18, సెప్టెంబర్ 2012, మంగళవారం

మళ్ళీ ఒక సారి వెళ్ళి రావాలి సురపురం...



సురపురమా? అదెక్కడుంది? మళ్ళీ వెళ్ళి రావడమేమిటి? ఇంతకు ముందెప్పుడైనా వెళ్లామాఇంతకీ అక్కడేముందని? ఏమిటా కథా కమామిషూ?
అదేనండి.అదే చెప్పబోతున్నాను.ఇంతకు ముందు నా బ్లాగులో నేను చదివిన ఓ మంచిపుస్తకం. ఒక పరిచయం అన్న పోస్టు చదివిన వారికి మెడోస్ టైలర్ బ్రిటిష్ ఆడ్మినిష్ట్రేటర్ గా సురపురం సంస్థానంలో పని చేసాడనీ ఆ సంస్థానం మన తెలంగాణా ప్రాంతానికి చెందినదనీ తెలిసే ఉంటుంది. 1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పుడు గుల్బర్గా ప్రాంతం కర్ణాటక రాష్ట్రం లో చేరిందనీ గుల్బర్గా మండలానికి చెందిన సురపురం కూడా దానితోపాటే కర్ణాటక లో చేరిపోయిందనీ తెలుసు. టైలర్ జీవిత చరిత్ర చదివిన దగ్గరనుంచీ నాకు ఈ సురపురం ఎక్కడుందో తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరిగింది. గుల్బర్గా ప్రాంతంలో ఉంటుందని గూగుల్ మేప్ లో సురపురం కోసం వెతికాను కానీ దొరక లేదు. ఆ మధ్య కొన్నాళ్లక్రితం హైదరాబాదునుంచి షిరిడీ వెళ్తున్న మన వోల్వో బస్సు షోలాపూర్ కి పాతిక మైళ్లు ముందరగా ఉన్న నల్ దుర్గ్ వద్ద అర్థ రాత్రి ప్రమాదానికి లోనై చాలా మంది చని పోయిన వార్త చదివినప్పుడు మళ్లా టైలర్ మహాశయుడు గుర్తుకు వచ్చేడు. ఎందుచేతనంటే సురపురం తర్వాత బ్రిటిష్ పాలనలో ఈ నల్ దుర్గ్ జిల్లా కే టైలర్ డిప్యూటీ కమిషనర్ గా పని చేసాడు. ఇది గుర్తుకు రాగానే మళ్ళా నా మనసు సురపురం మీదికి పోయింది. చిన్న పాటి పరిశోధన తో ఎలాగైతేనేం సురపురాన్ని పట్టుగో గలిగాను.
ఆనాటి సురపురం సంస్థానం రాజులు నివసించిన కోట,ఊరు ఉన్న ప్రదేశాన్ని ఇప్పుడు షోరాపూర్ అనే వ్యవహరిస్తున్నారు. ఈ పేరు ఇంతకు ముందు కూడా ఉంది. సూరా పూర్ షోలాపూర్ షోరాపూర్ అని కూడా పిలిచే వారట. సురపురం అన్న పేరు మాత్రం కనుమరుగై షోరాపూర్ అన్న పేరు మాత్రమే ఇప్పుడు వాడుకలో ఉంది. 2011 లో ఈ ఊరి జనాభా 45000 ట. ఒకప్పుడు గుల్బర్గా జిల్లాలో ఉన్నసురపురం ప్రస్తుతం కొత్తగా ఏర్పడ్డ యాద్గిర్ జిల్లా లో ఒక తాలూకా కేంద్రంగా ఉంది.
టైలర్ మహాశయుడు బ్రిటిష్ ప్రతినిధిగా సురపురం సంస్థానానికి వచ్చే సరికి అక్కడి పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంది. రాజు కృష్ణప్ప నాయక్ చనిపోయాడు.అప్పటికి అతడికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. రాణి ఈశ్వరమ్మ బ్రిటిష్ ప్రతినిధిని కాదని 10000 మంది సాయుధుల్ని సమకూర్చుకుని రాజ్యం దక్కించుకుందికి ప్రయత్నిస్తోంది. కృష్ణప్ప తమ్ముడు పెద్ది నాయక్ యువరాజుకు యుక్త వయసు వచ్చే వరకూ రాజప్రతినిధిగా వ్యవహరించాడానికి గవర్నర్ జనరల్ కు అర్జీ పెట్టుకున్నాడు. సైనిక చర్యతో తప్ప పరిస్థితిని అదుపు చేయలేమన్నాడు అప్పటి బ్రిటిష్ ప్రతినిధి. దానికి గవర్నర్ జనరల్ సుముఖంగా లేక పోవడంతో ఆ ప్రతినిధి రాజీనామా చేయడం. అతడి స్థానంలో టైలర్ రావడం జరిగాయి. టైలర్ సమస్యను సామరస్యంగా పరిష్కరించి పెద్దినాయక్ ని రాజప్రతినిధిని చేసి రాజకుమారుడికి చదువు సంధ్యలు నేర్పి పెద్దవాడిని చేసే బాధ్యతలు స్వీకరించి కాలక్రమంలో అతడిని పట్టాబిషిక్తుడ్ని చేసాడు. టైలర్ వ్యక్తిత్వాన్నిగురించి,ఆవూరి బాగోగులకి ప్రజలకి అతడు చేసిన సేవలగురించి చెప్పుకో వలసింది చాలానే ఉంది కాని అది ఎప్పుడైనా మరోసారి. ముందు ఈ సురపురం సంస్థానం గురించి కొంచెం తెలుసుకుందాం.
ఈ సంస్థానం కృష్ణా భీమా నదుల మధ్య ప్రదేశంలో కృష్ణా నది కుత్తరాన బిజాపురానికి నైరుతి దిశలోఉండేది.ఈ సంస్థానము నేలిన రాజ వంశీయులు రామ భక్తుడైన నిషద రాజు గుహుని సంతతి వారని,వీరు వేటగాళ్లని తెలుగు కైఫీయతు చెబుతోందట. ముదుగల్లు సీమ     (ఇప్పటిMudgal)లోని కోసల పేట ఒకప్పటి వీరి రాజధాని అనీ అందుచేత వీరిది కోసల వంశమంటారనీ కొందరంటారు. వీరేలిన కోసల దేశమే కోసల్నాడు లేక కాసల్నాడు అనీ ఒక వాదన కూడా ఉందట. వేట జీవనోపాధిగా బ్రతికే వీరిని స్థానికంగా బేడరులంటారు. ఈ సీమలో వీరే అధిక సంఖ్యాకులు. వీరిలో ముఖ్యులకు నాయకులని వ్యవహారమట. పామి నాయక్ అనే వాడు క్రీ.శ.1713 లో ఈ సురపురాన్ని నిర్మించి రాజధాని చేసుకున్నాడట.ఈ పామి నాయకుడు వైష్ణవ మతావలంబి. ఈ పరంపరలో సురపురాన్నేలిన చివరివాడే మన టైలర్ మహాశయుడు పెంచి పెద్ద చేసిన వెంకటప్పనాయక్. ఇతడు బ్రిటిష్ వ్యతిరేక పోరాటానికి చేయూతనివ్వడం ఆ సందర్భంగా బ్రిటిష్ వారు ఇతడిని బందీని చేయడం,టైలర్ కృషి వలన ఇతనికి ఉరిశిక్ష తప్పి నాలుగేళ్లు కారాగార శిక్ష పడడం,అది అమలు కాకుండానే అతడే తనను తాను కాల్చుకుని మరణించడం మనకు తెలిసిందే.
ఈ సంస్థానాధీశుల ఆశ్రయంలో దిగ్దంతుల వంటి పండితులుండేవారట. వారు సంస్కృత భాషాభివృధ్ధికి విశిష్టాద్వైత సిధ్ధాంత ప్రచారానికీ సాగించిన రచనలు కొల్లలుగా ఉన్నాయట.ఈ రాజ వంశంలో 1752 నుంచి 1773 వరకూ పాలించిన రాజా బహిరీ పామ నాయక్  కేవలం కృతి భర్తయే కాక స్వయంగా కవియట.ఇతడు తాను రచించిన భార్గవ పురాణాన్ని వారి కులదైవం సురపురం వేణుగోపాలునికి అంకితమిచ్చాడట.ఈయన కొడుకైన వేంకటనాయకుడు కూడా సాహిత్య పోషకుడే. అభినవ పెద్దన అని బిరుదు పొందిన కాణాదము పెద్దన సోమయాజి కవి,ముమ్మడి వెంకటాచార్యుడు మొదలైన కవులీ ఆస్థానానికి చెందిన వారే. 700 గ్రామాలు కలిగి,ఉత్సవ సమయాల్లో కవి పండిత నర్తక గాయకాదులకు భూరి సంభావనలిచ్చి ఆర్షధర్మాన్ని కళాసంస్కృతులను వికసింపజేసి విశిష్ట ప్రతిపత్తిని గడించిన సంస్థానంగా దీనిని శ్రీ తూమాటి దొణప్ప గారు పేర్కొన్నారు. కర్ణాటక సరిహద్దుల్లో నాగరికతకు నోచుకోని ప్రాంతంలో తెలుగు సాహిత్య పోషణకి నోచుకున్నదీ సంస్థానం. అందుకే ఇదెక్కడుందో తెలుసుకోవాలనీ ఒకసారి చూడాలనీ అనుకున్నాను. నాటి సురపురం కాదు గానీ-- ఈనాటి షోరాపూర్ నీ, అక్కడ శిధిలమైన కోటనీ, టైలర్ మహాశయుడు 1844 లో నిర్మించుకుని నివసించిన అతడి ఇంటినీ చూడగలిగాను. దాని పేరు టైలర్ మంజిల్. ఇప్పటికీ అది నివాస యోగ్యంగానే ఉండి కర్ణాటక ప్రభుత్వ Circuit house గా విరాజిల్లుతోంది.ఈ పని నేను నా కంప్యూటర్ ముందు కూర్చునే చేయగలిగాను. మీకూ ఆసక్తి ఉంటే Shorapur- u tube అని నెట్లో చూడండి.
( ఈ వీడియోని నెట్ లో పెట్టిన వారు CFSI-Azim premji Foundation వారు. సురపురం సంస్థానం వారి సాహిత్య పోషణ గురించి వివరంగా కావాలంటే శ్రీ దొణప్ప గారి ఆంధ్ర సంస్థానములు సాహిత్య పోషణము అనే గ్రంథం చదవండి.)
ఇప్పటికి సెలవు.  

 

7 కామెంట్‌లు:

buddhamurali చెప్పారు...

మీ ఆసక్తి పై ఆసక్తి కలుగుతోంది .. ఒక ప్రాంతం గురించి చదివి ఆ ప్రాంతాన్ని వెతకాలనే ఆసక్తి బాగుంది . వీలుంటే ఆ ప్రాంతానికి స్వయంగా వెళ్ళండి

www.apuroopam.blogspot.com చెప్పారు...

మురళి గారూ, నిజం గానే వెళ్లాలనుంది కానీ వయసు ఒంటరిగా వెళ్లడానికి సహకరించదు.మనకి సహకరించగలిగే వారికి అటువంటి విషయాలపై ఆసక్తి ఉండదు.Arm chair Travel లాగా కంప్యూటర్ లో ఇంటర్నెట్ ఎంతో సహకరిస్తోంది.మీకోసం బ్లాగరు ఎంత మంచి ఫోటోలను చూపిస్తున్నారో?.ఈ బ్లాగులూ ఇంటర్నెట్టూ నా జ్ఞానతృష్ణనిఎంత బాగా తీరుస్తున్నాయో.మీ స్పందనకి కృతజ్ఞతలు.

భాస్కర్ కె చెప్పారు...

వినాయకచవితి శుభాకాంక్షలండి,

అజ్ఞాత చెప్పారు...

చరిత్రలో మంచి పుటను పరిచయం చేసేరు. ధన్యవాదాలు.

Meraj Fathima చెప్పారు...

సర్, ఆలస్యానికి మన్నిచాలి కాని ఆసక్తిగా ఉంది మీరు రాసిన ప్రాంతం .
వంటరిగా వెళ్లొద్దు. ఎవరినైనా వెంట తీసుకొని వెళ్ళండి.

www.apuroopam.blogspot.com చెప్పారు...

ఫాతిమా గారికి ధన్యవాదాలు.కర్ణాటకలో ఇప్పుడు షోరాపూర్ ఒక టూరిస్టు కేంద్రం.పెద్ద ఊరు ఉన్నాది.అక్కడ టైలరు గారి ఇల్లు పడిపోయిన కోట తప్ప చూడడానికేమీ లేవు.ఒక మారుమూల అనాగరిక ప్రాంతంలో సాహిత్య పోషణ కూడా జరిగిందని చెప్పడానికి మాత్రమే రాసానీ పోస్టు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

the tree గారికి,మీ కామెంటు స్పామ్ లోకి వెళ్లి పోయిట్లుంది.ఇవాళే చూసేను.మీకు నాహృదయ పూర్వక కృతజ్ఞతలు.