని సంజ్ఞ చేసి, మళ్లా మొదటినుంచి నిదానంగా చదవమని
అడిగారట.ఆ తర్వాత అంతా నిదానంగా వింటూ “ ఇదిరా శయ్య!ఇదిరా శిల్పం!ఇదిరా
శబ్ద గాంభీర్యం!ఇదిరా అల్లిక!ఇదిరా ధార!ఇదిరా తెలుగు నుడికారం!” అంటూ పొగడ్తలు కురిపించారట.
అంతటితో ఆగకుండా“నాకు ఈ గంగావతరణం కథా వస్తువంటే చాలా ఇష్టం. నా
కంటె ముందు వాల్మీకి మొదలుగా పన్నెండుమంది కవులు ఈ గంగావతార ఘట్టాన్ని హృద్యంగా
వర్ణించి ఉన్నారు. నా కల్ప తరువు( రామాయణ కల్ప వృక్షం) లో నేనంత కంటె బాగా
వ్రాయడానికి ప్రయత్నించాను. ముందు వాటితో నిష్పాక్షికంగా సరితూచు కొని నాకే అగ్ర తాంబూలం ఇచ్చుకున్నాను. కాని ఇవాళ ఈ
గగన గంగావతరణం విన్నాక అగ్ర తాంబూలమిక నాది కాదు నీది అని నా అంతరాత్మ చెబుతున్నది.
అందు చేత ఆ నాడు నా కల్పవృక్షాన్ని ఆవిష్కరించినప్పుడు నాకిచ్చి సత్కరించిన పట్టు
వస్త్రాలు నీకిచ్చి ఆశీర్వదిస్తా” నంటూ వారూ వారి శిష్యగణమూ ముక్త
కంఠాలతో మంత్ర పుష్పాలతో ఆశీర్వదించి అక్షతలు చల్లారట!
విశ్వనాథ వారి సౌజన్యానికి మరో నిదర్శనం ఎందుకూ?
( ఇక్కడ నేను పేర్కొన్న గగన గంగావతరణం
నిజంగా ఒక అద్భుత కావ్యం. నేను పండితుణ్ణి కాను. కావ్యాలంటే పెద్ద ప్రీతి ఉన్న వాణ్ణీ
కాను. అయినా ఈ పుస్తకం నా చేతికి వచ్చిన రాత్రి ఏకబిగిన ఆపకుండా చదివింప చేసిందీ
60 పేజీల గ్రంథం. ఇది అందరికీ లభ్యమై చదివే అవకాశం ఉండక పోవచ్చు కనుక దీనిని
మరోసారి విపులంగా పరిచయం చేయాలని ఉంది. చేస్తాను.సెలవు.)
9 కామెంట్లు:
అద్భుతం.
కవిసమ్రాట్ విశ్వనాథ వారి నవనీత అంతరంగాన్ని ఆవిష్కరించే ముచ్చట్లు రెండూ చాలా బాగున్నాయి.
ఇంత మహా కవీ ఏదేని కార్యక్రమాలకి వెళ్ళి నప్పుడు చివరి వరుస కుర్చీలలో చేరి చిలిపిగా రవంత అల్లరి చేసే వారుట.మా కలాశాల శతజయంతి ఉత్సవాలకు విచ్చేయమని ఆహ్వానం పలుకుతూ మాన్యశ్రీ మానా ప్రగ్గడ శేషసాయిగారు విశ్వనాథ వారికి ఉత్తరం రాసేరు. వారు చెబుతూ ఉంటే వ్రాయసకాడిని నేనే.తరువాతి వారం లోనే జవాబు వచ్చింది. మా గురువర్యులు దానిని నా ముఖం మీద రెరెపలాడిస్తూ నాయనా ! విశ్వనాథ వారికి మనం రాసిన జాబుకి ప్రత్యుత్తరం వచ్చిందిరా ! అని చెప్పారు.
వస్తున్నారు కదండీ ? అనడిగేను అమాయకంగా.
కవి వృషభులు గోమాత తోడు లేనిదే రానంటున్నారోయ్
ఆ యేర్పాట్లేవో చూడాలి మరి అని కడుపారా నవ్వేరు.
అరటి దవ్వలాగా వారి మనసు మహా సుకుమారంరా.. వారిని జాగ్రత్తగా సేవించు కోవాలి సుమీ ! అని హెచ్చరించే వారు మా గురుదేవులు మీ టపా చదివేక అవన్నీ గుర్తుకొచ్చాయి. చాలా సంతోషం.
గగన గంగావతరణం పుస్తక పరిచయం కోసం ఎదురు చూస్తూ ఉంటాము.
చాలా బాగుందండీ, మంచి విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
లక్ష్మీ దేవి, కష్టే ఫలే, పంజో గార్ల స్పందనలకు కృతజ్ఞతలు.
మీ వ్యాసం చాలా బాగుంది. మీ "గగన గంగావతరణం" పుస్తక పరిచయం కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉంటానండీ.
శ్యామలీయం గారికి కృతజ్ఞతలు
చాలా బావుంది. దేవులపల్లి, విశ్వనాథ, శ్రీశ్రీ గొప్ప కవులే కాక మంచి కవిత్వమంటే ఏవిటో తెలిసిన గొప్ప అభిరుచి కలవారు కూడాను.
నమస్కారములు.
ఛాలా బాగుంది . విశ్వనాధ వారి ఔన్నత్యం శ్లాఘ నీయం . అసలిలాటి మచ్చు తునకలు , మీ వంటి ప్రముఖుల కలాల నుంచి జాలువారక పొతే , నావంటి వారికి ఎన్నటికీ తెలియ వేమొ ? ధన్య వాదములు
రాజేశ్వరి గారికి కృతజ్ఞతలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి