18, ఆగస్టు 2012, శనివారం

నాసికోపాఖ్యానం..లేక నాసికా సాముద్రికం..అనబడే..ముక్కు జోస్యం కథ..




ముక్కుమీది కోపం నీ ముఖానికే అందం అంటాడో సినీ కవి. కోపం ముక్కుమీద ఉండడమేమిటి? అక్కడేమీ కనిపించదు కదా? కోపం మన కళ్ళల్లో కదా కనిపించేది? అంటే నిజమే. కోపం మన చూపుల్లోనే కనిపిస్తుంది. ఎంతటి శాంతమూర్తులకైనా ఏదో సమయంలో కోపం రాకా తప్పదు. అది వారి కళ్ళల్లో కనిపించకా తప్పదు. కాని ముక్కుమీది కోపం అనే నానుడికి అర్థం వేరు. అతి తొందర గానూ అనవసరంగానూ కోపం తెచ్చుకునే వారి విషయంలోనే ఇలా అంటారు. ఎందుకనంటే ఎవరికైనా తమ శరీర భాగాల్లో అన్నిటి కంటే ముందుకు ఉండేది తమ ముక్కే
.( బొజ్జలు బాగా పెంచుకున్నవారు మాత్రమే దీనికి అపవాదం). అందుచేత ముక్కుమీద కోపం అంటే కోపిష్టులకు వారికంటే ముందే వారికోపం ఉంటుందన్నమాట. ముక్కు మూసుకుని ఘోరమైన తపస్సు చేసి ఎన్నో శక్తులను పొందిన ముని వర్యులలో కూడా తమ కోపాన్ని అణచు కోలేక ఎవరెవరికో శాపాలనిచ్చి తమ తపఃఫలాన్ని వృథా చేసుకున్నవారూ ఉన్నారు. అందులో దూర్వాస మహర్షి అగ్రగణ్యుడు.ఆయనకు కోపం ఆయన ముక్కుమీదే ఉండేది. అయిన దానికీ కాని దానికీ శాపాలిస్తూ ఉండేవాడు. అందుకే మన వాళ్లు కోపిష్టి వాడిని చూస్తే వాడో దూర్వాసుడు రా అంటారు.
మన పెద్ద వాళ్లు ఏ పిల్ల అయినా అందంగా ఉందని చెప్పేటప్పుడు కన్ను ముక్కు తీరుగా ఉన్నాయని చెబుతారు. అంటే మిగతా అవయవాలకి ఇవ్వని ప్రాముఖ్యత ఈ రెండిటికి ఇచ్చినట్లే కదా? ( కొంతమందికి మాత్రం ఆ పిల్ల వెనకాల ఉండే ఆస్థి మాత్రమే అందంగా కనిపిస్తుంది ).  సర్వేంద్రియాణాం నయనం ప్రధానం కనుక కళ్ళు,వాటి తర్వాత ముక్కు తీరునే చూస్తారన్నమాట. మనిషి సౌందర్యంలో ముక్కుకు ఉన్న ప్రాధాన్యం అటువంటిది. పంచేంద్రియాలలో ముక్కు స్థానం పదిలం. అందుకే లక్ష్మణస్వామి వారు శూర్పణఖకి ముక్కు చెవులు మాత్రం కోసి పంపించి వేసారు. అదే పెద్ద శిక్ష. 
రోజుల వయసులో ఉన్నలేలేత పిల్లలలో కొందరికి ఒళ్లంతా పచ్చగా ఉంటుంది. ముక్కు మీద చెవుల వెనకా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. దానికి పిల్లలకు వచ్చే పచ్చకామెర్లే కారణమట.వారిని
రోజూ ఉదయ కాలపు నీరెండలో కాసేపు ఉంచితే అదే తగ్గి పోతుంది. ఇలా చంటి పిల్లల ముక్కులు పచ్చగా ఉండడం చేతనే మన వారు వారిని ముక్కు పచ్చలారని ముద్దుబిడ్డలన్నారు. ( దీనినే ఇంగ్లీషు వారు కొంచెం వెనక్కివెళ్లి still green behind the ears అన్నారు). ఇక్కడా మన వారు మాత్రం ముక్కునే తలచుకున్నారు.
ముక్కుకు ముక్కెర అందం అన్నాడు మరో సినీ కవి. అందమైన ముక్కుకు ఆభరణం ముక్కు పుడక. మంచిరోజు చూసి ఆడ పిల్లకు ముక్కు కుట్టించడం కూడా ఒక పండుగే. ఇప్పుడంటే నవనాగరీకమైపోయారు గానీ,ఆంధ్ర దేశంలో ముక్కుకు ముక్కు పుడక లేని స్త్రీలు ఉండేవారు కాదు. (ముద్దుకు అది ప్రతిబంధం అయినా సరే.) మన మగువల సౌందర్యాభిలాష అటువంటిది మరి. వజ్రమో మెరిసే రాళ్లో పొదిగిన ముక్కెర ముదితల ముఖారవిందాలను ముచ్చటగొలిపేలా చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.  స్త్రీలే కాదు రాధారమణుడూ రాసలీలాలోలుడూ అయిన మన శ్రీ కృష్ణుడు కూడా తన నాసికాగ్రాన నవ మౌక్తికాన్ని ధరించే వాడు. (ఎందుకో మరి మన సినీ కృష్ణుడు మాత్రం ఇది ధరించినట్లు దాఖలాలు లేవు)
నఖశిఖ పర్యంతం స్త్రీల సౌందర్యాన్ని వర్ణించిన మన ప్రబంధ కవులు ఇంత ముఖ్యమైన అంగాన్ని వర్ణించకుండా వదలి పెడతారా? “నువ్వు పువ్వన నవ్వు జవ్వని నాసిక అని నువ్వు పువ్వుతో సరిపోలుస్తాడు నాయిక ముక్కును చేమకూర వేంకట కవి. మరి నంది తిమ్మన గారైతే ముక్కు మీద పద్యం వ్రాసి ప్రసిధ్ధి చెంది దానినే తన ఇంటి పేరుగా చేసుకున్నాడు. అందమైన ముక్కు మీది అందమైన పద్యాన్ని అడిగినంత ధర ఇచ్చి కొనుక్కుని మరీ తన కావ్యంలో వాడుకున్నాడు వసుచరిత్ర కారుడైన రామ రాజ భూషణుడు. ఆ పద్యాన్నొకసారి ఆస్వాదిద్దాం:
నానా సూన వితాన వాసనల నానందించు సారంగమే
లానన్నొల్లదటంచు గంధఫలి బల్కాకం తపం బంది యో
షా నాసాకృతి దాల్చి సర్వ సుమనస్సౌరభ్య సంవాసియై
పొందెన్ ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబులిర్వంకలన్
(అన్ని రకాల పూవుల వాసనను గ్రోలుచు ఆనందించే తుమ్మెద తనంటే ఎందు కిష్ట పడదని సంపెంగ పూవు ఘోరమైన తపస్సు చేసి నాయిక నాసిక రూపును ధరించి ఆమె చూపులనే తుమ్మెదల బారునే పొందినదని కవి ఉత్ప్రేక్షించాడు. అంటే నాయికయైన గిరికా దేవి ముక్కు సంపెంగ పూవంత అందంగా ఉందని భావం.)
ముక్కు లు అందరివీ ఒకేలా ఉండవు. కొందరివి సన్నగా పొడుగ్గానూ కొసదేరి ఉంటాయి. చివర కొంచెం వంగి ఉండి నాగలిలా ఉండే వాటిని కోటేరేసిన ముక్కులంటారు. (కోటేరంటే నాగలి). చిలక ముక్కు లాఉంటాయి కొందరివి. మరికొంత మందివి పొట్టిగానూ లావు గానూ నొక్కి వేసినట్లుంటాయి. వీటిని చప్పిడి ముక్కులంటారు. అసలే ముక్కు లేని వానిని ముక్కిడి అంటారు. మా చిన్నప్పుడు మా మాష్టరు గారొకాయనకు చాలా లావుగానూ పెద్దగానూ కొట్టొచ్చినట్లు కనిపించే ముక్కు ఉండేది. ఊళ్లో చిన్నా పెద్దా అందరూ ఆయనను ముక్కు మేష్టరుగారనే వ్యవహరించేవారు. ముక్కంటూ ఉన్నాక పడిశం రాకుండా ఉంటుందా? అన్నది సామెత. పడిశం సంగతి ఏమోగాని ఆయన ముక్కు ఆయనకు పెద్ద పేరు తెచ్చిపెట్టింది
మన దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గారి ముక్కు చూడ ముచ్చటగా ఉండేది. ఆవిడ ఇందిరా ప్రియదర్శిని కదా? ముక్కు చక్కగా ఉంటే మేలు కలుగుతుందంటుంది మన సాముద్రిక శాస్త్రం.(ఆమె భారత ప్రధాని కావడంలో ఆమె ముక్కు పాత్ర ఎంతో నాకు తెలియదు మరి). జన్మతః సహజంగా ఉన్నది కాకుండా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అందంగా తీర్చి దిద్దుకున్నంత మాత్రాన అదృష్టం కలిసి రాదట. కానీ అలా ముక్కుకు సర్జరీ చేయించుకుని సినీరంగంలో ధృవతారగా వెలుగు వెలిగిన ఓ శ్రీమంతురాలి కథ మనకు తెలిసినదే.
ముక్కును గురించి సాముద్రిక శాస్త్రం ఏం చెబుతుందో తెలిపే పద్యం చూడండి:
సీ. నాసిక దీర్ఘమై భాసిల్లుచుండిన
మగువ తా గోరిన మగని బొందు,
నాసిక వట్రువై భాసిల్లు చుండిన
సతి యాధికారిక ప్రతిభ గొఱలు,
నాసిక శుకరీతి భాసిల్లు చుండిన
భామిని సుఖరీతి బరిఢవిల్లు,
నాసిక చప్పిడై భాసిల్లుచుండిన
వికటస్వభావయై సకియ బొగులు,
ప్రాగుపార్జిత పుణ్య సౌభాగ్య యైన
లేమ నాసిక గంధపలి వలె వెలయు,
నని చికిత్సదీర్చికొనిన యంతమాత్ర
జక్కదనమబ్బునేమొ ప్రశస్తి రాదు.
( ఈ ముక్కు సాముద్రికాన్ని తన శతావధానం లో చెప్పిన వారు శతావధాని శ్రీ సి.వి. సుబ్బన్న గారు)
మరెందుకాలస్యం? అద్దంలో మీ ముక్కు తీరు చూసుకుని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
సెలవు.


 

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ముక్కోపాఖ్యానం బాగుందండి.

రసజ్ఞ చెప్పారు...

హహ నాసికోపాఖ్యానం బాగుందండీ! ముక్కు, చెవులు మాత్రమే పరోక్షంగా కూడా వాటి ఇంద్రియ నిర్వహణ చేసుకుపోగలవు. మిగతావి ప్రత్యక్షంగా మాత్రమే చేయగలవు. అందువలన శూర్పనఖకి ఆ రెండూ కోసేయటం జరిగింది అని విన్నాను.

www.apuroopam.blogspot.com చెప్పారు...

శర్మ గారికీ రసజ్ఞ గారికీ కృతజ్ఞతలు.