15, ఆగస్టు 2012, బుధవారం

జై తెలుగు పద్యం.. జై జై తెలుగు పద్యం...ఆశు కవితయొకటి..ఆవు పేడయునొకటి..అంటూ పండితులు ఆశుకవిత్వాన్ని ఈసడించే వారు. నిజమే. కుదురుగా కూర్చుని మేధను మధించి కష్టపడి పది కాలాల పాటు నిలిచి పోయే మంచి పద్యాన్నివ్రాయ వచ్చును. కానీ ఉన్న పాటున ఏదో విషయం పైన నిఘంటు నిరాపేక్షంగా చెప్పిన పద్యాలను వాటితో సరిపోల్చ కూడదు. ఆశు కవిత్వం కూడా అంత ఆషా మాషీ వ్యవహారం కాదు. ప్రధానంగా ఇవి ముక్తకాలై ఉంటాయి. అంటే కవి భావం అంతా ఒక్కపద్యంలోనే ఒదిగి పోవాలి. ఇవి ఒక్కసారి వినగానే శ్రోతలను ఆకట్టుకుని వారి మనసులను రంజింప జేయాలి. అందుకోసం ఇవి సులభ గ్రాహ్యంగా కూడా ఉండాలి. కావ్యాల్లో ఎన్నోపొల్లు పద్యాలున్నా పదింటి కొకటైనా మంచి పద్యం ఉంటే ఆ కావ్యం మన్నన పొందుతుంది. ఆశువుగా చెప్పిన పద్యాలు అలాగ కాదు. పస లేని పద్యాలు వెంటనే కాలగర్భంలో కలిసి పోతాయి. కాని తగిన పాండిత్యం సృజన ఉన్న మహాకవుల నోటివెంట అలవోకగా వెలువడిన పద్యాలు కొన్ని అనర్ఘరత్నాలుగా భాసిస్తూ చిరంజీవులుగా మిగిలిపోతాయి. వాటిలోని భావం పద్య శిల్పం మనల్ని అచ్చెరువొందిస్తాయి. ఇటువంటి పద్యాలలో తలమానిక మైన దాన్ని ఒకటి పరిచయం చేస్తాను. చిత్తగించండి:

లక్ష్మీ పార్వతుల అన్యోన్య పరిహాసం-
సీ. గంగా ధరుడు నీ మగండని నవ్వంగ
వేషధరుండు నీ పెన్మిటనియె,
నెద్దునెక్కును నీదు నెమ్మెకాడని నవ్వ
గ్రద్దనెక్కును నీ మగండటనియె
వల్లకాడిల్లు నీ వల్లభున కనంగ
నడిసంద్ర మిల్లు నీ నాధున కనె
నాట్యంబు సేయు నీ నాయకుండన నంగు
గావించు వెన్కనీ కాంతుడనియె
ముష్టి కెక్కడి కేగె నీ యిష్టుడనిన
బలి మఖంబున కేగె నో లలన యనియె
నిట్టులన్యోన్య మర్మంబు లెంచుకొనెడు
పర్వతాంబోధి కన్యల ప్రస్తుతింతు.

ఈ పద్యం తిరుపతి వేంకట కవుల శతావధాన సారం లోనిది. వారు ఒక శతావధానంలో చెప్పిన పద్యమిది. అర్థం సులభ గ్రాహ్యమే అయినా అవతారిక లేనందువల్ల కొంత మందికి పూర్వగాధలు తెలియక పోతే పద్యం లోని రసాస్వాదన అనుభవం లోనికి రాదు. కనుక కొంచెం వివరిస్తాను. లక్ష్మీ దేవి వేరే పనీ పాటూ లేని ఒక తీరిక సమయంలో వచ్చి పార్వతీ దేవితో ముచ్చట పెట్టుకుంది. సరదాగా పార్వతితో నీ మగడు ఆడదానిని (గంగను) నెత్తి మీద ధరించాడు కదా?” అంది. దానికి జవాబుగా పార్వతి విష్ణుమూర్తి మోహినీ అవతారంలో స్త్రీ రూపాన్ని ధరించడం గుర్తు చేస్తూ నీ మగడు పూర్తిగా ఆడ మేషమే ధరించాడు కదా?” అంది. అప్పుడు లక్ష్మీదేవి  నీ మగడు ఎద్దునెక్కి తిరుగుతాడు కదా?” యని యెద్దేవా చేయబోయింది. దానికి వెంటనే పార్వతీ దేవి నీమగడిలా గ్రద్ద నెక్కి తిరగడం కంటె అదేమి తక్కువ అని జవాబిచ్చింది.( ఎద్దు-నంది శివుని వాహనమైతే విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు- గ్రద్ద- కదా?). అప్పుడు లక్ష్మీ దేవి నీ మగని యిల్లు వల్లకాడు కదా?” అంటే పార్వతి వెంటనే నడి సముద్రం లో ఉండడం కంటె అదే నయం కదా?” అంది. ( పరమశివుని నివాసం వల్లకాడనీ విష్ణుమూర్తి పాలసంద్రపు నివాసి అనీ తెలుసు కదా?) .లక్ష్మీ దేవి నీ మగడు నాట్యం చేస్తాడు కదా?” అని ఎకసక్కెమాడబోతే పార్వతి అవును మీ ఆయన అటువంటి నాట్యానికి వెనక హంగు చేస్తాడు కదా?” అని జవాబిస్తుంది. శివుడు నటరాజు కనుక నాట్యం చేస్తాడు. ( అయితే దీనిలో హేళన ఏముంది? అని కొందరికి అనిపించవచ్చును. కాని ఆ పాత రోజుల్లో నట గాయకులంటే ఆంధ్ర దేశంలో చిన్న చూపే ఉండేది. నటులకీ,నాట్యకళాకారులకీ గాయకులకీ ఏమాత్రం గౌరవం ఉండేది కాదు. వారికి పిల్లనివ్వడానికి కూడా ఇష్టపడే వారు కాదు. సంఘంలో వారంటే చిన్న చూపే. సినిమాల రాకతో నటీనటుల సంపాదన పెరగడంతో సీను మారిందనుకోండి. అది విషయాంతరం). విష్ణుమూర్తి, గజాసుర సంహారంలో గజాసురుని కడుపులో ఉన్న మహాశివుని బయటకు రప్పించడానికి నందిని తీసుకు వెళ్లి అసురుని సభలో దాని చేత నృత్యం చేయిస్తూ ప్రక్కవాద్యం వాయిస్తాడు. నంది గజాసురుని తన కొమ్ములతో పొడిచి చంపి శివుణ్ణి బయటకు రప్పిస్తుంది. ఇదిగో ఇక్కడ విష్ణుమూర్తి  హంగు చేయడాన్నే లక్ష్మీ దేవికి గుర్తు చేస్తూ విష్ణుమూర్తి హంగుకాడని పార్వతీ దేవి దెప్పిపొడిచింది. అన్నిటికీ తిరుగు లేని సమాధానాలిస్తున్న పార్వతిని చూసి ఇక లాభం లేదనుకుని లక్ష్మీ దేవి ఆఖరు అస్త్రంగా నీ మగడు ముష్టి కెక్కడకు వెళ్లాడని అడుగుతుంది. దానికి పార్వతి బలి చక్రవర్తి చేసే యజ్ఞానికి వెళ్లి ఉంటాడనుకుంటానన్నది. (శివుని భిక్షాటనా,విష్ణువు వామనావతారంలో బలి దగ్గర దానం గ్రహించడం తెలిసినవే కదా?)
పై విధంగా లక్ష్మీ పార్వతులు ఒకరి నొకరు మేలమాడుకున్నారని చెబుతూ వారిద్దరినీ ప్రస్తుతించారు మన జంట కవులు. ఇంత భావాన్ని ఒక చిన్న పద్యంలో ఇమిడ్చి చెప్పడం మహాకవులకే చెల్లుతుంది. స్త్రీల సహజమైన చిత్త ప్రవృత్తిని అద్భుతంగా ఆవిష్కరించిన పద్యమిది. ముఖ్యంగా వారి భర్తలను ఎవరైనా అవమానిస్తూ మాట్లాడితే వారు సహించలేరు కదా? ఇంత వరకూ చాలా మందికి తెలిసే ఉంటుంది. కాని ఈ పద్యంలో సొగసైన విషయం మరొకటి ఉంది. అది మనవి చేస్తాను. సీస పద్యానికి అనుబంధంగా చెప్పిన తేట గీతిలో పార్వతి లక్ష్మీ దేవిని లలనా అని సంబోధిస్తుంది. లలన అనే పదానికి ధన గర్వాతిశయంతో ఉన్న స్త్రీ అనే అర్థం ఉంది. అందు వలన పార్వతి సిరుల కధిష్ఠాన దేవత అయిన లక్ష్మీ దేవిని నేను పేద రాలిని,నీవు ఐశ్వర్వవంతురాలవు కనుక ధన గర్వంతో నన్ను మేలమాడడానికి పనికట్టుకుని వచ్చా వని నిష్టూరమాడిందని కూడా మనకు అవగతమవుతుంది. ఒక చిన్న సంబోధనలో కూడా ఇంత ఆంతర్యం ఉండేటట్లు ఆశువుగా పద్యం చెప్పినవారు మహా కవులు కాకేమవుతారు?
మహాకవులెప్పుడో మరణించినా మంచిపద్యం మనకి మిగిల్చి పోయారు.
జై తెలుగు పద్యం....  జైజై తెలుగు పద్యం...                                      

4 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

ఆ పద్యంలో అన్ని గాధలు ఇమిడి ఉన్నాయ్ అదీ ఆనందం. మంచి పద్యం గుర్తు చేసేరు

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

తెలుగు పద్యాన్ని పల్లకీ కెక్కించిన
తిరుపతి వేంకట కవులలు సంస్మరించుకొనే
మహద్భాగ్యం కల్గించారు .
ధన్యవాదములు .
-----సుజన-సృజన

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు .
తిరుపతి వేంకట కవుల చమత్కారాన్ని చక్కగా వివరించి మాకందిం చిన మీకు మా కృతజ్ఞతలు . అసలు ఇలాంటి ఎన్నో రచనల గురించి వెలికి దీసి అందిస్తున్న మీ అభిరుచి శ్లాఘ నీయం .

Pantula gopala krishna rao చెప్పారు...

కష్టే పలే శర్మ గారికీ, లక్కాకుల వారికీ, రాజేశ్వరి గారికీ కృతజ్ఞతలు.